1961 – సాహిత్య సింహావలోకనము

1
8

[box type=’note’ fontsize=’16’] 1961 సంవత్సరంలో వెలువడిన నవలలు, కథలు, కావ్యములు, వ్యాసాలు… తదితర సాహిత్యాన్ని సింహావలోకనం చేస్తూ శ్రీ శ్రీ వాత్సవ గారు రచించిన వ్యాసాన్ని సంచిక పాఠకులకు అందిస్తున్నాము. మూల రచన ‘భారతి‘ మాసపత్రిక 1962 జనవరి సంచికలో ప్రచురితం. [/box]

[dropcap]1962[/dropcap] జనవరిలో 39వ జన్మదినోత్సవం చేసుకొంటున్న తెలుగు సాహిత్య మాసపత్రిక భారతి చరిత్రయే ఆధునిక తెనుగు సాహిత్య చరిత్ర. ఈ సంవత్సరము ప్రకటించిన రచనల అకారాది విషయ సూచిక పరిశీలిస్తే, అందు వెలువడిన పద్యములు, ప్రకీర్ణకములు, నవలలు, నాటకములు, కథలు, కావ్యములు, విమర్శలు, వివాదములు, సమీక్షలు, చర్చలూ, వర్తమానంధ్ర సాహిత్యముపైన వెలుగులై ప్రసరించగలవు. ప్రత్యక్షముగా ‘భారతి’ ప్రకటించినవే కాక, పరోక్షముగా పరిశీలించిన రచనలు, సోదర పత్రికలతో పాటు, సుపరిచితము చేసిన కృతులు ఈ సింహావలోకనములోనికి తేవచ్చును. వీనిని నిష్పక్షపాత దృష్టితో సమీక్ష చేసినచో ఈనాటి సాహిత్య ధోరణి గ్రహించినట్లే. ఒక పత్రిక స్థాయి, దానియందు ప్రకటించే రచనలను బట్టి నిలుచునుగాని, వాటిని పరామర్శ చేసే రాగద్వేషపూరితుల స్వాభిమానాలను బట్టి కాదు. కడచిన పన్నెండు మాసాల ప్రతులు తిరుగవేస్తే ‘భారతి’ వర్తమానాంధ్ర సాహిత్య రీతుల ప్రతిబింబముగా ప్రవర్తిల్లినట్లు విరోధులకైనను తోచక మానదు. 1961లో వచ్చినన్ని నూతన రచనలు కాని, కథలు కాని, కావ్యములు కాని, సాహిత్య చర్చలు కాని, వాద ప్రతివాదములు కాని ఇంతవరకు ఎన్నడు రాలేదేమో!

1961 అనేక విధాలుగా సాహిత్యపిపాసుల దృష్టి నాకర్షించినది. కారణము ఈ సంవత్సరములో కనీసము ఆరుగురు మహాపురుషుల శత వార్షిక జయంతులు జరిగినవి. రవీంద్రుడు, మోతీలాల్ నెహ్రూ, ప్రపుల్ల చంద్రరాయ్, గణేశ్ శంకర్ దత్త, గురజాడ, మదనమోహనమాళవీయ, మేడమ్ కామా మొదలైనవారు. వీరిలో రవీంద్రుని ప్రతిభ మిగిలిన వారినందరినీ క్రీనీడలోనికి తోసివేసినది. ఈ నవీనయుగంలో రేడియో, సినిమా పత్రికలు వంటి ప్రచారసాధనాలున్న 1961లో రవీంద్ర శత వార్షిక జయంతి రావడం ఒక విశేషం. ఒక్క భారత దేశంలోనే కాక, ప్రపంచ దేశాలు అన్నింటిలోనూ రవీంద్రుని జయంతి 1961 ఏడాది పొడుగునా ఎక్కడో ఒకచోట జరుగుచున్నది. రవీంద్రుని రచనావళి వంగ భాషలో ముద్రించి, పశ్చిమ వంగ ప్రభుత్వము చౌకగా రూ.75లకు అందజేస్తున్నది. భారతీయ భాషలన్నింటిలోనూ రవీంద్రుని రచనలు వెలువడ్డాయి. విదేశాలలో కూడా రష్యన్, జపాను, జర్మను, ఫ్రెంచి భాషలలో సైతము రవీంద్ర రచనావళి వచ్చినది. అద్భుత నైపుణ్యముతో రవీంద్రుని నాటకములు దేశవిదేశాలలో ప్రదర్శించారు. న్యూయార్కులో ‘ఆరూపరత్న’ (కింగ్ ఆఫ్ ది డార్క్ ఛాంబర్) నాటక ప్రదర్శనలో రాణిగ తెనుగుతార టి. సూర్యకుమారి పాత్రధారణ చేసినది. బెంగాలీలో వంగేతర భాషా ప్రతినిధులు రచనల్తో ‘మహామానవేర్ సాగర్ తీరే’ అనే గ్రంథము వెలువడినది. దానిలో తెలుగు ప్రతినిధి బెజవాడ గోపాలరెడ్డి గారు. రవీంద్ర సాహిత్యము మీద కృషిచేసిన వారిలో ఉత్తమ రచయితలకు కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతులిచ్చింది. వారిలో చిరకాలం నుండి రవీంద్ర సాహిత్యం అధ్యయనం చేస్తున్న ఆకురాతి చలమయ్యగారికి ఈ బహుమతి లభించింది.

ఈ జయంతి పురస్కరించుకొని కేంద్ర సాహిత్య అకాడమీ ఆంధ్ర సాహిత్య అకాడమీ వంటి సంస్థలే కాక, ఇతర ప్రకాశకులు కూడా ఎన్నో గ్రంథములు రవీంద్ర సాహిత్యమని ప్రకటిస్తున్నారు. చెట్టుపేరు చెప్పి కాయలమ్మినట్లు, లాభసాటి వ్యాపారం చేసుకోవడానికి ఈ పుస్తకాలు తోడ్పడ్డాయేమో కాని రవీంద్రుని భావ సరళికాని, కవితాభివ్యక్తి కాని లీలగానైనా చెప్పడానికి ఈ గ్రంథావళి ఉపకరించలేకపోయింది. ఇవి చదువుతూంటే ‘పాపం! రవీంద్రుడు’ అనిపిస్తుంది. కొన్ని అనువాదాలు చేసినవే క్రొత్తగా చేసి మరింతగా అయోమయం చేశారు. శీర్షికలలో సైతము మూలంలోని తాత్పర్యం అర్థం కాలేదనడానికి తార్కాణంగా ‘రాజాతిమిరగృహం’, ‘విసర్జన’, ‘యోగాయోగాలు’ వంటివి చూపవచ్చును. ‘గీతాంజలి’ అనువాదం సంగతి చెప్పనక్కరలేదు. ఇప్పటికి వెలువడిన అనువాదాల సంఖ్య దశమానం దాటినప్పటికీ మూలాన్ని అపేక్షించకుండా అర్థమయ్యేది ఒక్కటి కూడా లేదు. బెంగాలీలోని పద లాలిత్యము, శయ్యా, రీతి – ఇవి రాకపోయినా, కనీసం మాతృకలోని భావస్ఫురణ కూడా కలుగజేయలేకపోయినవి. ఈ సందర్భములో ఎన్నో ప్రత్యేక సంచికలు కూడా వచ్చాయి. వానిలో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ప్రకటించిన రవీంద్ర సంచిక ఒకటి. ఇది చక్కని ఆర్టు పేపరు మీద ఎంతో వ్యయ ప్రయాసలతో వేసిన ఉద్గ్రంథమైనా ఇందులో ప్రకటించిన వ్యాసావళి, విషయ సేకరణలో కాని, పద్య రచనల సంకలనములో కాని ఏ విధమైన శ్రద్ధ కనపరచినట్లు తోచదు. ఉదాహరణకు, ఒక ప్రముఖ సాహిత్యవేత్త రచించిన వ్యాసములో, రవీంద్రుని తల్లి మూడవయేట్నే మరణించిందనీ, అందుచేత అతనికి మాతృప్రేమ అంతగా తెలియదనీ, ఆ కారణంగా అతని స్త్రీ పాత్రల సృష్టి అద్భుతంగా ఉంటుందనీ తెలియజేశారు. శాశ్వతంగా ఉంచుకోదగిన యిట్టి ఉత్తమ సంచికలో రవీంద్రుని గురించి ఇటువంటి అబద్దాలు వ్రాస్తే, అది యెవరికీ గౌరవం? సాహిత్య అకాడమీలు తలపెట్టిన కార్యాలే ఇంత శోభాయమానంగా సాగితే, ఇతర ప్రకాశకుల సంగతి వేరే చెప్పాలా? మంచి సమయము మించిన దొరకదు అని ఎన్నో పుస్తకాలు వీసెలకొద్దీ కట్టలు కట్టి చింతపండు అమ్మినట్టు అమ్ముతున్నారు. రవీంద్రుని మూలంలో ‘నీలకంఠుడు’ తెలుగులో నీలకాంతుడవుతాడు. ‘సేఫాలిక’ మల్లిపూవుగాను, ‘రజనీ గంథము’ చీకటి తావిగాను మారుతుంది. చేసిన అనువాదాలు బెంగాలీనుండి ఇంగ్లీషులోకి, ఇంగ్లీషునుండి హిందీ, హిందీ నుండి తెలుగు, తెలుగు నుండి మారు తెలుగు ఇన్ని భాషాంతరాలు పొందిన మీద మూలంలోని అర్థం లీలగా కూడ నిలువలేదు. ఈ సమయంలో వచ్చిన అనేక గ్రంథములలో ఆంగ్లభాషలో వచ్చిన రవీంద్రుని జీవితం గూర్చి కృష్ణ కృపలానీ రచన, పిల్లల కోసం రేణుకారాయ్ రచించిన చిన్నపుస్తకం కొంతమేలుగా ఉన్నవి. తెలుగులో ‘అమరేంద్ర’ రచించిన గ్రంథం విశ్వకవి రవీంద్రుని బహుముఖ ప్రతిభను పరిచయం చేస్తున్నది. ఆంధ్ర ప్రదేశ్ అకాడమీవారు ఒక పోటీ పెట్టారు. దానిలో కోటికిరణుడైన రవీంద్రుని, ‘కవిచంద్రుని’గా చూసిన ఒక రచయిత్రి గ్రంథానికి బహుమతి యిచ్చారంటే, మన తెలుగువారి ఉచితజ్ఞత గ్రహించవచ్చును. కాళిదాసు, షేక్‍స్పియరు వంటి మహాకవులకు జరుగని పెద్ద స్థాయిలో రవీంద్ర శత జయంతి మహోత్సవాలు జరుగుచున్నవి. కాని ఈ పేరున ప్రభుత్వములు, మంత్రులు, విద్యాశాఖవారు, రెవెన్యూ డిపార్టుమెంటువారు కలుగజేసుకొని, యిది అధికార సమారాధనలాగ జరిపేటప్పటికి ఈ సభలలో తాశీల్దారులూ, రెవెన్యూ ఇనస్పెక్టర్లూ, జిల్లా విద్యాధికారులూ, బడిపంతుళ్ళు పూనుకోవలసి వచ్చి సాహిత్య సభలకు బదులు, జమాబందీ సమావేశాలు, సెంట్రల్ క్లాసులు చూస్తున్నట్టు అనిపిస్తున్నది. నిజంగా రవీంద్రుడు బహుముఖ ప్రతిభావంతుడు. సర్కారువారి పాటలలోకి దిగి వేలంవెర్రి యెత్తించవలసిన అపచారం ఏమీ చేయలేదు. భారతదేశానికి, వంగ దేశానికేకాక, ప్రపంచ దేశాలకే క్రొత్త సందేశం వినిపించిన యుగ ప్రవక్త. ఈ శత జయంతి సంతర్పణలు, సమారాధనలు ముగిసిన తర్వాతనైనా స్థిమితంగా కూర్చుండి చదివి ఆనందించవలసిన ద్రష్ట, స్రష్ట, కవీ, కళామూర్తి, తత్త్వవేత్త, ధర్మప్రవక్త.

