7. తుమ్మెద ఎద

0
5

[box type=’note’ fontsize=’16’] 2018 దసరా కవితల పోటీకి వచ్చిన కవిత. [/box]

[dropcap]అ[/dropcap]లివేణి అలశ్రేణిలో భ్రమర భ్రమణములు
అల్లిన కురులలో నల్లని ఝరుల సంభ్రమములు
సంయుక్త నేత్రాల అన్వేషణకి వకుళ ముకుళములు చిరునామా కాగా
చిన్నబుచ్చుకున్న  చిరుప్రాణి వెనుదిరిగి రాగా
కొలనులోని కమలములను చూసి
“సెలయేరుల సదనాన అరుణవర్ణపు అందాన శతపత్రములు కలదాన నే నీకై రానా…?”
అని కదపని పెదాలపై కదిలిన పదాలతో తన ఝంకారానికి తగ్గ శృతిలో పాడింది
సమాధానంగా సుమానందంతో జలజ మరింత విరిసింది
వలపు తేనె వలని విసిరింది
అళి దేహమును తన నళినదళదేహళి దాటించి
అరవింద మరందములో మిళిందముకు విందులు చేయించి పూతేనెను తాగించి మధుకేళి ఆడించి మధూళికను తనువుకు తాకించి తేనెలభారం దించుకుని తుమ్మెద దాహం తీర్చి పరపరాగసంపర్కానికి పంపింది
ఇంకో కుముదంలో ముదంతో మధురేష్టములను అధరోష్ఠములతో రుచి చూడ రొద చేసుకుంటూ  కృష్ణపక్షములతో వాలింది
భ్రమరానికి భ్రామరినందించి పరవిరిధూళిని తీసుకుని ఆనందించింది
ప్రకృతి పాఠాన్ని పాటిస్తూ తన లేతనువును బహుభారరసఫలములుగా మార్చుకుంది.