1.రెప్పలేని కన్ను

0
10

[box type=’note’ fontsize=’16’] 2018 దీపావళి కథల పోటీకి వచ్చిన కథ. [/box]

[dropcap]అ[/dropcap]రవయ్యో నెంబరు సిటీ బస్సు తన చివరి ట్రిప్ ముగించుకుని నలుగురు ప్రయాణీకులతో మద్దిలపాలెం బస్ కాంప్లెక్స్ చేరుకుంది. ప్రయాణీకులు దిగిపోయేక బస్ కాంప్లెక్స్ ఆనుకుని ఉన్న డిపోలోకి ప్రవేశించి కండక్టర్‌ని దించేసి లోపలికి వెళ్ళిపోయింది.

కండక్టర్ రామానుజం క్యాష్ డిపాజిట్ కౌంటర్ వైపు నడిచాడు. రాత్రి తొమ్మిది కావడంతో ఉదయం వెళ్లిన బస్సులు ఒక్కొక్కటి తిరిగి రావడం వల్ల లోపల కాస్త హడావిడిగా ఉంది. రామానుజం కౌంటర్లో క్యాష్ అప్పగించాడు. బ్యాగ్‌లో ఉన్న చిల్లర జేబులో వేసుకోకుండా అలాగే వదిలేసాడు. క్యాష్ కౌంటర్‌ని ఆనుకుని ఉన్న స్టాఫ్ రూములోకి నడిచి తన లాకర్ తెరిచాడు. క్యాష్ బ్యాగ్‌తో పాటు యూనిఫాం అందులో ఉంచి ఉదయం వేసుకొచ్చిన బట్టలు తొడుక్కున్నాడు. లాకర్ లాక్ చేసి కీ జేబులో వేసుకుని చకచకా అడుగులు వేస్తూ డిపో గేటు దాటాడు.

“రామానుజం ఇలా రా..” ఎవరో పిలిచారు.

అటు దృష్టి సారించాడతను. కొంతమంది డ్రైవర్లు, కండక్టర్లు గుంపుగా నిలబడి కనిపించారు. వారి మధ్యలోని యూనియన్ లీడర్‌ని గుర్తు పట్టి అటు కదిలాడు.

“అంత అర్జెంటుగా ఎక్కడికి పోతున్నావ్?” ఒకతను అడిగాడు.

“ఇంటికి.. మా ఆవిడ చూస్తూ ఉంటుంది.” చెప్పాడు.

పక్కున నవ్వేడతను.

“మాకూ పెళ్ళాలు ఉన్నారు. వాళ్లు కూడా మా కోసం చూస్తూ ఉంటారు.” అన్నాడతను వెటకారంగా.

రామానుజం మాట్లాడలేదు. అయిదేళ్ళ నుంచి కండక్టర్‌గా చేస్తున్నా ఎవరితోనూ కలవడతను. డ్యూటీ, ఇల్లు తప్ప మరో వ్యాపకం లేదు. గతంలో తీరిక చిక్కినప్పుడు సినిమాలకి వెళ్ళేవాడు. పెళ్ళాయ్యాక ఒకటి రెండు సార్లు మాత్రమే భార్యతో వెళ్ళాడు. ఇంట్లో తల్లిని ఒంటరిగా వదిలి వెళ్ళడానికి ఇష్టపడడు. ఆమెని సినిమాకి రమ్మంటే రాదు. ఇప్పుడు తన కోసం భార్య ఎదురు చూస్తూ ఉంటుందన్న ఆలోచన తప్ప అతని బుర్రలో మరేం లేదు.

“రేపు ఉదయం ధర్నాకి నువ్వురావాలి…” చెప్పాడు యూనియన్ లీడర్.

సందిగ్ధంగా చూసాడు రామానుజం.

“నీది సెకండ్ షిఫ్ట్ కదా! ఉదయం పదికి వస్తే ధర్నా అయ్యాక డ్యూటీకి పోవచ్చు. మనసులోని అయిష్టాన్ని దాచుకుని తలూపాడు రామానుజం.

“ఇది మనకి చాలా ముఖ్యమైన కార్యక్రమం. ఆరిలోవలో ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఎం.డి గారితో ప్రపోజల్ పంపితే ఇళ్ళ స్థలాలకి కొంత భూమి కేటాయిస్తానని కలెక్టర్ మన యూనియన్ నాయకులకు మాటిచ్చారు. ఎన్నిసార్లు కలిసి చెప్పినా ప్రపోజల్ పంపడం లేదు ఎం.డి. వత్తిడి తెస్తే తప్ప పనికాదు. కలెక్టర్ మారక ముందే పని చేయించుకోవాలి. అన్ని డిపోల నుంచి మన వాళ్ళు ధర్నాకి వస్తున్నారు” వివరించాడు యూనియన్ నాయకుడు.