రవీంద్ర ఛాయలలోపడి మాయమైన గురజాడ వర్థంతి ఈ సంవత్సరం వచ్చింది కాని, అన్ని విషయాలలోలాగే ఆయన పుట్టినతేదిని కూడా తెలుగువారు వివాదగ్రస్థం చేశారు. ఆయన జాతకం దొరికినా కాని అది నమ్మే స్థితిలో లేరు. 1961 ఎలాగ గతించింది కాబట్టి  – ఆ సంవత్సరం ఏమీ జరగకుండానే గడిచిపోయింది – పోనీ 1962లో నైనా వారి సరియైన పుట్టినతేదీ సెప్టెంబరు 21నాడు, శత వార్షిక జయంతి జరిపి వారి గ్రంథావళి ప్రచురించి అధ్యయనం చేస్తే సముచితంగా ఉంటుందేమో! వారి గ్రంథాలు, జీవితచరిత్ర రష్యాలో ప్రకటించబోతున్నారు. ఇంగ్లీషు, ఫ్రెంచి భాషలలో వారి నాటకం ‘కన్యాశుల్కం’ వెలువడబోతున్నది. ఆంధ్రసాహిత్య అకాడమీవారు, ‘కన్యాశుల్కం’ సంపూర్ణ ప్రతిని సవ్యాఖ్యానంగా ప్రకటించపూనుకోవడం మెచ్చుకోతగిన అంశం.

వార్షికోత్సవాలు, శత వార్షికోత్సవాలూ అటుంచి యించుమించు ప్రతిరోజు, ప్రతివారం ఎక్కడో ఒకచోట ఏదో ఒక గ్రంథం ఆవిష్కరణ మహోత్సవం జరుగుతున్నది. ఒక అమాత్యశేఖరుడో, ఒక అధికార ప్రవరుడో ఆధ్వర్యం వహించి గ్రంథాన్ని కాని, గ్రంథకర్తను కాని ఎంతమాత్రము తెలుసుకోకుండానే ఆవిష్కరణం చేస్తున్నారు. అక్షతలు వేస్తున్నారు. ఆరంభోపన్యాసా లిస్తున్నారు. అప్రస్తుతాలు చెప్తున్నారు. రాజులు రాజపోషకులు లేని ఈ ప్రజాయుగంలో ప్రజలే సాహిత్య పోషకులు. ప్రజాప్రతినిధులుగా మంత్రులు నిలువబడి కవులను, గ్రంథకర్తలను, ఖద్దరు దండలతో, ఖాదీ శాలువాలతో సత్కరిస్తున్నారు. ప్రచురణ వస్తున్నది కాని – దీనివలన ప్రయోజనము వెలువడిన గ్రంథాలకు గాని, అవి కష్టపడి రచించిన గ్రంథకర్తలకు గాని మృగ్యమైపోతున్నది. ఆవిష్కరణల పటాటోపం అటుంచి, గ్రంథములలో అంతరార్దం తెలిసికోవాలీ అంటే అవి చక్కగా పరిశీలించాలి. సమగ్రంగా సమీక్ష చెయ్యాలి. అట్టి సమీక్షలు పూర్వం పత్రికలలో వెలువడేవి. ఈనాడు పత్రికలలో చాలాభాగం సమీక్షలు, గ్రంథాలు చదువకుండానే వ్రాసినవే. దానివలన కూడా గ్రంథములలోని విషయములు తెలిసికొనే సావకాశం సన్నగిల్లిపోతున్నది. శతాధిక గ్రంథాలు వస్తున్నవి పోతున్నవి. వీనిని పరిశీలించగల్గిన ఓర్పు, ఓపిక ఈ కాలంలో ఎవరికి ఉంటుంది? అందుచేత సాహిత్య రంగంలో విలువలు కట్టడం కష్టమే. విపణివీధిలోలాగ ఇవి దినదినం మారేవికావు. కొన్ని ప్రమాణాలకు, కొన్ని లక్ష్యాలకు లోబడి నిలకడగా ఉండేవి. అవి అందులో లేని రచనలకు సాహిత్య వీధిలో తావేలేదు. ఈ దృష్టితో చూస్తే, ఈ కాలంలో వస్తున్న సారస్వతం ఏ విలువలూ పాటించలేకపోతున్నదేమో అనిపిస్తుంది. భావశబలత, రససిద్ధి, విశ్వశ్రేయస్సు వంటి మహోన్నత లక్ష్యాలను అందుకోలేకపోయినా, భాషలోని శక్తి, జీవత్ పరిణామము, పరిశుద్ధత, అర్థపుష్టి, యుక్తి చమత్కృతి, జాతీయభావన కూడ నిలుపుకొన్న రచనలు నేడు అరుదైపోయినవి. అవి గ్రాంథికము కానక్కరలేదు. జీవత్ భాష అయిన వ్యావహారిక భాష అయినాసరే కదిలేదీ, కదిలించేదీ అయి ఉంటే చాలు. పలుకుబడులతోను, నుడికారాలతో, నిండుతనంతో పసందులు చూచే భాషే నేటి రచనలలో కరువైపోయింది. లేనిదానికి విచారించి ప్రయోజనం లేదు. ఉన్నదానిలోనే గ్రుడ్డిలో మెల్లను ఎంచుకోవాలి. ఈ దృష్టితో చూస్తే 1961 సాహిత్యం కొంచెం మెరుగేమో అనిపిస్తుంది.

