12. కారుమబ్బులు

0
7

[box type=’note’ fontsize=’16’] 2018 దీపావళి కథల పోటీకి వచ్చిన కథ. [/box]

[dropcap]“అ[/dropcap]సలు శీలం అంటే ఏంటి ప్రణవ్?” ఫోన్ లోనే సూటిగా అడిగింది సురభి.

“శీలం అంటే పవిత్రమైనది, అపవిత్రం కాకూడనిది” పెద్ద వేదాంతుడిలా చెప్పాను నేను.

“నేను అడుగుతోంది అది కాదు. నీ దృష్టిలో శీలం అనేది మనసుకు సంబంధించినదా! లేక శరీరానికి సంబంధించినదా??” వివరంగా అడిగింది సురభి.

“– — — ” నేను మాట్లాడలేదు.

“అపవిత్రత అంటున్నావు కదా! అపవిత్రత అలుముకొంది పల్లవి మనసుకా! లేక పల్లవి శరీరానికా?” నా భాషలోనే అడిగింది.

“– — — ” నేను మళ్ళీ మౌనంగా ఉన్నాను.

“ఒక్క విషయాన్ని అడుగుతాను. సూటిగా చెబుతావా?” మళ్ళీ తనే మాట్లాడింది.

“ఏంటది?” బాధను దిగమింగుకొని అడిగాను.

“పెళ్ళైన ఈ పది రోజులూ పల్లవి నీ పట్ల ప్రేమగా నడుచుకోలేదా?”

“– — — ” నేను నా మౌనాన్ని కొనసాగించాను.

“నా ప్రశ్నలన్నింటికీ సమాధానాలు దొరికాక నాకు కాల్ చెయ్యి ప్రణవ్!” కాల్ కట్ చేసింది సురభి.

(అసలేం జరిగిందంటే!)

నా పేరు ప్రణవ్. హైదరాబాద్‌లో సాఫ్టవేర్ ఇంజనీరుగా పనిచేస్తున్నా. సొంతూరు నెల్లూరు. అక్కడే మా కుటుంబం ఉంటుంది. పది రోజుల క్రితం పెద్దల సమక్షంలో పల్లవిను పెళ్లి చేసుకొన్నా. ఈ పది రోజులూ ఆమె సహవాసంలో ఎన్నో గొప్ప అనుభూతులు రుచి చూసా. ఆమె నవ్వులోని అమాయకత్వపు స్వచ్ఛదనాన్ని చూసాను. ఆమె నడతలో ఆడదాని సున్నితత్వాన్ని చూసాను. ఆమె కళ్ళలో నాపై ఉన్న ఆకాశం అంత ప్రేమను చూసాను. ఆమె మాటలో అనంతమైన ఓర్పును చూసాను. నాకు తెలిసిన ప్రపంచంలో నాకు పరిచయం లేని కొత్తదనాన్ని చూసాను. పెళ్లికి పెట్టిన సెలవులు అయిపోవడంతో ఇవ్వాలే హైదరాబాదుకు వచ్చా.

ఆఫీసులో పని ముగించుకొని నా ప్లాట్‌కు చేరుకొనే సరికి టైం రాత్రి తొమ్మిదయ్యింది. ఫ్రెష్ అప్ అయ్యి నాతో పాటు తెచ్చుకొన్న టిఫిన్ తిన్నా. ఫోన్ అందుకొని పల్లవికు కాల్ చేశా. స్విచ్ ఆఫ్ వస్తోంది. సాయంత్రం కేంటీన్‌లో కాఫీ తాగుతూ తనతో మాట్లాడాను. మళ్ళీ రాత్రికి కాల్ చేస్తానని చెప్పాను. కానీ ఇప్పుడు కాల్ కలవడం లేదు.

