52. మన్నించండి

0
9

[box type=’note’ fontsize=’16’] సంచిక నిర్వహించిన 2018 దీపావళి కథల పోటీలో న్యాయనిర్ణేతలు/సంపాదకుల ఎంపికలో ప్రోత్సాహక బహుమతి పొందిన కథ. రచన: ముమ్మిడి శ్యామలా రాణి. [/box]

[dropcap]”సు[/dropcap]మిత్రా! కాస్త కాఫీ తీసుకురా. ఎందుకో తెలియదు తల పగిలిపోతున్నది. వేడిగా కాఫీ తాగితే తలనొప్పి తగ్గుతుందంటావు కదా” అన్నాదు నిరంజనరావు.

“పనంతా చేసి ఇప్పుడే నడుము వాల్చాను. నా వల్ల కాదు. ఫ్రిజ్‌లో పాలున్నాయి. వేడి చేసుకుని ఒక స్పూను పంచదార, ఒక స్పూన్ కాఫీ పొడి పాలలో కలుపుకుని తాగండి” అంది సుమిత్ర.

సుమిత్ర మాటలకు షాక్ అయ్యాడు.

***

ఒకప్పుడు ‘తలనొప్పిగా ఉంది సుమిత్రా’ అని అంటే పెద్ద హడావిడి చేసి, వేడిగా కాఫీ పెట్టి తెచ్చి, దగ్గరుండి కాఫీ తాగించి, ‘ఇప్పుడు తలనొప్పి తగ్గిందాండీ?’ అని ఆత్రుతగా సుమిత్ర అడగడం చూసి… కాస్త రిలీఫ్ అనిపించినా ‘ఆఁ… తగ్గింది’ అనేవాడు. గర్వంగా చేతిలోనున్న ఖాళీ కాఫీ కప్పువైపు చూసి, ‘ఇంకా వంట చేయలేదు, బోలెడు పని ఉంది’ అని గబగబా వెళ్ళిపోయేది.

పెళ్ళయి నలభై ఏళ్ళు దాటుతోంది. ఇప్పటి వరకూ ఏనాడూ మంచినీళ్ళు కూడా తను తీసుకుని తాగలేదు. మంచినీళ్ళ కోసం తను లేవబోతే… నేను నీళ్ళు తెస్తానని గబగబా వెళ్ళి నీళ్ళు తెచ్చి ఇచ్చేది. ఇద్దరు పిల్లలతో, గంపెడు చాకిరీ ఒక్క చేత్తో చేసేది. ఇంటిపనే కాదు, బజారు పనులు కూడా ఒక్కతే చక్కబెట్టేది. ఆఫీసు నుండి తను ఇంటికి వచ్చేటప్పటికి ఇద్దరు పిల్లలతో హోం వర్క్ చేయిస్తూ కనబడేది. తను ఫ్రెషప్ అయ్యేసరికి కాఫీ తెచ్చిచ్చి, ‘సౌమ్యా, సందీప్‌లడిగారని స్నాక్స్ చేశాను. మీకవి అంతగా ఇష్టం ఉండవుగా, వేడిగా రెండు దోశలు వేసి తెస్తాను’ అని అంటే, ‘అబ్బా సుమిత్రా! ఇప్పుడు నా కోసం ప్రత్యేకించి దోశలు వేయనక్కర్లేదు. ఖాళీగా కూర్చోలేవా?’ అని అంటే ‘భలేవారే! మీ కోసం చేసే పని నాకు బరువు అనుకున్నారా? అన్నట్లు సౌమ్య, సందీప్‌లకు రేపటి నుండి యూనిట్ ఎగ్జామ్స్. కాస్త ఎక్కువ సేపు చదువు చెప్పండి’ అనేది. పనీ, ఇల్లే లోకం క్రింద సుమిత్ర ఉండేది. సౌమ్య, సందీప్‌‍లకు తను చదువు చెపుతుంటే, ఈలోపు వంట చేసి, చదవడం అయిపోయిన సౌమ్య, సందీప్‌లకు ఎంతో ఓర్పుగా కబుర్లు చెబుతూ అన్నం తినిపించేది.

“పెద్దవాళ్ళవుతున్నారు పిల్లలు. వాళ్ళని తిననీయ్” అని తను అంటే, “వాళ్ళయితే కడుపు నిండా తినరండి. అయినా నా చేత్తో తినిపిస్తేనే నాకు తృప్తిగా ఉంటుంది” అనేది సుమిత్ర. రాత్రి పూటయినా పెందలాడే పడుకోకుండా… “ఏవండీ! సందీప్‌కి తలనొప్పిగా ఉందట. కాళ్ళు కూడా పీకుతున్నాయట. ఈ రోజు స్కూల్లో ఫుట్‌బాల్ ఆడాడట. సందీప్ తలపై నూనె వేసి మర్దనా చేసి, కాళ్ళు పిసుకుతానండి” అని ఒకసారి; “సౌమ్య తలనిండా పేలు పట్టాయి, స్కూల్లో ఏ పిల్లల తలలో పేలో సౌమ్య తలలో చేరాయి. ఆదివారం దాకా ఊరుకుంటే పేలు ఎక్కువైపోతాయి. ఆ పని చూస్తాను” అని సౌమ్య తల ఒళ్ళో పెట్టుకుని పేలన్నీ తీస్తూ ఉండేది. అర్ధరాత్రి దాకా ఓపికగా సౌమ్య తలలో పేలు తీస్తూ అలాగే నిద్రపోయేది. పిల్లల కోడిలా ఎప్పుడూ సౌమ్య, సందీప్‌లతోనే ఉండేది. సుమిత్ర జీవితంలో ఎక్కువ సమయం పిల్లల గురించి, వాళ్ళకిష్టమైనవి వండి చేసి పెట్టడం గురించి, అంత బిజీలో కూడా తనకేమైతే ఇష్టమో అవి తన్నక్కొడి కోసమే చేయడం, ఇంట్లో అందరినీ సంతోషంగా ఉంచడం కోసమే శ్రమించేది. వయసు పెరుగుతున్నా, పిల్లలు పెద్దవాళ్ళయినా, తన పట్ల, పిల్లల పట్ల, పనిలో గాని, శ్రమపడడంలోగాని సుమిత్రలో ఏ మార్పు లేదు.

