21. స్వంత గూడు

0
5

[box type=’note’ fontsize=’16’] 2018 దీపావళి కథల పోటీకి వచ్చిన కథ. [/box]

[dropcap]రా[/dropcap]త్రి భోజనాల తరువాత… భక్తవత్సలం, అల్లుడు సోమసుందరం వరండా ముందు ఉన్న లాన్లో కూర్చుని ఉన్నారు. భోజనం తరువాత.. రోజూ అలా కాస్సేపు కూర్చుంటాడు భక్తవత్సలం.

“మీరు అలా ఆలోచిస్తే ఎలా మామగారూ! మీకు మాత్రం ఎవరున్నారు? ఏమిచ్చినా మీ కూతురుకేగా.. మీరు ఎప్పుడో ఇచ్చేది ఇప్పుడే ఇచ్చేస్తే, మేం వెంటనే ఓ ఇల్లు కొనుక్కుంటాం. సైటే పాతిక లక్షలు ఉంది. అయినా ఈ పాటికి రిటైరుమెంటు డబ్బులు అన్నీ వచ్చే ఉంటాయి. రెండు నెలలు అయ్యిందిగా మీరు రిటైరు అయ్యి” తెలివిగా అడుగుతున్నాడు.

సోమసుందరం ఏమడిగినా భక్తవత్సలం గొంతులో పచ్చి వెలగకాయ పడ్డట్టే ఉంది. చల్లగాలి పేరుతో టీ.వి.ని కాదని.. బయటికొచ్చి అల్లుడికి దొరికిపోయాడు.

ఎంతిచ్చినా.. ఏమిచ్చినా సంతోషపడే ఘటం కాదు అల్లుడు. పెళ్ళికి ముందు ఇలా అని తెలిస్తే సంబంభం వదులుకునేవాడేమో! చూడడానికి బాగున్నాడు. అడ్వకేటు.. మంచి పేరున్న సీనియరు దగ్గర జూనియరుగా చేరాడు. ముందు.. ముందు సంపాదన ‘అదే’ అందుకుంటుంది అనుకున్నాడు.

అది అందుకుందో లేదో అంతగా తెలీదు గాని, క్లయింటుల దగ్గర వసూలు చేసినట్టే.. మామగారి దగ్గరా .. వసూలు చేస్తుంటాడు ఇంటల్లుడి హోదాలో – స్కూటర్ ఆని, ఏ.సీ.అని.

భక్తవత్సలంకి గాయిత్రి ఒక్కతే కూతురు. అలా అని మరెవరూ లేరని కాదు. అంత కన్నా ముందు.. పుట్టిన ఓ కొడుకు ఉన్నా.. చదువబ్బక దేశాలు పట్టిపోయాడు. ఎక్కడో చిన్న చిన్న పనులు చేసుకుని బ్రతుకుతున్నట్లు.. బంధువుల ద్వారా తెలిసినా, కొడుకుని పిలిచే ప్రయత్నం చెయ్యలేదు ఎప్పుడూ .. ‘వాడి’ పేరే తలవడు. ఎవరైనా కొడుకును గురించి మాట్లాడినా.. కోపం తెచ్చుకునేవాడు.

“వాడంతట వాడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. చదువుకోమని అన్నాం. ‘ఇంటర్’లో మార్కులు తక్కువ వచ్చినాయని కాస్త.. కోప్పడ్డాం. అంతమాత్రానికే ఇల్లొదిలిపెట్టి వెళ్ళిపోయాడు. వాడు చేసిన పనికి, బయట ప్రపంచంలో తలెత్తుకోలేకపోయాను. ముఖ్యంగా ఆఫీసులో… అంత అవమానం ఏ పగవాడికీ కలగకూడదు” అనేవాడు.

దాంతో నచ్చచెప్పి ‘కొడుకు’ని కలుపుదాం అనుకునే పెద్దమనుషులు వెనక్కు తగ్గేవారు.

అలా తండ్రి కొడుకుల మధ్య దూరం… అఘాతంలా.. అలానే ఉండిపోయింది. అన్ని సవ్యంగా జరిగితే.. కధ మరోలా ఉండేది. యుద్ధంలో శత్రు శేషం.. మిత్ర శేషం ఉండకూడదన్నట్లే.. ఎక్కడో అనామకంగా ఉన్నా వారసుడు.. వారసుడే.

