[box type=’note’ fontsize=’16’] సంచిక నిర్వహించిన 2018 దీపావళి కథల పోటీలో న్యాయనిర్ణేతలు/సంపాదకుల ఎంపికలో ప్రోత్సాహక బహుమతి పొందిన కథ. [/box]
[dropcap]రెం[/dropcap]డు రోజులక్రితం తన వాట్సప్‌కి స్నేహితురాలు కౌసల్య పంపిన చిన్న పెయింటింగ్‌ను చూస్తూ ఆలోచనలో పడింది సత్యవతి. చూడ్డానికి చిన్న పెయింటింగ్ లాగానే ఉంది. కానీ ఏదో ఊహకందని సందేశాన్ని అందిస్తున్నట్టుగా ఉంది. చూసేకొద్దీ చూడాలనిపిస్తోందెందుకో. ముగ్గరు యువతులు కనపిస్తున్నారు. ముగ్గురూ కలిసి ఒకే కుండని మోస్తున్నట్టుగా ఉంది చూడగానే. కానీ ఒక్క రెండు క్షణాలు కన్నార్పకుండా దానికేసే చూస్తే తెలుస్తోంది ముగ్గురు పడతులకీ ఎవరి నెత్తిన వారికి తలోకుండా ఉందని. చాలా ఆకర్షణీయంగా ఉంది ఆ బొమ్మ. దానికింద కౌసల్య వ్రాసింది – “మనందరం మరో రెండురోజుల్లో కలుసుకోబోతున్నాం కదా, ఈ బొమ్మ చూడగానే మీకు ఏ ఆలోచనలు తట్టాయో ఓ కాగితం మీద రాసుంచుకోండి. మనం కలిసి కబుర్లు చెప్పుకునేటప్పుడు బొమ్మ కలిగించిన ఆలోచనలు కలబోసుకుని పంచుకుని చర్చించుకుందాం” అని. ఆ బొమ్మని చూస్తుంటే ఒకటీరెండూ కాదు ఏవేవో కలగాపులగంగా, అస్పష్టంగా ఆలోచనలే ఆలోచనలు! ఇదీ అని ఇదమిథ్థంగా స్పష్టమైన ఆలోచనలు రావట్లేదు సత్యవతికి. కానీ అస్పష్టంగా ఏవేవో జీవిత సత్యాలు కళ్ళముందు రంగులరాట్నంలా తిరుగుతున్నాయి. చిన్నగా తనలో తనే నిట్టూర్చింది.
గేటు దగ్గర కారు చప్పుడు వినబడగానే ఆత్రంగా అటువైపు చూసింది సత్యవతి. నౌకరు వెంకన్న గేటు సగం తెరిచి పట్టుకుని కార్లో వాళ్ళని ఏదో అడుగుతున్నాడు. చటుక్కున హాల్లోంచి ఇవతలకొచ్చి, “గేటు తెరు. కారు లోపలికి పంపు వెంకన్నా” అంది. అదిగో కారు కిటకిలోంచి రమ ముఖం కనిపిస్తోందిగా. రమ, రాణి కలిసొస్తామన్నారు, టాక్సీ చేసుకునొచ్చేసారు. నవ్వుతూ మెట్లమీద నుంచున్న సత్యవతిని చూస్తూనే గభాలున కారు దిగి దాదాపు పరిగెడుతున్నట్టు వచ్చేసారిద్దరూ.
