10. ఆమె

0
8

[box type=’note’ fontsize=’16’] 2018 దీపావళి కథల పోటీకి వచ్చిన కథ. [/box]

[dropcap]ప[/dropcap]చ్చని చెట్లు నిండిన ఆ విశాలమైన ప్రాంగణంలో ఆ మధ్యాహ్న వేళ ఒక చెట్టు కింద అలసటతో కూచున్నా. నేను వచ్చిన పని పూర్తికాలేదు…. అవుతుందన్న ఆశ మాత్రం వదలలేదు. ఆమెను ఎప్పటికి కలుసుకోగలను? దేవుడెందుకు కొన్ని జీవితాలను అలా వ్రాస్తాడు? మంచివారికే ఎందుకలా శిక్షిస్తాడు? అసలు ఈ లోకంలో ఒంటరిగా తను ఎలా బ్రతుకుతుంది? అలా నా ఆలోచనలు సాగుతున్నాయ్. అసలు ఎవరామే? ఆమెకు నాకూ మధ్య సంబంధమేంటి? ఈ విషయాలు తెలుసుకోవాలంటే మీరు నా కథను తెలుసుకోవాలి. మాదో అందమైన పల్లెటూరు. అందులో మాదో పెద్దరికం కలిగిన కుటుంబం. అందరికీ తలలో నాలుకలా ఉండే మా నాన్న. ఒక్కడినే సంతానం. ముద్దుగానే పెంచినా…బుద్ధులు, హద్దులు తెలిసేలా పెంచిన పెంపకం. మొదటినుంచి ఆటలలోనూ, చదువులోనూ మంచి ప్రతిభ కలిగిన విద్యార్ధిగానే నా పాఠశాల విద్యాభ్యాసం ముగిసింది. దగ్గరలో ఉన్న పట్టణంలో ఇంటర్ పూర్తిచేశా. మొదటినుంచి ఉన్న పట్టుదలకు, స్వయంకృషి తోడై, సొంతగానే ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలో మంచి ర్యాంక్ సంపాదించా. రాష్ట్ర స్థాయిలో మంచి ర్యాంక్ సాధించటంతో, నగరంలో మంచి పేరెన్నికగన్న కాలేజీలో మంచి గ్రూప్ లో సీటు వచ్చింది. దూరమైనా మంచిది కదాని అందులోనే జాయిన్ అయ్యా.

అసలే నగర వాతావరణం కొత్త. దానికి తోడు ఆ కాలేజీ ఆధునికతకు పెట్టింది పేరులా ఉంది. చాలా భయమేసింది. అప్పుడే తను పరిచయమైంది. అందరితో చాలా సరదాగా ఉండేది. తనే ‘శిరీష’. మొదట్లోనే బాగా ఆకర్షించింది. కాకపోతే భయం వల్ల నేనేం మాట్లాడలేదు. కానీ ఒక రోజు, ల్యాబ్ లో కంప్యుటర్ ప్రోగ్రాం రాకపోతే సహాయం చేశా. ఇంక అప్పటినుంచి తనే పలకరించేది. కాలేజీకి వెళ్ళేటప్పుడు బస్సు కోసం వెయిట్ చేస్తుంటే, తన స్కూటీపై నన్ను కాలేజీకి తీసుకెళ్ళేది. నేను సిగ్గు పడితే నువ్వు మారాలి అనేది. దానితో నేనింకా అభిమానించా. ప్రేమించాను కూడా. ఎప్పుడూ తనే గుర్తొచ్చేది. తను అందరిలాగే నాతోనూ చాలా సాధారణంగా మాట్లాడేది. దానితో నా ప్రేమను చెప్పలేకపోయా. తనగురించి ఆలోచిస్తూ చదువుని కాస్త నిర్లక్ష్యం చేశా. ఏదో అత్తెసరు మార్కులతో ఉత్తీర్ణుడనయ్యా. దానితో భయ, వేసింది. అలా అని తనని మర్చిపోలేను. అందుకే ధైర్యం చేసి నా ప్రేమను  వ్యక్తం చెయ్యాలనుకున్నా…. ప్రేమికుల రోజున గులాబి ఇస్తూ నా ప్రేమను వ్యక్తం చేశా… “ఇన్ని రోజులు పట్టిందా మొద్దూ” అంటూ తను సమాధానం ఇచ్చేసరికి నేను మేఘాలలో తేలిపోయా. ఇంక ప్రతిక్షణం తనతోడిదే లోకం.