సోమసుందరంది అసలే క్రిమినల్ బుర్ర. ఆ అనామక బావమరిది తెర మీదకి వచ్చే లోపుగానే తను అంది పుచ్చుకునేది.. పుచ్చుకుంటే ఆ తరువాత .. ఎవరెంత గింజుకున్నా లాభం ఉండదు. అందుకే తన ప్రయత్నం తను చేస్తున్నాడు.

సరిగ్గా అదే సమయానికి అత్తగారు వసుంధర.. ఓ చేత్తో మనవరాల్ని ఎత్తుకుని, మరో చేత్తో.. అల్లుడి కోసం ఉదయం చేసిన సున్నిఉండలు, ప్లేటులో పెట్టి పట్టుకొచ్చింది. గాయిత్రి వంటగది సర్దే పనిలో పడింది.

“స్వీట్లు తీసుకోండి బాబూ” అందించింది.

మామగారికి చెప్పినట్లే అత్తగారికీ విషయం చెప్పాడు. ‘తను పని. చేసే కోర్టుకి దగ్గరలో ఇంటి స్థలం.. ఒకటి బేరానికొచ్చిందని. ఓ పది లక్షలు అయినా సర్దితే, మిగిలినది ఎలాగో సర్దుబాటు చేసుకుంటానని చెప్పుకొచ్చాడు.

భక్తవత్సలం అడ్డొస్తూ “పెళ్ళిలో మాటల్లో.. అనుకున్నదంతా అమ్మాయికి పెట్టేసాను. అయినా పై ఖర్చులకు కావాలంటే ఇప్పటివరకూ.. రెండు లక్షల వరకూ ఇచ్చాను. ఉన్నట్టుండి ఇప్పుడు పది లక్షలంటే కష్టం. ఇంటి దగ్గర నుంచే వెళ్లి వస్తున్నారు కదా! కొత్తగా మళ్ళీ ఇల్లెందుకు?”

తన రిటైరుమెంటు డబ్బు కోసం అల్లుడు ఆశ పడతాడని తెలుసు. రిటైరు అయితే జీవితం ముగిసిపోయినట్లేనా. తనకీ ముందు రోజులు ఎలా గడవాలి కదా!

భర్త మాటలతో వెంటనే తేరుకున్న వసుంధర. “మాకూ ఓ కొడుకున్నాడుగా బాబూ.. వాడినీ మేం చూడాలి కదా. అయినా మొత్తం డబ్బొచ్చిన తరువాత గాయిత్రి పేరున.. మూడు లక్షలు.. డిపాజిట్ చెయ్యాలనుకున్నారు మీ మావగారు” భర్త తనకి విషయం ఇదీ అని సరిగ్గా చెప్పకపోయినా.. భర్తని వెనకేసుకొచ్చింది.. లోలోన భయపడుతునే. కొడుకు పేరేత్తినందుకు భర్త నుంచి ఏం వ్యతిరేకత వస్తుందోనని.

మరోసారి అయితే అలాగే జరిగేదేమో. పెళ్లి సమయంలో ఏదో విషయానికి.. కొడుకు పేరు పలికినందుకే అందరిలోనూ ‘చావతిట్లు’ తిట్టాడు.

అయినా.. ఇప్పుడు అదే మాటని ‘చక్రంలా” అడ్డం వేసింది.

ఇదే మాట సోమసుందరం.. భార్య గాయిత్రితో అంటే “అలా అడిగితే ఏం బాగుంటుంది. అన్నయ్య కూడా ఉన్నాడు కదా” అనేసింది. అంటే ఎంత కాదనుకున్నా అందరి మనసుల్లోనూ ఆ అనామక ప్రాణి తిష్ట వేసాడు. అందుకే సోమసుందరం తాపత్రయం.

అందుకే “మీరు ఎప్పుడో ఇవ్వాలనుకున్నదేదో.. ఇప్పుడే ‘ఇచ్చేస్తే’ కాదా… మీ కూతురు సుఖపడితే మీకు మాత్రం సంతోషం కాదా” అంటూ లాజిక్కు మొదలుపెట్టాడు.

