14. కృష్ణమ్మ కంఠశోష

0
7

[box type=’note’ fontsize=’16’] సంచిక నిర్వహించిన 2018 దీపావళి కథల పోటీలో న్యాయనిర్ణేతలు/సంపాదకుల ఎంపికలో ప్రోత్సాహక బహుమతి పొందిన కథ. [/box]

[dropcap]ఎ[/dropcap]న్నో విలువలతో అందరి మన్ననలు అందుకుంటున్న ఆ కుటుంబంలో కృష్ణమ్మ నాలుగోది (నాలుగవది). కృష్ణమ్మ అంటే ఇష్టపడనివారు ఎవరూ ఉండరు. రూపురేఖలన్నీ ఎత్తుపల్లాలతో ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. వర్ణం కృష్ణ (నలుపు) వర్ణమే అయినా ఎంతో కళగా ఉంటుంది. ఇంట్లో చిన్నది కదా చిలిపిదేమో అనుకుంటూంటారు అందరూ. కాని అందరినీ అర్థం చేసుకుని, వారి అవసరాలు తీర్చడంలో కృష్ణమ్మ తరువాతే ఎవరైనా. ఎప్పుడూ చెంగుచెంగున ఆ ఊరికి ఈ ఊరికి, ఆ ఇంటికి ఈ ఇంటికి తిరుగుతూ ఉన్నా, దానిలోని ప్రశాంతత నేనెవ్వరి దగ్గర చూడలా. నాకు తెలిసినంతవరకూ కృష్ణమ్మకి సంతానం పెద్దదే, వారిలో కొందరు కాలం చేశారు. అయితేనేం, ఊర్లో అందరూ అమ్మ అమ్మ అంటూ పలకరించి దగ్గరికొస్తే చాలు! ఆప్యాయంగా అక్కున చేర్చుకుంటుంది. ఎంతోమంది మనసు బాగోపోతే కృష్ణమ్మ దగ్గర కూర్చొని కష్టాలు చెప్పుకునేవారు, కృష్ణమ్మ ఆ మాటలు విని ప్రశాంతంగా మాట్లాడి మన మనసుని మార్చేస్తుంది.

అలాంటి కృష్ణమ్మ కొద్దిరోజుల నుంచి మౌనమునిలా ఉంటుంది. ఎవరైనా వచ్చి పలకరించినా ముభావంగా సమాధానం చెప్తుంది తప్ప నవ్వడం లేదు. చిన్నపిల్లలు, కొంటెకుర్రాళ్ళు అప్పుడప్పుడు ఇంటి మీద చిన్న చిన్న రాళ్ళు విసిరేవారు. లేని కోపం నటిస్తూ, పరిగెత్తుకుంటూ వచ్చి “ఎవర్రా? ఎవర్రా అది?” అని అరిచేది. ఇంతకుముందే ఒక చిన్న కుర్రాడొచ్చి, చిన్న గులకరాయి ఆ యింటి మీదకి విసిరిగొట్టాడు. అయిపోయింది వీడి పని అనుకున్నా కాని ఒక మాటా మాట్లాడదాయె, కృష్ణమ్మేనా అసలు అనుకున్నా. పోయి దగ్గరికెళ్ళి చూద్దును కదా, మనసంతా కలవరంగా మారిపోయింది. ఇలా ఎప్పుడూ చూస్తా అనుకోలేదు. మనిషి శరీరంలో నీళ్ళన్నీ ఎండిపోతే ఎలా ఉంటారో అలా ఉంది ఎముకల గూడు. చర్మం అంతా పొడిపొడిగా శిశిరకాలం నాటి ఆకుని తలపిస్తున్నాయి. ముఖం కళావిహీనంగా ఉంది. నా తోటోళ్ళందరూ అక్కడే గుంపుగా చేరి ఆడుకుంటూ ఉంటే, మా వైపు ఎంతో ఇష్టంగా చూసేది. కుదిరితే మాతో కలసి రెండు గంతులేసేది. ఆ తర్వాత, పనులు చదువులతో కృష్ణమ్మ దగ్గరకెళ్ళడమే మానేశా. అటూ ఇటూ బండి మీద వెళ్ళేటప్పుడు ఆ దారిన వెళ్ళేటప్పుడు తల ఎత్తి, ఎత్తి చూసేదాన్ని, ఎప్పుడో ఒకసారి కనిపించేది, సరేలే ఈ ఎండలకు బయటికి రాలేక, లోపల లోపలే ఉంటుందేమో అనుకునేదాన్ని. అలాగే అనుకుంటూ ఉన్నా, పొద్దున ఆ సోడాకొట్టు మావయ్య వచ్చి కృష్ణమ్మ పరిస్థితి చెప్పేదాకా. ఇన్ని రోజులు కృష్ణమ్మ గురించి అసలు పట్టించుకోనందుకు, ఆమె పరిస్థితి గురించి ఆలోచించకుండా ఉన్నందు చాలా బాధేసింది. కృష్ణమ్మకు వయసు పెద్దదే, ఒకవేళ అమ్మ చనిపోద్దా? అమ్మో. ఆ ఊహే తట్టుకోలేకపోయా. ఆ ఆలోచన రాగానే అమ్మ దగ్గరకు వెళ్ళకుండా ఉండలేకపోయా.

