41. అశోక్

0
6

[box type=’note’ fontsize=’16’] 2018 దీపావళి కథల పోటీకి వచ్చిన కథ. [/box]

[dropcap]బం[/dropcap]గారు వర్ణాలతో తన పేరు వున్న పుస్తకాన్ని తన చేతిలో పెట్టా. అర్ధం కానట్టు చూశాడు, ఏంటిదని కళ్ళతోనే అడిగాడు. ‘తెలుగులో నీ పేరు’ అని చెప్పా. అయోమయంగా మళ్ళీ దానివంక నా వంక మార్చి మార్చి చూశాడు. పెదాలమీద చిరునవ్వుతో నన్ను పట్టుకుని భుజం మీద తట్టాడు. మరి ప్రముఖ పత్రికలో తన గురించి నేను రాసిన కథ ప్రచురించబడింది అంటే మాటలా?

అంతలో “ఈ రోజు స్టూడియోలో షూటింగ్ ఎవరు బుక్ చేసుకున్నారు” అంటూ సర్ అడగ్గానే ఇద్దరం విషయం గురించి మాట్లాడటం ఆపేసి షూట్ ఆరంబించాం. ఆ రోజంతా ఒక ఉత్సాహం, ఆరాటంతో కనిపించాడు తాను.

***

షూట్‌లో ఒకమ్మాయి నోరు, కాళ్ళు, చేతులు కట్టేసి ఉంటుంది. పక్కన ఒకతను స్త్రీ, తన యొక్క స్వేచ్ఛా భావాలను గురించి చెప్తూ తన కట్లను విప్పేస్తాడు, ఇదంతా షూట్ చేయబడుతూ ఉంటుంది, షూట్ అయిపోగానే ఆ అమ్మాయి వెళ్లి ఆ నటుడిని అభినందిస్తుంది. అంతసేపు అన్ని మాటలు చెప్పిన అతను “ఏంటా బట్టలు ఇంతమంది అబ్బాయిల మధ్యలో వర్క్ చేస్తూ” అని తిట్టేసి వెళ్ళిపోతూ ఉంటే నటించడం కాదు చెప్పినవి పాటించని ఆ అమ్మాయి అతన్ని వొదిలేసి వెళ్ళిపోతుంది.

***

షూట్ వైన్డ్ -అప్ చెప్పగానే నా దగ్గరికి వచ్చాడు. “బాగా చేశారు డైరెక్టరు గారు” అన్నాను నవ్వుతూ, “నీ ఎళితిటియా అతు?” అని అడిగాడు. అవును నేనే రాశాను అని చెప్పాను. అదేంటో చదివి అర్ధం చెప్పవా అని అడిగాడు. చదవకుండానే చెప్పగలను రాసింది నేనేగా. “అశోక్ అని ఒకబ్బాయి అతను పుట్టేవరకు భూమి, మనుషులు వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. అందరి జీవితాలు చెదరగొట్టడానికి ఒకడొస్తాడని వాళ్ళకి అప్పుడు తెలీదు” అని చెప్పుకుంటూ పోయాను. “అమ్మా తాయే! ఉన్నే కొల్లపోరెన్ నాన్ పార్థీటే ఇరు” (అమ్మా తల్లీ!నువ్వు చూస్తూనే వుండు చంపేస్తాను నిన్ను) అన్నాడు కోపం నటిస్తూ. పో డా అని నేను పేజీ మీద ఉన్న తన పేరుని చూస్తూ…

***

అశోక్ ఆరు అడుగుల మీద ఒక రెండు అంగుళాలు ఎక్కువుంటాడు. పొడవు మొహం, వర్ణం నలుపే అయినా మొహం కళగా ఉంటుంది. తాను నవ్వగానే పళ్ళు మెరుస్తూ ఉంటాయి, మీసాలు చిన్నగా గీత గీసినట్టు ఉంటాయి, ఎప్పుడు క్లీన్ షేవ్ లోనే ఉంటాడు. డైరెక్టర్ అవ్వడం తన జీవిత లక్ష్యం అందుకే ఎలక్ట్రానిక్ మీడియాలో పీజీ చేస్తున్నాడు, పాండిచ్చేరి యూనివర్సిటీలో. ఏ లక్ష్యం లేకుండా నేను అక్కడే చదవడం కేవలం యాదృచ్ఛికం. మొదటి సంవత్సరం నుంచే తనని నేను గమనిస్తూనే ఉండేదాన్ని. ఎందుకంటే పొడుగోళ్ళు అంటే నాకు కూసంత ఇంటరెస్ట్ ఎక్కువ.

