23. ప(మ)నీ మనిషి

0
9

[box type=’note’ fontsize=’16’] 2018 దీపావళి కథల పోటీకి వచ్చిన కథ. [/box]

[dropcap]కొ[/dropcap]త్తగా పెళ్లయిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు కుమార స్వామి, కుముదినిలు బెంగళూరు వైట్ ఫీల్డ్‌లో ఇండిపెండెంట్ హౌస్ బాడుగకి తీసుకున్నారు. వారి ఉద్యోగాలు కాలికి చక్రాలు కట్టి తిరిగిన మాదిరి ఉదయం నుంచి రాత్రి వరకు ఉరుకులు, పరుగులు.

వారానికొకసారి ఇల్లు శుభ్రంచేసేదానికి పని మనిషిని పెట్టుకుందామని భర్తని గోముగా అడిగింది కుముదిని. ‘కొత్త పెళ్లి కూతురును భద్రంగా చూసుకోరా అబ్బీ’ అని అమ్మమ్మ చెప్పి వుండటంతో ‘ఓకే’ చెప్పినాడు కుమార స్వామి. తాము వున్న కాలనీలో పనిమనిషి కోసం వెదికినారు. సరైన మనిషి దొరకలేదు. ఆదివారం తెలుగుదినపత్రికలో ‘పనిమనిషి కావలెను’ అని క్లాసిఫైడ్ అడ్వర్టయిజిమెంట్ ఇచ్చినారు.

***

జనవరి నెల – మొదటి ఆదివారంనాడు…

చింతకాయల సరోజ, సమ్మెట సుశీల, రాచకొండ రాణి, నడింపల్లి నవనీతలు పత్రికా ప్రకటన చూసి పనిమనిషి పదవి కోసం వచ్చినారు. కుముదిని పనికోసం వచ్చిన వారి పూర్వాపరాలు విచారించి మంచి చెడ్డలు పరిశీలించింది. చేయాల్సిన పనులు, చేయకూడని పనులు, పనివేళలు, జీత భత్యాలు మరియు ప్రవర్తన నియమావళిని వివరించింది. వచ్చిన వారిలో సైన్స్ పాసైన నవనీత తప్పితే మిగతా వారు కుముదిని ఇంటర్వ్యూలో గెలుపు సాధించలేకపోయారు.

చక్కగా స్థానంచేసి శుభ్రమైన దుస్తులు ధరించిన నవనీత మంచి కట్టు బొట్టు సాంప్రదాయం కలిగిన అమ్మాయిలాగా కనిపించింది కుముదిని కంటికి. కరెక్టు టైంకి పనికి రావాలని, ముందు చెప్పకుండా గెలవు పెట్టరాదనీ సూచించింది. మేము కాలనీకి కొత్త కాబట్టి, నీ గతం మాకు తెలియదు కాబట్టి మా జాగ్రత్తల్లో మేము వుండాలి కాబట్టి మీ ఇంటి అడ్రసు, మొబైల్ నెంబరు, సిటీలో మీకు పరిచయం వున్న ఇద్దరి ఫోన్ నెంబర్లు, ఆధార్ కార్డు నెంబరూ కావాలని కోరింది. అన్నిటికీ తల వూపింది నవనీత. ఓనరమ్మ అడిగినట్లే అన్నీ వివరంగా తెల్ల కాగీతంలో వ్రాసి కవర్లో పెట్టి ఇచ్చింది. తన ఇంటర్వూలో వందకి వంద మార్కులు సాధించిన నవనీతను వెంటనే ఉద్యోగంలో చేర్చుకుంది కుముదిని. తన అమ్మగారు తీసిచ్చిన గోద్రేజ్ బీరువాలో నవనీత ఇచ్చిన కవర్ని భద్రంగా దాచింది.

