25. ఆశయ గీతం..!

0
5

[box type=’note’ fontsize=’16’] 2018 దసరా కవితల పోటీకి వచ్చిన కవిత. [/box]

[dropcap]ఒం[/dropcap]టరైన ఒక హృదయం
మరీ ఒంటరిదైనపుడు
కళ్ళెదుట కలలు సైతం
క్షణకాలమైనా కదలలేనపుడు
ఏ మాటలోనూ ఒక్క పువ్వూ
పూయనపుడు
ఓ ఆశయమా! అలగకు..
అలిగి నలిగి నా నొసటిపై ప్రశ్నార్థకపు తైలాన్ని
విసరకు.. తల పై అమృతాన్ని నింపకు !

నేల కొరిగిన ఏకాంతపు రాత్రులలో
ప్రాణం తిరుగాడుతున్నపుడు
గుర్తుకొచ్చే పలకరింపులు
ఆశల్ని అన్యాయంగా అడ్డుకుంటున్నపుడు
నిరాశ నిండిన హృదయం
మరింత అగమ్యంగా తయారైనపుడు
ఓ ఆశయమా! రారా! నాతోనే ఉండు..
చురుక్కుమనే కిరణాలై చమక్కులను చీల్చుకుంటూ
మాయమాటల గాలిని లెక్కచేయకుండా
అలసిపోయిన అరుణిమ బింబాన్ని
చూడలేక ఛత్రం ఘాటుగా గుచ్చుకున్నప్పుడు
ఓ ఆశయమా! రా! నాతోనే ఉండు..

చీకటిని తరిమేసే వేకువ రేఖలా
నా జీవితం నాకే కనిపించే ఒక వర్ణచిత్రంలా
కలచివేస్తున్న కలలకి రంగులేస్తున్న కుంచెలా
ఓ ఆశయమా రా! నాతోనే ఉండు..
వివిధ కాంతుల తేజోవలయాలన్నింటినీ
ఒకచోటగా గుచ్చి మాలను చేసి అందించినట్లే అందించి,
ఒక్కసారిగా లాక్కుని నువ్వెవరు అని ప్రశ్నిస్తున్నప్పుడు కూడా
ఓ ఆశయమా! నన్నొదిలి దూరమై విషాద గీతంలా మిగిలిపోకు
తప్త ముక్త రిక్త మృత్యు విషమ భూముల్లో చిహ్నంలా మిగల్చకు!
నిశ్శబ్దాన్ని స్వరాల్ని చకితం చేస్తూ కన్నీటి పూలుగా మార్చకు!

ఓ ఆశయమా!
విడిచిపోవద్దు నన్ను నా ఆశల్ని ఎన్నటికీ..
తూలనాడద్దు నా ఆలోచనల్ని ఏనాటికి..
ఆత్మ గౌరవాన్ని ఈ ప్రపంచానికి నేనొక్కదాన్నే ఇవ్వలేదు
ఆత్మాభిమానం నేల గుండెకు ఒక్క నాతోనే రాలేదు.
హృదయ కాంతులు పాయలు పాయలుగా చీలుతున్నా
నా ఆశయం నాతో సగర్వంగా జీవిస్తూనే ఉంటుంది
అలా రాలుతున్న ఈ పూలరెక్కలు –
సగానికి సగం ముసుగులో దాగున్న సహజత్వాన్ని
తట్టి లేపుతూనే ఉంది.. అందుకే నా ఆశయమా! రా! రా! నాతోనే ఉండు..!

విషణ్ణమైన ఈ కలుషిత తత్త్వాలు
నా ఆత్మను చుట్టేయకముందే..
విపరీతమైన అత్యాశల ఆనవాళ్ళు
నా జీవితాన్ని అలుముకోకముందే..
విస్తరించు నా చుట్టూ నీ ధైర్యపు శ్వాసను!
విసిరివేయి నా ఇంటిపై నీ వాస్తవ రెక్కల సొగసులను!

ఆశా! ఫలాకృతీ! ఆత్రంగా కాదు! ఆనందంగా ముడివడు!
మమతానురాగాల్ని సుమ సౌందర్యంతో అందరికీ పంచుతూ!
మానవ కథా పరిమళాన్ని నిత్యం ప్రవహించే నదిలా నింపుతూ!