18. పరువుకోసం..

0
5

[box type=’note’ fontsize=’16’] 2018 దీపావళి కథల పోటీకి వచ్చిన కథ. [/box]

[dropcap]జ[/dropcap]య హనుమాన జ్ఞానగుణసాగర, జయ కపీశ తిహులోక వుజాగర

రామదూత అతులిత బలధామా, అంజనిపుత్ర పవనసుత నామా

ఉదయం ఐదున్నర కావస్తోంది. ఎక్కడో దూరంగా మైక్‌సెట్టులో హనుమాన్ చాలీసా వినపడుతోంది. ఇంట్లో మరుగుదొడ్డి కట్టుకున్నప్పటికీ ప్రకృతిని ఆస్వాదిస్తూ బహిర్బూమికి వెళ్తేకానీ తనివితీరని వెంకటయ్య చేతిలో చెంబు, నోటిలో బ్రెష్, మరో చేతిలో మొబైల్ టార్చ్‌లో ఊరి బయటకు పరుగందుకున్నాడు. ఊరవతల ఉపయోగంలో లేని భూమిలో ఏపుగా పెరిగిన తుమ్మపొదల చాటుకు వెళ్లి కూర్చుని హమ్మయ్య అంటూ నిట్టూర్చాడు.

కూర్చున్నాడన్నట్టేకానీ ఏదో భరించలేని వాసన తన ముక్కుపుటలను తాకుతుంటే ముక్కు మూసుకున్నాడు. చలికాలం కావడంతో పక్కన వ్యక్తి ఉన్న కనిపించలేని కటిక చీకటి. తను కూర్చున్న చోటు నుండే చుట్టూ పరికించి చూశాడు. అనుమానస్పదంగా ఏం కనిపించలేదు.

ముక్కు మూసుకున్న చేతిని తీసి ఈసారి వాసనను పసిగట్టే ప్రయత్నం చేశాడు. కమరు వాసన. కోడిని కాలిస్తే వచ్చే వాసన. చేతిలో ఉన్న బ్రష్ నోట్లో పెట్టుకుని మొబైల్ టార్చ్ ఆన్ చేశాడు. చుట్టూ టార్చ్ వేస్తూ పరికించి చూడసాగాడు. ఎక్కడ ఏం కనిపించలేదు. నాలుగు అడుగులు ముందుకు నడిచాడు. వాసన మరింత ఎక్కువైంది. భుజం మీద ఉన్న టవల్ తీసి ముక్కుకు చుట్టుకుని మరో నాలుగు అడుగులు ముందుకు వేశాడు.

కొంతదూరంలో ఏదో కుప్పగా పోసినట్లు కనిపించింది. వెళ్లాలా? వద్దా? ఆలోచిస్తూనే మరోకొంత ముందుకు వెళ్లాడు. మనిషి పడుకునేంత పొడవులో నల్లగా కనిపించింది. ఇంకాస్తా ముందుకు వెళ్లి టార్చ్‌తో చూశాడు. అంతే వెంకటయ్య పై ప్రాణాలు పైనే పోయినంత పనైంది.

ఒక్కక్షణం పాటు కాళ్లు ఎటు కదలలేక నిశ్చేష్టుడై నిలుచున్నాడు. అంతా చలిలోనూ చమటతో తన ఒళ్లంతా తడుస్తున్నట్లు ఆయనకు స్పష్టంగా తెలుస్తుంది. తేరుకున్నవాడల్లా అమ్మో అంటూ అరుస్తూ పరుగందుకున్నాడు.

ఎలా వచ్చాడో తెలియదు. రావడం రావడమే ఇంటి గేటు తోసుకుంటూ వచ్చి ఇంటి ముందు ఉన్న కుర్చీలో కూలబడి రెండు చేతులతో కళ్లుమూసుకుని అలాగే వంగాడు.