గద్య రచనలకున్న ప్రచారము పద్య రచనలకు లేకపోయినప్పటికీ, నేటికీ పద్య వాఙ్మయమునకే హెచ్చు గౌరవము లభిస్తున్నది. కవితా గ్రంథములు కూడ ప్రచారములోనికి రాగలవనడానికి ఒక మంచి తార్కాణము కరుణశ్రీ రచించిన ఉదయశ్రీ. ఈ కవితా సంకలనం 25 ముద్రణలు పొంది ఈ సంవత్సరం 26వ ముద్రణం వెలువడినది! ఇరవై అయిదు వేల ప్రతులు చెల్లిపోయినది. దీనికి కారణము ఈ పద్యముల మృదు మధురశైలి, పదలాలిత్యము, భావముల నిరాడంబరత. దానికంటె హెచ్చు, ఈ గ్రంథములోని పద్యములన్నీ యించుమించు గ్రామఫోను రికార్డులుగా మధుర కంఠముతో ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పరిచయం చేసి యుండుట. అదిగాక హరికథాగాయకులైన కీ.శే. మట్నూరి సూర్యనారాయణగారు, గాయకులైన మహావాది వెంకటప్పయ్యగారు గానం చేసి ఆంధ్రదేశమంత ప్రచారం చేశారు. ఏ కారణం చేతనైనా ఒక కవితా గ్రంథము ఇన్ని ప్రతులు చెల్లడం పుస్తక ప్రకాశనలోనే చరిత్ర సృష్టి చేసినట్లే! ఇంతగాను కవితా గ్రంథములు ప్రచారములోనున్న మరొకరు గుర్రం జాషువా కవి. వీరి స్వీయ చరిత్ర పద్యరూపములో వెలువడుచున్న నూతన కావ్యము. స్వీయ చరిత్ర గద్య పద్యాత్మకముగా రచించినవారు కీ.శే. శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రిగారు. వారు ద్విశతాధిక గ్రంథకర్తలు. అంత పెద్ద యెత్తున గ్రంథ రచన చేస్తున్నవారు. మన సమకాలికులు విశ్వనాథ సత్యనారాయణగారు. వారి రామాయణ కల్పవృక్షం యింకా చిగురులు తొడుగుతూనే ఉన్నది. ఈ లోపున పది పుణ్యక్షేత్రాలకు చెందిన ఇష్ట దైవములను ఎన్నుకొని వారిని గూర్చి పది శతకములు మధ్యాక్కరలతో చెప్పి, వెయ్యి పద్యాలతో కూడిన విశ్వనాథ దశ శతి ప్రకటించారు. ఇందులో వారు పాటించిన ద్వియతి నియమము పాఠకులను ఆశ్చర్య చకితులను చేసి, రసానందములో ముంచివేసినది. విశ్వనాథ వారు రామాయణము రచించినా, రమ్య రచనలు చేసినా చాటువులు చెప్పినా, శతకములు చెప్పినా ఒక నిగూడమైన శైలిలో నారికేళపాకంతో పాఠకులకు శ్రమ కల్పిస్తారు. వారి కావ్యాలలో దోషాలు లేవని కాదు. అట్టివి కాళిదాసాది కవులలోనే ఉన్నవని వారి మతము. వాటిని యెత్తి చూడడానికి సామాన్య పండితులు చాలరు. రసధునులైన సహృదయులే సమర్థులైన వారని వారి వాదము. రామాయణ కల్పవృక్షములోని దోష ప్రకరణముపైన రేగిన గాలిదుమారమునకు ఇదే సమాధానము. రెండు నెలలపాటు ఆంధ్ర పత్రికలో సాగిన ఈ సాహిత్య చర్చలోను, భాషాపరామర్శలోను కులములు, శాఖలు, రాగ ద్వేషములు ప్రవేశించి శాఖాచంక్రమణమునకు దారితీసినదని కొందరి అభిప్రాయము. కాని ఈ విమర్శ ప్రతి విమర్శల వలన, స్తబ్దుగా ఉన్న పాఠకలోకంలో చైతన్యం కలిగిన మాట నిజం. నేటి కవితా రీతులు చూచిన మూడుముఖ్యమైన పంథాలు కానవచ్చును. విశ్వనాథవారివలె రామయణాది కథలు తిరిగి వ్రాయుట. ఈ పద్ధతిలోనే చరిత్రగాథలు రచించువారున్నారు. ఉదాహరణకు జ్ఞానానందకవి రచించిన ‘గోలకొండ’ కమ్మని పద్యాలతో అలరారుచున్నది. సర్వోదయ సిద్ధాంతములు మననము చేసికొని, జీవితములో ఆచరణలోకి తెచ్చిన తుమ్మల సీతారామమూర్తి గారి ‘సర్వోదయగానము’ ఒక మంచి కావ్యము. ఉద్యోగ విరమణం చేసిన తరువాత తీరికగా కూర్చుండి కొండొకచో ఒక ఉడుత ఎగిరి గంతులువేస్తే చూచి వ్రాసిన ‘చిక్రోడ పంచదశి’ వారి కవితా హృదయమునకు మరొక తార్కాణము. మహాత్ముడు, బుద్ధుడు, వేమన వీరిపైన మూడు శతకములు రచించి నెహ్రూ పండితునికి అంకితమిచ్చి గౌరవాదరములు చూరగొన్న పల్నాడుకవి కొండవీటి వేంకటకవి ‘త్రిశతి’ చాలా చక్కని సంపుటము. శతక శైలిని వచ్చిన మరికొన్ని చాటు పద్యములు ఆధునిక కవి దాశరధి రచించిన దాశరథీ శతకములో నున్నవి. ఇందు దాశరధి ఆధునిక కవి శ్రేష్ఠులను, రాజకీయ వినాయకులను వ్యంగ్యముగా పరిచయము చేసి హాస్యరసము పోషించినారు. ఇట్లే ఆధునిక జీవితముపై వ్యాఖ్యలవంటి పద్దెములను వీరి జంటకవి సి. నారాయణరెడ్డి ‘సమదర్శనం’లో ప్రకటించారు. ‘చదువులతోనే వ్యక్తికి సంపూర్ణత్వమ్ము రాదు. సంస్కారములేని చదువు సౌరభమ్ములేని పూవు.’ ఇట్టి సత్యములు సహృదయతతో నారాయణరెడ్డిగారు చాటియున్నారు.