ముగ్గురూ చేతులుపట్టుకుని లోపలికి నడుస్తూ “హభ్భ! ఎన్నాళ్లకి కలిసామే!” అంటూ హల్లోకి చేరి సోఫాలో కూలబడ్డారు. “నువ్వేమీ మారలేదే” అని రమ, రాణి అంటే “మారకేం, లావెక్కాగా? ” నవ్వింది సత్యవతి. “ఇన్నేళ్లకి ఆ మాత్రం లావెక్కడం మామూలే. నేను మాత్రం మన మిత్రబృందం అందర్లోకి ఘనంగా ఎక్కాను” రాణి అంది. “నీ పొడుక్కి ఆ మాత్రం ఉండాల్లే. ఈ రమే అస్సలు మారలేదు” సత్యవతి మాటలకి రమ మొహమాటంగా నవ్వింది. వీళ్ళీ కబుర్లలో ఉండగానే పదిపది నిముషాలతేడాతో ఒకదాని వెనకొకటిగా మూడు ఆటోలు వచ్చాయి. వాటి లోంచి వరుసగా కుసుమ, కౌసల్య, సీత దిగారు. “ఎన్నాళ్ళయిందే మనం కలిసి” అనుకుంటూ, “ఇన్నాళ్లకైనా కలిసాం మళ్ళీ” అని సంతోషిస్తూ అరగంట గడిపేసారు. ఈలోగా వంటమనిషి వాళ్లకి టిఫినూ కాఫీలందించింది. “మన ఊళ్ళో కూడా ఆటోలు బాగా వచ్చేసాయే! బస్సు దిగగానే సైకిల్‌రిక్షా ఎక్కుదామని సంబరపడ్డా. ఒక్కటి కనబడలా” అంది సీత. “బస్టాండులో అస్సలుండవే బాబూ రిక్షాలు. కాస్త ఊళ్ళో ఐనా తిరుగుతున్నాయిగానీ” చెప్పింది సత్యవతి. కౌసల్య దగ్గరగా వచ్చి సత్యవతిని కౌగలించుకుని “నీ ధర్మమా అని మన ఊరుని, మన బృందాన్నీ చూడ్డం పడిందే తల్లీ!” అంది.
“నీకు వందనం అభివందనం” రాగం తీస్తూ, రాగానికి తగ్గట్టు అడుగులు వేసింది రాణి. “అబ్బో కాలేజీ రోజుల్లోనే ఉండిపోయామా అనిపిస్తోందే!” ఆనందంగా కేకపెట్టారు మిత్రబృందం. అందరూ కిలకిలా నవ్వేసుకున్నారు.
ఇంతకీ ఏం జరుగుతోందంటే, వాళ్ళంతా ఆ చిన్న పల్లెటూరి వాళ్లే. ఒకప్పుడు చిన్న పల్లెటూరే ఇప్పుడు ఆధునిక వసతులున్న చిన్నపాటి పట్నం. ఈ ఊళ్ళో ప్రాధమికవిద్య పూర్తిచేసుకుని హైస్కూలు, కాలేజీ చదువులు దగ్గర్లోని పట్నంలో కానిచ్చుకున్నారు వాళ్ళు. అందుకని వాళ్ళమధ్య విడరాని స్నేహానుబంధం ఏర్పడి పోయింది. చదువు పూర్తికాకముందే పెళ్ళయిపోయింది సత్యవతికి – ఆఊరి పెద్దకామందుగారి కొడుకుతో. దాంతో అక్కడే స్థిరపడిపోయింది సత్యవతి. మిగతా వారందరూ చదువులవగానే పెళ్ళిళ్ళై ఎక్కడెక్కడో స్థిరపడ్డారు. వారి తల్లితండ్రులు కూడా ఊరు వదిలేసి కొడుకుల ఉద్యోగపు ఊళ్లల్లోనో మరెక్కడో స్థిరపడ్డం వల్ల వాళ్ళకి ఆ ఊరితో సంబంధం తెగిపోయింది.
సత్యవతే, “ప్రతి రెండు మూడేళ్లకైనా ఒకసారైనా మనం కలుసుకోవాలే” అని పట్టుబట్టి తన ఇంట్లో ఈ సంగమం ఏర్పాటు చేస్తూంటుంది. తనే చెయ్యగలదు కూడా. మిగతా వాళ్ళుండేది మహానగరాలు కాకపోయినా కాస్త పెద్ద పట్నాలు. ఇక్కడున్నట్టుగా పనివాళ్ళు, ఇతరసౌకర్యాలు అంత తేలిగ్గా దొరకవా పట్నాల్లో. దొరికినా ఏర్పాట్లు చేయడం ఓ రకంగా కష్టమే వాళ్ళకి. అన్నిఏర్పాట్లూ చక్కగా చేయగల పరివారం, వసతీ కలిగినది ఆ బృందంలో సత్యవతి ఒక్కతే. అందుకే ప్రతి రెండేళ్ళకొక సారి ‘ఒక్కసారి మా ఊరు చూసి వస్తాము’ అని పాడుకుంటూ సత్యవతింట్లో చేరుతూంటారందరూ. సత్యవతి భర్త కాంతారావు ఊళ్ళోకెల్లా పెద్ద భూస్వామి. ప్రత్యక్షంగా రాజకీయాల్లో అడుగెట్టడుగానీ ఆ చుట్టుపక్కల ఏ నాయకుడూ అతని మద్దతు లేకుండా ఎన్నికలు గెలవలేడన్నది జగమెరిగిన సత్యం.