తనతో తిరగటానికి నాన్నకి ఏదో కారణం చెప్పి బండి కొనుక్కున్నా. ఇంకా ఎప్పుడూ బండిపై షికారులే. అలా ఒక సంవత్సరం అలా అలా గడిచిపోయింది. నా చదువు అటకెక్కిపోయింది. అంతే సగం సబ్జెక్టులు ఫెయిల్. కానీ నేను ఏమీ బాధపడలేదు. నాన్న అడిగితే మార్కులన్నీబాగానే వచ్చాయని అబద్ధం చెప్పా. ఎప్పుడూ నేను తెలివైనవాడిని అవ్వటం వల్ల, తను సులభంగానే నన్ను నమ్మారు. శిరీష మాత్రం నువ్వు పాస్ అయ్యేంతవరకూ బాగా చదువు మనం తిరగటం తగ్గిద్దాం అంది. తన ప్రేమకి ఫిదా అయిపోయా.కానీ నాకు అప్పుడు తెలీదు…. తరువాత జరగబోయే పరిణామాలు..

శిరీష కోసం అని నేను చదివేవాడిని. పడుకునే ముందు మాత్రం ఈ రోజంతా ఎలా చదివానో, ఏం చేశానో ఫోనులో చెప్పేవాడిని. వినేది కానీ పెద్దగా పట్టించుకునేది కాదు. అయినా చదువు గురించి కదా… తనకి అలానే ఉంటుంది లే అని నాకు నేనే నచ్చ చెప్పుకునే వాడిని. పోను పోనూ మాట్లాడటం కూడా తగ్గించటం మొదలు పెట్టింది. అడిగితే ఏదో ఒకటి చెప్పేది. నాకు అనుమానం వచ్చినప్పుడల్లా “ఏరా నా మీద నీకు నమ్మకం లేదా?” అనేది. నిజమే నాదే తప్పు అనుకుండేవాడిని.

కానీ కొద్దిగా తన ప్రవర్తనలో మార్పు రావటం మొదలైంది…. నన్ను వీలైనంత దూరం పెట్టేది. కొన్నాళ్ళకి నన్ను విసుక్కోవటం మొదలుపెట్టింది. తరువాత కొన్నాళ్ళకి మా ఫ్రెండ్స్, తను వేరే అబ్బాయితో తిరగటం చూసామని చెప్పారు. అదే విషయం అడిగితే, ఎవరో ఏదో చెప్తే, నన్నే అనుమానిస్తావా అంటూ కోపగించుకుంది. ఏదో బ్రతిమాలి, మంచి బహుమతి కొని, తన కోపాన్ని తగ్గించా. కానీ నా సంతోషం ఎన్నో రోజులు నిలవలేదు. ఒకసారి రోడ్డుపై వెళ్తుంటే…. ఎవరో అబ్బాయి బండి వెనక తనని వెనుకనుంచి వాటేసుకుని కూచుంది. అంతే… నేను హతాశుడనైపోయా. ఆ రాత్రి ఫోన్ చేసి నిలదీస్తే, “అవును, నిజమే… ఐతే ఇప్పుడేంటి? నాకు తిప్పటానికి, నాతో తిరగటానికి ఒక బకరా కావాలి. నువ్వు కొద్ది రోజులకే బోర్ కొట్టేసావ్. అందుకే వేరే వాణ్ని వెతుకున్నా. అయినా నాతో తిరిగి నువ్వూ బాగానే ఎంజాయ్ చేసావ్ కదా? నేనేం నిన్ను మోసం చెయ్యలేదు. ఇద్దరం కలిసి తిరిగాం… ఎంజాయ్ చేసాం అంతే…” అని ఫోన్ పెట్టేసింది. ఒక్కసారిగా నిలువునా కూలిపోయా… తనకోసం కట్టుకున్న నా ఆశల సౌధం కూలిపోయింది. అయినా ఉండబట్టలేక, జరిగిందేదో జరిగిపోయింది, నేను ఇప్పటికీ నిన్ను మనసారా ప్రేమిస్తున్నా అని వేడుకున్నా…. బ్రతిమాలా…. అయినా తను నన్ను పురుగుని చూసినట్టు చూసి… ఇంకా విసిగిస్తే పోలీసులకు చెప్తా అంది. ఛీ కొట్టి వెళ్ళిపోయింది.