అప్పటికే టైమ్ ఆరు దాటడంతో వెంకటయ్య భార్య భాగ్యలక్ష్మి లేచి వాకిలి ఊడుస్తున్నదల్లా కుర్చిలో ఏదో పడిన శబ్ధం రావడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి అటువైపు చూసింది.

వెంకటయ్య రెండు కాళ్లు కుర్చీ మీద పెట్టుకుని, కాళ్లమధ్య తల పెట్టుకుని రెండు కాళ్ల చుట్టూ చేతులు వేసుకుని ముడుసుకుని కూర్చున్నాడు.

చేతిలో ఊడుస్తున్న చీపురు అక్కడే పడేసి వెంకటయ్య దగ్గరకు వచ్చింది. ఒక క్షణం అలాగే నిలబడి తల మీదా చేయి వేసింది.

ఉలిక్కిపడిన వెంకటయ్య పెద్దగా అరుస్తూ కుర్చీలోనుండి ఎగిరినంత పనిచేశాడు. లక్ష్మిని చూస్తూనే వణికి పోతూ ఆమెను పట్టుకున్నాడు.

లక్ష్మి ఆశ్చర్యంతో “ఏమయిందయ్యా? అలా వణికిపోతున్నావు” అంటూ వీపులో నిమరసాగింది.

“అది.. అది.. అక్కడ.. ఊరవతల..” అంటూ భయంతో వణుకుతున్నాడు.

“ఆఁ.. ఊరవతల..ఏమైంది? మళ్లీ చీకట్లో పామునో, పిల్లినో చూసి జడుచుకున్నావా? ఇంట్లో పాయకానా పెట్టుకుని చెట్లల్లకు వెళ్లకయ్యా అంటే వినవు. వారానికోసారి ఇలా జడుచుకుని జరం తెచ్చుకుని మమ్మల్ని పరేషాన్ చేస్తవు? ఉండు ఇప్పుడే నిమ్మకాయ తిప్పేస్తా” అని వెంకటయ్య విడిపించుకునే ప్రయత్నం చేసింది.

“నీ అవ్వ అదికాదే, పిల్లి, పాము కాదు.. నేను చూసింది.. అది.. అది… మనిషే…”

“మనిషా? నీ లాంటోడు ఎవడో చెట్లచాటుకు వచ్చింటడు. దానికి కూడా భయపడాలా?” అసహనంగా అంది.

“ఒసేయ్ భాగ్యా మనిషంటే మనిషి కాదే. చచ్చిన మనిషి, సగం కాలిన పీనుగ, ఆడపీనుగ….” ఒకేసారి మొత్తం చెప్పేశాడు.

“ఏంటీ పీనుగా? ఆడపీనుగా? ఎక్కడ చూసినవ్? ఏందయ్యా నువ్వంటుంది?” ఆయన పక్కనే కింద కూర్చుంటూ ఆశ్చర్యం నిండిన ఆందోళనతో అడిగింది.

“అవునే సగం కాలిన పీనుగ” అని తను ఎక్కడికి వెళ్లింది. వాసన ఎలా వచ్చింది. అక్కడ చూసింది. అన్ని కూడా సీనిమా ఫ్లాష్‌బాక్‌లా చెప్పేశాడు.

‘ఊళ్లో ఎవరూ చచ్చినా ఊరి పొలిమేరలో ఉన్న కంచెలోనే కాలుస్తరు. ఆ తుమ్మపొదల్లో ఎందుకు కాలుస్తరు. అయినా నిన్న ఊరిలో ఎవరూ చనిపోలేదు. అందులోనూ ఆడమనిషి చనిపోయినట్లు ఎవ్వరూ అనంగా వినలేదు. ఎవరై ఉంటారబ్బా?’ భాగ్య ఆలోచించసాగింది.

వెంకటయ్య ఆమెనే చూస్తూ “ఏమైందే ఏం చెప్పవు?” అన్నాడు

“నిన్న మన ఊళ్లో ఎవరు చావలేదు. అయినా అక్కడ ఎవరు కాలుస్తరు? సరే నువ్వెల్లి నోరు కడుక్కొని రాపో. సర్పంచ్ రామన్న దగ్గరికెళ్లి జరిగిన విషయం చెబ్దాం” అంది.

