‘19వ శతాబ్దిలో తెలుగు కవిత్వంలో నవ్యత’ – సిద్ధాంత గ్రంథం – సంగ్రహం

1
11

[డా. ఆచార్య ఫణీంద్ర గారు పిహెచ్‍డి పట్టా కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖకి సమర్పించిన సిద్ధాంత వ్యాసాన్ని సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము.]

~

19వ శతాబ్దిలో తెలుగు కవిత్వంలో నవ్యత – సంగ్రహం (Abstract):

[dropcap]‘పం[/dropcap]దొమ్మిదవ శతాబ్దిలో తెలుగు కవిత్వంలో నవ్యత’ – ఈ శీర్షిక చూడగానే ఇంతవరకు తెలుగు సాహిత్య చరిత్రను అధ్యయనం చేసిన వారు చాలా మంది కనుబొమలు ముడివేయకపోరు. “పందొమ్మిదవ శతాబ్ది క్షీణ యుగమని, ఇరువయ్యో శతాబ్దిలోగాని నవ్య కవిత్వం అంకురించలేదని, అంధకారం ఆవరించి యున్న 19వ శతాబ్దిలో నవ్యత ఎక్కడిది?” అని సందేహాన్ని వెలిబుచ్చకపోరు.

అయితే ఇది 19వ శతాబ్ది తెలుగు కవిత్వానికి జరిగిన అన్యాయమని, నిజంగా 19వ శతాబ్దిలో వెలువడిన కావ్యాలను కూలంకషంగా అధ్యయనం చేస్తే, వాటిలోని నవ్యతా పరిమళాలను ఆస్వాదించగలిగితే ఈ అభిప్రాయాన్ని మార్చుకోకతప్పదని తెలియజెప్పే సిద్ధాంత వ్యాసం ఇది.

11 అధ్యాయాలుగా రూపొందించబడిన ఈ సిద్ధాంత వ్యాసంలో 19వ శతాబ్ది తెలుగు కవిత్వంపై నెలకొన్న ఈ అపప్రథకు కారణాలను అన్వేషిస్తూ, అసలు ‘కవిత్వం’, ‘నవ్యత’ అంటే ఏమిటో మూలాలను విశ్లేషిస్తూ, తెలుగు కవిత్వ యుగ విభజనలో 19వ శతాబ్ది స్థానాన్ని నిర్ధారిస్తూ, ఆ శతాబ్దిలోని సామాజిక రాజకీయ పరిస్థితులను వివరిస్తూ, ఆపైన 19వ శతాబ్ది తెలుగు కావ్యాలలో నెలకొని ఉన్న వివిధ రకాల నవ్యతలను గూర్చి విపులంగా చర్చించడం జరిగింది.

మొదటి అధ్యాయం – ‘ప్రవేశిక’లో, 20వ శతాబ్ది నవ్య కవిత్వం ఆ శతాబ్దిలో ఒక్క సారి ఊడిపడలేదని; పూర్ణ గర్భం దాల్చకుండా, పురిటి నొప్పులు లేకుండా పుత్ర జననం ఎలా అసాధ్యమో, ఇదీ అలా అసాధ్యమని తెలియజెప్పడం జరిగింది. 20వ శతాబ్దిలో వైభవాన్ని సంతరించుకొన్న నవ్య కవిత్వానికి సంబంధించిన బీజాలు 19వ శతాబ్దిలోనే పడ్డాయని సూచించబడింది. అంతే కాకుండా, 19వ శతాబ్ది తెలుగు కవిత్వంపై ‘అంధయుగం’, ‘క్షీణ యుగం’ అన్న ముద్ర పడడానికి గల వివిధ కారణాలను అన్వేషించి, వివరించడం జరిగింది. 18వ శతాబ్ది వరకు గల ప్రాచీన కవిత్వానికి, 20వ శతాబ్ది నవ్య కవిత్వానికి మధ్య 19వ శతాబ్ది కవిత్వం ఒక ద్వారబంధం లాంటిదని, ఆ ద్వారబంధాన్ని ప్రాచీన సాహిత్యం వైపు నుండి కాక, ఆధునిక సాహిత్యం వైపు నుండి దర్శించవలసిన ఆవశ్యకత ఈ అధ్యాయంలో నొక్కి వక్కాణించబడింది.

రెండవ అధ్యాయంలో – కవి, కవిత్వం, నవ్యతలను గురించి భారతీయ, పాశ్చాత్య ఆలంకారికుల అభిప్రాయాలను చర్చించడం జరిగింది. భారతీయ ఆలంకారికులు కవిని పరమోత్కృష్ట స్థానంలో నిలిపి గౌరవించారు. “నా నృషిః కురుతే కావ్యం”, “కవయః క్రాంత దర్శనః” అన్న లోకోక్తులు కవులను దివ్యదృష్టి గలవారుగా, లోక ధర్మాలెరిగిన వారిగా ప్రకటిస్తున్నాయి. ఈనాటికీ, కవికి కావలసిన ప్రతిభ దైవదత్తమని, ద్రష్టలయిన కవులే లోకోత్తర రచనలు చేయగలరని భారతీయులు విశ్వసిస్తున్నారని వివరించడం జరిగింది. అలాగే మంచి కవిత్వానికి ద్రష్టత్వం, రసానందం, జగద్ధితం అనే మూడు ప్రధాన లక్షణాలుంటాయని, ఈ మూడూ కూడ నవ్యత లేకుండా ముందుకు సాగలేమని తెలియజేయడం జరిగింది.