మాకు క్లాస్‌లో సినిమా ఎడిటింగ్ నేర్పిస్తుంటే తాను మాత్రం పక్కన యూట్యూబ్‌లో భారతీయ రాజా సినిమాలు చూస్తుండేవాడు. అందరం లంచ్ బ్రేక్‌కి వెళ్ళిపోతే తాను క్లాసులో ఒక్కడే బెంచ్ మీద నిద్రపోయేవాడు. బుక్‌లో ఎప్పుడు కథలు రాస్తుండేవాడు. అంతకుముందు తాను తీసిన సినిమాలు ముందే చూసి వున్నాను కాబట్టి తనంటే నాకు అభిమానం ఉండేది. క్లాస్‌లో చాలా కొద్దిమందితోనే బాగా మాట్లాడేవాడు, అందులో నేనొకదాన్ని. మా పరిచయం సరదాగా జరిగింది. నాకు మొదట్లో తమిళం రాకపోవడంతో తన దగ్గర, నాకు వచ్చిన తెలుగుకి తమిళ్ తాలింపు పెట్టి మాట్లాడేశాను. తీరా చూస్తే అవన్నీ తమిళ్‌లో చెడ్డపదాలు అంటూ తాను నవ్వుతూనే వుండిపోయాడు. నాకు చిన్నబోయినట్టు అయింది, తర్వాత తానే నా దగ్గరికి వచ్చి “నువ్వు ప్రయతిస్తున్నావ్ ఇంకో నెలలో అద్భుతంగా మాట్లాడతావ్ చూడు” అన్నాడు. అన్నట్టుగానే తమిళ్ అనర్గళంగా మాట్లాడటం వచ్చేసింది, మాటకి ముందో వెనకో తిట్లు పెట్టి మాట్లాడేంత చనువు అశోక్ దగ్గర నాకొచ్చింది.

ప్రతిరోజూ అశోక్‌ని గమనిస్తూనే ఉండేదాన్ని, ఏదైనా మంచి కథలు వున్నప్పుడు నాతో చర్చించేవాడు. “మేకప్, స్టొరీ బోర్డులు గీయ్యల్సిన అవసరం ఉంది, కొంచెం నేర్చుకో, నువ్వు బాగా గీస్తావ్” అని ఉత్సహపరిచేవాడు. ఆడ మగ తారతమ్యాలు లేకుండా కొట్టుకునేవాళ్ళం. అశోక్ లాంటి స్నేహితులు నా జీవితం లోని చేదు జ్ఞాపకాలను మర్చిపోడానికి మళ్ళీ నేను నవ్వడానికి చాలా ఉపయోగపడ్డారు.

***

రెండు సంవత్సరాల ముందు….

ప్రేమ విఫలం గురించి కొత్తగా చెప్పాడానికేముంది. తినడం, నవ్వడం, నిద్రపొవడం అంతెందుకు బతకడమే మర్చిపోయా. ముందు నన్ను ప్రేమించాను అని చెప్పి తర్వాత నన్ను కాదని ఎలా ఇంకో అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని నాతో ఎలా చెప్పగలిగాడు అని భాద. కళ్ళకు ఎప్పుడు ఒక కన్నీటి పొరతోనే ఉండేదాన్ని, ఒక్కదాన్నే పొగిలి పొగిలి ఏడ్చేదాన్ని. తను లేకుండా జీవితం శున్యం అనిపించేది ఇంతకంటే పెద్ద సమస్య ఎవరికీ రాదనీ అనుకునేదాన్ని. కానీ కాలం మనల్ని తప్పు అని నిరూపించడానికి తన కర్మలతో సిద్ధంగా ఉంటుంది

***

వారం క్రితం..

అశోక్‌ని ఎలాగైతే చూడకూడదు అని అనుకున్నానో అలాగే ఉన్నాడు తను. కళ్ళెప్పుడు చింతనిప్పులా కన్నీటి చారికలతో ఉంటున్నాయి. క్లాస్‌లో ఒక మూల ఫోన్ చూసుకున్నాడు. క్లాస్‌లో అందరి కళ్ళు అశోక్ మీదే. అందరు తన గురించే గుస గుసగా మాట్లాడుతూ ఉంటున్నారు. కొంతమంది ఏం జరిగింది ఏం జరిగింది? అంటూ అందరినీ అడుగుతుంటే ఇంకొంతమంది అయ్యో పాపం కదా అంటున్నారు. నా చూపులు తనని చేరినంత వేగంగా, నా మాటలు చేరలేకపోతున్నాయి. పక్కనే కూర్చున్న రాముని అడిగా తాను భోజనం చేశాడా అని చేసాడు అని సమాధానం రాగానే అక్కడినుంచి వెళ్ళిపోయా. తన దగ్గరికెళ్లడమే కష్టముగా ఉంది. ఇంకా మాట్లాడటమే అసాధ్యం, అన్ని తెలిసి ఎలా వున్నావ్ అని ఎలా అడగను. పరీక్షలు జరుగుతుండటంతో పరీక్ష టైంకు వచ్చేసి రాసేసి వెళ్ళిపోతున్నాడు. తర్వాత రోజు పరీక్షకు ఆలస్యంగా వెళ్ళాను, నా నెంబర్ వెతుక్కుంటూ అనుకోకుండా అశోక్ వైపు చూసాను. అప్పటికే తాను నా వంక ఆల్రెడీ చూస్తుండటంతో మర్చిపోయి పలకరింపుగా నవ్వాను. తన కళ్ళలో ఏ భావం లేకపోయేసరికి ఛ అనవసరంగా అటు చూసాను అనుకున్నాను. మరుసటి రోజు అందరు వెళ్లి తనతో మాట్లాడుతున్నారు కానీ నా వల్ల కావట్లేదు. ఎప్పుడు తిట్టుకుంటూ కొట్టుకుంటూ, నవ్వుకుంటూ వుండే అశోక్ మౌనం నాకు భయంకరంగా అనిపించింది.

తర్వాత రోజు క్లాసులో చాలా కొంతమందే వున్నాం. ఆ సమయంలో, డాక్యుమెంటరీ స్క్రీనింగ్ జరుగుతుంది. లాప్-టాప్‌తో భయం భయంగా అశోక్ వెనక బెంచిలో కూర్చున్నా. కొంతసేపటికి తానే మాట్లాడాడు, “హర్షితా కొంచెం ఇది ఈ పెన్ డ్రైవ్‌లో కాపీ చేసివవ్వా” అని అనుకోకుండా వచ్చిన ఆ మాటకి ఎలా సమాధానం చెప్పాలో తెలియక “హా కుడు కుడు” అని నా పని ఆపేసి తన చేతినుండి పెన్ డ్రైవ్ తీసుకున్న ఏ మాత్రం తన కళ్ళలోకి చూడకుండా. “ఏంటి హర్షితా? ఏం తిట్టకుండా తీసుకున్నావే?, వారం రోజుల నుంచి వాట్స్‌అప్‌లో లేనని బాగా సంతోషంగా ఉన్నావా” అని అడిగాడు. అన్ని రోజులనించి దాచుకున్న బాధ ఒక్కసారే తన్నుకొచ్చింది. “పో డా నీ” ( పో రా ) అని నేను ఏడుస్తుంటే తను నా కళ్ళలోకి చూస్తూ నవ్వుతూ నా తల నిమిరాడు. ఆ రోజంతా తనని కొడుతూనే వున్నా, తను నవ్వుతూనే వున్నాడు కష్టం మీద.

***

కొన్ని రోజుల క్రితం..

నేను ఒక జాబ్ మీటింగ్‌లో ఉండగా ఒకటే కాల్స్ వచ్చాయ్, చిరాకనిపించి ఫోన్ ఆఫ్ చేశా, మీటింగ్ పూర్తవగానే ఫోన్ ఆన్ చేస్తే పంతొమ్మిది మిస్డ్ కాల్స్. అన్ని రాము చేసినవే. వెంటనే కాల్ బ్యాక్ చేశా. “హర్షితా, అశోక్ వాళ్ళ అక్కా బావా ఆత్మ హత్య చేసుకున్నారు అంటా, కారణాలు ఏమి తెలీదు, బాడీ కోసం పోలీస్ స్టేషన్‌కి వెళ్ళాడు అశోక్, అత్త ఇంటివాళ్ళు ఇవ్వనంటున్నారు” అని చెప్పాడు. నాకు ఒక్కసారిగా తల తిరిగినట్టు అయింది. ఏమి అర్ధం కాలేదు. ఆరోజు అంత పడుకొని ఆలోచిస్తూ వున్నా. మొన్నే సంభాషణలో చెప్పాడు సంతోషంగా, తాను మావయ్య కాబోతున్నాను అని, ఇంకో ఐదు నెలలు ఓపిక పడితే చాలు అని చెప్పాడు. ఇంతలో ఇలా జరుగుద్ది అని ఎవరు అనుకోలేదు.

ప్రస్తుతం #

ఏమాత్రం ఆనందం లేని తన కళ్ళలోకి నేను సూటిగా చూడలేకున్నా. నా గతాన్ని మర్చిపోడానికి ఉపయోగపడ్డ వాడి ప్రస్తుతం వాడి భవిష్యత్తుకి ఏమాత్రం ఇబ్బంది పడకూడని నిర్ణయించుకున్నా. రోజు వెళ్లి తనతో మాట్లాడేదాన్ని, విసిగించేదాన్ని, కొట్టేదాన్ని, అప్రయత్నాంగా తనకి కన్నీరు వస్తే తుడిచేదాన్ని. మా ఇద్దరి మాటలు ఈ లోకం గురించి లేదా అంతకుమించి ఉండేవి. మొదట్లో తను ఏటో ఆలోచిస్తూ ఉండిపోయేవాడు. పోను పోను గతాన్ని మర్చిపోవడం అని నేను చెప్పలేను కానీ గతాన్ని గుర్తుచేసుకోకుండా ఉండటానికి ప్రయత్నిచాడు. ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. జ్ఞాపకాల ఉబిలోనుంచి బయటపడటం అంత సులభం ఏం కాదు కాదుగా. అయినా ప్రయత్నిద్దాం ఎందుకంటే అంత అసాధ్యమైనది కూడా కాదుగా,

ఇలాంటి అశోక్‌లు మన జీవితాల్లో ఎంతోమంది ఉంటారు, సమస్యలు వేరు కావచ్చు కానీ వచ్చే కన్నీరు ఒకటే, గెట్ వెల్ సూన్ అశోక్!