అల్లుడి మాటలు కొద్దిగా అయినా రుచించడం లేదు భక్తవత్సలానికి.. మాటామాటా పెరిగిపోయింది. “అప్పుడే.. ఇచ్చేయ్యడమూ.. పంపకాలూనా. ఏదైనా నా తదనంతరమే” తేల్చి చెప్పాడు.

***

భక్తవత్సలంది.. ఖజానా శాఖలో గెజిటెడ్ పోస్టు వద్దన్నా.. డబ్బే. అన్ని హంగులతో ఉన్న అధునాతన బిల్డింగు కట్టించాడు. అదే బలం అల్లుడికి.

గాయిత్రికీ చదువు పెద్దగా లేదు. భర్తను కాదని తండ్రి తరఫున ఏం మాట్లాడినా .. ఇంట్లో అందరూ యాగీకి వస్తారు. ముఖ్యంగా ‘పెద్దాడబడుచు’. భర్త కన్నా ముందు ‘ఆమెకు’ భయపడాలి.

తండ్రి కానుకలుగా ఇచ్చిన దాన్ని.. ఈమె హస్తగతం చేసుకున్నదే ఎక్కువ. ఏమీ అనే ధైర్యం లేక సర్దుకుపోయేది. సంసారం అంటే రాజీ పడడమే కదా!

ఆ గొడవ తరువాత.. చాలా రోజులు పుట్టింటిలోనే ఉండిపోయింది. సంక్రాంతి గడచి చాలా పండుగలే వస్తున్నా.. ఏ పండక్కి సోమసుందరం రాలేదు. గాయిత్రి రమ్మని ఫోనులు చేస్తున్నా.. “ఇదిగో అదిగో” అనడమే గాని బయలుదేరింది లేదు.

అదేమన్నా గవర్నమెంటు ఉద్యోగమా! శెలవులు దొరక్కపోవడానికి. పైకి బింకంగానే ఉన్నా, గాయిత్రి మనసు కీడు శంకిస్తుంది. భర్తకు పట్టిన డబ్బు ‘జబ్బు’ను వదిలించే శక్తి తనకు లేదు. ఎన్నాళ్ళు భర్తకు దూరంగా ఉంటే కాపురం నిలుస్తుంది.

పాపాయి బుడిబుడి నడకలు నడుస్తుంది. చిన్న చిన్న.. మాటలు వస్తున్నాయి. ఆ సంతోషాన్ని పాలుపంచుకోవడానికి సోమసుందరానికి అదృష్టం లేదు. అలా అని సరిపెట్టుకునే పరిస్థితీ తనది కాదు.

ఇంతకుముందు సోమసుందరానికి.. అక్క కూతురు ‘అలివేలు’నే ఇచ్చి చేయ్యలనుకున్నారట, మేనమామ అంటే ఆ పిల్లకూ ఇష్టమేనట. దగ్గర సంబంధానికి… ఆ పిల్ల తండ్రి ఇష్టపడక.. వేరే సంబంధం చేసారు. ఆరు నెలలు తిరగకముందే.. రోడ్డు ఆక్సిడెంట్లో కట్టుకున్న వాడు కాస్తా పోవడంతో.. పుట్టింటికే వచ్చేసింది అలివేలు.

అలా పుట్టింటి కొచ్చేసిన అలివేలు.. అప్పుడపుడు అమ్మమ్మ గారింటికి.. అంటే తమ ఇంటికి.. వచ్చేది. సోమసుందరానికి ఆ పిల్ల మీద ఉండే అభిమానాన్ని ఏ విధంగా అర్ధం చేసుకోవాలో తెలిసేది కాదు గాయిత్రికి. ఊరుకుంటే తన జీవితంలోకీ వచ్చేస్తుందేమోనన్న భయం వెంటాడుతుంది. అందుకే పుట్టింటిలో ఉన్నా ముళ్ళ మీదే ఉన్నట్లుంది.

***

అన్నయ్య వరుస అయిన కేశవరావుతో తన కష్టం చెప్పుకుంది, గాయిత్రి. కేశవరావు ఊరిలో పెద్దమనిషి తరహాగా ఉండి, సెటిల్మెంటులు చేస్తుంటాడు.

