27. పొడుస్తున్న పొద్దు

0
7

[box type=’note’ fontsize=’16’] 2018 దీపావళి కథల పోటీకి వచ్చిన కథ. [/box]

[dropcap]మ[/dropcap]రో పది నిమిషాల్లో ఫ్లైట్ లాండ్ అవబోతుందని, సీట్ బెల్ట్స్ పెట్టుకొమ్మని అనౌన్సు చేస్తున్నారు.. కిటికీ గుండా చుట్టూ నీలి మేఘాలు, పాలనురగ లాంటి తెల్లని మబ్బులు ఆహ్లాదపరుస్తూ కనబడ్డ్డాయి. చిన్నప్పుడు తమ పల్లె పై నుండి ఎప్పుడో ఒకప్పుడు విమానం వెళితే ఆ శబ్దం వినగానే ఇంట్లో నుంచి రయ్యిమని బయటకోచ్చేవారు, తను, చెల్లి. కంటిపై చెయ్యడ్డుపెట్టి వినీలాకాశంలో దూసుకుపోయే విమానాన్ని కనుచూపు మేర కనిపించెంతవరకు చూసేవాళ్ళు. ఆకాశంలో చిన్న పక్షిలా తీలిపోయే విమానంలో మనుషులు కూర్చుని  ఉన్నారని నాన్న చెబితే నమ్మక పోయేవారు. ఆలోచనల్లోనే బాక్ పాక్, క్యాబిన్ బాగ్ తో బయటకొచ్చాను.

వాష్ రూమ్‌లో ముఖం కడుక్కుని ఫ్రెషప్ అయి, సెక్యురిటీ చెకవుట్, పాస్‌పోర్ట్ స్టాంపింగ్ అటెండ్ అయ్యాను. కన్వేయర్ బెల్ట్‌పై నున్న రెండు బ్యాగుల లగేజ్ కలెక్ట్ చేసుకున్నాను. అన్నీ ట్రాలీలో పెట్టుకుని బయటకొచ్చాను. ఒక్కసారి చల్లటిగాలి రివ్వున తాకింది. ‘నా జన్మ భూమి ఎంతో అందమైన దేశము, నా ఇల్లు అందులోన కమ్మని ప్రదేశము…..’ పాట గుర్తొచ్చింది. రిసీవ్ చేసుకోవడానికి అమ్మావాళ్ళు వస్తానంటే తానే వద్దన్నాడు. ఇంటి దగ్గర నుండి కార్లో డ్రైవర్ వచ్చి బయట వెయిట్ చేస్తున్నాడు. పలకరించి క్షేమసమాచారాలడుగుతూ లగేజంతా డిక్కీలో, వెనక సీట్లో సర్దాను. కళ్ళు మూసుకుని వెనక్కి వాలాను. కారు మంచి స్పీడ్‌తో పోతోంది. ఆలోచనలన్నీ గతంలోకి జారుకున్నాయి.

సీతక్క ఇచ్చిన జున్నుపాలలో మిరియాల పొడి వేసి వేడి చేసి తనకిష్టమని తినిపించేది అమ్మ. రామక్క, సీతక్క తమింట్లో ఉండే ఎద్దు, ఆవులు. వాటి లేగదూడే ‘లక్ష్మి’. తను అమెరికా వెళుతుంటే అమ్మ, నాన్న, నేను ఏడ్చినపుడు దానికేం అర్థం అయ్యిందో గాని అది కూడా కన్నీరు కార్చింది.  తన సోపతిగాళ్ళు రవి, శివ, వెంకటేశు, నారిగాడు, నర్సిగాడు అంతా ఎలా ఉన్నారో….

