తాత్వికపరమైన అంశాలు, కళాత్మకత, కవిత్వపు ధోరణుల కలగలుపు -27 డవున్

0
7

[dropcap]1[/dropcap]973-74 సంవత్సరానికి అత్యుత్తమ హిందీ చలన చిత్రంగా జాతీయ పురస్కారం అందుకున్న చిత్రం ’27 డవున్’.

ఇది ఒక రైలు నెంబరు! రమేష్ బక్షీ రచించిన ‘అఠారహ్ సూరజ్ కే ఫౌదే’ అనే నవల ఆధారంగా అవతార్ కృష్ణ కౌల్ నిర్మించిన చిత్రం. ఈ చిత్రానికి మరొక పురస్కారం లభించింది – ఉత్తమ సినిమాటోగ్రఫీకి అపూర్వ కిషోర్ బీర్ (ఎ. కె. బీర్‌గా అందరికీ పరిచితులు). ఈ రెండు పురస్కారాలూ ప్రకటింపబడిన వారంలోనే ఓ దుర్ఘటనలో దర్శకులు అవతార్ కృష్ణ కౌల్ గతించడం ఎంతో బాధాకరం.

మనిషి జీవితంలోనూ, కథకుల సృజన లోనూ రైలు అనేది ఎంతో ప్రధానమైన పాత్రను పోషిస్తుంది. గమనము, గమ్యము, మనము, అందరము, అంతా కలసి ఎవరి పాత్రలను వారు పోషిస్తూ కలసి సాగించే సంసారం రెండు పట్టాల మీదుగా జనన మరణమనే జైలుకు కట్టబడి తిరిగి ఆ జైలుకే వచ్చి ఆగిపోయేదే కదా అన్న ఆలోచన ఎందరికి వస్తుంది. ఈ భూమి కూడా అందరినీ వెంటేసుకుని నిర్దేశించుకున్న కక్ష్యలో గుండ్రంగా ఉన్న పట్టాల మీద అలా ఎందుకు తిరుగుతుందో, త్రిప్పుతోందో దానికే తెలియాలి!

ఇటీవల రైలు బండిని ఎంచుకొని వ్రాసిన కథల సంకలనం ఒకటి ‘రైలు కథలు’గా వెలువడింది. ఈ ఆలోచన అనే కాన్వాసును పెద్దది చేసి రైలు ప్రభావం ఉన్న చిత్రాలతో ఓ ‘యాత్రా స్పెషల్’ లాంటిది తయారు చేయడం కూడా మంచి ఆలోచనే!

మనిషి ప్రయాణాన్ని ఎంత ఇష్టపడతాడో, దృశ్యాన్ని కూడా అంతగానే ఆస్వాదిస్తాడు. ఈ రెండూ కలిసిన చోట ప్రాణం మరోలా ప్రయాణిస్తుంది.

కిటికీ దగ్గర కూర్చుని రైలు బయట కనిపిస్తున్న దృశ్యాలను చూస్తుంటే అక్కడ ఉన్న ఆకాశం, ఆ గాలి, ఆ వాతావరణం, ఆ పక్షులు… అలా అన్నీ కనిపిస్తుంటే ఏదో చెయ్యాలని చేసేయ్యాలని అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడున్న దానిని తెంచేసి మార్చేయాలనిపిస్తుంది. జీవితం వైవిధ్యం కావాలంటుంది. కొత్తదనాన్ని కోరుకుంటుంది. డోర్ దగ్గర నిలబడితే ప్రతి సామాన్యుడు హీరోనే! టక్ చేసుకుని సరదాగా నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని ప్లాట్‌ఫార్మ్ మీద ఓ చిన్ని పెట్టె చేతిలో పట్టుకొని ఓ చెయ్యి జేబులో పెట్టుకుంటే అందరూ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్సే! అటువైపుగా ఓ అమ్మాయి దొంగ చూపు చూస్తూ వెళ్ళిపోతే రేపొద్దున జీవితంలో ఒక కొత్త సినిమానే…

కాకపోతే ఈ రైలు పరమ కిరాతకమైనది. ఇలా ఎప్పుడూ దిగవలసిన స్టేషన్లోనే దిగి పోవలసి వచ్చినప్పుడు ఈ దృశ్యాలెందుకు? ఈ ఊహలెందుకు? ఈ ఆలోచన లెందుకు? ఆశలెందుకు? ఎక్కువ మాట్లాడితే అసలు ఈ ప్రయాణం ఎందుకు?