ఒక మెత్త, రెండు తలగడలు, వాటర్ బాటిల్, మొబైల్ తీసుకొని పడుకోవడానికి డాబా పైకి వెళ్లాను. పల్లవికి వాట్సాప్‌లో గుడ్ నైట్ అని పిక్ చేసి పడుకొన్నా. పెళ్ళికి ముందు కూడా ప్రతి రోజూ ఇదే డాబా పై పడుకొనేవాడిని. ఒక తలగడను తల క్రింద, రెండో తలగడను కౌగిలిలో బిగించి పడుకొనే వాడిని. రెండో తలగడలో నాకు కాబోయే భార్యను ఊహించుకొని తియ్యని అనుభూతులు పొందే వాడిని. పెళ్ళైన ఈ పది రోజులూ రెండో తలగడతో అవసరం రాలేదు. పల్లవి ప్రేమలో ఈ పదిరోజులూ పరవశించి పోయాను. మళ్ళీ ఇన్నాళ్ళకు రెండో తలగడ పొందు కావాల్సి వచ్చింది. విశాలమైన ఆకాశానికి తన ప్రకాశంతో వెలుగును అద్దిన జాబిలిని చూస్తూ, రెండో తలగడను నా గుండెలకు హత్తుకొంటూ, నా గమనానికి సరికొత్త రంగులు అద్దిన నా పల్లవిని తలగడలో ఊహించుకొంటూ, సరికొత్త ఊహా ప్రపంచాన్ని నిర్మిస్తూ ఉండగా నా మొబైల్ వాట్సాప్ మెసేజ్ వచ్చినట్టు చప్పుడు చేసింది. మెసేజ్ చప్పుడు వినగానే నా పెదవులపై చిరు మందహాసం చేరింది. బహుశా ఆ మెసేజ్ పల్లవి నుండి వచ్చి ఉంటుందని నా మనసు ఊహించింది కాబోలు. వాట్సాప్ ఓపెన్ చేసి చూసా. అన్‌నోన్ నంబర్ నుండి పదుల సంఖ్యలో ఫోటోలు వచ్చిపడ్డాయి. వాటిని చూడగానే ఒక్క సారిగా ఉలిక్కిపడ్డాను.

నా పల్లవి వేరొకడి కౌగిలిలో ఉండగా తీయబడ్డ ఫోటోలు అవి. వాడు కూడా సుమారు నా వయసు వాడే. అర్ధ నగ్నంగా ఉన్నాడు. నా పల్లవి వాడి కౌగిలిలో బంధించి ఉంది. వాటిని చూడగానే నా కాళ్ళ క్రింద ప్రళయం జనించింది. ఆకాశం నుండి విపత్తు ధ్వనించింది. నా మనసులో అగ్ని జ్వలించింది. గొప్పగా మెదలై, సాఫీగా సాగిపోతున్న నా వైవాహిక జీవితంలో నేను ఊహించని ఉపద్రవం చోటుచేసుకుంది. అసలు నేను చూస్తున్నది నిజమేనా? ఫోటోలలో ఉన్నది నా పల్లవేనా? ఈ ఫోటోలను ఎవరు పంపారు? ఏం ఆశించి పంపారు? అసలు ఈ ఫోటోలలో నా పల్లవితో ఉన్నది ఎవరు?? నా మెదడు సాదారణ స్థితికి చేరే లోపే మరో మెసేజ్ వచ్చింది. అది మూడు నిముషాల వాయిస్ మెసేజ్. అప్రయత్నంగా దానిని ఓపెన్ చేశా. ఫోన్ లో మాట్లాడుతున్న సంభాషణ అది. పల్లవి ఎవడితోనో ఫోన్ లో మాట్లాడుతుండగా రికార్డ్ చేసి పంపారు. దాన్ని జాగ్రత్తగా విన్నా.

“హలో!” చాలా స్వీట్‌గా పలకరించింది పల్లవి.

“హాయ్!” కాస్త మంద్రంగా పలకరించాడు అతడు.

“ఎవరు?” అడిగింది పల్లవి.

“ఏంటి పల్లవి అప్పుడే మరచిపోయావా? నేను, నీ బాయ్ ఫ్రెండ్ అర్జున్‌ను.”

“ఎందుకు ఫోన్ చేసావ్?” సూటిగా అడిగింది పల్లవి.

“నన్ను కాదని, వేరే ఎవడినో పెళ్లి చేసుకొన్నావు కదా! వాడితో నువ్వు సంతోషంగా ఉన్నావో లేదో తెలుసుకొందామని!”

“ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినస్!”

“అదేంటి స్వీటీ, అలా అంటావ్. మనమిద్దరం ప్రేమించుకొన్నాం, కలసి తిరిగాం, కలసి….” సాగదీసాడు అతడు.

“స్టాప్ ఇట్ అర్జున్. ఇప్పుడు ఎందుకు కాల్ చేసావో చెప్పు?”

“నిన్ను ఒక్కసారి కలవాలని ఉంది డార్లింగ్. అందుకే కాల్ చేశా!”

“నువ్వు పిలవగానే పరిగెత్తుకొని రావడానికి నేను నీ పాత గర్ల్ ఫ్రెండ్‌ను కాదు!”

“రానంటే కుదరదు బేబి, ఖచ్చితంగా రావాల్సిందే! రాకపోతే నీకే నష్టం.”

“ఏంటి? బెదిరిస్తున్నావా?”

“లేదు స్వీటీ. నిజం చెబుతున్నా. నువ్వు నన్ను కలవలేదంటే, మన గతాన్ని నీ మొగుడి ముందు విప్పుతా. నువ్వు నన్ను ప్రేమించిన విషయం, మా ఇంటికి వచ్చిన విషయం, మనమిద్దరం ఆ రోజున తృప్తిగా గడిపిన విషయం.”

(మూడు నిముషాల వాయిస్ మెసేజ్ అయిపోయింది.)

పదేపదే ఆ ఫోటోలను చూసాను. ఆ మెసేజ్‌ను విన్నాను. వాటన్నిటినీ విశ్లేషించి చూస్తే నాకు కొన్ని విషయాలు రూడీ అయ్యాయి. పల్లవికి గతంలో, పెళ్ళికి ముందు అర్జున్ అనే బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు. పల్లవి తెలిసో తెలియకో వాడితో తప్పటడుగు చేసింది. ఆ తరువాత నన్ను పెళ్లి చేసుకొంది. వాడు ఇప్పుడు పల్లవికి పోన్ చేసి, బ్లాక్ మెయిల్ చేసి, ఆ ఫోన్ కాల్ ను రికార్డ్ చేసి నాకు పంపాడు.

ఈ పదిరోజులూ పల్లవి పై ప్రేమను నింపుకొన్న నా మనసులో కారుమబ్బులు అల్లుకొన్నాయి. క్షణాల్లో నా మనసు చీకటితో నిండిపోయింది. ఆ చీకటిలో నా ఆలోచనలు అస్తవ్యస్తంగా ప్రయాణించడం మొదలుపెట్టాయి. నాకు ఏం చెయ్యాలో పాలుపోలేదు. పల్లవికి ఫోన్ చేసి ఈ ఫోటోల వెనకున్న నిజాన్ని చెప్పమని నిలదీస్తే!! ఇదంతా అబద్దం అని కొట్టి పారేస్తుందా? లేక నిజాన్ని ఒప్పేసుకొంటుందా? అబద్దం అని కొట్టిపారేస్తే నేను నిజాన్ని నిరూపించాగలనా ? ఒక వేళ ఇదంతా నిజమేనని ఒప్పుకొంటే నేను తనతో కలసి జీవితాన్ని పంచుకోగాలనా? లేక తన నుండి వేరుపడి బ్రతకనా?? తనతోనే జీవితాన్ని పంచుకోవాలని అనుకొంటే ఈ నిజాలు, అబద్దాలు అన్న వాదనలు ఎందుకు? అసలు నా ఆలోచనలు ఏవైపు వెళ్తున్నాయి. అవి సరైన మార్గంలో వెళ్ళడం లేదని మాత్రం నాకు తెలుస్తూనే ఉంది. నా బాధను ఎవరితో చెప్పుకోగలను. ఆలోచిస్తూ ఉండగా నాకు సురభి గుర్తుకు వచ్చింది. తను నాకు పిన్ని కూతురు. అంతకు మించి మంచి స్నేహితురాలు. ఏడాది క్రితమే పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్ళింది. తనకు ఆ ఫోటోలను, వాయిస్ మెసేజ్‌ను పంపాను. తనకు కాల్ చేసాను. సురభి నన్ను ఓదారుస్తుందని, నా వైపు మాట్లాడుతుందని భావించా. కానీ అనూహ్యంగా తను పల్లవి వైపు నిలబడింది. నా మనసు సరైన దారిలో ఆలోచించడం లేదని నన్ను తప్పుబట్టింది. శీలం పేరుతో పదునైన ప్రశ్నలను నా వైపు సంధించింది.