స్నేహితురాళ్ళంతాకలిసి ఆరోజు, మర్నాడు ఊరంతా చుట్టబెట్టారు. తమ స్కూలు వర్ధిల్లుతున్నందుకు సంతోషించారు. చిన్నప్పుడాడుకున్న స్థలాలు, ఇంకా అక్కడ ఉన్న స్నేహితుల ఇళ్ళూ చుట్టబెట్టారు. బాల్యం, టీనేజ్, యవ్వనం అన్నీ మళ్ళీ మళ్ళీ తిరిగొచ్చినట్టు ఆనందించారు. మూడో రోజు సాయంత్రం ఇంక సత్యవతింట్లో డాబామీదచేరి కబుర్లలో పడ్డారు.
సీత డాబా మీద అటూఇటూ తిరుగుతూ పిట్టగోడనానుకుని మిగతా వాళ్లకేసి చూస్తూ నుంచుంది.
సత్యవతిని చూస్తూ కాలేజీరోజుల్లోకి వెళ్లి పోయింది ఆమె మనసు. వీళ్ళంతా ఇంటరు మొదటి సంవత్సరం చేరేసరికే కాంతారావు బియ్యే ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు. చదవడం అంటే కాలేజీ ఫీజులు కడుతూ పరీక్షలెగ్గొడుతూ, కొన్నిసార్లు పాసవుతూ వీలయినన్నిసార్లు తప్పుతూ కేవలం “కాలేజీ విద్యార్ధి” అన్నపేరుకోసం కాలేజినే పట్టుకు వేళ్లాడుతూండేవాడు. కాలేజ్ యూనియన్ రాజకీయాల్లో నిష్ణాతుడై ఊళ్ళో పెద్దనాయకుడిగా, తండ్రికి తగ్గ తనయుడుగా ఎదిగిపోయాడు. సత్యవతి బియ్యే మొదటిసంవత్సరం పూర్తయ్యి రెండోఏడాదిలో ఉండగానే ఇద్దరి తండ్రులూ కూడబలుక్కుని లాభసాటిబేరంగా సంబంధం కుదుర్చుకుని సత్యవతీకాంతారావుల కళ్యాణం జరిపిం చేసారు.
సత్యవతి డిగ్రీ పూర్తి చెయ్యనే లేదు. కానీ ఎవరితోనూ స్నేహం వొదులుకోలేదు. ఆమె కాపురం సంగతులన్నీ మిత్రులందరికీ తెలుసు. ఆ మాటకొస్తే అందరి సంతులూ అందరికీ తెలుసని చెప్పచ్చు. కాంతారావుకి పెళ్ళామంటే సభలూ, సమావేశాలలోను, శుభకార్యాలకూ పక్కన ఉండాల్సిన వ్యక్తి. అతనికా ఊళ్లో భార్యా, ఇద్దరు పిల్లలు, విశాలమైన పెద్ద ఇల్లూ కాక పక్క ఊళ్లల్లో ‘చిన్నఇళ్ళు’ రెండున్నాయి. అదీ టూకీగా సత్యవతి బతుకు.
సీత జాలిగా నవ్వుకుంటూ, ‘నా బతుకు మహా గొప్పగా ఏడిసింది కనుకనా’ అనుకుంది.
ఆమె భర్త డాక్టరు. పెళ్ళయిన మొదటిరోజే చెప్పాడు అతను “నేనసలు మరో లేడీడాక్టర్నే చేసుకుందామనుకున్నాను. మా అమ్మ అడ్డంపడింది. ‘మీ ఇద్దరూ మీ పిల్లల్ని నానెత్తిమీదొదిలి మీ ఇద్దరూ వెళ్లి ఆస్పత్రిలో కూచుంటే ఇంటిచాకిరీ, పిల్లలచాకిరీ ఎన్నేళ్ళొచ్చినా నాకు తప్పదా? సుబ్బరంగా ఇంటిపట్టునుండేదాన్నెవత్తినో ఒకత్తిని చేసుకో’ అని పట్టుబట్టింది మా అమ్మ. అందుకుని నిన్ను కట్టుకోవాల్సొచ్చింది” అని. కొంతకాలానికి భర్తవైపు చుట్టాలద్వారానే తెలిసింది సీతకి. అసలు అతనికి లేడీడాక్టరు సంబంధాలేవీ రానేరాలేదని, అసలు వీళ్ళకుటుంబం సంగతి తెలిసిన వాళ్ళెవరూ పిల్లనివ్వడానికి ముందుకు రాలేదని.