హాస్పిటల్ బెడ్ మీద ఉన్నా. ఆత్మహత్యా ప్రయత్నం చేశా…. ఎవరో రక్షించినట్టున్నారు. చెరోవైపు అమ్మ, నాన్న ఉన్నారు. అమ్మ ఏడుస్తుంది. కాస్త దూరంలో మా ఫ్రెండ్స్ ఉన్నారు. మెల్లగా కళ్ళు తెరిచా. వారిలో ఒకడు దగ్గరకు వచ్చాడు. మెల్లగా ఓపికను కూడదీసుకుని “ఏరా శిరీషకు విషయం తెలిసిందా?” అని అడిగా. అంతే వాడు నన్ను ఒకరకమైన హీనమైన చూపు చూసి… నువ్వేమైపోయినా తనకు అనవసరం అందిరా అన్నాడు. మా నాన్న గంభీరంగా ఉన్నాడు. అతని కళ్ళలోకి చూడలేకపోయా. కళ్ళు మూసుకున్నా.

హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయ్యాకా…నన్ను మా వూరు తీసుకునిపోయారు నాన్న. అక్కడా నాకు తన మీదే ధ్యాస.

కొద్ది రోజులు గడిచాకా ఇంట్లో ఉండీ, ఉండీ చిరాకుగా అన్పించి…. వూరి పొలిమేరలో ఉన్న చెరువుగట్టు మీదకు వెళ్ళేవాడిని. అక్కడ పెద్ద మర్రి చెట్టు ఉండేది…. దాని చుట్టూ ఒక సిమెంట్ అరుగు ఉంటుంది కూచోవటానికి.  అది మా వూరి నుంచి వేరే వూరు వెళ్ళటానికి దారి…. కాకపోతే జనసంచారం తక్కువగా ఉంటుంది. ఆ దారిలో పొలం గట్ల మీదుగా వెళ్తే, పక్కనే ఉన్న పట్టణానికి దగ్గరి దారి. చీకటి పడేవేళకి మందుబాబులకు అది రహదారి. ఎందుకో ఆ మర్రిచెట్టు గట్టున కూచుని చెరువులోకి గులక రాళ్ళు విసురుకుంటూ ఉండేవాడిని. మొదట్లో అందరూ నన్ను ప్రశ్నలతో వేధించేవారు… కొన్నాళ్ళకు నన్ను పట్టించుకోవటం మానేశారు. నేను శిరీషను మర్చిపోలేకపోతున్నా. కానీ అలా ఎన్నాళ్ళు? ఏమో కాలమే సమాధానం చెప్పాలి.

అందరూ నన్ను పట్టించుకోవటం మానేసిన కొద్దిరోజులకు, “అసలేమైంది నీకు? మంచివాడివేగా… ఇలా ఎందుకైపోయావ్? చాలా రోజులనుంచి గమనిస్తున్నా…. ఇంకా మారవా?” ఒక కొత్త గొంతు నన్ను చాలా చనువుగా పలకరించింది. చూసా… ఒక అమ్మాయి…. కాస్త మోటుగా ఉన్నా… తన కళ్ళు చాలా చురుకుగా ఉన్నాయ్. గొంతులో కాస్త కరుకుతనం… మంచి యవ్వనంతో, బంగారు వర్ణమైన మేనిఛాయతో, మంచి నిగారింపుగా ఉంది. ఒక్కసారిగా నేను చిన్న కలవరపాటుకు గురైనప్పటికీ, అలా చనువు తీసుకోవటం నాకు నచ్చలేదు. కానీ ఎందుకో తనకా విషయం చెప్పలేకపోయా… తనే ముందుకొచ్చి “నీ గురించి అందరూ అనుకుంటుంటే విన్నా…. బాగా తెలివైనవాడివంట కదా… ఎవరో అమ్మాయి మోసం చేస్తే ఇలా అయిపోయావంట కదా… ” …

