[box type=’note’ fontsize=’16’] 2018 దసరా కవితల పోటీలలో ప్రత్యేక బహుమతి పొందిన కవిత.
[/box]
రాజర్షి ఖేలుడు
నిర్వచన కథాప్రబంధం
సుగంధి:-
శ్రీనివాస పాదసేవఁజేయుచున్న నన్నిలన్
శ్రీనివాస తేజమంతఁజేరి వాణి దివ్యతన్
మానసాన నిల్పి దివ్య మందహాస భావనల్
కానుకివ్వ; కావ్యకాంతకాంతికూపీరూదితిన్ (1)
తే.గీ.
అయ్యగణపయ్యకుకుడుములారబెట్టి
ఆరుమోముల సామికి హారతిచ్చి
మూడుకన్నులవాడిని ముక్తినడిగి
తల్లి పార్వతి పదసీమ తలనువాత్తు (2)
తే.గీ.
జానకమ్మ మెచ్చిన రామచంద్రమూర్తి
సేవనందున నిల్చిన చిత్తమందు
తామసాగ్నులు చేరవు ధరణి మీద
మోక్షకాంతులు కనుముందు మూర్తిగవ్వు (3)
ఆ.వె.
తల్లి దేవతన్న ధర్మకాంతుల మధ్య
తండ్రి దేవుడన్న తలపులందు
గురువు దేవుడన్న గురుధర్మమందున
భరతభూమి వెలిగే భవ్య రీతి (4)
తే.గీ.
తెలుగు పద్యాల సొబగున తేనెలూరు
తెలుగు పద్యపునాదిన వెలుగు చుండు
నవరసాల నవగణిత నవ్యతంత
వెలుగు; శాస్త్రీయభావాల పెంపుతోటి (5)
ఆ.వె.
గురువు, లఘువు రెండు గుర్తులున్నను చాలు
తెలుగుపద్యమలరు జిలుగుతోటి
గణన యంత్రభాష ఘనముగనిల రెండు
చిహ్నములయందె; సాగేను చిత్రమిదియె (6)
తే.గీ.
తెలుగు గణగుణ తేజస్సు తెలియకుండ
పద్యమునుపాతి పెట్టగ పదపదమని
పలుకుచుండెడివారి కవనమునందు
శాస్త్ర తేజము శూన్యము సత్యమిదియే (7)
తే.గీ.
దివ్య వేదాంగములయందు దినకరునిగ
వెలుగు ఛందస్సున; గణిత వెలుగుకలదు.
శాస్త్ర దృష్టినఁ జూచెడి చదువులన్ని
ఛందమందలి గణితము చదువునెపుడు (8)
తే.గీ.
కనుము; గతకాలమందునే; గణపునాది
మీద, తెలుగు పద్యంబుల మేనునుంచి
రసమయంబుగ; తమ భావరాగమంత
తెల్పినారు పూర్వకవులు; దివ్య యతులు (9)
ఆ.వె.
సూర్యగణవికాస సుగతిన ప్రవచన
గణితముంది; బీజగణితముంది;
నేటి గణితసూత్ర నియమాల తేజంబు;
నాడే కలదు కవన వాడితోటి (10)
తే.గీ.
గణిత తేజాన వెలుగొందు ఘనగణాల
గతిన రాజర్షి ఖేలుని కాంతినంత
తెలుగు పద్యము పులకించ తెలియఁ జేతు
వేదభారతి కరుణించ విఙ్ఞనయ్యి (11)
తే.గీ.
ఓం అనగ విశ్వకంపనమోయి జీవ
కంపనంబున పుట్టిన కాంతిరూపు
నిత్య పారాయణంబున నిల్వ; ఖేల
భూపతి గుణమంత నచటే; పుట్టి పెరిగే (12)
స్వాగతం:
రాగభావ రసరాజిత ఖేలున్
ఆగమాల పతి యాతడే యంటున్
యాగశాల నవ యజ్ఞముఁ సేయన్
రాగ మోదమున రమ్మని పిల్చున్ (13)
తే.గీ.