అనూచానంగా వస్తున్న పద్ధతి నుండి వెలువడిన ఒక అసహజమైన ధోరణిని, అప్పుడప్పుడే ఏర్పడిన ఒక అపూర్వ రీతిని ‘నవ్యత’గా నిర్వచిస్తూ, నవ్యత కవిత్వంలో ఒక ప్రధానమైన అంతర్భాగంగా వివరించబడింది. శాసనాల కాలం నుండి 19వ శతాబ్ది అంతం వరకు తెలుగు సారస్వత ప్రస్థానంలో శతాబ్దుల వారీగా సంతరించుకొన్న నవ్యతను గూర్చి ఈ అధ్యాయంలో క్లుప్తంగా చర్చించబడింది. ఆ నవ్యత 19వ శతాబ్దిలో కూడా కొనసాగిందని తెలియపరుస్తూ, పైగా – మారిన సామాజిక, రాజకీయ పరిస్థితుల వలన ఆ శతాబ్దిలో ఆ నవ్యత మరింత విస్తృతమయిందని స్పష్టంగా చెప్పబడింది. 19వ శతాబ్దిలో ప్రధానంగా – సంప్రదాయ వ్యతిరేక నవ్యత, అభ్యుదయాత్మక నవ్యత; ఛందో నవ్యత; భాషాపరమైన నవ్యత; ప్రక్రియా పరమైన నవ్యత; విదేశీ సాహిత్య ప్రభావ నవ్యత; ఆంగ్లేయ సంస్కృతి, రాజకీయ ప్రభావ నవ్యత; అన్య మత ప్రభావ నవ్యత; సమకాలీన సంఘటన ప్రభావ నవ్యత; వస్తుపరమైన నవ్యత అనే పది రకాల నవ్యతలు గోచరించి, అబ్బుర పరిచిన విషయం తెలియజేయడం జరిగింది. ఆ నవ్యతలే విజృంభించి, 20వ శతాబ్దిలో ఆధునిక కవిత్వ మహా వృక్షంగా నెలకొన్నాయని సూచించబడింది.

మూడవ అధ్యాయంలో – సాహిత్య ‘యుగా’న్ని నిర్వచించడంతో బాటు, వివిధ సాహిత్య చరిత్రకారులు చేసిన యుగ విభజనలను గురించి, వారు అనుసరించిన విభజన పద్ధతులను గురించి, వాటిలోని పరిమితుల గురించి, ఆ కారణంగా 19వ శతాబ్ది కవిత్వ పరిశీలనకు గల అననుకూలత గురించి సోదాహరణంగా చర్చించడం జరిగింది. ‘సంధి యుగం’ అంటే ఏమిటో, దాని వైశిష్ట్యమేమిటో వివరించబడింది. ఒక యుగంలో వచ్చే మూస కావ్యాల సంఖ్యా బలాన్ని బట్టి కాక, ఆ యుగంలో నవ్య స్పర్శతో వచ్చిన కావ్యాలను (సంఖ్యలో తక్కువగా ఉన్నా సరే!) బట్టి, ఆ యుగ లక్షణాన్ని నిర్ధారించవలసి ఉంటుందని తెలియజెప్పడం జరిగింది. కవిత్వంపై సామాజిక రాజకీయ ప్రభావ దృష్టితో చూస్తే, కవులు, కవితా పోషకులు, ప్రక్రియలు తదితర పద్ధతుల కన్న, యుగ విభజన – కాలాన్ని బట్టి చేయడం సముచితమని; ఆ విధంగా 19వ శతాబ్ది తెలుగు కవిత్వాన్ని మొత్తం ప్రత్యేకంగా ఒక యుగంగా అధ్యయనం చేయవలసిన ఆవశ్యకతను నొక్కి చెప్పడం జరిగింది. శతాబ్దుల వారీగా యుగ విభజన చేయడం వలన గల లాభాలను వివరించి చెప్పడం జరిగింది. ఆ విధమైన అధ్యయనం వల్లే 19వ శతాబ్ది తెలుగు కవిత్వంపై గల అపప్రథ తొలగి న్యాయం జరిగే అవకాశం ఉందని వివరించబడింది.

నాలుగవ అధ్యాయంలో – ఏ శతాబ్దిలోనైనా కవిత్వంపై ఆ శతాబ్ది సామాజిక, రాజకీయ పరిస్థితుల ప్రభావం ఉంటుంది కాబట్టి, 19వ శతాబ్దిలో సామాజిక, రాజకీయ పరిస్థితులను గురించి అధ్యయనం చేయబడింది.

19వ శతాబ్ది పూర్వార్థంలో భారతీయ సంప్రదాయ సంస్కృతులను పుణికి పుచ్చుకొన్న సమాజం, ఉత్తరార్థంలో పెను మార్పులకు లోనై విద్యా విధానంలోను, వేష భాషలలోను, సాంకేతిక ప్రగతిలోనూ, మూఢాచార విశ్వాసాల నిరసనలోను ఎంతో ముందుకు వెళ్ళి, ముఖచిత్రమే మారిపోయిన పరిస్థితులను ఈ అధ్యాయంలో వివరించబడింది. ఆంధ్ర దేశం కూడా రెండు ముక్కలయి, ఒక ప్రాంతం నిజాము యేలికల పాలనలోనూ, మరొక ప్రాంతం బ్రిటిష్ పాలనలోనూ ఉన్న విషయాన్ని, అందుకు కారణ భూతమైన రాజకీయ సంఘటనలను గురించి సవిస్తరంగా వివరించడం జరిగింది.

