13. స్థపతి

0
6

[box type=’note’ fontsize=’16’] 2018 దీపావళి కథల పోటీకి వచ్చిన కథ. [/box]

స్థపతి

రెండవ తరగతిలోకి ప్రవేశించాడు.

మహాచురుకుగా ఉంటాడు.

అతడు మాటల్లో మొనగాడు

పాటల్లో ఘంటసాలకు, బాలూకు జతగాడు.

ముద్దుముద్దుగ తెలుగు మాట్లాడతాడు.

మురిపాలన్నీ కలగలిపి మాట్లాడతాడు.

ఇంగ్లీషంటే అతనికిష్టం. తెలుగంటే మహా ప్రాణం.

అతని మెదడెప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది.

ఆ ఆలోచనల్లో అనేక జీవనసత్యాలు దాగి ఉంటాయి.

పెద్ద పెద్ద లెక్కలు సహితం అతని పాటలతో జతకడతాయి.

నోళ్ళల్లో వేళ్ళు వేసుకోవద్దంటాడు. నీళ్ళల్లో కాళ్ళు పెట్టవద్దంటాడు..

స్థపతి అక్కయ్య స్యందన. ఇద్దరి నడుమ పదిహేను సంవత్సరాల తేడావుంది.

స్యందనకు స్థపతి అంటే ప్రాణం. స్థపతి ఆలోచనలంటే మహాప్రాణం. స్యందన స్థపతిని తమ్మునిలాగా భావించదు. స్వంత కొడుకులాగానే భావిస్తుంది. ఆమె భర్తకు కూడ స్థపతి అంటే మహాయిష్టం.

“అమ్మా.. అమ్మా .. నాన్నొచ్చారు

అల్వా మిఠాయ్ కొని తెచ్చారు

తాతయ్ కేమో అల్వా పొట్లం

తమ్మునికేమో మిఠాయి పొట్లం

మరి నాకేమో ముద్దుల పొట్లం”

అని పాడే స్థపతి పాటంటే ఆ యింట్లో వారందరికి యిష్టం.

స్థపతి తలిదండ్రులు ఉమాభారతి, మహేశ్వరరావులు. స్యందన తర్వాత చాలా కాలానికి పుట్టిన స్థపతి అంటే వారికీ మహాయిష్టమనేకంటే ప్రాణం అంటే బాగుంటుంది.

స్థపతి మహాగొప్పవాడయితే తనివితీరా చూడాలని వారిద్దరూ నిరంతం కలలు కంటూ ఉంటారు. లక్షలకు వెనుకాడకుండ స్థపతిని పేరున్న ప్రభుత్వేతర పాఠశాలలో చేర్పించారు. ఆంగ్లభాషతో పాటు అమ్మభాషనుకూడ కమ్మగా నేర్పిస్తామని ప్రచారం చేసుకునే విద్యాసంస్థ అది.

స్థపతి ఉదయం లేవగానే, “అమ్మకు జేజే – నాన్నకు జేజే – కమ్మని భారత భూమికి జేజే- బుధులకు జేజే – విధులకు జేజే – చదువులు నేర్పే గురువుకు జేజే” అని బాలబంధు బి.వి. నరసింహారావుగారి పాట పాడతాడు.

ఆ పాటను స్థపతికి స్యందన నేర్పింది.

స్థపతి ఆ పాటను పాడేటప్పుడు, అతని తలిదండ్రుల ఆనందం చెప్పనలవికాదు. ఇలాగే ఇంగ్లీషులోకూడ పాడితే చూచి పరవశించిపోవాలని అతని తలిదండ్రులు అనుకుంటారు. ఇదే పాటను స్థపతి తన పాఠశాలలో కూడా పాడాడు. అయితే అక్కడ అతనికి తిట్లు ఎదురయ్యాయి.

