22. వరమైన మొక్కు

0
5

[box type=’note’ fontsize=’16’] 2018 దీపావళి కథల పోటీకి వచ్చిన కథ. [/box]

[dropcap]ఎ[/dropcap]ప్పుడూ రద్దీగా ఉండే ఆశీలుమెట్ట జంక్షన్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర గాలికి కదిలే బొమ్మలు అమ్మేవాళ్ళు, ఎండ తగలకుండా కారు అద్దాలకి పెట్టే మెష్‌లు అమ్మే వాళ్ళూ, సాంబ్రాణి ధూపం వేసే వాళ్ళూ, సిగ్నల్ పడ్డప్పుడల్లా అటూఇటూ తిరుగుతున్నారు.

అలా తిరుగుతున్న వాళ్ళలో సూరిగాడు కూడా ఉన్నాడు. వాడికి పదిహేనో పదహారో ఏళ్ళు ఉంటాయి. నల్లగా బక్కగా పొడవుగా ఉన్నాడు. చేతిలో గాలికి ఊగే బొమ్మలు న్నాయి. ఆగిన ప్రతీ కారు దగ్గరకి వెళ్ళి చేతిలో బొమ్మలు చూపించీ కొనమని అడుగుతున్నాడు. కానీ లాభం లేకపోయింది. అసలే రాత్రి భోజనం లేదేమో నీరసంగా అనిపించి పక్కనే చెప్పులు కుట్టే తాత దగ్గర కూర్చున్నాడు.

“ఏ ఊర్రా మనది బొట్టోడా?” అడిగాడు తాత నోట్లోంచి చుట్ట తీసి

“ఇజీనారం దగ్గర్లే “అన్నాడు సూరిగాడు.

“అమ్మా నాన్నా ఉన్నారా? ఏటి సేత్తారేటి?” అడిగాడు తాత. తాతకి కూడా తోచటం లేదు మరి బేరాల్లేక.

“ఏటి సేత్తారంటే… మా ఊర్ల పనుల్లేవు. ఇశాపట్నంల బిల్డింగులు కట్టేపని ఎక్కువుంటాదని కూలి దొరుకుతాదని మా ఊరోళ్ళు సెప్తే ఆళ్ళతో బడి ఓ జట్టుగా అచ్చేసినాం. వో వోరం అయినాది. మా అయ్య ఇటికలు మొయ్యడానికి కుదిర్నాడు. మా అమ్మ రెండిళ్ళలో పాచిపనికి కుదిర్నాది. సెల్లి కూడా ఒకింట్లో పిల్లల్ని ఆడించడానికి కుదిర్నాది. నాకే ఏ పనీ లేదు. ఊరవతల బ్రిడ్జి కింద గుడిసెలల్ల ఉంతాం. నిన్న మా ఇంటి కాడ ఒకడు ఈ బొమ్మలు అమ్మితే కమిషన్ గెడతాదంటే ఈ పనిలో దిగినాను. కానీ నిన్న ఏటీ అమ్మనేదు. ఇయ్యాల కూడా ఏటీ అమ్మనేదు” అని అడిగిందే తడవుగా చరిత్ర చెప్పాడు.

ఈ లోగా ఒక పదిమంది మగాళ్ళు ఆడవేషం వేసుకున్నట్లున్నవాళ్ళు చప్పట్లు కొట్టుకుంటూ వచ్చారు. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగిన వాళ్ళ దగ్గర కెళ్ళి, బుగ్గ మీద పొడిచీ నెత్తి మీద చరిచీ డబ్బు అడుగుతున్నారు. విచిత్రం! వాళ్ళకి చాలా మంది పదులూ ఇరవైలూ ఇచ్చారు. ఇదంతా సూరిగాడు తెల్ల మొహం వేసుకుని ఈర్ష్యగా చూశాడు. తన చేతిలో ఉన్న బొమ్మల వైపు చూసుకున్నాడు.

“కాలం ఏం మారిపోనాదిరా? ఈడే కొన్నేళ్ల క్రితం ఆడంగులు చంటిపిల్లల్ని చేటల్లో పెట్టుకుని అడుక్కునే వోరు. చిన్న పిల్లలు కూడా అడుక్కునే వోరు. ఆళ్లని పోలీసులు తరిమేసే వోరు. గవర్నమెంటోళ్ళు పిల్లలు అడుక్కోకూడదని రూలెట్టినారు గదా. ఆళ్ళంతా ఎటు బోయినారో బోయినారు. ఇప్పుడు ఈళ్ళు దిగారు. ఏ సిత్రమో ఈళ్ళకి బానే గొడతాది. ఈళ్ళని ఇజ్రాలంటారంట” అని తనకి తెలిసిన విషయాలు చెప్పాడు తాత.

