[box type=’note’ fontsize=’16’] 2018 దీపావళి కథల పోటీకి వచ్చిన కథ. [/box]
[dropcap]స్మా[/dropcap]ర్ట్ ఫోన్ లేని చేతిని చూడటం కష్టమే. వంటి మీద దుస్తులు ఉన్నాయో లేదో అనవసరం. స్మార్ట్ ఫోన్ మాత్రం హస్త భూషణంగా ఉండితీరాలి.
నా ఫీచర్ సెల్ పూర్తిగా పాడై పోవడంతో అలాంటి ఫీచర్ సెల్ కొనాలనుకుంటే ఆఫీస్ స్టాఫ్ అన్నారు కదా!
“గురుమూర్తి గారూ! ఆఫీస్ ఇన్‌చార్జ్ మీరు. పూర్తిగా అప్‌డేట్ అవ్వండి సార్. స్మార్ట్ ఫోన్ మీ చేతిలో వుంటే వరల్డ్ మీ గుప్పెట్లో వున్నట్టే! అలా కాకుండా మళ్ళీ మీరు ఫీచర్ ఫోన్ కొంటే ఫ్యూచర్ నెగ్గుకు రాలేరు.”
వాళ్ళ మాటలు తీసేయలేక, మొన్న నెల వచ్చిన ఫెస్టివల్ అడ్వాన్స్+ఇంక్రిమెంట్ కలసి రావడంతో నా జేబు నిండడం చేత స్మార్ట్ ఫోన్ ఎలాగైనా కొని తీరాలనుకున్నాను.
‘గురుమూర్తి గారూ! ఇంటర్ నెట్‌లో స్మార్ట్ ఫోన్ బుక్ చేస్తే వన్ వీక్‌లో వస్తుంద’న్నారు స్టాఫ్. వీక్ వరకూ వెయిట్ చేస్తే నా డెసిషన్ వీకైపోతుంది.
‘ఆలస్యం అమృతం విషం’ అన్న ఆర్యోక్తి నా పట్ల నిజం. అందుకే నెట్‌లో వద్దని సెల్ పాయింట్ షాపులోనికి నేరుగా అడుగు పెట్టాను.
ఫస్ట్ కస్టమర్‌ని నేనే అనుకుంటా! షాపులో వాళ్ళంతా వి.ఐ.పి ట్రీట్‌మెంట్‌లో సాదరంగా ఆహ్వానించసాగారు.
ఆ షాపులోని వాళ్ళలో ఎవరి వద్దకెడితే వారికి అదనంగా బెనిఫిట్స్ వస్తాయట.
టక్ చేసి, టై పెట్టుకుని సూటు బూటులో దర్జాగా వున్న వ్యక్తి నాకు షేక్ హ్యాండిస్తూ “వెల్‌కమ్ సార్! వాట్ కెన్ ఐడు ఫర్ యూ సార్? ” అన్నాడు.
అతని ఆతిథ్యానికి పొంగిపోతూ నా చేతిని చాపి పక్కకు చూశాను. అతని పక్కనే అందాల అతివ ఉంది.
ఆమెను చూడటానికి రెండు కళ్ళూ సరిపోవనుకుంటూ… ఆమెను చూడటానికి అనడం కంటే ఆమె అందాలను చూడటానికి రెండు కళ్ళూ సరిపోవనడం సబబేమో? రోజ్ కలర్ శారీలో బ్లాక్ కలర్ డిజైనింగ్ బ్లౌజ్‌లో పోని టైల్ పెట్టుకుని, కనిపించీ కనిపించని ఎద సంపదతో, నిండైన యవ్వనంలో తొణికిసలాడుతున్న ఆమెను చూసి చూపు పక్కకు తిప్పుకోలేకపోయాను.
నాలో నిద్రాణమై వున్న కాముకుడు పైకిలేచాడు. అది షాపని, నలుగురూ వచ్చి వెడుతుంటారనీ అసభ్యతకు తావివ్వకూడదనీ నా సూపర్ ఇగో హెచ్చరిస్తున్నా ఇగో డామినేట్ చేస్తూ అందం ఆస్వాదిస్తేనే ఆనందం అంది.
సూటులో వున్న వాడికి హ్యండివ్వకుండనే అతిలోకసుందరి వైపు వెళ్ళాను.
“జెంటిల్మెన్” ఊరించి ఊస్సురు మనిపించారన్నట్లుగా చూశాడు.
మిగతా వాళ్ళు షాపు ముఖద్వారం కేసి చూడసాగారు. కొత్తగా వచ్చే కస్టమర్స్ కోసం.