ఏనుగు వీరాస్వామయ్య రచించిన ‘కాశీ యాత్రా చరిత్ర’ అన్న గ్రంథం ఆధారంగా తెలంగాణ ప్రాంతంలో స్థితిగతులను అధ్యయనం చేయడం జరిగింది. ఆనాటి జమీందారుల మధ్య తరచుగా జరిగిన కయ్యాల గురించి; వారికి స్వీయ భోగాలపై ఉన్న ఆసక్తి, ప్రజల బాగోగులపై, భద్రతపై లేకపోవడం గురించి; దొంగలు, దౌర్జన్యకారుల వలన భయభ్రాంతులవుతున్న ఆనాటి రైతులు, సామాన్య ప్రజల గురించి; ఉర్దూ ప్రాబల్యం వల్ల నిరాదరణకు గురౌతున్న తెలుగు భాష గురించి; నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటడం వల్ల దుర్భరమైన సామాన్యుల జీవితాల గురించి; బయటి ప్రాంతాల్లో ఆంగ్లేయుల పాలనలో సాంకేతిక రాజకీయ అభివృద్ధి ఫలాల వివరాలు తెలియక, బావిలో కప్పల్లా బ్రతుకుతున్న ప్రజల గురించి, కళ్ళకు కట్టినట్లు తెలియజేయబడింది. జమాందారుల పోషణలో కవిత్వం వెలువడుతున్నా, దానిలో నవ్య స్పర్శ ఉండే అవకాశం స్వల్పమన్న విషయం విశదీకరించబడింది.

మరో ప్రక్క – కోస్తా, రాయలసీమ ప్రాంతంలో పాశ్చాత్య విద్యా విధానం వల్ల మానవతావాదం, హేతువాదం, సాంఘిక సమానత్వం తదితర విషయాలపై ప్రజల కేర్పడుతున్న అవగాహన గురించి; క్రైస్తవ మత వ్యాప్తిలో భాగంగా విద్యా, వైద్య వసతుల మెరుగుదల గురించి; వివిధ సామాజికోద్యమకారుల, సంఘ సంస్కర్తల కృషి వల్ల ఉదయిస్తున్న నవ్య సమాజ నిర్మాణం గురించి వివరించి చెప్పబడింది. రైల్వే వ్యవస్థ, టెలీగ్రాఫిక్ వ్యవస్థ, ఫోటోగ్రాఫి, విద్యుద్దీపం వంటి సాంకేతిక ప్రగతి ఫలాల గురించి, అంతే కాకుండా సర్ ఆర్థర్ కాటన్ నిర్మించిన ధవళేశ్వరం ఆనకట్ట వల్ల మెరుగైన కోస్తా ప్రాంతీయుల ఆర్థిక స్థితిగతుల గురించి వివరించబడింది. ఆ పరిస్థితులలో ఆ ప్రాంతంలో ఆంగ్ల సంస్కృతి, సాహిత్యాధ్యయనానికి కూడ అవకాశం ఏర్పడి, తెలుగు సాహిత్యంలో కూడా అనేక విధాలుగా నవ్యత రూపు దిద్దుకోవడానికి మార్గం ఏర్పడ్డ విషయం ఈ అధ్యాయంలో విపులంగా తెలియజేయబడింది.

ఐదవ అధ్యాయం నుండి పదవ అధ్యాయం వరకు 19వ శతాబ్ది తెలుగు కవిత్వంలో వివిధ రకాలుగా వెల్లివిరిసిన నవ్యతలను గురించి సవిస్తరంగా, సోదాహరణంగా పరిశీలించి, పరిశోధించి, వివరించబడింది.

ఐదవ అధ్యాయంలో 19వ శతాబ్ది తెలుగు కవిత్వంలోని సంప్రదాయ వ్యతిరేక నవ్యతను, అభ్యుదయాత్మక నవ్యతను వెలికి తీసి విశదీకరించడం జరిగింది. ప్రాచీన కాలం నుండి తెలుగు కావ్య రచనను కృత్యాద్యవస్థలతో, శ్రీకారంతో సంప్రదాయ బద్ధంగా ప్రారంభించే వారని మనకు విదితమే! కాని 19వ శతాబ్దిలో మొట్ట మొదటిసారిగా శిష్టు కృష్ణమూర్తి అనే కవి తన ‘సర్వ కామదా పరిణయము’ అన్న ప్రబంధంలో అవతారిక మరియు ఇతర కృత్యాద్యవస్థలు లేకుండా రచనను ప్రారంభించాడు. అలాగే అదే శతాబ్దిలో ఆదిభట్ల నారాయణదాసు, శొంఠి భద్రాద్రి రామశాస్త్రి అనే కవులు తొలిసారిగా తమ రచనలను శ్రీకారంతో కాకుండా ఇతర అక్షరాలతో ప్రారంభించి, సంప్రదాయ వ్యతిరేకతను చాటారు. అంత వరకు నాయక ప్రాధాన్యంగా కావ్యాలు వెలువడుతుంటే, ఆ సంప్రదాయానికి విరుద్ధంగా తొలిసారిగా నాయికా ప్రాధాన్యంగా కావ్య రచనను చేసిన కవి కట్టమంచి రామలింగారెడ్డిగారు. ఈయన రచించిన ‘ముసలమ్మ మరణం’ తెలుగు సాహిత్యంలో తొలి విషాదాంత కావ్యం. అంతే కాకుండా, చాలా మంది అపశబ్దంగా భావించే ‘మరణం’ అన్న పదాన్ని ఆయన కావ్య శీర్షికలోనే ఉంచి, తన సంప్రదాయ వ్యతిరేక భావనలను బాహాటంగా చాటారు. స్త్రీ పురుష సమానత్వాన్ని చాటిన కందుకూరి వీరేశలింగం, ఆచంట సాంఖ్యాయన శర్మ; మత సామరస్యాన్ని ప్రబోధించిన వారణాశి అచ్యుత రామయ్య; ‘కన్యాశుల్కం’ వంటి దురాచారాలను నిరసించిన దాసు శ్రీరాములు కవి – 19వ శతాబ్దిలోనే ఆభ్యుదయాత్మక రచనలు చేసిన వైతాళికులు. ఇలాంటి విశేషాలెన్నో ఈ అధ్యాయంలో సోదాహరణంగా విశదీకరించబడ్డాయి.