ఈ లోగా ఆ గుంపులో ఒకడు పక్కనున్న మునిసిపల్ ఆఫీసు దగ్గర ఇడ్లీ దోశలూ అమ్మే బండి దగ్గర కెళ్ళి ఇడ్లీ తెచ్చుకున్నాడు. ఆ గట్టు మీదే కూర్చుని పొట్లాం విప్పుతున్నాడు. చూడకూడదనుకుంటూనే అటు చూశాడు సూరిగాడు. వాడి కళ్ళలో ఆకలి పసిగట్టిన అతను “తింటావా?” అని అడిగాడు.

“ఉహుఁ వద్దు” అన్నాడు సూరిగాడు, లోపల చిన్న భయంతో. కానీ అతను ఊరుకోలేదు.

“ఫరవాలేదు తను. నా కాడ ఇంకా డబ్బులున్నాయిలే. నే తెచ్చుకుంటా” అన్నాడు అతను. తాత కూడా “తీసుకోరా, పొద్దేలకాణ్నించీ ఏటీ తిట్లేదుగదా” అన్నాడు.

ఫైనల్‌గా ఆకలి జయించింది. తినేసి “తేంక్సన్నా” అని కళ్ళు తుడుచుకున్నాడు.

“ఫర్లేదులే” అని అతను మిగతా వాళ్ళలో కలిసి వెళ్ళి పోతూ “నువ్వీడే ఉంటావా సందేల దాకా?” అని అడిగాడు.

“ఆ ఈడే ఉంటాను” అని జవాబిచ్చాడు సూరిగాడు.

సాయంత్రం దాకా ఆ జంక్షన్ దగ్గర తిరిగినా ఏవీ అమ్ముడు పోలేదు. కాళ్ళీడ్చుకుంటూ ఇంటికి బయల్దేరాడు. ఇంటి కాడ ఎట్టున్నాదో, అమ్మా అయ్యా కూడు తిన్నారో లేదో? ఎప్పుడో పొద్దున్న తిన్న ఇడ్లీ. వాడికి ఆకలి వేస్తోంది. వాడికి ఇజ్రాలూ వాళ్ళ చేతుల్లో డబ్బులూ గుర్తిస్తున్నాయి బొమ్మలు షావుకారు దగ్గర అప్పజెప్పి, ఇంటి కెళ్ళి పోయాడు.

“యాడికి బోయినావురా? ఇంత నేటయినాది?” అని అడుగుతూనే “కూడు తిందువుగాని రా” అంది వాడి తల్లి. వాడికి ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే రోజూ కూడడిగితే వాడమ్మ బాధతో విసుక్కుంటుంది, అందుకని. “కూడేడదే?” అని అడిగాడు సూరిగాడు.

“పక్కింటి ఈరమ్మ పన్జేసే అమ్మ గారింట్లో ఏటో పంచను జరిగినాదంట. ఆ యమ్మ మిగిలిన కూరలూ అన్నం పంచేస్తంటే నాను కూడా ఈరమ్మతో ఎల్లి తెచ్చినాను.. స్పీటు కూడా ఉన్నాది” అని సంబరంగా చెప్పింది.

“అమ్మయ్య” అని కడుపు నిండా తిని ఎన్నో ఆలోచనల్లో నిద్ర పోయాడు. వాడి చెల్లి అప్పటికే నిద్ర పోయింది.

***

“ఓలమ్మో!ఇప్పుడు నానేటి సెయ్యాల? ఆ యమ్మ రమ్మన్నాది. మంచి సీర కట్టుకొని రమ్మన్నాది. ఇంట్లో సూత్త పెట్టి లోన సిలుకు సీర రైక కాపట్టం నేదు. ఏ దొంగోడట్టుకు పోనాడో. ఇప్పుడు నానేటి సెయ్యాల? ఆడి దివసం దెయ్య” అని వాడి తల్లి గుడిసె ముందు నుంచొని నానా తిట్లు తిడుతోంది. చుట్టుపక్కల వాళ్ళంతా నడ్డి మీద, బుగ్గ మీద చేతులేసుకుని వింటున్నారు.

“ఇప్పుడు నీకు సిలుకు సీర ఎందుకే” అని అప్పుడే వచ్చి జాయినయిన గుంపమ్మ అడిగింది.

“ఆ ఎందుకా? నాను పని సేసే అమ్మ గారు పారిటీ ఇత్తన్నారంట. శానామంది వత్తారంట. సాయం సెయ్యనానికి రమ్మంది. బోయినఁ వెడతానంది. వంద రూపాయలు యిత్తానంది. కాస్త మంచి సీర కట్టుగురా అని సెప్పింది. ఇప్పుడు సూత్తే పెట్ల సీర నేదు. నాటి జెయ్యాల?” అని మళ్ళీ మొదలెట్టింది. దాని కళ్ళ ముందర ఆవిడ తెప్పించిన స్వీట్‌లూ, హాట్లూ, పులిహోర, పాయసం కదలాడుతున్నాయి. ఎంతో కొంత తెచ్చి పిల్లలకీ, మొగుడుకీ పెట్టుకుందామని ఆశ పడింది. దాని ఆశ నిరాశ అయిపోయిందని బాధ పడుతోంది.

