24. కొడుకు

0
5

[box type=’note’ fontsize=’16’] సంచిక నిర్వహించిన 2018 దీపావళి కథల పోటీలో న్యాయనిర్ణేతలు/సంపాదకుల ఎంపికలో ప్రోత్సాహక బహుమతి పొందిన కథ. [/box]

[dropcap]”ప్రి[/dropcap]యమైన వంశీకి,

ఎలా ఉన్నావ్ నాన్నా?! ఇక్కడ మీ అమ్మా నేనూ కులాసాగా ఉన్నాము.

ఎక్కడో చిత్తూరు జిల్లాలోని మారుమూల గ్రామంలో నిన్ను అడవిలో వదిలేసినట్టుగా వదిలి వచ్చేసి అప్పుడే నెల దాటిపోయింది. తినడానికి చిన్న హోటల్ కూడా లేని ఆ ఊళ్ళో నువ్వు ఎలా ఉంటున్నావో అనే మా బెంగ. పైగా చిన్నప్పటినుండీ బైట ఎప్పుడూ ఉన్నది లేదు కదా! నాకంటే మీరే ఎక్కువ బెంగ పడుతున్నారని అమ్మ అంటోంది. ఒక రెండుమూడేళ్ళలో నీకు బదిలీ అయ్యేవరకూ ఎలాగో సర్దుకో. వంట చేసుకోవడం కష్టమే అనుకో. అమ్మ ఇచ్చిన వంటల పుస్తకంలో వంటలు చూసి నేర్చుకుంటూ ఉండు. పాలు కూడా తోడు పెట్టుకుని పెరుగు చేసుకుంటూ ఉండు. ఎప్పుడైనా ఒకరోజు కూర చేసుకోవడానికి బద్ధకించినా పెరుగన్నం అయినా తింటావు.

నిజానికి నెల క్రితం నిన్ను అక్కడ వదిలేసి వచ్చినప్పటినుంచీ నా మనసు మనసులో లేదు. ఎలా ఉంటున్నావో, ఎలా తింటున్నావో అనే నాకు బెంగ. మీ అమ్మ పైకి మామూలుగా కనిపిస్తున్నా తను కూడా దిగులు పడుతూనే ఉంది. కానీ మనలాంటి మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వరంగ బ్యాంక్‌లో ఉద్యోగం అంటే చాలా ముఖ్యమైనదే కదా! పైగా ఈ పోటీప్రపంచంలో కేవలం పంతొమ్మిదేళ్ళకే నువ్వు రాసిన మొదటి పరీక్షలోనే ఉద్యోగాన్ని పొందగలగడంలో నీ ప్రతిభ ఎంతో ఉంది. అందుకని మాకూ సంతోషమే!

ఇంటిపని దాదాపు పూర్తి కావచ్చింది. నీ సాయం చాలా ఉండేది కదా, అందువలన నాకూ ఒక్కడికే చేసుకోవడానికి ఇబ్బందిగానే ఉంది. తప్పనిసరిగా కొన్నిసార్లు మేస్త్రీల పైన ఆధారపడవలసి వస్తోంది. బహుశా ఉగాదికల్లా ఇల్లు పూర్తి అయిపోవచ్చు. ఆ తర్వాత గృహప్రవేశం పెట్టుకుందాం. కనీసం నాలుగురోజులైనా ఉండేలా నువ్వు వచ్చేలా చూసుకో.

నువ్వు నీ స్నేహితుడికి చెప్పి కొనిపించి పంపించిన ఫోన్ నిన్ననే తెచ్చి ఇచ్చాడు. చాలా బావుంది. కానీ నీ మొదటి జీతంలో దాదాపు మొత్తమంతా ఖర్చు పెట్టి ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు నాకు కొనివ్వకపోతేనేంరా?

రోజూ ఫోన్లో మాట్లాడుతున్నా ఇలా నీతో ఇంకా దగ్గరగా, ఇంకా బాగా మాట్లాడినట్టుగా అనిపిస్తుందని అమ్మా నేనూ కూర్చుని ఈపనిలో ఉన్నాము. ఈ వాట్సాప్ మా ఇద్దరికీ కొత్తగా ఉన్నా, నీతో ఇలా సంభాషించేందుకు అనుకూలంగానే ఉందనిపిస్తోంది. ఉత్తరాలు రాసే అలవాటు దాదాపు కనుమరుగైన ఈ కాలంలో తిరిగి నీ వలన ఈ రకంగా ఆ అలవాటు మొదలయిందనిపిస్తోంది. కాకపోతే కలమూ కాగితమూ లేవంతే!

ఫోన్ చాలా బావుంది. నీ పేరుతో ఒక ఆర్ డీ ఎకౌంట్ ఓపెన్ చేసుకుని పొదుపు మొదలుపెట్టు. అలాగే ఒక జీవితబీమా పాలసీ కూడా.