నేటి కవిత్వంలో ద్వితీయ పంథా ప్రణయ కవిత్వము. భావ కవిత్వమునకు కాలదోషము పట్టినప్పటికీ, నేటికీ ప్రణయ కవిత్వము వంటిది రచించువారు లేకపోలేదు. అయితే ఏదో ఒక కథను, ఒక శృంగార సన్నివేశాన్ని ఆధారంగా పెట్టుకుని రచిస్తున్నారు. ఇట్టివానిలో స్పూర్తి శ్రీ రచన ‘వియోగిని’ ముద్దులు మూటకట్టుచున్న ముచ్చటైన కావ్యం. ఈ కావ్యమంతా ‘వియోగినీ’ వృత్తములలోనే నడిచి వీనుల విందుగా విప్రలంభ శృంగారమును గానము చేసినది. యాతనామయమైన లోక జీవితమునుండి మానవ చేతన ద్వంద్వాతీతమగు నానందస్థితినందు ఇందున్నది. శృంగారంలోని అన్ని అవస్థలను చూపుచు గానం చేసిన కావ్యము సి. నారాయణరెడ్డి గారి ‘ఋతుచక్రము’. పల్లెటూరు దంపతుల జీవితంలో ఒక యేడాది ఋతుచక్రము కలిగించిన శృంగారావస్థలన్నీ చక్కగా ఈ కావ్యంలో చిత్రించినారు. ‘ఋతు ప్రబంధం’ ఋతువులను గూర్చి ఒక చిన్న పుస్తకమును పైడిపాటి సుబ్బరాయశాస్త్రి గారు తెచ్చినారు. శృంగారభావాలకు సూపీతత్త్వానికీ సూచిక అయిన గాలిబ్ కవి ఘజల్సు  – దాశరధి తెనుగు ద్విపదల లోనికి అనువదించి రసస్పందనము కలిగించు వాక్కులతో చెప్పినారు.  అంత్యనియమము పాటించి, పాడుకొనుటకు వీలైన ‘ఘజలు’ అనే పాట పాటగానే ఉంటే ఇంకా రక్తి కట్టేది అని ఉరుదూ పాటల సొగసు తెలిసిన పెద్దల అభిప్రాయం. అభ్యుదయ కవితలో క్రొత్త సంపుటము ఆరుద్ర సంకలనం చేసిన ‘సినీవాలీ’. దీనిలో యన్.జి.వో. సూర్యుడు, క్లార్కు సూర్యారావు, సీతాకోకచిలుక, మొదమైన రచనలు రేడియోలో ప్రసారమై, శ్రోతలకు చిక్కిలిగింతలు పెట్టినవే వేరే ప్రకటించారు. అన్ని రకాల రచనలు చేయుటలో అందెవేసిన, చేయి తిరిగిన యస్వీ జోగారావు గారి కవితా సంపుటి ఒకటి. ఈ శ్రేణి కవితలోను, అధివాస్తవికతలోనూ క్రొత్త త్రోవలు త్రొక్కి, భావనతో, పాటలతో, పాఠకులను దిగ్ర్భాంతుల్ని చేసిన కవి శ్రీరంగం నారాయణబాబు, పాపం ఈ సంవత్సరం కీర్తిశేషుడై పోయాడు. అతనిని గూర్చి ఆరుద్ర రచించిన గేయం చిరకాలం జ్ఞాపకం పెట్టుకోదగినది. ఇటువంటి అశ్రుగీతికలలో ప్రసిద్ధ కవయిత్రి, నవలా రచయిత్రి అయిన డాక్టర్ శ్రీదేవి ఆకస్మిక మృతికి అశ్రుతర్పణముగా నాయని కృష్ణకుమారి రచించిన ‘ఏం చెప్పను నేస్తం?’ అనే గేయం కూడా చక్కగా ఉన్నది. అభ్యుదయ ధోరణిలో మాదిరాజు రంగారావుగారి ‘మేలుకొన్న ఆకాశం’, ‘మనో భూమికలు’, ‘అద్దంలో నీడలు’ పేర్కొనదగినవి. తెలంగాణా పోరాటం గురించి వివరించే గీతికాసంపుటి ‘మిన్నేటి పొంగులు’ హీరాలాల్ మోరియా కృతి ఒకటి విశిష్ట లక్షణము కలది. ఈ సంవత్సరము రెండు కవితా సంకలనములు వచ్చినవి. వైతాళికులు, ఉదయఘంటలు తరువాత ఆ మాత్రము మంచి సంపుటులు చాలాకాలం వరకు రాలేదు. ఈ రెండు పుస్తకములు ఆ కొరతను కొంతవరకు తీర్చినవేమో. మొదటిది ‘మణి మకుటము’. విజయనగరము శోభా ప్రచురణలు ప్రకటించిన దానిలో 58 గురు ఆధునిక కవుల ఉత్తమ రచనలున్నవి. ఇది ప్రథమ భాగము మాత్రమే. రెండవ సంపుటిలో అత్యంత ఆధునికుల రచనలు వెలువడగలవనుచున్నారు. గురజాడ మొదలు కొనకళ్ల వరకు ఈ సంపుటములో భావకవితా యుగమువరకు వచ్చిన కవుల రచనలున్నవి. మరొక సంకలనము శ్రీశ్రీ యుగము. దీనిని అనిసెట్టి, ఆరుద్ర ప్రభృతులు సంకలనం చేసి యాభైమంది రచనలవరకు చేర్చారు. శ్రీశ్రీ మార్కు పద్యాలిందులో కనిపిస్తున్నా, కొందరిని కవితా ప్రజ్ఞలేని వారిని కూడా చేర్చడంతో ఈ సంపుటం విలువ పూర్తిగా దిగజారిపోయింది. ఆధునిక రచనలీరీతిగ సాగిపోతూంటే, పూర్వ ప్రబంధములు కొన్నిటిని ప్రకాశకులు తెచ్చుట ముదావహము. అట్టివానిలో వేమన పద్యములు -నేదునూరు గంగాధరముగారు సేకరించినవి ఒక బృహత్ గ్రంథముగా ప్రకటించినారు. క్రీడాభిరామము, కాళహస్తి మాహాత్మ్యము, కళాపూర్ణోదయము, భీమేశ్వరపురాణము తిరిగి వ్యాఖ్యానములతో వెలువడినవి. ఇట్టి గ్రంథములలో ఉత్కష్ట కావ్యము పల్నాటి వీర చరిత్ర సమగ్ర రూపము. పింగళి లక్ష్మీకాంతంగారు సంపాదించిన ఈ గ్రంథము గొప్ప కృషిని వ్యక్తపరచుచున్నది. పద్యవాఙ్మయము తరువాత సహృదయులను మెప్పించు సాహిత్యవిభాగము నాటకము. నాటకాంతే సాహిత్యమ్ అనే నానుడిపోయి నాటకముతోనే తమ నవకవితను నేటి రచయితలు ప్రారంభిస్తున్నారు. అయినా తెలుగు నాటకరంగంలో ఉత్తమ రచనలంతగా రావడం లేదు. ఎక్కువభాగము ఇతర నాటకములను ఇంగ్లీషు అమెరికన్ రష్యన్ రచయితలవి సంగ్రహించి స్వంతంగా ప్రకటించుకొంటున్నవే – మరొకరకం నాటకాలలో కొన్ని అవినీతిని, హత్యలను, వ్యభిచారమును ఉగ్గడించు రచనలు. ఒక వ్యక్తి అపచారము చేసినందుకు విచారించడు. పశ్చాత్తాపము చెందడు. పైగా దానిని సమర్థించుకొనును. అందుకే నేటి వాస్తవిక నాటకాలలో లేచిపోవడాలు, కానీన గర్భధారణలు, సోదర సోదరీ ప్రేమకలాపాల వంటి జుగుప్స పుట్టించు సన్నివేశాలు హెచ్చుగా కన్పిస్తున్నవి. దీనికి కొంత కారణం – తమిళదేశంలో ప్రచారం పొందిన నాటకాల ప్రభావం కావచ్చు. రక్తకన్నీరు, పరాశక్తి వంటి రచనలు తెలుగులోనికి తెచ్చి జాతినీ, సంఘాన్నీ, సంప్రదాయాన్నీ తిట్టుచు ఉపన్యసించుట పరిపాటి అయినది. దీనివల్ల జనం విరగబడి చూడవచ్చు కాని ఎటువంటి భావాలు ప్రచారమవుతున్నదీ గుర్తించలేకపోతున్నారు. ఈలాంటి నాటకాలు కొందరు సినీనటులు కూడా ఆంధ్ర దేశంలో వేస్తున్నారు. వానిలో బికారి రాముడు ఒకటి. దీనికి మాతృక బెంగాలీ నాటకం ‘ఉలా’. దానినెవరూ పైకి చెప్పక మాతృకను చిత్రవధ చేసి, ఏదో ఒక వికృతరూపంతో ప్రదర్శిస్తున్నారు. ఇలాగే చరిత్ర గాథల్ని ఇష్టం వచ్చినట్లు మార్చి ‘అల్లూరి సీతారామరాజు’ అనే నాటకం కొందరు ప్రదర్శించారు. వర్గ భేదాలు, కుల భేదాలు చూపితే రంగస్థలం మీద రక్తి కట్టునేమో కాని, వీని వలన కలిగే సాంఘిక ప్రతిఫలాలు దారుణంగా పరిణమించవచ్చును. ఈ అశాంతిలోనుండి కొందరు యువ రచయితలు క్రొత్త ప్రయత్నం చేసి జీవిత వాస్తవ చిత్రాలను చూపించడానికి మంచి నాటకాలు వ్రాస్తున్నారు.

వారిలో ఒకరు – దాసరి గోపాలకృష్ణ. ఈయన చదువుకున్న బడి జీవితం, నేర్చుకున్న పాఠాలు రంగస్థలం చూచి, సేకరించిన భాష పల్లెటూళ్ళలో ప్రజలు మాటలాడుకునేది. దాని నుండి నాటకీయత తెచ్చి రెండు నాటకాలు రచించి ప్రదర్శింప జేశాడు. వానిలో ‘చిల్లరకొట్టు చిట్టెమ్మ’ అనే నాటకానికి తణుకులో జరిగిన ఆంధ్రనాటక కళాపరిషత్తులో ప్రథమ బహుమతి వచ్చింది. ఈ సంవత్సరం ఇతడు వ్రాసిన నాటకం ‘చిలుకా – గోరింక’ మన గ్రామ జీవితాన్ని కళ్ళకు కట్టినట్లు చిత్రిస్తున్నది. మంచి హాస్యంతోను, చమత్కారంతోను నాటకీయత నెరిగి వినోదం కలిగించే నాటకాలు వ్రాయడంలో తొలిప్రయత్నంలోనే కృతకృతుడైన మరొక రచయిత భమిడిపాటి రాధాకృష్ణ. ఈయన రచించిన ‘ఇదేమిటి?’ ‘కీర్తిశేషులు’ పలు తావులలో బహుమతులందుకున్నవి. లంచగొండితనం గురించి వీరు వ్రాసిన క్రొత్త నాటకం ‘దైవశాసనం’ ఎంతో వినోదదాయకంగా ఉన్నది. ఇటీవల చిన్న నాటికలు రచించుటలో ఆరితేరిన సోమంచి యజ్ఞన్నశాస్త్రి గారి ‘కట్నం కోరని కల్యాణం’, రావికొండలరావు గారి ‘కథ కంచికి’, గొల్లపూడి మారుతిరావు గారి ‘పతిత’, విడియాల చంద్రశేఖరరావు గారి ‘ఇంటిదీపం’, కొండముది శ్రీరామచంద్రమూర్తి గారి ‘గడ్డిపూలు’ రంగస్థలం మీద రక్తి కట్టిన నాటికలు.