వెంకటయ్య భయంగా లేస్తూ లోపలికి వెళ్లాడు.

అప్పటికి ఏడు కావస్తోంది. చీకటి తెరలు ఒక్కటొక్కటిగా విచ్చుకుని వెలుతురు రేఖలు ప్రసరిస్తున్నాయి.

మరో పదినిమిషాల్లో సర్పంచ్ రామరావు ఇంటి ముందున్నారు వెంకటయ్య, భాగ్యమ్మలు.

లుంగి కట్టుకుని నోట్లో బ్రష్ వేసుకుని ఇంటిముందున్న ఖాళీ స్థలంలో వాకింగ్ చేస్తున్నవాడల్లా వీరి రాకను చూసి ఆగి ఆశ్చర్యంగా చూశాడు. ఇద్దరూ పొద్దున్నే వచ్చారంటే ఏదో గొడవ పెట్టుకుని ఉంటారు. వెంకటయ్య రాత్రి మందు తాగి ఏదో గొడవ చేసి ఉంటాడు అనుకుంటూ..

“రా వెంకటయ్య బావ, రా పొద్దుగాల్నే మా ఇంటికి దారిపడింది. మళ్లేమన్న గొడవ చేసిండారా?” అంటూ ప్రశ్నించాడు రామరావు.

“అయ్యో బావా, గొడవ లేదు పాడు లేదు. నీకో విషయం చెప్తామని వచ్చాం” అన్నాడు వెంకటయ్య.

“అవునా? సరే సరే రార్రి…” అంటూ ఇంటిముందున్న చెట్టుకింద వేసిన కుర్చీల వైపు నడిచి కూర్చున్నాడు. ఆయన వెనకే వెంకటయ్య కూడ నడిచి ఎదురుగా కూర్చున్నాడు. భాగ్య పక్కన నిలబడింది.

“అయ్యే నువ్వు కూర్చోమ్మా?” అన్నాడు రామరావు.

“పర్వలేదన్నా. నేను నిల్చుంటా” అంది.

“నువ్వు నిలుచుంటే నేను కూడా నిలుచుంట” అని రామరావు లేవబోయాడు.

“అయ్యో అన్న. కూకొర్రి.. సరే కూకుంటా” అని వెంకటయ్య పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుంది.

రామరావు వయస్సు సుమారు నలభై లోపు ఉంటుంది. ఉన్నత చదువులు చదివినవాడు. ఊరిలో భూమితో పాటు గతంలో హైదరాబాద్‌లో ఉద్యోగం చేసి సంపాదించుకున్న ఆస్తి కూడా ఉంది. రామరావు తండ్రి రాఘవరావు ఆ ఊరికి నలభై ఏండ్లు సర్పంచ్‌గా చేసి రెండేళ్ల క్రితం చనిపోయాడు. దీంతో కన్నతల్లిని, ఉన్న ఊరును చూసుకోవాలనే ఉద్దేశంతో ఉద్యోగం వదిలేసి వచ్చి ఇక్కడే స్ధిరపడ్డాడు. సర్పంచ్‌గా ఎన్నికయ్యాడు.

“ఇగ జెప్పు వెంకటయ్య బావా?” అంటూ వెంకటయ్య వైపు తిరిగాడు.

ఎక్కడ నుండి మొదలు పెట్టాలా? అన్నట్లు కళ్లు మూసుకుని ఉదయం తను చెంబు పట్టుకుని ఊరి బయటకు పోయినప్పటి నుంచి ఇక్కడికి వచ్చేవరకు జరిగిన విషయాలన్నీ పూసగుచ్చినట్లు చెప్పాడు.

