45. పితృఋణం

0
11

[box type=’note’ fontsize=’16’] సంచిక నిర్వహించిన 2018 దీపావళి కథల పోటీలో న్యాయనిర్ణేతలు/సంపాదకుల ఎంపికలో ప్రోత్సాహక బహుమతి పొందిన కథ. [/box]

[dropcap]”నా[/dropcap]న్నగారు పోయారు” అన్న ఫోన్ అందుకుని కన్నీరు మున్నీరు అయ్యాడు రాఘవ.

తండ్రి అంటే రాఘవకి చాలా ఇష్టం. అలా అని తండ్రి రాఘవని గారాబంగా పెంచిందీ ఏం లేదు. ఆ మాటకొస్తే ఆయనసలు ఇంట్లోనే ఉండేవాడు కాదు. తన లోకమె తనది. ఎంత సేపు సభలు, సన్మానాలు, ప్రముఖుల వెంట తిరగడం ఇదే లోకం. కీర్తి కండూతి ఎక్కువ.

రామారావు మోతుబరి కావడం వల్లను, పేరు కోసం పూనుకుని అన్ని చేస్తుండటం వల్లను, ముఖ్యంగా అవసరమైనప్పుడు సొంత డబ్బులు ధారాళంగా ఖర్చు పెడుతుండడం వల్లను, సహజంగానే అందరు పొగడటం, చందాల కోసం వెంట తిరుగుతుండాడం జరుగుతుండేది.

అయితే చాలామంది స్వార్థానికి బలయ్యాడు. వ్యక్తిగత ప్రాముఖ్యత, ప్రవీణ్యత లేనందున చాటున విమర్శలకీ, వెటకారాలకీ కూడా గురయ్యేవాడు. కానీ అవన్నీ అతని వరకు వచ్చేవి కావు.

కూర్చుని తింటే కొండలు కరుగవా? ఆస్తంతా హరించుకుపోయింది. సంపాదన తండ్రికి చాతకాదు.

తల్లి ఎలాగో గుంభనంగా ఉన్న కొద్దిదాంట్లోనే ఇల్లు గడిపేది. పెద్ద కొడుకు రాఘవ స్కాలర్‌షిప్పులతో చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించాడు. చెల్లికి అందం వల్ల మంచి సంబంధం కట్నకానుకలు లేకుండా వచ్చింది. ఇక తమ్ముడు రాజా ఉన్న కొద్దిపాతి పొలంలో వ్యవసాయం చేస్తూ ఉన్న ఊర్లోనే తల్లిదండ్రులను చూసుకుంటూ గుంభనంగా ఇల్లు గడిపేవాడు.

రాఘవ రమ్మన్నా ఉన్న ఊరు వదిలి రావటానికి ఎవరూ ఇష్టపడలేదు.

ఆస్తి హరించుకుపోయి, ఎలాగో గడుపుకోడం అందరూ భరించినా, రామారావు మాత్రం తట్టుకోలేకపోయాడు. వంధిమాగధులు లేక, చేతిలో విచ్చలవిడిగా ధనం లేక మానసికంగా క్రుంగిపోయాడు. అయినా పద్ధతి మార్చుకోలేకపోయాడు. తన దారి తనదేగా ఉండేవాడు.

రాఘవ శలవు, డబ్బు తీసుకుని సొంత ఊరు బయలుదేరాడు. అతను వెళ్ళేసరికి అతని కోసమే ఎదురుచూస్తున్న తల్లి, చెల్లి, తమ్ముడు ఘొల్లుమన్నారు. అప్పటికే ప్రొద్దుపోవటంతోటి దహనం మర్నాటికి వాయిదా వేశారు.

రాత్రి పదయ్యింది. పదిమంది మనుషులు లోనికి వచ్చారు. పరామర్శకుకు అయి ఉంటుంది. అప్పుడే అందరూ ఏడ్చి, ఏడ్చి నిద్రపోవటం తోటి రాఘవ వారిని తీసుకుని బయటకు వచ్చాడు. తమ్ముడు రాబోతుంటే వారించాడు. అతను అలసిపోయి ఉన్నాడు.

***

పదిరోజుల ఏర్పాట్లు చూస్తున్న అన్నదమ్ముల దగ్గరకొచ్చింది తల్లి.

“ఏమిటమ్మా?” అన్నారు ప్రేమగా.

“బాబూ మీ నాన్నగారికి చనిపోతే నిలువెత్తు ఫోటో పేపరులో పడాలని కోరిక. ఆ ఏర్పాటు చేస్తావా?” అడిగింది.

