మా వదిన వ్యాపార రహస్యాలు

    2
    4

    [box type=’note’ fontsize=’16’] రెండు అకౌంట్ పుస్తకాలు మెయింటెయిన్ చేస్తూ ఖర్చు, లాభాలతో ఆటలాడే వదిన చెప్పిన అద్భుతమైన వ్యాపార రహస్యాలు జీ ఎస్ లక్ష్మి రచించిన “మా వదిన వ్యాపార రహస్యాలు” చదివి తెలుసుకోండి.[/box]

    పొద్దున్నే అన్నయ్య ఫోన్ చేసి ఎంతో సంబరంగా “మీ వదిన తన బిజినెస్‌లో వందశాతం లాభాలు సంపాదించింది చెల్లాయ్” అన్నాడు. అన్నయ్య సంతోషంగా అన్న మాటలు వింటుంటే నాకూ ఎంతో ఆనందంగా అనిపించటంతో పాటూ, “అయ్యో.. నేనే ఏమీ చెయ్యకుండా ఇంట్లో ఉట్టినే కూర్చుంటున్నానే..” అని ఒక్క క్షణం అనిపించింది. వెంటనే వదినని ఫాలో అయిపోయి, నేను కూడా వదినలా వ్యాపారరంగంలో శిఖరాగ్రాన్నందుకోవాలనిపించింది. వెంటనే నా మనసులో మాట వదినకి చెప్పేసాను. వదిన కూడా చాలా సంతోషించి మర్నాడు వాళ్ళింటికి వస్తే వ్యాపారంలోని కిటుకులన్నీ చెపుతానంది.

    నాకు తెలుసు. వదిన చాలా తెలివైంది. పిల్లలిద్దరూ కాస్త పెద్ద క్లాసులకి రాగానే, తనకంటూ ఒక వ్యాపకం కల్పించుకుంది. ఆ వ్యాపకం కూడా నాలుగు డబ్బులొచ్చేదే ఎన్నుకుంది. ఇంట్లో ఉండే ఆడవాళ్ళు వారి ఖాళీ సమయాన్ని వృథా చెయ్యకుండా, వారికున్న సంబంధ బాంధవ్యాలను ఉపయోగించుకుని, ఒక్కొక్క ప్రోడక్టును సరసమైన ధరల కమ్మేలా ఈ మధ్య చాలామంది ఉత్పత్తిదారులు గృహిణులకు అవకాశం కల్పిస్తున్నారు. అలాంటి కంపెనీలో వదిన రిజిస్టర్ అయి, తనకున్న మాటకారితనంతో బోల్డు సేల్స్ చేసింది. అందుకే అన్నయ్య అంత గొప్పగా వందశాతం లాభమని చెప్పుకుంటున్నాడు. నిజమే.. దేనికీ లేని విలువ డబ్బుకుంది. ఇంట్లో ఎంత పని చేసినా మగవాడి దృష్టిలో లెక్కకురాని భార్య, కేవలం ఒక్క పదిరూపాయిలు సంపాదిస్తే చాలు అతని దృష్టిలో ఎంతో గొప్పమనిషైపోతుంది. ఇంత గొప్ప సత్యం ఇన్నాళ్ళకైనా నా బుర్రకి తట్టినందుకు నన్ను నేనే అభినందించేసుకుని, మర్నాడు ఉదయాన్నే వదిన చెప్పిన దారిలో నడవడానికి అన్నయ్యింటికి వెళ్ళాను.

    ముందుగా వదినని అభినందించి. నన్ను కూడా తనతోపాటూ తీసికెళ్ళి రిజిస్టర్ చేయించమన్నాను. వదిన ఆనందంగా ఒప్పుకుని, ఆ కంపెనీకి తీసికెళ్ళింది. అక్కడ నాలాంటి గృహిణులని చాలామందిని కలిసాను. ఒక్కొక్కరి సంభాషణా వింటుంటే నాకు తెలీని కొత్త విషయాలు చాలా తెలిసాయి. ఇంతకాలం బావిలో కప్పలా ఇంట్లోనే ఉండి, ఏవో కుట్టుకుంటూ, పాడుకుంటూ నా టైమంతా వృథా చేసినందుకు నన్ను నేనే తిట్టుకున్నాను.