ఈ కాలపు పంచవర్ష ప్రణాళిక, కుటుంబ నియంత్రణ వీనిని గురించి చాలా నాటికలు వస్తున్నవి. వానిని ప్రదర్శించడం కొంత కష్టమే. ఇట్టివానిలో కుటుంబ నియంత్రణ గూర్చి బుచ్చిబాబు రచించిన ‘గొలుసు’, కొండ ప్రాంతాలలో విద్యా శిక్షణ గూర్చి శ్రీ వాత్సవ రచించిన ‘మట్టిమనుషులు’, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము స్వీకరించారు. ఈ నాటకాలన్నీ రంగస్థల ప్రయోగమునకు చాలా అనువైనవే కాని, సాహిత్య రీత్యా అంతగొప్ప స్థాయినందుకోలేవు. సాహిత్యం దృష్ట్యా చూడదలచుకుంటే కొన్ని ఉత్తమ రచనలు, రేడియోలో ప్రసారితమైనవి. వానిలో అత్యంత నూతన ప్రయోగము శ్రీశ్రీ రచించిన ‘చతురస్రం’. శబ్ద చక్షువులు మాత్రం చూడటానికి వీలైన ఈ నాటకము శ్రీశ్రీలోని కవితా విపర్యయము పొందుచున్న క్రొత్త త్రోవలను చక్కగా నిరూపించినది. ఇది ఆంధ్రపత్రిక ఉగాది సంచికలో ప్రకటితమై, పాఠకులను ఆహ్లాదపరచినది.  ఆర్థిక సమతను ప్రతిపాదించే సామ్యవాదములో భౌతికసమత మానసిక సమానస్థితిని సాధించగలదా? అను ప్రశ్నను శ్రీశ్రీ అద్వైతముతో పరిష్కరించినాడు. ఇంతకంటె హెచ్చుగా సాహిత్య ప్రియులను ఆకర్షించిన రేడియో రూపకమాల ఆంధ్రవాఙ్మయ చరిత్రను గూర్చి శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారు రచించిన పది నాటకములు. విజయవాడ – హైదరాబాద్ కేంద్రాల నుండి ప్రసారమైన ఈ నాటకములు శ్రోతలలోను, పాఠకులలోను అనేక వాద ప్రతివాదములు లేపినవి. ఈ కవి చెప్పినట్లు, వీనిలో వారు చేసిన ప్రయత్నము చరిత్రకారునిగా ఆయా యుగముల చిత్రణము మాత్రమే. అందులో వారి అభిప్రాయములకు విలువలేదు. వారు మిన్నయన్న కవులు మిన్న కాదు. సున్నయన్న వారు సున్నకారు. కొందరిని వారు విడిచివేసినారు. మరికొందరిని ప్రశంస చేసినారు. అది అ యుగలక్షణమును చూపుటకు చేసినవి కాని వ్యక్తిగతమైన అభిప్రాయ భేదముల బట్టి కాదు. ఈ రచనలలో నన్నయ, తిక్కన, పోతన, శ్రీనాథుడు, వీరేశలింగం, శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి వంటివారిపైన కవి తన స్వంత అభిప్రాయములను వెల్లడించినాడు. అవి కేవలము వ్యక్తిగతమైనవే. వానితో మనము ఏకిభవించకపోవచ్చును. మొత్తంమీద ఈ రూపకమాల ఆంధ్ర వాఙ్మయ చరిత్రను అందముగా సింహావలోకనము చేసినది.  పాటలతో, పద్యములతో, వాద ప్రతివాదములతో వీనులవిందు చేసినది. ఇవి రేడియోకు దానికున్న ధ్వనిసీమిత రంగమునకు ఉద్దేశించిన నాటకాలని జ్ఞాపకముంచుకొంటే వానిలోని రసస్పూర్తి మరింత చక్కగా ఆస్వాదించుకొనవచ్చు. విశ్వనాథవారి ఇతర రచనలవలెనే యివి కూడా చాలా తర్జన భర్జనలకు గురి అయినవి. ఏది ఏమైనను విశ్వనాథవారి ఈ రచనలు శ్రోతలలో పాఠక లోకములో పెద్ద సంచనలము కొనితెచ్చిన మాట నిజము. ఇంక నవలలో పురాణ వైరి గ్రంథమాల పేరున రచించిన ఎనిమిది నవలలు చాలక, సముద్రపు దిబ్బ, మ్రోయు తుమ్మెద, విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు – విశ్వనాథ వారి టీవల ప్రకటించారు.

శత సహాస్రాధిక గ్రంథ రచనలో విశ్వనాథవారి కృషి దోషరహితము కాదు. అయితే వారొనరించిన కావ్య దోషములు, వాల్మీకి, కాళిదాసువంటి మహాకవులు చేసిన దోషములవంటివని వారందురు. వానిని పట్టి పరామర్శ చేయుటకు అంతటి కవి పండితులు కావలెను కాని సామాన్యులకు సాధ్యము కాదని వారి వాదన. ఈ విషయము శబ్ద, వాక్య సంబంధి దోషములకు వర్తించును. కాని వారి భావతత్త్వమే వాద ప్రతివాదములతో కూడుకొన్నది కదా! ఆధునిక విజ్ఞానము ప్రబలి శాస్త్రీయముగా ప్రతి విషయమును ఋజువు చేయు నేటి హేతువాద యుగములో వారు ప్రతిపాదించు భావము లెంతవరకు నిలువగలవు! వారు నిరూపించు విధానము ఎంతవరకు నేటి పరిస్థితులకు అనుకూలించును? సాహిత్య ప్రమాణముల బట్టి పరీక్ష చేసినచో వారి కృషి యెంతవరకు ఉత్తమ స్థాయికి చెందగలదు? ఇట్టివి పరిశీలించవలెను. యుక్తి యుక్తముగ వారి వాదముల నెదురుకొనవలయును. అదీ విమర్శ! ఉదాహరణకు వారికి పురాతన వ్యవస్థయన్న అభిమానము. అందులోని కులశాఖా విభేదములు ఎంత నవ నాగరికత మీరినను పోవునవి కావని వారి విశ్వాసము! మన సంఘము ఇంతగా చెడిపోవుటకు కారణము ఇంగ్లీషు ప్రభావమని వారి నమ్మకము. మారిపోయిన విలువలు, జారిపోయిన లక్ష్యాలు, విప్లవము చెందుతున్న సమాజ వ్యవస్థ వారికి అధోగతికి త్రోవలుగ కనిపించును. ఈ వాదమును ప్రచారము చేయుటకు వారు చరిత్రను కాదందురు. భాషా శాస్త్రమువంటివి లేవందురు. హేతువాదమును త్రోసిపుత్తురు. విజ్ఞానశాస్త్రమును వెర్రి తలయందురు. దీనిని సమర్థించుటకు నవలలు వ్రాయుదురు. నాటకములు కూర్చెదరు. కవిత్వము చెప్పెదరు. కావ్యములల్లెదరు. వానిలో వారొక విలక్షణమైన తెలుగు శైలి వాడెదరు. విచిత్రమైన వాక్య రచన చేయుదురు. దానిని ఏ మారుపేరుతో మరుగు పరచినా, ఏ నవలలో గుప్తపరచినా వారిని ఇట్టే పట్టివేయగల సమీక్షకులు తెనుగు పాఠకులలో కలరు. వారి మీద అభిమానముతో ఈ రహస్యము తెలిసికూడా, వారు వహించిన ప్రచ్ఛన్న రూపములను బయట పెట్టరు. ఏ పేరుతో వ్రాసినను ఆదరింతురు. అంతేకాదు వారు రచించిన నవలలో పాత్రలు వాస్తవము కాకపోయినను, ఎవరో యథార్థ వ్యక్తులను చూచి వ్యంగ్యముగా రూపొందించినను, ఆ వ్యక్తులను గుర్తు పట్టగలరు. ఈ వాస్తవ చిత్రణలో కొందరిపైన రచయిత తమ వ్యగ్రతను తీర్చుకొన్నట్లు కనిపించును. సామాన్య మానవ స్వభావమునకు విరుద్దమైన ప్రవర్తనలో ఈ పాత్రలు ప్రవేశించును. నీతియను హద్దుమీరి నడుచుకొనును. అంతటితో ఆగక, ఆ యవినీతిని సమర్థించుట యెడ నెడ కనిపించును. కవి, వేత్త అయిన రచయిత – సంఘములోని కుసంస్కృతి చూపవచ్చును. కాని దానిని సమర్థించుట – ఏ సహృదయులు క్షమించరాని అకృత్యము.