వాళ్ళతో కల్సి పొలం గట్ల వెంబడి ఎలా ఎగురుతూ తిరిగేవాడు. రెళ్ళు గడ్డి, ఎండు కట్టే పుల్లలు వేసి కాల్చుకుని తిన్న కంకులు, పల్లికాయలు, శనక్కాయలు, కందికాయలు. ఆహా ఏమి రుచిగా ఉండేవి. ఆ కమ్మదనమే వేరు. జామకాయలు, సీతాఫలాలు, మామిడికాయలు అలా ఏ కాలం పండ్లు ఆ కాలంలో చెట్ల మీది నుండి తెచ్చుకుని తింటే, ‘ఆహా ఏమి రుచి అనరా మైమరచి’ అనిపించేవి. ఆ తియ్యదనమే వేరు. లేతముంజలు, కొబ్బరి నీళ్ళు… ఆ రుచే అద్భుతం… ఇక బడికి సెలవు వచ్చిందంటే చాలు.. ప్రశాంతమైన చెరువు మొత్తం, తాము పోటీలు పెట్టుకుని చెరువు కట్టపై నుండి డైవ్ కొట్టి, దూకి కొట్టే ఈతలకు చెల్లాచెదురై విరజిమ్మే నీళ్ళతో  తమ కేకలతో దద్దరిల్లేది. బుడుబుంగలు, సీత్వలు, కారుకొల్లు, గోకలు వేటి ఆట వాటిదే.. ఎండ్రి కాయల్ని, చేపల్ని, గోండ్రు కప్పల్ని పట్టుడు, నీళ్ళల్ల వదలుడు ఒక ఆట.  తూము కింద సాకలోల్లు బట్టలు పిండేటోల్లు. అయిపోయిన నోటు పుస్తకాల్ల పేపర్లు చింపి కత్తి పడవలు, వట్టి పడవలు చేసి నీల్లల్లెసేటోల్లం. వర్షా కాలం మత్తడి పడితే ఆ అందమే వేరు. బడి లేకపోతే చాలు. చిర్రెగోనాట, కోతికొమ్మచ్చి, గోలీ ఆటలకు రికాము లేకపోయేది. చెరువుల దొరికే కసికెలు, గవ్వలు ఎరుకుని తీస్కపోయేటోల్లం. మువ్వపాలగోగు కసికేలతోని తీసిపెట్టేది అమ్మ. ఎంత కమ్మగుండేదో… గుట్టమీదుండే గోవిందరాజు స్వామీ దగ్గరకు తాత, నాన్నతో కలిసి చెల్లితో పోటీపడుతూ ఎక్కేవాన్ని. సుమతి శతక పద్యాలతో పాటు ఆంజనేయ దండకం, హనుమాన్ చాలీసా నోటికే వచ్చేవి. తాత ‘శ్రీ మనోహర సురార్చిత సింధు గంభీర, భక్త వత్సల కోటి భానుతేజ….’ అని రాగం తీస్తూ నరసింహ శతకం లోని పాటలు ఎంత చక్కగా పాడేవాడో…. అలా వినీ వినీ అవి కంటతా వచ్చేవి. అలా పాడుతూ మెట్లేక్కేవాళ్ళం. ప్రసాదం కోసమే నిలబడి, పూజారి ఆరగింపు చేసేంత వరకు పోటీపడి గంటకొట్టేవాళ్ళం. ‘శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే….’తో సహా ‘రామా మంగళము పరంధామా గైకొనవే కలవిరామా శృంగార సుగుణ ధామ…’ అంటూ అంతా కలసి మంగళ హారతులు పాడేవారు. తన కంఠం బావుంటుందని ఒక భజన చెబితే, కొబ్బరి చిప్ప నిండా ప్రసాదం ఎక్కువిస్తానని ఆశ పెట్టి పూజారి ఒక్కో భజన చెప్పించేవాడు. ‘ఆది శేషా… అనంతశయన… శ్రీనివాస శ్రీవెంకటేశా…’ ‘నంద గోపాల..’ ‘మహాదేవా.. సదాశివా…’ అంటూ భజనలు చెప్పేవాడు.