దూరదూరి పనిచేయసాగింది నవనీత. అవసరానికి వాషింగ్ మెషీన్ వాడమంటే “వద్దండీ, నేను వుండగా వాషింగ్ మెషీన్తో పని వుండదు’ అని భరోసా ఇచ్చింది నవనీత . ఓనరమ్మని సోఫా నుంచి కాలు కింద పెట్టనీయకుండా పనిచేసుకు పోయింది. మొగుడూ పెళ్లిద్దరూ మురిసిపోయినారు . నవనీతకు తెలియకుండా ఒకరికొకరు థమ్స్ అప్ సంకేతాలు ఇచ్చుకున్నారు.

***

జనవరి నెల – రెండవ ఆదివారం నాడు…

ఇంకా నెంబరురాని కొత్త యాక్టివా స్కూటర్లో సర్రుసర్రున ఉదయం ఆరింటికంతా డ్యూటీకి వచ్చింది నవనీత. వస్తూవస్తూ తమ ఇంటి వద్ద వున్న సన్నజాజుల చెట్టునుంచి నాలుగైదు పిడికిళ్ల సన్నజాజులు పాలిథిన్ కవర్లో పట్టుకొచ్చింది. రాత్రికి పూలుకొనే ఖర్చు తప్పిందని భార్యవైపు, పూలవైపు కొంటెగా చూసినాడు కుమారస్వామి. సిగ్గు మొగ్గలయ్యింది కుముదిని. వెంటనే వడివడిగా లేచి వేడివేడి ఫిల్టర్ కాఫీ తయారుచేసి తమతోపాటు నవనీతకు కూడా ఇచ్చింది.

నవనీత స్టూలు వేసుకొని బూజుకర్రతో ఇంటి బూజు దులిపింది. ఫినాయిల్ వేసి బాత్రూములు, వాష్ బేసిన్లు, తళతళా మెరిసేంతగా శుభ్రం చేసింది. గ్యాస్ స్టవ్‌లు శుభ్రంగా క్లీన్ చేసింది. ఓనరమ్మ ఇచ్చిన ఆహార పదార్థాలు చక్కగా తన స్వంత క్యారియర్లో సర్దుకొని ఇంటికి బయలుదేరింది.

పోతూపోతూ పోర్టికోలో కూర్చుని పేపర్ చదువుతున్న సార్తో “సార్! ఇల్లు శుభ్రం చేసేటప్పుడు బెడ్రూంలో మీరు ప్యాంటు తగిలించిన చోట నేలపై వంద రూపాయలు నోటు పడివుంది. తీసుకోండి సార్” అంటూ వందనోటు కుమార స్వామికి ఇచ్చింది. ఎగిరి గంతేసినాడు కుమారస్వామి. ‘నీతి నిజాయితీ చావలేదు జనంలో’ అని భార్యతో ఆనందంగా గట్టిగట్టిగా చెప్తాడు. ‘మన సెలక్షన్ అంటే ఏమిటనుకున్నారు’ అని కొంటెగా చెప్పింది కుముదిని. సంతోషంతో సతి, పతి ఇద్దరూ వేడివేడి బాదంపాలు తాగారు.

***

జనవరి నెల – మూడవ ఆదివారం నాడు…

తమ పెరట్లో కాచిన లేత బీరకాయల సంచీతో ఉదయం ఆరింటికంతా డ్యూటీకి వచ్చింది నవనీత. తలకోపుకి మూర మల్లెలు చుట్టి, చేతి వేళ్లకి కాళ్లకి గోరింటాకు రాసి, చేతులు నిండుగా గాజులు తొడిగి, కాలికి వెండి గజ్జెలు కట్టి, నుదుటిన పావలా బిళ్లంత బొట్టుపెట్టి లక్ష్మీకరంగా వచ్చింది. ఆమె ఇంట్లో అటూ ఇటూ తిరుగుతుంటే, ఓనరు మరియు ఓనరమ్మలకు గజ్జె కట్టిన లక్ష్మీదేవి ఇల్లంతా తిరుగులాడుతున్నట్లు అనిపించింది.