ఆయన చెప్తున్నంతసేపు రామరావు మనసు పరిపరివిధాల ఆలోచిస్తుంది. చనిపోయింది ఎవరూ? మన ఊరేనా? లేక వేరే ఊరా? వేరే ఊరయితే ఇక్కడ ఎందుకు కాలుస్తారు? అయినా మాములుగా చనిపోతే వారి ఊరిలోనే కాల్చాలి కానీ ఇక్కడికి ఎందుకు తెచ్చి కాల్చినట్లు? ఇలా ఆలోచిస్తూనే “సరే ఇప్పుడే పోదాం?” అని ‘చిన్నూ’ అని కేకేశాడు.

“ఏంటీ డాడీ” అంటూ రామరావు కూతురు స్వతంత్ర లోపలి నుండే ప్రశ్నించింది.

“టేబుల్ మీదా నా మొబైల్ ఉంటుంది, కాస్తా తీసుకు రామ్మా” అన్నాడు.

రామరావు కూతురు స్వతంత్ర ఇంటర్మీడియట్ చదువుతుంది. తన అన్నయ్య బిటెక్ చేస్తున్నాడు. ఇద్దరూ హైదరాబాద్ ఎస్.ఆర్.నగర్‌లో రూము అద్దెకు తీసుకుని చదువుకుంటున్నారు. క్రిస్మస్ సెలవులు కావడంతో ఊరికి వచ్చారు. ఈ లోపు ఆమె మొబైల్ తీసుకుని వచ్చి రామరావుకు ఇచ్చింది.

“థాంక్స్ నాన్నా” అన్నాడాయన.

“ఇట్స్ ఓకే డాడ్” అని నవ్వుతూ లోపలకి వెళ్లింది ఆ అమ్మాయి.

మొబైల్ తీసుకున్న రామరావు మొదట నవాబ్‌పేట పోలీస్‌స్టేషన్ ఎస్.ఐకి పోన్ చేసి జరిగిన విషయమంతా చెప్పాడు. ఆ తరువాత ఊరిలో ఉండే యూత్ సభ్యులకు, గ్రామ పెద్దలకు, ముఖ్యమైన వ్యక్తులకు అందరికీ పోన్ చేశాడు. ఈ లోపు రామరావు భార్య సుమ వాటర్ వాటిల్, మూడు కప్పుల్లో టీ తీసుకొచ్చి ఇచ్చింది.

ముగ్గురు టీలు తీసుకుని తాగారు. నైట్ ఫ్యాంట్ బనీను మీదున్న రామరావు “సుమా టీ షర్టు తీసుకుని రా” అన్నాడు.

“ఇంత మార్నింగ్ ఎటెళ్తున్నారు?” అని ప్రశ్నించిందామె. రామరావు జరిగిన విషయాన్ని మూడు ముక్కల్లో చెప్పాడు.

“అయ్యో అవునా? సరే సరే” అంటూ లోనికి వెళ్లి టీ షర్టుతో పాటు బైక్ కీ తీసుకువచ్చి ఇచ్చింది.

“అయ్యా రామన్నతో నువ్వెళ్లు. నేను ఇంటికి పోయి వంట చేసి పిల్లల్ని బడికి పంపాలే” అంది భాగ్య.

“సరే సరే నువెళ్లు” అన్నాడు వెంకటయ్య.

రామరావు అప్పటికే పలువురికి పోన్ చేసి ఉండడం వల్ల ఇరవై నుండి ముప్పై మంది ఊరి యువకులు, పెద్దలు రామరావు ఇంటికి వచ్చారు. వారిలో చాలామందికి బైక్లు ఉండడంతో లేనివారు అడ్జస్ట్ చేసుకుని బైక్లు ఎక్కారు. బైక్ లన్నీ ఊరి పొలిమేరవైపు కదిలాయి.

మరో ఐదు నిమిషాల్లో సంఘటన జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. అప్పటికే ఆ ప్రాంతమంతా కమరు వాసన వస్తుండంతో అందరూ ముక్కులు మూసుకుని సంఘటన జరిగిన ప్రదేశానికి వెళ్లారు.

