65 ఏళ్ళ మాయాబజార్

4
13

[dropcap]2[/dropcap]008లో ఉద్యోగరీత్యా నేను మెక్సికోలో ఉన్నాను. అప్పటికి ఇంకా లాప్‌టాప్‌ల వినియోగం పెరగలేదు. స్మార్ట్ ఫోన్లు మార్కెట్ లోకి వచ్చి ఏడాది కూడా అవలేదు. నాకు అప్పుడే ఆఫీసు వాళ్ళు లాప్‌టాప్ ఇచ్చారు. మా ఆఫీసులోని మెక్సికన్ సహచరుడితో మట్లాడుతుండగా లాప్‌టాప్‌ల గురించి ప్రస్తావన వచ్చింది. ఎంత సౌకర్యం, ఎంత సౌలభ్యం అనుకున్నాము. లాప్‌టాప్‌లో వీడియో కాల్స్ కూడా చేసుకోవచ్చు అని అబ్బురపడ్డాము. 50 ఏళ్ళ క్రితమే ఒక సినిమాలో ఇలాంటి వీడియో కాల్స్ చూపించారని అన్నాను. ఆ వస్తువు కూడా అచ్చం లాప్‌టాప్ లాగే ఉంటుందని చెప్పాను. అతను అలాగా అన్నాడు. అతను నిజంగా ఇంప్రెస్ అయ్యాడో లేదో తెలియదు కానీ మాయాబజార్ లోని ప్రియదర్శిని గురించి చెప్పినందుకు గర్వంగా అనిపించింది.

ఆ తర్వాత ఏడెనిమిదేళ్ళకు అరచేతిలోనే వీడియో కాల్స్ మామూలైపోయాయి. ‘స్టార్ వార్స్’లో ఇలాంటివి ముందే చూపించారని మురిసిపోయారు సినిమాప్రియులు. “రవి కాంచనిచో కవి గాంచున్” అన్నట్లు సినిమా వాళ్ళు ఎన్నో వింతలను ముందే ఊహించారు.

మాయాబజార్ లో వైఫై ఉన్నట్టు ఏమీ చూపించలేదు. ప్రియదర్శినిలో తమకు ఇష్టమైన వారే కనిపిస్తారు. అంటే మనసుని గుర్తించి పని చేసే వైఫై అన్నమాట. బలరాముడు ప్రియదర్శినిలో చూస్తే దుర్యోధనుడు కనిపిస్తాడు. “నా ప్రియ శిష్యుడు” అని మీసం మెలివేస్తాడు బలరాముడు. రేవతీ దేవి చూస్తే నగలు, చీని చీనాంబరాలు కనిపిస్తాయి. “రుక్మిణి నా పక్కనే ఉంది. ఆమె కోరుకున్నది నాకు కనిపించిందేమో!” అని మూతి విరుస్తుంది. కృష్ణుడిని చూడమంటే అర్జునుడే కనిపిస్తాడు లెండి అంటాడు. “ఈ మాత్రానికి రుక్మిణి ఏమీ అనుకోదు గానీ చూడవయ్యా” అంటుంది రేవతీ దేవి. కృష్ణుడు చూస్తే జూదానికి ఆహ్వానిస్తూ శకుని కనిపిస్తాడు.