సౌమ్య, సందీప్‌లకు ఉద్యోగాలు రావడం, పెళ్ళిళ్ళు అయిపోయి, ఇద్దరూ బెంగుళూరు వెళ్ళడం జరిగినాక ఒక్కసారి సుమిత్రలో నిస్సహాయత, ఏదో తెలియని దిగులు చోటు చేసుకుంది. “సౌమ్యా, సందీప్‍లను విడిచిపెట్టి ఉండలేనేమో అనిపిస్తుందండి” అని అప్పుడప్పుడు తన దగ్గర సుమిత్ర కళ్ళనీళ్ళు పెట్టుకునేది. “ఇది లోకసహజం. నువ్విలా దిగులుగా ఉంటే ఎలాగ? మన పిల్లలు.. వాళ్ళకు నీ గురించి, నీ ప్రేమ గురించి తెలుసు. ఈ వయసులో మనల్ని ఒంటరిగా వదలకూడదు, అమ్మ మన గురించి బెంగ పెట్టుకుంటుందనుకుంటే… సౌమ్య, సందీప్‌లు మనల్ని వాళ్ళ దగ్గరకు తీసుకువెళతారు.. లేదా వాళ్ళంత దూరం ఆలోచించకపోతే… వీలయినప్పుడల్లా ఇక్కడకు వచ్చి… కొద్ది రోజులు మనతో గడిపి.. సంతోషపెడతారు” అన్నాడు నిరంజనరావు.

“అలా అంటారేమిటండీ? ఆడపిల్ల సౌమ్య… దానికి మనల్ని దాని ఇంటికి తీసుకువెళ్ళాలని ఉన్నా ఎక్కడ కుదురుతుందండీ?” అంది సుమిత్ర.

“నువ్వన్న మాట ఈ కాలానికి వర్తించదు సుమిత్రా. ఈ కాలంలో ఆడా… మగా సమానంగా చదువుతున్నారు… ఆస్తి ఉంటే సమానంగా పంచుకుంటున్నారు కాబట్టి తల్లిదండ్రుల బాధ్యత సమానంగా తీసుకోవాలి.”

“ఏమో అవన్నీ నాకు తెలియదు. నేను… నేనే ఇలా పిల్లలు దూరంగా ఉన్నారని వాళ్ళని విడిచి ఉండలేక బాధపడుతున్నానంటారా? లేక నాలాగే అందరూ బాధపడుతున్నారంటారా?” అని అమాయకంగా నిరంజనరావు మొహంలోకి చూసింది సుమిత్ర.

“సుమిత్రా! లోకంలో ఎన్నో రకాల ప్రేమలుంటాయి. మనుషుల ప్రవర్తన బట్టి ప్రేమలో కూడా దాని స్థానం మారుతుంటుంది. కొందరు ప్రేమకి అతిగా రియాక్ట్ అవుతారు. మరికొందరు ప్రేమను నార్మల్‌గా తీసుకుంటారు. నిజం చెప్పాలంటే, నువ్వు సౌమ్య, సందీప్‌లను అతిగా ప్రేమిస్తున్నావు. అన్ని ప్రేమల్లో నిస్వార్థమైన, నిక్కచ్చయిన ప్రేమ ఎవరికైనా దొరికేది ఒక్క తల్లిదండ్రుల దగ్గరే! తక్కిన ప్రేమలన్నీ ఇచ్చి పుచ్చుకోవడం మీద ఆధారపడి ఉంటాయి. వయసులో ఉన్నవాళ్ళు… ఇద్దరిలో ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడినాకే, ఇద్దరి మధ్యా ప్రేమ పుడుతుంది. ఇద్దరిలో ఏ ఒక్కరు కాదన్నా, ప్రేమనేది ఉండదు. అలాగే అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ములు, ఇలా మనుషులు మధ్య రక్త సంబంధం ఉన్నా, ఒకరిని ఒకరు అభిమానిస్తేనే, వారి మధ్య ప్రేమకు చోటుంటుంది. కాని తల్లిదండ్రులు… పిల్లల నుండి ఏమీ ఆశించరు. ఇచ్చి పుచ్చుకోడాలు, లెక్కలు, వేటికీ తావుండదు. రెక్కలొచ్చిన పిల్లలు తల్లిదండ్రులను ప్రేమించినా, లేకపోయినా వీసమెత్తు ప్రేమ పిల్లల పట్ల తగ్గదు. నిజం చెప్పాలంటే తండ్రి కన్నా తల్లిలో కాస్త మమకారం, అభిమానం, ఆప్యాయతా, అనురాగాల పాలు ఎక్కువే! దానికి కారణం… బిడ్డను నవమాసాలు కడుపులో మోసి, బిడ్డకు జన్మ ఇచ్చినందుకో, తన రక్తాన్ని పాల రూపంలో బిడ్దకు ఇచ్చినందుకో, బిడ్డ తన కాళ్ళ మీద తాను నిలబడేవరకు, తప్పటడుగులు వేసి పడిపోకుండా కాపాడినందుకో లేక బిడ్డ ఉన్నత స్థానంలోకి వచ్చెవరకు నీడలా బిడ్డ వెంట ఉండి సపర్యలు చేసినందుకో… తెలియదు గానీ తండ్రి కన్నా తల్లే పిల్లలకు దగ్గిరవుతుంది. ఆ దగ్గిర కావడం వలనే తండ్రి కన్నా తల్లికి పిల్లలంటే అపారమైన ప్రేమ ఏర్పడుతుంది.”

