48. ఎక్కడెక్కడో వెతుకుతున్నా

0
5

[box type=’note’ fontsize=’16’] 2018 దసరా కవితల పోటీలలో పాఠకుల ఓట్ల ఆధారంగా ఎంపికైన ద్వితీయ ఉత్తమ కవిత.[/box]

[dropcap]గ[/dropcap]డ్డిపరక కూడా కొన్నివాక్యాలను
చేతికందిస్తుంది
పరకలోకి పరకాయప్రవేశం చేసి
గాలిపదునును, మెత్తదనాన్ని తనువుకు
గంధంలా పూసుకుంటున్నాను!!

కట్టెపుల్ల కూడా కవిత్వాన్ని
పలికించగలదు
నదిలోని గలగల సవ్వడులనే
కవిత్వం చేయాలని
భ్రమలకు పోతున్నా కానీ
దేని ఆత్మను వెలిగించినా కవిత్వమవుతుందని
ఇప్పుడు ఇప్పుడే తెలుసుకుంటున్నా!!

ఎక్కడెక్కడో వెతుకుతున్నా
అనవసరంగా కొన్ని పదాలను అతుకుతున్నా గాని
సంతృప్తి కరువు!!

నిప్పులతో కూడిన పదాలవంతెనపై
బుడిబుడి అడుగులు వేస్తున్నా కాని
తేలిక పదాల కవిత్వాన్ని తెలుసుకోలేకపోతున్నా!!

ఎక్కడెక్కడో వెతుకుతున్నా గాని
పక్కపక్కనే ఉన్న సంగతులను
కవిత్వం చేయాలేకున్న!!

ఇకనైన వెతకడం మాని
అతకడం మాని, నిజజీవితాలను
కవిత్వీకరించాలనుకుంటున్నా
కవిత్వం పేరుతో ఆ భావాలను రాసుకోవాలనుకుంటున్నా!!