ఏదేమైనా ఈ పెళ్ళాం అంటే అతనికి అదోరకం ఈసడింపు. పిల్లలమీద కూడా అదే భావం. ఈ ముగ్గురూ తన సొమ్ము తేరగా తిని కూచుంటున్నారని చీదరింపు. తిన్న సొమ్ముకు తగినంత పని వాళ్ళచేత రాబట్టాలని నిత్యమూ ప్రయత్నిస్తూంటాడు. ఆ ముగ్గురూ తన సేవకులు అన్న భావం అతని నరనరాన జీర్ణించుకుపోయి, చిన్న పిల్లలన్న జాలి కూడా లేకుండా ఏదో పని చెప్తూనే ఉంటాడు ఇంట్లో ఉన్నంతసేపూ. ‘అదోరకం పెర్వర్షన్ కాబోలు’ భారంగా నిట్టూర్చింది సీత. ఇంతలో, అక్కడ రాణి అంటున్న మాటలు చెవినిపడ్డాయి.
“రిటైరయ్యాక నేనొచ్చి ఇక్కడే ఈ ఊళ్ళోనే సెటిలవుతానే సత్యవతీ, మా అమ్మతో సహా వొచ్చి– అప్పటిదాకా ఆవిడ బతికుంటే” అంటోంది రాణి. తనది పెళ్ళయ్యాక విషాదగాధైతే, రాణిది విద్యార్ధి దశనించే విషాదగాధ.
బియ్యే చదువుతుండగానే రాణి తండ్రి మరణించాడు. కష్టపడి బియ్యే పూర్తిచేసి, బంధువుల చలవవల్ల ఉద్యోగం సంపాదించి, ఇద్దరు తమ్ముళ్ళనీ చదివించి, కాస్తోకూస్తో ప్రయోజకులనిచేసింది. వాళ్ళిద్దరూ కూడా మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారంటే రాణి కృషే కారణం. ఉద్యోగాలు దొరికి ఆర్ధిక స్వాతంత్ర్యం చేతిలోకి రాగానే తమ ఇష్టమొచ్చిన వాళ్లని పెళ్లిళ్ళు చేసుకుని, వేరే వెళ్ళిపోయారు. అక్కనీ అమ్మనీ ఏడాదికో రెండేళ్ళకో చుట్టపు చూపుగా చూడ్డానికి వస్తుంటారు. వాళ్లున్నా లేనట్టే! అందుకే ఇక వృధ్ధమాతతో రిటైర్డ్ జీవితం గడపడానికి ఇప్పటినించే పథకరచన చేస్తోంది రాణి. “నువ్విక్కడ ఏదైనా నా స్థాయికి తగ్గ ఇల్లు అమ్మకానికొస్తే చెప్పు. ఆఫీసునించి లోన్ తీసుకోడమో బేంక్ లోన్ తీసుకోడమో ఏదో ఏర్పాటు చేసుకుని కొనేస్తాను రిటైరయ్యేలోగా” అంది రాణి. “నువ్వంటే గుర్తొచ్చింది. మా వీధిలోనే ఆ చివరింటాయన ఇల్లమ్మేద్దామనుకుంటున్నానన్నాడు కిందటాదివారం మా ఆయనతో. ఇల్లుచిన్నదే, పొందిగ్గా బావుంటుంది. రా, ఇక్కడినించి కనబడుతుంది” అంది సత్యవతి.
కూచునున్న బృందంలో అందరూ లేచి, సీత నిలబడున్న పిట్టగోడ దగ్గరకొచ్చారు. కొద్దిగా వొంగుని, “అదిగో ఆ పచ్చగా ఉన్న చిన్న డాబా ఇల్లు. ఇవాళ వాళ్లు ఊళ్లో లేరు. రేప్పొద్దున్నే వస్తారు. పొద్దున్నెళ్లి ఇల్లుచూద్దాం. నచ్చితే కొనేస్కోవచ్చు” ఒకచిన్న ఇంటివైపు చూపించింది సత్యవతి. “నచ్చడానికేముందిలే దాని రేటు నాకు అందుబాటులో ఉంటే సరి” అంది రాణి. “అయితే మా అందరికన్నా ముందు నువ్వే ఓ ఇంటి దానివై పోతావన్న మాట” గలగలా నవ్వింది రమ. “మరేం చెయ్యనూ మీలాగా ఇల్లాల్ని కాలేక పోయానుకదా, ఇంటిదాన్నైనా అవ్వద్దా మరి” అంది రాణి తనూ నవ్వుతూ. “ఇల్లాళ్లమై మేం ఉధ్ధరించింది మాత్రం ఏముందిలే” సాగదీసింది రమ.