సంజయ్ (ఎమ్.కె. రైనా) 27 డవున్ ముంబయి – వారణాసి ఎక్స్‌ప్రెస్‌లో అగమ్యగోచరంగా పై బెర్త్ మీద పడుకొని వారణాసి వెళుతూ జరిగిన దానిని తలచుకుంటూ ఉంటాడు. ఇతను ఒక రైల్వే కుటుంబానికి చెందినవాడు. ఇతని తండ్రి (ఓమ్ శివ్‌పురి) ఇంజన్ డ్రైవర్. సంజయ్‌కి కళల పట్ల ఎన్నో కలలు. ముంబయిలో పెయింటింగ్ నేర్చుకునేందుకు కాలేజిలో చేరుతాడు. కానీ చివరి సంవత్సరం లోనే తండ్రి కుంటివాడు అయినందుకు, తల్లి చనిపోయినందుకు ఆ దారి వదిలి టికెట్ ఎగ్జామినర్‌గా రైల్వేలో చేరతాడు. రైల్వే అధికారి సంజయ్ ఉద్యోగం తాలూకు అర్జీ  పెట్టుకుంటున్నప్పుడు పుట్టిన స్థలం చెప్పే దగ్గర ఒక సన్నివేశం ఎంతో కళాత్మకంగా ఉంటుంది. ఇతను రెండు ఊళ్ళ పేర్లు చెప్తాడు. అదేమిటంటాడు అధికారి.

“నేను రైల్లో పుట్టాను. పుట్టినప్పుడు మొదట రాసిన ఊరు దాటేసింది రైలు. రెండో ఊరు ఇంకా రాలేదు” అంటాడు.

“నాకు అనవసరం. ఒక ఊరే వ్రాయాలి.”

“ఏది వ్రాయాలి?”

అక్కడ సీన్ కట్ అయిపోతుంది. కానీ ఆలోచన మిగిలింది. రెండోది చేరుకుని గమ్యం. మొదటిది వెనక్కి లాగేది. అదే అట్నుంచి వచ్చే రైలుకి మరోలా ఉండే మార్గం!

రైల్వేలో చేరాక ముంబయిలో సబర్బన్ ట్రైన్‌లో శాలిని అనే అమ్మాయితో పరిచయం ఏర్పడుతుంది (రాఖీ). ఈమెతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. ఇంతలో సంజయ్ తండ్రి ఇది తెలుసుకుని మరో అమ్మాయితో వివాహం నిశ్చయం చేస్తాడు (రేఖా సబ్నిస్). మామగారు నాలుగు పాడి గేదెలను కూడా తెస్తాడు. అవసరమైతే ఉద్యోగం కూడా మానేయవచ్చంటాడు. బాధతో శాలినిని కలవడానికి వెళతాడు. కనీసం ఒక  కప్పు టీ అయినా పెట్టియ్యమంటాడు. ఆమె అది కూడా కుదరదు అంటుంది. కిటికీ బయట రైళ్ళు వెళుతూ ఉంటాయి. దిగాలుగా కూర్చుని ఉంటాడు సంజయ్. ఒక కూత వినిపిస్తుంది.

“విన్నావా?” అంటుంది.

“ఏంటి?”

“కూత”

“అయితే?”

“సిగ్నల్ వచ్చింది. దాన్నిబట్టి నడుచుకో…”

ఇక బయలుదేరమని చెప్పటం అది. అటు ఇటు ఊగిసలాడే మరోసారి ఆమె దగ్గరకు వెళతాడు. ఈసారి ఆలోచించి మర్నాడు ఎప్పుడూ కలుసుకునే ప్లాట్‌ఫార్మ్ మీద టీ స్టాల్ దగ్గరకు రమ్మంటుంది. సబర్బన్‌లో ఎక్కి ఆశగా అక్కడికి వెళ్లి వెతుకుతాడు సంజయ్. ఆమె కనిపించదు. నిరాశలో ’27 డవున్’ ఎక్కుతాడు. ఇంటిదగ్గర వీళ్ల వ్యవహారం గురించి తన భార్యకు ఓ మిత్రుడు అన్నీ వివరంగా చెబుతూ ఉంటాడు… ఆమె సాధింపు మరోలా ఉంటుంది.

