11. నాన్న

0
8

[box type=’note’ fontsize=’16’] 2018 దీపావళి కథల పోటీకి వచ్చిన కథ. [/box]

[dropcap]హై[/dropcap]వేలో హై స్పీడ్‌లో హైఎండ్ మోడల్ కారులో దూసుకుపోతున్నా. మనసు అల్లకల్లోలంగా ఉంది. ఏదో తెలియని అలజడి. కాసేపయ్యాకా ఒక మామూలు రహదారికి మారాను…. ఆ దారి నేను పుట్టిన ఊరికి నన్ను తీసుకుని వెళుతుంది. కాస్త నెమ్మదిగా నడుపుతున్నా. ఊరికి ఇంకా సగం దూరం ఉంది. మధ్యలో ఉన్న సున్నం చెరువు గట్టుకి చేరా. సుమారు సాయంత్రం కావస్తోంది… ఆకాశం చిన్న మబ్బు పట్టి బంగారు వర్ణం సంతరించుకుని ఉంది…. సూర్యుడు అస్తమించటానికి సిద్ధపడుతూ వెళ్లేముందు తనవల్ల బంగారుమయమైన ఆ నేలను చూసుకుని మురిసిపోతున్నాడు…. ఆ అందాలను అతన్ని చూడనీయకుండా మబ్బులు అతడిని ఆటపట్టిస్తున్నాయ్. అబ్బా ఇలా కవితాత్మకంగా ఆలోచించి ఎన్ని సంవత్సరాలైందో… ఎందుకో కాసేపు అక్కడే ఉండాలనిపించింది. కారుని ఒక పక్కగా ఆపి అక్కడే చెరువు లాకుల దగ్గరకు వెళ్లి కూచున్నా….. వాతావరణం ఆహ్లాదంగా ఉంది…. రెండువైపులా పచ్చని పంటపొలాలు మధ్యలో రహదారి…. కోనసీమకు ఏమాత్రమూ తీసిపోని సుందర దృశ్యం. మనసు ఎంత అలజడిలో ఉన్నా ఆ వాతావరణానికి ఎంతో ఊరటగా ఉంది. ఒక్కసారిగా చిన్నప్పటి నా ఊహల్లోకి వెళ్ళిపోయా….

నేను ఈ ఊరిలో పుట్టి పెరిగా. మానాన్న ఈ ఊరిలోనే ఉపాధ్యాయునిగా పనిచేసేవారు. ఆయన పనిచేసేటప్పటికి ఈ ఊరివాళ్ళు ఎవరూ పెద్దగా చదువుకోలేదు… తను వచ్చాకా పిల్లలకి బడికి పంపమని ప్రతీ ఇంటికి వెళ్లి పెద్దవాళ్ళని ఒప్పించి, పిల్లలకి చదువు నేర్పించేవారు. చదువుతో పాటు పురాణాలు, పద్యాలు, పాటలు, సామెతలు, నీతికథలు చెప్పేవారు. దానితో తొందరగానే మంచి పేరు సంపాదించుకున్నారు. అలాగే ఊర్లోవాళ్లకి ఏ సలహా కావాలన్నా ఇచ్చేవారు. అందుకే అందరికీ ఆయనంటే గౌరవభావం ఉండేది. మా అమ్మ కూడా అందరితో చాలా కలుపుగోలుగా ఉండేది. వారికి నేను, అక్క సంతానం. నేను మొదటి నుంచి కాస్త తెలివితేటలు కలిగినవాణ్ని. ఒక రకంగా చెప్పాలంటే ఏకసంథాగ్రాహిని.