ఈ రమది మరో కథ. ఆ మిత్రుల్లో ఎమ్మేదాకా చదివింది రమ మాత్రమే. రాణి ఉద్యోగం చేస్తున్న ఊళ్ళోనే ఓ కాలేజీలో లెక్చరరుగా స్థిరపడింది. మరో లెక్చరర్ని పెళ్లి చేసుకుంది. మొదట్లో బానే ఉండేవాడా మొగుడు. సంపాదన స్థిరపడేసరికి అతని చుట్టూ చేరిన స్నేహబృందం చలవా అని తాగుడుకి బానిసయ్యాడు. రమని ఓ దేవతలా గౌరవిస్తాడు. కానీ తనకొచ్చే జీతంలో మూడొంతులు తాగుడుకే పెట్టేస్తాడు. అత్తింట్లో ఇద్దరాడబడుచులు, అత్తమామల బాధ్యతంతా రమ నెత్తికెత్తుకోవాల్సొచ్చింది. ఆ కుటుంబం గడవడానికి రమ జీతమే ఆధారం. తనకు పుట్టిన ఒక్కగానొక్క కొడుకూ తండ్రి బాటలో నడిచి చెడిపోతాడేమోనన్న బాధ రమను లోలోపల తినేస్తుంటుంది. ఆమె బాధకు కాస్తంత ఓదార్పు దొరికేది ఈ మిత్రుల వల్లే అందుకే ఈ సమావేశాలకోసం ఏడాదంతా ఎదురుచూస్తూనే ఉటుంది.
కుసుమ, కౌసల్యల కథ మరోరకం. ఏవేవో ఆదర్శాలు, ఉద్యమాలు ఉధ్ధరింపులూ పట్టుకుని ఊరూరా తిరుగుతూ సభలూ సమావేశాలూ నిర్వహిస్తూ, కష్టాల్లో చిక్కుకున్న చాలామందిని ఉద్యమించమని ఉద్రేకపరుస్తూ, జీవనోపాధి కల్పించి అండగా నిలుస్తూ రకరకాల సంఘసేవా కార్యక్రమాలు చేస్తుంటారు. ఈ క్రమంలో వారి వైవాహిక జీవితాలు తలకిందులయ్యాయి. ప్రస్తుతం తమ సంసారాలను విడాకులతో పెటాకులు చేసుకుని, పిల్లలమీద హక్కుల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.
రాణికి ఇల్లు చూపించడం అయ్యాక సత్యవతి సీతవైపు తిరిగి,“అవునూ మేమంతా అక్కడ కూచుని కబుర్లు చెప్పుకుంటుంటే నువ్వేంటీ ఇక్కడా? మా కబుర్లు బోరుకొట్టేసాయా తల్లీ, ఇక్కడకొచ్చి నిలబడ్డావు?” అంటూ నిలదీసింది సీతని.
“అదేం కాదే బాబూ, మీ ఇంటికెదురుగా ఉండే మన ఊరి చెరువు చూస్తుంటే ఏదో హాయిగా ఉంది. ఊరంతా మారింది కానీ ఈ చెరువు మాత్రం అప్పట్లాగే అందంగా ఉంది. ఇందాకటినుంచీ చూస్తున్నాను చాలామందే వొచ్చి కడవల్తోనూ కావిళ్ళతోనూ నీళ్లు పట్టుకుపోతున్నారు.. మునిసిపాల్టీ మంచి నీళ్ల సరఫరా లేదా? ” తన ఆలోచనల్లోంచి తేరుకుంటూ, మాటమారుస్తూ అడిగింది సీత. “ఉందికానీ ఆ నీళ్ళు తాగడానికే సరిపోతాయి. వాళ్ళ మిగతా అవసరాలకి సరిపడా ఎక్కడొస్తాయే పాపం! మనలాంటి వాళ్ళం బోర్లు తవ్వించుకుంటాం సంపులూ టాంకులూ అంటూ ఏదో ఏర్పాటు చేసుకుంటాం. అదంతా వాళ్ళకి కుదరదుగా. చెరువునించి పట్టుకెళ్ళడం తప్పట్లేదు. ఇంకా అదృష్టం! మహానగరాల్లోలాగా చెరువు చెత్తకుప్పగా మారలేదు. జనం అవసరాలకి బానే పనికొస్తోంది” అంది సత్యవతి.