మరోసారి తలూపి అక్కడ నుంచి రోడ్డు మీదకి వచ్చాడు రామానుజం. పూల కొట్టు మీద దృష్టి పడి ఓ క్షణం ఆలోచించాడు. భార్యకి పూలు తీసుకెళితే తల్లి ముఖం మాడ్చుకుంటుంది. ఎప్పుడో తన చిన్నతనంలో పోయాడు తండ్రి. అప్పటి నుంచి గుండెల్లో పెట్టుకుని కాపాడి పెంచి పెద్ద చేసింది తల్లి. పెద్దగా చదువుకోని, ప్రపంచం గురించి అంతగా తెలియని ఒంటరి మనిషి మనస్తత్వం అలాగే ఉంటుందన్న ఆలోచనతో తల్లికి ఎప్పుడూ ఎదురు చెప్పడు.

భార్య మీదున్న అభిమానం జయించడంతో పూలు తీసుకుని బస్సెక్కాడు.

***

ఇంటి గుమ్మంలో నిలబడి రోడ్డు మీదకి చూసింది కడలి. అక్కడకి రోడ్డు పక్కనున్న బస్‌స్టాప్ స్పష్టంగా కనిపిస్తోంది. ఆ బస్సు స్టాప్ దగ్గరకు నడిచి వెళుతున్నాడు భర్త రామానుజం. రోజూ అక్కడే బస్సెక్కి డ్యూటీకి వెళ్ళి అక్కడే బస్సు దిగి ఇంటికొస్తాడు. అతను ఓ బస్సు ఆపి ఎక్కేక వెనక్కి తిరిగిందామె.

“ఏం చూస్తున్నావ్?” అడిగింది అత్త, ‘టి.వి. మీద నుంచి దృష్టి మళ్ళించి,

“ఏం లేదండి..” చెప్పి వంట గదివైపు కదిలింది కడలి.

“ఇలాంటి బుద్ధులు మా ఇంటా వంటా లేవమ్మా! అందుకే అటేడుతరాలు, ఇటేడుతరాలు చూసి ఇంటికి పిల్లని తెచ్చుకోమన్నారు పెద్దలు.”

ఆ మాటలు చెవిలో పడి మనసు చివుక్కుమని కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి కడలికి. తనని కోడలిని చేసుకోవడం అత్తకి ఇష్టం లేదని పెళ్ళయిన కొత్తలోనే గ్రహించింది. ఆమె అడిగినంత కట్నం తండ్రి ఇవ్వలేకపోయాడు. కొడుక్కి పిల్ల నచ్చడం వల్ల ఆమె తగ్గాల్సివచ్చింది. భర్తతో ఏకాంతంగా ఉన్నప్పుడు పిలిచి మంచి నీళ్ళు ఇమ్మంటుంది. ఉదయం గది నుంచి బయటకు వచ్చినప్పుడు ముఖాన్ని పట్టి పట్టి చూస్తుంది. కొడుకు డ్యూటీకి వెళ్ళక ముందు నోరు విప్పని ఆమె ఆ తరువాత తన తెలివి తేటలన్నీ చూపిస్తుంది. కోడలి మీదున్న అయిష్టాన్ని ఏ మాత్రం దాచుకోదు. తను అడిగినంత కట్నం ఇవ్వలేదు కాబట్టి మిగతాది తెచ్చివ్వమంటుంది. ఆ విషయం రాత్రి భర్తకి చెప్పి తండ్రి అశక్తత వివరించింది.

“అమ్మకి నేను చెబుతానులే..” అన్నాడతను.

ఉదయం అత్తతో మాట్లాడకుండా హడావిడిగా వెళ్ళిపోయాడు భర్త. కట్నం గురించి తన తండ్రికి అత్త ఫోను చెయ్యమంటుందనే భయం ఆమె మనసులో కదులుతోంది.

“మీ నాన్నకి ఫోను చేసావా? ఎప్పుడు తెస్తానన్నాడు డబ్బు?” కసిరినట్టు అడగనే అడిగింది అత్త.

“లేదత్తయ్యా! ఆయన మీతో మాట్లాడతానన్నారు” బెరుగ్గా చెప్పింది.

