28. నడక

0
6

[box type=’note’ fontsize=’16’] 2018 దీపావళి కథల పోటీకి వచ్చిన కథ. [/box]

[dropcap]ఇం[/dropcap]టి ముందు మెట్లపై తాగుబోతు. ఎలా లేపాలి? పిలిస్తే పలకటం లేదు. ఉన్నాడా? అప్పటికే మెట్లపై పోసాడేమో.. ఎండిన మరకలు కనిపిస్తున్నాయి. ఊపిరి తీసుకుంటున్న కదలికలకోసం జాగ్రత్తగా చూసా… హమ్మయ్య… ఉన్నాడు. పక్కన ఉన్న కొబ్బరిబోండాల బండివాడు నా అవస్థ చూసాడు. వచ్చి లేపే ప్రయత్నం చేసాడు. లేవలేదు. పట్టుకుని ఈడ్చి మెట్లకు పక్కగా గోడకి చేరబెట్టివెళ్ళిపోయాడు. ఒక పని అయ్యిందని కటకటాల తలుపు తాళం తీసుకు లోనికి వెళ్ళా. ఏం తాగుడో ఏంటో.. ప్రయాణం చేసి అలిసి ఇంటికి వస్తే ఇదో బేరం గుమ్మం ముందు. బట్టలు మార్చుకుని టి.వి పెట్టుకున్నా. అమ్మ నాన్నా ఏవో మాట్లాడుకుంటున్నారు. మెల్లగాకాలం సాగిపోతోంది. చూస్తుండగా రెండుగంటలు గడిచాయి. రాత్రి ఏడున్నర. టి.వి. ఆపి బాత్రూంకి వెళ్తూ చూసా. తాగుబోతు మళ్ళా ఇంటి మెట్లపైకి వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు మత్తులోనే. వెళ్ళి కొంచం గట్టిగా పొమ్మని చెప్పా. వాడికి వినిపించినా అర్థమయ్యే స్పృహ ఉన్నట్లు లేదు. క్రింద మెట్టుమీద కూలబడి మీదకి పాకే ప్రయత్నం చేస్తున్నాడు. అంతలో పక్కన ఉన్న కొబ్బరిబోండాల బండివాడువాడి దగ్గరకు వచ్చి ఆ పక్కగా మూసేసి ఉన్న షాప్ మేట్లపైకి పొమ్మని రెండు మూడుసార్లు గట్టిగా తట్టి చెప్పాడు. బహుశా కొంత అర్థమయ్యి ఉంటుంది. పై మెట్లమీదకు ఎక్కే ప్రయత్నం మానుకున్నాడు.

క్రింద మెట్టుమీద కూర్చొని జోగుతున్నాడు. మధ్యలో తల విసురుతున్నాడు. చేతులతో తల కొట్టుకుంటున్నాడు. జేబులు తడుముకుంటున్నాడు. ఏవో తీస్తున్నాడు, పెడుతున్నాడు. ఒక పావుగంట ఇలా గడిచినతరువాత మెల్లగా పక్కన పడి ఉన్న చెప్పులు తీసుకుని వేసుకున్నాడు. ఒక చిన్నపిల్లవాడు కొత్తగా వేసుకున్నట్లు ఏ కాలెటో, ఎలా దూర్చాలో తెలిసీ తెలియని విధంగా. మెల్లగా లేచాడు. అడుగు తడబడుతోంది. ఎటు వెళ్ళాలి అన్నది బహుశా ఏ కాలికీ సరియైన సమాచారం మెదడు ఇవ్వటం లేదేమో. ఎంఎస్‌సి.లో స్టాటిస్టికల్ ఫిజిక్స్‌లో ర్యాండం వాక్ ప్రాబ్లం గుర్తొచ్చింది. ఏడాది మొత్తం మా సారు అదే చెప్తూ కూర్చున్నారు. అయినా ఆయన బాధేంటో ఆ గోలేంటో మాకు అర్థంకాలేదు. ఓ తాగుబోతు నడకను అంచనావేసే పనికిమాలిన సమస్య అని మాత్రం గుర్తు. మాకు అలానే గుర్తుండిపోయింది మరి.

ఇప్పుడు ఈ తాగుబోతు ఎటు వెళ్తాడు? ఎలా వెళ్తాడు? ఏం చేస్తాడు? ఒక్కసారిగా టీవీని వదిలి అసలు ప్రపంచాన్ని చూడాలనే ఆలోచన కలిగింది. గదిలోకి వచ్చి బట్టలు మార్చుకుని వచ్చాను. ఆ తాగుబోతు ఇంటి ముందునే చేతులు కట్టుకుని నిలబడి తూలుతూ మధ్యలో తల విదిలించుకుని అటూ ఇటూ చూస్తున్నాడు. చలిగా ఉంది. స్వెట్టరు వేసుకుని, చెగువేరా బొమ్మ ఉన్న వులెన్ టోపీ పెట్టుకుని తాళం తీసుకుని బయటకువచ్చా. తాళం వేసి అక్కడే నిల్చొని గమనిస్తున్నా. వీడు ఎటు వెళ్తాడు? వాడు కదులుతున్నాడు. ఎడమవైపుకు కొబ్బరి బోండాల బండికి కొంచం ముందు నిల్చున్నాడు. అక్కడనుండి కుడి వైపుకు వెళ్తున్నాడు. మా గుమ్మం దాటి కిటికీకి ఎదురుగా రోడ్డుపై కూరగాయలు అమ్ముతున్న చోట ఆగాడు. అక్కడ ఎవరో కూరలు బేరం ఆడుతుంటే ఏదో మాట్లాడే ప్రయత్నం చేసాడు. ఆయన వీడివంక చిరాగ్గా చూసి తన సైకిలు తీసుకు వెళ్ళిపోయాడు. కూరగాయల వాడితోనూ మాట్లాడే ప్రయత్నం చేసాడు. వాడి వీడిని కసిరి పక్కకు పొమ్మన్నాడు. ఇంకా ముందుకు సాగాడు. నేను ఇంటి మెట్లు దిగి చూస్తున్నాను. అక్కడ ఉన్న పళ్ళబండివాడి దగ్గరకు వెళ్ళి ఏదో అడిగాడు. వాడు తల అడ్డంగా ఊపాడు. తూలడం కొంత తగ్గింది. తల పట్టుకోవడం. ముఖాన్ని తడుముకోవడం కొనసాగుతున్నాయ్. చుట్టూ ఎవరున్నారు ఏం చేస్తున్నారు అన్న స్పృహ లేదు. నేను కదిలాను. అందరినీ గమనిస్తూ. కొంచం ముందు ఉన్న ఐస్‌క్రీం బండి వాడిని ఏదో అడిగాడు. సైగలు కనిపించినా నాకు ఏమన్నాడో అర్థం కాలేదు.

బండి వాడు పట్టించుకోలేదు. తాగుబోతు ముందుకు రెండడుగులు వేసాడు. ఆగి వెనక్కి తిరిగాడు. ఇంచుమించు మళ్ళీ మా ఇంటి గుమ్మం దాకా వచ్చాడు. జేబులు సవరించుకుంటున్నాడు. ఏవో కాగితాలు తీసాడు. ఒక జేబులోంచి ఇంకోదాంట్లో కి మారుస్తున్నాడు. మళ్ళీ కదిలి ఎడమవైపుకి వెళ్ళాడు. కోట జంక్షన్ దాకా ఆగకుండా తూలుతూనే వెళ్ళాడు. అక్కడ రోడ్డు దాటుతున్నాడు. అది మంచి ట్రాఫిక్ ఉన్న సమయం. అయినా అతను పట్టించుకునే స్థితిలో లేడు. తనకు ఇష్టం వచ్చినట్లు రోడ్డుకు అడ్డంగా వెళ్తున్నాడు. ఏమైపోతుందో అని నేను కాస్త టెన్షన్ పడ్డాను. ఏం కాలేదు. అటువైపు ఉన్న కిళ్ళీ కొట్టులో ఏదో అడిగాడు. వాడు పొమ్మన్నాడు. అలా రోడ్డుకు ఆ వైపు  నుండే మళ్ళి మా యింటి  వైపు నడుస్తున్నాడు. నేను ఈ వైపు ఉండి అనుసరించాను. నన్ను ఎవరైనా చూసినా ఏ ఆటో కోసమో ఎదురుచూస్తున్నట్టు అనిపించేలా మెల్లగా అటూ ఇటూ చూస్తూ వెళ్తున్నాను. ఎవరో సంచీలనిండా సామాన్లు పెట్టుకుని రోడ్డుకు అటునుంచి ఇటువైపు వస్తున్నారు. అంతలో ఒక సంచీ తెగి అందులో ఉన్నవి క్రిందపడిపోయాయి. సంచీలో పెడుతున్నప్పుడే అది బరువు కాయదు అన్న స్ఫురణ వస్తుంది. కానీ ఏదో మొండి ధైర్యం. ఏదోలా కాసేస్తుంది. ఈసారికి గట్టెక్కేస్తాం అని. ఒక్కోకప్పుడు అలానే కాసేస్తుంది. ఒక్కోకప్పుడు ఇలా..  తాగుబోతు ఎదురుగా వస్తున్న ముసలతనిని ఏదో అడిగాడు. ఆయన నేరుగా ముందుకే వెళ్ళమని చెప్పాడు. ఓహో ఏదో దారి అడిగినట్లున్నాడు. వీడు ఆ వైపుకు వేగంగా నడక మొదలుపెట్టాడు. నేనూ అడుగులు తొందరగా వేస్తున్నాను. మా ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చాను. రోడ్డుకు అటువైపు చర్మవ్యాధుల క్లినిక్ ఆ పక్కన గోడ. దాని ముందు చాలా బళ్ళు పార్క్ చేసి ఉన్నాయి. వీడు ఆ బళ్ళ మధ్యకు వెళ్ళాడు. వాడు ఏం చెయ్యడానికి వెళ్ళాడో అర్థమయ్యింది. నేను వెనక్కి తిరిగి మా ఇంటి మెట్ల మీదకు వచ్చి నిలబడ్డా. కొబ్బరిబోండాలవాడు నావైపు కాస్త విచిత్రంగా చూసాడు. నేనేం మాట్లాడలేదు. అసలు ఎప్పుడూ మాటలు లేవు. తాగుబోతు ప్యాంటు సర్దుకుని మళ్ళా నడక మొదలుపెట్టాడు. ముందు అటు తరువాత ఇటు. నేనూ అలాగే తిరుగుతున్నా. ఇంకో కిళ్ళీ కొట్టు దగ్గర ఆగాడు. ఈ సారి వీడు అడిగింది అర్థమయ్యిందో లేక ఆ కిళ్ళీ కొట్టువాడిది దయార్ధ్ర హృదయమో తెలియదు. అగ్గిపెట్టె ఇచ్చాడు. ఇందాకటి నుండీ ప్రతివాడినీ అడుగుతున్నది అది! ఈ సారి వాడి కృషి ఫలించింది. నాలుగు రాళ్ళు వేస్తే ఎదో ఒకటి తగలకపోతుందా. ఎంట్రెన్స్ ఎగ్జాంలు ఎన్ని రాయలేదు. వీడు బీడీ వెలిగించుకుని అగ్గిపెట్టె తిరిగి ఇచ్చేసాడు. దమ్ము లాగినతరువాత వాడిలో కొంత ఉత్సాహం వచ్చిందని స్పష్టంగా తెలుస్తోంది. నడవడం మొదలుపెట్టాడు కోటవైపుకి. నేను రోడ్డు దాటి అటువైపుకు వెళ్ళా. రెండడుగులు వేసి వాడు మళ్ళీ రోడ్డుకు ఇటువైపుకు వచ్చాడు. జాగ్రత్తగా నేనూ వాడి వెనుక రోడ్డు దాటా. ఆ కూడలి దగ్గర ఉన్న దర్గా దాటి ఆ పక్కన రోడ్డు మధ్యలో ఆపి ఉన్న బళ్ళ దగ్గరకు వెళ్ళాడు. అప్పటికే కాలుస్తున్న బీడీ అయిపోవచ్చింది. ఇంకో బీడీ తీసాడు.

అప్పుడు మొదలయ్యింది విశ్వప్రయత్నం. కాలుతున్న బీడీకి కొత్తబీడీ అంటించి వెలిగించాలి. నోట్లో కాలుతున్న బీడీ. చేతిలో కొత్తది. ఏం చెయ్యాలో తెలుసు. ఎలా చెయ్యాలో తెలుసు. కాని ఎంత ప్రయత్నించినా అది జరగటం లేదు. భరతనాట్యం క్లాసులో శుకతుండ హస్తాన్ని పెట్టడానికి పడిన అవస్థలా ఉంది. అన్ని వేళ్ళూ చాచిపెట్టి ఉంగరం వేలు చూపుడు వేళు 90 డిగ్రీలకు వంచి పెట్టాలి. వచ్చినట్టే అనిపిస్తూ చెయ్యి వంకపోతుంది.

వాడి వల్ల కాలేదు. నోట్లో బీడీ నోట్లోనే చివరంటా కాలిపోయింది. మరి పెదాలు కాలాయో లేదో. నోట్లో బీడీ క్రిందకు ఉమ్మినట్టు కనిపించలేదు. మళ్ళీ నడక మొదలు పెట్టాడు. అలా గురజాడ వారి ఇల్లు దాటుకుంటూ వెళ్తున్నాడు.  ఆ ప్రక్కన ఒక బండి దానిపై ఒక ఆడమగ మధ్యలో పిల్లాడు. “వెళ్ళాలంటావా”, “పిన్ని పిలిచింది..”, ” చలి ఎక్కువగా ఉంది..”. నాకు చలి పెద్దగా తెలియటంలేదు. స్వెట్టరు పైన చెగువేరా టోపీ. తాగుబోతుకీ చలి తెలుస్తున్నట్లు లేదు. వాడిది బొత్తాలు సగం ఊడిపోయిన చొక్కా అయినా!! నేను హిమాలయాలలో కట్ బనీన్‌తో తిరిగిన విషయం గుర్తుకువచ్చింది. అది తలుచుకున్నప్పుడు చాలా గొప్పగా అనిపించేది.

తాగుబోతు వెళ్ళి వెళ్ళి ఎం.ఆర్. కాలేజీ దగ్గర ఆగాడు. అంతా చీకటి. రోడ్డుమీద వెళ్తున్న వాహనాల వెలుగు మాత్రం అప్పుడప్పుడు పడుతున్నాది. అక్కడ ఆటోలను ఆపే ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరూ ఆగటం లేదు. ఇక్కడకి ఇక్కడకి వచ్చే ఆటోలన్నీ కోట దగ్గరికి వెళ్ళేవే అవుతాయి. మరి వీడు అక్కడ ఎందుకు ఎక్కలేదు? ఓహో.. ఆటో ఎక్కాలన్న స్పృహ ఇప్పుడు వచ్చినట్లుంది. అదేదో సినిమాలో హీరో కాలుమీద కాలేసుకుని కూర్చుంటే తండ్రి తిడతాడు. చదవటం లేదని. చదివేం చెయ్యాలని అడిగితే మంచి ఉద్యోగం తెచ్చికుని బాగా సంపాదించి హాయిగా కాలుమీద కాలేసుకుని కూర్చోవచ్చు అంటాడా పిచ్చితండ్రి. అదేదో ఇప్పుడే చేస్తున్నాగా అంటాడు పుత్రరత్నం. అది సినిమా.. ఇది జీవితం. ఎక్కడికి వెళ్ళాలో?

ఈలోగా ఇంకో తాగుబోతు కనిపించాడు. ఇతను కాస్త వయసు పైబడిన వాడు. ఇద్దరూ దగ్గర దగ్గరగా తూలుతూ ఉండడం చూస్తుంటే నాకూ చిన్నతడబాటు కలిగింది. ఇంకో నలుగురు తాగుబోతులు అక్కడ ఉండి ఉంటే ఆ నడకే సరైన నడకనై ఫిక్స్ అయిపోతానేమో. ఈ ర్యాండం వాక్ నిజంగానే ప్రాబ్లం అయ్యి కూర్చునేది.  అదృష్టవశాత్తూ ఈ ముసలి తాగుబోతు అక్కడ నుండి తిన్నగా నావైపు వచ్చాడు. ” బాబూ మూళ్ళాంతర్ల దగ్గరకి ఎలా వెళ్ళాలి” వీడికి ఎలా చెప్తే అర్థమౌతుంది. ఒక క్షణం ఆలోచించి చూపించా. నిజానికి గురజాడ వారి ఇల్లు దాటాక కుడివైపుకు వెళ్తే కోట ఎడమవైపుకు వెళ్తే మూడు లాంతర్ల జంక్షన్ వస్తాయి. అటు వైపు చూపించా. వాడు అటు వెళ్తున్నాడు. ముందు తాగుబోతు ఇంకా కాలేజ్ దగ్గరే తచ్చాడుతున్నాడు. ముందు తాగుబోతు దగ్గర ఆగాలా? పెద్ద తాగుబోతు వెనుక వెళ్ళాలా? ఎటూ తెలియటంలేదు. ఇంటర్లో బైపిసి నా ఎంపిసినా? నా తలకాయ్ ఏ రాయైతేనేంటి పళ్ళూడగొట్టుకోడానికి. ముందువాడు అక్కడ కిళ్ళీకోట్టులో మళ్ళీ నిప్పు సంపాదించాడు. బీడీ పొగ ఒదుల్తూ వెనక్కి కోటవైపుకే నడక మొదలుపెట్టాడు. బాగుంది. పెద్దతాగుబోతు, ముందు తాగుబోతూ ఇద్దరూ ఒకే వైపు వెళ్తున్నారు. ఒకేసారి ఇద్దరినీ ఫాలో అవ్వొచ్చు. ఈ వాక్యం అమ్మాయిల గురించి కాకుండా తాగుబోతుల గురించి అనుకున్నా కాబట్టి సరిపోయింది. లేకపోతే చిన్నప్పటి నుండి తలకెక్కించుకున్న మోరల్స్‌కీ మనసుకీ భయంకరమైన రామరావణ యుద్ధం జరిగేది.

అంతలో ఓ కూడలి వచ్చింది. పెద్ద తాగుబోతు మూడు లాంతర్లకు ఎటు వెళ్ళాలో తెలియక ఆగిపోయాడు. తెలుగు నెట్ పరీక్షలో రాయవాచకం ఎవరు వ్రాసారన్నదానికి నాలుగు ఛాయిస్‌లనూ మార్చి మార్చి చూస్తూ గుర్తుచేసుకున్నట్లు చూస్తున్నాడు నాలుగు దిక్కులూ. నేను చేరే లోపే మళ్ళీ ఎం.ఆర్. కాలేజీ వైపు వెనక్కు తిరిగి వచ్చేస్తున్నాడు. ఆగకుండా నన్ను దాటుకు వెళ్ళిపోయాడు. రాయవాచకం ఎవరు వ్రాసారో ఇప్పటికీ నాకు గుర్తులేదు. నేను పెట్టింది మాత్రం తప్పు.

నేను ముందుతాగుబోతు వెనుకే వెళ్తున్నాను. మళ్ళీ గురజాడవారి ఇల్లు మళ్ళీ దర్గా మళ్ళీ మా వీధి. ఇప్పటికి గంటన్నర అయ్యింది. ఇంట్లో ఎక్కడికి వెళ్తున్నానో చెప్పలేదు. భోజనం టైం  అయ్యింది. సెల్ ఫోన్ కూడా వదిలేసి వచ్చా. అమ్మా నాన్నా కంగారు పడతారో ఏంటో? వీడి ఇంట్లో ఎవరున్నారో? వాళ్ళేం చేస్తుంటారో? వీడిలా యాదృచ్చిక యానం చేస్తున్నాడు. ర్యాండం వాక్‌కి అద్భుతమైన తెలుగు అనువాదమని నేనే నాకో వీరతాడు వేసుకున్నాను. ఆగుతూ నడుస్తూ మొత్తానికి వీధిలో ఉన్న సాయిబాబా గుడి మెట్ల మీద కూలబడ్డాడు. నేను ఆ ప్రక్కనే కొంచం ముందుకి నిలుచున్నాను. అంతలో పిలుపు. వాడు నన్నూ పిలుస్తున్నాడు ‘ఏండీ’ తిరగాలా వద్దా అన్న సంశయం. ఇప్పటిదాకా వీడి విషయంలో నేను సాక్షిగా ఉన్నానే తప్ప ప్రత్యక్షంగా వేలు పెట్టలేదు. ఏం చేద్దాం. ఆలోచనలు కొలిక్కి వచ్చేలోపే వాడు లేచి వచ్చాడు. ‘నాతవలసకి ఆటోకి ఎంతవుతుంది’ అదీ నన్నడిగినది. ‘నాకు తెలియదు’. ‘బాబూ నేను డబ్బులు వేరే చోట అడుక్కు తెచ్చుకుంటా.. ఎంతవుతుందో చెప్పండి చాలు’ చేతిలో ఉన్న ఆరు రూపాయల చిల్లర చూపిస్తూ అన్నాడు. నాకు నిజంగానే తెలియదు. అదే చెప్పి ఆటో వాణ్ణి కనుక్కో మన్నా. నేనైతా తాగున్నా నీకేమయ్యింది ఈ మాత్రం కూడా తెలీదా అన్నట్లు చూసాడేమో అని నా అనుమానం. మా యింటి వైపుకు నడుస్తున్నాడు. నేను కూడా ఇంటికి వెళ్ళిపోదామని బయలుదేరాను. వాడూ ఓ ఆటోని ఆపాడు. ఆటోవాడు వీడి వాలకం చూసి ఎక్కించలేదు. ఇంకోడు పాపం తెలియక అన్నాడో, బాగా తెలిసి అన్నాడో వెనకన ఎక్కి కూర్చోమన్నాడు. ఆటో కదిలింది. నేను ఇల్లు చేరాను. ఏళ్ళు కాదు జీవితాలు జీవితాలు గడిచిపోయినా ఈ ర్యాండం వాక్ ప్రాబ్లం నాకు అర్థం అయ్యేట్టు లేదు. గంటన్నర నుండీ తాగుబోతును చూసానేమో ప్రతివాడూ తాగుబోతులాగే కనిపిస్తున్నాడు.