13. కర్చీఫ్

0
7

[box type=’note’ fontsize=’16’] 2018 దసరా కవితల పోటీలలో పాఠకుల ఓట్ల ఆధారంగా ఎంపికైన తృతీయ ఉత్తమ కవిత. [/box]

కనుల కొసల్లో కదలాడే
కన్నీటి చుక్కల్ని ఎదుటి వారికి
కనపడకుండా అది
ఎన్నెన్ని ప్రయత్నాలు చేసేది..

పొరపాటున కన్నీళ్ళొచ్చాయా
తడిసిన చెక్కిళ్ళను
అమ్మ చేతి స్పర్శంత
సుతారంగా తుడిచి
ఓదార్పు నిచ్చేది…

ఎర్రటి ఎండల్లో నీడైనపుడు
నాన్నని తలపించేది..
వానలో గొడుగైనపుడు
అమ్మ చీరకొంగును మరిపించేది..

ఒంటరినై నడుస్తున్నపుడు
నా కుడిచేతిని తాకుతూ
నువ్వొంటరివి కాదు
నీ సహ బాటసారినంటూ
తోడుగా నిలిచేది..

నాలో రహస్యంగా గూడుకట్టుకున్న
సంతోషాల్ని దుఃఖాల్ని పంచుకొనే
ఆత్మీయ నేస్తమయ్యేది..

మనసులోని భావాలను
అద్దంలా చూపే ముఖం
సంగతి నాకన్నా
నా కర్చీఫ్ కే బాగా
తెలుసుననిపిస్తుంది..

ఎప్పటికప్పుడు
జిడ్డులా మారిన ఆందోళనల్ని తుడుస్తూ
వచ్చీరాని నవ్వును అతికించేది…

ఒట్టి గుడ్డముక్క కాదది
నా దేహంలో భాగమై మసలుకొనేది..
అది లేని రోజు
చేయి విరిగిన భావన
క్షణక్షణం వెంటాడుతుంది!!!