దివ్య రాజర్షి ఖేలుని తేజమంత
బాలభానుని కిరణాల వెలుగుచుండ
సూర్యదేవుని మనసునఁ జూచుకొనుచు
తోయమర్పించే; ఖేలుడు తుష్టితోటి (14)
తే.గీ.
సోమమందున తారాడు సోమతేజ!
కృష్ణవర్ణజగతినుండి కృపతనువున
సురనరాళిని రక్షించగ సూర్యదేవ!
కనక నిర్మిత రథమున కదలిరార! (15)
తే.గీ
విశ్వకర్మసుతుడవయ్య విశ్వమేలు
సూర్యదేవ! సోమరసపు సోయగాన
ప్రాణమయ్యి వెలుగుచున్న భవ్య తేజ!
వందనాలయ్య! మార్తాండ! వందనాలు (16)
తే.గీ.
కన్నతల్లి యెవరు నీకు కాంతి తేజ!
బాలభానుడ! వుదయించి ప్రతిదినంబు
మహిత జగమంత వెలిగించి; మమ్ముకాచు
సూర్యనారాయణ! ప్రణవ సుందరాంగ! (17)
తే.గీ.
భువిన భూపాలరాగాలు భూసురగణ
బీజమంత్రాలు కలబోసి పిలువ నిన్ను
లోకమంత వెలుగునిచ్చు లోకనాథ
ధర్మ తేజాన రావయ్య ధర్మచరిత (18)
తే.గీ.
సురనదుల కెరటాలపై సుగతికోరి
వెలుగు చిమ్మేటి కిరణాల వెలుగునందు
జగతి మానసమంతయు జయజయమని
నవరసాలపాటలు పాడె; నలువలాగ (19)
తే.గీ.
ప్రణవ రాజర్షి ఖేలుని వదనదీప్తి
భక్తి సంద్రాన మునగంగ భవ్య రాజు
మానసంబున కదలాడే మాన్య చరిత
సురసరస్వతీ నది భవసోయగంబు (20)
తే.గీ.
అమ్మ! గంగమ్మ! కదలాడు అవని మనది
తల్లి! యమునమ్మ! జలమంత తన్మయంబె!
యిల సరస్వతీనీటిన వెలుగు జిలుగు
ముగ్గురమ్మలు దీవించ మోక్ష పథమె (21)
తే.గీ.
శారదానదీతరగల సరిగమలకు
బాలభానుడు పులకించ వసుధ మీద
కిరణ కెరటాలకాంతిన ఖేలుని మనసు
సుథన సంచరించనాతని చూపు మెరిసే (22)
తే.గీ.
మెరుపు చూపుల ఖేలుడు మెరుపు తీగ
వలె; సరస్వతీనది ముందు నిలచి మోక
రిల్లె దివ్యహవిస్సులు తల్లికివ్వ
సిద్ధమనే భక్తి భావన చేర మదిన (23)
తే.గీ.
దివ్యధినుసుల మంత్రాల దీప్తినందు
రూపమందు హవిస్సుల రూపమందు
దివ్య సుర తేజమలరారు దివిన భువిన
స్వీకరించ హవిస్సును సిరిగ రమ్ము (24)
తే.గీ.
శాస్త్రపథపు హవిస్సుల శక్తి నంత
సర్వవేదాల సారము సన్నుతించె
దివ్యహయ్యంగవీనపు దీప్తినందు
ప్రాణ తేజ హవిస్సుల ప్రసరణుంది (25)
తే.గీ.
సురులకు నరుడు శాస్త్రీయ శుద్ధినందు
వెలుగుతుండు. హవిస్సును విద్యగివ్వ
వింత వింతల కాంతిన వేల్పుసిరులు
నరునకు సురత్వమిచ్చు భూనభములందు (26)
తే.గీ.