ఉదయమే వారణాసిలో దిగుతాడు. ఒక చవకబారు బారులో కూర్చుని మద్యపానం చేస్తూ ఉంటాడు. ప్రక్కన కూర్చున్న వ్యక్తి గోడమీద ఓ సుందరి పెయింటింగ్ చూస్తూ ఉంటాడు. సంజయ్ మరో లోకంలోకి వెళ్ళిపోతాడు. మంచి చోటు చూపించమని అడుగుతాడు. ఆ రాత్రి ఓ వేశ్యగృహంలో గడుపుతాడు. మానసికంగా కేవలం దాహం తీర్చుకునేందుకు వచ్చాను అంటాడు. కానీ నిద్రలోంచి లేచాక తెలుస్తుంది – అది అంత తేలికయిన వ్యవహారం కాదని. తిరిగి తన ఊరుకి, తన భార్య దగ్గరికి చేరుకుంటాడు.

కట్టి ఉన్న గేదెలు బేలగా చూస్తూ ఉంటాయి. రైళ్ళు అలా వెళ్ళి పోతూ ఉంటాయి…

ఈ చిత్రానికి హరిప్రసాద్ చౌరాసియా, భువనేశ్వరి మిశ్రా అందించిన సంగీతం అద్భుతంగా ఉంటుంది. రైళ్ళు, రైల్వే ప్రపంచం, రన్నింగ్ రూమ్స్, సబర్బన్ రైళ్లు, రైల్వే కాలనీ లోని వ్యవహారం, రైలు ప్రయాణం వంటివి కెమెరాలో బంధించిన తీరు ఎ.కె. బీర్ గారికే సాధ్యం. ఈయనకు దక్కిన పురస్కారం కూడా ఎంతో సముచితమైది.

నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో 1970లో ఉత్తమ నటుడుగా కీర్తి సంపాదించిన నాటక కళాకారుడు ఎమ్.కె. రైనా. ఈయన ఎన్నో భాషలలో కృషి చేస్తున్నారు. 1995లో ఈయనకు ఉత్తమ దర్శకుడి వర్గంలో సంగీత నాటక అకాడమీ పురస్కారం లభించింది. 130కి పైగా భిన్నమైన నాటకాలు చేశారీయన. ‘నూర్’, ‘రబ్‌నే బనాదీ జోడీ’, ‘తారే జమీన్ పర్’, ‘లక్ష్య’, ‘న్యూ ఢిల్లీ టైమ్స్’, ‘అభూత్’, ‘మై అజాద్ హుం’ వంటి సినిమాలలో నటించిన ఈయనకు సంస్కృతి సమ్మాన్, సాహిత్య కళా పరిషత్ వంటి పురస్కారాలు చాలా లభించాయి. ఈయన నటనలో ఒక బేలతనం, సునాయాసంగా పాత్రపోషణ చేసే నేర్పరితనం రాణిస్తాయి. జరుగుతున్న కాలంతో అలా జారిపోతూ వెళ్ళిపోతారు గానీ ఏదో గంభీరమైన భావ ప్రదర్శనో లేక ఏదో నొక్కి వక్కాణించే సంవాదమో ఉండదు. ఈయన వ్యక్తిత్వం చాలామందిని ఆలోచింప జేస్తుంది – దీనికి కారణం ఏమిటంటే – ఈయన నాటక రంగంలో తీవ్రమైన కృషి చేసారు. 1969 నుంచి ఇప్పటి వరకు అనేక నాటకాలు – అర్బన్ ప్రేక్షకులకీ, గ్రామీణులకీ సమానంగా చేసారు. ఆధునిక యుగాన్ని, సాంప్రదాయ బద్ధమైన కళారూపాన్నీ సమానంగా అభ్యసించి పారంగతులైనారు. కశ్మీరు నుంచి వచ్చిన ఈయన బహుశః కృషికి ఎక్కువ పరిమితం అయిపోయి, ‘పెద బాబుల’ దృష్టికి, ప్రోత్సాహానికి తక్కువ నోచుకున్నారా అని అనుకున్నప్పుడు కొద్దిగా నొచ్చుకోవాల్సి ఉంటుంది…

నవల లోని ఇతివృత్తాన్ని ఎంతో అందంగా తెర మీదకి తెచ్చారు దర్శకులు.