ఇంతలో సూరిగాడు వచ్చి ఇంటి ముందు గుంపుని చూసి బెదిరాడు. చేతిలో సంచి ఇంట్లో పెట్టి బయటికి వచ్చి “ఏటయినాదే అమ్మా? ఏటీ గోల?” అనడిగాడు.

దాని కోపం వాడి మీదకి మళ్ళింది. “యాడికి బోయినావురా ఇంత సేపు? పనేటీ నేదని ఇంట్ల ఉంటానన్నావు గందా. నా సిలుకు సీర ఎవడో ఎత్తు కెళి బోనాడు. ఇప్పుడేం జెయ్యాల?”అని మళ్ళీ మొదలెట్టింది.

“సరిగా జూశావే?” అని సూరిగాడు అనడమే తడవు వాడి మీద పడి కొట్టినంత పని చేసింది.

వెటకారంగా చేతులు తిప్పుతూ “ఆఁ వంద గదులూ పదారు బీర్వాలూ ఉన్నాయనీ నా వెతుక్కోకపోనాప్లే నువ్వెళ్ళి జూడు, ఉన్నది ఒక్క పెట్టె ఏటి సరింగా జూసేది?” అని విదిలించింది.

సూరిగాడు లోపలకెళ్ళి కొంచెం సేపట్లో చేతిలో చీరతో తిరిగొచ్చాడు. “ఇదేనేటీ?” అంటూ.

నోరు తెరుచుకుని చూస్తూ ఉండిపోయింది వాడి తల్లి. “యాడున్నాదిరా?” అనడిగింది పక్కింటి ఈరమ్మ.

“సంచీలెట్టినాది. దానిమీద బొంత పడి పోనాది గావాల. కాపడనేదు. సంచీలెట్టి పెట్ల ఎతికితే ఎలా కాపడతాది?” అన్నాడు వాడు.

వాడి తల్లి కింకేమీ వినబడలేదు. చీర లాక్కుని గబగబా లోపల కెళ్ళి పోయింది. దానికి చాలా సంబరంగా ఉంది. నాలుగు చెంబులు నీళ్ళు పోసుకుని ఆ చీర కట్టుకొని బయటికి వచ్చి

“నానెళ్తున్నానురా ఇప్పటికే ఆలీసం అయిపోనాది. ఆయమ్మ ఏటంటాదో?”అని గబగబా పరుగులాటి నడకతో వెళ్లిపోయింది.

గుమిగూడిన గుంపు కూడా కథ సుఖాంతం అయినందుకు సంతోషించి నెమ్మదిగా వెళ్లిపోయారు..

సూరిగాడు అమ్మయ్య అనుకుని లోపలకెళ్ళి వెంకన్న ఫొటో కి దణ్ణం పెట్టి లెంపలు వేసుకుని మూల ఉన్న చాప పరుచుకుని పడుకున్నాడు.

వాడికి నిన్న సాయంత్రం నించీ జరిగిన వన్నీ గుర్తొచ్చాయి.

నిన్న పొద్దున ఇడ్లీ పెట్టిన వాడు సాయంత్రం మళ్ళీ వచ్చాడు. ఆమాటా ఈ మాటా మాట్లాడి వాడి మనసులో మాట బయట పెట్టాడు.

“నీకింత జుట్టూ, చెవులకి కన్నాలూ ఉన్నాయి కదా, రేపు నాతో వచ్చావంటే మనిద్దరం వేరేగా తిరుగుదాం. వచ్చిన డబ్బులు ఇద్దరం పంచుకుందాం” అన్నాడు. కానీ సూరిగాడికి భయం వేసింది.

“అమ్మో ఇది వెంకన్న బాబుకి మొక్కిన జుట్టు. మా యమ్మ తంతాది” అన్నాడు.

“మొక్కైతేనేమీ, నువ్వేమీ కట్ జేసుకోవట్లేదు గదా. మరేం ఫర్వాలేదు. నీటుగా జడేసుకుని నానాగ తయారయినావంతే మనిద్దరం తిరుగుదాం” అని అన్నాడు.

“నేను మీలో కలవ” అన్నాడు తను. “కలవక్కర లేదు. నేను ఈ ఊళ్ళో ఉన్నన్నాళ్ళూ మనిద్దరం ఒక జట్టు. తరవాత ఎవరి దారి వారిదే” అన్నాడు

వాడు.

