51. రక్షణ

0
2

[box type=’note’ fontsize=’16’] సంచిక నిర్వహించిన 2018 దీపావళి కథల పోటీలో న్యాయనిర్ణేతలు/సంపాదకుల ఎంపికలో ప్రోత్సాహక బహుమతి పొందిన కథ. [/box]

[dropcap]“మీ[/dropcap] గోదావరి జిల్లాల వాళ్ళ పెట్టుపోతల తర్వాతే మరెవరైనా? ఎంత పెద్ద లడ్డు. దాంతో పాటుగా కారపు గులాబీ పువ్వు. ఏ పిండితో తయారు చేశారో కాని నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నది.”

“వాటితో పాటు లాంఛనంగా ఇచ్చే పసుపూ, కుంకుమా, సున్నిపిండి, ఒక్కోటి వందగ్రాములకు తక్కువుండని జిప్ లాక్ పొట్లాలు. పండూ, తాంబూలం అన్నీ కలిపి పెద్ద ట్రే నిండుగా అమరాయి కదా సుశీలా?” అన్నది లలిత మొచ్చుకోలుగా.

“అవునవును. అన్నీ కలిపి మన పిచ్చేశ్శ్వర్రావు మనసంతా విశాలంగా, భారీగానే వుంది సారె” అన్నది సుశీల.

“ఆ..య్! మీకు బాగా నచ్చిందాండీ మా కాపురపు సారె. బాగా రుచిగానే అన్పించాయా అండీ తీపి, కారం సరుకులు రెండూ. మావైపున ఈలాగే చేస్తారు. మా అమ్మవాళ్ళు ఇంట్లోనే, మనుషుల్ని పెట్టి వండించి తట్టల కెత్తించేరు” అని ప్రభావతి చెప్తుండగానే బామ్మగారు లోపలి నుంచి హాల్లోకి వచ్చారు.

“మా బామ్మ మీ గుంటూరు జిల్లా ఆవిడేనండీ. తనకు దూరపు బంధువే అవుతారు మావారు.”

“ఆ.. మరే మా తమ్ముడికి తన అత్తగారి తరువున దగ్గరవాడే పిచ్చేశ్శ్వర్రావు” అంటూ బామ్మగారు అక్కడున్న కుర్చీలో కూర్చున్నారు. స్థిమితంగా కూర్చున్న తర్వాత లలితా వాళ్లతో మాటలు ప్రారంభించారు. “మా ప్రభను చూసి, పలకరించటానికి మీరు వచ్చినందుకు చాలా సంతోషం. అయితే మీరందరూ ఇక్కడ ఎన్నేళ్లబట్టి వుంటున్నారు? అంతా సౌకర్యంగా బాగానే వుటుందా? నీళ్ళుకూ, పాలకూ ఇబ్బందేం లేదుగా? మా పిల్లకి పనులు చెయ్యటం ఆట్టే అలవాటు లేదు. ఇన్నాళ్లూ చదువుకుంటూ గడిపేసింది. చేతి కింద సాయానికి ఎవరన్నా కాస్త దొరకితే బాగుండును.”

“మా అందరికీ పనులు చేతే పనిమనిషే చేసి పెడుతుంది లెండి. ఇన్నాళ్లూ పిచ్చేశ్శ్వర్రావుగారు పని మనిషి జోలు లేకుండా ఒక్కళ్లూ పనంతా చేసుకునేవాళ్లు. ఆ పైన స్వంతంగా, వంట కూడా చేసుకునే వాళ్లు. మనిషిని పంపిస్తాం పని చేయించుకోండి అని మేమెవరం చెప్పినా నా ఒక్కడికే ఎంత పని వుంటుందండీ అంటూ తానే చేసుకునే వాళ్లు. ఎప్పుడో నూటికో, కోటికో ఒక్కసారి ఆదివారం పూట ఆఫీసు అటెండరొచ్చి కాస్త బూజులు అవీ దులిపేవాడు. ఇంకా మాకందరికీ తల్లో నాలుకలా వుంటూ తనే మాకే సహాయం కావలసి వచ్చినా చేసి పెడుతూ వుండేవాళ్ళు. ఆ అభిమానంతోనే పిచ్చేశ్శ్వర్రావుగారి భార్య కాపురానికి రాగానే పలకరించి, పరిచయం చేసుకుందామని వచ్చాం. నాలుగు రోజులు పోతే అంతా తనకే పాత బడుతుంది లెండి. పనులూ అలవాటువుతాయి. అసలీ లోగా పిచ్చేశ్శ్వర్రావుగారే తన భార్యకు పనులన్నీ నేర్పించేస్తారు. పై ఎత్తున సలహాలివ్వటానికి ఓ పది రోజులు మీరుండండి బామ్మగారూ. ఏం కావలసి వచ్చినా మమ్మల్ని అడగండి. నేను రెండో ఫ్లోర్లో వుంటాను. నా పేరు సుశీల. తన పేరు లలిత. తను మూడో ఫ్లోర్లో వుంటుంది. ఏమైనా పన్లుంటే వాచ్‌మాన్‌ని పిలిచి చెప్పండి. వెళ్లొస్తాం” అంటూ లలితా, సుశీలా వెళ్లిపోయారు.

“బాగా సందడిగానే వుండేటట్లుంది ప్రభా ఇక్కడ.”

“ఆ..య్! అలాగే వుందే బామ్మా” అంటూ ప్రభావతి లోపలకిపోయింది.

***

సాయంకాలం ఏడయింది. పిచ్చేశ్శ్వర్రావు ఇంకా ఇంటికి రాలేదు. ఎదురు చూస్తూ కూర్చున్నది ప్రభావతి.

“గవర్నమెంటు ఉద్యోగస్థులు ఐదుయ్యేసరికి ఇంట్లో వుంటారంటారు. అబ్బాయి ఇంకా రాలేదేమిటో?  పైగా ఉన్న ఊళ్లోనే ఆఫీసాయే” అన్నది బామ్మ.

తనకు కొత్తగా పైళ్లైంది. కాపురాని కొచ్చిన భార్య ఇంట్లో ఎదురు చూస్తూ వుంటుంది, త్వరగా ఇంటికి పోవాలనుకున్నాడు పిచ్చేశ్శ్వర్రావు. ప్రభావతితో జరిగిన వివాహం ఎంతో సంతోషాన్ని కల్గించింది తనకు. జీవితంలో అతి ముఖ్యమైందీ బ్రతుక్కు నిండుదనాన్నిచ్చేదీ వివాహమే అన్పించింది. ఇన్నాళ్లూ తను గడిపిన జీవితం అసంపూర్ణంగా తోచింది. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్లి ప్రభావతితో గడుపుతాను అని తహతహలాడాడు.