‘అమ్మా!’ అని పిలిచా, వినిపించలేదనుకుంటా, ఏం బదులు చెప్పలేదు. ఆమె చీరంతా చిరిగిపోయిందనుకుంటా, పీలికలు పీలికలుగా ఆ ఎముకలపై పరచుకున్నాయి. ఆ చీరని చూసే ఎన్నో ఆలోచనలు గొలుసులా అల్లుకుపోతున్నాయి. తేరుకొని, ‘అమ్మోయి!’ అని పిలిచాను. ఈసారి నన్ను మెల్లగా చూసి మొహం తిప్పుకుంది. “ఏంటమ్మా కోపమా?” అని అడిగా.

“నేనసలు గుర్తున్నానట్రా, ఇప్పుడు మాత్రం ఎందుకొచ్చావు? పోయాకే రావల్సింది. పైగా కోపమా అంట. నాకేందుకే ఈ కోపాలు, ప్రేమలు” నీళ్ళు లేక గొంతు పొడిపొడిగా మాటలు కష్టంమీద వస్తున్నాయి. కానీ ఆ మాటల వెనుక ఉండే కష్టాల గురించి నేనెప్పుడూ ఆలోచించనందుకు సిగ్గేసింది.

ఈలోపు అమ్మే మళ్ళీ అనింది “ఎలాగో వచ్చావుగా, కాళ్ళు కడుక్కుని పక్కనొచ్చి కూర్చో”. తలూపి అమ్మ చెప్పినట్టే చేశాను. పక్కన కూర్చొని అమ్మను తాకాను. అమ్మ శరీరం చాలా చల్లగా ఉంది. నేను పట్టుకోగానే అమ్మ శరీరం కొద్దిగా చలించింది. కొద్దిసేపు చూశాను, అమ్మ ఏం మాట్లాడకపోయేసరికి మళ్ళీ నేనే మాట్లాడాలనుకున్నా.

“అమ్మా! ఎందుకింత వ్యథతో ఇలా ఉన్నావు? నువ్వు ఇలా ఉండడం నేను చూడలేను అమ్మా. మా అమ్మ తర్వాత నిన్నేగా అమ్మా అని పిలిచింది. ఏమ్మా ఎందుకింత మౌనం?”

అమ్మ ఏడ్వాలని ప్రయత్నించింది. కానీ కంటి నుంచి నీరేం రాలేదు. ఆ కళ్ళలో నీళ్ళు ఇంకిపోయాయని అప్పుడే గుర్తించాను. పొడిపొడిగా మాట్లాడడం ఆరంభించింది.

“ఏమోరా తల్లీ! నాకెంతోమంది పిల్లలని నీకు తెలుసు కదా, వాళ్ళు చనిపోయినప్పుడు కూడా నేనింత బాధపడలేదని తెలుసుకదా! నా వల్ల ఎంతోమంది మేలుపొందినవారు నేను తాకితే చాలు, ఉప్పొంగిపోయే గుండెలెన్నో. నీలా ఎంతోమంది పిలిచే పిలుపులోని నా అమ్మతనం వెదుక్కుంటూ ఉంటాను.”