గభాలున వచ్చి నిరంజనరావు ఒళ్ళో చిన్నపిల్లలా తల పెట్టి కన్నీళ్ళతో… “మీరు… మీరు ఎంత బాగా చెప్పారండి. సౌమ్య, సందీప్‌ల దగ్గిరే చివరి రోజులు సంతోషంగా గడపాలనిపిస్తుంది. వీలవుతుందంటారా?” ఆశగా అడిగింది సుమిత్ర.

“తప్పకుండా వీలవుతుంది. ఎందుకంటే అందరికంటే ఎక్కువగా… అటు మీ అన్నయ్యవాళ్ళ పిల్లలను… ఇటు మా అన్న, అక్కయ్య వాళ్ళ పిల్లలను పెంచేదానికన్నా పదిరెట్లు ఎక్కువ మమకారంతో, శ్రద్ధతో, సౌమ్య సందీప్‌లను పెంచావ్!… అంత బాధ్యతగా పిల్లలను పెంచితే నువ్వు పిల్లల తోటిదే లోకంలా పెంచావు సరదాలు… సంతోషాలు ఎన్నో వాళ్ళ కోసం వద్దనుకున్నావు. ఈ రోజు వాళ్ళ నుండి నువ్వు – ఇది కావాలి, అది కావాలని వాళ్ళకు సాధ్యం కానిది ఏదీ కోరడం లేదు. వాళ్ళతో కలిసి జీవించాలనుకుంటున్నావ్! ఇప్పుడే నీ మనసులో మాట సౌమ్యా, సందీప్‌లకు తెలియజేస్తాను. త్వరలో వాళ్ళు వచ్చి మనిద్దరిని వాళ్ళ దగ్గరకు తీసుకువెళతారు” అన్నాడు.

అంతే! ఆ రోజు నుండి సౌమ్య, సందీప్‌ల దగ్గరనుండి తియ్యటి కబురు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూడసాగింది సుమిత్ర.

ఒకరోజు జ్వరంతో మూసిన కన్ను తెరవలేదు సుమిత్ర. రోజూ వచ్చే పనిమనిషి కూడా ఆ రోజు రాలేదు. నిరంజనరావుకి ఏం చేయాలో తెలియలేదు. డాక్టరు ఇచ్చిన మందులు వేసుకుని స్పృహ లేకుందా పడి ఉంది సుమిత్ర. అయ్యో పాపం సుమిత్ర తన వయసు, శక్తి అన్నీ ఈ ఇంటి కోసం ధారపోసింది. కనీసం కాఫీ అయినా కలిపి సుమిత్రకి ఇవ్వాలి అని తనలో అనుకుని వంటగదిలోకి వెళ్ళి కష్టం మీద కాఫీ కలిపి, బలవంతంగా సుమిత్రని లేపి కాఫీ తాగించబోయాడు. కొంచెం తాగి కంగారు, నీరసంగా అంది సుమిత్ర – “ఏంటండీ? ఇది కాపీనా? కాపీలా లేదండీ.. వేప కషాయంలా ఉంది. వద్దండీ” అని. అయినా వినిపించుకోకుండా బలవంతంగా సుమిత్రతో తాగించబోతే వాంతి చేసుకుంది.

తను చేసిన కాఫీకే పేర్లు పెడుతుందా అని తాగబోయి వాంతు రాబోతుంటే కాఫీ కప్పు గభాలున డైనింగ్ టేబుల్ పైన పెట్టి సింక్ దగ్గరకు పరిగెత్తాడు. అప్పటి నుండి ఇప్పటిదాక తను చస్తే పొయ్యి దగ్గరకు వెళ్ళలేదు. వంట్లో బాగుండకపోయినా, ముక్కుతూ, మూలుగుతూ సుమిత్రే వంట చేస్తుంది. ఏదైనా సహాయం చేద్దామని వెళితే, నవ్వుతూ, “వద్దులెండి. మీరలా కూర్చోండి. నేను చేస్తాను” అనేది. కానీ ఈ మధ్యన ఒంట్లో బాగున్నా, తను ఖాళీగా ఉన్నా ఏదో ఒక పని చేయమని పురమాయిస్తోంది… అప్పుడప్పుడు చిరాగ్గా, కోపంగా – “మీకు ఎన్నాళ్ళు సేవలు చెయ్యాలి? మీకే కాదు నాకూ వయసు పెరిగింది. ఎప్పటిలా అన్నీ అమర్చి టేబుల్ మీద పెట్టలేను. ఒక పని చేయండి. మీకిష్టమైన వంటలు కొన్నయినా నెమ్మదిగా నేర్చుకోండి. ఇదేం బ్రహ్మ విద్య కాదు, అయినా చచ్చేవరకు నేనే చేయాలని రూలేం లేదు కదా” అని అనడం మొదలుపెట్టింది సుమిత్ర.