***

నేను ఆలోచిస్తూనే ఉన్నా. పల్లవి గురించి, ఈ పది రోజులూ పల్లవి నాపై చూపిన ప్రేమ గురించి. నా భవిష్యత్తు గురించి, భర్త అనబడే నా హోదా గురించి. మరో వైపు సురభి అడిగిన ప్రశ్నలు నన్ను మరింత నరకంలోకి నెట్టేస్తూ ఉన్నాయి. నాగరికతలో ఉన్న నేను అనాగరికంగా ఆలోచిస్తూ ఉన్నానా?

రాత్రి గడిచే కొద్దీ ఆకాశం నుండి మంచు బిందువులు కురుస్తున్నాయి. నా కళ్ళ నుండి కూడా కన్నీటి బిందువులు రాలుతున్నాయి. నేను చూసింది, విన్నది అబద్దం కావాలని ఎన్నో సార్లు కోరుకొన్నాను. కానీ నిజం ఎప్పటికీ అబద్దం కాలేదు కదా!

సమయం సుమారు ఉదయం ఐదు గంటలు. ఆలోచించి నా మనసు, నిద్రపట్టక నా కళ్ళు, విశ్రాంతి లేక నా శరీరం అలసిపోతూ ఉండగా నా ఫోన్ రింగ్ అయ్యింది. ఉలిక్కి పడి చూసా. సురభి కాల్ చేసింది.

“హలో!”

“చెప్పు సురభి”

“నా ప్రశ్నలకు సమాధానాలు దొరికాయా?”

“——–” నేను మాట్లాడలేదు.

“పల్లవి తప్పు చేసిందని ఎందుకు భావించాలి. ఒక్కోసారి మనం కళ్ళతో చూసింది, చెవులతో విన్నది కూడా అబద్దం అవుతుంది.” సర్ది చెప్పే ప్రయత్నం చేస్తోంది తను.

“ఆ ఫోటోలలో ఉన్నది, వాయిస్ కాల్ లో విన్నది పల్లవిని కాదా?” గట్టిగా అడిగాను నేను.

ఈ సారి మౌనం ఆమె పంచన చేరింది. కొద్ది సేపు మౌనం తరువాత మళ్ళీ తను చెప్పడం మొదలు పెట్టింది.

“చూడు ప్రణవ్! శీలం అనేది శరీరానికి సంభందించినది అని నువ్వు అనుకొంటే, ఆమె శరీరానికి అంటిన మకిలి తలంటి స్నానం చేసిన ప్రతిసారీ శుభ్రపడి ఉంటుంది. అలాకాకుండా శీలం అనేది మనసుకు సంభందించినది అని నువ్వు అనుకొంటే ఆమె మనసుకు అంటిన మకిలి ఎప్పుడో తుడిచి పెట్టుకుని పోయింది. అందువల్లే ఆమె గతాన్ని మరచి, నిన్ను పెళ్లి చేసుకొని, నీపై ప్రేమను చూపగలుగుతూ ఉంది. పల్లవి మనసులో ఇంకా అతనే ఉన్నాడని నువ్వు భావిస్తే, నీ ప్రేమతో ఆమె మనసుకు అంటిన మకిలిని పోగొట్టు” అని చెప్పి సురభి ఫోన్ కట్ చేసింది.