ఆ గర్వం నాలో ఎప్పుడూ ఉండేది. నాన్న చెప్పే మంచి మాటలు ఎందుకో పెద్దగా నచ్చేవి కాదు. అవి పనికిరాని, చేతకాని మాటల్లా అనిపించేవి. దానికి ఒక కారణముంది. నేను ఎప్పుడు ఏం అడిగినా ఏదోఒక కారణం చెప్పేవారు. అవసరాలు మాత్రమే తీర్చేవారు. నాకేమో కాస్త పెద్ద పెద్ద కోరికలుండేవి. అవి తీర్చేవారు కాదు. ఉన్నదాంట్లో సంతృప్తి పడాలనేవారు. కోరిక తీరకపోతే సంతృప్తి ఎలా వస్తుంది. పెద్దయ్యాకా, ఈయనకి దూరంగా, నాకు నచ్చినట్టు ఉండాలనుకున్నా. అందుకే ఆయన చెప్పే ఈ మాటా నాకు పెద్దగా నచ్చేది కాదు. కానీ ఆయన దగ్గర ఉన్న భయం వల్లో, లేక అమ్మ మీద ప్రేమ వల్లో ఏం అనేవాడిని కాదు. అలా నా పదవతరగతి వరకూ అక్కడే గడిచింది. పదోతరగతిలో రాష్ట్ర స్థాయిలో మంచి ర్యాంక్ వచ్చింది. అందరూ నన్నే మెచ్చుకున్నారు. అప్పుడు కూడా మా నాన్న, “మంచిది, ఇంకా బాగా చదివి గొప్ప పేరు తెచ్చుకోవాలి” అన్నారేగానీ, కనీసం ఒక బహుమతి కూడా ఇవ్వలేదు. అదే మాట అమ్మతో అంటే, ఆయన ఎంత సంతోషంగా ఉన్నారో తెలుసారా? అందరూ నీ గురించి మెచ్చుకుంటుంటే లో లోపలే పొంగిపోతున్నారు. నీకు ఎప్పుడూ మంచి జరగాలని గుడిలో అర్చన చేసి పదిమందికి అన్నదానం కూడా చేసారు తెలుసా అని గొప్పలు పోయింది. అంటే… పదిమంది అడుక్కునే వాళ్లకి పెట్టడానికి డబ్బులున్నాయ్ గానీ, నాకు కనీసం ఏదన్నా బహుమతిలాంటిది ఇవ్వాలన్న ఆశ లేదన్నమాట. అంతే నాకు అక్కడినుంచి దూరంగా వెల్లిపోవాలనిపించింది.

అప్పటికి నాకు తెలిసిన ప్రేమకు నిర్వచనమదే. ఎవరో అన్నట్లు మీటరు కడ్డీకేం తెలుస్తుంది సముద్రపు లోతు.

ఇంటర్‌లో పెద్ద కార్పోరేట్ కాలేజీ వాళ్ళు నన్ను ఉచితంగా చదివిస్తామని చెప్పి తీసుకుని వెళ్ళిపోయారు. నాకూ సంతోషంగా ఉంది. ఎందుకంటే నాకు సిటీలో ఉండటమే ఇష్టం. పైగా ఆయన చెప్పే సోది వినక్కరలేదు. నాకు నచ్చినట్లు ఉండవచ్చు. అడిగేవారు ఉండరు. అందుకే దూరం అని అమ్మ వారించినా చదువు పేరు చెప్పి అక్కడే జాయిన్ అయ్యా. ఐ.ఐ.టి.లో మంచి ర్యాంక్ వచ్చింది. ఐ.ఐ.టి డిల్లీలో ఎలక్ట్రానిక్స్‌లో ఇంజినీరింగ్. ఇంజినీరింగ్ తర్వాత పెద్ద పెద్ద కార్పోరేట్ కంపెనీలలో ఉద్యోగం వచ్చినా నేను సివిల్స్ చెయ్యాలని అనుకున్నా… బంగారంలాంటి ఉద్యోగం వదులుకుని, వేలల్లోఒకరికి వచ్చే ఆ ప్రభుత్వ ఉద్యోగం అవసరమా అని అందరూ వ్యతిరేకించారు, ఒక్క మా నాన్న తప్ప. దేశానికి, ప్రజలకి, సమాజానికి ఉపయోగ పడటానికి సివిల్స్ మంచి ఎంపిక అని మా నాన్న ఉద్దేశ్యం. కానీ నాకు ఆ ఉద్యోగంలో డబ్బుతో పాటు హోదా ఉంటుంది. అది ఇష్టం. అందుకే నేను అనుకున్నది తొందరలోనే సాధించా. ఇంకా అక్కడితో నా గ్రాఫ్ పైకే వెళ్ళటం మొదలైంది…. దానితోపాటే మా నాన్న ఆలోచనలకు, నా ఆలోచనలకు దూరమూ పెరిగింది. ఎంతలా అంటే నేను తనని విడిచిపెట్టేసేంత. నేను లంచావతారంగా మారటం, రాజకీయ నాయకులతో పూసుకుని తిరగటం ఆయనకు నచ్చలేదు. ప్రాక్టికల్‌గా ఆలోచించమని, కాలం మారిందని నేను చెప్పే మాటలు ఆయన జీర్ణించుకోలేకపోయారు. దానికితోడు తన ఇష్టానికి వ్యతిరేకంగా, నేను ఒక సీనియర్ ఆఫీసర్ కూతురిని పెళ్ళిచేసుకోవటం ఆయనకు, నాకు మద్య పెద్ద అగాధమే సృష్టించింది.