సుమిత్ర… కొత్త మనిషిలా మాట్లాడుతుంది ఏమిటి? అయినా కొత్తగా తను వంట నేర్చుకోడం ఏమిటి?

“నీకు వంట చెయ్యడం ఇష్టం లేకపోతే వంట మనిషిని పెట్టుకో సుమిత్రా” అని అనగానే కోపంగా ఇంత ఎత్తున లేచింది.

“వయసు పైబడిన వాళ్ళం, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. వంటమనిషి వండినవి తింటే త్వరలో హాస్పటల్ పాలవుతాం. ఇష్టం వచ్చినట్లు నూనె పోసి వండేస్తారు. అయినా వాళ్ళు సక్రమంగా రోజూ పనిలోకి వస్తారని అనుకుంటున్నారా? ఆదివారాలు ఎగ్గొడతారు. మధ్య మధ్యలో పండుగలనీ, ఒంట్లో బాగుండలేదని శలవులు పెడతారు. ఏదో ఒక వంక చూపెడుతూ శలవులు పెడుతూనే ఉంటారు. గుప్పెడు మెతుకులు పడేస్తే ఇంటిని కాపలా కాసే విశ్వాసం గల కుక్కలా, మెడలో తాళి కడితే తనువు చాలించేదాక, తన కుటుంబం కోసం కోసం కష్టపడే భార్యలా పనివాళ్ళుండరు” అని మొదటిసారిగా చాంతాడంత ఉపన్యాసం ఇచ్చింది సుమిత్ర.

అసలు అకస్మాత్తుగా సుమిత్ర ఇంత మొండిగా, కోపంగా తయారవడానికి కారణం ఏమై ఉంటుంది? అని ఆలోచించగా, నిరంజనరావుకి గభాలున గుర్తు వచ్చింది. అవును! సౌమ్య, సందీప్‌ల దగ్గరకు బెంగుళురు వెళ్ళి, తిరిగి వచ్చినాకే సుమిత్ర ప్రవర్తనలో మార్పు వచ్చింది. అప్పటి నుండి తన మీద చిరాకు పడడం, వంట చేయడం నేర్చుకోమనడం మొదలుపెట్టింది. పిల్లలు సుమిత్ర పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తించి ఆమె మనసు బాధ పెట్టారా? అక్కడున్నన్నాళ్ళూ సౌమ్య, సందీప్‌లలో తమ పట్ల మునుపు చూపించిన అభిమానం, ప్రేమ ఇప్పుడు బాగా తగ్గినట్లే అనిపించింది. మాటల్లో, చేతల్లో విసుగు, చిరాకు కనిపించినా పిల్లలు పెద్దవాళ్ళయ్యారు, చిన్నప్పటిలా ఎలా ఉంటారని సరిపెట్టుకున్నాడు. అయినా ఇందులో బాధపడడానికి, ఆశ్చర్యపోడానికి ఏముంది? పిల్లల తోటిదే లోకం క్రింద తల్లిదండ్రులు బ్రతకడం; తల్లిదండ్రులు గుదిబండల్లా తయారయ్యారని కొంతమంది పిల్లలు అనుకోవడం సమాజంలో అప్పుడప్పుడూ చూస్తునే ఉన్నాం, అయినా చిన్నతనం వల్ల ఇప్పుడు ఇలా ప్రవర్తించినా, తరువాత వాళ్ళే తమ తప్పు తెలుసుకుని, “అమ్మా!” అంటూ తిరిగి పిల్లలు ప్రేమ చూపించకుండా ఉంటారా? ఈ మాత్రం దానికి తను బాధపడిపోయి, మధ్యలో నా మీద కారాలు మిరియాలు నూరితే ఎలాగు? పోనీ ఎవరిని అనక, తననే అంటున్నా ఈ వయసులో తను చెయ్యి కాల్చుకోవడం ఏమిటి? పట్టుబట్టి తనకి వంట నేర్పడం ఏమిటి? ఏమైనా అంటే మీకే కానీ రిటైర్‌మెంట్ నాకు లేదా? ఒంట్లో బాగుండకపోయినా నేనే వంట చేయాల? అని ప్రశ్నలు వేస్తుంది సుమిత్ర. మనిషిలో ఏదో నిస్సత్తువ. ముఖంలో ఏదో నిస్పృహలాంటి బాధ కనిపిస్తుంటే – “ఏం జరిగింది సుమిత్రా? నాతో కాకపోతే ఎవరికి చెబుతావు? చెప్పు సుమిత్రా…” అంటే అంత ఎత్తున లేచి కోపంగా అంది:

“సరేలెండి, చచ్చేవరకూ నేనే వంట చేస్తాను లెండి. ఇప్పుడు కాదు తరువాత బాధ పడతారు” అని అనగానే కంగారుగా దగ్గరకు వెళ్ళి “ఓకే.. ఓకే. సుమిత్రా నీ కోసం తప్పకుండా వంట చెయ్యడం నేర్చుకుంటాను. సుమిత్రా! నీ బాధ అర్థం అయింది… చిన్నతనం… సౌమ్య, సందీప్‌లు మన దగ్గిర ఉన్న చనువు కొద్దీ తెలివి తక్కువగా ఏమైనా అన్నా బాధ పెట్టుకోకూడదు. పిల్లలు దూరం అయి నీ మనసు దేని మీద లగ్నం కాక, బాధతో ఏవేవో నన్ను అంటున్నావ్! అయినా నన్ను కాకపోతే ఎవరిని అంటావ్” అని సుమిత్రని ఊరుకోబెట్టాడు.

***

కాని… ఇప్పుడు తలనొప్పిగా ఉందంటే పరిగెత్తుకుని వెళ్ళి కాఫీ తెచ్చి ‘వేడిగానే కాఫీ తాగండి’ అని దగ్గర నిలబడే సుమిత్ర… నన్ను కాఫీ కలుపుకుని తాగమని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది. బాధగా కళ్ళు మూసుకున్నాడు నిరంజనరావు.

బారెడు పొద్దెక్కింది. లేచి కాలకృత్యాలు తీర్చుకుని… గదిలోకి వెళ్ళి ఇంకా మంచం మీద నిద్రపోతున్న సుమిత్రను చూసి తనలో తాను చిన్నగా నవ్వుకున్నాడు.

సుమిత్ర ముఖంలో ఎంతో ప్రశాంతత కనిపించింది. పిచ్చి సుమిత్ర… పిల్లల విషయంలో ఏవేవో ఊహించుకుంది. ‘ప్చ్… నీది తప్పులేదు సుమిత్రా! మన ఇద్దరి జీవితాలు పిల్లల చేతుల్లో ప్రశాంతంగా సంతోషంగా సాగిపోవాలని కోరుకున్నావు. కానీ వాళ్ళిద్దరూ… మనిద్దరం వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళ ప్రైవసీకీ, ప్రశాంతతకు, ఇంకా ఎన్నో అడ్డంకులు ఉంటాయనుకున్నారు. నీ ఒక్క పిల్లలే కాదు, లోకంలో చాలామంది పిల్లలు ఇలానే అనుకుంటున్నారు. పిల్లలు చిన్నప్పుడే కాదు… పెద్దవాళ్ళయ్యాక కూడా వాళ్ళే మన ఊపిరి, ప్రాణం అనుకుంటూ బ్రతుకుతాం. కాని వాళ్ళు తల్లిదండ్రుల్ని గుడిబండల్లా ఉన్నారని అనుకుంటారు. మనం కళ్ళల్లో పెట్తుకొని పిల్లలను చూస్తే, వాళ్ళు మనల్ని కంటిలో నలకల్లా అనుకుంటారు. ఇది కొత్త కథేం కాదు, పాత కథే. అలా అని నువ్వు మనసు కష్టపెట్టుకొని, నన్ను బాధపెట్టడం మొదలుపెట్టావు. నా మీద ఎప్పుడూ చూపించే ప్రేమ ఏమైంది సుమిత్రా? నాకు నా పాత సుమిత్ర కావాలి’ అని అనుకుంటూ దగ్గరకు వెళ్ళి ప్రేమగా సుమిత్ర తల మీద చెయ్యి వేసి నిమురుతూ.. “నీ కోపం ఎన్నాళ్ళులే! తాటాకు చప్పుళ్ళ లాంటిది. త్వరలోనే నువ్వు నా పాత సుమిత్రలా అవుతావు. ఆ నమ్మకం నాకుండి” అని అనుకుని గభాలున ఆలోచన వచ్చి… వంటింట్లోకి వెళ్ళి రెండు కాఫీ కప్పుల నిండా కాఫీ కలిపి గదిలోకి నడుస్తూ… ‘అవును! పిల్లలు ఇవ్వలేని సంతోషం సుమిత్రకి తను ఇవ్వాలి… తనని నా వైపు తిప్పుకోవాలి…’ అనుకుని సుమిత్ర తల పక్కనే కూర్చుని, “లే సుమిత్రా!… ఏం చేసానో చూడు. బ్రహ్మాండంగా కాఫీ కలిపాను.. తాగి చూడు… ఈ రోజు నేనే వంట చేస్తాను. అసలు నువ్వు వంట గదిలోకి రానక్కరలేదు. టి.విలో “గోపురం”, “ఓంకారం” ఏదో ఒక ప్రోగ్రాం చూసుకో. మన కోసం మనం సంతోషంగా బ్రతకాలి సుమిత్రా! నేను ఇంతలా మాట్లాడుతుంటే ఇంకా నిద్రపోతున్నావు ఏమిటి సుమిత్రా? లే…లేచి కాఫీ తాగు అని సుమిత్ర కళ్లు తెరవకపోవడంతో కాఫీ కప్పులు మంచం ప్రక్కనే ఉన్న టీపాయ్ మీద పెట్టి, నిద్రపోతున్న సుమిత్ర వైపు కంగారుగా చూసి “సుమిత్రా అని కదిపి చూసి చలనం లేకపోవడంతో సుమిత్రా” అని బాధగా గట్టిగా కేకవేసాడు నిరంజనరావు. కళ్లనుండి కన్నీళ్లు జారసాగాయి.

