8. మలిజీవన ప్రస్థానం

0
11

[box type=’note’ fontsize=’16’] 2018 దీపావళి కథల పోటీకి వచ్చిన కథ. [/box]

[dropcap]ఉ[/dropcap]పోద్ఘాతం:

అల్లారుముద్దుగా పెంచిన కొడుకు అక్కరకు రానప్పుడు…. మలిజీవిత మజిలీ దుర్భరం అవ్వాల్సిందేనా? అసలు ఆ పరిస్థితికి ఆ తండ్రి ఎంత వరకూ బాధ్యుడు? పరిస్థితికి తలవంచాల్సిందేనా? వేరొక మార్గం లేదా?

ఎన్నో ఇళ్లల్లో చూసి అయ్యో అనుకుంటున్న మనం…. మన ఇంట్లో ఆ పరిస్థితే ఉందా అని ఎప్పుడన్నా ఆలోచించే ప్రయత్నం చేశామా? కనీసం ఇప్పుడన్నా చేద్దామా? మనకోసం అహరహం శ్రమించి విశ్రమాన్ని కోరుకుంటున్న ఆ ముసలి ప్రాణాలకు కాస్త శాంతిని, సాంత్వనను కలిగిద్దామా? అందరికంటే ముందు మన ఇంటిని శుభ్రం చేసుకుందామా?

సాయంసంధ్యా సమయం. విశాలమైన ఆ ప్రాంగణం, చుట్టూ పెద్ద పెద్ద పొడవాటి చెట్లతో వాటి మధ్య సన్నని కాలినడక బాటతో మనసుకు ఆహ్లాదకరంగా ఉంది. అందులో అక్కడక్కడా కొంతమంది వృద్ధులు గుంపులుగా కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. అది ఒక పేరెన్నికగన్న వృద్ధాశ్రమం. బయటకు వాకింగ్ కు వెళ్లి తిరిగివస్తూ అందరినీ పలకరించుకుంటూ హుషారుగా ముందుకు వెళ్తున్న రాఘవయ్యకు కొద్ది దూరంలో ఒంటరిగా, దీర్ఘాలోచనలో ఉన్న నరసింహాచారి కనిపించాడు, యదాలాపంగా పలకరించి ముందుకు పోదామనుకున్న రాఘవయ్య ప్రతి సమాధానం రాకపోయేసరికి ఒక్క అడుగు వెనక్కి వేసి, ‘హలో నరసింహాచారి, అర్ యు ఫైన్?’ అని అడగటంతో ఈ లోకం లోకి వచ్చిన నరసింహాచారి ముఖంలోకి లేని నవ్వుని తెచ్చుకుని ‘హాఁ ఏం లేదు బాగానే ఉన్నా’ అని సమాధానం చెప్పాడు. కానీ రాఘవయ్య కొన్ని రోజులుగా నరసింహాచారిని గమనిస్తూనే ఉన్నాడు. అతను ఎందుకో అదోలా ఉంటున్నాడు. పరధ్యానంలో ఉంటాడు. ఈ రోజు ఎలాగైనా ఆ కారణం తెలుసుకోవాలనుకున్నాడు రాఘవయ్య.నరసింహాచారి దగ్గరగా వచ్చి ఆ సిమెంట్ బల్లపై తనూ కూచున్నాడు. ‘నిన్ను కొద్దిరోజులుగా గమనిస్తున్నా…. ఏదో పరధ్యానంలో ఉంటున్నావ్. అందరితో అంత సఖ్యంగా ఉండటం లేదు. ఏమన్నాసమస్యా? బాధని వేరొకరితో పంచుకుంటే సగమౌతుంది. సంతోషం పంచుకుంటే రెట్టింపు అవుతుంది. నీకు ఇబ్బంది లేకపోతే నీ సమస్యను నాతో పంచుకోవచ్చు. నా పరిధిలో చేయగలిగిన సహాయం చేస్తా’ అని అతని సమాధానం కోసం ఎదురు చూస్తున్నాడు. నరసింహాచారి తటపటాయిస్తూనే, మొదలుపెట్టాడు.