ఆరవ అధ్యాయంలో – 19వ శతాబ్ది తెలుగు కవిత్వంలో ఛందో నవ్యతను గురించి చర్చించబడింది.

ఆదికవి నన్నయ కాలం (11వ శతాబ్ది) నుండి 19వ శతాబ్ది అంతం వరకు ఆంధ్ర కవిత్వం సంప్రదాయ పద్య ఛందస్సులతో కొనసాగిందని, 20వ శతాబ్ది నవ్యకవిత్వ యుగారంభంలో గురజాడ ఆ సంప్రదాయ ఛందస్సులను ప్రక్కకు నెట్టి ‘ముత్యాల సరము’ అనే మాత్రా ఛందస్సును సృజించి, తెలుగు కవితా ఛందస్సును కొత్త మలుపు తిప్పారని సాహిత్య రంగంలో ఒక అభిప్రాయం నెలకొని ఉంది. కానీ అది వాస్తవం కాదు. గురజాడ కంటే వంద సంవత్సరాల పూర్వమే, అంటే క్రీ.శ. 1810 ప్రాంతంలో రేవణూరి వేంకటార్యుడనే కవి తన ‘శ్రీపాద రేణు ప్రభావము’ అన్న కావ్యంలో అదే ఛందస్సును ప్రయోగించాడని తెలిస్తే ఈనాటి ఆధునికులు ఆశ్చర్యంలో మునుగక తప్పదు. కానీ, ఇది సత్యం.

‘శ్రీమత్రికూటాచల మాహాత్మ్యము’ అన్న కావ్యంలో కొప్పరాజు నరసింహ కవి – పాదానికి ఒక గురువు మాత్రమే ఉండే ‘శ్రీ’ వృత్తాన్ని ప్రయోగించి అబ్బుర పరిచాడు.

“శ్రీ

కో

టీ

శా!” – అన్నది ఆ పద్యం.

‘బిల్వేశ్వరీయము’ అన్న ప్రబంధాన్ని రచించిన కొక్కొండ వేంకటరత్నం పంతులు ఇలాంటి 140 విశిష్ట వృత్తాలతో బాటు, స్వయంగా ‘బంగారము’, ‘వెండి’, ‘తేటి’, ‘తేటిబోటి’, ‘ఆట బోటి’ వంటి ఛందస్సులను సృష్టించి ప్రయోగించారు. పంతులుగారు ఈ కావ్యంలో అనేక గీతాలను కూడా రచించి, తొలిసారి గేయ కవితలకు పద్య కావ్యంలో స్థానం కల్పించారు.

ఇదిలా ఉంటే, శిష్టు కృష్ణమూర్తి, మండ కామశాస్త్రి, అయాచితులు హనుమచ్ఛాస్త్రి అనే కవి పుంగవులు తులసీదాసు హిందీ భాషలో వెలయించిన ‘రామ చరిత మానస్’ అన్న రామాయణ కావ్యాన్ని ఆంధ్రీకరిస్తూ, హిందీ సాహిత్యంలోని ‘దోహా – చౌపాయి’ వంటి గేయ ఛందస్సులను తెలుగు సాహిత్యంలో ప్రవేశ పెట్టారు.

ఇలా 19వ శతాబ్దిలోనే తెలుగు కవులు ఛందస్సులో స్వేచ్ఛా ప్రియత్వాన్ని చాటి, 20వ శతాబ్దిలో విస్తృతంగా వెలువడిన గేయ, వచన కవితలకు బాటలు వేశారు – అన్న వ్యాఖ్యతో ఈ అధ్యాయం ముగుస్తుంది.