“చూడండి పిచ్చేశ్శ్వర్రావ్! ఆ తేలప్రోలు రూట్‌లో జరిగే రోడ్డు పనుల దగ్గర కెళ్ళండి. పాచ్‌ వర్క్ జరుగుతుందిగా. మన సూపర్‌విజన్ వుండాలి. ఇప్పటికే పేపర్లో వచ్చింది. ఆ రోడ్డు పనల్ని కాంట్రాక్టరు సరిగ్గా చేయటంలేదు. మొటీరియల్, వర్క్ అంతా నాసిరకంగా వుంటున్నాదని. మీరెళ్ళి కాస్త జాగ్రత్తగా చూడండి”   అంటూ డి.ఇ. గారు పిలిచి చెప్పారు. చేసేదేం లేక బండి తీసుకుని రోడ్డ పనులు జరిగే చోటుకెళ్లాడు. నిజానికది నరసింహరావనే మరో ఎ.ఇ. వెళ్లాల్సిన రూట్. అతనే స్వంత పని మీద వెళ్లాడో తెలియదు. డి.ఇ. గారు పిలిచి తనను వెళ్లమనేసరికి కాదనలేకపొయ్యాడు. నరసింహరావు బయటికెడుతూ, పిచ్చేశ్శ్వర్రావును పంపండి అని చెప్పే వుంటాడు. అతనికలా చెప్పడం అలవాటే అనుకున్నాడు పిచ్చేశ్శ్వర్రావు.

“మీరు ఎంత జె.ఇ. అయినా అన్ని పనులూ మీకే చెప్తుంటే ఎలాగండీ? మీరు మెదలకుండా వుంటే బాధ్యత మీ మీదేసి వాళ్లు పెత్తనాలు గొడుతూ వుంటారండీ. ఏదో వంక చెప్పి మీరు కొన్ని పన్లు తప్పించుకోండి. ఆళ్ల పన్లు ఆళ్లే చూసుకుంటారు” అని అటెండరు పున్నారావు మధ్య మధ్యలో సలహాలిస్తూ వుంటాడు.

“పోనీలే. ఎవరో ఒకళ్లం వెళ్లి ఆ పని చూట్టం ముఖ్యం. దగ్గర ఎవరూ లేకపోతే కాంట్రాక్టర్ కంకరలో సిమెంటు పాళ్లు మరీ తగ్గించి ఇసకో, బుసకో పోయించి పోతాడు” అంటూ గబగబా పనులు జరిగే చోటుకు పోతూవుంటాడు పిచ్చేశ్శ్వర్రావు.

ఆ రోజు తేలప్రోలు రోడ్డు దగ్గర నుండి వచ్చేటప్పటికి బాగా చీకటి పడిపోయింది. దార్లో మల్లెపూలు కొనుక్కుని  హుషారుగా ఇంటి కొచ్చేటప్పటికి ఎనిమిదిన్నర అవనే అయ్యింది. సాయింత్రం ఇంటికి వచ్చి తింటాడని ప్రభావతి చేసివుంచిన టిఫిన్ చల్లగా అయిపోయి, గిన్నేలో పడివున్నది. మూత తీసి చూస్తూ “ఇప్పుడేం టిఫిన్ చేస్తానులే? ఏకంగా స్నానం చేసి భోజనాలు చేద్దాం. బామ్మా! మీరు  భోజనం చేశారా? మీరు పెందరాడే భోజనం చేసేయ్యండి. నా కోసం చూడొద్దు. ఒక్కో రోజు నాకిలాగే ఆలస్యమవుతుంది. రేపు  ఆదివారమేగా ఆఫీసు కెళ్లక్కర్లేదని కాస్త పని వుంటే అదీ చూకుకుని వచ్చాను” అన్నాడు పిచ్చేశ్శ్వర్రావు.

పడక గదిలోకి రాగానే కిటికీ తెరలు పక్కకి జరిపాడు.

“చల్లని గాలి బాగా లోపలికొచ్చి రూమంతా బాగా చల్లబడుతుంది ప్రభా. కిటికీలో నుంచి చంద్రుడు ఎంత బాగా కనపడుతున్నాడో చూడు. నాలుగో ఫ్లోర్ కావటం వలన చంద్రుడు, వెన్నెలా బాగా కనపడతాయి ఇక్కడకు. మంచం మీద క్కూడా పగలు ఎండ పొడా, రాత్రిళ్లు వెన్నెల కాంతీ చక్కగా పడతాయి. ఇక్కడికి వచ్చిన తర్వత ఈ గది నాకు చాలా ప్రీతిపాత్రమైపోయింది” అంటూ చేతిలోని గుండు మల్లెల చెండును పొట్లం విప్పదీసి కిటికీలో వుంటాడు. పాంటు జేబులో నుంచి చిన్న తామరాకు పొట్లం తీసి దాంట్లో నుంచి నాలుగు సంపెంగలు బయటకు తీశాడు.

“వీటినోక గిన్నెలో నీళ్ళలో వేసి ఆ టీపాయ మీద పెట్టు. తెల్లవార్లూ గదంతా కమ్మని వాసనోస్తుంది. మల్లెచెండు నీకు అంటే మనకు” అంటూ నవ్వాడు. పిచ్చేశ్శ్వర్రావుకు ఇప్పుడు ప్రతి సంఘటనా ఎంతో మైమరుపును కలిగిస్తూ మరెంతో మధురంగా అన్పించసాగింది. ఎంత వీలైతే అంత ఎక్కువ సేపు ప్రభావతి సమక్షంలోనే గడపాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ప్రభావతి వంక చూస్తున్న కొద్దీ ఇంకా చూడాలనిపిస్తున్నది. ఆమె తెల్లని ఒంటి రంగూ, పలుచని చెక్కిళ్లు, కొన తేరిన ముక్కు, కొంచెం లావుగా వున్న పెదవులూ అన్నీ అపురూపంగానే కనపడుతున్నాయి. రాత్రి పూట ఆమె మంచం మీద పడుకుంటే ఆ భంగిమనూ తనివితీరా చూస్తూన్నాడు. ఆమె వేసుకున్న తెల్లని పువ్వుల నైటీతో పోటీ పడుతుంది ఆమె దేహకాంతి అన్పిస్తుంది. గదిలోని లైట్ తీసేస్తాడు వెన్నెల బాగా కనపట్టం కోసం. తమ మంచం మీద పడే పల్చని వెన్నెల కాంతిలో ఆమె ముఖం మరింత అందంగా సంతోషం జాలువారుతున్నట్లుగా అన్పించి తదేకంగా చూస్తూ వుండి పోతున్నాడు. తల్లి పొత్తిళ్ళలోని తన పసిబిడ్డను చూచుకున్నత మురిపెంగా తాను, తన భార్యను పొదివిపట్టుకుంటూ ఎంతో హాయిని పొందుతున్నాడు. ప్రభావతి వాలకం చూస్తూంటే ఆమె కూడా అన్ని విధాలా తృప్తిగానే వున్నట్లు అనిపించేది పిచ్చేశ్శ్వర్రావుకి.