పెళ్ళయ్యాకా ఊరు వెళ్ళటం కూడా తగ్గిపోయింది. అమ్మ పోయాకా నాన్నని నా దగ్గరకు రమ్మని చెప్పినా ఆయన ఒప్పుకోలేదు. తనకు ఇక్కడే ప్రశాంతంగా ఉంటుందని చెప్పి నా మాట కొట్టేసారు. నేనూ ఏదో మాటవరసకు అడిగా గాని, తను మా ఇంటి వాతావరణానికి ఇమడలేడని తెలుసు. తర్వాత నా పని ఒత్తిడిలో నేను పడిపోయి ఆయన ఎలా ఉన్నాడో తెలుసుకునే ప్రయత్నం కూడా చెయ్యలేదు. మొదటినుంచీ తనకీ నాకూ మధ్య ఆ దూరం వల్ల పెద్దగా మాట్లాడుకోపోయినా, తేడా తెలిసేది కాదు. అందుకే నెలలు గడిచినా తను ఎలా ఉన్నారో అనే ఆలోచన వచ్చేదికాదు.

నేను ఇప్పుడొక ఉన్నతోద్యోగిగా ఉన్నా. ముఖ్యమైన పనులు నా సంతకం లేనిదే ముందుకు కదలవు. ప్రజల్లో ఉన్న పేరు కన్నా…. పెద్దల్లో ఉన్న పేరే గొప్పగా ఉంది. నేను వారికి, వారు నాకు ఉపయోగ పడటం. మొదట్లో బాగానే ఉన్నా, నా చుట్టూ ఉన్నవాళ్లు నన్ను చూసే విధానం నాకెందుకో అనుమానంగా అనిపించింది. ఆలోచించేకొలదీ, నా చుట్టూ అవసరంతో చేరిన మనుషులే కనిపించారు. అవకాశాలకోసం నన్ను వాడుకునే వారే కనిపించారు. దానికి తోడు ఒక రోజు నేను ఆఫీస్‌లో లేననుకుని నా గురించి నా కింది వాళ్లు మాట్లాడుకునేమాటలు నాకు స్పష్టంగా వినిపించాయ్. అవి ఎంతలా అంటే… గుండెల్లో గునపాల్లా… రోజూ మెచ్చుకున్న వాళ్ళే నా గురించి అంత ఛండాలంగా మాట్లాడటం తట్టుకోలేకపోయాను. ఒక బజారు మనిషికి నాకూ తేడాలేదని, తానైతే కనీసం చాటుగా తన వ్యాపారం చేస్తుందని, నేను మరీ బహిరంగమని… ఇంకా ఏవేవో, కోపం తన్నుకొచ్చినా, ఏం చెయ్యలేక ఆలోచనలో పడిపోయా.

నేను నా సంతోషానికి దూరమైయా. ఒకప్పుడు డబ్బు,హోదా ఉంటే చాలు అనుకునే వాడిని. ఇప్పుడు ఆ రెండూ ఉన్నా ఇంకా ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్. అది నాకు తెలియటంలేదు. ఎవరినీ నమ్మలేకపోతున్నా. అందరూ అవసరానికి నాతో ఉంటారని ఒక ఫీలింగ్. చివరకు నా భార్య కూడా నా డబ్బు వల్లే నా దగ్గర ఉంది అనే ఫీలింగ్. దానితో నాపై నాకే నమ్మకం తగ్గిపోయి, ఆందోళన పెరిగిపోతుంది. అలా అని ఆ పరిస్థితి నుంచి ఎలా బయటకు రావాలో తెలియటం లేదు. అలాంటి సమయంలోనే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. నాన్న దగ్గర పెద్దగా డబ్బు లేకపోయినా, పెద్ద హోదాలో లేకపోయినా సంతోషంగా ఎలా ఉండేవారు? అతనికి బాధలే లేవా? అయినా ఎప్పుడూ చిరునవ్వు చెదరని ముఖం ఎలా సాధ్యం. చిన్న విషయానికే కోపగించుకునే నేను, ఆయన కోపం ఇంతవరకూ చూడలేదు. అదెలా సాధ్యం. దానినే తెలుసుకోవాలనుకున్నాను. నా పరిస్థితికి ఆయనే సమాధానం చెప్పగలడని అనిపించి చాలా నెలల తర్వాత నాన్నకి ఫోన్ చేసి ఊరు వస్తున్నా అని చెప్పా. ఎలా ఉన్నావ్ రా… ఏమన్నా సమస్యా? అన్నారు. లేదు అని చెప్పి ఫోన్ పెట్టేశా. ఇన్ని రోజుల తర్వాత మాట్లాడినప్పుడు కూడా ఎలా ఉన్నావ్ నాన్నా అని నేను అడగలేదు. కానీ ఎలా ఉన్నావ్ రా అని ఆయనే నన్ను అడిగారు. ఎందుకో కాస్త సిగ్గు అనిపించింది. ఆయన సంస్కారానికి ముచ్చటేసింది. వెంటనే బయలుదేరా. ఇప్పుడు ఇదో ఇక్కడి వరకూ వచ్చా….. ఆలోచనలలోంచి బయటకు వచ్చా.