నా సమాధానం కోసం తను ఎదురు చూడటం లేదు… నా ముఖంలో భావాలను ఆమె గమనించటం లేదు. తన ప్రవాహంలో తను మాట్లాడేస్తోంది. “అయినా మోసం చేసిన అమ్మాయి కోసం ఆలోచిస్తూ నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావా? నీ మీదే ఆశలు పెట్టుకుని జీవిస్తున్న నీ తల్లితండ్రులను నువ్వు మోసం చెయ్యటం తప్పు కాదా? జరిగిన దానిని తలచుకుని ఏడుస్తూ బ్రతికే కంటే…. దాన్ని పీడకలలా మర్చిపోయి జీవించవచ్చుగా? ఉన్నదే చిన్న జీవితం… ప్రతి క్షణం విలువైనదే… దాన్ని అనుభవించాలే కానీ వ్యర్థం చెయ్యకూడదు.”. ఆమె వాక్ ప్రవాహానికి అడ్డు వస్తూ అప్పుడే అటువైపుగా ఎవరో ఆమెను పలకరించారు…. తన ప్రవాహాన్ని అటు మళ్ళించి వెళ్ళిపోయింది. మరో రోజు మళ్ళీ కలిసింది…. “ఆలోచించావా? మారాలనుకుంటున్నావా?” అంది. మళ్ళీ మౌనమే నా సమాధానం. కానీ ప్రతి రోజూ ఆమె నన్ను అక్కడే కలిసేది… అలాగే ఏదో వ్యక్తిత్వవికాస బోధన చేసేది….

ఒక రోజు నేను నా మౌనాన్ని చేధిస్తూ… ఆమెను ఒక ప్రశ్న అడిగా… “నేనంటే నీకు ఎందుకు ఆ ప్రత్యేకమైన అభిమానం? నేను పట్టించుకోకపోయినా ఎందుకు ప్రతిరోజూ నాతో మాట్లాడాలని ప్రయత్నిస్తావ్? అసలు ఎవరు నువ్వు?” నా ప్రశ్నల పరంపరకు అడ్డు వస్తూ…. “అన్ని విషయాలూ చెప్తా… కానీ నేను చెప్పినట్లు నడుచుకుంటావా?” అంది. చాలా ప్రత్యేకంగా అన్పించింది.

నాకు తెలీకుండానే నా నోటినుంచి “అలాగే” అని వచ్చేసింది. ఇంకా ఆ రోజు నుంచి తనని కలవడానికే అక్కడికి వెళ్ళేవాడిని. తను అక్కడకి వచ్చే వరకూ అక్కడే ఉండే వాడిని…. చీకటి పడే వేళ అయినా ఉండేవాడిని. తను అన్నీ చెప్పేది….. కానీ తానెవరో, ఏం చేస్తుందో మాత్రం చెప్పలేదు. “నన్ను ప్రేమిస్తున్నావా?” అని అడిగేసా… దానికి తను బిగ్గరగా నవ్వి “దానికి నా మనసులో చోటులేదు.” అంది. తనొక ప్రత్యేకమైన వ్యక్తిలా అన్పించేది…. తను చెప్పే మాటలకు ప్రభావితుడనై మళ్ళీ నేను పాత జీవితంలోకి రావటం మొదలు పెట్టా…..

ఒకసారి మాత్రం తనని బాగా బలవంతం చేశా ఆమె గురించి ఎలాగైనా చెప్పాలని…. అంతే… భోరుమంది. ఎంతో ధైర్యంగా మాట్లాడే ఆమె, అలా ఏడ్చేసరికి నాకు ఆశ్చర్యమేసింది. ఆమె ఒక లక్ష్మీ కరుణ లేని సరస్వతి. చిన్నతనంలోనే ఎదురుదెబ్బలు తిని, శిల్పంలా మారిన ఒక శిల. తండ్రి తాగుడుకి బానిసై, చిన్నతనంలోనే ఒక కర్కోటకుడికి ఇచ్చి పెళ్లి చేస్తే…. వాడు తనని అంగడి బొమ్మని చేసి అమ్మేస్తే …. అక్కడినుంచి తప్పించుకుని…. దారితప్పిన గాలిపటంలా ఈ వూరికి చేరింది.