ఇక, ఏడవ అధ్యాయంలో – 19వ శతాబ్దిలో వెలువడిన తెలుగు కవిత్వంలోని భాషా నవ్యతను పరిశీలించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఉరుదూ, తెలుగు భాషలను మణిప్రవాళ శైలిలో ప్రయోగించిన శ్రీమత్తిరుమల వేదాంతము శ్రీనివాస దీక్షితయ్యరు, బెండా పెంటయ, శిష్టు కృష్ణమూర్తి, దిట్టకవి నారాయణకవి మొదలైన కవుల కావ్యాలనుండి భాషా నవ్యతకు సంబంధించిన అనేక ఉదాహరణలను పేర్కొనడం జరిగింది. అంతే కాకుండా, దిట్టకవి నారాయణకవి రచించిన ‘రంగరాయ కదన రంగ చరిత్రము’ (క్రీ.శ. 1800 ప్రాంతం)లో; చట్రాతి లక్ష్మీ నరసు కవి రచించిన ‘విజయ రామ యశోభూషణము’ (క్రీ.శ. 1810-1820 మధ్య)లో ఫ్రెంచి, ఆంగ్ల పదాలను ప్రయోగించిన తీరును విశ్లేషించడం జరిగింది. మతుకుమల్లి నృసింహ శాస్త్రి రచించిన ‘చెన్నపురీ విలాసము’ (క్రీ.శ. 1860)లో ఆధునిక నగర వర్ణన చేస్తూ, కవి ఆధునిక నాగరిక, సాంకేతిక ప్రగతిని – ఆంగ్ల భాషలోని ఆ ఆధునిక నాగరిక, సాంకేతిక శబ్దాలను ప్రయోగిస్తూ వర్ణించిన తీరును వివరించబడింది. తరిగొండ వేంకమాంబ తన ‘వేంకటాచల మహాత్మ్యము’ (క్రీ.శ. 1840)లో ప్రయోగించిన ఎరుకల సాని వ్యావహారిక భాషను గురించి, వడ్డీ పత్రంలో వాడిన పరిభాషను గురించి విశదీకరించి, ఆ కావ్యంలోని భాషా నవ్యతను ప్రశంసించడం జరిగింది. ఇంకా వద్దిపర్తి కోనమరాజు ప్రయోగించిన కరణాల వృత్తిపరమైన వ్యావహారిక పరిభాషను విపులంగా విశదీకరించి, నాటి కావ్యాలలో ఆ కవులు ఇలా వ్యవహార భాషను సమర్థవంతంగా ప్రయోగించడం వల్లనే, 20వ శతాబ్దిలో వ్యవహార భాషోద్యమానికి బీజాలు నాటినట్లయిందని విశ్లేషించబడింది.

ఎనిమిదవ అధ్యాయంలో – ప్రక్రియా పరంగా 19వ శతాబ్ది తెలుగు కవిత్వంలోని నవ్యతను వెలికితీసే ప్రయత్నం జరిగింది. నవ్య కవిత్వానికి ప్రత్యేక లక్షణమైన ప్రక్రియా బాహుళ్యానికి అంకురార్పణ 19వ శతాబ్దిలోనే జరగడం విశేషం. 19వ శతాబ్దిలో రూపపరంగా – పద్యనాటకం, ఖండ కావ్యం, గేయ కావ్యం వంటి ప్రక్రియలు, వస్తు పరంగా – వ్యంగ్య కావ్యం, స్మృతి కావ్యం, యాత్రా కావ్యం, జీవిత చరిత్ర, స్వీయ చరిత్ర వంటి అనేక ప్రక్రియలు కవిత్వ పరిధిలో వెలువడ్డాయి.

కందుకూరి వారు రచించిన ‘అభాగ్యోపాఖ్యానం’ తెలుగు సాహిత్యంలో తొలి వ్యంగ్య కావ్యం. పంతులుగారే రచించిన ‘సరస్వతీ నారద విలాపము’ తొలి ఏకాంకిక నాటిక. వావిలాల వాసుదేవ శాస్త్రి రచించిన ‘సీజరు చరిత్రము’ తొలి పద్య నాటకం. తెలుగులోకి అనువదించబడిన తొలి ఇంగ్లీషు నాటకం కూడా ఇదే. షేక్స్పియర్ రచించిన ‘జూలియస్ సీజర్’ నాటకానికి ఆంధ్రానువాదం ఇది. తెలుగులో తొలి స్వతంత్ర సాంఘిక నాటకం మరియు తొలి స్వతంత్ర పద్యనాటకం – ‘నందక రాజ్యం’. దీని కర్త కూడా వావిలాల వాసుదేవ శాస్త్రి గారే. తెలుగులో తొలి ఖండ కావ్యాల సంపుటిని వెలయించింది ఆచంట వేంకట సాంఖ్యాయన శర్మ. దీని పేరు ‘ఆంధ్ర పద్యావళి’. ఇందులో ‘దాదా భాయి నౌరోజీ’ వంటి జాతీయ నాయకునిపై రచించిన ఖండ కావ్యం, ‘రవి వర్మ చిత్ర పటాలు’ వంటి నవ్య వస్తువుపై అల్లిన ఖండ కావ్యం, ‘సంఘ సంస్కరణము’ పేరుతో అభ్యుదయాత్మకంగా వెలయించిన ఖండకావ్యం ఇలా, ఎన్నో విశిష్టమైన ఖండ కావ్యాలున్నాయి. ఖండ కావ్యాలను ఒక సంపుటిగా వెలువరించడంలో కూడా సాంఖ్యాయన శర్మ ఆద్యులు. వాగ్గేయకారుడు త్యాగరాజు రచించిన ‘ప్రహ్లాద భక్తి విజయము’, ‘నౌకా చరిత్రము’ తెలుగు సాహిత్యంలో తొలి సంగీత రూపకాలు. అలాగే, పురుషోత్తమ చౌధరి రచించిన ‘రక్షణ చరిత్ర’, ‘నిస్తార రత్నాకరము’ తొలి క్రైస్తవ సంగీత రూపకాలు. ఇవన్నీ 19వ శతాబ్దిలో వెలువడ్డవే. ఇవిగాక తొలి ‘కృతులు’, తొలి హాస్య, వ్యంగ్య కీర్తనలు కూడా ఇదే శతాబ్దిలో వెలువడ్డాయి. ఇంకా శిష్టు కృష్ణమూర్తి, మండ కామశాస్త్రి రచించిన ‘ఆంధ్ర తులసీ రామాయణము’, తెలుగులో తొలి మాత్రా ఛందస్సు కావ్యం. వడ్డాది సుబ్బారాయకవి రచించిన ‘సతీ స్మృతి’ తెలుగులో మొట్ట మొదటి స్మృతి కావ్యం. నరహరి రాజామణిశెట్టి రచించిన ‘గోపాల కృష్ణమూర్తి శతకం’ – శతక రూపంలో వెలువడిన తొలి జీవిత చరిత్ర. మండపాక పార్వతీశ్వర శాస్త్రి రచించిన ‘ఆత్మ సపర్యా చర్య’ తెలుగు సాహిత్యంలో తొలి స్వీయ చరిత్ర. మతుకుమల్లి నృసింహ శాస్త్రి చే విరచితమైన ‘చెన్నపురీ విలాసము’ తెలుగులో వెలసిన తొలి యాత్రా కావ్యం. ఇవన్నీ తొలిసారిగా 19వ శతాబ్దిలోనే వెలువడిన ప్రక్రియలు.