నేడు మన సాహిత్యములో ‘చెడును’ ఆకర్షవంతముగా చిత్రించుట బాహాటముగా జరుగుచున్నది. స్త్రీ పాత్రలన్నియు – పతితలే, లేచిపోయినవారే. భర్తను విడిచి వేరుపతులతో విచ్చలవిడిగా అభిసరించినవారే – కొందరు వరుసవావి తప్పి, వయసుమీరి ప్రవర్తించువారు. సమకాలిక జీవనమూ ఇంత నీచముగా ఉన్న కారణముచేత ఇట్టి రచనలు వస్తున్నవని సమర్థింతురేమో! సాహిత్య స్రష్ట మురికి కూపముల చిత్రించవచ్చును. కాని దాని ప్రక్కనే ముముక్షు మార్గము కూడ చూడగలడు. మనుష్యునిలోని పశు ప్రవృత్తి చూపినపుడు, వానిలోని దైవశక్తి కూడా వీక్షించగలడు. నేటి పాశ్చాత్యలోకంలో మానవునిలో దానవత, సెక్సులోని విపరీత వాంఛలు చూడడం పరిపాటి, వానిని ఉన్నదున్నట్లు మన సంఘంలోకి దిగుమతి చేయడం మన సంప్రదాయం కాదు. ఇంతకీ మన రచయితలు – ఎదురుగ కనిపిస్తున్న లోకాన్ని చూడలేకపోతున్నారు. ఎక్కడో జీన్‍పాల్‍సార్త్రే, ఆల్బెర్టో మొరావియా, డోష్టూవస్కీ – ఇటువంటి యూరపియన్ రచయితల భావాలు ఎరువు తీసికొంటున్నారు. పరకాయ ప్రవేశం చేస్తున్నారు. దొంగ రచనలు ఎంగిలి మెతుకులు. ఇవి అందకపోతే ఎవరో వ్యక్తి మీద కసి తీర్చుకొనే రీతిలో వికృతమైన పాత్రలను సృష్టిచేసి వినోదించడం. ఇట్టి ధోరణి అధమాధమ పద్ధతి. ఇది యెంత త్వరగా ఆపితే అంత మంచిది. తెనుగులో నవలలు లేవని ఒక వాదు ఉండేది. క్రమేపీ అది పోయింది. హెచ్చు నవలలు వస్తున్నవి. 1961లో కనీసం నూరు క్రొత్త నవలలైనా వచ్చి ఉంటాయి. దీనికి కారణం వివిధ పత్రికలలో వారం వారం ప్రకటించే సీరియల్స్, వాటి నిమిత్తం పెట్టిన పోటీలు కావచ్చు. ఈ సంవత్సరం యెన్నిక చేసిన పోటీ నవలలు, సీరియల్ నవలలు పరిశీలించి చూస్తే అన్ని పాత్రలు కాలుజాతి బాట తప్పినవే. వారికి నిష్కృతిలేదు. అనుతాపం లేదు. చివరికి ఒకటి రెండు నవలల్లో ఆ పాత్రలు ఏ ఆశ్రమంలోనో ఉపదేశం పొంది, ఏ వెంకటేశ్వర స్వామి ముందో మోకరిల్లితే అంతకుముందు చేసిన సర్వపాపాలు పరిహారమైనట్లు భావిస్తారు. ఇలాంటి చెడు నడతల సీరియల్ కథలు లక్షలకొద్దీ పాఠకులపైన చాలా దారుణమైన దుష్పలితాలు తేవచ్చు. వీనిని గురించి తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిక చేయవలసి యున్నది. ఇట్టి కలగూరగంపలో – ఒక్కొక్కసారి మంచి రచనలు లేకపోలేదు. ఉదాహరణకు ఆంధ్ర వారపత్రికలో వచ్చిన ‘ధ్రువతార’ అనే నవల ఒక బడిపంతులు జీవితంలో ప్రవేశించిన అనాథ శిశువును గూర్చి, వివరిస్తూ – యీ చిన్న సంఘటన వెనుక జరిగిన ఉదంతాలను, ప్రవర్తిల్లిన పాత్రలను ఎంతో ఉదాత్తంగా చిత్రించినది. ఇది రచించిన పెద్దిభొట్ల సుబ్బరామయ్య మంచి రచన చేశారు. ఈ రకం నవలే – ‘మా ఘంటం’ – పుల్లాబొట్ల వెంకటేశ్వర్లుగారు రచించినది – నిజమైన స్నేహానికి కుల, జాతి భేదాలు అడ్డురావని నిరూపించినది. గత శతాబ్దిలో ఒక మారుమూల సముద్ర తీర గ్రామంలో జరిగిన కథ, ఎంతో కరుణారసపూరితమై యథార్థమును కన్నులకు కట్టినట్లు చూపినది. చరిత్ర, కథలు, నవలలుగా చేయుటలో కవుల జీవితాలకు కల్పన జోడుచేసి నోరి నరసింహశాస్త్రి గారు కవిత్రయము మీద మూడు నవలలు రచించారు. ఈసారి శ్రీనాథుని మీద కవి సార్వభౌముడు అనే నవల ప్రారంభం చేశారు. దీనిలోనైనా చారిత్రక విషయాల సత్యానికి విరుద్దమైన సన్నివేశాలు జొన్పించకుండా ఉండగలిగితే వీరి కృషి ప్రశంసాపాత్ర మవుతుందేమో! అలాగ చరిత్రకు – కథకు – నాటి జీవితానికీ తేడా లేకుండా రచించిన నవల – ‘ప్రతాపరుద్రమదేవి’. కాకతీయులనాటి ఆచార వ్యవహారములను, తెలుగుదేశ స్థితి గతులను చక్కని శైలిలో చిత్రించిన ఈ నవల 30 ఏండ్ల క్రితమే కాళ్ళకూరి నారాయణరావు గారు రచించి కీర్తిశేషులయ్యారు. అప్పటినుండి అసంపూర్తిగానే ఉండిపోయింది. దీనిని పూర్తి చేయించి గ్రంథముగా ఒక ప్రకాశక సంస్థ ప్రకటించారు. కథా సంవిధానములో పాత్ర చిత్రణములో, సమకాలీన జీవిత నిర్వచనములో ఈ నవల ఉత్తమ స్థాయినందుకొన్నది. ఎంతసేపు ప్రేమకథలు, మధ్య తరగతి కుటుంబాల కథలతో విసిగిపోయిన పాఠకులకు, విశాఖజిల్లాలోని ఒక సన్నకారు కుటుంబాన్ని పరిచయం చేస్తూ, బలివాడ కాంతారావు గారు రచించిన ‘దగా పడిన తమ్ముడు’ – ఆంధ్ర వార పత్రికలో ప్రకటితమైనదే – పుస్తకరూపంలో వచ్చినది. అలాగే – పోతుకూచి సాంబశివరావుగారి ‘అన్వేషణ’ పుస్తక రూపం దాల్చింది. తెలంగాణ జీవితాన్ని పరిచయం చేస్తూ రచించిన ‘క్రొత్తపంట’, మధ్య తరగతి కుటుంబంలో సాంఘిక సూత్రముల మార్పును సూచించే ‘కత్తుల వంతెన’ – శ్రీ మహీధర రామమోహనరావు రచించినది – పాము నిచ్చెన అను పేరుతో విద్యార్థి జీవితాన్ని చిత్రించే నవల – గంగినేని వెంకటేశ్వరరావు రచించినది క్రొత్త సమస్యలతో మెదడుకు ఆలోచన కల్పిస్తున్నవి. పత్రికల పోటీలలో నెగ్గిన ఇవీ – మరికొన్నీ నేటి సంఘంలోని అవ్యవస్థ చిత్రిస్తున్నవి. యువలోకంలోని అస్థిరతను చూడడానికి యువకులు రచించిన నవలలు కొన్ని తోడ్పడుచున్నవి. ఇట్టివానిలో – నాగరాజు రచించిన రజనీప్రియ, గోపీచంద్ మెఱుపుల మఱకలు, కొలకలూరి ఇనాక్ అనాథ, గొల్లపూడి మారుతిరావు ‘చీకటిలో చీలికలు’ పేర్కొనవచ్చును. గోపీచంద్ ఇంకా చాలా నవలలు వ్రాసి – విషయములో పాత్రలలో వైవిధ్యము చూపినారు. కాని భావ వైఖరిలో పరిణత బుద్ధి లేదనడానికి వారి ‘గడియపడని తలుపులు’, ‘పిల్ల తెమ్మెర’, ‘పరమేశ్వర శాస్త్రి వీలునామా’, ‘చీకటి గదులు’ చదివిన వివక్షణశీలురందురు. మానవ సహజమైన దుర్భలతలు చిత్రిస్తూ, దానితో అరవిందుని వేదాంత తత్త్వము వంటివి కలుపుట, భావనలోని అస్పష్టతకు, అనిశ్చలతకు తార్కాణమనిపించును. నవలలు రచించుట నల్లేరు మీద బండిగా సాగించే కొడవటిగంటి కుటుంబరావు గారు మూడు నాలుగు పెద్ద కథలు వ్రాశారు. వీనిలో ‘గడ్డురోజులు’, ‘క్రొత్త కోడలు’ నవలలో వారు చేసిన పాత్ర సృష్టి, నడిపిన సంభాషణల చమత్కృతి, సాంసారికముగా స్వాభావికముగా ఉండి పాఠకుల దృష్టి నాకర్షించినవి. నేటి – సమాజంలో అరాజకత గుర్తించి దానిని చూచి పలాయనము చిత్తగించకుండా, ఆ నడతలు పరిస్థితుల ప్రభావం చేత వచ్చినవని చెప్పే రచనలు భాస్కరభట్ల కృష్ణారావుగారి ‘వెల్లువలో పూచిక పుల్లలు’, రంధి సోమరాజు గారి ‘సౌందర్యమూ – సౌశీల్యము’. రాజమహేంద్రవరములోని వాస్తవదృశ్యాలు చిత్రించడంలో సోమరాజుగారు అద్భుత శైలి ప్రదర్శించారు. నేటి నవలాకర్తలు కాని, కథకులు కాని, తెనుగుదేశంలో నగరాలు, భారత దేశంలో దృశ్యాలు వర్ణించేటప్పుడు యథార్థాన్ని చూడరు. రాజమహేంద్రవరంలో మెడికల్ కాలేజీ పెట్టించిన ప్రబుద్ధులు, బెజవాడలో బీచ్ షికార్లు చేయించిన రచయితలు, మద్రాసులో పర్వతములు మొలిపించిన మేధావులు లేకపోలేదు. కాని యివన్నీ అచ్చయిపోతున్నవి. కొన్నింటిలో సెక్సు వర్ణనలు, అవినీతి ప్రవర్తనలు ఎక్కువ ఉండటం చేత అపరిణత బుద్ధుల్ని ఆకర్షించి వేలకొలది పాఠకుల్ని భ్రమింపజేస్తున్నవి. అట్టివాని ప్రసక్తి ఈ సాహిత్య సమీక్షలో అప్రస్తుతము. కథానికా రచనలో పలువురు క్రొత్త రచయితలు వచ్చి క్రొత్త రచనలు గావించి పాఠకులను ఆహ్లాదపరుస్తున్నారు. కారణం – కథలకు నేడు పత్రికలలోగల గిరాకీయే. వచ్చినవి చాలక, పలు పత్రికలు పోటీలు పెట్టి బహుమతులిచ్చి కథకులను ప్రోత్సహిస్తున్నవి. వీనిలో ఈ సంవత్సరము స్త్రీల రచనలు వెలుగులోనికి వచ్చినవి. శ్రీమతి జె. సుబ్బులక్ష్మి రచించిన కథలకు రెండు పోటీలలో ప్రథమ బహుమతులు లభించినవి. ఈ రెండు కథలలోను ఆమె స్త్రీ మనఃప్రవృత్తిని అతి సుకుమారంగా చిత్రించినది. ‘మాతృప్రేమ’ అను కథలో – ఒక పేద కుటుంబములో అయిదుగురు పిలల్ల తల్లి బిడ్డలను పోషించలేక, ఒక బిడ్డను పెంపకం ఇవ్వలని తలచి – ఆ పిల్లలనే అడుగుతుంది. అప్పుడా పిల్లలిచ్చిన జవాబులు ఎటువంటివారి మనస్సునైనా ఇట్టే కరిగిస్తాయి. ఇలాంటి కథలెన్నో వస్తున్నవి. ‘కృష్ణవేణి’ నవల రచించి, ప్రసిద్ధురాలైన ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారి ‘ఆండాలమ్మ’ కథ, ఒక విచిత్రపాత్రను పరిచయం చేయడంలో ఎంతో సొగసుగా కుదిరింది. స్త్రీలలో యద్దనపూడి సులోచనదేవి ‘వాచస్పత్రి’, కె.వి.యస్. అచ్యుతపల్లి, మునిపల్లె సరోజినీదేవి, తురగా జానకిరాణి కొన్ని మంచికథలు ప్రకటించారు. వీరుగాక ఆచంట శారదాదేవి కథలు ‘పగడాలు’ అను పేరున సంపుటిగా వెలువడినవి. రమాదేవి కథలు ‘ఆ తండ్రికి తగిన కొడుకుకాడు’ మొదలైనవి ఏదో ఒక సందేశాన్ని చెప్తున్నవి. యస్. సుబ్బలక్ష్మి కథలు ‘కాపురం’ మొదలైనవి నేటి సాంఘిక జీవనాన్ని స్త్రీ దృక్పథంతో చూపిస్తున్నవి. కథానికలు పత్రికలలో వెలువడటమే కాక – ప్రత్యేక సంకలనములుగ కూడా వస్తున్నవి. వీనిలో దక్షిణ భాషా పుస్తక సంస్థ వారు ప్రకటించిన రెండు సంపుటములు, ఆంధ్రప్రదేశ్ బుక్ డిస్ట్రిబ్యూటర్స్ వారి ఒక సంపుటి, ప్రత్యూష ప్రచురణల వారి సంకలనము పేర్కొనదగినవి. కొన్ని తెలుగు కథలు ఆంగ్లంలో అనువాదం చేసి ప్రసిద్ధ సచిత్ర వారపత్రికలలో ప్రకటించడం చేత మంచి ప్రచారం పొందినవి. వీనిలో – యస్. యమ్. వై. శాస్త్రి, బుచ్చిబాబు, కుటుంబరావు ప్రభృతుల కథలు ఆంధ్రేతర పాఠకుల్ని సైతం ఆకర్షించాయి. తెనుగుకథల సంపుటులు ‘ఆటకే ఆఁసూ’, ‘తెలుగుకే ఉత్కృష్ట కహానియా’ అనుపేరులతో హిందీలో బాలాశౌరిరెడ్డి గారు ప్రకటించినవి – మంచి ప్రచారము పొందినవి. తెలుగు సంకలన గ్రంథాలలో – సి. రామచంద్రరావు, ముళ్ళపూడి వెంకట రమణ, పూసపాటి కృష్ణంరాజు మొదలైన వారి కథలు క్రొత్త పాత్రలను, క్రొత్త జీవితాలను పరిచయం చేస్తున్నవి. ఇటీవల రచనలు చేస్తున్న కథకులలో మధురాంతకం రాజారాం, వాణీకుమార్, కలువకొలను సదానంద, పెద్దిభొట్ల సుబ్బరామయ్య, కొండముది హనుమంతరావు, ఆకొండి నారాయణమూర్తి, సింగరాజు రామచంద్రమూర్తి మొదలైన వారు క్రొత్త ప్రయోగాలు చేసి శైలిలో, భావనలో, కథా సరళిలో క్రొత్త పంథాలు త్రొక్కుతున్నారు. హాస్యానికి ఏష్యం అయిపోయిన తెనుగు సాహిత్యవీధిలో ముళ్ళపూడి వెంకట రమణ తర్వాత – కలువకొలను సదానంద, పూసపాటి కృష్ణంరాజు నూతన చమత్కృతులతో చదువరులకు గిలిగింతలు పెడుతున్నారు. కథానిక క్షేత్రంలో మాత్రం – తెనుగు రచయితలు ఫలవంతమైన సస్యములు ప్రోది చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ అను పేరున ప్రకటించు ప్రచార పత్రికను – సాహిత్య సంచికగా చేయదలచి పద్యములు, గద్యములు, వ్యాసములే గాక, పుస్తక సమీక్షలు, విమర్శలు గూడా ప్రకటిస్తున్నారు. కాని పాడిపంటలతో పాటు బ్లాక్ డెవలప్‍మెంటు వార్తలు, వ్యవసాయ విశేషాలు, మంత్రుల కార్యకలాపాల ఛాయాచిత్రాలతో నిండిన యీ పత్రిక, ఎంత ఆర్టు పేపరు మీద వేసి, ఎంత ఉదారంగా ప్రకటించినా, సాహిత్య స్థాయిని అందుకొనగలదనుకొనడం మృగతృష్ణలో తృష్ణతీర్చుకోవం వంటిదేమో! ఈ పత్రిక అటు ప్రచార లక్ష్యమూ సాధించలేక, ఇటు సాహిత్య స్థాయినీ పొందలేక రెంటికి చెడినరేవడయై ‘త్రిశంకు స్వర్గంలో’ ఉన్నది. ఆంధ్ర ప్రభుత్వము అల్లూరి సీతరామరాజు జీవిత చరిత్రను గూడా వ్రాయించి ప్రకటించారు. అది సాహిత్య దృష్టితో చూస్తే విలువను పొందలేదు. విజ్ఞాన వ్యాసరచన అంత విశేషంగా వికాసం పొందని తెనుగు సాహిత్యంలో – వ్యక్తుల జీవితాలను గూర్చిన రేఖాచిత్రాలు రావడం అపూర్వమే. తెలుగు వెలుగులు అనుపేరున ఆంధ్ర వారపత్రికలో సంవత్సరంనర పైగా వెలువడి పాఠకలోకాన్ని విశేషంగా ఆకర్షించాయి. ఈ తెలుగు వెలుగుల వ్యాసావళి వాస్తవ చిత్రణతోపాటు ఉన్న సత్యాన్ని నిర్మొహమాటంగా చెప్పుతూ, శైలిలో, భాషలో, సాధించిన కుప్తీకరణ, వ్యంగ్యధోరణి, వాక్యపటుత్వము, అనన్యసాధ్యమైనవి, అపూర్వమైనవిన్నీ. ఈ తీరున మరొక వ్యాసం వ్రాయవలసిందని ఒక పోటీపెడితే, ఈ రేఖా చిత్రాలతో తులతూగగల్గిన శబ్ద చిత్రం ఒక్కటి కూడా ఎవ్వరూ రచించలేకపోయారు. ఈ వ్యాసములన్నీ గ్రంథరూపంలో ప్రకటిస్తే, తెలుగు సాహిత్యానికి అమూల్యాలంకారంగా అలరారగలవు. విజ్ఞాన శాస్త్ర విషయములో చాలినన్ని గ్రంథములు లేవు. వచ్చినవానిలో విస్సా అప్పారావుగారి ‘అకాశం’, గాలి బాలసుందరం గారి ‘మన దేహము – దేహారోగ్యము’ ప్రత్యేకముగా పేర్కొనదగినవి. లేఖలు, చలంగారివి, రెండు మూడు పుస్తకములుగా వచ్చినవి. దువ్వూరి రామిరెడ్డిగారి ఉత్తరములు డైరీ కలిపి కె.వి రమణారెడ్డిగారు క్రోడీకరించి – ‘డైరీ – ఉత్తరాలు’ అనుపేరున గ్రంథము ప్రకటించినారు. గురజాడ శతవార్షిక జయంతి సందర్భంలో వారి డైరీలు తిరిగి వెలువడినవి. తెలుగుభాషలో కాని, సారస్వతములో గాని పరిశోధనలంతగా లేవను వాదు పోవునట్లు, ఇపుడు డాక్టరేట్లు అడిగినదే తడవుగా అధికముగా లభించుచున్నవి. ఈ సంవత్సరము కేతవరపు రామకోటిశాస్త్రిగారికి ‘తిక్కన కవిత్వము’ మీద పరిశోధనకు, నండూరి కృష్ణమాచార్యులు గారికి అదే విషయము మీద పరిశోధనకు, డాక్టర్ పి.యన్. ఆర్. అప్పారావుగారికి – నాటకముల పుట్టు పూర్వోత్తరాల మీద పరిశోధనకు డాక్టరేట్లు లభించినవి. ఇదివరకే డాక్టరేటు పొంది డిల్లీలో ద్రావిడ భాషావాఙ్మయ పీఠములో పని చేసిన డాక్టరు కొత్తపల్లి వీరభద్రరావుగారు అమెరికాలోని ఒక విశ్వవిద్యాలయంలో తెలుగు అద్యాపకులుగా పనిచేయడానికి వెళ్ళారు. వారి పరిశోధన ‘ఆంధ్ర సాహిత్యం మీద ఆంగ్ల భాషా ప్రభావం’ గ్రంథంగా వెలువడింది. అలాగే డాక్టరు దివాకర్ల వేంకటావధానిగారి ప్రాజ్ఞన్నయ్య యుగము గురించిన పరిశోధనల వ్యాసము, యస్వీ జోగారావుగారి యక్షగానములను గూర్చినది గ్రంథములుగా వెలువడినవి.