అక్కడ కనిపిస్తున్న దృశ్యం చూసి అందరూ అవాక్కయ్యారు. కాలి కాలని శవం, ముఖం కాలినప్పటికీ కాళ్లు చేతులు, శరీరం పూర్తిగా కాలలేదు. సగం కాలిన ఆకుపచ్చరంగు సుడీదారు, గులాభీ రంగు సున్నీ. దాన్ని బట్టి చనిపోయింది ఒక యువతి అని నిర్ధారణకు వచ్చారు. ఆ అమ్మాయి వయస్సు 20-25 మధ్య ఉంటుందేమో. ఒంటిమీద కాలిన డ్రెస్ తప్ప మరే ఆధారం దొరకలేదు.

అప్పటికే విషయం ఊరంతా తెలియడంతో ఆ ఊరితోపాటు చుట్టు పక్కల ఊరి వాళ్లు కూడా తండోపతండాలుగా వస్తున్నారు. ఈలోపు నవాబ్‌పేట ఎస్.ఐ రమేష్ తన బృందంతో జీపులో వచ్చాడు. సంఘటన స్థలాన్ని పూర్తిగా పరిశీలించి తను రాసుకునేది రాసుకున్నాడు. మధ్యలోనే ప్రభుత్వ డాక్టర్‌కు పోన్ చేయడం మూలంగా అతను వచ్చి పంచనామా చేశాడు. అమ్మాయి చనిపోయిన తర్వాత ఇక్కడికి తీసుకువచ్చి పెట్రోల్ పోసి తగలబెట్టారని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు పోలీసులు.

వెంకటయ్య, సర్పంచ్ రామరావు నుంచి కొన్ని వివరాలు సేకరించి పోటోగ్రాఫర్‌తో సంఘటనకు సంబంధించిన పోటోలు తీయించారు. స్థానిక ప్రెస్ వాళ్లు, టీవీ ఛానల్స్ తాము చేయాల్సిన హడావిడి చేశాయి.

“చంపేశారట అని ఒకరు, రేప్ చేసి చంపారట” అని మరోకరు. ‘ఈ ఊరివాళ్లే చేసి ఉంటార’ని ఇంకొందరు ఎవరికి తోసింది వారు మాట్లాడుకుంటున్నారు. మిగిలిన శరీరభాగాల్ని ఒక క్లాత్‌లో చుట్టి వాటిని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.

సంఘటన జరిగి పది రోజులైంది. పదవరోజు ఉదయం పదిన్నర కావస్తోంది. నవాబ్‌పేట పోలీస్స్టేషన్లో ఎస్.ఐ రమేష్ తల పట్టుకుని కూర్చున్నాడు. ఎంత ప్రయత్నించిన సగం కాలిన శవం కేసు ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదు. నెలరోజుల నుంచి చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లలోనూ యువతులెవ్వరూ మిస్ అయినట్లు కేసులు నమోదు కాలేదు. అలాంటప్పుడు చనిపోయింది ఎవరనే విషయం జవాబు లేని ప్రశ్నగా మిగిలింది.

అప్పుడే ఇద్దరూ నడి వయస్సు దంపతులు స్టేషన్లోకి అడుగుపెట్టారు. వారిని చూస్తే స్థానికులు కాదనే విషయం అర్థమవుతుంది. వారిని చూస్తూనే రమేష్ సైగచేసి తన ముందున్న కుర్చీల్లో కూర్చోమని చెప్పాడు.

వారి కళ్లల్లో కన్నీళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

“సార్ నా పేరు కుమారస్వామి. ఈమె నా భార్య రాజమణి. మా అబ్బాయి అర్జున్. వాడు గడచిన ఇరవై రోజులుగా కనిపించడం లేదు” సూటిగా విషయం చెప్పాడు.