అందరూ ఏవేవో చిన్ననాటి తీపి జ్ఞాపకాలతో మళ్ళీ చెరువు వైపు చూసారు. “చెరువు బానే ఉంది కానీ మన ఊరే ఒకప్పటిలా లేనందుకు మనసులో ఏదో బాధగా ఉంటుందే. మార్పు తప్పదని తెలుసు. అయినా ఏంటో! ఊరు అప్పట్లాగే ఉంటే బాగుండునని పిస్తుంది వచ్చినప్పుడల్లా ఏదో దిగులు గుండెల్లో నిండినట్టుంటుంది!” అంది రమ.
ఇప్పుడు ఒకేసారి దాదాపు ఓ పదిమంది ఆడవాళ్ళు అక్కడ చెరువు గట్టున చేరారు. ఏవేవో కబుర్లూ కేరింతలతో డాబామీద చేరిన స్నేహితుల్లాగే కాలక్షేపం చేస్తూ హాస్యాలాడుకుంటున్నట్టు కనిపిస్తోంది. “అబ్బో చాలామందే చేరారే కుండలు పట్టుకుని!” ఆశ్చర్యపోయింది కౌసల్య. “అదిగో ఆ ఎర్రచీరపిల్ల మా తోటమాలి పెళ్ళాం. చెరువులోకి దిగుతోందే ప్లాస్టిక్కు కడవతో? ఆ మనిషి, ఆమె మొగుడూ మా పొలాల్లో పనిచేస్తారు. దాదాపు అక్కడున్న వాళ్ళల్లో మూడొంతులు మా పరివారమే” చెప్పింది సత్యవతి. “సరే ఆ పచ్చ చీర పిల్ల మా ఇంట్లో పనిమనిషి లక్ష్మి. పొద్దున్నించీ చూస్తూనే ఉన్నారుగా” అంది.
“అబ్బ ఎంత హాయిగా సరదాగా ఉన్నారే వాళ్ళు! కాయకష్టం చేసుకునే వాళ్ల బతుకులే హాయిగా నిశ్చింతగా ఉంటాయెలాగైనా ” అంది సీత.
“ఇప్పుడలాగే కనిపిస్తారు. ఇళ్లకెళ్లాక చీకటిపడేవేళకి సీను మారిపోతుందిలే. మా తోటమాలి పెళ్ళాం అని చెప్పానే తనూ మొగుడితో కలిసి మా తోటపనికి వస్తుంది. ఇద్దరూ పని చేస్తుంటే అదేదో పాతకాలం సినిమాపాట టీవీలు రాకముందు రేడియోలో మోగుతుండేదే “ఆడుతుపాడుతు పనిచేస్తుంటే అలుపూసొలుపేమున్నదీ” అనుకుంటూ ఆ పాట గుర్తుకొస్తుంది. అలా పనిచేసి ఇంటి కెళ్లి చీకటి పడే వేళకి ఇంత చుక్కేస్తాడా మొగుడు. అత్త మహాతల్లి కోడలిమీద ఉన్నవీ లేనివీ చాడీలు కల్పించి చెప్తుంది. దాంతో మొగుడు మహాశయుడు వీపు విమానం మోత మోగించక తప్పదు. ఇంక మా పనిమనిషి లక్ష్మి కథ మరోరకం… ”
“హమ్మో చాల్లేవే బాబూ. ఇంక చెప్పకు ఏదో సరదాగా గడుపుదామనొచ్చాం. మనకున్న గోల చాలు. ఇంకివన్నీ చెప్పి మా మూడ్స్ చెడగొట్టకు” మిత్రబృందం సత్యవతికి దండాలెట్టేసి బతిమాలేసారు. “సరే సరే. చెప్పనులే. అందరూ చాలా హాయిగా ఉన్నారు. మనం కూడా” గబగబా అనేసి చెంపలు వాయించుకుంది సత్యవతి. అంతా గలగలా నవ్వేసారు ఆమె మాటలకి, చేతలకి.