“నేను ఒక కుగ్రామంలో పేద కుటుంబంలో పుట్టానండి. స్వయంకృషి తో ఎదిగి సమాజంలో మంచి స్థానం సంపాదించుకున్నాను. నేను పడ్డ కష్టాలని నా పిల్లలు పడకూడదని, ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఎక్కడ ఇబ్బంది పడతామేమో అని ఒక్కడితోనే చాలించా. వాడినే ప్రాణంగా చూసుకుంటూ, ఏ కష్టమూ వాడి దరిచేరకుండా కంటికి రెప్పలా కాచుకున్నా. వాడూ మంచి తెలివితేటలు కలిగిన వాడవటం చేత తొందరగానే జీవితంలో స్థిరపడ్డాడు. వాడి ఎదుగుదల చూసి చాలా గర్వపడేవాడిని. కాలప్రవాహంలో వాడికి మంచి సంబంధాలు వెతికి చక్కని అమ్మాయిని చూసి పెళ్ళిచేయాలని చెయ్యని ప్రయత్నం లేదు. ఎట్టకేలకు ఒక మంచి కుటుంబానికి చెందిన మంచి అందమైన, గుణవతి అయిన అమ్మాయిని ఎంచి వాడికి పెళ్లి చేసుకోమంటే, తను ఒక అమ్మాయిని ప్రేమించానని, తననే పెళ్లి చేసుకుంటానని పట్టుపట్టాడు. ఎన్నో రకాలుగా చెప్పి చూసినా ప్రయోజనం లేక, వాడి నిర్ణయాన్ని కాదనలేక అర్థ ఇష్టంతో, వాడి పెళ్లిని ఘనంగానే చేయించా. పెళ్లిరోజే ఆ కుటుంబ ఆచారవ్యవహారాలు అర్థమైనా, సర్దుకుపోయాం. ఎంతైనా మావాడు కట్టుకున్నాడు కనుక, మాకూ వారే లోకం కనుక, అమ్మాయిని కూతిరిలా చూసుకుందామనుకున్నాం. అలాగే ప్రయత్నం చేశాం. కానీ మా ప్రయత్నం పెరిగే కొలదీ ఆమె మాకు ఇంకా దూరం జరిగిందే కానీ దగ్గరయ్యే ప్రయత్నం చెయ్యలేదు. సరికదా, మావాణ్ణి మానుంచి దూరం చేసే ప్రయత్నాలు బాగానే చేసేది. నా భార్య అవన్నీ తెలుసుకున్నా, ఏమీ అనలేక మౌనంగా ఉండేది. అప్పుడప్పుడూ నేను కాస్త ఆగ్రహించినా, ఎందుకండీ మన పరిధిలో మనం ఉంటే మంచిది కదా అనేది. ఇంతా వాడే జీవితమనుకున్నది ఇందుకేనా అని అంటే… అది విధిరాత అనేది. కాలక్రమంలో ఆమె నాకు జ్ఞాపకాలను మిగిల్చి, ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోయింది. ఇంక అక్కడినుంచి నాకు నరకంలా ఉండేది. మాట పంచుకునే దిక్కు లేదు. ఎప్పుడన్నా మా అబ్బాయితో మాట్లాడదామంటే, ఏదో ఒక పని పేరుతో వాణ్ని మా కోడలు పిలిచేది. మళ్ళీ వాడు దొరకటం అరుదు. పోనీ మనవడితో ఆడుకుందామంటే, వాడు బడి నుంచి వచ్చింది మొదలు ట్యూషన్ అని, హోం వర్క్ అని గడిపేవాడు.ఆదివారం వస్తే, ఉదయాన్నే ఏదో ఒకటి వండేసి, నన్ను వడ్డించుకోమని చెప్పి బయటకు తిరగటానికి వెళ్ళిపోయేవారు. మళ్ళీ ఏ రాత్రికో తిరిగి వచ్చేవారు. ఎప్పుడన్నా మా వియ్యంకులు (మేము ఉండే నగరంలోనే వాళ్ళ నివాసం) వాళ్ళు వచ్చినా ఒక పలకరింపుతో సరిపుచ్చి, వేరే గదిలో వాళ్ళంతా మాట్లాడుకునే వారు. ఆకలికి తట్టుకోలేక, ఆత్మాభిమానం చంపుకుని అడగలేక అలాగే నీళ్ళు తాగి పడుకుంటే, ఎప్పటికో గాని భోజనానికి కబురు వచ్చేది కాదు. సూటిగా చెప్పాలంటే నా ఇంట్లో నేను ఉన్నా లేనట్టే. ఒంటరితనం భరించలేనంతగా ఉండేది.