కనిపించడం లేదు అనగానే రమేష్ ఆశ్చర్యంగా చూశాడు. తను చనిపోయిన అమ్మాయి ఎవరనే విషయం వెతుకుతుంటే మరో మిస్సింగా? అని ఆశ్చర్యపోయి

“ఇంతకీ మీరు ఎక్కడుంటారు?” అన్నాడు

“ముంబై సార్”

ఈసారి మరింత ఆశ్చర్యంగా “ముంబాయా? అయితే ఇక్కడెందుకు కేసు పెడుతున్నారు.”

“వాడు ఇక్కడికి వచ్చే మిస్ అయ్యాడు సార్.”

“ఇక్కడికి వచ్చా.. ఇక్కడికెందుకు వచ్చాడు. కాస్తా వివరంగా చెప్పండి” అదుర్దాగా అడిగాడు రమేష్.

“మా అబ్బాయి అర్జున్. వికారబాద్ డిగ్రీ కాలేజీలో చదువుకున్నాడు. పక్కనే ఉన్న దాచారంలో మా అమ్మ నాన్న ఉంటారు. వారి దగ్డరే ఉండి డిగ్రీ పూర్తి చేశాడు. చదువుకునే టైంలోనే గుడిపల్లె ఊరుకు చెందిన రాజకీయ నాయకుడు చందన్రావు కూతురు అనితను ప్రేమించాడు. రెండెండ్ల క్రితం డిగ్రీ అయిపోగానే ముంబై వచ్చాడు. అక్కడే ప్రైవేటు జాబ్ చేస్తున్నడు. నెల రోజుల క్రితం అనితను పెళ్లి చేసుకుని ముంబైకి తీసుకువచ్చాడు. మేము ఇద్దరికీ సర్దిచెప్పి వారి నాన్నగారితో మాట్లాడుతానని చెప్పి అమ్మాయిని వారింటి దగ్గర వదిలి రమ్మని పంపాను. వాడు అలాగే చేసి వచ్చాడు. ఇరవై రోజుల క్రితం చందన్రావు ఫోన్ చేసి మాట్లాడుకుందాం రమ్మని మా వాడిని పిలిస్తే వచ్చాడు. మేం వస్తాం అని చెప్పిన వినలేదు. వచ్చిన వాడు తిరిగి ముంబై రాలేదు. ఆ రోజు నుంచి వాడి సెల్ స్విచ్ఛాఫ్ వస్తుంది. మేము నిన్న చందన్రావు ఇంటికి వెళ్లి అడిగాము. నేను పోన్ చేసింది నిజమే కానీ తను వస్తా అని ఇంతవరకు రాలేదు అని సమాధానం ఇచ్చాడు. అనుమానంతో ఎంత అడిగినా మెడలు పట్టి బయటకు గెంటేశాడు” అని జరిగిన విషయం చెప్పాడు కుమారస్వామి.

చందన్రావు జిల్లాలో పేరుమోసిన రాజకీయ నాయకుడు. ఆస్తులు, అంతస్తులతో పాటు అగ్రకులానికి చెందినవాడు. మంత్రులు, ఎమ్మెల్యేలతో పరిచయాలు ఉన్నవాడు. ముఖ్యంగా జిల్లాలో పరువు ప్రతిష్ఠలు ఉన్నవాడు. వచ్చే ఎన్నికల్లో వికారాబాద్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడన్న ప్రచారం ఉంది. రమేష్ ఒక్కసారి కళ్లు మూసుకుని అంత ఆలోచించాడు. కేసు కొలిక్కివచ్చినట్లేనని స్పష్టమైంది. వెంటనే కళ్లు తెరిచి “మీరు జరిగిన విషయమంతా మా క్లర్క్‌కు చెప్పండి” అని లేచి “ఏ వన్నాట్ ఫోర్” అని కేకేసాడు.

కానిస్టేబుల్ పరుగున వచ్చి సెల్యూట్ చేసి ‘ఎస్సార్’ అన్నాడు.

“జీపు తీయండి. మిగిలిన వారిని పిలవండి” అన్నాడు

మరొ నలుగురు కానిస్టేబుల్స్ వచ్చారు. అందరూ కలసి జీపు తీసుకుని గుడిపల్లెకు భయలుదేరారు. నేరుగా చందన్రావు ఇంటిముందే జీపు ఆపారు.