తనేం చేస్తుందో మాత్రం చెప్పలేదు… నేనూ అడగలేదు…..

మరి నేనెందుకు ఇష్టం అంటే “చిన్నప్పుడు తన స్కూల్‌లో ఒక పెద్దింటి అబ్బాయ్ తనకి బెస్ట్ ఫ్రెండ్… తను అచ్చు నాలానే ఉండేవాడట… నాలో తనని చూసుకుంటుంది…. అందుకే నేనంటే అంత ఇష్టం”. మొత్తానికి తను ఇచ్చిన ప్రోద్భలంతో నా కొత్త ప్రయాణం మొదలుపెట్టా….

ఆపేసిన నా చదువుని మళ్ళీ మొదలుపెట్టా….. అన్ని సబ్జక్ట్స్ ఒక్కసారికే పాస్ అయ్యా… నాలో మార్పు చూసి నా తల్లితండ్రులు చాలా సంతోషించారు. మొదట్లో ఒక చిన్న కంపనీ లో ఉద్యోగం సంపాదించా…. నా పనితనంతో పాటు నా నిజాయితీ, పట్టుదల, నా తెలివితేటలు గుర్తించి యాజమాన్యం నన్నుఅమెరికా పంపించింది. అక్కడే ఒక 3 సంవత్సరాల పాటు ఉండిపోయా. అక్కడా మంచి పేరు రావటంతో నాకు మంచి పదోన్నతినిచ్చి, ఇండియా బ్రాంచికి హెడ్‌ని చేసారు. అగాధంలో ఉన్న నా జీవితం రాకెట్ వేగంతో దూసుకెళ్లిపోతుంది… దానికి కారణం మాత్రం తనే…. ఇన్ని రోజులు మాట్లాడినా నాకు ఆమె పేరు తెలియలేదు. అడగలేదు…. అవసరమూ రాలేదు. ఎన్ని రకాలుగా ఆలోచించినా తనకి నేను ఏదోలా రుణం తీర్చుకోవాలనిపించింది. నా జీవితాన్ని మార్చిన తనకి…. తన జీవితాన్ని మార్చడమే సరైనదిగా తోచింది. తోచిందే తడువుగా నాన్నకి ఫోన్ చేసి మొత్తం చెప్పా…. మొదట హతాశుడైన ఆయన, నా దృఢ నిశ్చయానికి మౌనంగా అంగీకారం తెలపాల్సి వచ్చింది. ఎప్పుడెప్పుడు వూరు చేరుదామా అని మనసు ఉబలాటపడుతోంది. ఆ సమయం రానే వచ్చింది….

ముందుగా విమానంలో హైదరాబాద్ చేరా…. ఆ రోజు ఆఫీస్‌లో కొంత పని ముగించి, తరువాత రోజునుంచి ఒక వారం పాటు సెలవు తీసుకుందామన్నది నా ఆలోచన. అలా ఆ రోజు ఆఫీస్‌కి వెళ్తున్నా. దారిలో ఒక దృశ్యం నన్ను, కారుని ఆపేలా చేసింది. “శిరీష”…… అవును…. నా మొదటి ప్రేమ గురుతు…

నిస్తేజమైన కళ్ళతో, కళావిహీనమైన మొహంతో… రోడ్డుపై నిలబడి ఉంది…. అంతలా మారినా నేను వెంటనే గుర్తుపట్టా తనని… మొదటిప్రేమ మహిమ కాబోలు. ముందుకే వెళ్లిపోదామనుకున్నవాణ్ని, ఎందుకో తనని పలకరించాలనిపించింది. మొదటి ప్రేమ ప్రభావం కాబోలు. కారుని ప్రక్కగా ఆపి వెళ్లి పలకరించా…. మొదట నన్ను గుర్తుపట్టలేకపోయినా.. కొద్ది క్షణాల్లో గుర్తుపట్టింది.