“ఏ టైపు సెల్ కావాలి సార్?”
ఆమె మాట అంత మధురంగా లేకపోయినా సూపర్ హిట్ సినిమాలో చిన్న చిన్న తప్పులున్నానూ పైకి కనబడవన్నట్లుగానే ఎడ్డెస్ట్ అయిపోయాను. మూడు పదుల వయసుకే నాకు బట్టతల వచ్చేయడంతో కవర చేసేందుకు టోపీ పెట్టుకుంటాన్నేను.
ఎసి రూమ్ కావడంతో చల్లదనం కోసం టోపీ తీయాలనిపించినా అందం తగ్గిపోతూందన్న భావన చేత తల పై టోపీ సవరించుకున్నాను.
ఆ అందాల అతివ టేబుల్ అద్దంపై తన మృదువైన చేతులను ఆన్చుతూ ముందుకు వంగింది. “సార్.. ఇది 4జి సెల్ ఫ్రెంట్ కెమేరా బ్యాక్ కెమేరా… చక్కగా ఉంటాయ్. 64 జిబి ఫోన్ మెమొరీ.”
ఫోన్ క్వాలిటీస్ చెబుతూంటే చెవులిక్కరిస్తూ వింటున్నాన్ గాని నా సునిశిత దృష్టి మాత్రం ఆమె రవిక బిగువుల్లోంచి ఎగిసి పడుతూన్న బరువులు తూగుడు బల్లలా పైకి కిందికీ ఊగుతూ అరకొరగా కనిపిస్తూన్నా వాటి పైనే నిలిచింది.
చూసే కళ్లు వినే చెవులూ ఒక్కటైతేనే విషయం బోధపడుతుంది. కాని నేను చూసేదొకటి వినేదొకటి!!
ఆమె అంటోంది ‘సెల్ బావుందా సార్?’ అని అడిగితే ‘నేను నచ్చానా సార్’ అని అడిగినట్లనిపించింది. చుట్టూ నలుగురున్నారనీ సభ్యత కాదనీ బుద్ది వారిస్తున్నా నీతి బోధ నాకొద్దంటూ వయసుతో ముడుపడిన మనసు వలపు బాట పట్టింది.
ఆమె మళ్ళీ అడుగుతోంది.
“సార్ మరో సెల్ చూపించమంటారా?” అని! నా దృష్టి మాత్రం ఆమె రవిక మీదే వుంది. “అడుగుతోంది మిమ్మల్నే సార్?” అంటూ అకలిగొన్న పులిలా కొరకొరమంటూ చూస్తూన్ననా వాడి, వేడి చూపులను గమనించినామే చురకత్తిలా నా వైపు చుర్రుమని చూస్తూ పైట బాగా పైకి లాక్కంది.
“సార్… మీరు సెల్ కొనడానికి మాత్రమే వచ్చారు. కాని మీ చూపు మరోలా వుంది” అంది “మంచిది కాదు సుమా” నాకు మాత్రమే వినబడేట్టు అంది.
నా ఇగో హర్ట్ అయింది. “మా కస్టమర్స్ వస్తేనే మీ షాపు నడిచేది! మీకు జీతం వచ్చేది! మైండ్ ఇట్ కస్టమర్స్‌తో సభ్యతగా మాట్లాడు. నేను కూడా నీ చేతిలో వున్న సెల్‌నే గమనిస్తున్నాను, నిన్ను కాదు” అంటూ ఆమెకు మాత్రమే వినబడేట్టు అన్నాను. బాధగా చూసింది. బ్రతుకు దెరువు కోసం ఉద్యోగం చేస్తోందేమో? నోరు పెంచితే నోటి కూడుకు లోటని గుర్తించి తగ్గింది. తగ్గి మళ్ళీ సెల్ చూపించే పనిలో పడింది.
అప్పుడే… ఆ క్షణంలోనే “మీరు గురుమూర్తి గారేనా?” ప్రశ్నర్థకంగా మొహం పెడుతూ అన్నాడొక వ్యక్తి.
నాక్కూడా అతన్నెక్కడో చూసినట్లనిపిచింది. ఐ మీన్ ఎప్పుడో నా చిన్నతనంలో కలిసి చదివినట్లనిపించింది.
అతను మీరు అని నన్ను సంబోధించినా నాకు మాత్రం వాడెవ్వడో గుర్తుకు వచ్చేసింది.
“నువ్వు శ్రీధర్‌వి కదూ!” అన్నాను నవ్వుతూ.