భాషా శాస్త్రములో పరిశోధనలు చేసినందుకు డాక్టర్ కె. మహదేవ శాస్త్రిగారికి కలకత్తా విశ్వవిద్యాలయం వారి డిలిట్ లభించినది. ‘కొందు’ భాష గూర్చి కృషిచేసిన – డాక్టరు భద్రిరాజు కృష్ణమూర్తిగారి పరిశోధనలు ఖండాంతరములో పండితుల మన్ననలందుకొన్నవి. ఇవి ఇట్లుండగా తెలుగు భాషా సమితి, సాహిత్య అకాడమీ వంటి సంస్థలు, విజ్ఞాన సర్వస్వములు, సామెతలు, నన్నయ పదకోశము, పదబంధ పారిజాతము వంటి గ్రంథములు ప్రకటించుచున్నవి. అయ్యదేవర కాళేశ్వరరావుగారి యాజమాన్యమున పారిభాషిక నిఘంటువు ఒకటి తయారగుచున్నవి. వారే స్థాపించిన చరిత్ర – శాస్త్రము గురించిన తెలుగు ఉరుదూ అకాడమీ తరపున కొన్ని మంచి పుస్తకములు – చైనా, అమెరికా, ఈజిప్టు గురించినవి – శాస్త్ర విషయములు గురించినవి వెలువడినవి. దక్షిణ భాషా ప్రచురణ సంస్థ తరపున ఆంధ్ర వాఙ్మయ చరిత్ర ఒకటి, దక్షిణ దేశ చరిత్ర ఒకటి వెలువడినవి. ప్రదేశ అకాడమీ ఈ సంవత్సరము జరిపిన పోటీలలో డాక్టరు గిడుగు వెంకట సీతాపతి గారి ‘ఆంధ్ర ఛందోరీతు’లకు సుబ్రహ్మణ్యం గారి ‘వీర రసము’ నకు బహుమతులు లభించినవి. సీతాపతిగారు ఛందస్సుగూర్చి గొప్పగా తెలిసినవారై – 1920, 1927, 1930, 1936 – ఈ సంవత్సరాలలో వ్యాసములుగా, పుస్తక పీఠికలుగా రచించిన వానినే సంగ్రహించి ఈ పుస్తకముగ తెచ్చినారు. అందుచేత ఆంధ్ర ఛందోరితులు పరిణామము చరిత్రరీత్యా ఎట్లు జరిగినదీ తెలుసుకొను గోరువారికిగాని, తెనుగు ఛందస్సులోని తీరు తెన్నుల సమగ్ర వివరణము తెలియగోరువారికిగాని ఈ గ్రంథము తృప్తినీయదు. పైగా కన్నడము, తమిళము, వీనిలో ఛందోరీతులను గూర్చి వీరు చేసిన సూత్రీకరణములు ఆయా భాషల పరిణామము అంతరార్థము తెలిసిన వారామోదించలేరు 1933లో గిడుగు రామమూర్తి గారి సప్తతి సంచికలో డాక్టరు చిలుకూరి నారాయణరావు గారు ప్రాకృత సంస్కృత ఛందస్సుల యందలి అక్షర మాత్రా విభేదములను చూపును, లెక్కలతో తెలిపిన అంశములు యథాతథముగా ఈ గ్రంథములో స్వీకరించి, కృతజ్ఞత తెలుపకపోవుట ఆశ్చర్యము గొల్పును. ఇంతవ్రాసి – పద్యమునకు, గేయమునకు గల భేదముకాని, తెలుగులోని యతిప్రాసల విశిష్టత గాని సమగ్రముగా ఈ గ్రంథములో చర్చించలేదు. దీనికి తోడు ఈ పుస్తకమునకు సూర్యుని దివిటీతో చూపినట్లు ఒక యువక ఛందోవేది రచించిన పీఠికలో ఆంధ్ర దేశములో ఛందస్సు తెలిసిన పండితులు తాము మాత్రమే యని చెప్పుకొనుట ఈ గ్రంథ ప్రశస్తిని ఉగ్గడించేది మాత్రం కాదు. సాహిత్య విమర్శలలో అల్లసాని వారి అల్లికగూర్చి విశ్వనాథవారి వ్యాసావళి, సాహిత్య – మరమరాలని తాపీ ధర్మారావుగారి వ్యాసములు ఆలోచన పురికొల్పు రచనలు.