ఈ ఒక్క సన్నివేశంలో ఎన్ని విషయాలు చెప్పారు స్క్రీన్ ప్లే రచయిత కె. వి. రెడ్డి, మాటల రచయిత పింగళి నాగేంద్రరావు! బలరాముడు దుర్యోధనుడిని సమర్థిస్తాడని ముందే చెప్పారు. రేవతీ దేవికి ఐశ్యర్యమంటే మోజు అని చెప్పారు. అయినా పైకి మాత్రం నాకేం అలాంటి ఆశలు లేవంటుంది. ముందు ముందు పాండవులు అడవుల పాలైతే అభిమన్యుడికి తన కూతురిని ఇచ్చి అడవుల పాలు చేయలేనని అంటుంది. తిరిగి ఈ సన్నివేశంలోకి వస్తే రేవతీ దేవి మరిది అయిన కృష్ణుడిని ఆటపట్టిస్తుంది, మామూలుగా వదినలు ఆటపట్టించినట్టే. అంటే కృష్ణుడికి రుక్మిణి కాక వేరే స్త్రీలు కనిపించినా ఎవరూ ఆశ్చర్యపోనక్కరలేదని చెప్పటం. కృష్ణుడికి శకుని కనిపించటంలో ఆంతర్యం భగవంతుడికి ఇదంతా ఒక లీల. ధర్మసంస్థాపనార్థం పాండవులకి అవమానం జరగాలి, వారు యుద్ధం చేయాలి, దురాత్ములని ఓడించాలి, భూభారం తగ్గాలి. అందుకే పాండవుల అవమానానికి కారణమైన శకుని అంటే కృష్ణుడికి ఇష్టమని చూపించారు. రామాయణంలో రాముడికి పట్టాభిషేకమై రాజైతే రావణసంహారం ఎలా? అందుకే కైకేయికి వక్రమైన బుద్ధి పుట్టింది. అలాంటిదే ఇదీ. మనం తెలియక కొందరిని తిట్టుకుంటాం కానీ ఎవరి కష్టాలకీ ఎవరూ కారణం కాదు ఈ జగన్నాటకంలో. శకుని కృష్ణుడికి ఇష్టుడని చూపించిన కె. వి. రెడ్డి, పింగళి ఎంతటి వేదాంతులో కదా!

ఇలాంటి వేదాంతమే తర్వాత ఘటోత్కచుడు ద్వారకకు వచ్చినపుడు కనిపిస్తుంది. శశిరేఖ కోసం వెతుకుతూ ఆమెను పోల్చుకోలేక తికమక పడుతుంటాడు. “పూర్వం లంకలో మా పెదనాన్న హనుమంతులవారు పడ్డ స్థితిలో పడ్డాను” అనుకుంటాడు. తన తండ్రి వాయుపుత్రుడైన భీముడు. అంటే వాయుపుత్రుడైన హనుమంతుడు తనకి పెదనాన్న వరసే కదా! హనుమంతుడు కూడా లంకలో సీత కోసం వెతుకుతూ అలాగే తికమక పడ్డాడు. తత్త్వాలు పాడుకుంటున్న ఒక వృద్ధుడిని శశిరేఖ జాడ చెప్పమని అహంకారంగా అడిగితే అతను తనను మోసుకుని పోతే చూపిస్తానంటాడు. ఎత్తటానికి ప్రయత్నిస్తే కదలడు. చివరికి ఆ వృద్ధుడే కృష్ణుడని తెలిసి శరణాగతి చేస్తాడు ఘటోత్కచుడు. ఎంత బలమున్నా దైవానుగ్రహం కూడా ఉండాలని అంతరార్థం.

‘మాయాబజార్’ని తెలుగు వారి కథగా నిలబెట్టారు. అసలు బావామరదళ్ళు పెళ్ళి చేసుకోవటం దక్షిణభారతంలోనే ఉంది, ఉత్తరభారతంలో లేదు. దీనికి తోడు ఆంధ్రశాకం ‘గోంగూర’ ప్రస్తావనతో తెలుగువారు పులకించాల్సిందే. అలాగే అరిశెలూ, కజ్జికాయలూ. ఆడపడుచుల్ని దెప్పిపొడిచే వదిన గార్లు, పెళ్ళింట్లో బెట్టు చేసే మగపెళ్ళివారు ఇవన్నీ తెలుగు ఇళ్ళలో కనిపించేవే. పాండవులు అరణ్యవాసానికి వెళ్ళాక పుట్టింటికి వచ్చిన సుభద్రను ఆహ్వానించకుండా రేవతీ దేవి తలనొప్పి సాకుతో తన అంతఃపురంలో ఉంటుంది. సుభద్ర కృష్ణుని ఇంటికి వెళ్ళి తర్వాత పెద్ద వదినను పలకరించటానికి వస్తుంది. చిన్నన్నయ్య వాళ్ళు ఆ ఇంటికి తీసుకువెళ్ళారు అంటుంది. “ఏ ఇంటికి వెళితే ఏం? నాకా పట్టింపులేం లేవు. ఇక అందరం ఇక్కడుండవలసినవాళ్ళమేగా ఈ పన్నెండేళ్ళూనూ” అంటుంది రేవతీ దేవి. అందులోని శ్లేష సులభంగానే అర్థమౌతుంది. “చెడి పుట్టింటికి చేరకూడదు” అని బాధపడుతుంది సుభద్ర. దుర్యోధనుడితో వియ్యానికి సిద్ధపడిన బలరాముడిని ఇది భావ్యమేనా అని అడుగుతుంది. ఇవన్నీ నిత్యం ఎదురయ్యే సంఘటనలే.