మేమిద్దరమూ బాగానే ఉన్నాం. కంగారు పడకు. నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు. నీ సహోద్యోగులతో స్నేహంగా ఉండు. నీకు ఏమాత్రం ఇబ్బంది ఉన్నా చెప్పు. వెంటనే వస్తాను.

ఉంటానిక.

ప్రేమతో…

నాన్న, అమ్మ.”

దాదాపు నలభై నిమిషాలు స్మార్ట్ ఫోన్‌తో కుస్తీలు పడి తను టైప్ చేసినదంతా భార్య జానకికి చూపించాడు రామం.

ఆసక్తిగా ఫోన్లోకి చూస్తూ భర్త రాసినదంతా చదువుకుని సంతృప్తిగా తల తాటిస్తూ చెప్పింది జానకి. “ఇప్పుడే ఈ ఇంటిపని పెట్టుకున్నాం. లేకపోతే కొన్నాళ్ళు వాడికి తోడుగా ఉండైనా వచ్చేవాళ్ళం.”

భార్య ఆమోద్రముద్ర పడిందని నిర్ధారించుకున్నాక తను టైప్ చేసిన సందేశాన్ని కొడుకు వంశీకి పంపించి చెప్పాడు రామం.

“ఆఫీసులో సెలవు ఎవరిస్తారు చెప్పు? పైగా పీ ఎఫ్ తీసెయ్యడమే కాకుండా, ఆఫీసు వాళ్ళిచ్చే అప్పులన్నీ చేసేసాను. ఇప్పుడు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి!”

“మరో పదేళ్ళ పైనా సర్వీసుంది కదా, ఎందుకు గాభరా పడతారు. ఆసరికి మన వంశీ కూడా చేదోడుగా ఉంటాడుగా?” కొడుకుపై ఆపేక్షనంతా తన కన్నుల్లో పెట్టుకుని చెప్పింది జానకి.

“వాడిమీద ఆధారపడకూడదు జానకీ! వాడున్నాడనే భరోసాతోనే ఇల్లు కట్టడం మొదలుపెట్టామా ఏంటీ?”

“అవుననుకోండి. చెట్టంత ఎదిగిన ఒక్కగానొక్క కొడుకూ అవసరానికి అందివస్తాడని తల్లిదండ్రులు అనుకోవడం అత్యాశేమీ కాదు కదా?!”

“ఈ కలికాలంలో అలాంటి ఆశలేవీ పెట్టుకోలేము. మరో నాలుగేళ్ళు పోతే వాడికీ పెళ్ళవుతుంది. అప్పుడైనా వాడి సంసారం వాడిదే కదా?!” నవ్వాడు రామం.

“పెళ్ళయ్యేవరకైనా నా కొడుకును నా కొడుకుగా అనుకోనివ్వరా ఏంటీ?” చిరుకోపంగా చూస్తూ చెప్పింది జానకి.

“సరేలే. నీ మాట మాత్రం ఎందుకు కాదనాలి?” మళ్ళీ నవ్వుతూ జవాబు చెప్పాడు రామం.

“వాడు జవాబేమైనా ఇచ్చాడా?” ఆత్రుత ధ్వనించింది జానకి స్వరంలో.

“ఇంకా లేదు. చూస్తూనే ఉన్నా, ఫోన్ వైపే!”

“ఇంకా ఆఫీసునుంచి వచ్చినట్టు లేడు. ఆఫీసులో వాట్సాప్ అంటే కష్టం కదా వాడికి!” కొంచెం విచారంగా చెప్పింది జానకి.

వాళ్ళ ప్రశ్నకు సమాధానం చెబుతున్నట్టుగా ఫోన్‌లో సందేశం వచ్చిన ధ్వనికి ఇద్దరూ ఫోన్లోకి తొంగిచూసారు.

“ప్రియమైన అమ్మానాన్న గార్లకు,

నేను బాగానే ఉన్నాను. వావ్ నాన్నా! మీరు వాట్సాప్‌లో అంతసేపు ఓపికగా టైప్ చేసి, అదీ అచ్చమైన తెలుగులో తప్పులేవీ లేకుండా అందంగా పంపించడం భలే బావుంది. నిజంగా గ్రేట్ మీరు. నాకెందుకు స్మార్ట్ ఫోన్ అని అంటూనే ఉండేవాళ్ళు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలా నన్నడిగి అలా తెలుగు టైపింగ్ కూడా నేర్చేసుకుని మీరు మెసేజ్ పంపించారంటే మీరు జీనియస్ నాన్నా! అమ్మా నువ్వు కూడా నేర్చుకో. నాన్నగారే కాకుండా నువ్వు కూడా నాతో ఛాట్ చెయ్యాలి కదా!