మల్లెపూల వాసనంతా ఆవిరవకుండానే బెడ్ రూమ్‌లోకి రావాలనుకుని స్నానాదికాలు పూర్తి చేసి భోజనాని కూర్చున్నారు. ఆ సరికి బామ్మ కూడా భోంచేసి అవతలి గదిలోకి వెళ్లి పడుకుంది. వాళ్లకు ఏకాంతం కల్పరించటం  కోసం ఆమె టి.వి ముందు కూడా కూర్చోకుండా పిచ్చేశ్శ్వర్రావు ఇంట్లో వున్నంత సేపు ఏదో పని కల్పించుకుని వంటగది లోపలో, అవతల బెడ్ రూమ్‌లోనో వుండి పోతున్నది. భోజనాలు పూర్తయినాయి. డైనింగ్ టేబుల్ శుభ్రం చేసుకుని వంట పాత్రల్ని ఇద్దరు కలిసి సర్దేసుకుంటున్నారు.

“బామ్మకు మంచి నీళ్లు సీసా ఇచ్చావా ప్రభా?” అంటూ తమ కోసం బాటిల్ నీళ్లు పట్టసాగాడు. ఈలోగా ఫోన్ రింగయ్యింది. వెళ్లి చాశాడు. డి.ఇ. గారు లైన్లోవునారు. ఫోను తీసుకుని మాట్లాడసాగాడు. అట్నుంచి డి.ఇ గారు  వివరాలు చెప్పటం మొదలు పెట్టారు. “కొత్త పెళ్లి కొడుకువి. ఇబ్బంది పెడుతున్నాను పిచ్చేశ్శ్వర్రావ్! ఏమనుకోకు. మన ఎమ్.ఎల్.ఎ. గారున్నారుగా, ఆయన తండ్రి చనిపోయి సంవత్సరం పూర్తి కావస్తుందట. ప్రథమ వర్ధంతి రోజు కల్లా ఆయన కాంస్య విగ్రహన్ని ప్రతిష్ఠించాలట. తన నియోజకవర్గమైన మన ఊరి సెంటర్లో ఆ విగ్రహాన్నుంచాలట. విగ్రహం తయారీ అయిపోయిందట. మన ఉపరాష్ట్రపతి కార్యాలయం నుంచి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికొస్తామని ఎం.ఎల్.ఎ. గారికి మెసేజొచ్చిందిట. ఆయన నాకు ఫోన్ కొట్టాడు. మీ ఆర్ అండ్ బి వారే ఏర్పాట్లన్నీ చూడాలి. తాలూకా పైస్కూల్ గ్రౌండ్ చాలా విశాలంగా వుంటుంది. మీరు దగ్గరుండి హెలిపాడ్ ఏర్పాడు చేయించాలి. అవసరమైన చోట గ్రావెల్ అవీ తొలగించి నేలంతా చదును చేయించండి అంటూ వివరాలు చెప్పారు. రేపు ఉదయాన్నే ఆదివారమైనా మనం ఆఫీసులో వుండాలి. అక్కడ్నుంచి గ్రౌండ్‌కెళదాం. రెండు మూడు రోజుల్లోనే ఆ పన్లు పూర్తి చేయాలి. ఎన్ని సార్లు ఫోన్ చేసినా నరసింహరావు ఫోన్ తియ్యలేదు. అతనికి రేపుదయం ట్రై చేస్తాను. మిగతా వాళ్లకు చెప్పాను. అందరూ ఆఫీసులో వుంటాల్సిందే.  మేమెంత ముందొచ్చినా నువ్వైతేనే పర్‌ఫెక్ట్‌గా పని చేయించగలవు. నువ్వొస్తేనే నాకు టెన్షన్ తగ్గుతుంది. మరో మాట, ఈ పన్లన్నంటికీ ఎస్టిమేషన్ పూర్తి చేసుకుని రావాలి. మన దగ్గర టైం ఎక్కువేం లేదు” అంటూ మరో మాటకు అవకాశం లేకుండా ఫోన్ పెట్టేశారు డి.ఇ.గారు.

ఆ మాటలతో సగం ఉత్సాహం నీరుగారిపోయింది పిచ్చేశ్శ్వర్రావుకు.

ఎన్నో ఆశలతో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన రెండేళ్లకు ఈ ఉద్యోగమొస్తే – గవర్నమెంట్ ఉద్యోగం, ఎంతో భద్రతో వుంటుందని ఆలోచించి దీంట్లో చేరాడు. చేరేలోపున ఇద్దరు కాంట్రాక్టర్ల దగ్గర సివిల్ ఇంజనీర్‌గా పని చేశాడు, అనుభవం కోసం కొత్త ఉద్యోగంకు. హుషారు పాలు ఎక్కువ, పని పట్ల నిబద్ధత వండేటప్పటికి డి.ఇ. కాని తోటి వారు కాని, పిచ్చేశ్శ్వర్రావుకు పని భారం ఎక్కువ పడేస్తున్నారు. ఏ మాత్రం ఆలస్యం లేకుండా పన్లంటినీ చేసుకుపోతూనే వున్నాడు.

“కాంట్రాక్టర్లు మన మాట వినరయ్యా. మనమే వాళ్ల మాట వినే రోజులు. నీవు కాస్త చూసీ చూడనట్లుపో. వాళ్ళిలాగే లేబర్‌ను తక్కువ మందినే పెడతారు. తక్కువ పాళ్లు సిమెంట్ కలుపుతారు. కాంక్రీట్ బ్రికెట్స్ అమర్చి మరీ స్లాబులు పొయ్యాల అంటూ నువూరికే హైరానా పడకు అంటూ ఎ.ఇ. వాళ్లు సలహాలిచ్చేవాళ్లు.

***

మనసంతా ఆఫీసు ఆలోచనలు నింపుకుని లాప్‌టాప్ ముందేసుకున్నాడు పిచ్చేశ్స్వర్రావు. ప్రభావతి తల్లో మల్లె చెండు సర్దుకుంటూ చిన్న వెండిగిన్నెలో రెండు కిళ్లీలు పెట్టుకుని, బెడ్రూమ్‌లో  కొచ్చింది. పిచ్చేశ్శ్వర్రావు అప్పటికే డి.ఇ. గారు చెప్పిన పనిలో లీనమయ్యాడు.