“ఇలాంటి తెలుగు సాంగ్స్ పాడకు. నీకు పాడాలని ఉంటే, మదర్ జేజే ఫాదర్ జేజే- మదర్ కంట్రి జేజే అని నేను సాంగ్ నేర్పుతాను. అది పాడు” అని అతని ఇంగ్లీషు టీచర్ ఇంగ్లీషులో తిట్టింది. అప్పటినుండి స్థపతి బడిలో పాటలు పాడటం మానేసాడు.

బడిబడి మాబడి- మంచిది మాబడి – మమత సమతలు నేర్పే కోవెల అది – అమ్మ ఒడి మాబడి” అన్న పాట కూడ స్థపతికి వచ్చు. ఆ పాటకూడ స్థపతికి అతని అక్కయ్యే నేర్పింది. అయితే తన బడిని చూస్తే, అతనికి ఆ పాట పాడాలనిపించదు.

స్థపతి చదివే స్కూల్లో ప్లే వే మెథడ్ లోనే పాఠాలు బోధిస్తారు.

అయితే ఆ పాఠాలు స్థపతికి నచ్చడం లేదు.

ఎందుకంటే అక్కడ అక్కయ్య లేదంటాడు.

“అక్కయ్య స్కూలుకు రాకూడదురా” అంటుంది ఉమాభారతి.

అయితే అక్కడ అక్కయ్య పంచే అభిమానం, ప్రేమ లేదన్న స్థపతి మనసును అమె అర్థం చేసుకోలేదు.

మేం తెలుగు పిల్లలం – వెలుగు పిల్లలం – తెలివితేటలు కలిగి మెలుగు పిల్లలం” అని టీచర్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాడొకనాడు స్థపతి.

అందుకు ఆ టీచర్, “మీకు తెలివితేటలెన్నో ఉన్నాయి. కాదనను. అయితే ఇప్పుడు మీరు తెలుగు పిల్లలమనుకోరాదు. అలా అనుకుంటే ఇంగ్లీషురాదు” అని అంది.

“ఇంగ్లీషు కోసం తెలగమ్మను, తెలుగు నాన్నను, తెలుగు అక్కను మర్చిపోవాలా? తెలుగులో అమ్మ, నాన్నా, అక్క, తాత, మన దేశం, మన మమత, మన సమత, మన అలవాట్లు, మన పద్ధతులు, మన మంచి మాటలు, మనం చెయ్యాల్సిన మంచి పనులన్నీ ఉంటాయి. వాటన్నిటిని వదిలి ఇంగ్లీషును నేర్చుకుంటే, అక్కడ మమ్మీలు, డాడీలు, ఆంటీలు ఉంటారు. వారి పద్ధతులుంటాయి. ఎవరికివారే యమునాతీరే అన్నట్లు వారి అలవాట్లు ఉంటాయి. అది నేర్చుకుంటే అవే అలవాట్లు అలవాటవుతాయి. అప్పుడు పెద్దయ్యాక మమ్మీడాడీని వదిలెయ్యొచ్చు గదా?” అన్న స్థపతి బుల్లి బుఱ్ఱ నుంచి వచ్చిన మాటలను వినగానే టీచర్ బుఱ్ఱ గిర్రున తిరిగింది. ఆమెకు వాళ్ళ అమ్మనాన్న, నానమ్మ తాతయ్యలు గుర్తుకు వచ్చారు.

స్థపతి ఆలోచనలు బడిలోని వారందరిని ఆకర్షించాయి. అయితే,”బుజ్జీ నీ ఆలోచనలన్నిటిని ఇంగ్లీషులోకి మార్చుకుని ఇంగ్లీషులో చెప్పు” అని కొందరు టీచర్లు స్థపతిని ముద్దుచేసారు.

స్థపతి ఆలోచనా పథాన్ని బాగా అర్థం చేసుకున్న స్యందన బడి ఆలోచనలకు అనుకూలంగా తమ్ముని మార్చసాగింది. కన్నతల్లిని, కన్నభూమిని, తల్లి భాషను మరవకూడదంటూనే అవసరాన్నిబట్టి అన్ని భాషలు నేర్చుకోవాలని తమ్మునికి చెప్పింది.