1961లో చాల – సాహిత్య చర్చలు, భాషా వివాదాలు జరిగాయి. ముఖ్యంగా రామాయణ కల్పవృక్షంలోని భాషా ప్రయోగాలు గూర్చి – వానిని తిరిగి యిచ్చట ప్రసక్తిలోనికి తెచ్చి – చర్విత చర్వణము చేయదలచలేదు. ఇది -భాషా చర్చలోనుండి కుల శాఖా వివక్షతలోనికీ, అప్రస్తుత ప్రశంసలోనికి దిగి – నేల విడిచిన సాముగా మారిన మాట నిజము. అందుకే ఇది కొనసాగించిన ‘ఆంధ్రపత్రిక’ వారు దీనికి అంతటితో స్వస్తి చెప్పారు. సాహిత్య చర్చ ఏ రీతిలో సాగవలసినదీ – నిరూపించిన మరొక చర్చ ‘భారతి’లో వచ్చినది. భారతములోని కొన్ని పాఠముల గూర్చి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మగారు ప్రారంభం చేసిన ఆలోచన – ‘ధనంజయ ప్రవరకరమ్ము – బలియిడు వీనిన్’ అను ప్రయోగములను వారు సమర్థిస్తూ, యుక్తియుక్తముగా తమ వాదాన్ని ప్రతిపాదించారు. దానిపైన – దీపాల పిచ్చయ్యశాస్త్రిగారు, ధూళిపాళ శ్రీరామమూర్తి గారు తమకు తోచిన ప్రతివాదములు చూపినారు. అవన్నీ పరిశీలించి – శ్రీ అనంతకృష్ణ శర్మగారు ఎంతో సౌహృదముతో చర్చించినారు. సాహితీహితమైన యిట్టి చర్చలలో, వారన్నట్లు మన్నించుటకు విషయమే లేదు. ‘ఇట్టి చర్చలు కేవల విషయ శ్రద్ధచే వ్యక్తిని మరచి – చేయవలసినవి’. ఈ స్థాయిలో జరిగిన సాహిత్య చర్చలు అర్థవంతమగును. ప్రయోజనకారులగును. పాశ్చాత్య రచయితలైన జీన్‍పాల్ సార్త్రె, సోమర్‍సెట్ మాఘమ్ వంటి వారిని పరిచయం చేసిన కొండముది శ్రీరామచంద్రమూర్తి గారి వ్యాస పరంపర మంచి విమర్శకు నిదర్శనములు.

1961 సాహిత్య సింహావలోకనములో – తెనుగు సీమలో ప్రవర్తిల్లిన వైఖరులు వైభవములు స్థాలీపూలకముగా స్పృశించుట జరిగినది. దీనివలన – సామాన్య పాఠకులకు నేటి సాహిత్యమును గూర్చిన జిజ్ఞాస – ఉత్తమ గ్రంథములు చదువవలెనను కుతూహలము కలిగిన చాలును. ఈ సమీక్షలో కొన్ని ధోరణుల గూర్చి, కొన్ని తప్పు త్రోవల గూర్చి తీవ్రముగా విమర్శ చేసినచో, అది వ్యక్తిగత రాగ ద్వేషములతో చేసినదికాక, ఉత్తమ ప్రమాణములు, ఉన్నత లక్ష్యములు ఉద్ధరించాలనే సంకల్పముతో చేసిన సదసద్ వివేచన గానే సహృదయ పాఠకులు, రచయితలు స్వీకరింతురని మా నమ్మకము. ఆధునికాంధ్ర సాహిత్య స్రవంతి నిర్గమించుచున్న నిసర్గ స్వరూపము అత్యంత స్పుటముగా పరిచయము చేయుటయే ఈ సమాలోచనలో మా సంకల్పము. ఆ సంకల్పము నెరవేరినచో ఈ సింహావలోకనము సార్థకమైనట్లే!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here