“ఫోనెక్కడనుండి?  అనడిగింది.”

“డి.ఇ. గారు చేసారు. అనుకోకుండా పనిబడింది. ఏదైనా మాగజైన్ చూస్తూ కాసేపు రిలాక్సవు. నా పని పూర్తి చేసుకుంటాను. ప్లీజ్! ” అన్నాడు.

“ఛ. ప్లీజ్ ఏమిటి?  నేను చదివింది కంప్యూటర్ బి.ఎస్సీ నేగా. మీరు చెప్తూ వుండండి. సిస్టమ్‌ను నేను అప్‌డేట్ చేస్తాను” అన్నది.

“వద్దొద్దు. ఇంటి పనంతా నువ్వొక్కదానివి చేసుకుంటున్నావు. రెస్టు తీసుకో. ఎలాగోలా నేనే పూర్తి చేస్తాను, కాస్త టైమ్‌ పడుతుంది. ”

కొసరి, కొసరి తినిపించుకుంటూ కాస్త ఎక్కువగా తిన్న భోజనం. చల్లగాలి వెన్నెల హాయి, మంచం మీద వాలిన కొద్ది సేపటికే ప్రభావతికి నిద్ర ముంచుకొచ్చింది.

పిచ్చేశ్శ్వర్రావు పని పూర్తి చేసుకుని లాప్‌టాప్ ముందు నుంచి లేచేసరికి ఒంటిగంటయ్యింది. ఒళ్లు విరుచుకుంటూ లేచాడు. గిన్నెలో వుంచిన కిళ్లీలు అలాగే వున్నాయి. నీళ్లులోని సంపెగలు వాసన తగ్గి బంగారు రంగులోకి మారుతున్నాయి. ప్రభ ఒక ప్రక్కకు తిరిగి పడుకుని వున్నది. జడలోని మల్లె చెండు కాస్త వడబడింది. ప్రభావతి ముంగుర్లు గాలికెగురుతుంటే ఆమెనే తన్మయంగా చూస్తూవుండిపోయాడు. జాగ్రత్తగా ప్రభావతికి మెలకువ రాకుండా దుప్పటి కప్పాడు. ట్యూబ్‌లైట్ తీసేసి కాసిని మంచి నీళ్లు తాగాడు. ఆమెనడుం మీద చెయ్యేసి ప్రేమగా ఆమెను స్పృశిస్తూ కళ్లుమూసుకుని నిద్రపోవటానికి ప్రయత్నంచాడు.

ఆగస్టు పదిహేను. ఆర్ & బి ఆఫీసులో జతీయ జెండా వందనం జరిగింది.

“కొన్ని ఆఫీసుల్లో స్వీట్ల్, హాట్లు తెచ్చుకుని తింటారు. మనమూ తెప్పించుకుంటే పోలా?” అంటూ ఒకరు ఉచిత సలహాపడేశారు.

“మనకి మనమే తెప్పించుకొందాం. తడవ కొకళ్లం ఖర్చుపెడదతాం. ముందు నువ్వు మొదలు పెట్టవోయ్ పిచ్చేశ్శ్వర్రావ్. జూనియర్‌తో మొదలు పెట్టిద్దాం. ఆ తర్వాత మా సీనియర్ల వంతు” అంటూ మరొకరు వంత పాడారు.

“ఓ అలాగే” అంటూ స్వాట్లూ, హాటూ పెద్ద ఫ్లాస్క నిండా కాఫీ తెమ్మని అటెండర్‌ను పంపించాడు.

“ఈయనో పిచ్చి మాలోకం. ఎవరు జేబులు చేయి పెట్టి పైసా బయిటికి తీయరు. అందలో వీళ్లు. ఏ విధంగా రూపాయి పోగేసుకుందామో అని చూస్తూ వుంటారు, కాని ఛస్తే వాళ్లు జన్మలో పైసా ఖర్చుపెట్టరు. వీళ్ల మాటల్ని ఆయన నమ్మేశాడు. వెంటనే సరంజామా తెమ్మని డబ్బుచ్చి పంపుతున్నాడు. నెమ్మదిగా వివరంగా జె.ఇ గారికి అర్ధమయ్యేటట్లు చెప్పాలి” అనుకున్నాడు అటెండరు.

“మొన్న హెలిపాడ్ తాలుకు బిల్లలు ఏమైనా శాంక్షన్ అవతాయా?” అన్న విషయం ఆఫీసులో చర్చకొచ్చింది.

“కల్లో మాట, శాంక్షన్ చేస్తామన్న మాట చెప్తుంది గవర్నమెంట్. మనం కాష్ చేసుకోవటం అంటూ జరిగే సరికి పుష్కర కాలం గడుస్తుంది.”

“డిపార్ట్‌మెంట్ పరువు కోసం యమ్.ఎల్.ఎ.తో పేచీ లేకుండా వుండేందుకు డి.ఇ. గారే జేబుకు చిల్లు పెట్టుకున్నారు.  పైగా ఆయన రిటైర్మెంట్‌కు దగ్గర్లోనూ వున్నారాయే.”

“డి.ఇ ఒక్కడే కాదయ్యా జూనియర్ మోన్ పిచ్చేశ్శ్వర్రావు జేబుకూ పెద్దచిల్లే పడింది. డి.ఇ కైతే ఫరవాలేదు. ఈ జె.ఇ ఆ బొక్కను ఎట్లా పూడ్చుకుంటాడో తెలియదు.”

“ఒక్కసారి ఏకాంట్రాక్టర్ దగ్గరో కళ్లు మూసుకుని వాడు పెట్టమన్న చోట సంతకాలు పెట్టేస్తే పిచ్చేశ్శ్వర్రావు పెట్టిన సొమ్మంతా పుడుతుంది. కాని ఒప్పుకోడుగా.”

“ఆ.. మనవాడికి ధర్మపన్నాలు ఎక్కువగా. ”

“పోను పోను మనందరి కంటే రాటు దేలతాడు లేవయ్యా. ఇప్పుడంటే ఉడుకు రక్తం. నిజాయితీ ఆదర్శాలు ఉండి ఏడుస్తాయిలే” అంటూ ఎవరికి తోచినట్లు వారు వ్యాఖ్యానించారు.

***

ఆ రోజు ఆదివారం. ఆఫీసులోని అటెండరు ఐదారు కిలోల వేరుశనక్కాయలు మూటను తీసుకుని పిచ్చేశ్శ్వర్రావు ఇంటికి వచ్చాడు.

ప్రభావతి అతణ్ణి కూర్చోబెట్టి కాఫీ ఇచ్చింది.

“అబ్బాయ్! ఈ వేరు శనక్కాయలేమిట్రా?” అనడిగింది బామ్మ.

“అమ్మా! నేలపాడు దగ్గర రోడ్డు వేస్తుంటే ఆ పన్లు చూడటానికి మా ఆఫీసు వాళ్లు వెళ్ళారు. అక్కడ రోడ్డు పక్క చేలో వేరుశనక్కాయల్ని కోస్తున్నారు. కాంట్రాక్టరు ఒక బస్తా తెప్పించి తలా కాసిన్ని పంచాడు. మా జె.ఇ గారు మాత్రం తీసుకోకుండా ఆ రైతుకు తానే డబ్బులిచ్చి ఓ పది కిలోలు కొన్నారు. దాంట్లో నన్ను కొన్ని తీసుకుని మిగతావి తెచ్చి ఇంట్లో పడెయ్యమన్నారు. మా జె.ఇ.గారి దారే వేరమ్మా. ఈ డిపార్ట్‌మెంట్‌లో  ఉండవలసినాయన కాదు. ఎప్పుడూ ఆయన జేబులోది వదిలించుకోవడమే. మిగతా అందరూ బయట కూడా డబ్బు పోగు చేసుకొస్తుంటే ఈయనగారేమో వదిలించుకుంటూ వుంటారమ్మా. ఇంట్లో వాళ్లు మీరైనా జాగ్రత్తలు చెప్పాలమ్మా”  అన్నాడు ప్రభావతికేసి తిరిగి.

“రైతుల కష్టార్జితం మనకెందుకు బాబూరావ్! మీ జె.ఇ గారు చేసింది మంచి పనేగా?” అన్నది ప్రభావతి.

తన పెళ్లికి ముందు తన తల్లిదండ్రులు తమ దగ్గర బంధువులన్న మాటలు గుర్తుకొచ్చాయి ప్రభావతికి.

ఆర్&బి లో జె.ఇ. అంటే బోలెడంత రాబడి. దండుకున్నోడికి దండుకున్నంత. మంచి సంబంధం, పోనివ్వద్దు అంటూ తండ్రికి బంధువులు కొంత మంది సలహాల నివ్వటం గుర్తుకొచ్చింది ప్రభావతికి.

బామ్మ ఆలోచనలు వేరేగా వున్నాయి. ఒకళ్లసొమ్ము మన కొద్దు. అన్యాయపు సంపాదన, అక్రమసంపాదన, మంచిది కాదు నిజమే. కాని అమాయికంగా మొఖమాటానికి జేబులో డబ్బు వదిలించుకుంటుంటే ఎలాగ? ఎదో గవర్నమెంటు ఉద్యోగమున్నది. కుర్రవాడు నెమ్మదైనవాడు పిల్లని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడని ప్రభానిచ్చి పెళ్లిచేశాం. పిచ్చేశ్శ్వర్రావుకు మరీ అతి మంచితనం. దాని తగ్గించి మనిషిని కాస్త దారిలో పెట్టాలి అని ఆలోచించసాగింది.

***

బాబూరావు వెళ్లాడో లేదో అపార్టమెంట్‌లోని పిల్లలు వచ్చారు. టిఫిన్లూ గట్రా తిని ఆడుతూ, పాడుతూ ప్రభావతితో కలిసి ఇవ్వాళంతా వంట పనీ, ఇంటి పనీ చక్క బెడతామనుకున్నాడు పిచ్చేశ్స్వర్రావు. ఈ పిల్లలు ఇప్పుడే తలో గేమూ అడమంటారు కాబోలు తనను అని ఆలోచించుకుంటుండగానే “అంకుల్, కారమ్స్ ఆడదామా” అని ఇద్దరూ, “అంకుల్ కింద పార్క్ గ్రౌండ్ కొస్తే కాసేపు బ్యాట్ ఆడదాం” అని ఇద్దరూ పిచ్చేశ్శ్వర్రావుకు రెండు వైపులా చేరి చేతులు పట్టుకుని లాగసాగారు.

వంటింల్లో చేరి రెండోసారి కాఫీ కలుపుకుని తాగుతూ ఏదైనా స్పెషల్ వంటకం ప్లాన్ చేద్దామన్న అలోచనలో వున్నాడు.

“ఈ రోజు కాదు. తర్వాతెప్పుడన్నా ఆడదాం. ఈ రోజునాక్కస్త పని వుంది సరేనా?”

“నెల పైగా ఐపోయింది అంకుల్ మీరు మాతో స్పెండ్ చేసి. ఆంటీ! మీరైనా చెప్పండి ఆంటీ, అంకుల్ని మాతో ఆడమని చెప్పండి” అంటూ మొండిపట్టు పట్టాడు వాళ్లలో ఒకడు. బాచిలర్‌గా వున్నప్పుడు వాళ్లతో కలిసి ఆడుకునేవాడు కాబోలు, ఆ అలవాటు చొప్పున పిల్లలోచ్చారు, ఇప్పుడు తాను కాదంటే పిల్లల దృష్టిలో తాను చెడ్డదాన్ని అయిపోతుంది అనుకున్నది ప్రభావతి.

“మీ అంకుల్‌కి ఏమైనా ఆఫీసు వర్కుందేమో నాకు తెలియదు బాబూ! ఫ్రీగా వుంటే మాత్రం అలాగే ఆడుకోండి” అన్నది ప్రభావతి.

ఇంతలో మరో పిల్ల ఫిఫ్త్ క్లాస్ చదివేది లెక్కల టెక్ట్స్ బుక్కు నోటు బుక్కు పట్టుకొచ్చి “అంకుల్! అంకుల్! ఈ చాప్టర్ నాకర్ధం కావడంలేదు. మమ్మీ మీ దగ్గర కెళ్లి చెప్పించుకోమన్నది” అన్నది.

“ఏయ్ పిల్లా! ఇలారా! నీ పేరేంటి?”

“సుష్మ”

“మీ అమ్మకు రాదా? నీకు చదువు చెప్పటం? ”

“మమ్మీకి వంటింట్లో పనుంది.”

“డాడీ టీ.వీ చూస్తున్నారు”

బ్యాట్ ఆడమని చెయిపట్టుకుని లాగిన పిల్లాడే అంటున్నాడు “అంకుల్! మీరేదైనా పని మీద బజారువెళితే మమ్మీ చెప్పమన్నది తన ఫోన్‌లో బాలెన్స్ వేయించాలట.”

“ఈ రోజూ బజారు కెళ్ళంటం లేదమ్మా. రేపు వెడితే వేయిస్తానుని చెప్పు.”

