40. కాళ్ళని కళ్లకద్దుకుంటూ…

0
8

[box type=’note’ fontsize=’16’] 2018 దసరా కవితల పోటీకి వచ్చిన కవిత. [/box]

[dropcap]కా[/dropcap]ళ్ళని
కళ్ళలా చూసుకుంటూ
ఇంటి లోపలా
కనిపెట్టుకొని వుంటాయి
అలసట వుండదు… గమ్యమూ వుండదు
వేళాపాళాలేని
నిరంతర ప్రయాణం
అడుగు బయట పెడితే చాలు
“అంగ”కు సిద్ధంగా వుంటాయి

మనిషి
ఒంటరి అవుతాడేమో గాని
చెప్పుల జత మాత్రం
జోడీ వీడవు
కుడి ఎడమలూ మారవు

పాదాలకే కాదు
శరీరమంతటికీ
అవి పరోక్ష రక్షణ కవచం

ఒక్కోసారి
సరిహద్దు రేఖకు ఆవల
గుంపులుగుంపులుగా చేరి
గుసగుసలాడుతుంటాయి

చెప్పుదీ మనిషిదీ
మనిషిదీ మట్టిదీ
తరతరాల అనుబంధం
అడుగడుగునా
మట్టినీ మనిషినీ
ఒకేసారి ముద్దాడుతూ
దూరాన్ని దగ్గర చేస్తుంటాయి

పాదం పథం వీడినా
నడక ప్రస్థానం ఆగదు
మరో కాళ్లకు కవచమవుతుంది
మనిషి
కాలిబూడిదవుతాదేమో గాని
చర్మపు చెప్పులు
“అగ్గి” పరీక్షకూ తట్టుకుంటాయి

సోకులెన్ని చేసినా
కాలికింద
అణిగిమణిగి వుండే
నిలువెత్తు నమ్మకం చెప్పులు
కాబట్టే
చర్మం వొలిచి
చెప్పులు కుట్టిస్తామంటారు