మబ్బులు కమ్ముతున్నాయ్. వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయ్. ఇంకా బయలుదేరా…. కారు మట్టి రోడ్డుపై పోతుంది. గాలికి దుమ్ము రేగుతుంది… క్షణాల్లో వాతావరణంలో మార్పు చోటుచేసుకుంది. తొందరగానే పోనిచ్చా… చీకటి పడే వేళకి ఇంటికి చేరుకున్నా. ఇంటి వసారాలో నాన్న తనకిష్టమైన భగవద్గీతని చదువుకుంటూ నాకోసం ఎదురుచూస్తున్నారు. చెప్పాకదా మా మధ్య మాటలు తక్కువని… పనిమనిషికి చెప్పి నాకు కావాల్సిన ఏర్పాట్లు చేసారు. తినేటప్పుడు కూడా రెండే మాటలు… కోడలు, పిల్లలు ఎలా ఉన్నారు? అని అంతే. కాకపోతే నేనేదో ఆందోళనతో ఉన్నా అని అర్థం చేసుకున్నారు. కానీ నా నోటితోనే వినాలని ఆగినట్లున్నారు.

భోజనాలు ముగిసాకా, నేను కాసేపు బయటనే ఉన్నాను ఏదో ఫోన్‌లో మాట్లాడుకుంటూ. కొంతసేపు నాకోసం చూసి, నాన్న తన గదికి వెళ్ళిపోయారు. నాకు వేరే గదిలో పడక ఏర్పాటు చేసారు. నా ఫోన్ పూర్తయ్యాకా నేనే ఆయన గదికి వెళ్లాను. సంకోచంగా ఉంది. ఎలా మొదలుపెట్టాలో తెలీదు. ఇంతలో నాన్నే… “ఏరా ఏమన్నా సమస్యా? ఏదో ఆందోళన నీలో కనిపిస్తోంది. ఎందుకలా ఉన్నావ్?” అన్నారు. అంతే ఒక్కసారిగా ధైర్యం వచ్చింది. బయట చిన్నగా వర్షం మొదలైంది. మెల్లగా చెప్పడంమొదలు పెట్టా. “అన్నీ నేను అనుకున్నట్లుగానే ఉన్నాయ్ గానీ, నేనెందుకో సంతోషంగా ఉండలేకపోతున్నా నాన్నా. డబ్బుకి, అంతస్తుకి డోకాలేదు. అయినా మనసుకి శాంతిలేదు. జీవితంలో డబ్బు ఉంటే ఏమన్నా సాధించగలననే నమ్మకం ఉండేది… డబ్బు ఉంటే సంతోషంగా ఉండగలననుకున్నాను. డబ్బుకోసం అప్పుడప్పుడూ మీరు పడే కష్టం చూసి ఆ పరిస్థితి నాకెప్పటికీ రాకూడదనుకున్నాను. అందుకే డబ్బు చుట్టే తిరిగాను. దాన్ని నా చుట్టూ తిప్పుకుంటున్నాను. అయినా నాకెందుకో ఆనందం లేదు. పైగా నా చుట్టూ ఉన్న మనుషులు నా డబ్బు కోసమే ఉన్నారనే ఆలోచన నన్ను వేధిస్తోంది. ఏమీ లేకపోయినా మీరు అమ్మ అంత సంతోషంగా ఎలా ఉండగలిగారు? నేనెందుకు ఉండలేకపోతున్నా? నేను మీలా సంతోషంగా ఉండాలంటే ఏం చెయ్యాలి… ఎలా ఉండాలి?”