ఇంతలో ఇంకో చిన్నకుర్రవాడు వచ్చి చిప్స్ ప్యాకెట్టు కవరు తెచ్చి అమ్మ ఒడిలో పడేటట్టు విసిరిపోయాడు.

అమ్మ చేతిలో ఆ ఖాళీ కవరు పట్టుకొని “ఇదేం పెద్ద బాధ కాదులే. కొన్నిసార్లు వీళ్ళు నా ఇంట్లో పడేసే చెత్తతోనే నాకు ఊపిరి సలపక ఆరోగ్యం పాడౌతుంది. కాని నాకు వీటి గురించి ఎప్పుడూ బాధ లేదు” అంది.

“ఏంటి? దీని గురించి కాదా నువ్వు బాధపడేది?” అని అడిగాను.

కాదన్నట్టు తల అడ్డంగా ఊపి, మళ్ళీ మాట్లాడటం ఆరంభించింది. మధ్యలోనే అడ్డు తగిలి “మరసలు నువ్వు బాధ పడేది దేని గురించి అమ్మా?” అని అడిగాను.

“మీ గురించేరా?” అని చెమర్చిన కళ్ళతో నా వంక చూసి తల దించేసుకుంది.

“చిన్నప్పుడు మీరొచ్చినట్టే మొన్నే నలుగురు కుర్రాళ్ళు వచ్చారు ఇక్కడ ఆడుకోవడానికి. ఉడుకు రక్తం కదా! ఒకటే ఇకఇకలు, పకపకలు. అసలు నా మాటే పట్టించుకోరాయే. “రేయ్ శశీ! ఇటు రారా, ఇటురా”, “రేయ్ శివా అటుపోదాం రారా, రేయ్ క్రాంతిగా దమ్ముంటే నన్నొచ్చి అంటుకో చూద్దాం” అంటూ అరుస్తూ, కేరింతలు కొడుతూనే ఉన్నారు చాలా సేపు.”

ఏం చెప్పాలనుకుంటే నాకర్థం కావట్లేదు. అయినా వింటూ ఉన్నా.

“అప్పటికీ చెబుతూనే వున్నా, నేను మునుపటిలా లేనురా, నా శరీరం ఇప్పుడంతా డొల్లయిపోయే. ఎక్కడ ముడుతలు పడ్డాయో, ఎన్ని గుంటలు పడ్డాయో నాకే తెలీదు.”

“గుంటలు పడడం ఏంటి అమ్మా?”

“ఏంటి అంటే ఏం చెప్పనమ్మా. నాకు ఉరుకుడెక్కువ, పరుగులెక్కువ అని నన్ను శత్రువును చూసినట్టు చూస్తున్నారు కానీ, నాలోని మట్టంతా ఎన్ని లారీలు, ట్రాక్టర్లు వచ్చి తోడుకుపోయాయో, నా శరీరం మాంసం, నీరుని మార్చి ఎంతమంది కులాసాగా ఉన్నారో నీకేం చెప్పేది? రాత్రి పూటైతే చాలు, చప్పుడు లేకుండా వచ్చి ఇసుక మొత్తం తీసుకెళ్ళిపోతారు. వద్దు, వద్దు నన్ను విడిచిపెట్టండి అని ఎన్నిసార్లు వాళ్ళ కాళ్ళు పట్టుకున్నానో. పెద్ద పెద్ద సూదులు, బల్లేలతో నన్ను పొడుస్తూ చిత్రవధ చేసి నన్నిలా అస్థిపంజరంలా మార్చేశారు. ఈ పలచటి నీటి చీరతో ఆ గుంతలని కప్పి ఒళ్ళు దాచుకుంటున్నా.”

అమ్మ కష్టం వింటున్న నాకు అప్రయత్నంగానే కళ్ళలో నీళ్ళు తిరిగాయి.