***

సౌమ్యా, సందీప్.. వాళ్ళ గదుల్లో వెళ్ళి పడుకున్నారు. గదిలోకి వచ్చి మంచం మీద నిస్సత్తువగా వాలాడు నిరంజనరావు. ప్రక్కకు తిరిగి చూసాడు. ఖాళీగా ఉంది స్థలం. నలభై సంవత్కరాలుగా తన ప్రక్కనే సుమిత్ర ఉండేది. తనకి నిద్ర వస్తుందని చెబుతున్నా కబుర్లు చెబుతూనే ఉండేది. కాని ఇప్పుడు సుమిత్ర లేదు. అప్యాయంగా చేయివేసి ఖాళీ స్థలం అంతా నిమిరాడు. ‘సుమిత్రా అకస్మాత్తుగా నన్ను ఒంటరివాడిని చేసి వెళ్ళిపోయావు. నీకు గుండె నొప్పి రావడం ఏమిటి? అసలు.. నువ్వు ఇలా అర్థాంతరంగా చనిపోతావని కలలో కూడా అనుకోలేదు’. కళ్ళల్లో నీళ్లు జారుతుండగా నెమ్మదిగా తలగడ మీద చెయ్యి వేసి ప్రేమగా గట్టిగా పట్టుకొని ‘సుమిత్రా నన్ను వదలి ఎక్కడికి వెళ్లిపోయావు? నువ్వు లేకుండా.. నేను.. నేను..ఎలా బ్రతకాలి?’ అని బాధగా కళ్లు మూసుకున్నాడు నిరంజనరావు.

“ఏమండీ!.. ఎప్పటి నుండో మీకు ఉత్తరం వ్రాయాలని కోరిక ఉండేది. ఆ కోరిక తీరలేదునుకున్నా సమయంలో ప్చ్.. కోరిక తీరే మార్గం లభించింది. నిజం చెప్పాలంటే ఈ ఉత్తరం నా మొదటి, ఆఖరి ఉత్తరం కావచ్చు. మీకు తెలుసు కదా? నాకు అమ్మ, నాన్న లేరు. అన్నదమ్ములు నా పెళ్ళి చేసి చేతులు దులుపుకున్నారు. ఏనాడు పుట్టింటికి రమ్మని పిలవలేదు. అసలు ఉత్తరం వ్రాసే అవకాశమే దొరకలేదు. నేను మీకు వ్రాసిన ఉత్తరం.. నేను మీకు దూరం అయినాకే చదవండి. అయ్యో కంగారుపడుతున్నట్లున్నారు. అలా కంగారు పడితే ఎలాగండి? మనం చివరి మజిలీలో ఉన్నాం. ఎప్పుడో ఒకప్పుడు ఒకరు ముందు ఒకరు వెనుక. వినడానికి భయంగా, బాధగా ఉన్నా తప్పదండి. నాకు మాత్రం మీ చేతుల్లో హాయిగా సంతోషంగా పోవాలని ఉందండి. ఎందుకంటే మీరు లేకుండా ఒంటరిగా నేను ఎలా బ్రతకగలను చెప్పిండి?” అంది సుమిత్ర.

ఈ మధ్యన ఇలానే పిచ్చి పట్టినదానిలా సుమిత్ర మాట్లాడుతోంది. కాని ఆ ఉత్తరం ఎందుకు వ్రాసినట్లు? ఏ వ్రాసింది? అసలు ఉత్తరం వ్రాయడం ఏమిటి? ఈ విషయం తను పెద్దగా పట్టించుకోలేదు. కొంపదీసి సుమిత్ర పిల్లల మీద బెంగతో ఏ అఘాయిత్యం చేయలేద కదా? లేదే సహజ మరణమే!… అయితే… గబగబా వెళ్ళి కప్‌బోర్డు తెరిచి ఉత్తరం కోసం వెతికాడు. పెళ్ళినాటి పాత ఆల్బమ్‌లో కవరు కనిపించింది. ఆ కవరు మీద నిరంజనరావుగారికి, సుమిత్ర అని ఉంది. ఆ ఉత్తరం చేతిలోకి తీసుకున్నాడు. ఏదో తెలియని ఉద్వేగం.. ఆరాటం ఆత్రుత. గబగబా కవరు ఓపెన్ చేసి చదవసగాడు.