“ఈ పిల్లలందరికీ ఈ ఇంట్లో బాగా చనువున్నట్లుంది. ఇది వరకంటే బ్రహ్మచారి కొంప. ఏదో ఆడుతూ, పాడుతూ గడిపేశారు. ఇప్పుడెల్లా కుదురుతుంది?  నెమ్మదిగా ఇలాంటివి తగ్గించుకోవాలి. పైగా ఇక్కడి వాళ్లు కొందరు తమ పిల్లల్ని పిచ్చేశ్శ్వర్రావు మీద వదిలి పెట్టి తాము కష్టపడకుండా చూసుకుంటున్నారనుకుంటాను”  అన్న నిర్ణయానికొచ్చింది బామ్మ.

ఇంతలో సెకండ్ ఫ్లోర్‌లో వుండే జానకమ్మొచ్చింది.

“బాగున్నారా బామ్మగారూ! ప్రభావతి, పిచ్చేశ్శ్వర్రావులిద్దరికీ చిన్నతనం. ఇంకొన్నాళ్లు మీరు ఇక్కడే వుండండి. ఉదయాన వెడితే ఎప్పుడో రాత్రి కొస్తారు ఇంజీనీరు గారు. అప్పటిదాకా ఆ పిల్ల ఒక్కత్తే బిక్కుబిక్కుమంటూ వుండాలి. మీరుంటే తనకు సాయంగా వుంటుంది” అంటూనే “పిచ్చేశ్శ్సర్రావుగారూ? కటింగ్ ప్లేయర్ ఒకసారిస్తారూ? కుళాయిల్లో నీళ్లు సరిగా రావటం లేదు. నట్ ఊడదీసి చూస్తాను. మట్టి ఏమైనా చేరిందేమో చూస్తాను. విప్పి మళ్లీ బిగించటం నాక్కుదురుతుందంటారా?  పోయిన సారి మీరు విప్పి శుభ్రంగా క్లీన్ చేసి పెట్టారు. అప్పుట్నుంచీ  ప్రాబ్లమే లేదు. పోనీ ఆదివారమేగా? ఒక్కసారి కాస్త చూసి పెట్టగలరా? ఆయనకేమో ఇవేమీ పట్టవు. నాకా, ఈ పనులు చేతగాదు” అన్నది.

“దానికేం భాగ్యం, వస్తున్నా వుండండి’’ అంటూ చొక్కా వేసుకుని  ఆమె పని చూట్టానికి వెళ్లాడు.

“ఏమే ప్రభావతీ! మీ ఆయన ఇంజనీరా? కుళాయిలు విప్పి బాగుచేసే మెకానిక్కా? ఆవిడొచ్చి పిలవగానే అలా వెళ్లాడేమిటే? వాళ్లేమో ఖర్చు లేకుండా ఈ మానవుడి చేత పనులన్నీ చేయించుకోవాలని చూస్తున్నట్లున్నారు. ఓరి.. నీ.. అసాధ్యం కూలా?”

“ఏమో బామ్మా నాకేం అర్థం కావటంలేదు. నిన్నొకావిడ వచ్చి మా ట్యూబ్‌లైట్ వెలుగుతూ, వెలుగుతూ ఆరిపోతున్నది, కాస్త పిచ్చేశ్శ్వర్రావుగారి నొకసారి వచ్చి చూడమన్నావని చెప్పండి అని ఆర్డరేసి పోయింది. ఎవరికే పని కావల్సోచ్చినా వెళ్లి సాయడుతున్నారనుకుంటాను. అందుకే అందరూ వచ్చి తలోపని అడుగుతున్నారు” అంటూ వంటిట్లో కెళ్ళింది.

ఏమి సాయమో? ఏమిటో అనుకున్నది బామ్మ.

మధ్యాహ్నం పడుకుని లేచిన తర్వాత కబుర్లు చెప్పుకుంటూ వేరుశనగ పకోడీలు చేసుకున్నారు ప్రభావతీ, పిచ్చేశ్శ్వర్రావులు.

“నీక్కాస్త మెత్తని పకోడీ వేశాను తిను బామ్మా” అంటూ ఆమె ముందొక పకోడీ ప్లేటు పెట్టింది ప్రభ. అవి నాలుగూ నోట్లో వేసుకిని వాళ్లద్దరూ శెలవు పూటన్నా కాస్త మురిపెంగా మాట్లాడుకుంటారులే అని బామ్మ లిఫ్ట్ ఎక్కి కిందకు సెల్లార్‌లో కొచ్చింది. వాచ్‌మాన్ పూల మొక్కలకు నీళ్లు పెడుతున్నాడు. అపార్టమెంట్‌కు రెండు మెయిన్ గేట్లున్నాయి. రెండింటి మధ్యలో చక్కగా కాంక్రీట్ చేసివున్నది. ఒకవారగా కూర్చోటానికి అరుగు కట్టివున్నది. బామ్మను చూస్తూనే “మన ఇంజనీరు అయ్యగారు ఇక్కడ కొచ్చిన తర్వాతనే అమ్మా ఇంత బాగు పడింది. అంతకు ముందు మునిసిపాలిటీ వాళ్లు వేసిన రోడ్డు తప్పితే మనలోపలికి రావటానికి కచ్చా  దారే వుండింది. మరో చెక్క ముక్కా వేసి దిమిసేయించారు. అయ్యగారొచ్చాక కంకరా, సిమెంటు తెప్పించి మనుషుల్ని మాట్లాడి పక్కా రస్తా ఏపిచ్చారు. జనాలు కూర్చోవటానికి బక అరుగు వేసిచ్చారు” అని చెప్తూ అవతలి వైపు మొక్కలను తడపటానికి వెళ్లాడు. మొక్కల్ని చూచుకుంటూ మరో వైపుకు నడిచింది బామ్మ. అక్కడ నలుగురైదుగురు ఆడవాళ్లు కూర్చీవేసుకుని కూర్చుని కబుర్లలో మునిగిపోయివున్నారు.

“ఇవాళ మీ ప్లాట్‌లో ఏదో పని చేసినట్లున్నారుగా! సన్నసన్నగా మోతలలు వినపడ్డాయి.” అంది ఒకామె.

“ఆ.. మరే పైపుల్లో మంచి నీళ్లు మరీ సన్నాగా వస్తున్నాయండీ. మన ఆస్థాన వర్కర్ వున్నాడుగా పిచ్చేశ్శ్వర్రావు. అతణ్ణి తీసుకొచ్చి పైపుల్లోని నాబ్‌లన్నీ విప్పించి, బ్రష్‌తో శుభ్రం చేసి మళ్లీ పెట్టించాను. ప్లంబర్‌ను పిలిస్తే చాలు. వందలకు వందలు బిల్లేసిపోతున్నారు. ఇంత కంటే చేసి చచ్చేదేమీ వుండదు” అన్నది పెద్దగా నవ్వుతూ.

