36. మైనపు ముద్దలు

0
4

[box type=’note’ fontsize=’16’] 2018 దీపావళి కథల పోటీకి వచ్చిన కథ. [/box]

[dropcap]అ[/dropcap]ప్పటికింకా ఆకాశం చీకటి దుప్పటిని తొలగించుకోలేదు!

“చక్రీ! తెల్లారింది లే!!” మంచమ్మీద ముడుచుకు పడుకున్న కొడుకును నిద్ర లేపింది సుమిత్ర.

‘చక్రి’లో చలనం లేదు.

“నిన్నే పిలిచేది. ట్యూషనుకు టైమవుతోంది. త్వరగా లే!”

ఈసారి కాస్త గట్టిగానే వచ్చింది కేక.

“కొంచెం సేపు పడుకుంటానమ్మా!” మంచమ్మీద మళ్ళీ ముడుచుకొంటూ తల్లిని ప్రాధేయపడ్డాడు.

“నీ ఆగడాలు రోజు రోజుకూ ఎక్కువయిపోతున్నాయి చక్రీ! ఆటల మీదున్న ఇంట్రెస్ట్ చదువులో కనిపించడం లేదు. హాఫియర్లీ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయన్న ధ్యాసే లేదు నీకు…” కొడుకు యిష్టాయిష్టాలతో పనిలేదన్నట్టు బలవంతంగా నిద్రలేపి కూర్చోబెట్టింది.

“ఇవాళ ‘సండే’ కదమ్మా. ట్యూషన్‌కు రేపు వెళ్తాను. ఇంకాసేపు పడుకోనివ్వు… ప్లీజ్!”

“ఇవాళ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచుంది. మా ఫ్రెండ్సందరు నన్ను తప్పకుండా రమ్మన్నారు…”

అర్థింపులకు ఆ తల్లి మనసు కరగనంటోంది!

బ్రష్ మీద పేస్ట్ అంటించి, టవల్ భుజాన వేసి కొడుకును బలవంతంగా బాత్‌రూమ్‌లోకి తోసి గడియపెట్టింది.

అరగంటలో స్నానం ముగించుకుని తల్లి ముందు నిలబడ్డాడు చక్రి.

“చూడు చక్రీ! ఈసారి ఎగ్జామ్స్‌లో క్లాస్‌లో ఫస్ట్ ర్యాంకు నీకే రావాలి సుమా! ప్రతీసారీ తన కొడుక్కే ఫస్ట్ ర్యాంకొస్తుందని పక్కింటి ప్రణీత్ వాళ్ళమ్మకు ఎక్కడలేని గర్వం! అందుకే సబ్జెక్టుకో ట్యూషన్ పెట్టించాన్నేను!…..”

కొడుకును డ్రెస్సప్ చేస్తూ చెప్పుకుపోతోంది సుమిత్ర!

మాటల్లోనే రానే వచ్చింది ఆటో!

గ్లాసుడు పాలు గడగడా త్రాగించి, పుస్తకాల  బ్యాగ్‌ను భుజానికెత్తి బరబరా ఈడ్చుకెళ్ళినంత పనిచేసి ఆటోలో కూర్చోబెట్టి వచ్చింది సుమిత్ర!

“తప్పు చేస్తున్నావేమోననిపిస్తోంది సుమిత్రా! ఆడుతూ పాడుతూ చదువుకోవలసిన పసివయసులో గంటకో ట్యూషన్ పెట్టించి అభం శుభం తెలియని ఆ పసివాణ్ణి ‘ఓ చదువుల యంత్రం’లా మార్చేస్తున్నామనిపిస్తోంది!… ఓసారి ఆలోచించు!” భార్య అందించిన వేడి వేడి కాఫీని సిప్ చేస్తూ ఆ రోజు ఆఫిసులో జరగనున్న కాన్ఫరెన్సుకు మ్యాటర్ ప్రిపేర్ చేసుకొంటూ కూల్‌గా అన్నాడు సుధాకర్.

“మీకేం తెలీదు. మీరూరుకోండి!’ కళ్ళెర్రజేస్తూ భర్త మీద హుంకరించింది సుమిత్ర.