ప్రియమైన శ్రీవారికి,

మీరు… నన్ను ముందు ‘మన్నించండి’. నా ప్రవర్తనతో నా చేతలతో మిమ్మలను చాలా బాధపెట్టాను. జీవితంలో ఇటువంటి రోజు వస్తుందని ఊహించలేదండి. బహుశా ఊహించకపోవడం నా తెలివితక్కువతనమే!… బలవంతుడి చేతిలో బలహీనుడు ఓడిపోలేడని తెలుసు, కాని కని పెంచి ప్రాణపదంగా చూసిన పిల్లల చేతుల్లో తల్లిదండ్రులు అవమానించబడతారనుకోలేదు. పిచ్చిదానిని. చిన్నతనంలో పిల్లలకు తోడు నీడగా తల్లి దండ్రులుంటారు, పెద్ద వయసులో తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా పిల్లలుంటారనుకున్నాను. ఎందరో నిరాశ్రయులైన తల్లిదండ్రులను చూసాక కూడా నా నిర్ణయం మారలేదు. వాళ్ళలా నా పిల్లలు మాత్రం ఉండరనుకున్నాను. ఆ ఆశే నన్ను నిరాశకు గురిచేసింది. మనం సౌమ్య, సందీప్‌ల దగ్గరకు బెంగుళూరు వెళ్లాం. సౌమ్య, సందీప్‌లను చూస్తూ సంతోషంతో పొంగిపోతూ, వాళ్ళకు కావలసినవన్నీ వండి పెడుతూ, కొసరి కొసరి తినిపిస్తూ, నేను అదృష్టవంతురాలిని… ఇంతటి సంతోషం ఎంత మంది తల్లిదండ్రులకు దక్కుతుందనుకున్నాను. కాని పిల్లలిద్దరూ, వాళ్ల చేష్టలతో, మాటలతో గుండెకి తూట్లు పొడిచారు. అడుగు వేసినా, మాటాడినా, వాళ్ళ దృష్టిలో తప్పుగానే కనబడేది. మన ఇంట్లో పనిమనిషికైనా స్వాతంత్రం ఉంది కాని నాకు అక్కడ లేదు. ప్రతీ పని అడిగి చేయాలి. ప్రతీది వాళ్ళు చెప్పినట్లు వండాలి. అంతే కాదు… వాళ్ళు పసివాళ్లుగా ఉన్నప్పుడు నేను వాళ్లని ఏవేవో అన్నానట. ఎప్పుడో ఒక దెబ్బ వేసానట. పెద్దయ్యాక కూడా సౌమ్యని ఏవెవో అన్నానట. ఎన్నో తప్పులు చేసానట. ఆ తప్పులు సౌమ్య మనసుని బాధించాయట. నా బిడ్డల పట్ల నేను తప్పు చేసానా అని ఎంత అత్మపరిశీలన చేసుకున్నా నా తప్పులు ఏమిటో నాకు తెలియడం లేదండి. అయినా సరే మనల్ని తన దగ్గరకు రానిచ్చినందకు ఏదో గొప్ప ఘనకార్యం చేసినట్లు సౌమ్య మాట్లాడింది. ఏం తినాలన్నా, తాగాలన్నా తినే తిండిలో తాగే వాటిలో కూడ వ్యత్యాసాలు. మీకిష్టమైనవి వండడానికి, అక్కడ స్వాతంత్రం లేదు. పాపం మీ లోకంలో మీరు కాలక్షేపం చేస్తూ ఉండేవారు. మీ గురించి నేను పట్టించుకోకపోయినా నన్ను మీరు ఏమి అనేవారు కాదు.

అంతటితో అయితే ఈ ఉత్తరం మీకు వ్రాసేదానిని కాదు. ఒక రోజు అనుకోకుండా సౌమ్య, సందీప్‌ల మాటలు విన్నాను. ఆ నిమిషంలోనే ప్రాణం పోతే బాగుండునని అనుకున్నానండి. నా బాధ మీతో చెప్పుకోకపోతే ఎవరితో చెప్పకోగలనండి. అందుకే ఉత్తరం వ్రాయడం మొదలు పెట్టాను. ఇంతకీ సౌమ్య, సందీప్‌లు ఏం అన్నారో తెలుసా? వాళ్ల మాటల్లోనే చదవండి.

“సందీప్!.. అమ్మా, నాన్నలు వచ్చి నాలుగు రోజులవుతుంది. ఇంతకీ ముందు నువ్వు వాళ్లని ఉంచుకుంటవా? నన్ను ఉంచుకోమంటావా?”

“సౌమ్యా!… ముందు వాళ్ళని నీ దగ్గరే పెట్టుకో!”

“నా దగ్గిర అంటా వేమిటిరా? అవిడని చూస్తుంటే ఆవిడ చేసిన పనులన్ని గుర్తు వస్తున్నాయ్!.. ఆ విషయలన్నీ అలా ఉంచు. ఏంటి అలా తయారయింది? ఓల్డ్ లుక్. ఇక ఆయన గురించి చెప్పక్కరనేలేదు అలా ఉంటే నాకు చాలా చిరాకు రా”.

“అలా అంటే ఎలా? నాకెంత బాధ్యత ఉందో నీకు అంతే ఉంది. అంటే వాళ్లిద్దరిని నా దగ్గిరే ఉంచుకోమంటవా? నా వల్ల కాదు. అయినా నాతో సమానంగా చదివావ్!.. ఆస్తిలో సమాన వాటా రాసారు. వాళ్లని చూడడంలో నీ బాధ్యత కూడా ఉంది.”

“ఏంట్రా.. అంత ఆవేశపడిపోతున్నావ్? అసలు తల్లిదండ్రులను కొడుకులే చూసుకోవాలి. నేను చూడనంటే ఏం చేస్తావ్? చచ్చినట్లు నువ్వే చూస్తావ్! అసలు మనిద్దరం పోట్లాడుకునే అవకాశం త్వరలోనే వస్తుంది. ఈవిడైతే కనీసం పోయేవరకైనా వంటచేస్తుంది ఆయనైతే గెస్టులా కూర్చుంటాడు. ఇప్పటి వరకు ఆయన్ని చిన్న పిల్లాడిలా చూసింది. గ్లాసుతో నీళ్లు కూడా తీసుకోరు. కొంపదీసి ఆవిడ ముందు పోయి, ఈయన ఉండిపోయారనుకో పరిస్థితి ఎలా ఉంటుందో చూడు.”