యురేకా ఫోర్బ్స్ మిషను అందుకొని ఇల్లు ఇల్లంతా శుభ్రం చేసింది. మంచం, పరుపులు, దిండ్లు, దుష్టట్లు, బొంతలు… అన్నిటినీ యురేకా ఫోర్బ్స్ సహాయంతో దుమ్ము దులిపేసింది. డస్ట్ బ్యాగుల్లో కుష్టలు కుప్పలుగా పేరుకొని వున్న మురికిని ఓనర్లకు చూపించింది. మొగుడూ పెళ్లారిద్దరూ మంచి పని మనిషి దొరికినందుకు ఖుషీ అయిపోయారు. నవనీతకు తెలియకుండా ఒకరికొకరు షేక్ హ్యాండ్లిచ్చుకున్నారు.

ఇంటి పనులన్నీ అయ్యాక పోర్టికోలో ఊగే ఉయ్యాలలో కూర్చొని ఆయిల్ పుల్లింగ్ చేస్తున్న సార్తో “సార్! ఇల్లు చిమ్మేటప్పుడు నేల మీద రెండు వందల నోటు పడివుంది తీసుకోండి సార్” అంటూ రెండు వందల నోటు కుమారస్వామి చేతికిచ్చింది. ఐసులా కరిగిపోయాడు కుమార స్వామి. ‘సిస్టర్ లాంటి సిస్టర్‌వి నీవు’ అన్నాడు. వంగి కుమార స్వామి కాళ్లకి మొక్కింది. కాళ్ల మొక్కుడికి కొవ్వొత్తిలా కరిగిపోయినాడు.

“పైసలిలా ఎక్కడంటే అక్కడ పారేస్తే ఎలా?” అని అరిచింది కుముదిని. కుముదిని మాటలు పట్టించుకోలేదు కుమార స్వామి. ఎక్కడికో… ఆకాశంలోకి ఎగిరిపోతున్నంత సంబరపడినాడు. రెండు వందల నోటుని నవనీతకే ఇవ్వబోయాడు. సున్నితంగా తిరస్కరించింది. తుర్రున బండి స్టార్టు చేసుకొని వెళ్లిపోయింది. ‘డబ్బు వుంటే కొండమీద కోతి అయినా దిగివస్తుంది అనుకుంటాం కానీ క్యారెక్టరున్న మనుష్యులు ఈ కలికాలంలో కూడా అక్కడా ఇక్కడా వున్నారండి’ అని అంది కుముదిని. భార్యభర్తలిద్దరూ నవ్వుకొంటూ సండే స్పెషల్ ఇడ్లీ పాయా చేసుకొని పని మనిషిని పొగుడుతూ తృప్తిగా తిని చేతులు కడుక్కున్నారు.

***

జనవరి నెల – నాలగవ ఆదివారం నాడు…

ఉదయం ఆరింటికే వచ్చిన నవనీత డజను బేనీషా పండ్లు తెచ్చి ఓనరమ్మ చేతికిచ్చింది. తమ్ముకూరు వద్ద తమ పల్లెలోని మామిడి తోటలో పండిన కాయలని, తన తండ్రి ఊరి నుంచి తెచ్చారనీ చెప్పింది. నోరూరించే మామిడి పండ్లను భద్రంగా ఫ్రిజ్లో దాచింది కుముదిని.

ఇళ్లంతా ఫినాయిల్ వేసిన రెండు బక్కెట్ల నీళ్లతో క్లీనింగ్ మాప్‌తో తుడిచింది. కుర్చీలు, సోఫాలు, దీవాన్లు పొడి గుడ్డతో తుడిచింది. వంట పాత్రలు కడిగింది. చివరిగా ఓనరు పచ్చరంగు వోక్స్ వాగన్ కారుని నీటిపైపు పెట్టి కడిగి తడిగుడ్డ పొడి గుడ్డలు వాడి కొత్త కారులా మిలమిలా మెరిసేట్లు చేసింది.

