26. అవని కాకూడదు అగ్నిగుండం

0
6

[box type=’note’ fontsize=’16’] 2018 దసరా కవితల పోటీకి వచ్చిన కవిత. [/box]

[dropcap]కొ[/dropcap]న్నేళ్ళుగా
మానవ తప్పిదాల ప్రభావం
పుడమిపై యిప్పుడిప్పుడే కనిపిస్తోంది.
యిప్పటికీ క్రమం
తప్పక కొనసాగిస్తున్న
తప్పిదాలు
భవిష్యత్తును శాసించబోతున్నాయి.

అభివృద్ధి పథంలోకి వెళుతున్నామనేది
యెంత వాస్తవమో..!
అంతిమంగా యిది తమ ఉనికికే ముప్పనేది
అంతకంటే వాస్తవం…!!

విజ్ఞానం వైపు దూసుకు
పోతున్నాననుకొనే మానవుడు
క్రమంగా తనకు తానే
అవుతున్నాడు భస్మాసురుడు.

నాగరికత మనిషి
మనుగడకు అద్దంలా వుండాలి
మానవ మనుగడకు
అడ్డంకి కాకుండాలి.

మాయమవుతున్న పచ్చటి పొలాలు
తరగి పోతున్న మహారణ్యాలు
తరలి పోతున్న తరులు
కరగి పోతున్న హిమగిరులు
సజీవత్వాన్ని కోల్పోతున్న నదులు
మునుగుతున్న సాగర తీరాలు
అవనిపై హద్దుమీరిన ప్రగతి
అంతులేని ఈ విషాదాల జగతి.

క్షణక్షణానికి సహజత్వాన్ని
కోల్పోతున్న పుడమి
అవుతోంది రోజులు గడిచే కొద్దీ
నిప్పుల కొలిమి.

మనిషి మనుగడకు
అభివృద్ధి ఎంత ముఖ్యమో…
ముందుతరాల వారు బ్రతకడం
అంతకన్నా ముఖ్యం..!

ఈనాటి జనుల సాంకేతిక దాహం
భావితరాలకు కాకూడదు శాపం
అవని కాకూడదు అగ్నిగుండం
అది భావితరాల మనుగడకు గండం.