75 సంవత్సరాల విశ్వనాథ శకం

3
12

[శ్రీ కోవెల సుప్రసన్నాచార్య రచించిన ’75 సంవత్సరాల విశ్వనాథ శకం’ అనే వ్యాసాన్ని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]వి[/dropcap]శ్వనాథ సత్యనారాయణ తెలుగు సాహిత్యంలో ఒక అద్భుతమైన ప్రతిభ, వ్యుత్పత్తులతో పాటు అనేక ప్రయోగాలు చేసి అన్ని ప్రక్రియలను సారవంతం చేసిన మహానుభావుడు. ప్రాచీన తెలుగు సాహిత్యంలో తిక్కన స్థానం ఎలాంటిదో ఈనాటి సాహిత్యంలో ఆయన స్థానం అలాంటిది. తిక్కన పదిహేను పర్వాలు ఒక చేతి మీద నిర్వహించడమే కాకుండా తన భాషా వైశిష్ట్యం చేత, రచనా వైశారద్యం చేత సాహిత్య రంగానికే కాకుండా తన హరిహర నాథ తత్త్వ భావన చేత సమాజ పరిణామంలో ఒక అద్భుతమైన మలుపును తీసుకొని వచ్చిన వాడు. ఇటువంటి స్థితి ప్రాచీన సాహిత్యంలో మరొకరికి లేదు. ఆధునిక సాహిత్యంలో సాహిత్య ప్రక్రియలను నిర్మించడంలోనే కాక దాని పరిణామంలోనూ సాంస్కృతిక చైతన్య వికాసంలోనూ తన ముద్ర వేసిన గొప్ప కవి విశ్వనాథ సత్యనారాయణ. ఆయన గురువైన చెళ్లపిళ్ల వారు 20వ శతాబ్దంలోని పూర్వభాగాన్ని ఆక్రమించినవారు. ఆయన అవధానాలు, సాహిత్య వివాదాలు, గుంటూరు సీమ, గీరతం వంటి గ్రంథాలు ఆ రోజుల్లో అనేక వివాదాలకు కారణమయ్యాయి. అయితే వారి వివాదాలు ఒకవైపు కొనసాగుతుండగానే సాహిత్య రంగంలో జాతీయోద్యమము, సంస్కారోద్యమము, పెనవేసుకొని భావకవిత్వోద్యమంగా ప్రగతివాద కవిత్వోద్యమంగా విస్తరించాయి. రాయప్రోలు సుబ్బారావు జాతీయోద్యమ సాహిత్యానికి నాయకత్వం వహిస్తే, తరువాత కృష్ణశాస్త్రి, నాయని, నండూరి వంటివారు దాని ఒక పార్శ్వమైన ప్రణయ కవిత్వాన్ని ముందుకు తీసుకొని వెళ్లారు. ఆ నాళ్లలో ప్రణయ కవిత్వం ఒకవైపు సాగుతుండగా దేశభక్తి ఉద్యమం ప్రబలంగానే కొనసాగింది. ‘ఏదేశమేగినా, ఎందుకాలిడినా’ అన్న రాయప్రోలుతోపాటు ఈ ఉద్యమంలో దువ్వూరి రామిరెడ్డి, దామరాజు పుండరీకాక్షుడు, విశ్వనాథ సత్యనారాయణ, మొదలైన వారు దేశభక్తి భావనకు పెద్దపీట వేశారు. ప్రగతివాద కవిత్వోద్యమం మార్క్సిస్టు భావ ప్రాధాన్యంతో వెలువడవలసి వచ్చినా, తెనాలిలో జరిగిన తొలి మహాసభలో ప్రాచీన సాహిత్యం అంతా ప్రజాసామాన్యాలకు ద్రోహం చేసిందని తీవ్ర ప్రకటనతో జస్టిస్ పార్టీ భావజాలానికి ప్రాధాన్యం ఇచ్చింది. కానీ, రెండవ మహాసభ రాజమండ్రిలో జరిగినప్పుడు దేవులపల్లి కృష్ణశాస్త్రి అధ్యక్షుడుగా ఉన్న ఆ సందర్భంలో ఈ జస్టిస్ పార్టీ భావజాలానికి ప్రాధాన్యం తగ్గింది. తరువాత మదరాసులో జరిగిన నాలుగో మహాసభలో ఎక్కువమంది ఆధునిక కవులను విశ్వనాథతో సహా ఆహ్వానించి ప్రాచీన సాహిత్యానికి తగినంత గౌరవ స్థానాన్ని కల్పించడంతో దాని స్వరూపం మారిపోయింది. తరువాత 1955లో విజయవాడలో జరిగిన