అదే సమయంలో చెరువుదగ్గరున్న లక్ష్మి తలెత్తి డాబామీద కనబడుతున్న సత్యవతినీ ఇతరులనీ చూసింది. తన చేతిలోని ఖాళీ కడవని పక్కన పెట్టి చెరువుగట్టు మీద అటుగా నడిచి రోడ్డెక్కి సత్యవతి ఇంటివైపు వస్తుండడం చూసారు వీళ్ళు.
“లక్ష్మి మనల్ని చూసి మనం ఏదో పనిచెప్తాం అనుకుని మళ్ళీ వస్తున్నట్టుంది. భలే మంచిపిల్లలే. చాలా సాయంగా ఉంటుంది” అంది సత్యవతి. “అదృష్టమే తల్లీ నీకు. హాయిగా కూచుంటే లేవకుండా సేవలు చేసే పరివారం మాత్రం బాగా దొరికారు” రాణి అంటుండగానే మెట్లెక్కి డాబా మీద ప్రత్యక్షమైంది లక్ష్మి.
“ఏటండమ్మగారు ఏటయినా పనుందాండీ? నాకోసం సూత్తన్నారా?”అడిగింది. సరదాగా అందరి వైపు చూస్తూ.
“ఏమిటే లక్ష్మీ, ఇవాళ మీగూడెం ఆడాళ్లు ఒకేసారి చాలామందే చేరారు చెరువు దగ్గర? ఎప్పుడూ లేనిది మీ అత్త కూడా కడవ పట్టుకునొచ్చిందే?” అడిగింది సత్యవతి.
“మా అత్తొకత్తే కాదండి ఆ ఎంకటి, సూరీ, కమలం ఆళ్ళ అత్తలు కూడా వొచ్చీరండి” అంది నోరు బార్లా తెరిచి నవ్వుతూ.
“అదే అడుగుతున్నా ఏంటి విశేషం?” సత్యవతి ప్రశ్నకి కిలకిలా నవ్వేసి,
“ఇసేసవేఁనండి. మీరంతా అప్పుడప్పుడూ… ఆ మునసబు గోరి పెల్లాం, ప్లీడరుగోరి బార్యాగోరూ ఇంకా మిగతా ఊళ్ళో పెద్ద కామందుల బార్యలూ అంతా కలిసినప్పుడు చిట్టిపార్టీలో ఏవో సేసుకుంటుంటారు కదుండీ? ”
“కిట్టీపార్టీలే తల్లీ! చిట్టిపార్టీలు కాదు” అంతా నవ్వేసారు.
“అదేలెండి ఆపార్టీల్లో అయేయో గేములాటలాడతాంటారు గందా. అల్లాగే మేమంతా ఇయ్యాల ‘ఎవురికుండ ఆల్లే మొయ్యాల‘ అని గేమాట పెట్టుకున్నామండి. మరి కోడల్లం మేం రోజూ అట్టుకెల్లే సెరువు నీల్లు మా అత్తలు కూడా వాడుకుంటారుకదండీ అందుకని ఆల్లు కూడా ఆల్ల కుండ ఆల్లే మొయ్యాల్సిందే అన్నామండి కోడళ్ళమందరం. అందుకనీ ఆల్లు కూడా వొచ్చీసీరండి” కిలకిలా నవ్వింది లక్ష్మి. వింటున్న వాళ్లందరూ కూడా సరదాగా నవ్వేసారు.
నవ్వేసారేగానీ, వాళ్ళందరి కళ్లముందూ కౌసల్య వాట్సప్‌లో పెట్టిన ముగ్గురు పడతులబొమ్మ కదలాడింది. అప్పుడు ఆ క్షణంలో అందరి మనసుల్లోనూ ఒకే తలపు తలుపుతట్టింది.
‘అవును. ఎవరికుండ వాళ్ళే మొయ్యాలి! ఏవేవో ఆనందాలు తోడుకుని అనుభవించాలి అని. “బతుకు చెరువు” దగ్గరచేరి కుండ నింపుకున్నాక అందులో నిండినది ఆనందమైనా, విషాదమైనా, ఎంతబరువైనా ఎవరికుండ వారే మొయ్యాలి తప్పదు’.