అన్ని పనులు అయ్యాక పోర్టికోలో ప్రాణాయామం చేస్తున్న సార్ తో “సార్, ఇల్లు తుడిచేటప్పుడు బెడ్రూంలో అయిదు వందల నోటు పడివుంది తీసుకోండి సార్’ అని అయిదు వందల నోటు కుమారస్వామి చేతికిచ్చింది. ఎవరెస్టు ఎక్కినంత సంబరపడినాడు కుమార స్వామి. ఆమె నిజాయితీ కదిరి మర్రిమానంత మహా వృక్షమైతే తను తమ ఇంటి కుండీలోని బోనసాయ్ మొక్కలాగా ఊహించుకున్నాడు. కుముదిని అభిమానంగా వంట గదినుంచి వచ్చి నవనీత భుజం తట్టింది. పూల తొట్టెలోని ఎర్ర గులాబీలు రెండుకోసి నవనీత చేతికిచ్చింది. నవనీత బండి స్టార్టు చేసి వీధి చివరికి వెళ్లేంతవరకు మొగుడూ పెళ్లిద్దరూ టాటాలు చెప్పినారు.

వంట గదిలోకి పోతూపోతూ కుముదిని “డబులైతే కట్టారుకానీ జిమ్ వారానికి ఒక్కసారయినా పోవడం లేదు ఏమిటండీ” అని నిష్టూరం చేసింది. “ఈరోజు వెళతానులే” అని ఒళ్లంతా ఊగిస్తూ చిటికెలేసుకుంటూ బెడ్ రూంలోకి వెళ్లాడు.

***

అయిదు నిమిషాలకంతా – “కుముదినీ, కుముదినీ” అంటూ తేలు కుట్టిన వాడిలాగా గట్టిగట్టిగా కేకలు వేసాడు. వంట గదిలో కొత్తిమీర కట్ట ఒలుస్తున్న కుముదినీ భర్త కేకలకి భయపడి బెడ్రూమ్‌లోకి పరుగులు తీసింది.

“నా మిత్రుడు నరసింహం నిన్నరాత్రి ఉడిపి వెళుతూ నన్ను తన ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టమని అరవై వేల క్యాష్ ఇచ్చివెళ్లాడు. సోమవారం కడదాములే అని డబ్బుల్ని ప్యాంటు ఎడమ జేబులోనే పెట్టా. పెట్టిన డబ్బులు కనిపించడంలేదు. నీవు డబ్బుల్ని చూసావా” అని భార్యని అడిగాడు.

బెదిరిన భార్యాభర్తలిద్దరూ అల్మారాలు, బీరువాలు, బ్రీఫ్ కేసులూ వెదికారు. అన్ని ప్యాంటు షర్టులు విదిలించి చూసారు. ఎంత వెదకినా దొరకలేదు. అయినా పట్టు వీడక ఇల్లంతా వెదుకుతుండగా.. కుమార స్వామి జేబులో నవనీత ఇచ్చిన అయిదు వందల నోటు చూసిన కుముదిని కెవ్వున కేకవేసింది. డబ్బు మాయంలో నవనీత హస్తం వున్నట్లు మొదటిసారిగా వారికి అనుమానం వచ్చింది.

క్షణాలలో కుముదిని గోద్రేజ్ బీరువా తీసి తను దాచిన నవనీత కాగితాలను బయటికి తీసింది. వెంటనే నవనీత మొబైల్ నెంబర్‌కి ఫోన్ చేసింది. వయ్యారంగా ఆడగొంతు అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని ముద్దుముద్దుగా చెప్పింది. మొగుడూ పెళ్లాలిద్దరికీ చెమటలు పట్టాయి. క్షణం ఆలస్యం చేయకుండా నవనీత ఇచ్చిన రెఫరెన్స్ నెంబర్లకి ఫోన్ చేసింది. మొదటి ఫోన్ సిటీలోని సురేష్ సూపర్ బజార్ రిసెప్షనిస్ట్ నెంబర్. రెండవది జయశ్యాం థియేటర్ టిక్కెట్ రిజర్వేషన్ కౌంటర్ నెంబరు. మొగుడూ పెళ్లాలిద్దరూ ‘క్యార్’మన్నారు. నెట్లో నవనీత అడ్రస్ సెర్చ్ చేస్తే అలాంటి అడ్రస్ సిటీలో ఎక్కడా కానరాలేదు. ఆధార్ కార్డు నెంబర్ వెదికితే ‘మిస్ మ్యాచ్’ వచ్చింది.