పెళ్ళి ఇంట్లో మర్యాదలకు పులకించిపోయి ఆడపెళ్ళివారిని పొగుడుతారు కౌరవుల ఆస్థాన పండితులు శాస్త్రి, శర్మ. “మీరు ఉద్దండపండితులే గానీ మీకు ఉండవలసిన బుద్ధి మాత్రం లేదయ్యా” అంటాడు శకుని. ఇందులోని పదాల్లో ప్రాస పింగళి పాండిత్యానికి ప్రతీక. “అది బావులేదు, ఇది బావులేదు అని బెట్టు చేయాలి” అని ఉపదేశిస్తాడు శకుని. యాదవులంటే కౌరవులకున్న చిన్నచూపుని ఈ కల్పిత కథలో కూడా ఔచిత్యం తప్పకుండా చూపించారు. మన ఇళ్ళలో ఉండే పట్టింపులని తెరపై చూసి కనెక్ట్ అయిపోతారు ప్రేక్షకులు. పెళ్ళిలో తెర పట్టడం కూడా తెలుగు సంప్రదాయమే, ఉత్తరాదిలో లేదు.

సావిత్రి నట విశ్వరూపం ఈ చిత్రంలో చూస్తాం. బావతో సరసాలాడే శశి, తల్లిపై తిరగబడే శశి, తండ్రి మాటను జవదాటలేని శశి, ఘటోత్కచుని ఆహార్యం ఒంటబట్టించుకున్న మాయాశశి, శకునిని ఆటపట్టించే శశి, లక్ష్మణకుమారుణ్ని ముప్పతిప్పలు పెట్టే శశి – ఇలా ఎన్నో కోణాలు. “సుందరి నీవంటి దివ్యస్వరూపం” పాట ఘంటసాల పాడుతుంటే మాటలు పలికింది సావిత్రి. ఒకచోట ఆవిడ నవ్విన నవ్వుకి ఘంటసాల నవ్వు ఆపుకోలేక కిసుక్కున నవ్వి పాట పాడారు. ఆ నవ్వు అలాగే పాటలో ఉండిపోయింది. పెళ్ళిలో పాదపీడనం జరిగే ముందు సావిత్రి “ఆర్యపుత్రులకు కోపం వస్తే?” అని అంటే రేలంగి (లక్ష్మణకుమారుడు) అరక్షణం అలా చూస్తూ ఉండిపోతారు. నా అభిప్రాయం ప్రకారం రేలంగి ఆమె నటనకు ముగ్ధుడై తను డైలాగ్ చెప్పే సమయం వచ్చిందని మరచిపోయారు. ఇది పాత్రోచితంగా ఉండటంతో ఆ షాట్ ని అలాగే ఉంచేసి ఉంటారు.

లక్ష్మణకుమారుడు అన్ని విషయాల్లో అభిమన్యునితో పోటీపడటం తమాషాగా ఉంటుంది. “అభిమన్యుడు వరించిన కన్యలందరినీ నేనే వరిస్తాను” అంటాడు. అతనికి అతని సారథి, శాస్త్రి, శర్మ వత్తాసు. “విజయోస్తు విజయోస్తు వీరావతారా, శ్రీరస్తు శ్రీరస్తు శృంగారసారా” అంటూ అతన్ని శాస్త్రి, శర్మ కీర్తిస్తారు. అది “జో అచ్యుతానంద జో జో ముకుందా” బాణీలో ఉంటుంది. లక్ష్మణకుమారుడు వెంటనే “జో జో.. చాలు మీ జోలపాట” అంటాడు. తెలివైనవాడే! సారథికి అతని కీలకం తెలుసు. అందుకని ఈ పద్యం చెబుతాడు:

అటు ఇద్దరు ఇటు ఇద్దరు అభిమన్యుని బాబాయిలు
అటు చూసిన ఇటు చూసిన నలుగురంటే నలుగురే.. మరి తమకో
నూటికి ఒక్కరె తక్కువ మేటి మేటి బాబాయిలు
ఏమని చెప్పుదు బాబాయిల సేన తమది బ్రహ్మాండముగా

లక్ష్మణకుమారుడు మురిసిపోతాడు. మహాభారతంతో పరిచయంలేని వారికి కూడా దీంతో పాండవులు ఐదుగురని, అర్జునుడు పాండవమధ్యముడని, కౌరవులు నూరుగురని తెలుస్తుంది.