భక్తవత్సలానికి కూతురంటే వల్లమాలిన ప్రేమ. మనవరాలు ‘మానస’ అంటే ముద్దు. ఒక్క నిమిషం వదిలేవాడు కాదు. అంత గొడవ జరిగిన తరువాత కూతుర్ని ఆ ఇంటికి పంపాలంటే ధైర్యం చాలడం లేదు. ఇప్పుడే ఆస్తులు పంచలేదన్న కోపంతో “ఏ అర్ధరాత్రి అయినా కూతుర్ని.. కిరోసిన్ పోసి తగలెట్టేస్తేనో” అన్న ఆలోచన. తన సంపాదన అంతా జలగలా అల్లుడు పీల్చేయ్యలనుకుంటున్నాడు. ఇదంతా కొడుకు ప్రయోజకుడు కాకపోవడం వల్లే వచ్చింది.

అదే మాట కేశవరావుతో అంటే “అలాటిందేమీ జరగదులే’ అని నచ్చచెప్పి వప్పించాడు. సోమసుందరాన్ని బుజ్జగించి.. గాయిత్రిని అక్కడ చేర్చి వచ్చారు కేశవరావు దంపతులు.

గాయిత్రి కాపురం కొన్నాళ్ళు సజావుగా సాగినా.. సోమసుందరం ప్రవర్తనలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. భార్యపై చీటికి మాటికి విసుక్కోవడం.. ముద్దులొలికే పాపాయి దగ్గర కొచ్చినా పట్టించుకోకపోవడం చేసేవాడు.

అత్తమామలూ అలాగే ఉండేవారు. కోరి అత్తవారింటికి వచ్చిన గాయిత్రి పరిస్తితి .. సంతోషం అంటే ఏమిటో తెలియని, వండి వార్చే మరమనిషిలా తయారైపోయింది. చంటి పిల్లని చూసుకుంటూ, ఇంటిని చక్కపెట్టలేక పోయింది. .

ఓ సారి సోమసుందరం మామగారిని ఏదో అంటే “మా నాన్నని అలా తక్కువ చేసి మాట్లాడవద్దు. ఆయన మనకి కాకపోతే ఎవరికి ఇస్తారు. ఎవరూ వెళ్ళేటపుడు ఏదీ పట్టుకుపోరుగా. అన్నయ్యే సరిగ్గా ఉంటే మాకు ఇలాంటి కష్టం వచ్చేది కాదు” ఎదురుతిరిగింది గాయిత్రి.

అందరిలోనూ భార్య అలా అనేసరికి.. ఉక్రోషం పట్టలేక చెయ్యి చేసుకున్నాడు. విషయం ఊరూ వాడా తెలిసేలా రాద్దాంతం చేసాడు. సిగ్గుతో చచ్చిపోయింది.

ఇక అక్కడ ఉండలేక… తండ్రి అనే మాటలు నిజం కాకూడదని, ఉరుములేని పిడుగులా చంటిపిల్లని తీసుకుని పుట్టింటికి వచ్చేసింది గాయిత్రి.

***

నాలుగేళ్ళ తరువాత..

ఇంట్లోంచి వెళ్ళిపోయిన భక్తవత్సలం కొడుకు చంద్రశేఖరాన్ని అల్లుడుగా చేసుకోవడానికి సిద్దపడ్డాడు భక్తవత్సలంకు వరుసైన బంధువు ఆదినారాయణరావు. ఇళ్ళకు రంగులు వేసే పెయింటర్ అయినా, చేపల చెరువులకు కాపలాదారుడైనా చంద్రశేఖరం, ఆస్తి పరుడైన తండ్రికి కొడుకు.

ఆర్ధికంగా చితికిపోయిన ఆదినారాయణరావు చిన్న కూతురికి పెళ్లి చెయ్యలేక అవస్థ పడుతున్నాడు.

అది ఎలా వున్నా అవారాగా తిరిగే కొడుక్కి సంబంధం ఎదురొస్తే కాదనేదేముంది. అందునా చిన్నప్పటినుంచీ తెలిసిన ఆదినారాయణరావు.

పెళ్లి ‘అన్నవరం’లో పెట్టుకున్నారు. కొత్త కోడలు శార్వాణితో.. కొడుకు చంద్రశేఖరం స్వంత ఇంట్లోకి అడుగు పెట్టాడు.