నాన్న చిన్నగా నవ్వారు. అప్పుడు చూసా అతని కళ్ళలో ఒక రకమైన మెరుపు. ఏదో తెలియని గర్వం… బయట వర్షం పెద్దదైంది… మేమిద్దరమే ఉన్నాం. నాన్న మెల్లగా చెప్పటం మొదలు పెట్టారు. “నీ మాటల్లోనే సమాధానం ఉందిరా. నువ్వే అన్నావుగా డబ్బులేకపోయినా సంతోషంగా ఉండేవాళ్లమని. అంటే డబ్బులో సంతోషం లేదనేగా. సంతోషానికి, విలాసానికి చాలా తేడా ఉందిరా… విలాసవంతమైన జీవితంలో సంతోషం ఉంటుందని చాలామంది భ్రమ పడతారు. నిజానికి విలాసం శరీరానికి సంబంధించినదైతే, సంతోషం మనసుకి సంబంధించినది. మనం చేసే పని మంచిదా కాదా అని మన విజ్ఞత మనల్ని హెచ్చరిస్తూనే ఉంటుంది. దానిని కొట్టిపారేసి పరిస్థితుల పేరు చెప్పి మనం చేసే పనుల వల్ల డబ్బు వస్తుందేమో కానీ సంతోషం రాదు. నీ మనసుకు నచ్చిన, పదిమందికి ఉపయోగపడే పని చేసినప్పుడు…. నీవల్ల ఉపయోగపడ్డ ఆ పదిమందీ నిన్ను మెచ్చుకుంటున్నప్పుడు, నీ మనసులో కలిగే ఆనందానికి వెలకట్టగలమా? నేను చేసిందీ, నడిచిందీ అదే దారి… అందుకే డబ్బులేకపోయినా సంతోషంగానే ఉన్నా. ఇకపోతే, ఉన్నదాంట్లో సర్దుకుపోయే మనస్తత్వం ఉండటం అన్నది నాకూ, మీ అమ్మకు మా కుటుంబ పరిస్థితుల వల్ల చిన్నప్పటినుంచే అలవాటైంది. నిన్నూ అలాగే పెంచుదామనుకున్నా. కానీ అదే నీకు నా మీద వ్యతిరేకత పెంచింది. అందీ అందని పండు, చాలా ప్రయత్నం తర్వాత అందినపుడు అందులో సాధించిన ఆనందం ఉంటుంది. అందుకే అది చాలా తీయగా ఉంటుంది. ఆ ఆనందం చాలా సమయం ఉంటుంది. అడగ్గానే దొరికితే వజ్రమైనా క్షణంలో రాయిలా అనిపిస్తుంది. ఆ తేడా తెలియాలనే చాలా వస్తువులను నీకు దూరం చేసాను. కానీ నువ్వు దానిని శిక్షగా భావించావు. డబ్బే అన్నీ ఇవ్వదు. కొన్ని మనకు మనం సమకూర్చుకోవాలి. మంచి మనుషులను, వారి ప్రేమలని.”

“సంతోషంగా ఉండాలంటే డబ్బు అవసరం లేదంటావా?”

“డబ్బూ అవసరమే. అది మన అవసరాలు తీర్చుకోవటానికి. డబ్బు సంపాదించటం తప్పు కాదు. కానీ ఆ యావలో పడి జీవితాన్ని అనుభవించలేకపోవటం, మనుషుల్ని, మమతల్ని, బంధాల్ని వదులుకునేంతగా పరిగెట్టటం దురదృష్టం.”

“మరి ఈ రోజుల్లో డబ్బు ఉన్నవాళ్లకే కదా నాన్నా విలువ. వాళ్ళకే కదా నాన్నా, బంధువులు, మర్యాదలూనూ…”

“నిజమేరా…. దురదృష్టమేంటంటే లోకం ఆ తీరుగ సాగుతోంది. బెల్లం చుట్టూ ఈగలు. బెల్లమూ శాశ్వతం కాదు… ఈగలూ శాశ్వతం కాదు. తోచినంతలో అవసరంలో ఉన్నవారికి సహాయపడు. వారే నీకు నిజమైన బంధువులు అవుతారు.”

