‘19వ శతాబ్దిలో తెలుగు కవిత్వంలో నవ్యత’ – సిద్ధాంత గ్రంథం-11

2
11

[డా. ఆచార్య ఫణీంద్ర గారు పిహెచ్‍డి పట్టా కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖకి సమర్పించిన సిద్ధాంత వ్యాసాన్ని సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము.]

~

XI. ముగింపు

[dropcap]13[/dropcap] ఫిబ్రవరి 1943నాడు తెనాలిలో జరిగిన తొలి ‘ఆంధ్ర అభ్యుదయ రచయితల మహాసభ’లో అధ్యక్షోపన్యాసం చేస్తూ, తాపీ ధర్మారావు ఇలా అన్నారు.

“ఏ దేశంలోనయినా, ఏ కాలంలోనయినా రచయితలు చేయవలసిన పని చాలా ఉంటుంది.

  1. గతించిన విషయాలను బోధించాలి – నిర్దాక్షిణ్యంగా
  2. ప్రస్తుతాన్ని అర్థం చేసుకోవాలి – నిష్పక్షపాతంగా
  3. భావికి కాగడా పట్టి దారి చూపాలి – నిరాటంకంగా”

19వ శతాబ్ది తెలుగు కవులు ఈ మూడు పనులు చేయడంలో ఏ దేశ రచయితల కన్న, ఏ కాలం రచయితల కన్న తక్కువేం చేయలేదు. ఇంకా ఎక్కువే చేసారు. ఎందుకంటే తెలుగు దేశంలో 19వ శతాబ్దిలో ఏర్పడిన పరిస్థితులు, ఏ దేశ చరిత్రలోనైనా ఎప్పుడో ఒకప్పుడే ఏర్పడుతాయి. బ్రిటన్‍లో అవి 18వ శతాబ్దిలో ఏర్పడి ఉంటాయి. భారతదేశంలో 19వ శతాబ్దిలో ఏర్పడ్డాయి. అంతే కాని, అన్ని దేశాలలో, అన్ని కాలాలాలో, గతానికి వర్తమానానికి మధ్య పెను మార్పులేం సంభవించవు. గతానికి, వర్తమానానికి మధ్య పెద్ద వ్యత్యాసం ఏమీ ఉండదు – కొద్ది కొద్ది చిన్న మార్పులు తప్ప. కానీ 19వ శతాబ్దిలో తెలుగు దేశంలో పెను మార్పులు సంభవించాయి. గతానికి, వర్తమానానికి మధ్య భూమ్యాకాశాల తేడా ఏర్పడింది. అందుకే మన తెలుగు కవులు ఆ శతాబ్దిలో గతించిన విషయాలను బోధించారు. వర్తమానాన్ని అర్థం చేసుకొన్నారు. భావికి కాగడా పట్టారు. చాలా మంది కవులు మన పురాణాలు, మన ప్రాచీన సంస్కృతి, మన సంప్రదాయాచారాలను బోధించే కావ్యాలను రచిస్తే రచించి ఉండవచ్చు.

“పతి పరకాంతలతో సం

గతి జేసిన, నాదు పుణ్యగతి యిట్లనుచున్ –

మతి దలప వలయు; లేదా

బతిమాలగ వలయు – గలహ పడకు కుమారీ!

~

పెనిమిటి కన్న బతివ్రత

మునుపే మృతి బొందెనేని బురుషాగమనం

బున కెదురు చూచు; వచ్చిన

గనుగొని యనురాగ మెనయ గలయు గుమారీ!”

వంటి భావాలతో ఫక్కి వెంకట నరసయ్య వంటి కవి ‘కుమారీ శతకా’న్ని రచించి ఉండవచ్చు. కాని గతంలో ఒప్పుగా అనిపించి, తరువాత తప్పులుగా కనిపించిన విషయాలను గురించి చైతన్యం కలిగించేలా బోధించిన కవులు కూడా 19వ శతాబ్దిలో లేకపోలేదు. ఆచంట సాంఖ్యాయన శర్మ స్త్రీల ప్రకృతి ధర్మాన్ని ఇక పురుషులు పాటించాలని వ్యంగ్యంగా పలికి, స్త్రీ పురుషుల సమానత్వాన్ని ప్రబోధించినా; కందుకూరి వీరేశలింగం పంతులు మితిమీరిన శృంగార వర్ణనలతో, చిత్ర కవిత్వాలతో దిగజారుతున్న ప్రబంధ సాహిత్యం గురించి హాస్య వ్యంగ్యాలను జోడించి కనువిప్పు కలుగజేసే రచనలు చేసినా; దాసు శ్రీరాములు కవి కన్యాశుల్కం దురాచారాన్ని నిరసిస్తూ పద్యాలు చెప్పినా; కట్టమంచి రామలింగారెడ్డి సమాజం కోసం ఒక గ్రామీణ యువతి త్యాగాన్ని ఆదర్శంగా తీసుకోవాలని తెలియజెప్తూ, మరో వైపు మూఢాచారాలకు గ్రామీణులు ఎలా బలి అవుతున్నారో వివరించినా – ఇలా ఎంతో మంది తెలుగు కవులు ఎన్నో రకాలుగా 19వ శతాబ్దిలో గతించిన విషయాలలోని దుర్నీతిని ఎత్తి చూపి నిర్దాక్షిణ్యంగా బోధించిన వారే!

అలాగే, మతుకుమల్లి నృసింహ శాస్త్రి కవి మద్రాసు నగరంలోని సాంకేతిక ప్రగతిని ముఖ్యంగా రైలుబండిని, పొగ ఓడను, తంతి – తపాల వ్యవస్థను వర్ణించినా; రాయభట్ట వీర రాఘవ కవి గాలివాన ఉధృతిని, దాని వలన కలిగిన నష్టాన్ని వివరించినా, సాంఖ్యాయన శర్మ దాదాభాయి నౌరోజీ వ్యక్తిత్వాన్ని, ఆశయాలను అధ్యయనం చేసినా; వావిలాల వాసుదేవశాస్త్రి, వడ్డాది సుబ్బారాయకవి ప్రభృతులు ఆంగ్ల సాహిత్యాన్ని, ఆంగ్లేయ రాజకీయ వ్యవస్థను గురించి తెలుగు వారికి తెలియజెప్పినా – అదంతా ఆనాటి వర్తమానాన్ని నిష్పక్షపాతంగా అర్థం చేసుకోవడమే!

ఇంకా, శిష్టు కృష్ణమూర్తి గేయ ఛందస్సులను పరిచయం చేసినా; శొంఠి భద్రాద్రి రామశాస్త్రి, ఆది భట్టనారాయణ దాసులు కృత్యాద్యవస్థలను, సంప్రదాయ కావ్య ప్రారంభ పద్ధతులను విసర్జించినా; పన్నాల సీతారామబ్రహ్మ శాస్త్రి, బుద్ధిరాజు ఈశ్వరప్ప పంతులు తదితరులు కావ్య వస్తువులలో అల్పం, అనల్పమని లేవని, కాదేదీ కవిత నర్హమని చాటినా, వారణాశి అచ్యుత రామయ్య పురాణ కథ ఆలంబనగా పరమత సహనాన్ని ప్రబోధించినా, కందుకూరి వారు ‘యాంటీనాచ్’ ప్రబోధాన్ని అందించినా – అదంతా నిరాటంకంగా భావికి కాగడా పట్టి మార్గదర్శనం చేయడమే!

ఆచార్య సి. నారాయణ రెడ్డి ఆధునికాంధ్ర కవిత్వ లక్షణాలను ఈ క్రింది విధంగా పేర్కొన్నారు.

  1. ఖండ కావ్య ప్రక్రియ
  2. ఆత్మాశ్రయ రీతి
  3. వస్తు నవ్యత
  4. భావ నవ్యత
  5. శైలీ నవ్యత
  6. పద ప్రయోగం
  7. దేశి కవిత
  8. ప్రక్రియా బాహుళ్యం

19వ శతాబ్దిలో ఈ లక్షణాలన్నిటికీ ఎలా బీజాలు పడ్డాయో ఇప్పుడు పరిశీలిద్దాం –

1. ఖండ కావ్య ప్రక్రియ:

‘రవి వర్మ చిత్రాలు’, దాదాభాయి నౌరోజీ వంటి జాతీయవాది మొదలైన నవ్యాంశాలపై తొలి ఖండ కావ్యాలను ఆచంట సాంఖ్యాయన శర్మ రచించింది 19వ శతాబ్దిలోనే. ‘మాతృస్వరూప స్మృతి’ పేరుతో ఆంగ్ల భాషలోని ఖండకావ్యాన్ని తొలిసారిగా తెలుగులోనికి వావిలాల వాసుదేవశాస్త్రి అనువదించింది కూడా 19వ శతాబ్దిలోనే. అలాగే వినయము, ఐకమత్యము, దాతృత్వము మొదలైన నీతి విషయాలపై తొలిసారి పద్య ఖండికలను రచించి, ‘శ్రీ సూక్తి వసు ప్రకాశకము’ పేర వడ్డాది సుబ్బారాయ కవి సంకలనం చేసింది కూడా 19వ శతాబ్దిలోనే.

2. ఆత్మాశ్రయ రీతి:

వడ్డాది సుబ్బారాయ కవి ‘గోదావరి ధూమ నౌకా విహారము’, ‘గౌతమి మహాజల మహిమాను వర్ణనము’ అన్న రెండు చాటు ప్రబంధాలను ఆత్మాశ్రయ రీతిలో రచించింది తొలిసారిగా 19వ శతాబ్దిలోనే సుమా!

3. వస్తు నవ్యత:

బుద్ధిరాజు ఈశ్వరప్ప పంతులు, పన్నాల సీతారామబ్రహ్మ శాస్త్రి, సామినేని వేంకటాద్రి ప్రభృతులు తొలిసారిగా సర్వసాధారణమైన వస్తువులపై కావ్యాలల్లింది 19వ శతాబ్దిలోనే. మతుకుమల్లి సోదర కవులు తొలిసారిగా ఆధునిక నగరాలైన మద్రాసు నగరంపై, మచిలీ బందరుపై, ఇంకా ఆ నగరాల్లోని నవీన నాగరికత, సంస్కృతులపై నవ్యకావ్యాలను అల్లింది 19వ శతాబ్దిలోనే. మండపాక వారి ‘సోషియో ఫాంటసీ’ – ‘రాధాకృష్ణ సంవాదము’ వెలువడింది 19వ శతాబ్దిలోనే. అపురూపమైన కల్పనలతో శొంఠి భద్రాద్రి రామశాస్త్రి ‘చిత్రసీమ’, ఆదిభట్ట నారాయణ దాసు ‘బాటసారి’ కృతులు వెలువడింది 19వ శతాబ్దిలోనే. తుఫానులపై, ధూమ నౌకా ప్రయాణాలపై తొలిసారిగా కావ్యాలు వెలువడింది 19వ శతాబ్దిలోనే. తొలిసారిగా తెలుగు కవుల ఆలోచనా పరిధి భారతదేశాన్ని దాటి, అంతర్జాతీయ స్థాయిలో పెంపొంది, బ్రిటిష్ మహారాణిపై కావ్యాలు, ప్రశంసా పద్యాలు, అనేక పాశ్చాత్య గ్రంథాలకు అనువాదాలు వెలువడింది ఆ శతాబ్దిలోనే కదా!

4. భావ నవ్యత:

మతుకుమల్లి నరసింహ శాస్త్రి ‘ఎలక్ట్రిక్ షాక్’ ను వర్ణిస్తూ, కోటి కందిరీగలు కరచినట్టు, వేయి మండ్రగబ్బలు కలసి ఒక్కసారి కుట్టినట్టు ఉంటుందని నవ్యోపమానాలతో నవ్య విషయాన్ని చెప్పడం, అంతే కాకుండా మోచేతికి దెబ్బ తాకినట్టు ఉంటుందని స్వభావోక్తిలో వివరించడం – భావ నవ్యతే కదా! తొలిసారిగా తెలుగులో స్మృతి కావ్యాన్ని వెలయించిన వడ్డాది సుబ్బారాయకవి, పరమపదించిన తన సతిని గురించి తలపోస్తూ – “ఒక నాడు ఒక తొండ చూలాలు నేల త్రవ్వి, పల్లంలో కుప్ప వోసినట్లు గ్రుడ్లు పెట్టాక, కడుపుతోలు వ్రేలాడుతుంటే, కాన్పు బడలికతో సొమ్మసిలి పడి ఉండగా, ఎక్కడి నుండో ఒక కాకి ఎగిరి వచ్చి దానిని ముక్కున కరచుకొని వెళ్ళిపోతే, చూచి కంట తడిపెట్టిన తన భార్యను, నేడు మృత్యువట్లే ఎత్తుక పోయిం”దని విలపించడం ఎంత నవ్య భావన. ఎంత హృదయ విదారకమైన వర్ణన. మరోవైపు కందుకూరి వీరేశలింగం పంతులు ‘పత్నీ వ్రత బోధిని’ అంటూ కడుపుబ్బ నవ్వించే పద్యాలు రచించారు. కుష్టు రోగం ఉన్నదైనా, గ్రుడ్డిదైనా, ముసలిదైనా, క్రమం తప్పకుండా భార్య ఎంగిలి తిన్న పురుషునికి పుణ్య లోకాలు సంప్రాప్తిస్తాయని; పురుషుడు, గాడిదలాగే అప్పుడప్పుడు భార్య చేత దండింప బడకపోతే చెడిపోతాడని; పురుషుడు ప్రతిరోజు తన భార్యకు పాదపూజ చేసి ఆ శ్రీపాద తీర్థాన్ని సేవించాలని, ఆయన వ్యంగ్యంతో కలగలపి చిప్పిల్లిన హాస్యం కూడా భావనవ్యతను మొలక లెత్తించింది. కోటప్ప కొండ జాతరలో కొండపైన ప్రభలకు కట్టిన అద్దాలను పైనున్న భక్తులు చూసి, ఇక్కడ ఇంకా చాలా జాతరలు జరుగుతున్నాయని, కొండ క్రింద ఉన్న ప్రభలకు కట్టిన అద్దాలను క్రింద ఉన్న భక్తులు చూసి, తమను అనుగ్రహించడానికి పైనున్న దేవుడు గుడితో సహా క్రిందికి దిగాడని భావించారని వర్ణించడం కొప్పరాజు నరసింహ కవి ఆధునిక భావ శబలతకు నిదర్శనమే! ఇంకా, జయంతి భావనారాయణ కవి ‘లాలు జెండాలు’ అని నవ్యాతి నవ్యమైన ఉపమానాన్ని ప్రయోగించడం నిరుపమానం. ఇలాంటి విషయాలెన్నో ఈ సిద్ధాంత రచనలో పలుచోట్ల ఉదాహరించడం జరిగింది. మరి ఇవన్నీ వచ్చింది. 19వ శతాబ్దిలోనే కదా!

5. శైలీ నవ్యత:

తరిగొండ వేంకమాంబ ఎరుకలసాని చెప్పే సోదెను, అదే జాతి వ్యవహార భాషలో సహజంగా రచించడం; వద్దిపర్తి కోనమరాజు జమాబంది వ్యవహారాల గురించి, ఆ వృత్తి పరమైన పరిభాషలోనే వర్ణించడం; దాసు శ్రీరాములు వివిధ శాఖలకు చెందిన బ్రాహ్మణుల నిత్యవ్యవహార భాషలను, ముఖ్యంగా మధ్వల, వైష్ణవుల మతపరమైన పరిభాషలను కావ్యంలో ప్రయోగించడం – ఇవన్నీ 19వ శతాబ్దిలో వికసించిన శైలీ పరమైన నవ్యతలో భాగమే మరి!

6. పద ప్రయోగం:

‘రంగ రాయ చరిత్రము’లో దిట్టకవి నారాయణ కవి, ‘విజయ రామ యశో భూషణము’ లో చట్రాతి లక్ష్మీ నరసు అనేక ఉరుదూ, పారశీక పదాలతో బాటు ఫ్రెంచి భాషా వికృత శబ్దాలను ప్రయోగించడం; ‘చెన్నపురీ విలాసము’ లో, ఇంకా ఇతర కావ్యాలలో అనేకమైన ఆంగ్ల శబ్దాలను తెలుగు కావ్యాలలో ప్రయోగించడం, ఇంకా అనేక కావ్యాలలో పలు రకాల పారిభాషిక పదబంధాలను ప్రయోగించడం 19వ శతాబ్ది తెలుగు కవిత్వంలోని పద ప్రయోగ నవ్యత.

7. దేశి కవిత:

తొలి పద్య నాటకమైన ‘సీజరు చరిత్రము’ తేటగీతుల మాలికలో వెలువడటం, వీరేశలింగం పంతులుచే అనువదించబడిన ‘జాన్ గిల్ఫిన్’ ద్విపద ఛందస్సులో వెలువడటం, ఇంకా అంతకుముందే రేవణూరి వేంకటార్యుడు ‘ముత్యాల సరం’కు మాతృక అయిన ‘తురంగ వృత్తా’న్ని ప్రయోగించటం, శిష్టు కృష్ణమూర్తి మరియు మండ కామశాస్త్రి ‘ఆంధ్ర తులసీ రామాయణము’లో నవ్య గేయ గతులలో పద్యాలను వ్రాయటం, కొక్కొండ వేంకట రత్న శర్మ ‘బిల్వేశ్వరీయము’లో ‘సీసం’ వంటి దేశికవితల లాగే ‘బంగారము’, ‘వెండి’ వంటి కొత్త ఛందస్సులను సృజించటం, ఇంకా ఈ కావ్యంలో పెళ్ళిపాటలు, తొట్ల పాటల వంటి గీతాలను లిఖించటం – ఇదంతా ఆయా కవులు 19వ శతాబ్దిలో దేశికవితకు పెద్ద పీట వేయడమే!

8. ప్రక్రియా బాహుళ్యం:

తొలి పద్య నాటకం, తొలి ఏకాంకిక, తొలి ఖండ కావ్యం, తొలి గేయ కావ్యం, తొలి వ్యంగ్య కావ్యం, తొలి స్మృతి కావ్యం, తొలి జీవిత చరిత్ర, తొలి స్వీయ చరిత్ర, తొలి యాత్రా చరిత్ర – ఇలా ఆధునిక తెలుగు కవిత్వానికి సంబంధించిన అనేక ప్రక్రియలు తొలిసారిగా వెలువడింది. 19వ శతాబ్దిలోనే! ఈ విషయం ‘19వ శతాబ్ది తెలుగు కవిత్వంలో ప్రక్రియా పరమైన నవ్యత’ అన్న అధ్యాయంలో సవిస్తరంగా వివరించబడింది.

ఇలా నవ్య కవిత్వ లక్షణాలుగా పండితులు భావించిన 8 అంశాలలోనూ తొలిసారి బీజాలు నాటింది, 19వ శతాబ్దిలోనే అని రూఢి అయింది. అలాంటప్పుడు ఇంకా 19వ శతాబ్దిని క్షీణయుగంగా ఎలా భావించగలం? వ్యవస్థీకృతమయిన 20వ శతాబ్ది నవ్య కవిత్వ మహా వృక్షానికి బీజావాపనం జరిగింది 19వ శతాబ్దిలోనే! ఇది సత్యం!!

ఇక, 19వ శతాబ్ది తెలుగు కవిత్వంలోని ఈ నవ్యత ప్రభావం 20వ శతాబ్ది తెలుగు కవిత్వంపై ఎలా ప్రసరించిందో రేఖా మాత్రంగానైనా పరిశీలిద్దాం –

అంతకన్న ముందు, అసలు 20వ శతాబ్దిలో ఆరంభమైన ‘నవ్య యుగం’ అనగానే, మదిలో మెదిలే అంశాలేమిటో చూద్దాం –

  1. ముత్యాల సరం, ఇతర గేయ ఛందస్సులు
  2. ఖండకావ్యాలు
  3. ‘కాదేది కవిత కనర్హం!’ అన్న శ్రీశ్రీ ప్రబోధం
  4. ప్రక్రియా వైవిధ్యం
  5. సామాజిక దృష్టి – సంఘ సంస్కరణం
  6. అన్య భాషా, అన్య మత ప్రభావ సాహిత్యం

రేవణూరి వేంకటార్యుని తురంగ వృత్తమే ముత్యాల సరంగా రూపుదిద్దుకొన్న విషయం విదితమే. అలాగే శిష్టు కృష్ణమూర్తి ‘ఆంధ్ర తులసీ రామాయణం’లో హిందీ భాషా సంబంధ గేయ గతుల ఛందస్సులను ప్రయోగించిన ప్రభావంతో అనేక ఆధునిక కవులు సంప్రదాయ ఛందస్సులను విడనాడి వివిధ రకాల గేయ గతుల ఛందస్సులలో రచనలు చేసారు. ముఖ్యంగా శ్రీశ్రీ, ఆరుద్ర, సినారె వంటి కవులు ఇలాంటి రచనలు కోకొల్లలుగా అందించారు. శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’, ఆరుద్ర ‘కూనలమ్మ పదాలు’, సినారె ‘కర్పూర వసంత రాయలు’, ‘నాగార్జున సాగరము’ మొదలైనవి కొన్ని ఉదాహరణలు మాత్రమే! ఇటీవలి కాలంలో ఉరుదూ భాష నుండి రుబాయీలు, గజళ్ళు, జపనీస్ భాష నుండి హైకూ వంటి ఛందస్సులు తెలుగు సాహిత్యంలో ప్రవేశించడానికి ‘ఆంధ్ర తులసీ రామాయణమే’ నాందిగా నిలిచిందని చెప్పవచ్చు అంతే కాకుండా, 20వ శతాబ్దిలో దేవులపల్లి కృష్ణశాస్త్రి వంటి చాలా మంది భావ కవులు తమ ‘కృష్ణ పక్షం’ వంటి అనేక కావ్యాలలో విరివిగా మాలికల రూపంలో తేట గీతి ఛందస్సు వినియోగించడానికి కూడా వావిలాల వాసుదేవ శాస్త్రి వేసిన బాటే కారణమని భావించవచ్చు. ఆధునిక కవితకు తేటగీతి ఛందస్సు అనుకూలమైనదని ముందుగా గుర్తించి, ‘సీజరు చరిత్రము’, ‘నందక రాజ్యము’ వంటి తొలి తరం పద్య నాటకాల ద్వారా ఆయన మార్గదర్శనం చేసిన సంగతి విదితమే!

20వ శతాబ్దిలో వెలువడిన, 21వ శతాబ్దిలో ఈనాటికీ వెలువడుతున్న పద్య, గేయ, వచన కవితా ఖండ కావ్యాలకు ఆచంట సాంఖ్యాయన శర్మ రచించిన ‘ఆంధ్ర పద్యావళి’ స్ఫూర్తిగా నిల్చిందని చెప్పవచ్చు. ఒక కవితా సంకలనంగా కూడా ఇది 20వ శతాబ్దిలో పుంఖానుపుంఖాలుగా వెలువడిన కవితా సంకలనాలకు మార్గదర్శిగా నిలిచింది.

20వ శతాబ్ది నవ్య కవిత్వానికి గురజాడ వారి ‘పూర్ణమ్మ’ ఖండ కావ్యం ఒక దిక్సూచిగా భావిస్తారు. దీనికి చాలా విశిష్టతలున్నాయి 1) నాయికా ప్రధాన కావ్యం, 2) విషాదాంత కావ్యం, 3) సామాజిక మూఢాచారానికి బలి అయినట్లు చూపడం వల్ల ఆ మూఢాచారం పట్ల పాఠకులలో వ్యతిరేక భావాన్ని నెలకొల్పడం – వంటివి ప్రధానంగా చెప్పవచ్చు. అయితే కట్టమంచి రామలింగారెడ్డి అంతకుముందే, 19వ శతాబ్దిలోనే రచించిన ‘ముసలమ్మ మరణం’ కావ్యంలో కూడా ఈ మూడు విలక్షణ లక్షణాలుండడం విశేషం. పైగా రెండు కావ్యాలలో కూడా నాయిక నీళ్ళలో దూకి ఆత్మార్పణం చేసుకోడం కావ్య నిర్మాణంలోని పోలికను చూపుతోంది. దీనిని బట్టి గురజాడ వారి పూర్ణమ్మపై రామలింగారెడ్డి గారి ‘ముసలమ్మ’ ప్రభావం ఉందని చెప్పక తప్పదు. అంతేకాదు రాయప్రోలు వారి ‘స్నేహలత’ పై కూడా ఈ ప్రభావం కొంతైనా ఉందని సహేతుకంగా నిరూపించవచ్చు.

“కాదేది కవిత కనర్హం!” – దీనిని ఇప్పటికీ శ్రీశ్రీ స్వీయ ప్రవచనం గానే ఆధునికులు భావిస్తున్నారు. కాని 19వ శతాబ్దిలోనే వచ్చిన ‘పూచి పుల్ల శతకం’ ఈ భావనతో వచ్చిన తొలి కావ్యమన్న విషయం సహృదయులు విస్మరిచకూడదు. అలాగే బుద్ధిరాజు ఈశ్వరప్ప పంతులు రచించిన ‘అట్టు కథ’ తినుబండారంపై వచ్చిన తొలి కవిత. ఆ తరువాత ఆ స్ఫూర్తితో ‘పకోడి’పై, ‘టీ’, ‘కాఫీ’లపై, ‘వంకాయ’ కూరపై ఇలా ఎన్నో రచనలు 20వ శతాబ్దిలో వచ్చాయి. ముఖ్యంగా చిలకమర్తి వారు రచించిన ‘పకోడి’ పద్యాలు బహుళ ప్రసిద్ధి నొందాయి. మచ్చుకి రెండు పద్యాలను ఉదాహరిస్తాను.

“ఆ కమ్మదనము; నా రుచి,

యా కరకర, యా ఘుమ ఘుమ యా పొరకములా

రాకలు, పోకలు, వడుపులు

నీకేదగు – నెందు లేవు – నిజము పకోడి!

~

కోడిని దినుటకు సెలవున్

వేడిరి మును బ్రాహ్మణులది వేదన తోడున్

కోడి వలదా బదులుగ ప

కోడిం దినుమనుచు జెప్పె కూర్మి పకోడీ!”

ఇలా అల్ప వస్తువులపై 20వ శతాబ్దిలో అనేక ఖండ కావ్యాలు రచించిన కవి జాషువా. ఆయన ‘గిజిగాడు’, ‘సాలీడు’ వంటివి అందుకు ఉదాహరణలు. కరుణశ్రీ జంధ్యాల పాపయ శాస్త్రి ‘పుష్ప విలాపం’, ‘పాకీ పిల్ల’, శ్రీశ్రీ ‘భిక్షుకి’, దాశరథి ‘ఓసి కూలిదాన!” వంటి కవితలు ఇలా సర్వ సాధారణ, హీన, దీన వస్తువులపై రచించినవే!

“విసిరేసిన ఖాళీ సీసా!

ఉసూరు మనకు

పగుల గొట్టుకో నీ ముఖాన్ని

పొడుచుకొస్తాయి పదునైన బాకులు”

వంటి ఆధునిక కవితల్లో సి. నారాయణ రెడ్డి వంటి మహాకవులు సాధారణ వస్తువుల నుండి అసాధారణమైన, ఉదాత్తమైన భావాలను మొలకెత్తించారు. అయితే ఇవన్నీ 19వ శతాబ్దిలో చీపురు పుల్లపై, పొగాకుపై, ముక్కు పొడుంపై పద్యాలు వచ్చాక, ప్రాణం పోసుకొన్నవే!

19వ శతాబ్దిలో తొలియాత్రా కావ్యాలను రచించిన మతుకుమల్లి సోదర కవుల వలెనే 20వ శతాబ్దిలో డా. దాశరథి, సినారె, బాపురెడ్డి, ఎన్. గోపి వంటి సత్కవులు తమ విదేశీయాత్రలపై కవితలను రచించారు. డా. దాశరథి అమెరికాలో నిర్వహించిన తెలుగు సభలలో పాల్గొన్నప్పుడు వ్రాసుకొన్న ఈ పద్యాన్ని గమనించండి.

“డెట్రాయిట్ ప్రాంతములో

చట్రాయికికూడ తెలుగు సభలని తెలియున్ –

తొట్రు పడనేల? కలమూ,

గట్రా చేకొని కదలుము కవితలు వ్రాయన్!

ప్రాసతో చమత్కార భరితంగా సాగిన పద్యం ఇది.

20వ శతాబ్దిలో పరిఢీవిల్లిన ప్రక్రియల్లో నూటికి తొంబై శాతం ప్రక్రియలు 19వ శతాబ్దిలోనే పురుడు పోసుకొన్నాయని చెప్పడం చర్విత చర్వణమే అవుతుంది. అయితే 19వ శతాబ్దిలో కనిపించక 20వ శతాబ్దిలోనే తొలుత ఉద్భవించిన ప్రక్రియ ‘వచన కవిత’ అని అంగీకరించక తప్పదు. 19వ శతాబ్దిలో కవిత్వమంటే పద్యమో, గేయమో – అంతే. ‘వచన కవిత’ 20వ శతాబ్ది నవ్యయుగ కవితా సామ్రాజ్యంపై ఎగురవేసిన జెండా. అయితే ముక్తచ్ఛంద కవిత్వ సృజనకు బాట వేసింది – 19వ శతాబ్దిలో రేవణూరి వేంకటార్యుడు, శిష్టు కృష్ణమూర్తి, మండకామశాస్త్రి, కొక్కొండ వేంకట రత్న శర్మ వంటి కవులు సంప్రదాయ ఛందస్సుల నుండి కొంత స్వేచ్ఛ కోరి గేయ గతులపై మొగ్గు చూపడమేనన్నది గమనార్హం.

ఆచంట సాంఖ్యాయన శర్మ, కందుకూరి వీరేశలింగం పురుషులపై దెప్పి పొడుపుల కవితలతో చేసిన స్త్రీ పురుష సమానత్వ ప్రబోధం నాందీ వాక్యమై 20వ శతాబ్దిలో మానవతా వాదం, సామ్యవాదం వంటి అంశాలతో నవ్య కవిత్వం వెలువడడానికి దారి తీసిందని భావించవచ్చు. తరువాతి కాలంలో ఇదే స్త్రీ వాద, దళిత వాద కవిత్వ శాఖలుగా కూడా విస్తరించింది. అలాగే శ్రీరాములు కవి చేసిన కన్యాశుల్క దురాచార నిరసన మినుకు మినుకుమనే దీపంలా వెలిగినా, తరువాతి కాలంలో అదే ప్రచండ జ్యోతిలా మారి, 20వ శతాబ్దిలో వరకట్నం, ఇతర సామాజిక దురాచారాలపై కవులు కాస్త ఘాటుగానే ఉద్యమించే స్ఫూర్తి నిచ్చింది. సాంఖ్యాయన శర్మ దాదాభాయి నౌరోజీపై వ్రాసిన ఖండకావ్యం, 20వ శతాబ్దిలో తుమ్మలపల్లి సీతారామమూర్తి చౌదరి రచించిన ‘గాంధీ తారావళి’, ఉండేల మాలకొండారెడ్డి రచించిన ‘నేతాజీ’ వంటి జాతీయ నాయకులపై వచ్చిన కావ్యాలకు మూల బీజంగా నిలిచిందని చెప్పవచ్చు.

అయితే సామాజిక దృష్టిలో 19వ శతాబ్ది నవ్య కవులకు, 20వ శతాబ్ది నవ్య కవులకు కొంత వ్యత్యాసం ఉంది. 19వ శతాబ్ది నవ్య కవులు బ్రిటిష్ పాలనకు అనుకూలంగా ఉండి విక్టోరియా రాణిని, ఇతర బ్రిటిష్ అధికారులను స్తుతించారు. కాని 20వ శతాబ్దిలో స్వాతంత్ర్యేచ్ఛరగిలి, బ్రిటిష్ వారిని, వారి పాలనను దుయ్యబడుతూ రచనలు వెలువడ్డాయి.

19వ శతాబ్దిలో కందుకూరి, వావిలాల వాసుదేవ శాస్త్రి ప్రభృతులు షేక్స్పియరు, ఆలివర్ గోల్డు స్మిత్ వంటి ఆంగ్ల కవుల రచనలను అనువాదం చేసి, తులసీ రామాయణాన్ని శిష్టు కృష్ణమూర్తి మండ కామశాస్త్రి అనువాదం చేసి, చూపిన బాటలో, 20వ శతాబ్దిలో అనేక కవులు ఆంగ్లం నుండి తెలుగులోకి, అలాగే దేశీయంగా బెంగాలీ, తమిళ, కన్నడ, ఉరుదూ భాషలలోని కావ్యాలను తెలుగులోకి విస్తృతంగా అనువదించారు. పారశీక భాషలోని ఉమర్ ఖయ్యాం కవితలను ఆదిభట్ట నారాయణదాసు, రాయప్రోలు సుబ్బారావు, దువ్వూరి రామిరెడ్డి, ముద్దు కృష్ణ తదితరులు రమణీయంగా అనువదించారు. అలాగే రవీంద్రనాథ్ టాగోరు రచించిన ‘గీతాంజలి’ అన్న నోబెలు బహుమతి గ్రహీత కృతిని గుడిపాటి వెంకటచలం, కొంగర జగ్గయ్య వంటి కవులు ఆంధ్రీకరించారు. డా. దాశరథి గాలిబు గీతాలను కమనీయంగా తెలుగుజేసి, రాష్ట్ర ప్రభుత్వం నుండి ఉత్తమ అనువాద బహుమతిని గెలుచుకొన్నారు. 19వ శతాబ్దిలో కొక్కొండ వారి కవిత తలిసారి ఆంగ్లంలోకి అనువదించబడిన విషయం విదితమే. 20వ శతాబ్దిలో అనేక తెలుగు రచనలు దేశీయ భాషలలోనికే కాక విదేశీ భాషలలోనికి కూడా అనువదించబడ్డాయి. సంస్కృతం కాకుండా ఇంకా ఇతర భాషలతో ఈ అనువాద సంపర్కం తొలిసారి 19వ శతాబ్దిలో ప్రారంభమై, 20వ శతాబ్దిలో ఈ ఆదాన ప్రదానాలు విస్తృతం కావడం గమనించదగ్గ విషయం.

1970వ దశకంలో నగ్నముని ‘కొయ్య గుర్రం’ పేరిట దివిసీమ తుఫాను బీభత్సంపై ఒక్క చక్కని కావ్యాన్ని రచించారు. సుప్రసిద్ధ విమర్శకులు ఆచార్య చేకూరి రామారావు దానిని ఆధునిక మహాకావ్యంగా ప్రశంసించారు. అయితే ఇలాంటి ప్రకృతి వైపరీత్యంపై తొలిసారి ‘గాలివాన సీసమాలిక’ కృతిని రాయభట్ట వీర రాఘవ కవి 19వ శతాబ్దిలోనే రచించారన్న విషయాన్ని విస్మరించకూడదు. అలాగే 20వ శతాబ్దిలో చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి ‘జాతక చర్య’, గుర్రం జాషువ ‘నా కథ’ అన్న పేర్లతో పద్య కావ్యాలుగా తమ స్వీయ చరిత్రలను వెలయించారు. ఇంకా ఎందరో వచనంలో స్వీయ చరిత్రలను రచించారు. అయితే ఈ ప్రక్రియకు తెలుగులో నాందీ వాక్యం పలికింది మండపాక పార్వతీశ్వర శాస్త్రి. అదీ 19వ శతాబ్దిలోనే.

ఆంధ్ర క్రైస్తవ, కవి సార్వభౌమునిగా పేరొందిన పురుషోత్తమ చౌదరి తెలుగులో తొలి క్రైస్తవ కవి. 19వ శతాబ్దిలో క్రైస్తవ మత సబంధ కీర్తనలను, గేయ, పద్య కావ్యాలను రచించి, ఆ రకమైన సాహిత్యానికి వైతాళికునిగా నిలిచి, 20వ శతాబ్దిలో అనేకమైన క్రైస్తవ భక్తి గీతాలు, శతకాలు వెలువడేందుకు ఆయన దారి చూపారు. ఆయన ఇచ్చిన స్ఫూర్తితో జాషువా, జ్ఞానానంద కవి తదితరులు క్రీస్తు జీవితంపై కావ్యాలను రచించారు. జాషువా రచించిన ‘క్రీస్తు చరిత్రము’ కావ్య గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. చౌదరి కవి ఇచ్చి ప్రేరణలతో 20వ శతాబ్దిలో ఉమర్ – అలీషా, బూర్గుల రామకృష్ణరావు మున్నవారు ఇస్లాము సంబంధ రచనలను తెలుగులో అందించారు. ఇటీవలి కాలంలో మైనారిటీ వాదం పేరిట ఒక కొత్త కవిత్వ శాఖ ఏర్పడడం ఆనంద దాయకమైన విషయం. తెలుగులో అన్య మత సంబంధ కవిత్వ బీజాలను నాటిన 19వ శతాబ్ది కవి పురుషోత్తమ చౌధరి సదా స్మరణీయులు.

ఈ విధంగా 19వ శతాబ్ది తెలుగు కవిత్వంలోని నవ్యత 20వ శతాబ్ది తెలుగు కవిత్వంపై బలమైన ప్రభావాన్నే చూపింది.

ఇక 19వ శతాబ్ది కవులలో యుగకర్తగా ఎవరిని పేర్కొనాలన్నది పెద్ద సమస్యేం కాదు. 20వ శతాబ్దిలో లాగ, “గురజాడనా? రాయప్రోలా? లేక ఇరువురా?” అన్న తర్కం అవసరం లేదు. ఒక వైపు సంఘ సంస్కరణ దృష్టితో రచనలు చేసి, మరో వైపు ఆనాడు వస్తున్న సాహిత్యంలోని చెడు పోకడలను ఎత్తి చూపి, ఇంకోవైపు తెలుగు సాహిత్యంలో అనేకమైన నూత్న ప్రక్రియలను ప్రవేశ పెట్టి మన సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన కందుకూరి వీరేశలింగం పంతులుగారే 19వ శథాబ్ది యుగకర్త అనడానికి ఎట్టి సందేహం లేదు. (ఇక్కడ 19వ శతాబ్దిని ఒక యగం అనే యూనిట్గా భావిస్తే, ఆ యూనిట్‌కి కర్తగా ఈ ‘యుగకర్త’ అన్న శబ్దాన్ని భావించాలి.) ఆయనతో బాటు తొలి స్మృతి కావ్యాలు, తొలి పద్య నాటకాలను రచించిన వడ్డాది సుబ్బరాయకవి, వావిలాల వాసుదేవశాస్త్రి గార్లను ఆ శతాబ్ది వైతాళికులుగా పేర్కొనాలి. 19వ శతాబ్దిలో ఆ ముగ్గురిని ‘కవిత్రయం’ అని పిలచే వారట. వీరితో బాటు ఖండ కావ్య ప్రక్రియను ప్రవేశ పెట్టిన ఆచంట సాంఖ్యాయన శర్మ; తొలి స్వీయ చరిత్రను, ‘రాధాకృష్ణ సంవాదము’ వంటి సోషియో ఫాంటసీ కృతిని రచించిన మండపాక పార్వతీశ్వర శాస్త్రి; కొత్త ఛందస్సులను ప్రవేశ పెట్టిన శిష్టు కృష్ణమూర్తి, మండ కామశాస్త్రి, కొక్కొండ వేంకట రత్న శర్మ; ఆధునిక జన వ్యవహార శైలిని వివరించిన దాసు శ్రీరాములు; ఆధునిక నగరాన్ని, నవీన నాగరికతను కావ్య వస్తువుగా మలచిన మతుకుమల్లి నృసింహశాస్త్రి; తొలి విషాదాంత కావ్యాన్ని సృజించిన కట్టమంచి రామలింగారెడ్డి; కావ్య సంప్రదాయాలను మార్చి వేసిన శొంఠి భద్రాద్రి రామశాస్త్రి, ఆదిభట్ట నారాయణ దాసు, జమాబంది వ్యవహారాలను చూసే కరణాల కష్టాల గురించి, వారి పరిభాషలోనే కావ్యంగా మలిన వద్దిపర్తి కోనమరాజు, గిరిజన మహిళ వ్యవహార భాషను కావ్యంలో పొందుపరచిన తరిగొండ వెంకమాంబ, క్రైస్తవ మత సాహిత్యానికి రూప కల్పన చేసిన పురుషోత్తమ చౌధరి – ఇలా ఎందరో మహానుభావులు ఆ శతాబ్దిలోని వైతాళికులే!

క్షీణ యుగంగా నిరాదరణకు గురై, ఎన్నో కావ్యాలు ఈనాటికి అందుబాటులో లేకుండా మరుగున పడిపోయిన 19వ శతాబ్దిలో, దొరికి నంత మేర గ్రంథాలలో, దొరికినంత మేర సమాచారంలోనే ఇంత నవ్యత ప్రస్ఫుటమౌతుంటే, 20వ శతాబ్ది ప్రారంభంలోనే 19వ శతాబ్ది కవిత్వంపై సమగ్ర పరిశీలన జరిగి ఉంటే ఇంకెంత నవ్యత ప్రకటితమై ఉండేదో ఆలోచించవలసిన విషయం.

అసలు, 19వ శతాబ్దిని సాహిత్య చరిత్రలో క్షీణయుగంగా ప్రతిపాదించిన 20వ శతాబ్ది తొలితరం సాహితీవేత్తలు, పండితులు చర్విత చర్వణ రీతిలో వస్తున్న ప్రబంధాలను వేటితో పోల్చి, ఆ యుగాన్ని క్షీణ యుగంగా పేర్కొన్నారో గమనించాలి. రాయల వారి ప్రబంధయుగంలోని ప్రబంధాల నుండి చేమకూర వారి ‘విజయ విలాసము’ వరకు గల ప్రబంధాలతో పోల్చి. అంటే, ఒకవేళ ఆ క్షీణ ప్రబంధాల వెల్లువ లేకుండా ఉంటే, ఆ స్థానంలో వారు ఎటువంటి కావ్యాలు వెలువడి ఉండవలసిందని ఆకాంక్షించి ఉండేవారు? మళ్ళీ ప్రబంధయుగం నాటి ప్రామాణిక ప్రబంధాలనే సుమా! అంతే కాని ఈ సిద్ధాంత వ్యాసంలో ఇంత సవిస్తరంగా అధ్యయనం చేసిన నవ్య కావ్యాల వంటివి మాత్రం కావు. ఎందుకంటే వారికా దృష్టే ఉండి ఉంటే ఆ రోజుల్లో నవ్యదృష్టితో వెలువడిన అనేక నవ్య కావ్యాలను పరిశీలించి వాటిలోని నవ్యతను కూలంకషంగా అధ్యయనం చేసి ఆదరించి ఉండేవారు. వాటిలో నుండి ఎన్నో కావ్యాలు ఈనాడు మరుగున పడిపోకుండా కాపాడేవారు. కాని వారికా దృష్టి లేదనే చెప్పాలి. వారి చూపంతా వైభవోపేతమయిన ప్రాచీన సంప్రదాయ ప్రబంధ సాహిత్యం పైనే. అంతేకాని, అప్పుడప్పుడే ఉదయిస్తున్న నవ్య కవిత్వ సూర్యుని లేలేత కిరణాల పైన కాదు. అందుకే వారి దృష్టిలో 19వ శతాబ్ది క్షీణయుగం లేక అంధయుగంగా మిగిలింది.

ఇంతకు ముందు ఒక అధ్యాయంలో పేర్కొన్నట్టు 18వ శతాబ్ది అంతం వరకు కొనసాగిన నాయక రాజుల యుగానికి, 20వ శతాబ్దిలో వ్యవస్థీకృతమయిన నవ్య యుగానికి మధ్య 19వ శతాబ్ది ఒక ద్వార బంధం లాంటిది. 20వ శతాబ్దిలో తొలితరం పండితులు 19వ శతాబ్దిలో వెలువడిన ఒకటి, రెండు నవ్య కావ్యాలను గుర్తించినా, వారి దర్శనం ద్వార బంధానికి అటువైపు నుండి చేసిందే. కాని, ఈ సిద్ధాంత రచన 20వ శతాబ్ది నవ్యయుగ మహా వృక్ష ఫలాలను పూర్తిగా రుచి చూసి, ద్వార బంధానికి ఇటు వైపు నుండి చేసిన దర్శనం.

ఇంతకు ముందే వివరించినట్టు సాహిత్య చరిత్రను యుగాలుగా విభజించి చెప్పే కన్న, శతాబ్దుల వారీగా చెప్పడం వల్ల చాలా లాభాలున్నాయి. ఒక వేళ అలా కాదు, కూడదని, యుగ విభజన తప్పనిసరి అని ఎవరైనా భావిస్తే, 19వ శతాబ్దిని క్షీణయుగంగా మాత్రం పేర్కొన వద్దని నా మనవి. దానికి ‘ఉషోదయ యుగం’గా నామకరణం చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని నా అభ్యర్థన. తెలుగు కవులకు, పండితులకు, విమర్శకులకు, సాహితీ ప్రియులకు ఆ పునర్నామకరణ మహోత్సవానికి ఆహ్వానం పలుకుతూ, ఈ సిద్ధాంత రచనను ముగిస్తున్నాను.

(సమాప్తం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here