    అక్కడ అందరూ ఎవరెవరికి ఎంతెంత లాభాలు వచ్చాయో చెప్పుకుంటున్నారు. అందులో వదినకి అరవైశాతం అని తెలిసింది. నాకు ఆశ్చర్యంగా అనిపించింది. వాళ్లంతా పొరపాటు పడుతున్నారనుకుంటూ, “కాదు, కాదు వందశాతం..” అంటూ గట్టిగా చెప్పబోతున్న నా నోటిని వదిన గబుక్కున తన చేత్తో మూసేసింది. “ఏంటొదినా? నీకు వందశాతం లాభాలు కదా! అలా తక్కువ చెప్తుంటే కరెక్ట్ చెయ్యొద్దూ!” అన్నాను ఆశ్చర్యంగా. “తర్వాత చెప్తానుగా..” అంటూ అప్పటికి నా నోరు మూయించేసింది మా వదిన.

    ఇంటికి వచ్చి తీరిగ్గా కూర్చున్నాక చెప్పింది వదిన.. “చూడు స్వర్ణా, వాళ్ల లెక్కల ప్రకారం అరవైశాతమే. కానీ నా లెక్కల ప్రకారం వందశాతం” అంది. “అదెలా?” అన్నాను తెల్లబోతూ.

     “చూడూ, నువ్వు బిజినెస్ మొదలుపెట్టే ముందు నీకు ఇలాంటి కొన్ని వ్యాపార రహస్యాలు తెలియాలి. ఏ వ్యాపారస్తుడైనా రెండు అకౌంట్ బుక్స్ పెట్టుకుంటాడు. ఒకటి ఇన్‌కమ్‌ టాక్స్ వాళ్లకి చూపించడానికీ, ఇంకోటి తన లెక్కలు సరిగ్గా చూసుకుందుకు. కానీ, మనలాంటి చిన్న వ్యాపారాలకి ఇన్‌కమ్‌ టాక్స్ ఉండదు. అయినా కూడా మనం కూడా రెండు బుక్స్ పెట్టుకోవాలి. ఎందుకో చెప్తాను విను.” అంది.

    నేను బుద్ధిమంతురాలిలా చేతులు కట్టుకుని శ్రధ్ధగా వినడం మొదలుపెట్టాను.

    “మొదటిమాట. అక్కడ లెక్కలు చూపించినప్పుడు అయిన ఖర్చులో మనం బిజినెస్ పనిమీద ఎక్కడెక్కడికి, ఎన్నిసార్లు వెళ్ళామో ఆ ప్రయాణఖర్చులు ఖర్చుల జాబితాలో వేసి వచ్చిన మొత్తంలోంచి తీసేస్తాం. మిగిలిన దాంట్లోనే లాభం లెక్కలు కడతాం. కానీ మనం ఇంటిదగ్గర మొగుడికి చూపించే లెక్కల్లో ఆ ఖర్చులు చూపించకుండా, అవి కూడా లాభాల్లో కలిపి చూపించేస్తే, ఖచ్చితంగా వందశాతం లాభం కనపడుతుంది.”

    నాకు అర్ధం కాలేదు. “అదెలా వదినా.. మనం నాలుగుచోట్ల తిరగందే బిజినెస్ ఎలా నడుస్తుందీ?” అనడిగాను.

    “ఎందుకు తిరగం! తిరుగుతాం..”

    “మరి ఆ ఖర్చూ?” అంటూ ప్రశ్నార్ధకంగా పెట్టిన నా మొహాన్ని చూసి, కూల్‌గా నవ్వుతూ, “అవన్నీ మొగుడి ఖాతాలో వేసేయడమే. మనం ఇంట్లోంచి బైటకెళ్ళి, మళ్ళీ మనం ఇంటికి చేరేవరకూ.. అంటే ట్రాన్స్‌పోర్ట్, మధ్యలో టిఫిన్లు, కాఫీలు, కూల్‌డ్రింకులు అన్నీ మొగుళ్ళ అకౌంట్ లో వేసేస్తే మనకి బిజినెస్‌లో చాలా మిగులుతుంది తెల్సా?” అన్న వదిన మాటలకి మరీ అశ్చర్యపోతూ, “కానీ, మన బిజినెస్‌కి వాళ్ల డబ్బులు వాడడం అన్యాయం కదా వదినా! అలా తప్పు లెక్కలు వేస్తే మగాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారూ?” అన్నాను.

    “అయ్యో, పిచ్చి స్వర్ణా.. ఆ మాట వాళ్లతో చెపుతామేంటీ? అదంతా లాభంలో చూపించెయ్యడమే. అప్పుడు వాళ్ళు ఎంత సంబరపడిపోతారో మీ అన్నయ్యని చూస్తే తెలీటంలేదూ?”

    “అంటే వాళ్ళకి తెలీకుండా వాళ్ళ డబ్బులే వాళ్లకి లాభాలుగా చెప్పడమా..?”

     “మరి లేకపోతే… ఇలాగని వాళ్లకి పండొలిచి చేతిలో పెట్టినట్టు చెప్తారా ఎవరైనా! ఇలాంటి విషయాలు అస్సలు బైట పెట్టకూడదు తెల్సా!” అంది వదిన గంభీరంగా.

    అన్నయ్య అమాయకుడు కనక వదిన ఆడే ఇలాంటి ఆటలు చెల్లుతున్నాయి. అందుకే “అందరు మగవాళ్ళూ అలా ఊరుకోరేమో వదినా” అన్నాను నెమ్మదిగా.

    “నీకా అనుమానమేం అఖ్ఖర్లేదు. నువ్వనుకుంటున్నట్టు ఒక్క మీ అన్నయ్యే అమాయకుడేం కాదు. అందరు మగాళ్ళూ అంతే. మగవాళ్ళు మనలాగ ఒకేసారి నాలుగురకాల విషయాల గురించి ఆలోచించలేరు. ఏదైనా ఒక్క విషయాన్నే పట్టుకుని అదే ధోరణిలో ఉంటారు. మనలాగ అన్నివైపుల్నించీ ఆలోచించాలన్న తెలివే వాళ్లకుండదు. వట్టి వన్ వే ట్రాఫికే అనుకో. రోడ్డుమీద ట్రాఫిక్ సిగ్నల్స్ పెట్టి అటే వాళ్లని వెళ్ళమన్నట్టు మనం కూడా వాళ్లని ఫలానా దారిలోనే ఆలోచించాలన్నట్టు కథలు చెప్పేస్తే చాలు. మరింకేమీ ఆలోచించకుండా ఎంచక్కా అలాగే ఆలోచించేస్తారు. వాళ్లకున్న ఆ బలహీనతనే మనమిక్కడ వాడుకోవాలి.”

    మా ఆయన దగ్గర ఈ పప్పులుడకవని నాకు బాగా తెలుసు. అందుకే “అన్నయ్యలా కాదు మా ఆయన..” అనబోతున్న నా మాటలని మధ్యలోనే ఆపేసి

    “నా మొగుడేకాదు, ఏ మొగుడైనా అంతే. నీకు చెప్పే పధ్ధతి తెలిస్తే చాలు. నీకెందుకు.. నేనున్నాగా..” అంటూ అచ్చమైన వ్యాపార రహస్యాలని వరసగా వివరిస్తున్న వదిన మాటలు నోరెళ్లబెట్టి వింటూ నిలబడిపోయాను.

    జి.యస్.లక్ష్మి

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here