అతను కూడా అవునన్నట్లుగా తలూపుతూ “బాగానే గుర్తుపట్టావ్ మూర్తి! ఎన్నాళ్ళైందిరా చూసి… ఎన్నేళ్ళైందిరా కలిసి..” అన్నాడు ఆనందాన్ని వ్యక్త పరుస్తూ..
పదో తరగతి పూర్తయ్యాక.. పై చదువుల నిమిత్తం పట్నం వచ్చేశాను. మళ్ళీ ఇదే కలవడం.
“మూర్తీ బాల్యం అమూల్యం, మళ్ళీ ఆ రోజులు తిరిగి రా(లే)వు రా” అన్నాడు శ్రీధర్.
“అది సరే! గడిచిపోయిన గంట కూడా తిరిగి రానప్పుడు ఇక బాల్యం ఎలా వస్తుందిరా? ఎలా వున్నావ్? ఏం చేస్తున్నావ్?” అడిగాను.
షాపులో కస్టమర్స్ ఎక్కువైనట్టున్నారు. మరో కష్టమర్ కోసం ఎదురుచూస్తూ నా బేరం వదిలించుకోవాలని వడివడిగా ఆమె నాతో “సార్… ఈ 4జి సెల్ ఓకే చేసేస్తారా?” అడిగింది ఆత్రంగా!
కంగారు పడితే పనులేలా అవుతాయ్? కొనాలనుకున్నప్పుడు కొంత టైం వచ్చించిక తప్పదు. “వెయిట్ ప్లీజ్! ఫ్యూ మినిట్స్” అన్నాను సీరియస్‌గా…
శ్రీధర్ నాతో “సెల్ కొంటున్నావా?” అడిగాడు. నేను శ్రీధర్ చెవిలో అన్నాను “కన్నె కత్తిలా వుంది కదరా!” వాడు నాకేసి అభావంగా చూశాడు.
“ఏం? కాదా?” కళ్ళతో అడిగాను.
“చిన్ననాటి చురకు ఇంకా పోలేదా?” అడిగాడు.
“పోదు… నేను పోయేవరకూ పోదు” అదనపు డిగ్ర్రీలా ఫోజిస్తూ అన్నాను.
“మూర్తీ ఏం ఉద్యోగం చేస్తున్నావ్?” మాట మార్చుతూ అన్నాడు శ్రీధర్.
“ఆఫీస్ ఇన్‌ఛార్జ్ నోయ్!” ఫోజిస్తూ అన్నాను. ఆమెక్కూడా వినబడాలని, మన పవర్ కనబడాలని.
“బాసు ఆఫీసులో వుంటే అసిస్టెంట్‌వి కదా!” బెలూన్‌లో గాలి తీసేసినట్టు అన్నాడు. తన ముందు వెటకారం ఆడాడని చిరుకోపం వచ్చింది. వయసు మీదపడినా వెటకారం పోలేదే? సీరియస్ అయ్యాను.
“సార్.. ఈ సెల్ ఓ.కె. చేసేయమంటారా?”
“నా ఫ్రెండ్‌ని కూడా అడిగి చెబుతాను. కంగారు పడకు” అని వార్నింగ్ ఇస్తున్నట్లు చెప్పి, “చూడరా శ్రీధర్, కన్నె కత్తిలా వుంది. ఆమె పరువాలను బరువులనూ చూడు. రాఘవేంద్రరావు గారి సినిమాలో హీరోయిన్‌లా లేదూ? ఆయన కళ్ళలో ఈమె పడితే పళ్ళు, పూలు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి కనువిందు చేసేవారు కదూ!” అన్నాను.
“మూర్తీ వర్ణన ఎక్కువైందిరా! కత్తి, గిత్తీ అంటూ ఎగసిపడకు, కోసుకోగలదు. ఇతిహాసాలు మనకేం చెబుతున్నాయ్? శివభక్తుడు అపర జ్యోతిష్కుడు, మేధావి అయిన రావణబ్రహ్మ పరస్త్రీ వ్యామోహం అనే దుర్వ్యసనంతో సర్వనాశనమయ్యాడు.
అసూయతో స్త్రీని అవమానించిన దుర్యోధనుడు కురువంశ నాశనానికి మూల కారకుడయ్యాడు. పరాయి స్త్రీలను వ్యామోహంతో చూడటం తప్పురా!” అంటూ హితబోధ చేశాడు.
“షటప్ రా! బూతులు మాట్లాడుతుంటే నీతులు చెబుతావే?”
“మాట్లాడక ఏం చెయమంటావ్? నీ భార్యనే ఇలా వర్ణిస్తూ.. నీతో చెబితే ఎలా వుంటుంది?” వాడి మాటలు విని అవాక్కయ్యాను.
“ఆమె.. నీ.. భా..ర్యా..?”