“కానీ అలా ఉండటం సాధ్యమా? నేను ఉన్న ఈ అవినీతి ప్రపంచంలో నేను నీతిగా న్యాయంగా పనిచెయ్యగలనా?”

“కష్టమే… కానీ అసాధ్యమైతే కాదు. మొదట్లో లెక్కలేనన్ని అవరోధాలు వస్తాయ్. సంకల్పంతో నీవు నమ్మిన మార్గాన్నే ముందుకు పో…. కొన్నాళ్ళకి అన్నీ దారి తప్పుకుని రహదారిలా మారుతుంది. ఒక్కసారి ఆలోచించు. నిజాయితీగా ఉన్నవాడికి విలువ ఉంటుంది, గౌరవం ఉంటుంది. అవినీతిపరునికి డబ్బు ఉంటుంది… కానీ కిందిస్థాయి ఉద్యోగి కూడా లెక్క చెయ్యడు. నిజాయితీకి ఉన్న గొప్పతనమది. పదిమందికీ ఉపయోగపడే నీ హోదా ఆ ప్రజలకోసం నిజాయితీగా ఉపయోగించు… ఒక్కసారి ఆ మార్పు చూడు… అప్పుడు కలిగే సంతోషం యొక్క రుచి చూడు. నచ్చితే దాన్నే పాటించు…. నచ్చకపోతే…. ఆ ప్రశ్నే లేదు.”

ఎందుకో ఇన్ని రోజులూ నేను చూడని ఒక కొత్త నాన్న నాకు కనిపిస్తున్నారు. ఇన్ని సంవత్సరాల నా ఈ జీవితం వ్యర్థం చేశాననే బాధ కలిగింది. ఆ రోజు నాన్న కాళ్ల దగ్గరే, అలాగే నిద్రపోయా…

ఎప్పుడూ లేనిది నేను ఆఫీస్‌కి వెళ్తున్నప్పుడు నీ శ్రీమతి తన స్వహస్తాలతో నాకు టిఫిన్ పెట్టింది. నవ్వుతూ మాట్లాడుతుంది. మా అమ్మాయి, “నాన్నా, మా కాలేజీలో అంతా మీ గురించే గొప్పగా చెప్పుకుంటుంటే చాలా హ్యాపీగా అన్పించింది”, అంటుంటే చాలా గర్వంగా అనిపించింది. ఎందుకో చాలా హాయిగా అనిపించింది. మబ్బుల్లో౦చి అమ్మ నవ్వుతూ నా తల నిమురుతోంది…. అంతే ఒక్కసారిగా ఉలికిపడి లేచా. అది నా కల… అందమైన కల… ఆనందమైన కల….

అప్పుడే తెలవారుతోంది. రాత్రి పడిన వర్షానికేమో దుమ్ము పట్టిన నా కారు మొత్తం శుభ్రంగా కడిగిన ముత్యంలా మెరుస్తూ ఉంది, నా మనసులాగే. బయలుదేరి వెళుతూ, నాన్న కాళ్ళకి దండం పెట్టి,

“నాన్నా, ఇంకో నెలలో వస్తా, మీరు మా దగ్గరకు రావాలి అన్నా…. నాన్న కళ్ళలో నీళ్ళు. ఒక్కసారిగా హత్తుకుని…. ఇన్నేళ్ళ తన ప్రేమనంతా కొన్ని క్షణాల్లో చూపించి, తప్పకుండా వస్తా అన్నారు. నిజంగా ఆయన వస్తారని నేను అనుకోలేదు… ఆయన కళ్లల్లో ఏదో కాంతి. నేను ర్యాంక్ సాధించినపుడు కూడా అంత కనిపించలేదు. కానీ నేను ప్రయోజకుడిని అయ్యాననేమో…..అంతే కొన్ని మార్పులు చాలా ఆనందాన్నిస్తాయ్.”

ప్రపంచానికి వెలుగులు పంచడానికి తన రధమెక్కి సూర్యుడు తూర్పున తన ప్రయాణం మొదలుపెట్టాడు…

ఆ ఉషోదయాన… నా జీవితంలో వెలుగులు నింపుకోవడానికి, పదిమందికి వెలుగునివ్వడానికి… దృఢ సంకల్పంతో, స్వచ్చమైన మనసుతో నా కొత్త ప్రయాణం మొదలైంది…..

ప్రేమతో…. అంకితం…. నాన్నకు.