“క్లాస్‌లో ఎప్పుడూ తన కొడుక్కే ఫస్ట్ ర్యాంకొస్తుందని పక్కింటి ప్రణీత్ వాళ్ళమ్మకు ఎక్కడలేని గర్వం! కాలనీలో నలుగురూ చుట్టూ చేరి ఆవిణ్ణి పొగిడినప్పుడల్లా ఒళ్ళు మండిపోతోంది నాకు. ఎంత ప్రయత్నించినా మన ‘చక్రి’కి సెకండ్ ర్యాంకే వస్తోంది. ఈసారి ఎలాగయినా మనవాడికే ఫస్ట్ ర్యాంక్ రావాలి! అది చూసి కాలనీలో అందరి ముందు నేను గర్వంగా తలెత్తుకోవాలి!…”

ఆవేశంతో చెప్పుకుపోతున్నా భార్య మనసులోని బలమైన కోరిక ముందు తలవంచి, సూట్‌కేస్ సర్దుకుని ఆఫీసుకు బయల్దేరాడు సుధాకర్.

***

అంతగా ట్రాఫిక్ లేని తార్రోడు మీద ఆవేశంగా దూసుకుపోతోంది ఆటో రిక్షా!

ఆటోలో అసహనంగా అటూ ఇటూ కదులుతున్నాడు చిన్నారి చక్రి.

అతని మస్తిష్కం నిండా అనేక ఆలోచనలు!

ప్రతి రోజూ స్కూలు నుండి వచ్చాక ఫ్రెండ్స్‌తో కాస్సేపు సరదాగా ఆడుకోవాలనిపిస్తుంది తనకు! ఓ గంట సేపు ‘టీవీ’ చూస్తూ గడపాలనిపిస్తుంది.

అందుకు మమ్మీ ససేమిరా ఒప్పుకోదు!

నిద్రపోయే టైమ్ తప్పిమ్చి మిగతా సమయాల్లో ఎప్పుడూ పుస్తకం ముందేసుకుని కూర్చోమంటుంది. క్లాసులో అందరికంటే తనకే ఎక్కువ మార్కులు రావాలంటుంది! పక్కింటి ప్రవీణ్‌కి కాకుండా తనకే ఫస్ట్ ర్యాంక్ వచ్చి తీరాలంటుంది. ఎంత ప్రయత్నించినా తనవల్ల కావట్లేదంటే వినదు.

స్కూలూ, ట్యూషన్ తప్ప వేరే ఆలోచన తన మనసులోకి రాకూడదంటుంది.

అతని ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ ట్యూషన్ సెంటర్ రానే వచ్చింది.

***

మధ్యాహ్నం ట్యూషన్ నుండి వచ్చీ రావడంతోనే పుస్తకాల బ్యాగ్‌ను టేబుల్ మీదకి విసిరేసి నీరసంగా మంచం మీద వాలిపోయాడు చక్రి.

“అలా ఉన్నావేం?” ఆప్యాయంగా కొడుకు తల నిమురుతూ అడిగింది సుమిత్ర.

జ్వరంతో ఒళ్ళంతా కాలిపోతోంది!

తడిగుడ్డతో ఒళ్ళంతా తుడిచి వేడి వేడి పాలిచ్చి పడుకోబెట్టింది.

అలా పడుకున్నవాడు నాలుగురోజుల తర్వాత హాస్పిటల్ బెడ్ మీద నీరసంగా కళ్ళు తెరిచాడు చక్రి.

అతని ముందు ఆదుర్దా నిండిన కళ్ళతో తల్లిదండ్రులు!

“ఎలా వుందిప్పుడు?” అంతలోనే రౌండ్స్ కొస్తూ అడిగాడు డా. ప్రభాకర్.

“ఇప్పుడే కళ్ళు తెరిచాడు డాక్టర్! మళ్ళీ అంతలోనే కళ్ళు మూసుకున్నాడు…” హాస్పిటల్ బెడ్‌కి అతుక్కుపోయిన కొడుకును చూసి కళ్ళ నీళ్ళు పెట్టుకుంది సుమిత్ర! మౌనంగా ఓదార్చాడు సుధాకర్.