అక్కయ్య చెప్పిన మాటలు స్థపతికి బాగా నచ్చాయి. అలాగే అక్కయ్య పాడి వినిపించిన, “బాసబాసబాసమ్మ- రకరకాలభాసల యాసమ్మ- గబగబ అంతా నేర్చుకుంటే- అందలాలన్నీ మనవేనమ్మ” పాటకూడ స్థపతికి నచ్చింది.

ఒకనాడు క్లాసురూంలో టీచర్, ‘దిసీజ్ మమ్మీ’ అంటూ మోకాళ్ళవరకు లంగా, నడుం క్రిందవరకు కోటు వేసుకున్న చిత్రాన్ని నల్లబల్ల మీద గీసింది. ఆ బొమ్మ స్థపతికి నచ్చలేదు. ఆ విషయం చెబుదామంటే టీచర్ తిడుతుందేమోనని భయం వేసింది.

స్థపతి యింటికి వచ్చి చీరకట్టుకున్న అమ్మ బొమ్మను వేసాడు. అలాగే చిన్నచిన్న యిళ్ళ బొమ్మలు వేసాడు. రంగురంగుల పూలబొమ్మలను వేసాడు. అన్ని బొమ్మలను తన అక్కయ్యకు చూపించాడు.

తమ్ముడేసిన బొమ్మలన్నిటిని చూచి, వాటిని స్యందన మెచ్చుకుంది. అక్కయ్య అలా మెచ్చుకునే సరికి స్థపతికి పట్టరాని ఆనందం కలిగింది. స్థపతి ఆనందంతో అక్క ముందు గిర్రునతిరిగాడు.

మూడు ఒకటి అక్కయ్య – చక్కని లెక్క అక్కయ్య – మూడుకు ముందు రెండంట – మూడును అంటి నాల్గంట- నాల్గురెండు నలభైరెండు” అంటూ ఆనందంతో పాడాడు.

తమ్ముని పాట విని స్యందన మరింత మురిసిపోయింది. ఇలా అన్నీ నేర్చుకోవచ్చు అని తమ్మునికి చెప్పింది.. అదే పాటని ‘త్రీ వన్ టీచర్’ అంటూ ఇంగ్లీషులోకి మార్చి తమ్మునికి నేర్పింది.

ఇంగ్లీషు సాంగ్‌ని బడిలో పాడమని తమ్మునికి చెప్పింది స్యందన. స్థపతి అక్కయ్య చెప్పిన పాటను బడిలో పాడటానికి ముందు భయపడ్డాడు. లెక్కల టీచర్ ప్రోత్సాహంతో పాడాడు.

లెక్కల టీచర్ స్థపతిని మెచ్చుకుంది. స్థపతి పొంగిపోయాడు. తనకు తన అక్క నేర్పిన పాటలన్నిటిని లెక్కల టీచర్ ముందు పాడి వినిపించాడు.

అక్కడి మాటలు ఇక్కడ – ఇక్కడ మాటలు అక్కడ చెప్పే మరో టీచర్ స్థపతి లెక్కల క్లాసులో తెలుగులో పాటలు పాడటం, తెలుగులో మాట్లాడం అంతా చాటుగా ఉండి వింది. అక్కడ జరిగిన దానికి మరో నాలుగు చాడీలను కలిపి యాజమాన్యానికి చెప్పింది.

యాజమాన్యం లెక్కల టీచర్‌ని పిలిచింది. క్లాసులో అనవసర ప్రసంగాలు చెయ్యవద్దని మందలించింది. స్థపతి తెలుగులో మాట్లాడి పాటలు పాడినందుకు వందరూపాయిలు అపరాధరుసుము కట్టాలని నిర్ణయించింది. అపరాధరుసుమును లెక్కల టీచరే కట్టేసింది.

మరునాడు లెక్కల టీచర్ దగ్గర మరో లెక్కల పాట పాడటానికి ప్రయత్నించాడు స్థపతి. అప్పుడు లెక్కల టీచర్ ఇలా పాటలు పాడుతూ కాలం గడిపితే సిలబస్ పూర్తవ్వదని, పాటలు పాడవద్దని స్థపతిని మృదువుగా మందలించింది.