గణేష్ నిమజ్జనం వచ్చినా, బతకమ్మ పండగొచ్చినా ఊరు ఊరంతా అందంగా ముస్తాబయ్యేది. గట్టు, పుట్ట తిరిగి ఏరేరి అన్ని రకాల పూలు కోసుకోచ్చేటోల్లం. బతుకమ్మను పేర్చడానికైతే సొర, బీర, కట్ల, కాకర, గుమ్మడి, రుద్రాక్ష, తంగేడు, గునుగు, మందార, గన్నేరు, కనకాంబరాలు ఇలా అన్నీ కోసుకోచ్చేవాళ్ళం. సిబ్బిలో పరవడానికి, తాంబాలంల పెద్ద బతుకమ్మ పేర్వడానికి బీర, సొర,గుమ్మడి ఆకులు కూడా తెంపి తెచ్చేవాళ్ళం. కడుపులో నింపడానికి కూడా అన్ని ఆకులు తెచ్చేటొల్లం. అందరి కన్నా తమ బతుకమ్మ పెద్దగా ఉండేది. ముందు రోజే గునుగు పువ్వులకు, రకరకాల రంగులద్ది ఆరబెట్టేవాళ్ళం. తను ఏ రంగు తర్వాత ఏ రంగు బావుంటుందో చెబుతూ అందిస్తూ సహాయం చేసేవాడు. అమ్మ ఉయ్యాల పాటలు, కోలాటం పాటలు పాడుతూ పేర్చేది. ఇంట్లో పనులు చేసుకుంటూ కూడా పాడేది. అలా వినీ వినీ తనకూ కంటతా వచ్చేసాయి. చెరువు కట్ట మీదకు రోజూ బతుకమ్మలు పట్టుకుని చెల్లి, మిగతావాళ్ళంతా పొతే తాము ఫ్రెండ్స్ అంతా  కల్సి వెంట  వెళ్లి, అక్కడే హస్కు కొట్టేవాళ్ళం. రోజు సిబ్బిల్లల్ల పప్పు ఫలహారాలు వాయినం ఇచ్చుకుంటే, చెల్లి ఫలహారం తను తినేవాడు. చెరువు కట్ట మీద కూర్చుని నీళ్ళల్ల తేలుకుంట బతుకమ్మలు పోతుంటే అలా చూస్తూ కూర్చునేవాళ్ళం.

ఇక సద్దుల బతకమ్మ, తొమ్మిదో రోజు వచ్చిందంటే పొద్దున్నే లేచి, చెట్ల మీద ఒక్క పువ్వు లేకుండా తీరొక్క పువ్వు తెంపు కోచ్చేటోల్లం. పట్టుచీరలు, కొత్తబట్టలు కట్టుకుని, తల నిండా చామంతి పూలతో చేతుల నిండా గాజులతో, మెడ నిండా నగలతో అన్ని వాడల నుండి జనం బతుకమ్మలతో చెరువుకట్ట దారి పడితే ఊరు ఊరంతా పూలవనం కదిలినట్లుండేది.. ఊరు ఊరంతా చెరువుకట్ట దగ్గర జమయితే, నేల ఈనిందా అన్నంత జనముండేది. అందులోనే ఫలహారాలనమ్మే తోపుడు బళ్ళు, చిన్న పిల్లల ఆటవస్తువులు అమ్మే బళ్ళు ఉండేవి. ఒకే దరువుతో బతుకమ్మల చుట్టూ తిరుగుతూ వేసే చప్పట్లు, పాడే పాటలతో కోలాటాలతో చాలా సందడిగా ఉండేది. కట్టమీది మైసమ్మ, ఊర్లోని పోచమ్మ దీవిస్తున్నట్లుండేవి. ఆడవాళ్ళతో పాటు చిన్నా, పెద్ద మగవాళ్ళంతా కూడా కదిలి వచ్చి ముచ్చాట్లాడుకునేవారు. పాటలు పాడి చీకటి పడ్డాక బతుకమ్మలో పెట్టిన గౌరమ్మను తీసుకుని, పైసలు పెట్టి దీపం ముట్టించి నీళ్ళల్ల వదిలిపెట్టేవాళ్ళు. చిమ్మటి  చీకటిలో దీపం వెలుగుతూ నీటిలో బతుకమ్మ కదిలి వెళుతుంటే అత్తగారింటికి ఆడపడుచును సాగనంపినట్లుండేది.