నాకోసం మీ ఇద్దరూ కంగారు పడకండి. అన్నం, కూరలూ వండుకుంటున్నాను. బద్ధకించనులెండి.

ఇల్లు పూర్తవ్వకుండా నేనిటు వచ్చెయ్యడం నాకూ బాధగానే ఉంది నాన్నా! కానీ మీరు ఎక్కువ శ్రమ పడకండి. మరీ అవసరం అయితే చెప్పండి… నా ఫ్రెండెవరికైనా మీకు సాయం రమ్మని చెబుతాను. నేనే వద్దమంటే ఇంకా ప్రోబేషన్లోనే ఉన్నాను కదా సెలవు దొరకదు. గృహప్రవేశం నాటికి వీలవుతుందనే అనుకుంటున్నా.

పాలసీ గురించి నేనూ ఆలోచిస్తున్నా. చూసి తీసుకుంటా నాన్నా! ఆర్ డీ ఎకౌంట్ తెరిచాను. డబ్బుల గురించి ఎలా జాగ్రత్తగా ఉండాలో ఇప్పుడిప్పుడే తెలుస్తోంది.

ఉంటానమ్మా, నాన్నా! మీకు రాత్రికి ఫోన్ చేస్తాను.

ప్రేమతో…

మీ

వంశీ.”

కొడుకు రాసిన సందేశాన్నే ఇద్దరూ పదే పదే చూస్తూ కూర్చుండిపోయారు రామం, జానకి.

అలా కొన్ని రోజులు గడిచాయి. రోజులు నెలలుగా మారి చివరకు గృహప్రవేశానికి మరో ఇరవై రోజుల దగ్గరకు వచ్చింది కాలం.

“పెయింటింగ్ మాత్రమే కదా మిగిలింది? మీరింక నిశ్చింతగా ఉండొచ్చు.”  ఆదుర్దాగా కనిపిస్తున్న భర్తతో చెప్పింది జానకి.

“సెలవు దొరుకుతుందో లేదో అన్నాడు వంశీ! వాడు రాకపోతే ఏంబావుంటుంది చెప్పు?” ఆయన ముఖమంతా దిగులు అలుముకుని ఉంది.

“ఉద్యోగంలో చేరాక కొన్నాళ్ళు బాగానే ఉన్నాడు వాడు. వాట్సాప్‌లో కూడా ఇప్పుడు వాడు కనపడ్డంలేదు. ఎంతోసేపు ఫోన్ చేస్తే ఎప్పటికో ఎత్తుతాడు. అదీ ముక్తసరిగా మాట్లాడి ఊరుకుంటాడు. ఎలాంటి పిల్లాడు ఎలా అయిపోయాడో! మనసుకు చాలా కష్టంగా ఉందండీ!” ఉబికి రాబోతున్న కన్నీటిని అదుపులో పెట్టుకుంటూ చెప్పింది జానకి.

“పనివత్తిడేమో జానకీ. కానీ మధ్యలో ఒక్కరోజు సెలవు పెట్టైనా రావొచ్చు కదా వాడు? ఇంటిపనుల గురించి కూడా ఏమీ మాట్లాడలేదు. వాడి ఫ్రెండ్ హరీష్‌కి అప్పజెప్పి ఊరుకున్నాడు. మనవాడికన్నా ఆ హరీషే నయం. నీడలా నన్ను వదలకుండా సాయం చేస్తూనే ఉన్నాడు ఈ క్షణం వరకూ!” చెప్పాడు రామం.

“సరే, ఎలా రాసిపెట్టి ఉంటే అలానే జరుగుతుంది. మీరు ఎక్కువగా ఆలోచించకండి. భోంచేసి నిశ్చింతగా పడుకోండి. రండి వడ్డిస్తాను.” చెప్పింది జానకి. భోజనాలు కానిచ్చి పడుకున్నాక తెల్లవారుఝామునే కాలింగ్ బెల్ మ్రోగడంతో ఉలిక్కిపడి లేచింది జానకి. లైట్ వేసి టైం చూసింది. నాలుగున్నర. ఇంత తెల్లవారే ఎవరా అనుకుంటూ తలుపు తీయడానికి వెళ్ళింది. వెలుతురుకు మెలకువ వచ్చేసిందేమో రామం కూడా ఆమెను అనుసరించాడు.

తలుపు తీసి చూస్తే ఎదురుగా హరీష్.

“ఏమయింది హరీష్, ఇంత పొద్దుటే వచ్చావ్?!” ఆశ్చర్యంగా అడిగింది జానకి.

“రాత్రి మీరు టీవీ చూడలేదా ఆంటీ?” విచారంగా ఉంది హరీష్ ముఖం.

“లేదు బాబూ. ఈ ఇంటిపనుల్లో పడ్డాక టీవీ కూడా సరిగ్గా చూడటంలేదు. ఏమయింది?” రామం ప్రశ్నించాడు.