“మరీ వర్కర్ అనకండి జానకిగారూ! ఎంతైనా అతను సివిల్ ఇంజినీరు.. ఏదో మొన్నటి దాకా బాచిలర్‌గా వున్నాడు. అన్ని పనులూ వచ్చిన మనిషి. మనం ప్రతిదానికీ మెకానిక్‌ల దగ్గరకు పరుగెత్తుకుపోకుండా ఉపయోగపడుతున్నాడు. ఇప్పుడు పెళ్లైంది. భార్య కాపురానికి వచ్చింది. ఆవిడ ఇలా మనిళ్లకు చీటికీ, మీటికీ రానిస్తుందో లేదో తెలియదు. అక్కడికీ మా వారంటారు. అతను ఆర్&బిలోని ఇంజినీరు, ప్రతి చిన్న దానికీ అతన్ని పిలవటం మర్యాదగా వుండదని.”

“ఏమో? చూద్దాం. జరిగినన్నాళ్లు జరుగుతుంది. అతడు చేసినన్నాళ్లు చేయించుకుందాం. చెయ్యని నాడు డబ్బులు పారేసి టెక్సీషియన్స్‌ను పిలిపించుకుందాం”

అటుగా వచ్చిన బామ్మ వెవరూ గమనించలేదు. కాని ఆ  మాయలన్నీ విన్న బామ్మకు కడుపులో దేవినట్లైంది. నెమ్మదిగా మరలా లిఫ్ట్‌లో పైకొచ్చింది.

“తోటి వాళ్లకు సాయపడదామన్న మంచి తనంతో అడిగిన వాళ్లకల్లా సాయం చేస్తుంటే ఇతన్ని తక్కువ కింద కట్టేస్తున్నారు. ఇవాళ చిన్న ఇంజనీరే. రోజులు గడిచే కొలదీ, అతడే పెద్ద ఇంజనీరవుతాడు” అని ఆలోచించుకుంటూ తమ ఫోర్త్ ఫ్లోర్ కొచ్చేసి వారగా వేసివున్న తమ వెయిన్ డోర్ తలుపును నెమ్మదిగా నెట్టింది.

హాల్లో నట్టింట కూర్చుని విరజిపూలు మాల కట్టుకుంటున్నది ప్రభావతి. కుర్చున్న ఆమె ఒళ్లో తల పెట్టుకుని పిచ్చేశ్శ్వర్రావు పడుకుని ఏవో కబుర్లు చెప్తు ప్రభావతిని నవ్వుస్తూ వున్నాడు. లోపలికొచ్చిన బామ్మను చూచి గబుక్కున లేవబబోయ్యాడు.

“లేవకు నాయినా పడుకో. నాకు ప్రభావతి ఎంతో నువ్వూ అంతే. కలకాలం మీరుద్దరూ కలిసి మెలిసి చల్లగా కాపురం చేసుకోవాటమే మాక్కావలసింది. ప్రభావతి కిక్కడ బాగానే అలవాటుయ్యింది. రెండు రోజుల్లో నేను బయిలుదేరి మావూరెళ్తాను.”

“అప్పుడే ఎందుకండీ బామ్మగారూ? ఇంకా కొన్నాళ్లుండండి.”

“కాదులే వెళ్లాలి నాయినా. నా పన్లు నాకున్నాయి” అంటూ తాను ఓ ముక్కాల పీట మీద కూర్చుని వంగి విరజాజి పూలు నాలుగు, నాలుగు తీసి గుత్తులుగా పెట్టి ప్రభావతి కందించసాగింది.

“చూడు నాయినా పిచ్చేశ్శ్వర్రావు! నీ మీద అభిమానంతో కొన్ని మాటలు చెబ్దామనుకుంటున్నాను. తప్పుగా అనుకోవుగా! ”

“భలే వారే బామ్మగారు. మా మంచి కోరి చేప్పే మాటల్ని నేనెలా తప్పుగా అనుకుంటాను? ”

“ఎవరి మాటల్ని తప్పుగా అనుకోని మంచి మనసు నీది. ఆ సంగతి నాకు బాగా అర్థమయింది. చూడు నాయినా! ఆఫీస్‌లో అటెండరయినా తన ఇంటికెళ్తే యజమాని అతనే. యజమానిగా తాను గౌరవిస్తూ మిగతా వాళ్లు కూడా తన భర్తను గౌరవించాలని ప్రతి భార్య కోరుకుంటంది. తనని తేలిక చేసిన దాని కంటే తన భర్తను చులకన చేస్తుంటే ఏ భార్యా భరించలేదు.

ప్రతి వాళ్లకు మంచితనముండాలి. ఎదుటి వాళ్లకు సాయపడే గుణమూ  వుండాలి. అంత కన్నా ముఖ్యమైంది నిజాయితీ. ఆ నిజాయితీ అనేది తన కాళ్లకు సంకెళ్లు వేసేదిగా మాత్రం మారగూడదు. తన మనుగడకే అపాయంగాను మారగుడదు. ఇదంతా ఎందుక్కానీ మా ప్రభావతికి చిన్నప్పటి నుంచీ నా దగ్గర కథలు చెప్పించుకోవటం చాలా ఇష్టం. నేను ఊరెళ్లే ముందు ఒక చిన్న కథ చెప్పి పోతాను. ఇద్దరూ వినండి అన్నది బామ్మ.

“కథా” అంటూ నవ్వుతూ లేచి కూర్చున్నాడు పిచ్చేశ్శ్వర్రావు.