“అమ్మో! అమ్మో!… ఎంత మోసం, ఎంత మోసం” అన్నాడు బాధతో కుమార స్వామి. “అయ్య బాబోయ్, ఆడ దొంగని నట్టింట్లో పెట్టుకొని ముద్దు ముద్దుగా చూసుకొన్నామన్నమాట. అయినా నవనీత దొంగ కాదండీ… దొంగలకు దొంగ. ముసుగువేసిన దొంగ కాదు. ముసుగులేని దొంగ” అంది ఏడుపు గొంతుతో కుముదిని.

“మనకి తనపైన ఎలాంటి అనుమానం రాకుండా జాగ్రత్తలు తీసుకొంది. అందుకని వంద, రెండు వందలు, అయిదు వందలు, ఇన్వెస్ట్ చేసింది. పూలు, కాయలు, పండ్లు ఇచ్చి మనల్ని ప్రసన్నం చేసుకొంది. డబ్బు వారంవారం నేలపైన ఎందుకు పడిందో మనకి అనుమానం రాకుండా జాగ్రత్తగా నటించింది” అని సమీక్ష చేసినాడు కుమార స్వామి.

లబోదిబో మంటూ పోలీస్ స్టేషన్ చేరారు. భార్యాభర్తల బాధలు చూడలేని పోలీసులు వారిని ప్రశాంతంగా కూర్చోబెట్టి కొబ్బరి నీళ్లు తెప్పించి తాగించి విషయమంతా తెల్లకాగితాల్లో వ్రాయించి ఫిర్యాదు స్వీకరించారు.

***

అదే రోజు పౌర్ణమి రాత్రి..

వెన్నెలలో పోర్టికోలో భార్యభర్తలిద్దరూ ఉయ్యాలలో కూర్చొని ఊగుతూ వున్నారు. తెల్లటి పౌర్ణమి వెన్నెలకు పెరట్లోని గన్నేరు పూలు గుబాళిస్తున్నాయి. చల్లటి పిల్లగాలులు తెరలు తెరలుగా వీస్తున్నాయి. కుముదిని కట్టి ఇచ్చిన స్వీట్ కిళ్లీ నములూ కుమారస్వామి ఇలా చెప్తాడు.

“మనకి ఆకర్షణీయమైన జీతాలున్నాయి. ఇంట్లో గైండర్, గ్యాస్, హీటర్, మిస్ట్రీ, మైక్రో ఒవెన్, వాషింగ్ మెషీన్, యురేకా ఫోర్బ్స్ వున్నాయి. వీటితోపాటు మనకి కారు, ఇంటికి ఇన్వర్టర్, ఎసిలు వున్నాయి. వీటి సహాయంతో మన పనులు మనమే చేసుకోవచ్చు. శరీరంలోని కొన్ని క్యాలరీలయినా ఖర్చువుతాయి. అవసరమైతే మన పల్లె నుంచి పేదింటి ఆడపిల్లను బెంగళూరు సిటీకి తెచ్చుకుందాం. చక్కగా చదివిద్దాం. ఇంట్లో మనిషిగా వుంటుంది. మంచి చెడ్డా చూసుకొంటుంది. తోడుగా వుంటూ మనకీ ఇంటి పనుల్లో సహాయపడుతుంది. మనకి కూడా ఒక పేద పాపను పోషిస్తున్నామన్న సంతోషం కలుగుతుంది” అన్నాడు.

కుముదిని సంతోషంగా ఒప్పుకుంది. వెంటనే తమ చిత్తూరు జిల్లాలోని పుత్తూరు మండలం రాచపల్లిలోని బంధువులకి ఫోన్ చేయడానికి మొబైల్ చేతిలోకి తీసుకొంది.

మబ్బుల చాటున వున్న చందమామ వెన్నెల వెదజల్లుతూ ఆకాశంలోకి ప్రవేశించాడు.