ఎక్కడన్నా తింటూ మాట్లాడదామంది… పక్కనే హోటల్‌కి వెళ్లాం…. “ఎలా ఉన్నారు?” అన్నా… “నీలాంటి వాణ్ణి మోసం చేస్తే ఎలా ఉంటానో అలానే ఉన్నా” అంది. “నిన్ను నేను మోసం చేశా…. ప్రేమ పేరుతో నన్ను వేరొకడు వాడుకుని మోసం చేసాడు…. శిక్ష అనుభవిస్తున్నా.. ఇంట్లో వాళ్ళను కాదని వాడు చెప్పే మాటలు నమ్మి వచ్చేసా….. తడి గుడ్డతో గొంతు కోసాడు. ఏం చేయాలో తెలీక…. ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నా.

ప్రతి దగ్గరా తిరస్కారమే…. రోజులు గడవడమే కష్టంగా ఉంది…. ఇంత వరకూ ఇంటినుంచి తెచ్చిన నగలు అమ్మి ఎలాగో నెట్టుకొచ్చేశా…. గత 2 రోజులుగా అదీ లేదు. ఆకలికి తట్టుకోలేక సిగ్గువిడిచి నువ్వు కనపడగానే… ఏదన్నా తింటూ మాట్లాడదామని అడిగా.” అంటూ కళ్ళ నీరు కార్చింది. తనలో పశ్చాత్తాపం కనిపిస్తోంది. వెంటనే నా కార్ ఎక్కించుకుని ఆఫీస్‌కి తీసుకెళ్ళి నా పర్సనల్ సెక్రటరీగా ఉద్యోగం ఇచ్చా. అలాగే తనని ఒక హాస్టల్‌లో చేర్చి, నెలకు సరిపడా డబ్బులు చెల్లించి, మరికొంత తనకి ఇచ్చి బయలుదేరబోయా….

వర్షించే తన కళ్ళు తను చేసిన తప్పులను కడిగేస్తున్నట్లుంది. ఆ రాత్రి నా “ఆమె” గురించి ఆలోచిస్తూ పడుకున్నా….

మరుసటి రోజు మద్యాహ్నానికి వూరు చేరా….. కాలకృత్యాలు అన్నీ తీర్చుకున్నాకా….. వెంటనేచెరువు గట్టును చేరుకున్నా… సాయంత్రందాకా ఎదురుచూసా.. అలా మూడు రోజులూ చూసా….. తనేమైపోయింది? నాన్నని నిలదీశా… ఆమె ఎటో వెళ్ళిపోవటానికి తనేమన్నా కారణమేమో అని…. నా అనుమానం నిజమైంది. వీళ్ళే తనని బెదిరించి ఎటో వెళ్లిపోయేలా చేసింది….. తను కన్పించకపోతే వదిలేస్తాననుకున్నారు. కానీ తననే నాలో నింపుకున్న నేను, వేరే వాళ్ళతో నా జీవితాన్ని ఊహించుకోలేకపోయా…… అదే విషయం నాన్న వాళ్లకి చెప్పా. నా దృఢసంకల్పం ముందు వాళ్ళ మాటలు పనిచెయ్యలేదు. వాళ్లు భయపడ్డారు…. మళ్ళీ నేను ఏమైపోతానో అని…. కానీ తను నాలో నింపిన స్ఫూర్తి…. నన్ను మనిషిగానే మిగులుస్తుంది గానీ మళ్ళీ మోడువారిన మానుని చేయదు. అదే చెప్పి తనని అన్వేషించే ప్రయత్నంలో పడ్డా…. ఆ నా ప్రయత్నంలోనే… ఆమెను గురించి చాలా వివరాలు సేకరించా…. కొంతమందిని కలుసుకున్నా… ఆ ప్రయత్నంలోనే ఈ ఆశ్రమానికి వచ్చా…. ఇక్కడ ఏమన్నా తలదాచుకుని ఉంటుందేమోనని. నా ప్రయత్నం నెరవేరాలని మొక్కని దేవుడులేడు… ఎక్కని గుడి మెట్లు లేవు….

మీ ఆశీస్సులు కూడా లభిస్తే తొందరలోనే నేను తనని కలుసుకోగలను…