ఇలా, 20వ శతాబ్దిలో ప్రక్రియా బాహుళ్యంతో విస్తరిల్లిన అనేక ప్రక్రియలకు పునాదులు 19వ శతాబ్దిలోనే పడ్డాయన్నది నిర్వివాదాంశమని నొక్కి వక్కాణిస్తూ ఈ అధ్యాయం ముగుస్తుంది.

తొమ్మిదో అధ్యాయంలో – 19వ శతాబ్ది తెలుగు కవిత్వంపై పాశ్చాత్య ప్రభావ నవ్యతను అధ్యయనం చేయబడింది. ఈ అధ్యాయంలో కందుకూరి వీరేశలింగం, వావిలాల వాసుదేవ శాస్త్రి, శిష్టు జగన్నాథ శాస్త్రి, పార్థసారథి రాయణి, గోపిశెట్టి రామచంద్రరావు, జయంతి భావ నారాయణ, గొట్టు ముక్కల రమాకాంతచార్యులు వంటి 19వ శతాబ్ది తెలుగు కవులు – ‘షేక్స్పియర్,’ ‘టెన్నిసన్’, ‘గోల్డ్ స్మిత్,’ ‘షెరిడన్,’ ‘కౌపర్,’ ‘బైరన్’, ‘గ్రే’ వంటి ఆంగ్ల కవుల సాహిత్యాన్ని చదివి, ఆంగ్ల సాహిత్యం, ఆంగ్లేయ సంస్కృతుల ప్రభావానికి లోనై, ఆంగ్ల సాహిత్యంలో అజరామర ఖ్యాతిని ఆర్జించిన ‘క్లాసిక్స్’ – ‘మర్చంట్ ఆఫ్ వినీస్’, ‘ది ట్రావలర్’, ‘ప్రిజనర్ ఆఫ్ చిల్లాన్’, ‘వికార్ ఆఫ్ ది వేక్ ఫీల్డ్’, ‘ట్వెల్త్ నైట్’, ‘డోరా’ మొదలైన వాటికి అనువాదాలను, అనుసృజనలను రూపొందించిన విధానాన్ని విపులంగా విశ్లేషించడం జరిగింది. ఇంకా, ఈ అధ్యాయంలో విక్టోరియా మహారాణి (బ్రిటిష్ మహారాణి)పాలనలో భారతదేశంలో జరిగిన అభివృద్ధి ప్రభావానికి లోనై మతుకుమల్లి నృసింహశాస్త్రి, వడ్డాది సుబ్బారాయకవి వంటి కవులు – రైలు బండిపై, టెలీగ్రాఫ్‌పై వ్రాసిన పద్యాల గురించి, మహారాణి పరిపాలన ‘జ్యూబిలీ’ ఉత్సవాల సందర్భంగా కందుకూరి, వడ్డాది సుబ్బారాయకవి మొదలైన వారు వ్రాసిన ప్రశంసా పద్యాలను గురించి, తొలిసారి తెలుగు కవితకు అంతర్జాతీయ పురస్కారాన్ని ఆర్జించి పెట్టిన కొక్కొండ వేంకట రత్న శర్మ రచించిన ‘ప్రిన్స్ ఆఫ్ వేల్స్ తారావళి’ గురించి, విక్టోరియా మహారాణి జీవిత చరిత్రను కావ్యాలుగా రూపుదిద్దిన మంత్రి ప్రెగడ భుజంగరావు, కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి కవుల గురించి సోదాహరణంగా ‘పాశ్చాత్య రాజకీయ ప్రభావ నవ్యత’ గా అందించబడింది.

