45. జయ గీత

0
10

[box type=’note’ fontsize=’16’] 2018 దసరా కవితల పోటీకి వచ్చిన కవిత. [/box]

[dropcap]రెం[/dropcap]డుమాటలు చెప్పనా వదిలించనా పెనునిద్దురన్
బండబారిన గుండె గుండెను జ్వాలనే రగిలించనా
ఎండమావుల బాటసారికి హెచ్చరింపుగ మ్రోగనా
కొండపిండిని చేయుసత్తువ గుర్తు చేయన భారతా!

పల్లెలు పట్టణంబులవి స్వార్థతమస్సున జారిపోవగా
చల్లగ పర్వెనో విపణిజాలము తేజము నీఱుగారగా
మెల్లగ మారుచున్నదిర మేలిమి బంగరు ఛాయ మ్లేచ్ఛమై
ఉల్లమునందు పేదరికముద్ధతి క్రమ్మెను భారతావనిన్  

ఎవ్వడు వాడు నీభుజములెక్కి మదంబున త్రొక్కుచున్నవా
డెవ్వడహంకృతిన్ నగుచు నెంగిలికూడు విదిల్చు వాడు వా
డెవ్వడు నిన్ను నెంచ నతడెవ్వడు నీతులు జెప్ప సోదరా
క్రొవ్వినవాడురా ! తెలుసుకో! చొరనివ్వకు భావదాస్యమున్!

కొదమసింగపు దమ్ము గోవు సాధుత్వమ్ము
చెవులపిల్లుల నౌరు చిఱుత జోరు
కాకి సంఘనిరతి గజగభీరాకృతి
కమఠ వహనశక్తి గరుడ దృష్టి
రాయంచ న్యాయంబు రాచిల్క నెయ్యంబు
ఉడుత సాయంబులు న్నుడుము పట్లు
గిజిగాని వైదగ్ధి  అజగర సంతృప్తి
బెబ్బులి శౌర్యము  పిచుక బిడెము

కలసియున్నవాడు కద భారతీయుడు
జీవమున్నవాడు జేతయతడు
అంతరించుచున్న జంతుజాలము తీరు
భారతీయగుణములారుచుండె 

ఉన్నతమైన యోచనములున్నత వర్తనమున్న చాలు నీ
కున్న బలమ్ము బుద్ధెవరికున్నది లెమ్ముర భారతీయుడా
నిన్నకు మొన్ననే విరిసె నీ ప్రతి వాడల ధర్మవాటి  యా
సన్నము కాలమయ్యె మనసందున చీడను రూపుమాపగన్

అనితరమైన యాత్మబలమందగ వచ్చును పట్టుబట్టి నీ
వనవరతంబు జ్ఞానసముపార్జన చేయుగ; నిన్ను నువ్వు బల్
పెనగొని  నిన్ను గెల్చుకొన విశ్వము నీ పదమంటు నమ్ముమా
మనసున నిర్మలత్వము సమత్వము సత్వము బ్రహ్మతత్వమే !

అదిరా దేహము సద్ప్రవర్తనకు గేహంబైన ధర్మధ్వజం
బదిరా జ్ఞానము విశ్వచింతననికాయంబైన ధీఃప్రగ్రహం
బదిరా డెందము జీవకోటి హితలక్ష్యంబైన యుచ్చైశ్శ్రవం
బదిరా జన్మము భారతీయతను సంధ్యానించు దివ్యస్థలం
బదిరా నీవదిరా సదా విజయవాక్యంబై విజృంభించరా

తమ్ముడ! చెల్లెలా! యవిరతమ్ము మనమ్మున దీక్షబూనుమా
రమ్ము నరమ్ములందు రుధిరమ్మెగజిమ్మగ విక్రమింపుమా
క్రమ్మిన తామసమ్ము నరకమ్ము నిజమ్ము పరాక్రమింపుమా
అమ్మకు భారతమ్మ కభయమ్ము జయమ్మును కల్గ జేయుమా