‘రాముని పల్లె’ బోర్డ్ రాగానే ఆత్రంగా బయటకు చూస్తున్నాను. ఎవరూ కనబడటం లేదు.. ఇండ్లు కూడా చాలా వరకు తలుపులు, తాళాలు వేసున్నాయి. అదేంటి ఈ బతుకమ్మ పండుగ రోజుల్లో ఇలా ఉండడమేంటీ…. పచ్చదనం ఎక్కడా కానరావడం లేదు. ఎండిపోయి నెర్రెలు వాసి, బీటలు బారిన పొలాలు రాకాసి నోళ్ళలా తెరుచుకుని ఉన్నాయి. కారు ఇంటి ముందు ఆగింది. ఎప్పటిలా పచ్చటి కల్లాపి జల్లి, వేసిన ముగ్గులతో వాకిలి ఆత్మీయంగా ఆహ్వానం పలికింది. అమ్మ ఎర్రనీల్లు దిష్టి తీసి కౌగిలించుకుని కన్నీరు పెట్టింది. నాన్న, తాత ఆలింగనం చేసుకున్నారు. చెల్లి అయితే చేయివదలడం లేదు. లో నుండి ఎలా తెలిసిందో లక్ష్మి ‘అంబా’ అని నన్ను మర్చిపోయావన్నట్లు అరుస్తుంది. వెళ్లి ఆలింగనం చేసుకున్నాను. లక్ష్మి పెద్దగయి బక్కచిక్కింది. దాని కళ్ళ నుండి అశ్రువులు రాలుతున్నాయి. ఆప్యాయంగా తడిమాను.

‘అమ్మా.. రామక్క… సీతక్క ఏరి.. పొలానికెల్లారా…’ అంటుండగానే నా సెల్ మోగింది…. బంధువులు పలకరించారు.

ఇల్లు పెద్దగా మారలేదు, చిన్న చిన్న మార్పులు తప్పితే. మల్లెచెట్టు, మందార, విరజాజి, జామ, నిమ్మ, గులాబి అన్నీ చూసుకుని పలకరించా…. తలలు ఊపుతూ ఆహ్వానించాయి. అమ్మ ఎప్పటిలా నూనెతో తల అంటి కుంకుడు రసంతో తలంటు పోసింది. దేవునికి దండం పెట్టుకోగానే అమ్మ నా కిష్టమైన పకోడీ, పాయసం, సాంబారు, గోంగూరపచ్చడి, ఆలు వేపుడు, పాలకూర పప్పు వడియాలతో విందు భోజనం పెట్టింది. చాలా సంవత్సరాల తర్వాత సుష్టుగా ఆరగించాను. కడుపు నిండటం ‘జెట్ లాగ్’ వల్లనేమో… ప్రయాణ బడలిక తోడై నిద్ర ముంచుకొచ్చింది. ఆదమరిచి అట్లాగే సోఫాలోనే పడుకుండి పోయాను.

తెల్లవారి లేచి తొందరగా లేచి నాన్నతో పొలానికి తయారయ్యా… రెండడుగుల కొకరు పలకరించేవాళ్ళు. ఇప్పుడు అసలు మానవ సంచారం లేని ఎడారిలా ఉంది. అదేంటి వీళ్ళు నాగరికత ఉచ్చులో పడి  మాలా సూర్యుడొచ్చే వరకు పడుకుంటున్నారా  ఏమిటీ… అన్న అనుమానమొచ్చింది… నాన్న నడిగాను. ‘ఏం చెప్పమంటావురా నాన్న…. ఇది అప్పటి మన కమ్మటి కల లాంటి రాముని పల్లెకాదు…. ఈ సారి వానలు లేవు. దానితో ఊరు ఊరంతా వలసబోయి వల్లకాడైంది. అప్పులు తెచ్చి పంటకు పెట్టిన  వారందరి నోళ్ళల్లో మన్ను పడింది. పెద్ద పెద్ద కామందులు, మోతుబరి రైతులందరూ నలుగురికి పని చూపెట్టేవాల్లె బ్రతుకుదెరువు వెదుక్కుంటూ పట్నమెల్లారు. ఊరు ఊరంతా కేవలం వయసుడిగిన ముసలోళ్ళు, వాళ్ళ దగ్గర వదిలిన చిన్నారులే మిగిలారు. ఊరు ఊరంతా వట్టి పోయింది. గడ్డి, గాదం లేక పశువులను కూడా అయినకాడికి సంతల తెగనమ్ముకున్నారు. కొన్ని కబెలాలకు తరలినాయి. ఎంత డబ్బులు పెట్టినా గ్రాసం దొరకదాయే…. మన రామక్క, సీతక్క లను గ్రాసం దొరకక, ఏదో ఆకులు, చెట్టు చేమ తింటాయని బయటకు వదిలితే గడ్డి దొరకక ప్లాస్టిక్ బ్యాగులు తిని రామక్క చనిపోయింది. సీతక్కను కూడా అలాగే చంపలేక సాదు కొమ్మని ఎవరికైనా ఇద్దామనుకున్నాను… కాని ఎవరైనా ఎలా సాదు కుంటారు… అలా ఎన్నో పశువులు కబెలాలకు తరలి వెళ్ళాయి. మా బాధ చూడలేకనో, రామక్క చనిపోయిన బాధకో గాని  కన్నీరు పెట్టి, బయటకెళ్ళి అతికష్టంపై తెచ్చిన గడ్డి కూడా తినక సీతక్క కూడా చనిపోయింది. గుండె రాయి చేసుకుని మన పొలంలనే పాతి  పెట్టాము. లక్ష్మి నీకు ప్రాణాప్రాణమని దానిని కాపాడడానికి ఖర్చుకు వెనకాడక ఏదో తంటాలు పడుతున్నాము. అదీ ఇంకెంతో కాలం సాగదు…’

పొలం వెళదామంటే నాన్న ఎందుకు తెల్లమొహం వేసాడో ఇప్పుడర్ధమయ్యింది నాకు. ‘అదేంటి నాన్న… బావులు, బోర్లు ఏమయ్యాయి… మోటర్లతో నీళ్ళు తోడి పోసినా కసీసం  గడ్డయినా మోలిచేది కదా….’

‘ఇంకెక్కడి బావులు నాన్నా…. అవేప్పుడో ఎండిపోయాయి… ఎన్నిసార్లు, ఎన్ని చోట్ల బోర్లేసినా భూగర్భజాలం అడుగంటి నీళ్ళు పడుతలేవు. విత్తనాలు కల్తీనే, ఎరువులు కల్తీనే… అన్నీ తట్టుకుని  ఎలాగోలా పండిస్తే, దళారులతో, అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి. గిట్టుబాటు ధర లేక అయినకాడికి అమ్మేసుకుని, చేసిన అప్పులు తీర్చలేక రైతన్నలెందరో ఉరితాల్లకు బలయ్యిండ్రు.. అదేందో పంటలకు పని చేయని పురుగుల మందు, మనుషులు తాగితే మంచిగా పని చేసింది. ఇప్పుడు ఊరు కాదు స్మశానమే మిగిలింది. ఏదో మనలాంటి నాలుగైదు ఇండ్లవాల్లె ఉన్నారు…..’ నాన్న గద్గద స్వరంతో చెబుతూ పోతున్నాడు.

నా కళ్ళు నాకు తెలియకుండానే గంగా గోదారులయ్యాయి. నా సప్త వర్ణాల కల పటాపంచలయి ముక్కలు చెక్కలయ్యింది. అసలు నేనిక్కడికి రాకుండా ఉంటే ఆ చిత్రమలా మధురంగా శాశ్వతంగా నా కళ్ళల్లో ఉండిపోయేదేమో….

ఆ రోజు సద్దుల పండగ నాకిష్టమని అమ్మ బతుకమ్మ పెద్దగా పేర్చడానికి  తంటాలు పడింది. అమ్మ ఎంత పెద్దగా పెర్చాలనుకున్నా పూలు ఎక్కువ లేక పట్నం నుండి తెప్పించిన బంతి, చామంతుల తోనే నింపేసింది. చెల్లి, అమ్మానాన్నలందరికీ నేను తెచ్చిన కొత్తబట్టలిచ్చాను. అంతా  తయారయ్యారు. నేను అన్యమనస్కంగానే తయారయ్యాను. గుడ్డిలో మెల్లలా ఏ మూలో చిన్న ఆశ. అక్కడయినా తన సాయితగాల్లు అందరూ తప్పక కలుస్తారని. ఇదివరకులా దారంతా జనం నేల ఈనినట్లు నిండిపోలేదు. పలచగా…… సందడి లేక ఊరంతా స్తబ్దుగా అనిపించింది. చిన్న చిన్న గుంపులుగా అయి మధ్యలో బతుకమ్మలు పెట్టి ఆడుతున్నారు. ఇదివరకటి కోలాహలం, జనసందోహం లేదు. తోపుడుబల్ల కలకలం, అరుపులు అదీ పెద్దగా లేదు. చెరువు ఇంకొంచెం దూరం ఉందేమోనని నడుస్తున్నా…

‘ఇంకెక్కడి చెరువురా…. ఈ జిల్లేడు చెట్లు, గన్నేరు చెట్లు, పిచ్చి మొక్కలు మొలిసిందే చెరువురా….’ అమ్మ మాటతో అవాక్కయ్యాను. చెరువు చుక్క నీరు లేక మటుమాయమైంది. సోపతి గాల్లతో ఎగిరెగిరి డీ కొట్టి, జల సముద్రం లాంటి చెర్లలో దునికిన ఆ రోజులేవి…. ఆ అశేష జల సంపద, మత్స్య సంపద ఎక్కడికి వలసబోయింది… కనీసం కట్ట మీది మైసమ్మనో, పోచమ్మ తల్లో, ఉప్పలమ్మ తల్లో  అడ్డుపడలేదా… కన్నుల పండువగా బోనాల పండుగ చేసిన కనికరమైనా లేదా…

ఇంతకాలం అమెరికాలో స్విమ్మింగ్ ఫూల్ (ఈతకొలను) లో ఎన్ని సార్లు ఈత కొట్టినా, చెరువులో చేసిన ఆ ఆనందం వచ్చేది కాదు. ఇక్కడ స్నేహితులతో తనివితీరా కొట్టి, కొన్ని సంవత్సరాల మధురానుభూతులు కూడగట్టుకుని పోదామని వచ్చా… ఉన్న జ్ఞాపకాల్ని సమాధి చేసుకుంటాననుకోలేదు. నా కళ్ళు రెండు మత్తడోచ్చిన చెరువులయ్యాయి.

‘అరె… నువ్వు… మన సీనువు కదూ… అరె… మేమురా… నారిగాన్ని… వీడు వేంకటేశు.. వీడు శివగాడు… వీడు రవిగాడు…’ అంటూ వచ్చిన సోపతి గాళ్ళను చూసాను. బక్కచిక్కిన శరీరాలతో, కళ్ళల్లో ప్రానమున్నట్లున్న వాళ్ళల్లో అప్పటి వారి పోలికలను పోల్చుకుంటూ ఆత్మీయులను చూసిన ఆనందంతో ఆలింగనం చేసుకున్నా…

‘ఏందీరా…. ఏంటిది… ఇట్లా ఏడుస్తున్నావ్…’ వాళ్లడుగుతున్నారు…

‘మన చెరువు… మనం ఈతకొట్టిన చెరువేదిరా…’ నా కంఠం రుద్ధమై ఏడుపు గొంతుకే వచ్చింది. మౌనం వహించారు వాళ్ళు..

‘ఈతల నన్నేప్పటికి ఓడించే నర్సిగాడు ఏడిరా… రాలేదా… వాడి కోసం స్విమ్మింగ్ డ్రెస్, గాగుల్స్ అన్నీ తెచ్చా… వాడికి గాగుల్స్ బాగా షోకు కదరా… జాతర్ల దొరికే నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని తెగ సంబర పడేవాడు కదా…. వాడి ఫోన్ నంబరైనా ఉందా…’

‘అదేంటిరా… ఏం మాట్లాడ్డం లేదు… మన గ్రూప్ లో వాడొక్కడే రాలేదేంటి రా.. ఊర్లో లేడా…’

‘ఈ లోకంలోనే లేడురా… మన నర్సిగాడు ‘బతుకుదెరువుకు మస్కట్ పోయి, అక్కడి పరిస్థితులు అద్వాన్నంగా ఉండి, దళారుల మోసానికి బలై, ఇక్కడ చేసిన అప్పులు తీర్చలేక, రావడానికి వీసా లేక, ఒకవేళ వచ్చినా మొహం చూపించలేక ఆడనే ఉరేసుకున్నాడు…’

షాక్ కొట్టింది నాకు. నా కళ్ళ ముందు కళ్ళద్దాలు పెట్టుకుని, ‘ఎప్పుడో ఒకప్పుడు ఇలా గాగుల్స్‌తో విమానం నుండి దిగుతా…’ అని ఫోజిస్తూ చెప్పే వాడి అమాయకపు మొహం కళ్ళ ముందు కదలాడింది.

‘అరె… ఇలా మన ఫ్రెండ్ పోతే … ఊరంతా వల్లకాడైతే మీరంతా ఏం చేస్తున్నార్రా…’

‘అరె… నీకేందిరా… అమెరికాల సుఖంగున్నావ్… ఇక్కడ కడుపుకు బుక్కెడంత బువ్వలేక కడుపులు చేత బట్టుకుని బతుకుంటే బలుసాకు తినోచ్చని పారిపోయినం. కడుపు నిండినోల్లు కమ్మటి కతలు ఎన్నైనా జెప్తరు… కాని ఇక్కడ కరువుదీర్చేటోల్లు కావాలె…..’ కొంచెం నిష్టూరం ధ్వనించింది రవి కంఠంలో. మిగతావాళ్ళు వత్తాసు పలుకుతున్నట్లు మౌనం వహించారు.

చీకటి పడింది. అందరూ బతుకమ్మలు తీసుకొచ్చి అక్కడ పెట్టిన రెండు నీళ్ళ గోలాల్లో వేస్తున్నారు. మిగతా వాళ్ళకి, గోళం నిండే సరికి స్థలం లేక ఒకరి బతుకమ్మను తీసి కింద బెట్టి వాళ్ళ బతుకమ్మలు వేస్తున్నారు. క్రింద పెట్టిన బతుకమ్మల్లో ఉన్న వెలుగుతున్న క్రొవ్వోత్తులు ఇదివరకటిలా జీవనజ్యోతుల్లా కనబడటం లేదు. కొడిగట్టి గాలికిఊగుతూ ఆరిపోయే దీపాల్లా ఉన్నాయి. ఆ దృశ్యం హృదయవిదారకంగా కనిపించింది. ఇదివరకులా చెరువులా నిరాటంకంగా తేలుతూ, వెలుగుతూ వీడ్కోలు పలికే ఆడబిడ్డ బతుకమ్మలా లేదు. పుట్టినింట్లో నిట్టనిలువునా దహించేసుకున్న సతీదేవిలా ఉంది. ఇటీవల ‘కళ్యాణ సుందరం’ గారి గురించి చదివిన వార్త కళ్ళల్లో కదలాడింది. లైబ్రేరియన్ అయిన ఆయన తన సంపాదన మొత్తం అనాధలకు, సేవాకార్యాలకే వినియోగించాడట. మనం ఆయనంతగా చేయకపోయినా, ఏదో ఈ దేశంలో పుట్టినందుకు, మన చేతుల గల సహాయం చిన్నదైనా చేయలేమా… ఆ దైవ  కృప వల్ల  ఇప్పుడు నేను అక్కడ నేలకు ఆరంకెల జీతంతో బాగానే సంపాదిస్తున్నాను. చాలా వెనకేసాను. అందులో కొంత ఇక్కడ ఖర్చుపెట్టినా, నా ఊరును బాగు చేసిన వాడినవుతాను. ఒక ఊరు నిలబెట్టి ఎందరి జీవితాలనో వెలిగించిన వాడినవుతాను. మా ఊరి చెరువును దత్తత తీసుకుని, ఇంటింటికీ ఇంకుడుగుంతలు ఏర్పాటు చేసి భూగర్భజలం పెంపొందేలా చేయాలి. పిచ్చి చెట్లు తీసేసి, చెరువు పూడిక తీయించాలి. ప్లాస్టిక్ బారిన పడి చనిపోతున్న పశువుల ఉసురు పోసుకోకుండా, భూగర్భ జలాలు పెంపొందడానికి, వాన నీటిని ఇంకకుండా చేస్తున్న ప్లాస్టిక్‌ను నిరోధించాలి. ప్లాస్టిక్,  భూమిలో కలవడానికి కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది. దాన్ని పూర్తిగా నిరోధించాలంటే అందరికీ ఈ విషయం తెలిపి చైతన్యం తీసుకు రావాలి. తనతో పాటు అమెరికాలో పని చేసే ఫ్రెండ్స్ అంతా  ‘చారిటీ ట్రస్ట్’ పెడదామని ఇటీవల అనుకున్న వాళ్ళే. హోటల్‌కి వెళితే కనీసం టిప్ పది డాలర్లు వేస్తాం అక్కడ. అక్కడితో పోలిస్తే వారు ఇక్కడికి పంపే డబ్బు ఒక నెల జీతం కాదు. కాని వారి పేరు కలకాలం నిల్చిపోతుంది. శిలాఫలకాల మీద కాకపోయినా జనం గుండెల మీద. తను ఇక్కడి పరిస్థితి చెప్పి సహాయం కావాలంటే ఎవరూ కాదనరు.. ఇలా పర్యావరణ పరిరక్షణ లేక కూడా ఇలాంటి కరువు కాటకాలు వస్తున్న సంగతి అందరికీ విశదపరచాలి. ఇది ఒక యజ్ఞంలా కొనసాగించడానికి , చర్యలు తీసుకోవడానికి, తాము పంపే డబ్బులు సద్వినియోగాపరచడానికి నిజాయితీగా, దృఢసంకల్పంతో ఊరికోసమే పని చేసే ఒక గ్రూప్ కావాలి. అది తను, తన ఫ్రెండ్స్ ఎందుక్కాకూడదూ… ప్రతి ప్రవాస భారతీయుడు ఒక్కొక్కరు ఒక నలుగురు రైతులను దత్తత తీసుకుంటే, ఊరు ఊరంతా బాగుపడదూ… రేపు తన పిల్లలకు భావితరాలకు బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి, కనీసం వారికి నివాసయోగ్యంగా నైనా పర్యావరణం ఉండాలంటే ఇప్పుడైనా మేల్కొనక తప్పదు. భావితరం జీవించే హక్కుని హరించే అధికారం మనకేవరిచ్చారు… ఇప్పుడున్న పరిస్థితులు ఇప్పటి  తరం మనుగడకే ప్రశ్నార్ధక మౌతున్నాయి.