శాస్త్రహీన హవిస్సులె సత్యమనుచు
వాటి వెనుకనె పోయెడి వారలంత
నరక కష్టాల మాటున నడిచి నడిచి
కఠిన చిత్తాన వదులును కరుణనంత (27)
తే.గీ.
సోమరసమందు వెలిగేను సూర్యశక్తి
చంద్రతేజము రయమున సతతమొకటి
గయ్యి సోమశక్తిని పెంచు కరుణ తేజ!
ధరణినహవిస్సునంతయు త్రాగరమ్ము (28)
తే.గీ.
యాగవేదికలందున నమరివుండు
గణిత తత్వమునంతయు గమనమందు
నిల్పకున్నను ఫలమంత నిష్పలంబె
దుష్ఫలంబున మరణము తొంగిచూచు (29)
తే.గీ
పక్షి రూపున హంసరూపమున యాగ
వేదికలు నూటయెనిమిది పేర్లతోటి
వెలుగుచున్నవి నిక్కము వెలుగులందు
వెలుగు గణితసూత్రగరిమ వెలుగుదీప్తి (30)
తే.గీ.
నీ చరణసీమ సాక్షిగ నేను చెప్పు
మాటలివి నిప్పులాంటివి మాత నమ్ము
ఋతహవిస్సుల ప్రాణాన్ని ఋతపథాన
ధారపోయగ నేనుంటి ధర్మచరిత (31)
తే.గీ
ఖేలవచనాలమాటున తేలు ఋతము
విన్న భారతి దరహాస విలువఁజెప్ప
వేదవేదాంతాలనెరుగు వేల్పుబృంద
తరముకాదు పంచాగ్నుల తరముకాదు (32)
స్వాగతం:
వాణివమ్మ రసవాక్కుల మాటున్
రాణివమ్మ నవరాగముకున్ పా
రాణివమ్మ సిరిరాగమునందున్
వేణివమ్మ ఘన వేల్పుల తల్లీ (33)
తే.గీ.
మంత్రి భాష్కలుడన్నను మనసువిప్పి
మాటలాడు భేలుడెపుడు మమతతోటి
రాజదర్శనార్థము మంత్రి రాజు వద్ద కేగ
రాజుచూడనేలేదు జగతి మరచి (34)
తే.గీ
యాగశాలల నిర్మాణ యత్నమందు
మురిసిపోయెడి రారాజు ముదమునెరిగి
గతమునందున భూపాల గమనమంత
గుర్తు చేసుకొనియె మంత్రి కుశలశీలి (35)
స్వాగతం:
యాగరూపములు యాగ సుకీర్తుల్
యాగ తేజములు యాగ సుదీప్తుల్
యాగలోకములు యాగములన్నిన్
యాగఖేలునికినన్నియు తెల్సున్ (36)
చంద్రిక:
జయము జయము చంద్రలేజమా
జయము జయము సత్యరూపమా
జయము జయము సత్వపాలకా
జయము జయము శాస్త్ర వేదమా (37)
తేగీ.
గరుడరూపాన వెలుగొందు కాంతిదీప్తి
హంసరూపాన మెరిసేటి హంసదీప్తి
పద్మరూపాననలరారు పసిడిదీప్తి
యాగనిర్మాణ గణితాన జగతీదాగె (38)
తే.గీ
నూట యెనిమిది రూపాల నూత్న యాగ
శాలల నడుమ ఖేలుడు సత్య తేజ
శీలిగ వెలిగి; మునివరాశీస్సులన్ని
రాజు తనువును చుట్టంగ రాగశీలి (39)
తే.గీ.
రాజ రూపాన యాగాగ్ని రక్తిచెంద
బ్రహ్మవిష్ణుమహేశ్వర భవ్య సిరులు
ఖేల రారాజు రూపున కలిసివుండె
ఖేల దీప్తిన యాగాలు గిరిధరంబె (40)