ఐశ్వర్యం ఉన్నా అయిదవతనానికి దూరమై.. ఒంటరిదైపోయిన గాయిత్రిని చూసి అందరూ జాలి పడేవారు..

“ఏమ్మా ఎలా ఉన్నావ్” అంటే చాలు.

“నాకేం.. నేను బాగానే ఉన్నాను” అనేది పెడసరంగా, భర్త అనే వాడు లేకపోయినా.. నేను కూడా మీలాగే సంతోషంగా ఉండగలను సుమా! అన్నట్లు. భర్త.. లాయరు అయి ఉండి కూడా విడాకులు తీసుకోకుండానే.. అక్క కూతురుతో.. ఇద్దరు పిల్లలతో సుఖంగా ఉన్నాడు. పిల్లను పెట్టుకుని.. తండ్రి దగ్గరే ఉండిపోయింది గాయిత్రి.

తల్లితండ్రుల దగ్గరకు వచ్చేసినా.. భక్తవత్సలం ముభావం… చంద్రశేఖరానికి మింగుడు పడలేదు. తన కొడుకు ఇళ్ళకు సున్నాలు కొట్టుకునే పనిచెయ్యడం ఎంతమాత్రమూ నచ్చలేదు. చదువు లేదు కాబట్టి, ఉద్యోగానికి పనికిరాడు. ఏదైనా పెట్టుబడి పెట్టి .. కిరణాషాపు లాంటిది పెట్టిద్దామన్నా.. దాన్ని నడపగలుగుతాడన్న నమ్మకం కలగడం లేదు.

శార్వాణి అందరితోనూ కలుపుకోలుగా ఉన్నా.. “అత్తయ్యా, మామయ్యా” అని వెంటతిరిగినా.. ఇంటి పెత్తనం గాయిత్రిదే.

తండ్రి ఇంట్లో భోజనానికి ఇబ్బంది లేకపోయినా.. చేతి ఖర్చులకు డబ్బు ఎవరిని అడగ్గలడు?

నెల తిరిగే సరికి…

భార్యని తీసుకుని తను ఉండే ఊరికి బయలుదేరాడు. ఆలస్యమైతే జట్టు మేస్త్రి వప్పుకోడన్న నెపంతో. కొడుకు మళ్ళీ దూరం అవుతున్నందుకు బాధపడింది వసుంధర. కొంత డబ్బు, ఇంటిసరుకులు ఇచ్చి పంపింది. “వస్తుంటాం లే అత్తయ్యా” ఓదార్చింది శార్వాణి.

***

కాలక్రమంలో చంద్రశేఖరానికి ఇద్దరు పిల్లలు పుట్టుకొచ్చారు. వాళ్ళను పెంచగలిగే శక్తి లేదు. నెలలో అన్ని రోజులూ పనిదొరికేది కాదు. దొరికినా కొన్ని రోజులు ఇల్లొదిలి పెట్టి ఉండాల్సివచ్చేది.

శార్వాణి అప్పుడపుడు వచ్చి వెళ్ళేది. ఆ వంకనైనా మామగారి మనసు మారి ఏమైనా ఆర్ధిక సహాయం చేస్తాడేమోనని. అవసరానికి ‘ఆ కష్టం’ నుంచి బయటపడేసినా .. పరిస్థితి మళ్ళీ మామూలే.

గాయిత్రితో.. శార్వాణి ఒద్దికగానే ఉండేది, తను ఉండాల్సిన స్థానంలో ఆడపడుచు వేళ్ళునుకుపోయింది. కోడలిగా తనకు స్వతంత్ర ప్రతిపత్తి లేదు ఆ ఇంట్లో. ఆమె దయ.. తమ పిల్లల ప్రాప్తం.

ఆదినారాయణరావు పాచిక నెరవేరలేదు. తన కూతురు కోటలో పాగా వెయ్యలేకపోయింది. అల్లుడి కష్టం చూసి .. తన పరపతి ఉపయోగించి, నీటిపారుదల శాఖలో ఓ చిన్న ‘లస్కరు’ పోస్టు వేయించాడు. అదీ పూర్తి టెంపరరీ. కాకపోతే నెలతిరిగే సరికి జీతం వస్తుంది.