ఈ విషయం స్యందనకు తెలిసింది. వెంటనే వెళ్ళి లెక్కల టీచర్‌ని కలిసి సారీ చెప్పి అయిదువందల నోటిచ్చింది. అందుకు లెక్కల టీచర్, “వద్దు మేడమ్; స్థపతి పాటలనుండి నేను చాలా నేర్చుకున్నాను. నిజం చెప్పాలంటే ఆ పాటలలో అమోఘమయిన గణితం ఉంది. అయితే ఆరోజు సంభాషణంతా తెలుగులోనే జరిగింది. స్కూలు నియమాల ప్రకారం అది తప్పు. సబ్జెక్టు ప్రకారం చెప్పాలంటే అమ్మ భాషలో వాడు చెప్పిన సబ్జెక్టు మేధావి అయిన ఇంటర్ స్టూడెంట్‌కి కూడా తెలిసుండదు.

“ఈ కాలంలో ఇంగ్లీషులో చక్కగా మాట్లాడితే చాలు. చదువు వచ్చేసినట్లే; సబ్జెక్టు సామర్థ్యంతో పని లేదు. ఉద్యోగాల్లో మాత్రం సబ్జెక్టు సామర్థ్యం తప్పని సరవుతుంది. చదువుకి ఉద్యోగానికి నడుమ ఈ గ్యాప్ ఉండటం వలనే నిరుద్యోగం ఇలా వర్ధిల్లుతుంది” అని అంది.

స్యందన లెక్కల టీచర్ మాటలను సమర్థిస్తూ, స్థపతి ఎక్కువగా యింగ్లీషులో మాట్లాడేటట్లు చూడమని రిక్వెస్టు చేసింది. టీచర్ చెల్లించిన అపరాధ రుసుమును మంచి మాటలతో ఆమెకు ముట్టచెప్పేసింది.

స్థపతి నెమ్మది నెమ్మదిగా ఇంగ్లీషు మాట్లాడసాగాడు.

అతని సంభాషణలో చక్కని ఇంగ్లీషు పదాలు దొర్లుతున్నాయి.

అయితే అదంతా పొడి సంభాషణ మాత్రమే; తన ఎదనుండి వచ్చే అందమయిన భావాలను, ఆలోచనాత్మక గణితాన్ని మాత్రం ఇంగ్లీషులో పెట్టలేకపోతున్నాడు.

తన భావాలకు, తన గణితానికి సరిపడ ఇంగ్లీషు పదజాలం అతనికి అందుబాటులోకి రావడం లేదు. ఎప్పుడన్న తన అక్కయ్య చెప్పిన ఇంగ్లీషు పదం వాడితే, అది టీచర్లకు అర్థం గాక అది తప్పంటున్నారు.

ఒకప్పుడు టాయిలెట్ – ఇప్పుడు రెస్ట్ రూం.

ఒకప్పుడు టీచర్ ఇప్పుడు ఫెసిలిటేటర్ అంతే, అంటూ అలాంటి పదాలనే టీచర్లు నేర్పుతున్నారు. ఒకనాడు ఒకబ్బాయి “రెస్ట్ రూం ఫెసిలిటేటర్” అన్నాడు.

నాలుగు నెలలు తిరిగేసరికల్లా స్థపతి చక్కగా ఇంగ్లీషులో మాట్లాడసాగాడు. అయితే అతని మాటల్లో భావం కంటే మాటలే ఎక్కువగా ఉన్నాయి.

సబ్జెక్టుకు సంబంధించిన విషయాలలో పుస్తకాలకే పరిమితమయ్యాడు. తెలుగులో ఆలోచించినంతగా ఇంగ్లీషులో ఆలోచించలేకపోతున్నాడు.

అది తెలిసిన యాజమాన్యం, “ఇంగ్లీషులో మాట్లాడుతున్నాడుగదా! నో ప్రాబ్లమ్” అని అంది.