ట్రీట్‌మెంట్ విషయానికి వస్తే ‘సెల్ఫ్ రిఫ్లెక్సివిటీ’ అనే ఒక ఆసక్తికరమైన ప్రక్రియ ఇందులో కనిపిస్తుంది. రచనకు, నాటక రూపాంతరానికి, చలనచిత్ర నిర్మాణానికి మధ్య ఒక అందమైన అంతరంగం ఉంటుంది. ఎందరో రచయితలు సినిమాలో రాణించాలనుకున్నవారుంటారు. ఈ అంతరంగాన్ని ఆవిష్కరించలేకపోతే వారిలో నున్న నైపుణ్యం తెలియకుండానే ఆవిరైపోతుంది. ఎందుకన్నది ఉదహరిస్తాను –

కథలో ఒక కళాకారుడిని చూపించారు కానీ ఆ మేరకు ఫోకస్ చాలా తక్కువ ఉంచారు. ఆ కళాకారుడిని యాంత్రికంగా జీవిస్తూ, నవ్వుకుంటూనే జరుగుతున్నవాటి మీద ఏవో పరిశీలనలు చేస్తున్న వ్యక్తిగా చూపించి ఆ కళ పట్ల గల స్వతంత్ర్యమైన పిపాసను కేవలం ఒక బార్‌లో కొద్దిగా అశ్లీలంగా ఉన్న పెయింటింగ్ దగ్గర సూచనప్రాయంగా వదిలివేశారు. బాగుంది కదా ఇది, అంటాడు ప్రక్కనున్న వ్యక్తితో. ఆ దృశ్యంలోని ఆ మనిషి ఏమీ మాట్లాడడు. ఇది వారణాసిలో ఏమిటి? తీర్థస్థలం కదా? అన్నింటినీ విస్మరించి పూర్తి స్వాతంత్ర్యంతో విశ్వమానవునిలా తనలోని సృజనను సాక్షాత్కరించుకోవటం యాత్ర కాదా? శరీరమనే జైలు ఓ రైలులో అక్కడికి చేరుకోదా?

ఈ అంశాన్ని రచన ఒకలాగా చెబుతుంది. నాటకం నాటకీయమైన సంఘటన మీద ఆధారపడుతుంది. చలనచిత్రం తక్కువ మాటలతో సంఘటనలను ప్రయాణంలోని స్టేషన్ల లాగా లాక్కుంటూ వెళ్ళి ప్రదర్శించాలని కోరుకుంటుంది. దృశ్యం ‘దర్శనానికి’ సంబంధించినది. కెమెరా కాన్సెప్ట్ మీద కూర్చుంటుంది. అయ్యో నా లైను ఇందులో రాలేదే, నాకు నటనకు స్కోప్ ఇవ్వలేదే అనేవి అర్థరహితమవుతాయి.

బెర్టోల్ట్ బ్రెక్ట్ సిద్ధాంతం ‘డిస్టెన్షియేషన్’ మీద ఆధారపడ్డ చిత్రాలు, అలాగే 1943లోని ‘మెషెస్ ఆఫ్ ది ఆఫ్టర్‌నూన్’ (మాయా డెరెన్) ఈ కోవకి చెందినవి. ఇప్పుడు అర్థమవుతుంది, ఈ చిత్రానికి ఎమ్.కె. రైనా ఎందుకు ఎంపికైనారని!

తాత్వికపరమైన అంశాలను, కళాత్మకతను, కవిత్వపు ధోరణులనో ఉన్న విషయాలను తెర మీద ప్రదర్శింపగోరువారు ‘సెమియాటిక్స్’ అనే ప్రక్రియను పూర్తిగా జీర్ణించుకోవలసిన అవసరం ఉంటుంది. ఇందులో రెండు ప్రధానమైనవి ఉంటాయి – మొదటిది ‘డినోటేషన్’, రెండవది ‘కనోటేషన్’.

రైలు, రైలు పరివారం, ప్రయాణం…. ‘డినోటేషన్’కు చెందినవి. కనిపిస్తున్న పాత్రలు, సంబంధాలు, సామాజిక, సాంఘికపరమైన అంశాలన్నీ ‘కనోటేషన్’కు సంబంధించినవి.

ఈ రెండిటి మధ్య గల వారధి ‘సెల్ఫ్ రిఫ్లెక్సివిటీ’కి చెందిన సంజయ్ పాత్ర. అందుచేత అతను మనకు బాధ పడిపోతున్న ఓ నాయకుని గానో, త్రాగుడుకు అలవాటు పడి చెడిపోయే వాడిగానో, ఎక్కడో కూర్చుని ‘షేర్ షాయిరీలు’ వినిపించే వాడి గానో కనిపించడు.

కారణం? మనమందరం మన విషయంలో స్వేచ్ఛను కోరుకోమా? ఇంట్లోని కిటికీలోంచి, రైల్లోని కిటికీలోంచి చూడమా?

ఒక్కోసారి పైకి చూసి ఆకాశం ఇలా ఎందుకుందీ అని అనుకోమా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here