ఎస్.ఐ రమేష్ చందన్రావు ఇంటి గేటు తీసుకుని ఇంట్లోకి ప్రవేశించాడు. ఎదురుగా బాల్కనీలో చందన్రావుతో పాటు మరో పదిమంది కూర్చుని ఏదో మాట్లాడుకుంటున్నారు.

పోలీసులను చూడగానే అక్కడ ఉన్నవారంత ఆశ్చర్యంగా లేచి నిలబడ్డారు. రమేష్ డైరెక్ట్‌గా వెళ్లి చందన్రావు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు.

“ఏంటి ఎస్ఐ గారు ఇలా పిలవకుండానే వచ్చారు. ఏమైనా పనా?” అని చందన్రావు అడిగాడు. అలా అడుగుతున్న సమయంలో ఆయన మాట తడబడినట్లు రమేష్ గుర్తించాడు.

రమేష్ ఒక్కసారి చందన్రావు చుట్టూ ఉన్న వారిని చూశాడు. అంతే వారంతా అర్థమైన వారిలా భయటకు వెళ్లిపోయారు. కానిస్టేబుల్స్ అందరినీ భయటకు పంపి గేటు పెట్టి వచ్చారు.

“చందన్రావు గారు ఒకసారి మీ అమ్మాయి అనితను పిలుస్తారా?” సూటిగా అడిగాడు.

“మా అమ్మాయా, ఎందుకు? తను ఇంట్లో లేదు. ఎవరో ఫ్రెండ్ వాళ్లింటికి వెళ్లింది. అయినా ఆమెతో పనేంటి?” తడబడుతూ అడిగాడు.

“ఒకసారి పోన్ చేసి పిలిపించండి. మాట్లాడాలి” మళ్లీ అడిగాడు రమేష్.

“ఆమెకు పోన్ లేదు. అయినా ఎందుకు? వస్తుంది కదా? వచ్చాక మాట్లాడిస్తా. అయిన ఆమెతో ఏం మాట్లడుతారు” మళ్లీ అదే కంగారు.

“సరే అర్జున్ తెలుసా?” మళ్లీ అడిగాడు రమేష్.

“అర్జునా? వాడెవడు. నాకు ఎవరూ తెలియదు” అన్నాడు.

“తెలియకుండానే ఆయనకు కాల్ చేసి రమ్మన్నారా?” అంటూ తన చేతిలో ఉన్న చందన్రావు మొబైల్లో అర్జున్ నెంబర్‌కు నాలుగు సార్లు కాల్ చేసినట్లు ఉన్న కాల్ డేటాను చూపించాడు.

అప్పటి వరకు తన మొబైల్ తన చేతిలోనే ఉందనుకున్న చందన్రావు ఎస్ఐ చేతిలో చూడగానే వణికిపోతూ నోరు తెరిచాడు.

“సరే ఎస్ఐ గారు విషయం చెప్తా. మా అమ్మాయి వాడిని ప్రేమించి పెళ్లిచేసుకుంది. నాకు ఇష్టం లేకపోయిన వారి ప్రేమను అంగీకరించి మళ్లీ పెళ్లి చేస్తా రమ్మని కాల్ చేసి రమ్మన్నాను. వాడు వచ్చి నా బిడ్డను ఇంటిముందు వదిలేసి వెళ్లిపోయాడు. సరేనని మళ్లీ పది రోజులకు కాల్చేసి రమ్మన్నా. ఇంతవరకు రాలేదు” అన్నాడు.

“సరే మీ అమ్మాయిని పిలిపిస్తే ఏదైనా విషయం తెలుస్తుంది కదా? ఏ ఫ్రెండ్ వాళ్లింటికి వెళ్లిందో చెప్పండి మా వాళ్లు తీసుకొస్తారు” అన్నాడు.