రాఘవ ఏదో చెప్పబోయాడు. ఇంతలో ఇద్దరు వ్యక్తులు లోనికొచ్చారు. రాఘవ మాట్లాడబోయే లోపలే వారు అన్నారు – “మీ నాన్నగారు ఈ ఊరిలో ఆడిటోరియమ్ లేదు కాబట్టి తన పేరు మీద కట్టిస్తానన్నారు. మీరు వెళ్ళే లోపల ఆ డబ్బు ఏర్పాటు చేస్తే ఏడాది లోపల పూర్తి చేస్తాం. సంవత్సరీకాలు అందులోనే చెయ్యచ్చు ఘనంగా” అని.

“మేము ఈ దినాలు అయ్యాక మాట్లాడతాం” అన్నాడు రాఘవ.

“మర్చిపోకండి” అంటూ వెళ్ళిపోయారు వాళ్ళు.

తల్లి మంగళసూత్రాలు తీసి చేతిలో పెట్టింది.

“ఏమిటమ్మా ఇది?” నిర్ఘాంతపోతూ అడిగాడు రాఘవ.

“మీ నాన్నగారి కోరికలు తీర్చటానికి నా వంతు సాయం బాబూ. ఇంక వీటితో అవసరమూ లేదు. ఆయన కోరిక తీరితే చాలు” అంటూ లోపలికి వెళ్ళింది.

రాఘవ అటే చూస్తుండిపోయాడు. రాజా, చెల్లి కూడా కొంత డబ్బు ఇచ్చారు.

***

పదవ రోజు అందరు ఆత్రంగా పేపర్ చూశారు. ఎక్కడా రామారావు ఫోటో లేదు.

“అన్నయ్యా, నాన్న ఫోటో రాలేదే. పదవ రోజుకే రావాలని చెప్పలేదా? రేపొస్తుందా?” అడిగాడు రాజు.

“లేరు. ఎప్పటికీ రాదు” అన్నాడు మెల్లిగా రాఘవ.

“ఎందుకని?” ఆశ్చర్యంగా అడిగింది చెల్లి.

“ఎందుకంటే పేపరులో ఫోటో పడటం (అదీ నిలువెత్తుది), ఘనంగా ఆడిటోరియం కట్టించడం, అందులో సంవత్సరీకాలు… వీటన్నిటికంటే పరువుగా, అప్పులు తీర్చుకుని బయటపడడం ముఖ్యం కదా” అన్నాడు రాఘవ.

“అంటే?” అన్నాడు రాజా.

“అంటే నేను వచ్చిన రోజు పదిమంది వ్యక్తులు వచ్చారు గుర్తుందా? వాళ్ళు వచ్చింది పరామర్శకి కాదు. అప్పుల వాళ్ళు. అప్పు వసూలు కోసం వచ్చారు. వాళ్ళ అప్పులు తీర్చకపోతే అమ్మని ఊరు కదలనీయమన్నారు, శవమూ లేవదన్నారు. ‘అన్నారు’ అనేకంటే బెదిరించారు అని చెప్పవచ్చు. అందుకే నీ వాటా, చెల్లి వాటా, అమ్మ ఇచ్చినది, మిగిలినది (అది చాలా ఎక్కువ) నేను వేసి తీర్చేశాను. ఆడిటోరియమ్ మన వల్ల కాదని చెప్పేశాను.”

“నాన్నగారు అన్ని అప్పులు చేశారా?” అని నిర్ఘాంతపోయిన రాజా తేరుకుని అన్నాడు – “కానీ కన్నందుకు (మాతా) ‘పితృఋణం’ తీర్చుకోవాలని అన్నారుగా పంతులుగారు.” తండ్రి కోరిక తీర్చకపోతే ‘పితృఋణం’ తీర్చుకున్నట్లు కాదేమోననే సందేహంతో,

“ఇప్పుడు నేను చేసిందీ అదే కదా. ‘పితృఋణం’ (తండ్రి అప్పు) తీర్చాను కదా” అన్నాడు రాఘవ పేలవంగా నవ్వుతూ.

ఒకవేళ తనని ప్రపంచం వేరేలా అనుకోవచ్చునేమో కానీ, తండ్రి పరువు నిలబెట్టడానికి, తల్లి గౌరవంగా బ్రతికేలా చెయ్యటానికి, తండ్రిని ప్రాపంచికంగా ఋణవిముక్తుడిని చెయ్యటం కూడా ‘పితృఋణం’ తీర్చుకోవటమే కదా. ఏది ఏమైనా తను చేసింది మంచి పనే అనే నమ్మకంతో, తల్లికి వివరించి, సముదాయించటానికి లేచాడు రాఘవ.