“వెనకటి రోజుల్లో ఒక అడవి వుండేది. ఆ అడవిలో ఒక నాగుపాము మిగతా జంతువులతో పాటు తను కూడా వుండేది. ఎప్పుటూ కూడా మనుషుల్ని కాని, జంతువుల్ని కాని కాటు వేసేది కాదు. చిన్న, చితకా కప్పల్ని, ఎలుకల్నీ పట్టుకుని తిని ఆకలి తీర్చుకునేది. ఆ అడవి లోనే కొంచెం దూరంగా ఒక మునీశ్వరుడు కుటీరం కట్టుకుని తపస్సు చేసుకుంటూ వుంటేవాడు. ఒక రోజు పాము ఆ ఋషి దగ్గరకెళ్లింది. “మునీశ్వరా! నేను పాపాలేమీ చెయ్యకుడా ప్రశాంతంగా బతకాలని వున్నది. అలాగే వుంటున్నాను. తోటి ప్రాములకు ఏమైనా ఉపకారం చెయ్యాలని వున్నది. నాకేదైనా ఉపాయం చెప్పండి” అని ప్రాధేయపడ్డది. “అలా అయితే  ఎప్పుడూ కూడా ఎవర్నీ కరవకుండా నాలాగా సాధుజీవితం గడుపు. ఎవరి జోలికీ వెళ్లకుండా వుంటే నీ జోలికీ ఎవరూ రారు. తోటి ప్రాణులకు నువ్వు చేసే పెద్ద ఉపకారం అదే అవుతుంది. అలా వుంటే నీకు ప్రశాంతంగా మిగతా వారికీ హాయిగా వుంటుంది” అని చెప్పి పంపాడు. పాము సంతోషించి వెళ్లిపోయింది. మునీశ్వరుడు చెప్పాడుగదా అని తనకూ భయమేమీ వుండదనుకుని పుట్టలు నుంచి బయటకు ఎక్కువగా రాసాగింది. దొరికిన ఆహారాన్ని తింటూ దారి పక్కగా వుంటూ ప్రశాంతంగా కాలం గడుపుదామనుకున్నది. కొన్ని రోజులు గడిచాయి. బాగా బక్కచిక్కి వళ్లంతా దెబ్బలతో, మరలా మునీశ్వరుడి దగ్గరకొచ్చింది. ముని కారణమడిగాడు. “మీరు చెప్పినట్లే దారి పక్కన పడి వుంటూ ఎవరికీ హాని చేయకుండా వుండే దానిని. తోటి వారికి మేలు చేస్తున్నాననుకున్నాను. మెదలకుండా వురుకుంటూన్నానని పిల్లలూ, పెద్దలూ, రాళ్లతోనూ, కర్రలతోనూ అకారణంగా నన్ను కొడుతున్నారు. ఆ దెబ్బలతో వళ్లంతా గాయాలయ్యాయి చూడండి” అంటూ చూపించింది.

“అనవసరింగా ఎవరినీ కాటు వేయకుండా మంచిగా సాధువులాగ వుండమని చెప్పాను, కాని బుస పెట్టటం నీ సహజ స్వభావం. నువ్వు బుస పెట్టటం ప్రారంభించగానే నిన్ను కొట్టాలనుకున్న వాళ్లు భయపడి దూరం పోతాలు. నిన్ను బుస పెట్టవద్దని నేను చెప్పలేదే” అని అన్నాడు ముని.

ఆ మాటలుతో సాధువుగా వుంటూనే తన్నుతాను ఎలా కాపాడుకోవాలో పాముకు అర్థమైయింది. ఆనాటి నుంచీ తన జోలి కైవరైనా వస్తే బుస పెట్టి తన్ను తాను రక్షించుకోసాగింది. ఇప్పడీ కథ ఎందుకు చెప్పనో అర్థం చేసుకో పిచ్చేశ్శ్వర్రావ్. నువ్వు కూడా అతి మంచితనంతో అందర్నీ నెత్తికెక్కించుకోకు. అలాగే ఆఫీసులోనూ  మితిమీరిన పనులు నెత్తిన వేసుకోవద్దు. అనవసర ఖర్చుల కోసం జేబులు ఖాళీ చేసుకోవద్దు. దాన్ని అలుసుగా తీసుకుని చాకిరీ అంతా నీ నెత్తిన రుద్ది కొంతమంది స్వంత పెత్తనాలు చేసుకుంటారు. పాము లాంటి క్రూర స్వభావం నీకుందని నిన్ను పోల్చటం కాదు. మెత్తగా వుంటే పాము లాంటి దానిని గూడా ఇబ్బందులకు గురిచేస్తారని చెప్పడమేనా ఉద్దేశం. మరో మాట. నిన్ను లంచాలు తీసుకోమని నేను చెప్పను. ఇతరులకతి సహాయం చెయ్యవద్దనీ నేను చెప్పను. కాని సమయం, సందర్భం చూసుకో. రేపట్నంచీ నీకు పిల్లా పీచూ పుట్టుకొస్తారు. అన్నింటా జాగ్రత్త పడటం అలవాటు చేసుకో. చుట్టు పక్కల వాళ్లకు కూడా శృతి మించి సాయం చేస్తూపోతే జీతం, బత్తం లేని నౌకరు కింద జమగట్టి తేలిక చేస్తారు. చివరికి పిల్లలు కూడా తేలికగా చూస్తారు. నీ స్థానాన్ని, నీ ఉద్యోగ స్థాయినీ తగ్గకుండా చూసుకో.

“కుర్ర సన్నాసిలాగా కాకుండా హుందాగావుండాలి అని చెప్తుంది బామ్మ. అర్థమైందా శ్రీవారూ?  వాళ్లకు దండెం తీగ తెగిందనీ, వీళ్ల గ్యాస్ పొయ్య రిపేరు వచ్చిందనీ రెంచీలూ, పట్టకార పట్టుకుని అదే పనిగా పరుగెట్టకూడదని” అంటూ సందర్భం వచ్చింది గదాని తన మనసులోని ఉద్దేశమూ చెప్పేసింది ప్రభావతి.

“నా మనవరాలూ అంతా పసికడ్తూనే వున్నది. ఇక దిగుల్లేదు” అనుకుంటూ బామ్మ లేచి లోపలి కెళ్లింది. పాము కనువిప్పు పిచ్చేశ్శ్వర్రావుకు బాగా నచ్చింది.

***

పెళ్లైన తొలి సంవత్సరం సంక్రాంతి పండక్కొచ్చారు ప్రభావతీ, పిచ్చేశ్శ్వర్రావులు.

“సంక్రాంతి, పండక్కి మీకేం కానుక కావాలో చెప్పండల్లుడుగారూ” అనడిగారు అత్తమామలు.

పెళ్లి అయిన కొత్తలో అయితే “అబ్బేబ్బే మాకేం వద్దండీ. అన్నీ వున్నాయి ” అంటూ తెగ మొగమాట పడిపోయేవాడు. కాని ఇప్పుడలా అనలా. “మీ అమ్మాయినడగండీ, ఆమేది అడిగితే అది కొనిపెట్టిండి” అన్నాడు గడుసుగా.

“బామ్మా! నువ్వ చెప్పొచ్చిన కథను మా ఆయన బాగా వంటబట్టించుకున్నాడు. మాటలూ, పనులూ అన్నింటా ఆచితూచి అనసరమన్నంత వరకే ఉపయేగిస్తున్నాడు. పిచ్చేశ్శ్వర్రావుగారు బాగా మారిపోయారు. ఇది వరకట్లాగాదు. పెళ్లం వచ్చి మార్చేసిందని నన్నే అందరూ ఆడిపోసుంటున్నారు”  అన్నది ప్రభావతి.

“అంటే అన్నారు లేవే. పిచ్చేశ్శ్వర్రావుకు చిన్నతనంపోయి గాంభీర్యం వచ్చింది” అన్నది మెచ్చుకోలుగా బామ్మ.