సభలో శ్రీశ్రీ ఛందస్సులకు ప్రాధాన్యం ఉండాలని ప్రకటించడంతో దాని మౌలిక ఆశయాలు పూర్తిగా చెదరిపోయాయి. ఒకవైపు ఈ రకమైన మార్పులు వస్తూ ఉండగా 1930 లలో సౌందరనందం రావడంతో నవ్య సంప్రదాయ సాహిత్య రచనకు, విస్తరణకు ప్రాధాన్యం ఏర్పడింది. జాతీయోద్యమం ఒత్తిడి వల్ల శివభారతం, రాణా ప్రతాపసింహ చరిత్ర వంటి కావ్యాలు ప్రాచీన కావ్య శరీరంతో ఆధునిక భావ చైతన్యంతో ప్రకాశించాయి. ఈ సందర్భంలో ఆంధ్ర పురాణం కూడా ఈ మార్గంలోనే ప్రవర్తించింది. 1950లో శివరాత్రి నాడు చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి పరమపదించడంతో అవధానాల ఒత్తిడి గల కాలం అంతరించి పోయింది. క్రమంగా నవ్యసంప్రదాయం పుంజుకోవడం ప్రారంభమైంది. 1933 ప్రాంతంలో విశ్వనాథ రామాయణ రచనను ప్రారంభించారు. అప్పటికే ఆయన నర్తనశాల, త్రిశూలం, వేనరాజు వంటి నాటకాలే కాకుండా కిన్నెరసాని పాటల వంటి ఆధునిక గేయ కావ్యాలను ప్రకటించారు. దాంపత్యంలో ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు స్త్రీ, తన జీవితాన్ని సామాజిక సేవా సందర్భంలో వినియోగింపవచ్చునని కిన్నెరసాని పాటల కావ్యం నిరూపించింది. తత్పూర్వం ఆయన రచించిన నాటకాల్లో దాంపత్య ధర్మం కామోత్కర్ష వల్ల, అధికారపు దాడి వల్ల, స్వలింగ సంపర్క భావన వల్ల చెదరిపోయే పరిస్థితి వస్తే దాని నుంచి తనను తాను రక్షించుకోవాల్సిన పరిస్థితి వేయి పడగలు, చెలియలి కట్ట మొదలైన రచనల ద్వారా వివరించింది. 1950 లో వెంకటశాస్త్రిగారు నిష్క్రమించడమే కాకుండా ఆ సందర్భంలోనే శ్రీరమణ మహర్షి, శ్రీఅరవిందులు దేహత్యాగం చేశారు. భారతీయ ఆధ్యాత్మిక రంగంలో ఒక పెద్ద మార్పు వచ్చింది. చలం వంటి తీవ్రవాది కూడా తన రచనా సర్వస్వాన్ని తిరస్కరించి రమణులకు శరణాగతి చేశారు. 1950 నాటికి విశ్వనాథ సృజనాత్మక రచనలే కాక, కావ్య రహస్యాన్ని, కథా కథనాన్ని శిల్ప వైచిత్రిని వెల్లడించే విమర్శ గ్రంథాలను నన్నయ్యగారి ప్రసన్న కథాకలితార్థ యుక్తి పేరుతో 1949 లో భారతిలో వెలువరించారు. అంతకుపూర్వం విమర్శ కొత్త కథ, పాత కథ, నాటకీయ శిల్పము మొదలైన మూస పద్ధతిలో సాగిపోతుండగా కథ కొత్తది కానక్కరలేదు.. రసమే ప్రధానము అని ఒక సిద్ధాంతాన్ని ప్రపంచిస్తూ ప్రాగ్విపశ్చిన్ మతంబున రసము వేయిరెట్లు గొప్పది నవకథాదృతిని మించి అని స్పష్టం చేసి ప్రాచీన అలంకార సిద్ధాంతాన్ని ఆధునిక సందర్భంలోనికి తీసుకొని వచ్చి దాని గతిని స్థితిని సంపూర్ణంగా మార్చివేశారు. అంతకుపూర్వం నవ్య సాహిత్య పరిషత్ అధ్యక్షస్థానం వహించినప్పుడు ఆయన చేసిన ఉపన్యాసం ఆధునిక సాహిత్య చరిత్ర నిర్మాణానికి దోహదం చేసిందని కురుగంటి వారు నవ్యాంధ్ర సాహిత్య వీధులు గ్రంథంలో తెలియజేశారు.

ఒక వైపు ఆధునిక సాహిత్య విమర్శలో ప్రాచీనమైన రసధ్వని సిద్ధాంతానికి అనుబంధం కల్పిస్తూ రెంటి నడుమ ఒక మణిసేతువును నిర్మించారు. శిల్ప శబ్దం తిక్కన వాడినా, అక్కడ మనకు వివరణ లభించదు. విశ్వనాథ ఒక అక్షరము నుండి మహాకావ్యం దాకా కావ్యానుభవాన్ని కలిగించే వైఖరీవాక్కు శిల్పమయంగా ఉంటుందని కవి ప్రతిభ అంతా దాని వలనే వ్యక్తమవుతుందని నిరూపణ చేశారు. నవ భారతి పత్రికలో కల్పవృక్షము శిల్పదృష్టి అన్న వ్యాసాలలో ఈ శిల్ప వికాసము ఎలా జరిగిందో వివరించారు. ఆ తరువాత శాకుంతలము యొక్క అభిజ్ఞానత అన్న విమర్శ గ్రంథంలో పంచమాంకం యొక్క విశిష్టతను మనోవైజ్ఞానిక శాస్త్ర సంబంధ వివేచనతో విశ్లేషించి వ్యాఖ్యానించారు. ఆయన విమర్శ గ్రంథాలు అల్లసాని పెద్దన్నను గూర్చినవి, నాచన సోమన గూర్చినవి.. ఈ విశిష్టతను, వివేచనను ముందుకు కొనసాగింపజేశాయి. బాల సరస్వతి ప్రచురణ సంస్థ వారు భాగవతాన్ని ప్రతి గ్రంథాన్ని ఒక విద్వాంసుడి పీఠికతో అచ్చు వేస్తామని ప్రయత్నం చేస్తూ విశ్వనాథ వారిచేత దశమ స్కంధానికి పీఠిక వ్రాయించారు. అయితే తెలుగువారి దురదృష్టం వల్ల బాల సరస్వతి వారి భాగవతమూ రాలేదు. విశ్వనాథ వారి పీఠికా రాలేదు.

1950 నుండి విశ్వనాథ ముద్ర తెలుగు సాహిత్యం మీద ప్రబలంగా పడింది. అప్పటికే ఆయన బాల, అయోధ్య కాండలు పూర్తిచేసి అరణ్యకాండ రచిస్తున్నారు. 1950 ల మొదట స్వర్గానికి నిచ్చెనలు.. నడుమ తెఱచిరాజు రచించారు. అంతకుముందు ఆయన రచనలను గూర్చి దుష్కరమని పాషాణపాకమని ప్రచారం చేసినవారు ఉండగా 1950ల మధ్యనాటికి ఆయన తన రామాయణ కల్పవృక్షాన్ని వినిపించడం, ఒక గోష్ఠిగా కార్యక్రమాన్ని నిర్వహించడం ఆరంభమైంది. 1957లో మాదిరాజు రంగారావు రామాయణ కల్పవృక్ష మహోత్సవాలు ఖమ్మంలో నిర్వహించారు. మూడు రోజులు విశ్వనాథ దానిలోని వివిధ ఘట్టాలను వినిపించారు. ఆయన ఒకానొక సందర్భంలో భారతం చదవటం కష్టం, భాగవతం అర్థం చేసుకోవడం కష్టం.. అని చెప్పారు. కల్పవృక్షంలోనూ మన సంభాషణా శైలిని ఛందస్సులో నిబంధించడం చేత పద్యం ఎక్కడ విరువాలో తెలియక పాఠకుడు కొంతవరకు గందరగోళం పడ్డ సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఈ ఉత్సవాల వల్ల క్రమంగా పాఠకులకు కవికి మధ్య ఒక అనుసంధానం ఏర్పడింది. ఖమ్మం తరువాత వరంగల్లులో మరికొన్ని చోట్ల ఈ ఉత్సవాలు జరిగాయి. క్రమంగా శ్రోతలు ఏర్పడ్డారు. పాఠకులు ఏర్పడ్డారు. అధ్యయన అధ్యాపనాలు జరుగుతూ వచ్చాయి. కరీంనగరంలో జువ్వాడి గౌతమరావు వంటి సహృదయులు కల్పవృక్షాన్ని చదివి వినిపించి రసిక జగత్తులో దాని ఆస్వాద్య లక్షణాన్ని వ్యాప్తం చేశారు. అందువల్ల 1950వ దశకం పూర్తయ్యేనాటికి కల్పవృక్షం తెలుగు భాగవతానికి ఎంత ప్రచారం ఉందో అంత ప్రచారాన్ని పొందింది. హైదరాబాద్‌లో కోఠీలోని స్త్రీల కళాశాలలో కల్పవృక్ష ఉత్సవాలు జరిగినప్పుడు తాపీ ధర్మారావు గారు వచ్చి దాన్ని ఆస్వాదించారు. 1961లో కల్పవృక్ష యుద్ధకాండ పూర్తి కావడం, దానిమీద విమర్శలు, ప్రతి విమర్శలు పెరగటం, క్రమంగా దాని భావనా వైశిష్ట్యాన్ని, శిల్ప వైదుష్యాన్ని యువకులైన విద్వాంసులు అంగీకరించడం జరుగుతూ వచ్చింది. ఇలా సాగుతూ ఉండగా విశ్వనాథ ఇంకొక మహా ప్రయత్నానికి ప్రారంభం చేశారు. భారతదేశ చరిత్ర పాశ్చాత్యుల వ్యాఖ్యానాల వల్ల వక్రీకరింపబడిందని దాన్ని పునర్నిర్మాణం చేయవలసిన అవసరం ఉన్నదని భావించి పురాణ వైర గ్రంథమాల అనే 12 నవలల రచనలను నిర్వహించారు. ఆ తరువాత అదే మార్గంలో నేపాల, కాశ్మీర చరిత్రలు కూడా నవలలుగా నిర్మించారు. వర్తమాన చరిత్రను కూడా ఆయన వదిలిపెట్టలేదు. స్వాతంత్ర్యం వచ్చిన కొత్త రోజులలో పరిపాలించిన నెహ్రూ పటేళ్ల మధ్యన కలిగిన విభేదాలను చర్చ చేస్తూ వల్లభ మంత్రి అనే నవలను నిర్మాణం చేశారు. హైదరాబాద్‌లో 1957లో సాహిత్య అకాడమీ నిర్మించిన తరువాత ఉపాధ్యక్షుడిగా హైదరాబాద్‌కు ఆయన రాకపోకలు పెరిగాయి. అప్పుడే కరీంనగరంలో నూతనంగా స్థాపింపబడిన డిగ్రీ కళాశాలకు ప్రిన్సిపల్‌గా ఆహ్వానింపబడ్డారు. అప్పుడు రెండు మూడు సంవత్సరాలు ఆయన సాహిత్య నిర్మాణానికి కరీంనగరం కేంద్ర స్థానం అయింది. హైదరాబాద్ కూడా విడిదిగా మారింది. కరీంనగరంలో మ్రోయుతుమ్మెద, ఆరు నదులు, విష్ణుశర్మ ఇంగ్లిష్ చదువు, నీలపెళ్లి, సముద్రపు దిబ్బ మొదలుగా అనేక రచనలు చేశారు. ఈ ప్రయత్నం అంతా భారతీయ సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమంలో ఒక భాగమైంది. ఈ భాగం ఆయనను సాహిత్య జగత్తుకే పరిమితం కాకుండా సాంస్కృతిక చైతన్య నిర్మాతగా చూడవలసిన అవసరాన్ని తెలియజేసింది. భారతదేశంలోనే ఇన్ని విధాలుగా సాంస్కృతిక మూలాలను వ్యాఖ్యానించిన మహా రచయిత ఎవరైనా ఉన్నారేమో నాకు తెలియదు. 1961 లో ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి సహకారంతో ఆంధ్ర సాహిత్య చరిత్ర రూపకాలను పదింటిని రచించి మొత్తం సాహిత్య చరిత్రను సూక్ష్మరీతిలో వ్యాఖ్యానించారు. తనను గురించి తప్ప ఆనాటి వరకు ఉన్న సాహిత్య వేత్తలందరినీ స్పృశించారు. త్రిపురనేని రామస్వామి, శ్రీశ్రీల మార్గాలను ప్రశంసించారు. ఈ పది రూపకాలు కూడా జాగ్రత్తగా అధ్యయనం చేయవలసి ఉన్నది.

కల్పవృక్షం తరువాత విశ్వనాథ శ్రీకృష్ణ దేవుని గూర్చిన నాలుగు కావ్యాలు రచించారు. ముందరికాలంలో రాసిన శృంగార వీధి.. శ్రీకృష్ణ మహిమలు చెప్పేదే. తరువాతి కాలంలో ప్రద్యుమ్నోదయం, భ్రమరగీతలు, గోపికాగీతలు, శ్రీకృష్ణ సంగీతం అనే కావ్యాలు రచించారు. ఇవన్నీ తన సాధనకు సంబంధించిన రచనలే. భ్రమరగీతలకు ఆయన వ్యాఖ్యానమే ఉన్నది. సమష్టిగా కృష్ణకావ్యాలకు భాగవత భాగీరథి అనే పేరు పెట్టుకున్నారు. అదొక అద్భుతమైన విషయం. విశ్వనాథ మధ్యాక్కఱలు అనే రచన రామాయణ కల్పవృక్షంలో విరివిగా మధ్యాక్కఱలు ప్రయోగించినప్పుడు చతుర్థ పంచమ గణాదులలో రెండు యతులను ప్రయోగించారు. విశ్వనాథ మధ్యాక్కఱలు కేవలం అంతర్ముఖ సాధన. ఈ పది శతకాలు ఒక మౌన చింతన షట్చక్ర యోగ సాధన భావనామాత్రంగా సగుణం నుంచి నిర్గుణానికి చేసే ప్రయాణం. దీనిలో తెలుగు భాషా ప్రయోగం కొత్త పోకడలు పొందింది. ఈ గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం రావడం యాదృచ్చికమే అయినా యోగ్యమైన గ్రంథానికే వచ్చింది.

విశ్వనాథ సాహిత్యాన్ని అభిమానించే సాధకుడు ఆయనకు శిష్యప్రాయుడు 1930ల నుండే మనకు కనిపిస్తున్నారు. జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి, చెఱుకుపల్లి జమదగ్నిశర్మ, తుమ్మలపల్లి రామలింగేశ్వరరావు, పొట్లపల్లి సీతారామారావు, ఇలా అనేకులు ఆయన సాహిత్యాన్ని ప్రాణప్రదంగా భావిస్తూ వచ్చారు. 1952 ప్రాంతాల్లో ఉషశ్రీ తన మిత్రులతో కలిసి విశ్వనాథ సాహిత్యాన్ని గూర్చి విశ్వశ్రీ అనే ఒక సంచికను వెలువరించారు. దీనికి ప్రధాన సంపాదకుడు ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి. తెలుగులో ఏ కవి సాహిత్యాన్ని గూర్చి అయినా ఒక విమర్శ సంచిక రావడం ఇదే ప్రథమం. ఈ సంచిక వెలువడిన తరువాత ఆయన సాహిత్యాధ్యయనం విస్తృతంగా వ్యాపించింది. విశ్వనాథకు ఒక అలవాటు ఉండేది. రోజూ సందర్శకులు వచ్చినప్పుడు వారితో మాట్లాడుతూ అప్పుడు రాస్తున్న రచనలోని భాగాన్ని వినిపించేవారు. దానితో ఎప్పటికప్పటికి పాఠకుల ప్రతిక్రియ ఆయనకు తెలియవచ్చేది. 1958లో రసధుని అనే సాహిత్య సంస్థ హైదరాబాద్‌లో విశ్వనాథ సాహిత్యాన్ని గూర్చి రెండు రోజుల గోష్ఠి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. దీనిలో చదువబడ్డ పరిశోధన పత్రాలు తరువాత క్రమంగా స్రవంతి పత్రికలో వచ్చాయి. విశ్వనాథ షష్టిపూర్తి గుడివాడలో జరిగిన తరువాత అంతకంటే వైభవంగా కరీంనగర్‌లో 1956లో జరిగింది. దీనిలో ఆయన ‘తనలోతు ఎరుగని జనుల పూజకు తిరస్కృతి జూపు మత్సరస్వతి సుభద్ర, తనలోతునెరిగిన జనులకు నవాదృతి జూపు మత్సరస్వతి సమాద్ర’ అని ప్రకటించారు. ఈ సమావేశాల్లో తెలంగాణ ప్రాంతం నుంచి అనేకులైన కవిపండితులు పాల్గొన్నారు. పీవీ నరసింహారావు ఈ సమావేశాలలో ఆయన నవలలను గూర్చి విస్తృతంగా ప్రసంగించారు. ఆ సందర్భంలో పీవీ నరసింహారావు ‘వేయిపడగలు’ను హిందీలోకి అనువదించడానికి విశ్వనాథ అనుమతిని తీసుకున్నారు. ఈ సందర్భంలో దానిలోని 29 వ అధ్యాయాన్ని అనువదించి చూపించారని తెలియవస్తున్నది. తరువాత విశ్వనాథకు ఆంధ్రవిశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదం ఇవ్వడం, 1971లో జ్ఞానపీఠ పురస్కారం రావడం జరిగింది.

కాకతీయ విశ్వవిద్యాలయంలో విశ్వనాథ వాఙ్మయ జీవిత చరిత్రను గూర్చి పరిశోధించడానికి ఒక ప్రాజెక్టు ఏర్పడింది. విశ్వనాథ వాఙ్మయ సూచికను ప్రకటించుకొని, ఆ తరువాత విమర్శిని సంచిక 400 పేజీలతో ప్రకటించడం జరిగింది. ఇలా అధ్యయన అధ్యాపనాలలో విస్తృతంగా తరచి చూసే అవకాశం తెలుగు పాఠకులకు లభించింది. కొన్ని సందర్భాలలో ఆయన సాహిత్యాన్ని గూర్చి విరుద్ధ ధోరణిలో చర్చ చేయడం కూడా జరిగింది. ఆయన చనిపోయిన పదవరోజు నాడు ఒక సమావేశంలో ఒక విద్వాంసుడు ఆయన స్మృతులనే శృతులుగా భావించారని పేర్కొన్నారు. మరొక విమర్శకుడు ఆయన రచనలలో పేజీకి మూడు తప్పులు చూపిస్తానని ప్రకటించాడు. అప్పుడు ఆంధ్రజ్యోతి పత్రిక మూడు నెలల పాటు ఈ వ్యతిరేక ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగించింది. అదంతా గాలికి కొట్టుకుపోయిందని వేరుగా చెప్పవలసిన అవసరం లేదనుకుంటా.

విశ్వనాథ సాహిత్య అధ్యయనంలో తెలుగుదేశంలోని విశ్వవిద్యాలయాలు, స్నాతకోత్తర కేంద్రాలు ఉత్సాహంతో ముందుకు వచ్చి నూతనాంశాలను ఆవిష్కరిస్తూ వచ్చాయి. తెలుగు సాహిత్యంలో ఇంకే రచయితల సాహిత్యాన్ని గురించి జరుగనంత పరిశోధన కార్యక్రమం విశ్వనాథ సాహిత్య విషయంలో జరిగింది. జరుగుతున్నది. జరుగబోతున్నది. 21వ శతాబ్దం ఆరంభంలో వెలిచాల కొండలరావు విశ్వనాథ సాహిత్య పీఠం అనే సంస్థను ప్రారంభించి ఆయన ఎప్పుడో జయంతి పత్రికను పునరుజ్జీవింపజేసి విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఎన్నో విలువైన ప్రత్యేక సంచికలను జయంతి ద్వారా వెలువరించినారు.

ఇప్పటికీ ఆయన సమకాలీన రచయితల్లో చాలామంది చరిత్ర పుటల్లోకి వెళ్లిపోయినారు కానీ, ఆయన గ్రంథాలను విద్వాంసులు, సహృదయులు అధ్యయనం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ కొత్త గ్రంథాలు ఆయన సాహిత్యాన్ని గూర్చి వెలువడుతూనే ఉన్నాయి. ఒకసారి ఈ రచయిత ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు తెలుగులో జాతీయ కవి ఎవరని ప్రశ్నిస్తే విశ్వనాథ సత్యనారాయణ అని ఆయన నిస్సందేహంగా ప్రకటించారు. 1950ల నాడు ప్రారంభమైన ఆయన సాహిత్య అధ్యయనం ఇంతకాలం కొనసాగటం తెలుగు సాహిత్యంలో ఉన్న అపూర్వమైన అంశం. ఆయన విమర్శ గ్రంథాలు, పీఠికలు సాహిత్య విమర్శలో కొత్త దారులను తీస్తూనే ఉన్నాయి.

1960ల మధ్యలో ఒక వికృతమైన ఉద్యమం తెలుగు సాహిత్యాన్ని కుదిపివేసింది. అది దిగంబర కవిత్వోద్యమం. దానిని నిరసిస్తూ వరంగల్లు నుండి చేతనావర్త కవిత్వ ఉద్యమం వచ్చింది. ఆ తరువాత కొందరు కవులు తమ భావనలకు అనుగుణంగా అనుభూతి కవిత్వమని, విప్లవ కవిత్వమని, దళిత కవిత్వమని, స్త్రీవాద కవిత్వమని.. ఇలా అనేక పేర్లతో వస్తు ప్రాధాన్యాన్ని మాత్రమే నొక్కి చెప్తూ దశాబ్దానికి ఒక ఉద్యమంగా వివరిస్తూ సాగినారు. ఏదీ పదేళ్లకు మించి నిలువలేదు. 20వ శతాబ్దం గడచి ఇంచుమించు పాతిక సంవత్సరాలు గడుస్తున్నా భారతీయ సాంస్కృతిక పునరుజ్జీవన చైతన్య ప్రవాహం కొనసాగుతూనే ఉన్నది. విశ్వనాథ సాహిత్యానికి వేయిపడగలకు, కల్పవృక్షానికి ఇవాల్టికి ఆదరణ ఏమీ తగ్గలేదు. 1950 నుంచి ఈనాటి వరకు దాదాపు 75 సంవత్సరాలు విశ్వనాథ ముద్రవేసిన తెలుగు సాహిత్య యుగం లాగా పేర్కొనవచ్చుననిపిస్తున్నది. అన్ని ఉద్యమాలు అచిరకాలంలోనే మాసిపోతూ ఉన్నా ఆయన ప్రారంభించిన నవ్య సంప్రదాయ సాహిత్య ఉద్యమం కొనసాగుతూనే ఉన్నది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here