“వాడా.. వాడేం మాట్లాడతాడు నాతో. అయినా ఇంట్లో జరిగినవన్నీ మొగుడు చెవిని వేస్తున్నావా? అంటే వాడికి నాకూ తగువు పెట్టేసి వేరు కాపురం పెడదామనుకుంటున్నావా? నా బొందిలో ప్రాణం ఉండగా అది జరగదు..” అరిచిందామె.

“అదికాదత్తయ్యా! మా నాన్నగారు ఇస్తానన్న కట్నం ఇచ్చేసారు. పెళ్ళి చెయ్యడానికి అప్పు చేసారు. ఇప్పుడు అదనంగా కట్నం అడిగితే ఎక్కడ నుంచి తేగలరు?” నెమ్మదిగా అంది కడలి.

అత్త ఎర్రగా చూసింది. “అదనంగా కట్నం అడగలేదమ్మా! నేనడిగిన దానిలో మిగిలింది తెమ్మంటున్నాను” వెటకారంగా అంది అత్త.

“ఒప్పుకున్న మొత్తం ఇచ్చేసారు కదా అత్తయ్యా!”

“మిగిలింది పెళ్ళయ్యాక ఇమ్మన్నాను. అది నీకు తెలియదు కాబోలు..”

కడలి మాట్లాడలేదు. మాటలతో అత్తని గెలవడం సులువు కాదని తెలుసు. ఈ చిక్కులు ఎలా తొలగుతాయో, తన సంసారం ఎప్పుడు కుదుట పడుతుందో అంతుబట్ట లేదామెకి. బంగారంలాంటి భర్త దొరికినందుకు మురిసిపోతుంది. బతుకులో మనశ్శాంతి లేకుండా చేస్తున్న అత్తని చూసి ముడుచుకుపోతుంది. గదిలోకి వెళ్ళి దిగులుగా కూర్చుందామె.

రెండు రోజుల తరువాత మధ్యాహ్నం భోజనం చేసాక స్నేహితురాలితో కబుర్లు చెప్పడానికి వెళ్ళింది అత్త. ఓ పది నిముషాలకి తలుపు చప్పుడు కావడంతో వెళ్ళి తీసింది కడలి. పాతికేళ్ళ కుర్రాడు కాగితాలు పట్టుకుని నిలబడి ఉన్నాడు.

“ఈ ఇంట్లో ఇద్దరేకదండి ఉండేది? అడిగాడతను. “కాదు.. ముగ్గురు.” చెప్పింది కడలి. “ఆధార్ కార్డులు ఇస్తారా.. ఓటర్ లిస్టులో రాసుకోవాలి.”

గుమ్మం దగ్గరకి కుర్చిలాగి గదిలోకి వెళ్ళిందామె. బీరువాలోని ఫైలు నుంచి ఆధార్ కార్డులు పట్టు కొచ్చింది. వాటిని అందుకుని,

“కొంచెం మంచి నీళ్ళు కావాలండి..’ అడిగాడతను.

మంచి నీళ్ళు తాగాక ఓటర్ల లిస్టులో పేర్లకి ఎదురుగా ఆధార్ నెంబర్లు రాసుకున్నాడు. ఆ లిస్టులో కడలి పేరు లేకపోవడంతో వేరే పేపరు మీద వివరాలతో పాటు ఆధార్ నెంబర్ నోట్ చేసుకున్నాడు. ఆధార్ కార్డులు తిరిగిచ్చి అతను బయటకు నడిచాడు. ఆ వ్యక్తి వెళ్ళాక తలుపు ముయ్యబోతూ అత్త రావడంతో ఆగింది కడలి.

“ఎవరతను?” లోపలికి వస్తూ విసురుగా అడిగింది అత్త.

“ఓటర్ లిస్టులో ఆధార్ నెంబర్లు రాసుకోవడానికి వచ్చిన వ్యక్తి” చెప్పింది కడలి.

“ఎంతకాలం నుంచి సాగుతోంది. ఈ వ్యవహారం?”

అర్థం కానట్టు చూసింది కడలి.

“కూర్చోబెట్టి మంచినీళ్లు ఇచ్చి ముచ్చట్లు చెప్పడానికి అతను నీకేమన్నా చుట్టమా? గదిలో కూర్చుని సెల్లో రోజూ గుసగుసలాడేది ఇతనితోనేనా? కాసేపు ఇంట్లో నేను లేకపోతే ప్రియుడ్ని ఇంటికి పిలిచావంటే నువ్వు తెగించినట్టే. వెంటనే పెట్టి సర్దుకుని మీ ఇంటికిపో..” అరిచింది అత్త.

అవమానంతో కడలి ముఖం ఎర్రబడింది. “అత్తయ్యా..” భీకరంగా అరిచింది.

“నోర్ముయ్.. ముందు బయటకునడు. ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండటానికి వీలులేదు.”

కడలి చప్పున గదిలోకి వెళ్ళి తలుపు గడియ పెట్టుకుంది. కొన్ని క్షణాల తర్వాత గదిలోంచి బాధతో కూడిన మూలుగు వినిపించింది. సరిగ్గా అప్పుడే ఇంట్లో కాలు పెట్టాడు రామానుజం. గుడ్డ కాలుతున్న వాసన ఇల్లంతా వ్యాపించింది.

“ఏమయింది?” కంగారుగా అడిగాడు తల్లిని.

ఆమె నోట మాట రానట్టు గది వైపు చూపించింది. రామానుజం ఆలస్యం చెయ్యకుండా భుజంతో తలుపు పగలగొట్టాడు. లోపల మంటల్లో అటూ ఇటూ పరిగెడుతోంది కడలి. దుప్పటి అందుకుని ఆమె మీద కప్పి మంటలు ఆర్పేసాడతను.

ఇంతలో ఎవరో అంబులెన్స్‌కి ఫోన్ చేసారు. కడలిని అంబులెన్స్‌లోకి ఎక్కించాక, తనూ ఎక్కబోతూ ఆగి గుమ్మం దగ్గర నిలబడిన తల్లి దగ్గరకు వచ్చాడు.

జేబులోంచి రెండు ఐదు వందల నోట్ల కట్టలు తీసి తల్లి చేతిలో పెట్టి “దీని కోసమేగా దాని బతుకు బుగ్గి చేసావ్. ఇవి తలమీద పెట్టుకుని ఊరేగు..” అని, అంబులెన్స్లో కూర్చుని తన చూపు భార్య దగ్గ శరీరం మీదకి సారించాడు. ఆమె బాధతో విలవిల్లాడుతోంది. నిస్సహాయంగా చూస్తున్న రామానుజం కళ్ళనిండా కన్నీళ్ళు.

“ఆమె చావుకి ఎవరు కారణం?” మరునాడు రాత్రి పోలీస్ సబ్ఇన్‌స్పెక్టర్ తల్లి, కొడుకుల్ని అడిగాడు.

“నేనే..” చెప్పాడు రామానుజం.

కేసు విచారణ పూర్తయింది.

ఆరోజు జడ్జిమెంట్ చెప్పే రోజు. ఇద్దరు కానిస్టేబుల్స్ రామానుజాన్ని తీసుకొచ్చి కోర్టు బయట వరండాలో కూర్చోబెట్టారు. అతను గచ్చు మీద కాళ్లు ముడుచుకుని నిర్వికారంగా కూర్చున్నాడు. అతని తల్లి దూరంగా నిలబడి చూస్తోంది.

కొడుకులో వచ్చిన మార్పు ఆమెకి అంతుబట్టడం లేదు. బెయిల్ పిటీషన్ పెట్టడానికి రామానుజం ఒప్పుకోలేదు. నచ్చ చెప్పడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అతను తల్లితో మాట్లాడి చాలా రోజులయింది. తన మామగారు కట్నంగా కొంత డబ్బు పంపినట్లు తల్లికి ఇవ్వాలని రామానుజం లక్ష రూపాయలు తెచ్చాడని ఆమెకి తెలియడు. కోడలి మీద లేనిపోని ఆరోపణలు చేసి భయపెట్టి మన గుప్పెట్లో ఉంచుకోవాలని స్నేహితురాలు ఇచ్చిన సలహా బెడిసికొట్టి కోడలి చావుకి కారణమైందన్న నిజం తెలిసేసరికి అంతా జరిగిపోయింది.

కోర్టు కార్యక్రమాలు మొదలయ్యాయి. ఒక్కొక్క కేసు పిలుస్తున్నారు. కొన్ని వాయిదా పడితే మరికొన్ని విచారణకు వస్తున్నాయి. సాయంకాలం అయిదు గంటలకి రామానుజాన్ని పిలిచారు. అతనికి అయిదేళ్ళ శిక్ష పడింది. అతన్ని కోర్టు నుంచి బయటకు తీసుకొచ్చారు పోలీసులు. అప్పుడు కూడా రామానుజంలో ఎలాంటి మార్పులేదు.

“శిక్ష పడినందుకు బాధగాలేదా?” సానుభూతిగా అడిగాడు ఓ కానిస్టేబుల్. “ఉంది..” చెప్పాడు రామానుజం..

“నిజమే.. చాలా బాధగా ఉంటుంది. అయిదేళ్ళంటే మాటలు కాదు. నీ యవ్వన కాలమంతా జైల్లో గడిచిపోతుంది.” అన్నాడతను.

“అయిదు సంవత్సరాల శిక్షపడినందుకు కాదు నా బాధ. నన్ను ఉరి తియ్యనందుకు.” తెల్లబోయాడు కానిస్టేబుల్.

జైలు నుంచి విడుదలయ్యాడు రామానుజం.

ఇంటికొచ్చిన తరువాత కూడా అతను తల్లితో మాట్లాడలేదు. ఉదయం నిద్రలేచి రోడ్డు మీద కొచ్చి బస్‌స్టాప్ దగ్గరున్న చెట్టు కింద కూర్చుంటాడు. బస్‌స్టాప్ ఇంటికి దగ్గరలో ఉండటం వల్ల అతను తల్లికి కనపడుతూనే ఉంటాడు. మొదటిరోజు కొడుకు భోజనం కోసం వస్తాడని ఎదురు చూసింది. చాలాసేపు చూసి తనే వెళ్ళి పిలిచింది.

అతను పలకలేదు.

ఏం చెయ్యాలో తోచలేదు. చివరికి ప్లేటుతో అన్నం తీసుకెళ్ళి కొడుకు దగ్గర పెట్టి తిరిగొచ్చింది. కొద్దిగా తిని మిగతాది ఓ కుక్కకి వేసాడు. రాత్రి పూట నిద్రపోయే ముందు ఒక గ్లాసు మంచి నీళ్ళు తాగుతాడు. క్రమంగా అతని తల్లికి జ్ఞానోదయం అయింది. కట్నం కోసం వేధించి కోడలి చావుకి కారణమైన తను, కొడుకు అభిమానాన్ని పోగొట్టుకున్నానని తెలుసుకుంది. ఆ విషయం కొడుక్కి చెప్పి, ప్రాధేయపడటానికి ప్రయత్నించింది. ఆ మాటలు వినిపించనట్టు వెళ్ళిపోయాడు చెట్టు కింద కూర్చోడానికి.

రామానుజం రూపం ఓ సాధువు రూపంలా తయారయింది. తల, గెడ్డం పెరిగిపోయాయి. ఉదయం నుంచి రాత్రి పది వరకూ అక్కడే కూర్చోవడం వల్ల ఒళ్ళంతా దుమ్ము పట్టింది. ఒకరోజు ఆర్మీలో పని చేస్తున్న రామానుజం స్నేహితుడు సెలవులో ఇంటికి వచ్చిన విషయం తెలుసుకుని రామానుజం తల్లి వెళ్ళి తన గోడు చెప్పుకుంది. అతనొచ్చి ఎముకల గూడులా ఉన్న రామానుజాన్ని చూసి షాక్ తిన్నాడు. గబగబా దగ్గరకు వెళ్ళి పలకరించాడు. భుజాలు పట్టుకుని కుదిపేసాడు. దేనికి సమాధానం లేదు. కళ్ళల్లో ఎలాంటి భావం లేదు. విసుగు చెందకుండా మాట్లాడించడానికి ప్రయత్నించి చివరగా అడిగాడు.

“ఎవరికోసం చూస్తున్నావు రా?”

ఆ ప్రశ్న అర్థమైనట్లు కదిలాడు రామానుజం. అతని పెదాలు సన్నగా ఏదో గొణిగాయి. మరోసారి అదే ప్రశ్న అడిగి చెవులు రిక్కించాడు స్నేహితుడు.

“నా భార్య కోసం..” రామానుజం నుంచి వచ్చిందా జవాబు.

“ఇంకెక్కడ నుంచి వస్తుందిరా?” అతని గొంతు గద్గదమైంది.

“పుట్టింటి నుంచి వస్తుంది.”

స్నేహితుని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అతను అక్కడ నుంచి వెళ్ళిపోయాడు.

ఎంత మంది ఎన్ని రకాలుగా ప్రశ్నించినా సమాధానం చెప్పని రామానుజం “ఎవరి కోసం చూస్తున్నావ్?” అని అడిగితే మాత్రం “నా భార్య కోసం.” అంటాడు.

ఇప్పటికి కూడా అతను అక్కడే కూర్చుంటాడు. అదే సమాధానం చెబుతాడు.