బాగా ఆలోచించాను. “సురభి మాటల్లో నిజం లేకపోలేదు. ఎవడో అనామకుడు పంపిన మెసేజ్‌ను నేను ఎందుకు నమ్మాలి. వాడెవడినో నమ్మి నాతో బ్రతకానికి వచ్చిన పల్లవిని నేను ఎందుకు దూరం చేసుకోవాలి. తను తప్పు చేసి ఉండదు. ఒక వేళ తప్పు చేసినా అది గతం. తను ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకొంది. నాతో జీవితాంతం ప్రయాణించడానికి సిద్దపడి వచ్చింది. నాకు ప్రేమను పంచుతోంది. ఇది నిజం. ఇది మాత్రమే నిజం. ఈ విషయం గురించి పల్లవి ను అడగకూడదు.” అని నిర్ణయించుకున్నాను. వెంటనే సైబర్ క్రైమ్‌లో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తూ ఉన్న నా ఫ్రెండ్ దినేష్‌కు కాల్ చేసి జరిగింది చెప్పాను. నా టీం లీడర్‌కు కాల్ చేసి మరో రెండు రోజులు సెలవు అడిగి నెల్లూరికి బయలుదేరా.

***

హైదరాబాద్ నుండి నెల్లూరికి చేరేసరికే దినేష్ ఫోన్ చేసాడు. ఆ అర్జున్‌ను అరెస్ట్ చేసానని చెప్పాడు. నేను సరాసరి ఇంటికి వెళ్లాను. ఇంటికి వెళ్ళేటప్పటికి సాయంత్రం ఏడు దాటింది.

అమ్మ, నాన్న గుడికి వెళ్లినట్టు ఉన్నారు. ఇంట్లో పల్లవి ఒంటరిగా కూర్చొని ఏడుస్తోంది.

నన్ను చూడగానే ఒక్క ఉదుటున నా దగ్గరకు వచ్చింది.

“ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావ్??” నాకేమీ తెలియదన్నట్లు తనని అడిగా.

తను చెప్పలేక పోయింది. ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తోంది. తనని మరింత దగ్గరకు తీసుకొన్నా. సమస్య ఏదైనా తనకు తోడుగా ఉంటానని, తనవైపు నిలబడుతానని మాట ఇచ్చా. తను మెల్లగా కుదుటపడింది. గతాన్ని చెప్పడం మెదలు పెట్టింది.

***

 “డిగ్రీలో నా క్లాస్‌మేట్ అర్జున్ నన్ను ప్రేమించానని అన్నాడు. మూడేళ్ళు నా వెంట తిరిగాడు. క్రమంగా నేను కూడా అర్జున్‌ను నమ్మాను. అతన్ని ప్రేమించడం మెదలుపెట్టాను. ఫైనలియర్‌లో ఉండగా ఓ రోజు, తనకు పుట్టినరోజని, తన ఇంట్లో కేక్ కట్ చేస్తానని, తన ఫ్యామిలీకి నన్ను పరిచయం చేస్తానని, నన్ను తన ఇంటికి ఆహ్వానించాడు. నేను అతన్ని గుడ్డిగా నమ్మి ఆ సాయంత్రం అతడి ఇంటికి వెళ్ళాను. కానీ నేను వెళ్ళేటప్పటికి ఇంట్లో అతను తప్ప మరెవ్వరూ లేరు. అతను కూడా అర్ధనగ్నంగా ఉన్నాడు. అతడి చూపులో, ప్రవర్తనలో తేడాను గమనించాను. పెళ్ళికి ముందు ఇలాంటివి వద్దన్నాను. కానీ అతడు ఒప్పుకోలేదు. నన్ను బలవంతపెట్టాడు. నన్ను అనుభవించాలని చూసాడు. నేను ఎలాగోలా అతడి నుండి తప్పించుకొని వచ్చాను. ఆ మరుసటి రోజు నుండి అతను నన్ను బ్లాక్‌మెయిల్ చెయ్యడం మొదలుపెట్టాడు. ఆ రోజు తన ఇంట్లో రహస్యంగా సెల్ ఫోన్ అమర్చి మెత్తం వీడియో తీసాడట. ఆ వీడియోను ఫోటోలుగా కట్ చేసి వాటిని నాకు వాట్సాప్‌లో పంపాడు. నేను కనుక అతని కోరిక తీర్చకపోతే ఆ ఫోటోలను కాలేజ్‌లో అందరకీ వాట్సాప్ చేసి, నా పరువు తీస్తానని బెదిరించాడు. నేను మా HOD మేడమ్ గారికి జరిగిందంతా చెప్పాను. మేడమ్ గారు వాడ్ని పిలిచి వార్నింగ్ ఇచ్చారు. ఇంకోసారి అలా ప్రవర్తిస్తే కాలేజ్ నుండి సస్పెండ్ చేస్తానని చెప్పారు. దాంతో వాడు నాకు సారీ చెప్పి, మేడం గారి ముందే ఆ వీడియోను, ఫోటోలను తన సెల్ నుండి డెలీట్ చేసాడు. ఆ తరువాత ఎప్పుడూ నా జోలికి రాలేదు.