ఒకనాడు వర్షం పడుతుంది.

స్థపతి క్లాసురూంలో ఉన్నాడు.

ఇంగ్లీషు టీచర్ స్థపతితో హోంవర్క్ చేయిస్తుంది.

స్థపతి ఇంగ్లీషు పదాలకు తెలుగులో అర్థాన్ని గ్రహిస్తూ, ఇంగ్లీషు పదాలను కూడబలుక్కుంటూ హోంవర్క్ చెయ్యసాగాడు.

తెలుగులో ఆలోచించవద్దని స్థపతికి ఇంగ్లీషు టీచర్ చెప్పింది.

స్థపతి పూర్తిగా ఇంగ్లీషులో ఆలోచించలేకపోయాడు. దానితో ఇంగ్లీషు టీచర్‌కి బాగా కోపం వచ్చింది. స్థపతి ఇంగ్లీషులోనే ఆలోచించడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు.

దానితో ఇంగ్లీషు టీచర్ కోపం తారస్థాయికెగసింది. ఇంగ్లీషు టీచర్ స్థపతిని చావచితకబాదింది. “నిన్ను చంపైనా సరే, నీకు ఇంగ్లీషు నేర్పుతా” అంది ఇంగ్లీషు టీచర్.

బాల మేధావి స్థపతికి అయిదవ తరగతిలోనే నూరేళ్ళు నిండాయి. ఆ బాల మేధావి పాడిన లెక్కల పాటల్లో మహోన్నత గణితం నిండుగా, మెండుగా ఉంది. ముఖ్యంగా

మూడు ఒకటి అక్కయ్య

చక్కని లెక్క అక్కయ్య

మూడుకు ముందు రెండంట

మూడును అంటి నాల్గంట

నాల్గు రెండు నలభైరెండు…

అన్న పాటలోని గణితం గురించి చెప్పాలంటే వెయ్యి పేజీల ఉద్గ్రంథమవుతుంది. అందులో ఉన్న ఒక లెక్క ఏమిటంటే…

మూడుకు ఒకటి కలిపితే నాలుగు అవుతుంది. అలాగే మూడులోనుండి ఒకటి తీసివేస్తే రెండు వస్తుంది. అదే నలభైరెండు. ఈ పాటలో మూడుకు ఒకటి కలపటం, మూడునుండి ఒకటి తీసివెయ్యడం అనే రెండు సమస్యలు, వాటికి సమాధానం ఒకేచోట ఉన్నాయి.

ఇక మూడు ముందు మూడు వెనుక అన్న మాటల్లో కూడ మరో గణిత సూత్రం ఉంది. మూడు ముందు రెండు, మూడు తర్వాత నాలుగు కలిపితే ఆరవుతుంది. దానిని రెండుతో భాగిస్తే మూడు వస్తుంది. అంటే రాశుల మొత్తాన్ని రాశుల సంఖ్యతో భాగిస్తే వరుస రాశులలోని మధ్య సంఖ్య వస్తుందన్న విషయం కూడ ఈ పాట తెలుపుతుంది.. ఇలాంటి లెక్కలు ఈ పాటలో మరికొన్ని ఉన్నాయి.

ఇలాంటి లెక్కలపాటలు స్థపతి అక్క దగ్గర నేర్చుకుని, కొంతమార్చి పాడినవి అనేకం ఉన్నాయి.

“ఇలాంటి స్థపతి మరో పది సంవత్సరాలు బ్రతికి ఉంటే లెక్కల ప్రపంచం లెక్కకందకుండా పోయేది.” అంటూ స్థపతి పాటల మీద పరిశోధనచేసిన ఒక గణిత మేధావి తన అభిప్రాయాన్ని తెలియచేసాడు.

లెక్కల టీచర్ స్థపతి పాటలన్నిటిని సేకరించింది. వాటన్నిటిని ఒక పుస్తకంగా తీసుకువచ్చింది. దాని మీదే మరో మేధావి పరిశోధన చేసాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here