“యస్..” బయటకు తీసుకెళ్ళి చెప్పసాగాడు. “షి ఈజ్ మై వైఫ్.. రజని!”
కత్తి వేటుకు నెత్తురు చుక్క లేనట్లుయింది నా పరిస్థితి.
“సారీ శ్రీధర్…” తేరుకుంటూ చెప్పాను.
“మూర్తీ.. నా భార్య కాబట్టి సారీ చెప్పావ్… కాకుంటే కామంతో చూస్తావ్ కదా!” తల వంచాను.
“అర్ధరాత్రి ఆడది ఒంటరిగా వెళ్ళినప్పుడే నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లని గాంధీగారు అప్పుడు చెప్పారు. ఎందుకో తెలుసా.. ఆ రోజుల్లో ఉద్యోగాలు చేసే మహిళల శాతం బాగా తక్కువ కాబట్టి! అదే నేటి రోజుల్లో కుటుంబ పోషణార్థమై ఆఫీసుల్లో ఉద్యోగాలు చేసే మహిళలను మరో భావంతో చూడని పురుషులున్నప్పుడే నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లవుతుందని గాంధీ గారు మార్చి చెప్పేవారు.”
నేను మౌనం వహించాను.
“మూర్తీ.. బతుకు బండి సాగక పట్నం వలస వచ్చాం. నాకింకా ఉద్యోగం దొరకలేదు. కాని నెల తిరిగేసరికి రెంటు, కరెంటు, కిరాణా.. వంటి ఖర్చులు తప్పవు. రజనీ ఉద్యోగం మా కుటుంబానికి బ్రతుకు తెరువు. తనకు క్యారియర్ ఇచ్చేందుకు ఇలా వచ్చాను. నిన్ను చూసి చిన్ననాటి స్నేహితుడవని ఆనదించాను ఇప్పుడు…” మాట్లాడలేక మౌనం వహించాడు.
“ఇప్పుడు అసహ్యించుకుంటునావా?” కొనసాగింపుగా అన్నాను.
“కాదురా.. స్నేహితుడవు కాబట్టి చెప్పాను. కాని ఆడదానిని అంగడి వస్తువుగా చూస్తూ.. అందాలను ఆర బోసే ఆటవస్తువుగా చూసే మగాళ్ళున్నంత కాలమూ పరిస్థితి మారదు. డబ్బుతో కోరకను తీర్చుకోవడం వ్యభిచారం అయితే.. కేవలమూ మానసికంగా.. కళ్ళతో కసిగా కోరికేలా చూస్తూ… పైకి కనిపించని వాటిని కూడా స్కానింగ్ చేస్తూ కళ్ళతో చూడటం ఒక రకంగా మానసిక వ్యభిచారం అవుతుందని గుర్తించరా!”
ఇంతకు మించి నేనేమీ చెప్పలేనంటూ శ్రీధర్ అక్కడ్నుంచి కదిలాడు.
నేనెంత తప్పుగా ప్రవర్తించానో తెలిసొచ్చింది. నన్ను నేను అసహ్యించుకున్నాను. లోపలకు వెళ్ళాను.
“సార్.. ఈ సెల్ ఓకే చేసేయమంటారా?” ఏమీ ఎరుగనట్టుగానే నన్నడిగింది. ఓకే చేయమని చెప్పి… తనకు మాత్రమే వినబడేటట్టు “సారీ” అన్నాను.
“ఓ.కే. సార్.. ఒక్క మాట సార్ ఆఫిీసుల్లో, షాపుల్లో ఆకర్షణీయంగా కనిపించేందుకు మాత్రమే ఆడవాళ్ళు అలంకరించుకుంటారే గానీ, అందాలను ఆరబోసి అమ్ముకుంటారనే చులకన భావంతో గాదని మీ మగాళ్లు గుర్తిస్తే, మీరు సారీ చెప్పల్సిన అవసరమే లేదు” చాచి కొట్టినట్లనిపించింది రజని మాటలు వినగానే.
సెల్ చేతిలోకి తీసుకున్నాను. బిల్ పే చేశాను. ఒక్కసారి వెనక్కు చూశాను.
రజనీ మరో కస్టమర్‌కి సెల్ చూపిస్తోంది. ఇలా తనను చూడటంలో ఈసారి నాలో ఏ దురుద్దేశ్యమూ లేదు. నాలో మార్పును రజనీ గమనించింది.
“సార్.. విజిట్ వన్స్ ఎగైన్” అంది ఆనందంగా!!
నేను నవ్వుతూ సెల్‌ఫోన్‌తో బయటకు నడిచాను.