అంతే కాకుండా, ‘పాశ్చాత్య మత ప్రభావ నవ్యత’ గా ‘ఆంధ్రక్రైస్తవ కవి సార్వభౌముడు’ పురుషోత్తమ చౌధరి రచనలు – ‘యేసు నాయక శతకము’, ‘యేసు క్రీస్తు ప్రభు శతకము’, ‘క్రైస్తవ నీతి ప్రకాశము’, ‘సత్యవేద సార సంగ్రహము’ మొదలైన తొలితరం క్రైస్తవ శతకాలు, పద్య కావ్యాల గురించి వివరించబడ్డాయి.

పదో అధ్యాయం ప్రత్యేకమైనది. ఇందులో ‘19వ శతాబ్ది తెలుగు కవిత్వంలో వస్తు నవ్యత’ అన్న అంశాన్ని పరిశీలించబడింది. కవి సృజన శక్తికి ప్రతీకగా నిలిచే వస్తువు కావ్యానికి ప్రాణం వంటిది. అటువంటి వస్తువులో 19వ శతాబ్ది కవులు సాధించిన నవ్యతను విశదీకరించిన అధ్యాయం ఇది. ఇందులో ప్రధానంగా నాలుగు రకాల వస్తు నవ్యతలు మనకు గోచరిస్తాయి. అవి –

  1. అల్ప వస్తువులకు కావ్య గౌరవం
  2. సమకాలీన సంఘటనాత్మక వస్తువులు
  3. ‘సోషియో ఫాంటసీ’ కథా వస్తువులు
  4. విచిత్ర కల్పనల కావ్య వస్తువులు

20వ శతాబ్దిలో నవ్య కవిత్వంలో ఆధునికులు ఒక ముఖ్యాంశంగా భావించే విషయం – అల్ప వస్తువులను కూడా హీనంగా చూడకుండా, వాటిని కూడా కవితామయం చేస్తూ కావ్యాలను నిర్మించడం. దీనికి ప్రాతిపదికగా మహాకవి శ్రీశ్రీ రచించిన –

“కుక్కపిల్లా –

అగ్గి పుల్లా –

సబ్బు బిళ్ళ –

హీనంగా చూడకు దేన్నీ!

కవితామయమేనోయ్ అన్నీ!

…..

…..

కాదేదీ కవిత కనర్హం!

ఔనౌను శిల్ప మనర్హం!”

అన్న ‘ఋక్కులు’ కవితను పేర్కొంటారు. అయితే, అంతకన్న 50, 60 సంవత్సరాలకు పూర్వమే, అంటే 19వ శతాబ్దిలోనే, పన్నాల సీతారామ బ్రహ్మశాస్త్రి – ‘పూచి పుల్ల శతకం’; బుద్ధిరాజు ఈశ్వరప్ప పంతులు – ‘అట్టుకథ’, సామినేని వేంకటాద్రి అనే కవి – ‘చీపురు పుల్ల శతకము’ వంటి కావ్యాలను రచించారంటే ఆధునికులు విని ఆశ్చర్యపోకపోరు. అంతే కాకుండా, మిర్యాలగూడకు చెందిన చిరుమర్రి నరసింహ కవి పొగాకుపై 14 పాదాల చంపకమాల వృత్త మాలికను రచించారు. ముక్కు పొడుమును గూర్చి, దీపావళి టపాకుల గురించి దాసు శ్రీరాములు కవి ‘తెలుగు నాడు’ కావ్యంలో పద్యాలను రచించారు – ఇలాంటి విశేషాలెన్నో ఈ అధ్యాయంలో పొందుపరచబడ్డాయి.

19వ శతాబ్దిలో రాయభట్ట వీర రాఘవ కవి రచించిన ‘గాలి వాన సీస మాలిక’ తెలుగు సాహిత్యంలో ప్రకృతి వైపరీత్యాలపై వచ్చిన తొలి రచన. క్రీ.శ. 1864లో బందరులో వచ్చిన పెను తుఫానును ప్రత్యక్షంగా చూసిన కవి తన అనుభవాన్ని కవిత రూపంలో అందించారు. ఇలా సమకాలీన సంఘటనలపై స్పందించి కవిత్వం చెప్పిన మరో కవి వడ్డాది సుబ్బారాయకవి. గోదావరి వరదలపై ఆయన ‘గౌతమీ మహా జల మహిమానువర్ణనము’ పేర ఒక చాటు ప్రబంధాన్ని కళ్ళకు కట్టినట్టు వర్ణిస్తూ రచించారు. ఇదే కవి, ఒక సారి మిత్రులతో కలిసి పొగ నావపై ‘బొబ్బరి లంక’కు షికారుకు వెళ్ళిన ఉదంతాన్ని ‘గోదావరి ధూమనౌకా విహారము’ పేరిట కావ్యంగా మలచారు. ఈ కావ్యాలు ఆత్మాశ్రయ రీతిలో వెలువడడం గమనార్హం. ఇలా సమకాలీన సంఘటనాత్మక రచనలే కాక పందొమ్మిదో శతాబ్దిలో ‘చెన్నపురీ విలాసము’, ‘మచిలి బందరు చరిత్రము’ వంటి ఆధునిక నగరాల వర్ణనలతో కూడా కావ్యాల నల్లారు మతుకుమల్లి సోదర కవులు. ఈ విషయాలన్నీ విపులంగా వివరించబడ్డాయి.