“అవును… నువ్వు చెప్పింది కరక్టే!.. నువ్వు చెప్పినట్లు జరిగిందనుకో… నెమ్మదిగా ఈయన్ని తీసుకు వెళ్ళి వృధ్ధాశ్రమంలో దించి వచ్చేద్దాం.”

“ఏమండీ!… ఇంకా ఎన్నో అన్నారు. ఆ మాటలు విని నా గుండే ఇంకా ఎందుకు ఆగిపోలేదనిపించింది. ఇన్నాళ్ళు పిల్లలను చూస్తూ సంతోషంగా గడపాలన్న కోరిక ఎటో వెళ్ళిపోయింది. ఇప్పుడు నా ముందు ఉన్నది ఒక్కటి ధ్యేయం పిల్లలన్నట్లు నేను ముందు పోయి మీరు ఉండిపోతే! మీ పరిస్థితి ఏమిటి? హోటల్ ఫుడ్ అస్సలు మీరు ఇష్టపడరు.

కష్టం అయినా మీరు వంట నేర్చుకోవాలి. మీ కోసం వండకోవాలి. అంతకు మించి వేరే దారి కనబడ లేదు. అంతే!… ఆలోచన రావడమే తడవుగా మీ పట్ల కఠినంగా ప్రవర్తించి, మీతో పని చేయించడం మొదలుపెట్టాను. పొరపాటున కూడ మీరు పిల్లల దగ్గరకు వెళ్ళి బాధపెట్టకుండి. కష్టం అయినా మీ కోసం మీరు వండుకొని స్వాతంత్రంగా, సంతోషంగా ఉండండి.”

ఇక ఉత్తరం ముందుకి చదవ లేక మడిచి ‘సుమిత్రా! నీకు గుండె నొప్పిరావడం ఏమిటనుకున్నాను. ఇంతటి బాధను గుండెలో దాచుకొని, చనిపోయే చివరి నిమిషం వరకు నా కోసం ఆలోచించి నలిగిపోయిన నీ గుండె ఆగిపోకుండా ఎలా ఉంటుంది?’ అప్యాయంగా గుండెకి ఉత్తరం హత్తుకొని కళ్లు మూసుకున్నాడు నిరంజనరావు.

పెట్టెలు తీసుకొని హాలులోకి వచ్చిన సౌమ్య. సందీప్‌లు సోఫాలో లుంగీలో కూర్చుని పేపరు చదువుతున్న నిరంజనరావుని చూసి “ఇంకా మీరు రెడీ కాలేదా? అని ఇద్దరూ ఒకేసారి అన్నారు.”

“నేను రావడం లేదర్రా.. మీరు వెళ్ళండి” అన్నాడు.

కంగారుగా సౌమ్య, సందీప్‌లు ఒకరి మొఖాలు ఒకరు చూసుకున్నారు.

“ఒక్కరూ ఇంట్లో ఎలా ఉంటారు?” అన్నాడు సందీప్.

చిన్నగా నవ్వి అన్నాడు “నేను ఒక్కడ్ని ఉండడం ఏమిటిరా? మీ అమ్మ జ్ఞాపకాలు తలచుకుంటూ సంతోషంగా గడిపేయగలను. ట్రైన్‌కి టైమ్ అవుతుంది. టిఫిన్ తినండి. ఫ్లాస్కులో కాఫీ ఉంది” అన్నాడు నిరంజనరావు.

గిన్నెలో ఉన్న ఉప్మా ప్లేటులో పెట్టుకొని, సౌమ్య, సందీప్‌లు తినడం మొదలు పెట్టారు.

“ఉప్మా చాలా బావుంది కదూ?” అంది సౌమ్య.

“అచ్చం అమ్మ చేసిన జీడిపప్పు ఉప్మాలాగానే ఉంది. ఇలాంటి ఉప్మా తిని ఎన్నాళ్లయిందో? నాన్నా!.. మీకు వంట మంగమ్మ ఎలా చేస్తుందో అనుకున్నాను. ఉప్మా బ్రహ్మండంగా చేసింది. నిన్నటి వరకు కేటరింగ్ ఫుడ్ తిని నోరు చచ్చిపోయింది” అని ఫ్లాస్కులో కాఫీ కప్పులో పోసి తాగి “వావ్ బ్రహ్మండంగా చేసింది కాఫీ… అయితే మంగమ్మ బెస్ట్‌కుక్ అన్నమాట” అన్నాడు సందీప్.

“ఇంకా మంగ పనిలోకి రాలేదమ్మా” అన్నాడు.

“మరి ఎవరు చేసారు, ఉప్మా, కాఫీ?” ఇద్దరూ ఒకే సారి కంగారుగా అన్నారు.

“నేనే చేసానర్రా” అన్నాడు నిరంజనరావు.

“మీరా.. మీరు ఉప్మా, కాఫీ చేసారా?” అని సౌమ్యా, సందీప్‌లు ఆశ్చర్యంగా కంగారుగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు.