అంతర్జాతీయ యోగా దినోత్సవం 2023 – నివేదిక

0
11

[dropcap]యో[/dropcap]గా చేసుకుని మెల్లగా బయటకు వస్తుంటే, బొటానికల్ గార్డెన్‌లో, యోగా గురూజీ యాదవ్ గారు పలకరించారు, “మేడం! 27 మే శనివారం నాడు సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్‌లో యోగా మీట్ ఉంది. బొటానికల్ గార్డెన్ నుంచి ఒక బస్సు వెళ్తుంది. మీరు కూడా రండి. రిజిస్ట్రేషన్ చేసుకోవాలి” అని పేరు తీసుకున్నారు. యాదవ్ గారు రిటైరర్డ్ మిలటరీ! అక్కడ కొంతమందిని కలిపి యోగా చేయిస్తుంటారు. “మేడం! మీరూ ఆడవాళ్ళకి ఒక గ్రూప్ చేసి చెప్పండి” అని నన్ను అంటుండేవారు. బంధాలు, ప్రతిబంధకాలు అని commitments నాకు ఇష్టం వుండదు. నా పాటికి నేను యోగా చేసుకుని వస్తుంటాను. ‘4 AM కి బొటానికల్ గార్డెన్ నుంచి బస్సు బయలుదేరుతుంది. 4 కి అక్కడుంటేట్టు ప్లాన్ చేసుకోమ’ని చెప్పారు.

యోగా ఎంతో ఇచ్చింది జీవితానికి! గత 30 ఏళ్లుగా కొంచెం యోగా సీరియస్ గానే చేస్తున్నా! పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది. ఈ 30 యేళ్ళుగా, నాకు తలనొప్పి వచ్చినట్టు గుర్తులేదు. నేను మూడు నాలుగు గంటల కంటే ఎక్కువ పడుకోను. అయినా ఎప్పుడూ fatigue feel అవ్వలేదు. BP, Sugar లు లేవు. చిన్న చిన్న జ్వరాలు, జలుబు దగ్గులు కూడా ఇబ్బంది పెట్టిన సందర్భాలు లేవు. ఇంత ఇచ్చిన యోగాకి రుణపడి ఉన్నట్టుగానే అనిపిస్తుంది. వెళ్ళటానికే నిర్ణయించుకున్నా.

యోగా డే ని ఇంటర్నేషనల్ గా జరుపుకునే స్థాయికి చేరుకోవడానికి కారణభూతులైన మన ప్రధానమంత్రి మోడీ గారిని తలుచుకొని మనసు గర్వంతో, ఆనందంతో ఉప్పొంగిపోయింది.

ఎర్లీ మార్నింగ్ లేచి బొటానికల్ గార్డెన్ చేరుకునే సరికి, యోగా మిత్రులందరూ చేరుకుంటున్నారు. 4:30కి ఇక్కడి నుంచి బస్సు బయలుదేరింది. అందరూ యోగ చేసే వాళ్లే కాబట్టి, బస్సు అంతా చక్కగా శ్లోకాలు పఠించుకుంటూ, కాసేపు నామస్మరణ చేసుకుంటూ ప్రశాంతంగా పెరేడ్ గ్రౌండ్స్ చేరుకున్నాం. పెద్ద కటౌట్లతో యోగా డే బ్యానర్లు, మోడీ గారి ఫోటోలతో పెరేడ్ గ్రౌండ్ కళకళలాడి పోతోంది. మే మార్నింగ్ కదా, వాతావరణం అంతా సాత్వికమైన ప్రశాంతతతో నిండిపోయింది. Positive vibrations, ఎఫెక్ట్ బాగా కనిపిస్తుంది. పెరేడ్ గ్రౌండ్ మొత్తం చక్కగా కార్పెట్ పరిచి, మ్యాట్లు వేసి రెడీగా సిద్ధంగా ఉంచారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాలబాలికలు, స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు, యోగా ఇన్‌స్టిట్యూషన్స్ నుంచి వచ్చిన వాళ్ళూ, చక్కటి సాంప్రదాయకమైన దుస్తులు ధరించి యోగా విన్యాసాలు చేసి చూపిస్తున్నారు. బ్యాక్‌గ్రౌండ్‌లో అద్భుతమైన దేశభక్తి పాటలు వినపడుతున్నాయి. రెహమాన్ గారి వందేమాతర గీతం! మనసంతా పవిత్రమైన దేశభక్తి భావాలతో నిండిపోయింది. అద్భుతంగా చేస్తున్న ఆ పిల్లల యోగ విన్యాసాలు తిలకిస్తుంటే ఒళ్ళు పులకించిపోయింది. ఒక అద్భుతమైన ప్రక్రియని మన భారతదేశ, పతంజలి మహర్షి లాంటి మహామునులు కనుక్కొని, ప్రపంచానికి అందించారని తలుచుకోగానే ఎంతో గర్వంగా అనిపించింది. యోగా చేస్తూ, యోగా చేయమని ప్రబోధిస్తూ, యోగా విలువల్ని ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చిన మహానుభావుడు భారతదేశానికి ఒక ప్రధాని అని తెలుసుకుంటే ఎంతో గొప్పగా అనిపించింది. మళ్ళీ మళ్ళీ ఇటువంటి సందర్భం మన దేశానికి రావాలనిపించింది.

గవర్నర్ తమిల ఇసై గారు, గౌరవ మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, లక్ష్మణ్ గారు, గోపీచంద్ గారు, సైనా నెహ్వాల్ గారు, విశ్వక్సేన్, శ్రీ లీల, కృష్ణ చైతన్య లాంటి సినీ ప్రముఖులు వీళ్ళ అందరితో వేదిక శోభిల్లింది. మే 27 నుంచి జూన్ 21 వరకు ఈ యోగా డే సెలబ్రేషన్స్ జరిగేట్టుగా ప్రణాళిక చేసుకున్నామని గౌరవ మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు సభతో పంచుకున్నారు. అక్కడ వచ్చిన వాళ్ళందరికీ యోగ టి షర్ట్స్, యోగా మ్యాట్లు, రిఫ్రెష్మెంట్స్, వాటర్ బాటిల్స్ విరివిగా సప్లై చేశారు. గ్రౌండ్స్ మొత్తం జనంతో నిండిపోయింది.

తర్వాత అందరితో కలిపి మురార్జీ దేశాయ్ గారి యోగా ఇన్‌స్టిట్యూషన్ నుంచి వచ్చిన వ్యక్తులు చక్కగా యోగా చేయించారు. చిరు ప్రాణాయామము, ధ్యానాలను చేయించిన తరువాత అందరూ కలిసి సామూహికంగా ప్రమాణం చేసుకున్నాము, మన చుట్టూ వాతావరణాన్ని ఎటువంటి కలుషితం కాకుండా కాపాడుకుంటామని, యోగాభ్యాసం ప్రతి ఒక్క వ్యక్తి చేసేట్లుగా తోటి వారికి ప్రబోధిస్తామనీ!

మెల్లగా, తృప్తిగా అందరం ఇంటికి తిరుగు ముఖం పట్టాము.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here