చాలా రోజుల తర్వాత మళ్ళీ నిన్న నాకు కాల్ చేశాడు వాడు. నన్ను ఒంటరిగా కలవాలని అడిగాడు. లేదంటే ఆ ఫోటోలను, వీడియో ను యూట్యూబ్‌లో అప్లోడ్ చేసి నా పరువు తీస్తానని నన్ను బెదిరిస్తూ ఉన్నాడు” ఏడుస్తూ చెప్పింది పల్లవి.

నేను ఏమీ మాట్లాడలేదు. మౌనంగా ఆలోచిస్తూ ఉన్నా. తను చెప్పింది నమ్మమని నా మనసు చెబుతూ ఉంది.

“వాడు నాతో మాట్లాడిన కాల్‌ను నేను నా సెల్‌లో రికార్డ్ చేసాను. వాడు నన్ను బెదిరించడం మెత్తం ఫోన్‌లో రికార్డ్ అయ్యింది. ఆ ఆధారంతో వాడిపై మనం పోలీస్ కంప్లయింట్ ఇద్దాం” అడిగింది నన్ను.

“వాడు నీతో ఫోన్‌లో మాట్లాడింది నువ్వు రికార్డ్ చేసావా?” ఆశ్చర్యంగా అడిగాను నేను.

“అవును రికార్డ్ చేసాను” అంటూ తన ఫోన్‌లో రికార్డయిన వాయిస్ కాల్ వినిపించింది పల్లవి. నేను జాగ్రత్తగా విన్నాను.

“హలో!”

“హాయ్!” కాస్త మంద్రంగా పలకరించాడు అతడు.

“ఎవరు?”

“ఏంటి పల్లవి అప్పుడే మరచిపోయావా? నేను, నీ బాయ్ ఫ్రెండ్ అర్జున్‌ను.”

“ఎందుకు ఫోన్ చేసావ్?”

“నన్ను కాదని, వేరే ఎవడినో పెళ్లి చేసుకొన్నావు కదా! వాడితో నువ్వు సంతోషంగా ఉన్నావో లేదో తెలుసుకొందామని!”

“ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్!”

“అదేంటి స్వీటీ, అలా అంటావ్. మనమిద్దరం ప్రేమించుకొన్నాం, కలసి తిరిగాం, కలసి…..” సాగదీసాడు అతడు.

“స్టాప్ ఇట్ అర్జున్. ఇప్పుడు ఎందుకు కాల్ చేసావో చెప్పు?”

“నిన్ను ఒక్కసారి కలవాలని ఉంది డార్లింగ్. అందుకే కాల్ చేశా!”

“నువ్వు పిలవగానే పరిగెత్తుకొని రావడానికి నేను నీ పాత గర్ల్ ఫ్రెండ్‌ను కాదు!”

“రానంటే కుదరదు బేబి, ఖచ్చితంగా రావాల్సిందే! రాకపోతే నీకే నష్టం.”

“ఏంటి? బెదిరిస్తున్నావా?”

“లేదు స్వీటీ. నిజం చెబుతున్నా. నువ్వు నన్ను కలవలేదంటే, మన గతాన్ని నీ మొగుడి ముందు విప్పుతా. నువ్వు నన్ను ప్రేమించిన విషయం, మా ఇంటికి వచ్చిన విషయం, మనమిద్దరం ఆ రోజున తృప్తిగా గడిపిన విషయం.”