“నన్ను జీవనది, జీవనది అంటూనే నాలో జీవం లేకుండా చేశారు మీరు. నేనెక్కడ పుట్టానో నీకు తెలుసా? కుదిరితే మహాబలేశ్వరం వెళ్ళిరా! చుక్కా చుక్కా చేర్చి నీళ్ళని పొదివి పట్టుకొని ఎన్ని ఊర్లను దాటుకుంటూ ఇక్కడి దాకా వచ్చానో. ఏం నాకేం పనిలేకా…? మీ అందరి నోర్లూ పైర్లూ తడపాలనే కదా నా తాపత్రయం. నేనేం పాపం చేశానని ‘అమ్మా! అమ్మా!’ అంటూనే నన్ను అమ్మేస్తున్నారు? నా నుండి పుట్టిన పిల్లకాలువల పీకలు ఎక్కడికక్కడ కోసేశారు. నా కడుపు కోతను కష్టంగా భరించిన నేను, మొన్న క్రాంతి కేక విని తట్టుకోలేకపోయా. అది ఒక చావు కేక.

రేయ్ అబ్బాయి! చూడడానికి చదువుకున్నోళ్ళులాగా ఉన్నారు. మెల్లగా మెల్లగా, అటే ఉంది ఆడుకోండి అన్నాను. వాళ్ళు నా మాటలు వినడం పూర్తిగా మానేశారు. ఇంతలో ఒకడు ‘రేయ్! ఈత వచ్చా నీకు’ అని అడిగాడు. ఆ ఇంకో కుర్రాడు ‘ఎందుకు రాదు’ అని చిరునువ్వు నవ్వాడు. ఇంకొకడు ‘నేర్పించరా, నాకు రాదురా’ అన్నాడు. ఇంకెవడో ముద్దుగా అన్నాడు ‘అవునురా! ఈత నేర్చుకోవడానికి ఇదే కరెక్టు! సముద్రం అయితే అంతే సంగతులు’ అన్నాడు. నేనేం చెప్పను, ఇప్పుడు నాతో ఆటలు కూడా అంతే ప్రమాదకరం అని. ఒక మెల్లగా ఈదుకుంటూ అటూ ఇటూ తిరుగుతున్నాడు. మిగతా వాళ్ళు వాడిని అనుసరిస్తూ ఉన్నారు. నేను భయపడుతూ దేవుడ్ని వేడుకుంటుండగానే ఒకడి కాళ్ళు నా కడుపులో దిగిపోయాయి. వాడు భయంతో అరవడం ఆరంభించాడు. నన్ను విడిపించుకుపోడానికి నా కడుపులో కాలు పెట్టి తన్నడం ప్రారంభించాడు.

గర్భంలో ఉన్న శిశువుకి ప్రాణం పొయ్యి దేవుడా అని అరిచాను. దేవుడు వినిపించుకోలేదు, కానీ వాడి స్నేహితులు ఇటువైపు రావడం చూశాను. ‘రావద్దు! ఇటు రావద్దు, నా శరీరం మొత్తం గుంటలే’ అని అరుస్తున్నాను. ఏడు ఆపుకోలేకపోయాను. నేను చూస్తుండగానే మరో ముగ్గురు నాలో దిగబడిపోతున్నారు. చేపపిల్ల ఒడ్డున గింజుకున్నట్టు గింజుకున్నాను. ఏం చెయ్యను, ఎక్కిళ్ళు పెట్టి ఏడ్చాను.  ఒకడు నా ఒడిలో నిద్రపోతున్నాడు. లేపుదామని ఎంత ప్రయత్నించినా నా వల్ల కాలేదు. మిగతా ముగ్గురు కూడా మెల్లిగా నా ఒడిలో శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. కింద కిందకి చేరుకుంటున్నారు. నాలోని రక్తం మెల్లగా వాళ్ళు నింపుకుంటున్నారు. నాలోని మాంసం వాళ్ళ కళ్ళకి ఇసుకపొరలుగా కమ్మేసింది. కలలోనైనా హాని చెయ్యాలని ఎప్పుడూ అనుకోని నేను వాళ్ళ శరీరాలని నాలోనే దాచుకుని విలపిస్తూ ఉన్నా.