“కానీ మొక్కుకున్న జుట్టు గందా పాపం కాదా” అన్నాడు తను.

ఇదంతా వింటున్న తాత నోట్లోంచీ చుట్ట తీసి “ఒరే బొట్టోడా, నానోటి సెప్తా ఇను. ఆ బగమంతుడు ఇచ్చిన కాలూ, చేతులుతోనే పని జేసి డబ్బులు సంపాదిత్తన్నాము. మరి ఆ డబ్బులు మొక్కులు దీర్చనానికి వోడుతాము గందా. మరలాగే ఆ బగవంతుడు ఇచ్చిన జుట్టు డబ్బులు సంపాదించనానికి ఉపోగించుకో. ఇందల తప్పేటి?” అన్నాడు. పైగా “డబ్బులు సంపాదించి మొక్కు తీర్చీ” అని కూడా అన్నాడు.

మొక్కు తీర్చనానికి ఆ మొక్కు కున్న జుట్టునే వాడుకోమన్న తాత తెలివికి ఆశ్చర్యపోయాడు.

“మరి మీ జట్టులో వాళ్ళు ఏటీ అనరా” అని అడిగాడు తను. తను మెత్తబడ్డాడని గమనించి వాడు ఉత్సాహంగా

“అదంతా నేను చూసుకుంటా. నువ్వు రేపు ఓ సీరా రైకా ఒట్టుకుని ఈడకి రా” అని “మీ అమ్మ రైక నీకు సరిపోతాదా” అని అడిగాడు.

మళ్ళీ వాడే “రేపు ఏదో ఒకటి చేద్దాం లే” అన్నాడు.

వాడు వెళిపోయాక తాత మళ్ళీ ధైర్యం చెప్పాడు. వాళ్ళ చేతుల్లో ఆడే డబ్బు గుర్తు చేశాడు.

నిన్న రాత్రి చాలా ఆలోచించాడు. ఓపిక లేకపోయినా పన్లో కెళ్తున్న అయ్యా, బట్టలుతికీ అంట్లుతోమీ వొరిసిపోయిన కాళ్ళూ చేతుల్తో బాధ పడుతున్న తల్లీ, చిన్నదైనా పిల్లల నెత్తుకోడానికి కుదిరిన చెల్లినీ తలుచుకునేసరికి వాడు చెయ్యబోయే పనిలో పెద్ద తప్పు లేదనిపించింది. అయినా తాత చెప్పినట్టు తనేం దొంగతనాలు చేస్తున్నాడా దోపిడీలు చేస్తున్నాడా? అడిగినప్పుడు ఇచ్చిన వాళ్ళు ఇస్తారు లేని వాళ్ళు లేదు. అలా తనకి తను ధైర్యం చెప్పుకుని నిద్ర పోయాడు.

ఇయ్యాల పొద్దున్నే మిగతా వాళ్ళు అందరూ పనికి వెళ్ళాక అమ్మ సీరా రైకా ఒట్టుకుని వాడు చెప్పిన చోటికి వెళ్ళాడు. వాడు తనని ఒక దగ్గరకు తీసుకెళ్లి ఓ అరగంట కష్టపడి అమ్మాయిలా తయారుచేశాడు. అద్దంలో చూసుకుంటే అమ్మ పెళ్లి ఫోటోలలో ఎలా ఉన్నాదో అలా ఉన్నాడు. అదృష్టం! అమ్మ రైక సరిగా సరిపోయింది.

వాడి వెనకాల తిరిగాడు. మొదట్లో కొంచెం భయం వేసినా మద్దినేలకి తగ్గి ధైర్యం వచ్చింది. కొంచెం సురుగ్గా తిరిగాడు.

మద్దినేలకి వచ్చిన డబ్బులోంచి కొంచెం బోయినానికి కూడా ఇచ్చాడు.

సీకటి పడి పోతుండగా ఇదుగో తీసుకో అని ఓ రెండు వందలు చేతిలో పెట్టాడు.

మళ్ళీ పొద్దున్న వెళ్ళిన చోటికి వెళ్ళి ఆ వేషం మార్చి ఇంటి కొచ్చేసరికి ఈ గోల.

పేలు పట్టి చీదరగా ఉన్నప్పుడు తలనీలాలు తీయించలేక పోయినందుకూ కులాచార ప్రకారం చెవులు కుట్టించినందుకూ ఇన్నాళ్ళూ విసుక్కున్నా ఈ వేళ మాత్రం చాలా సంతోషంగా ఉన్నాడు.

ఇప్పుడు జేబులో ఉన్న ఆ రెండు వందలూ వాడి తల్లిని వాడు ఒప్పించగలననే నమ్మకం ఇచ్చాయి. వాడు తల్లి కోసం ఎదురు చూస్తూ నిద్ర లోకి జారుకున్నాడు.