ఏం చెప్పాలో అర్థం కానీ చందన్రావు – “అయ్యా ఎస్ఐ గారు అసలేం జరిగిందంటే వాడికి పోన్ చేసి రమ్మన్న రోజు నుండి మా అమ్మాయి కూడా కనపడడం లేదు. వాడే వచ్చి తీసుకెళ్లి ఉంటాడని, భయటకు తెలిస్తే పరువు పోతుందని నేనే ఎవరికీ చెప్పుకోలేదు” అంటూ ఏడుస్తున్న వాడిలా నటించడం మొదలు పెట్టాడు.

ఈ లోపు ఇద్దరు కానిస్టేబుల్స్ చందన్రావు ఇంటిలోపల ఉన్న సీసీటీవీ పుటేజీ తీసుకువచ్చి జీపులో ఉన్న లాప్‌టాప్‌లో వేసి రమేష్ ముందుంచారు. అందులో ఇంట్లోకి వచ్చిన అర్జున్‌ను చందన్రావు, మరో ముగ్గురు విచక్షణారహితంగా కొడుతున్న సంఘటన రికార్డయింది. దాన్ని చందన్రావు వైపు తిప్పాడు.

ఆ దృశ్యం చూడగానే చందన్రావుకు చెమటలు పట్టాయి. తన రక్షణ కోసం తను ఏర్పాటు చేసుకున్న కెమెరాలే తనకు తొలిసారి శత్రవులుగా కనిపించాయి. వారి దాడిలో అర్జున్ చనిపోవడం, ఆ శవాన్ని కారు డిక్కీలో వేసుకుని భయటకు వెళ్లడం సీసీటీవీలో స్పష్టంగా రికార్డయ్యాయి. చందన్రావు లేచి పరుగెత్తే ప్రయత్నం చేశాడు. కానిస్టేబుల్స్ అన్ని వైపులా రౌండింగ్ చేసి పట్టుకున్నారు.

ఇక తప్పదన్నట్లు జరిగిన విషయమంతా చెప్పాడు. అర్జున్‌ని చంపేసి ఊరి బయట పాతిపెట్టానని, తరువాత పది రోజులకు ఈ విషయమంతా తెలిసి అనిత ఎదురు తిరగడంతో ఆమెను కూడా చంపి నవాబ్‌పేట శివారులో పెట్రోల్ పోసి తగలబెట్టానని ఒప్పుకున్నాడు. రమేష్ మృతదేహన్ని వెలికితీసి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. మార్చూరిలో ఉన్న అనిత మృతదేహాన్ని వారి బంధువులకు అప్పగించారు.

“రాజకీయంగా, ఆర్థికంగా, కులపరంగా అగ్రగామిగా ఉన్న నేను నా కూతురు ఒక దళితున్ని పెళ్లి చేసుకోవడం జీర్ణించుకోలేకపోయాను. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్న నాకు ఇది పెద్ద అడ్డంకిగా మారింది. నియోజకవర్గంలో 50 శాతం ఓట్లున్న నా సామాజిక వర్గం నన్ను కులం నుండి వెలేస్తే నేను గెలవడం కష్టం. అందుకే నా పరువు కోసం వారి అడ్డుతొలగించుకున్నాను” అని చందన్రావు కోర్టులో వాంగ్మూలం ఇచ్చాడు. ఆయన్ని అరెస్ట్ చేసి చర్లపల్లి జైలుకు తరలించారు.

పరువు కోసం కన్నకూతుర్నే చంపుకుని రాజకీయ నాయకునిగా ఎదగాలనుకున్న చందన్రావు జైలు ఊసలు లెక్కబెడుతున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకుని ఆనందంగా జీవించాలనుకున్న ప్రేమికులు వారి కోరిక తీరకుండానే మృత్యుఒడికి చేరారు. అటు ఒక్కగానొక్క కొడుకు పోయి కుమారస్వామి దంపతులు, కన్న కూతుర్ని కోల్పోయి అనిత తల్లి గుక్కపట్టి ఏడుస్తున్నారు.