ఒకరి తర్వాత ఒకరు జనం నా ఇంటి ఆవరణలో గుమిగూడారు. అందరూ వాళ్ళ వాళ్ళ పిల్లలు క్షేమంగా బ్రతికి రావాలని అనుకుంటూ నన్ను ప్రార్థించారు. ఆ గొంతులు విన్న నేను వాళ్ళకేం చెప్పను? అప్పటికే వాళ్ళు మృత్యుదేవత ఒడిలోకి చేరిపోయారని? దినేష్ వాళ్ళ అమ్మ అనుకుంటా – ‘కృష్ణమ్మ! నిన్నే కదమ్మా నమ్ముకున్నాది, ఎందుకమ్మా నాకీ కడుపు కోత పెట్టావు?’ అని ఇసుకను తీసి మొహం మీద జల్లుకుంటుంది. ఇంకొక తండ్రి గుండె పట్టుకు నించున్నాడు. నేను ఇక్కడ వాళ్ళ నలుగురిని గుండెలకు హత్తుకుని ముద్దు పెట్టాను.

పిల్లలు, వాళ్ళూ వీళ్ళూ వేసిన చెత్త, వ్యర్థాల వల్ల అనుకుంటా… వెతకడం చాలాసేపు పడుతోంది. నేను వాళ్ళని అలాగే పొదివి పట్టుకుని కూర్చున్నా. చాలా సేపటి తర్వాత నా నుంచి ఒక్కొక్కరిగా లాగేసుకున్నారు. నా నుండి వాళ్ళను తీసుకునేటప్పుడు నాకేం బాధ కలగలేదు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు బ్రతికిలేరు. వాళ్ళు పోతూ – పోతూ నా జీవం కూడా తీసేసుకుని, నన్నిలా జీవచ్ఛవాన్ని చేశారు.”

అప్పటికే కృష్ణమ్మ తెప్పరిల్లుతున్నట్టు, మొహం అంతా వాడిపోయినట్టనిపించింది. కొద్దిగా నీళ్ళు తీసుకుని మొహం మీద చిలకరించా.

“అమ్మా బాధపడకు, నీ ధర్మం నువ్వు నిర్వర్తించాఉ. రోజూ మాకు నీళ్ళు ఇవ్వగలవు, అలాగే నీతో పెట్టుకుంటే మా ప్రాణాలు కూడా తియ్యగలవు. ఇదే నీ ధర్మం” అని చెప్పాను.

కానీ అమ్మ వినిపించుకునే పరిస్థితిలో లేదు.

“అమ్మా నువ్వు మాకెప్పటికీ అమ్మవే, నీ మీద ఎప్పుడూ, ఎవ్వరికీ కోపం రాదు” అని సర్దిచెప్పి అక్కడ్నించి బయలుదేరి నడుస్తూ అమ్మ గురించి ఆలోచిస్తూ ఉన్నాను.

ఆమె పరిస్థితీ, చిరిగిపోయిన చీర, లోపల దాచిన అస్థిపంజరం, గుంటలు పడ్డ మొహం పదే పదే గుర్తొస్తున్నాయి. కళ్ళలో నీళ్ళు అప్రయత్నంగానే తిరిగాయి.

“అమ్మా!” అనే పిలుపు విని, ఈ లోకంలోకి వచ్చాను. ఎదురుగా ఒకావిడ. చూడగానే ఆకట్టుకునే మొహంతో దగ్గరికి వచ్చి అడిగింది, “కృష్ణమ్మ ఇంటికి దారి ఇటే కదూ!” అని.

“అవునండీ! మరి మీరు?” అడిగాను.

“మా చెల్లెలికి బాగోలేదని, ముభావంగా ఉంటుందని కాసేపు మాట్లాడదామని వచ్చాను, అమ్మా! చాలా రోజుల నుంచి మా మధ్య మాటలు లేవు. ఈ మధ్య కలిసి ఆత్మీయంగా హత్తుకున్నాను. సరేలే అదంతా నీకెందుకులే. అమ్మా! నా పేరు గోదావరి అంటారురా. సరే మరి, నా చెల్లెలని చూడాలి. వెళ్తున్నా మరి…” చెప్తూ వెళ్ళిపోయింది.