“అనుకు, ఆంటీ, మీరేం కంగారు పడకండి. మనకొచ్చిన ఇబ్బందేం లేదు కానీ గోదావరి పొంగి పొర్లడంతో వరదనీరు మన ఊళ్ళోని లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది అంకుల్. మన శ్రీనగర్ కూడా!” వీలైనంత నెమ్మదిగా విషయాన్ని చెప్పాడు హరీష్.

“ఓహ్. అయ్యో అవునా? గత నాలుగైదేళ్ళుగా వరదప్రమాదం రావడంలేదులే అనుకున్నాను. మన ఇల్లు కూడా మునిగిపోయే ఉంటుంది కదా హరీష్?!” తను ఊహించిందే అడిగాడు రామం.

“అయినా ఇబ్బందేమీ లేదంకుల్.” చెప్పాడు హరీష్.

“అంటే మునిగిపోయిందా? అయ్యో… గృహప్రవేశం కాకుండానే ఇల్లంతా పాడైపోయిందా?” జానకి కంఠం రుద్ధమయింది.

“లేదాంటీ. మీరసలు కంగారు పడవలసిన పనిలేదు. శ్రీనగర్ కొత్తగా ఏర్పడుతున్న కాలనీ కదా! అక్కడ నిర్మాణంలో ఉన్న ఇళ్ళన్నీ కూడా పాడైపోయాయి. గత పదిరోజులుగా కురుస్తున్న వర్షాలు కూడా తోడవడంతో కొన్ని ఇళ్ళు కూలిపోయాయి కూడా! వంశీ కూడా ఇక్కడి విషయాలు గమనిస్తూనే ఉన్నాడు. ఇదిగో ఈ  సందేశం మీకు చూపించమన్నాడు.” అంటూ తన మొబైల్ ఫోన్ తీసి చూపించాడు హరీష్.

ఆత్రుతగా ఫోన్ అందుకున్నాడు రామం. “నాన్న గారూ! అమ్మా! కంగారు పడకండి. నా మొదటి జీతంతో మీకు మొబైల్ ఫోనే కాదు. మన ఇంటికోసం ఇన్స్యూరెన్స్ పాలసీ కూడా తీసుకున్నాను. మనం పెట్టిన డబ్బంతా పోయిందని దిగులు పడకండి.

ఇకపోతే నేను మీతో ఎక్కువ కాంటాక్ట్‌లో లేకపోవడానికి కారణం, ఇప్పుడు పనిచేస్తున్న బ్యాంక్ ఉద్యోగం నాకు నచ్చలేదు. విపరీతమైన పని వత్తిడితో పాటు పై అధికారులనుంచి వేధింపులు. నిద్రాహారాలు మానేసి ఎప్పుడూ బ్యాంక్ పనిలోనే ఉండాలన్నట్టుగా ఉంది వాళ్ళ ధోరణి. పైగా చేస్తున్న పనికి, ఇస్తున్న జీతానికి అసలు సంబంధం లేకుండా చాలా తక్కువ జీతం. అందుకే మీకు చెప్పకుండా నేను తిరుపతిలో ఓ పోటీపరీక్షల కోచింగ్ సెంటర్లో చేరాను. రోజూ తిరుపతికి వచ్చి క్లాసులు హాజరై రాత్రి అక్కడే ఉండి ఉదయాన్నే తిరిగి బయలుదేరి బ్యాంక్‌కి వస్తున్నాను. రోజూ డెబ్భై కిలోమీటర్ల ప్రయాణం అలసటగా ఉన్నా కానీ తప్పలేదు. ప్రయాణిస్తున్నప్పుడు మాట్లాడదామంటే రోజూ అంత దూరం ప్రయాణమా అని మీరు బాధపడాతారని చెప్పలేదు. నా శ్రమ వృథా కూడా పోలేదు.. పోటీపరీక్షలు రాస్తున్నాను. నిన్ననే స్టాఫ్ సెలక్షన్ కమీషన్లో ఇంటర్వ్యూలో కూడా పాస్ అయినట్టుగా తెలిసింది. కస్టమ్స్ ఆఫీసర్‌గా త్వరలోనే పోస్టింగ్ కూడా వస్తుంది.

నేను దగ్గర లేకపోయినా హరీష్ ఎప్పుడూ మీకు సహాయంగానే ఉంటాడు. ఎంతైనా వాడు రైతుబిడ్డ కదా! వాడికి వ్యవసాయంలోనే ఆనందం!

ఉంటాను.

ప్రేమతో…

మీ

వంశీ.”

సందేశాన్ని చదడం పూర్తి చేసిన రామం కనులు రెండూ నీరు నిండుతోండగా మొబైల్ ఫోన్‌ను జానకి చేతికందించి ఆప్యాయంగా హరీష్‌ను కౌగిలించుకున్నాడు.