***

కొన్నాళ్ళకి కిడ్నీ వ్యాధి సోకింది భక్తవత్సలానికి.

ట్రీట్‌మెంట్ సమయంలో ‘డయాలసిస్’ పేరుతో.. లక్షలు.. మంచినీళ్ళలా ఖర్చు అయ్యింది. ఉన్న పొలం అమ్మేసారు. ఆ సమయంలో చంద్రశేఖరం చేదోడు వాదోడుగా ఉండేవాడు. చాన్నాళ్ళు .. బాధపడి ఓ తెల్లవారుఝామున కన్నుమూసాడు భక్తవత్సలం.

అన్నీ తానై ఖర్మకాండలు జరిపించాడు చంద్రశేఖరం. పున్నామ నరకం నుండి తండ్రిని రక్షించాడు. పుట్టినందుకు ఋణం తీర్చుకున్నాడు. ఇక తండ్రి అడ్డంకి లేదు కాబట్టి, ఇక హక్కుగా ఇక్కడే ఉంటాడు, కొడుకు .. అనుకున్నారంతా. వసుంధర కూడా అలాగే అనుకుంది.

దినకార్యం రోజున.. ఆస్తుల విషయం కదలేసారు పెద్దలు.

“ఈ ఇల్లు నాకు ‘వ్రాసాడు’ మా నాన్న. రాజోలులో ఉన్న ఇంటిలో ఒక పోర్షన్ మా అమ్మాయికి, ఇంకో పోర్షన్ అన్నయ్యకు వ్రాసాడు” పెద్దలతో చెప్పింది గాయిత్రి. నాలుగేళ్ళ క్రిందట వ్రాసిన.. రిజిస్టర్డ్ కాగితాలు చూపిస్తూ.

అందరూ ముక్కున వేలేసుకున్నారు. కొడుకుతో సేవ చేయించుకుని చివరికి భక్తవత్సలం చేసిన పని ఇదా!

ఎక్కడో యాభై కిలోమీటర్ల అవతల.. రాజోలులో. ఆ ఇల్లు తనేం చేసుకుంటాడు. దానికోసం.. వెళితే ఇక్కడ చేస్తున్న పనికి ఇబ్బంది.

అన్నీ ఆలోచించుకుని “నేను ఈ ఇంట్లో ఉండలేను” అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు చంద్రశేఖరం.

“మళ్ళీ ఎప్పుడొస్తావ్” అడగలేదు గాయత్రి. ఎందుకంటే ఉన్న ‘గూడు’.. ఇప్పుడు పూర్తిగా తనది. తను బ్రతికినంత కాలం.. ఇక్కడే బ్రతకొచ్చు. అన్నయ్య అనుకుంటూ.. ఆప్యాయతలు పెంచుకుని .. సమస్యల్ని ముందు పెట్టుకోదలుచుకోలేదు. తన మనుగడ ప్రశ్నార్ధకం చేసుకోలేదు. తనకీ పెళ్లి చెయ్యాల్సిన కూతురుంది.

తండ్రి ఆస్తిని.. కోరుకుని, తనని నిర్లక్ష్యం చేసిన ఆశాపాతకుడైన భర్తకు దూరమైంది.. ప్రశాంతమైన జీవనం కోసమే. ఇన్నాళ్లూ లేని అన్నయ్య.. ఈ రోజు వచ్చి తనను ఉద్ధరించేది ఏముంది. అందుకే అన్నయ్య వెళ్లిపోతున్నా.. మౌనం వహించింది.

పేగుబంధం గానీ, మమతాపాశం ఆమెను కదిలించలేకపోయాయి. స్త్రీ కరుణామయి అయినా రేపటి రోజున ఆమెకీ స్థిరత్వం కావాలి.

అన్నయ్య వెళ్లిపోతుంటే, వారించకపోగా.. భర్త అలవాటుగా కూర్చునే పడక్కుర్చీలో .. ఇదంతా నా ప్రపంచమే అన్నట్లు తనదైన ధీమాగా కూర్చున్న గాయిత్రిని చూసి విస్తుపోయింది వసుంధరమ్మ.