“కంగారు పడవలసిన పన్లేదు! ట్రీట్‌మెంట్‌కు బాగానే రెస్పాండవుతున్నాడు! రెండు మూడు రోజుల్లో  మామూలుగా లేచి తిరుగుతాడు. డోన్ట్ వర్రీ!’ ధైర్యం చెప్పాడు డాక్టర్.

“ఉదయం స్కూల్ కెళ్ళేటప్పుడు స్కూల్ బస్ లోనుండి ప్రవీణ్‌ను క్రిందకు తోసేశాను మమ్మీ! చక్రాల కింద పడి నలిగిపోయాడు వాడు!… ఇక నుండీ క్లాసులో ఫస్ట్ ర్యాంక్ నాదే!…”

నీరసంగా బెడ్ మీద పడుకుని నిద్రలోనే కలవరిస్తున్నాడు చక్రి!

ఆశ్చర్యపోవడం అక్కడున్న అందరి వంతయింది!

“ఇదీ వరస డాక్టర్! నిన్నట్నుండీ నింద్రలో ఏవేవో కలవరింతలు! తలచుకుంటే భయమేస్తోంది!…” దుఃఖంతో కొంగు నోట్లో కుక్కుకుంది సుమిత్ర. తల్లిమనసు.

“మరేం ఫర్వాలేదు! జ్వరం తగ్గిన తర్వాత డిశ్చార్జి చేస్తాను!” మరో సారి ధైర్యం చెప్పి ముందుకు కదిలాడు డాక్టర్!

***

చూస్తుండగానే చక్రిని డిశ్చార్జి చేసే రోజు రానే వచ్చింది.

వైద్య పరీక్షలవీ అయింతర్వాత డాక్టర్ క్యాబిన్‌లో కూర్చున్నారు సుమిత్రా, సుధాకర్‌లు!

“ఓ వారం రోజులివి వాడండి!” మందులు వ్రాసిచ్చి జాగ్రత్తలు చెప్పాడు డాక్టర్ ప్రభాకర్.

తమ ఒక్కగానొక్క బిడ్డ ప్రాణాలు కాపాడినందుకు కృతజ్ఞతతో డాక్టరుకు నమస్కరించారు సుధాకర్ దంపతులు.

“మీ వాడి జ్వరం నయం చేసి డాక్టరుగా నా ధర్మాన్ని నేను నిర్వర్తించాను. కానీ, సమాజంలో బాధ్యత గల ఒక పౌరుడిగా మీకో విషయం చెప్పాలి!” సందేహిస్తునే ఆగిపోయాడు డాక్టర్.

చెప్పమన్నట్లు చూశారు దంపతులిద్దరూ.

“మనిషి జీవించడానికి ‘చదువు’ కావాలి! కానీ చదువొక్కటే మనిషి జీవితం కాకూడదు! ఆటపాటల్తో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణంలో నేర్చిన ‘విద్య’ అన్ని విధాలా అభిలషణీయం.

తల్లిదండ్రులు పిల్లలకు నిజమైన స్నేహితుల్లా మెలగాలి! అనుక్షణం పిల్లల మనసెరిగి మసలాలి! అంతేగానీ, తమ మనసులోని కోర్కెల్నీ, ఆశలూ ఆశయాల్నీ పసి హృదయాలపై బలవంతంగా రుద్దటానికి ప్రయత్నిస్తే, అది విపత్కర పరిస్థితులకి దారితీస్తుంది!

పసిపిల్లల హృదయాలు ‘మైనపు ముద్దల’ వంటివి! వాటిని ఏ మూసలో పోస్తే ఆ ఆకారాన్ని మనకిస్తాయని మాత్రం మరువకండి!!” చెప్పడం ముగించాడు డాక్టర్.

పశ్చాత్తాపం నిండిన మనసులతో డాక్టరు దగ్గర శలవు తీసుకొని చిన్నారి ‘చక్రి’ని వెంటబెట్టుకొని ముందుకు కదిలారు సుమిత్రా సుధాకర్ దంపతులు!