చిన్నప్పుడు ఈ సినిమాలోని మాయలు, మాయాశశి చేసే అల్లరి చూసి కేరింతలు కొట్టేవాళ్ళం. కానీ ఇది కల్పిత కథ అని తర్వాత తెలిసింది. అయినా ఎక్కడా హద్దు దాటకుండా తీశారు. తర్వాత వచ్చిన కొన్ని సినిమాలలో హద్దులు దాటి ఇతిహాసాల్ని వక్రీకరించారు. ‘మాయాబజార్’లో కూడా “ఆ పాంచాలి నన్ను చూసి నవ్వింది” అంటాడు దుర్యోధనుడు. వ్యాస భారతంలో కేవలం భీముడు మాత్రమే దుర్యోధనుణ్ని పరిహసించాడని ఉంది. వారిద్దరకీ చిన్నప్పటి నుంచి వైరం. భీముడి మీద విషప్రయోగం చేసి సరస్సులో పడవేయించాడు దుర్యోధనుడు. అలాంటి భీముడు మయసభలో దుర్యోధనుడి పరాభవాన్ని చూసి నవ్వాడంటే దానికి అర్థం ఉంది. ద్రౌపది అసలక్కడ లేనే లేదు. ద్రౌపది నవ్విందనే కథ నెమ్మదిగా ప్రచారంలోకి వచ్చింది. తర్వాతి కవులు దానికి మరింత ఊతం అందించారు. మరో విషయమేమిటంటే లక్ష్మణకుమారుడు నిజానికి వీరుడు. సినిమా కోసం అతన్ని ఒక హాస్యపాత్రలా చూపించారు. శశిరేఖ పూర్తిగా కల్పిత పాత్ర. ఇలాంటి కథలను, సినిమాలను కొంచెం జాగ్రత్తగా చూడాలి. ముఖ్యంగా ఇవి వినోదం కోసమే అని గుర్తు పెట్టుకోవాలి. నిజమైన కథలు తెలియాలంటే మూలగ్రంథాలను చదవాల్సిందే.

‘మాయాబజార్’ 27 మార్చ్ 1957 న విడుదలైంది. ఇప్పటికీ కొత్త తరం వారిని అలరిస్తూనే ఉంది. పాండవులని చూపించకుండా కథ నడిపించటం, పింగళి రచించిన సంభాషణలు, మార్కస్ బార్ట్లీ ట్రిక్ ఫొటోగ్రఫీ గురించి ఇప్పటికీ సినీప్రియులు చెప్పుకుంటూ ఉంటారు. పాటలు కూడా పింగళే వ్రాశారు. ఎస్. రాజేశ్వరరావు, ఘంటసాల స్వరపరిచారు. పాటలన్నీ ఆణిముత్యాలే. అప్పటికే ‘మాయాబజార్’ నాటకం ప్రదర్శిస్తున్న సురభి నాటకమండలికి కూడా కొంత క్రెడిట్ దక్కుతుంది. ఎన్టీఆర్ కృష్ణుడిగా నటించిన తొలి చిత్రమిది. తర్వాత ఆయన రాముడిగా, కృష్ణుడిగా ఎన్నో చిత్రాలలో నటించి తెలుగువారికి ఆరాధ్యులుగా మారారు. సావిత్రి, రేలంగి గురించి పైన చెప్పుకున్నాం. ఏఎన్నార్, ఎస్వీఆర్, గుమ్మడి, సీఎస్సార్, ఛాయాదేవి, ఋష్యేంద్రమణి, ముక్కామల, మిక్కిలినేని, వంగర, అల్లు రామలింగయ్య, రమణారెడ్డి, ఆర్. నాగేశ్వరరావు, సంధ్య, సూర్యకాంతం, బాలకృష్ణ లాంటి హేమాహేమీలైన నటులు పాత్రలకు ప్రాణం పోశారు. ఈ చిత్రం నిర్మించిన నాగిరెడ్డి, చక్రపాణి, దర్శకత్వం వహించిన కె. వి. రెడ్డి చిరస్మరణీయులు.

Images Credit: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here