పురాణ పురుషుల పాత్రలు, సమకాలీన సమాజంలోని పాత్రలను కలగలిపి అల్లిన కల్పిత కథలను ‘సోషియో ఫాంటసీ’ లంటారు. 19వ శతాబ్దిలోనే ఇలాంటి ప్రయోగాలను చేసిన కవులు – ‘రాధాకృష్ణ సంవాదము’ కర్త మండపాక పార్వతీశ్వర శాస్త్రి మరియు ‘అలిమేలు మంగా పరిణయము’ కృతి కర్త తూము రామచంద్రారెడ్డి. ఈ కావ్యాలలోని సోషియో ఫాంటసీ లక్షణాలతో బాటు, వాటిలోని గుణాలను చక్కగా ఎంచి చూపడం జరిగింది ఈ అధ్యాయంలో.

క్రీ.శ. 1912లో అమెరికాకు ప్రయాణిస్తున్న టైటానిక్ అనే ఓడ ‘ఐస్ బర్గ్’ అనే కొండకు ఢీకొని ఘోర ప్రమాదానికి గురైన విషయం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ సంఘటన జరుగక ముందు 24 సంవత్సరాల పూర్వమే ఒక తెలుగు కవి ఇలాంటి సంఘటనను ఊహించి, ఆ కల్పిత కథతో ‘బాటసారి’ అన్న కావ్యాన్ని రచించాడు. ఆ కవి ఎవరో కాదు ‘హరికథా పితామహుడు’గా తరువాతి కాలంలో ప్రసిద్ధి చెందిన ఆదిభట్ట నారాయణ దాసు. ఇది నమ్మశక్యం గాని నిజం.

ఈ రోజుల్లో సెక్స్ మార్పిడి అన్నది ఒక వైజ్ఞానిక విజయంగా మనం భావిస్తున్నాం. అయితే శొంఠి భద్రాద్రి రామశాస్త్రి అనే కవి 19వ శతాబ్దిలోనే ‘చిత్రసీమ’ అన్న కావ్యంలో చిత్రసీమ అనే నాయిక ‘చిత్ర సీముని’గా మారిపోయినట్లుగా కథ అల్లి రసవత్తరంగా కావ్యాన్ని నడిపారు.

ఇలాంటి చిత్ర విచిత్ర వస్తువులతో 19వ శతాబ్దిలో తెలుగు కవులు సాధించిన వస్తు నవ్యతను పరిశోధించి, ఈ అధ్యాయంలో పరిచయం చేయబడింది.

ఇక, ముగింపు అధ్యాయంలో – తెలుగు సాహిత్య విమర్శకులు, పండితులు ఆధునికాంధ్ర కవిత్వ లక్షణాలుగా పేర్కొన 8 లక్షణాలకు (ఖండ కావ్య ప్రక్రియ, ఆత్మాశ్రయ రీతి, వస్తు నవ్యత, భావ నవ్యత, శైలీ నవ్యత, పద ప్రయోగం, దేశి కవిత, ప్రక్రియా బాహుళ్యం) బీజాలు 19వ శతాబ్దిలోనే ఎలా పడ్డాయో పునశ్చరణ చేయడం జరిగింది. 19వ శతాబ్ది కావ్యాల ప్రభావం 20వ శతాబ్ది ప్రసిద్ధ కావ్యాలపై ఎలా ప్రసరించింది సోదాహరణంగా వివరించబడింది.

19వ శతాబ్ది తెలుగు కవిత్వానికి యుగ కర్తగా కందుకూరి వీరేశలింగం పంతులుగారిని పేర్కొంటూ, వడ్డాది సుబ్బారాయకవి, వావిలాల వాసుదేవశాస్త్రి, ఆచంట సాంఖ్యాయన శర్మ మొదలైన వైతాళికుల ఔన్నత్యాన్ని కొనియాడడం జరిగింది.

ఇంతటి నవ్యత పొదుగుకొని, 20వ శతాబ్ది నవ్య కవిత్వ మహా వృక్షానికి బీజావాపనం చేసిన 19వ శతాబ్దిని క్షీణ యుగంగా, అంధయుగంగా పేర్కొనడం అనుచితమని పేర్కొంటూ, 19వ శతాబ్దికి తెలుగు సాహిత్య చరిత్రలో ‘ఉషోదయ యుగం’గా పునరామకరణం చేయవలసిన ఆవశ్యకతను నొక్కి వక్కాణిస్తూ, ఈ సిద్ధాంత రచనను ముగించడం జరిగింది.

‘భారత దేశ చరిత్రలో 19వ శతాబ్ది ముఖ్య సంఘటనలు’, ‘ప్రపంచ చరిత్రలో 19వ శతాబ్ది ముఖ్య సంఘటనలు’, ‘ఆంధ్ర దేశ చరిత్రలో 19వ శతాబ్ది ముఖ్య సంఘటనలు’, ‘19వ శతాబ్దిలో వెలువడిన తెలుగు పత్రికలు’ వంటి ఆసక్తికరమైన అంశాలను ఈ సిద్ధాంత రచనకు అనుబంధాలుగా చేర్చబడ్డాయి. ఈ పరిశోధనకు ఉపకరించిన తెలుగు, ఇంగ్లీషు గ్రంథాలు; పత్రికలు, ప్రత్యేక సంచికల పట్టికను ‘ఉపయుక్త గ్రంథ సూచి’గా జత చేయబడింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here