“స్టాపిట్. పిచ్చిపిచ్చిగా ఉందా? ఆ రోజు నువ్వు నాతో తప్పుగా ప్రవర్తించినందుకు నా దగ్గర చెప్పుదెబ్బలు తిన్నావ్ కదా! మరచి పోయినట్టు ఉన్నావ్!”

“గుర్తుంది డార్లింగ్. మూడేళ్ళు నన్ను నీ వెనుక తిప్పించుకొన్నావ్. ఒక్క గంట నాతో గడపమని అడిగితే పెద్ద పతివ్రత లాగా నన్ను చెప్పుతో కొట్టి నా నుండి తప్పించుకొని వెళ్లిపోయావ్. కానీ ఆ విషయం కొట్టిన నీకు, తిన్న నాకు మాత్రమే తెలుసు. నీ మొగుడికి తెలియదు కదా!”

“అయితే?”

“ఇప్పుడు నీ మొబైల్‌కు పంపిన ఫోటోలను, వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తా. నీ మొగుడికి కూడా పంపుతా. నువ్వు నాతో తప్పు చేసావని నీ మొగుడిని నమ్మిస్తాను. నీ బ్రతుకును సర్వనాశనం చేస్తాను” చెప్పాడు వాడు.

“నీ లాంటి వాళ్ళు వెయ్యిమంది వచ్చి నా గురించి తప్పుగా చెప్పినా నా భర్త నన్ను రవ్వంతైనా అనుమానించడు. ఇంకెప్పుడూ నాకు ఫోన్ చెయ్యద్దు. చేసావంటే నీ మీద పోలీస్ కంప్లయింట్ ఇస్తాను, జాగ్రత్త.” ఫోన్ కట్ అయ్యింది.

వాడు పంపిన సంభాషణకు పూర్తి కొనసాగింపు వినిపించింది పల్లవి. ఆ సంభాషణ మొత్తం వినగానే నా మనసులో కమ్ముకొన్న కారుమబ్బులు తొలగిపోయాయి. కన్నీటి రూపంలో అవి వర్షించాయి. ఒక్కసారిగా నా మనసు నిర్మలంగా మారిపోయింది. ఎవడో అనామకుడు పంపిన మెసేజ్‌ను ఆధారంగా చేసుకొని నేను నా పల్లవిని అనుమానించినందుకు నాపై నాకే అసహ్యం వేసింది. మొత్తం సంభాషణను రికార్డ్ చేసి, పల్లవి నాకు వినిపించకుంటే నేను పల్లవిపై అనుమానాన్ని పెంచుకొని ఉండేవాడిని. తద్వారా మా ఇద్దరి జీవితాలు నాశనం అయ్యి ఉండేవి. కేవలం పది రోజుల్లోనే నాపై ఇంతగా నమ్మకాన్ని పెంచుకొన్న పల్లవి పై నాకు ప్రేమ, గౌరవం పెరిగింది. నేను తనను అమాంతం దగ్గరకు తీసుకొన్నా. మా మధ్య గాలికూడా చేరలేనంత దగ్గరకు.

“ఏమండీ! వాడిపై పోలీస్ కంప్లయింట్ ఇద్దాం!” నా కౌగిలిలో ఒదిగిపోతూ మళ్ళీ అడిగింది పల్లవి.

“నేను వాడిపై పొద్దున్నే కంప్లయింట్ ఇచ్చాను. పోలీసులు వాడ్ని అరెస్ట్ చేసారు.”

“అంటే! మీకు ఈ విషయాలు అన్నీ ముందే తెలుసా?” ఆశ్చర్యంగా అడిగింది.

“తెలుసు.”

“మీకెలా తెలుసు?” మళ్ళీ ప్రశ్నించింది.

మెత్తం చెబితే నేను తనపై అనుమాన పడ్డానని తనకు తెలుస్తుంది, నాపై తను పెంచుకొన్న ప్రేమ, గౌరవం, నమ్మకం సడలిపోతాయి. అందుకే తనకు సమాధానం చెప్పలేదు. తను నన్ను తిరిగి ప్రశ్నించే అవకాశం ఇవ్వకుండా తనను మరింత దగ్గరకు తీసుకొని నా పెదవులతో తన పెదవులను కప్పేసాను.