తానూ అప్పటి చిన్నన్నాటి మధురానుభూతుల్ని ఎలా నేమరేసుకున్తున్నాడో, రేపు తన సంతానం కూడా అలాంటి అనుభూతుల్ని పొందాలంటే పల్లె చచ్చిపోకూడదు… పల్లె బ్రతికి బయటపడి ఆనాటి జనజీవాల్ని సంతరించుకుని, ఊరు ఊపిరి పొసుకోవాలంటే ఈ చెరువును, ఈ రైతులను, ఈ ఊరినే దత్తత తీసుకోవాలి. రామదండులా ఊరికి ఒక ‘దండు’ అయినా ఏర్పడాలి. నా మస్తిష్కంలో ఆలోచన కార్య రూపం దాల్చింది. సోపతిగాల్లందరినీ రెండు చేతులు బార్లా చాచి దగ్గర కనుకుంటూ, ‘ఇక ముందు మన పల్లెలో ఒక్క ఆకలి చావు ఉండవద్దనుకుంటే….’ అంటూ నా ప్రణాళిక చెప్పడం మొదలు పెట్టాను.

ఇంతకాలం నా ఊరికి దూరంగా ఉండి  పట్టించుకోలేదేమోనని, నా మనస్సులో అంకురంలా మొదలై వటవృక్షమైన అపరాధ బావన క్రమక్రమంగా దూరమైంది. ఇప్పుడు అస్తమించిన సూర్యుడైనా రేపు తప్పక ఉదయిస్తాడు. అలాంటి ఉదయించే సూర్యుడి కోసం ఆహ్వానం పలుకుతున్నట్లు తొట్టెలోని బతుకమ్మ పైని దీపం ఆ చిమ్మని చీకట్లను చీలుస్తూ దారి చూపుతూ దేదీప్యమానంగా వెలుగుతూ కనబడింది. మా వూరి లోని గుడి లోని జేగంటలు మంగళకరంగా ‘తథాస్తు’ అన్నట్లు మ్రోగాయి.