49. నేటి పల్లెటూరులు..

0
7

[box type=’note’ fontsize=’16’] 2018 దసరా కవితల పోటీకి వచ్చిన కవిత. [/box]

[dropcap]ప్లా[/dropcap]స్టిక్ నవ్వుల ప్రపంచానికి దూరంగా..
‘పల్లె అందాలు’ అత్మీయంగా రమ్మంటూ పిలుస్తున్నాయి!
ఊరికి ఆనుకుని..
బాతుల నడకల వయ్యారాలు.. తూనీగల సయ్యాటల పరవశాలు..
తూరుపు చిరుగాలులు తాకగానే..
తామరాకుల మద్యన విరిసిన కలువల ఊగిసలాటలు..
ముచ్చటగా ముస్తాబైన చెరువు..!
నేలతల్లికి ఆకుపచ్చని చీర కట్టినట్లుగా.. విస్తారంగా పరచుకున్న వరిపంటల పచ్చదనాలు!
అభిమానం, అనురాగం.. మాటలలో తొణికిసలాడుతుండగా..
ఎద తలుపులను తట్టిలేపుతున్నట్లుగా.. ప్రతిపిలుపు!
అందం, ఆనందం.. పదాలకు అర్థం తెలిసేలా.. ‘పల్లె పడచుల’ స్వచమైన చిరునవ్వులు!
రవిబింబం.. తూరుపు దిక్కుని పసిడివర్ణకాంతులతో రమణీయంగా అలంకరిస్తుంటే..
ప్రతి ఉషోదయం.. సరికొత్తగా ఆవిష్కృతమవుతుంటే..
వీక్షిస్తున్న హృదయం.. ఆనందపరవశం!
కోవెల లోని దైవాన్ని సుప్రభాతంతో మేలుకొలుపుతుండగా..
గుడిగంటలు లయబద్దంగా మ్రోగుతుంటే..
పురోహితుల వేదమంత్రాలు గుడిలో ప్రతిద్వనిస్తుంటే..
ఆలకిస్తున్న మనస్సు సంతోష సంబరాల సంగమం!
సుర్యోదయసమయాన.. స్వర్ణమణిమయకాంతులతో దైవం వర్దిల్లుతుంటే..
ఆధ్యాత్మికత ఉట్టిపడే.. ఆనంద క్షేత్రాలు.. పల్లెటూరులు!
వరుణదేవుడి కరుణను కాంక్షిస్తూ.. అవనితల్లి ని నమ్ముకున్న రైతన్నలకి నిలయాలు.. పల్లెటూరులు!
ప్రేమ, ఆప్యాయతలతో అలరారుతూ.. కల్మషమే లేని స్వచమైన అనుబంధాలకు
నెలవులు.. పల్లెటూరులు !
ఆధునిక వ్యవసాయ పద్దతులను అందిపుచ్చుకుంటుంటే ..
సృజనాత్మకత వెల్లువిరిసే వ్యవసాయ క్షేత్రాలు.. నేటి పల్లెటూరులు!
రైతుల శ్రమ ఫలించి ..
పంటలు చేతికి అంది వచ్చిన వేళ..
రైతన్నని ‘అన్నదాత’ గా కీర్తిస్తుంటే..
ధాన్యరాశులే సిరిసంపదలుగా గల..
ఇలలో వెలసిన లక్ష్మీదేవి నిలయాలు .. నేటి పల్లెటూరులు!
నాడు గాంధీజీ చెప్పినట్లుగా ..
నేటీకీ.. ‘దేశ ప్రగతికి పట్టుగొమ్మలు’గా.. పల్లెటూరులు!