ఈ క్రమంలో ఒక రోజు ఆదివారం, ఉదయం 8 గంటలైనా ఎవరూ లేవకపోయేసరికి, టీ కాచుకుందామని వంటింట్లోకి వెళ్ళా. నా ఖర్మానికి, పాల గిన్నె చేజారిపోయింది. అంతే, రివ్వున వచ్చిన మా కోడలు అది చూసి రంకెలు వెయ్యటం మొదలెట్టింది. కాసేపు ఆగితే నేను పెట్టేదాన్ని కదా, అంతదానికి మీరెందుకు రావటం, మొత్తం పాలన్నీ నేలపాలు చేసారు. దాన్ని శుభ్రం చేసేసరికి నా తలప్రాణం తోకకొస్తుంది, మీకేం హాయిగా కుర్చీలో కూచుంటారు,…. అంటూ ఇంకా ఏవేవో… చాలా ఏళ్ల తర్వాత నా కంటిలో నీరు నా చెంపను చేరింది.అంతకంటే దారుణమైన విషయమేంటంటే, సర్దిచెప్పాల్సిన మావాడు, మౌనంగా వింటూ వెళ్ళిపోవటం నేను తట్టుకోలేకపోయాను. ఆ క్షణమే నిర్ణయించుకున్నా… వాళ్ళ మీద ఆధారపడి బ్రతకకూడదని. నా పెన్షన్ డబ్బులతో, హాయిగా బ్రతుకుదామని. అన్ని విషయాలు కనుక్కున్నాకా, ఒక పేపర్ మీద అన్ని వివరాలు వ్రాసి, ఈ ఆశ్రమంకి వచ్చేస్తున్నా అని చెప్పి, నా సామాను సర్దుకుని ఇంటినుంచి వచ్చేశా.” అంటూ దీర్ఘ శ్వాస తీసుకున్నాడు నరసింహాచారి. వెంటనే రాఘవయ్య “ఇంకేం ఇక్కడ సంతోషంగానే ఉండాలిగా. మళ్ళీ ఎందుకలా వెనకటి మనిషిలా?” ఆన్నాడు.

“నేను వచ్చేస్తున్న విషయం తెలిసి నా కొడుకు బ్రతిమాలుతాడనుకున్నా. కనీసం వచ్చి తిరిగి రమ్మంటాడని ఎదురుచూసా. కానీ వాడు నా ఆశని తుంచేస్తూ, అసలు నాతో మాట్లాడే ప్రయత్నమే చెయ్యలేదు. అంటే నేను ఆ ఇంటిలోనుంచి వచ్చేయటం వాళ్లకి ఇష్టమే అనుకుంటా. అప్పుడనిపించింది, నేను పొరపాటు చేశానని. ఇంకొకళ్ళని కని ఉంటే బావుండేదని. ఎంత అనుకున్నా నా పరిస్థితిని నేను భరించలేకపోతున్నా. ఆ ఆలోచనతోనే ఏమీ చెయ్యలేక, ఎవరితోనూ గడపలేక ఒక్కన్నే వేదన అనుభవిస్తున్నా….” అంటూ ముగించాడు.

అంతా విని చిన్నగా నవ్వుతున్న రాఘవయ్య ని చూసి, “ఏంటీ, నా పరిస్థితి చూసి మీకు నవ్వొస్తోందా” అంటూ విసుక్కున్నాడు…. అప్పుడు రాఘవయ్య “ఇంత కథలో మీ తప్పు అసలు లేదంటారా?” అన్నాడు. ఆశ్చర్యంతో చూస్తున్న నరసింహాచారిని చూసి, ప్రసన్న వదనంతో చెప్పటం మొదలు పెట్టాడు రాఘవయ్య.

“ఒక్కడే సంతానం… ముద్దుగా పెంచాలని వాడు అడిగిన గొంతెమ్మ కోర్కెలన్నీ తీర్చారు. మీరు ఎంత కష్టపడినా వాడికి కష్టం తెలీనివ్వలేదు. ఉన్నత స్థానంలో నిలబెట్టాలని, పెద్ద పెద్ద స్కూల్స్ లో చదివించారు… ఆ చదువులు వాడికి డబ్బు విలువ, ఉద్యోగం విలువ చెప్పాయి కానీ నైతిక,సామాజిక విలువలు నేర్పలేదు. పోనీ ఇంట్లో మీరన్నా చెప్పారా అంటే అదీ లేదు. జీవితంలో కష్టం విలువ తెలిసిన వాడే తోటి మనిషిని గుర్తించగలడు… లేకపోతే అవసరార్ధమే మనుషులు అనే భ్రమలో ఉంటాడు. మీవాడి పరిస్థితీ అంతే. పిల్లలెంతమంది ఉన్నారన్నది ముఖ్యంకాదు… వాళ్ళ నడవడిక, ప్రవర్తన ముఖ్యం. అది మనం చిన్నతనంలోనే నేర్పించే ప్రయత్నం చెయ్యాలి. మీరు పడే కష్టం వాడూ పడేలా కాకున్నా, కనీసం దాన్ని గుర్తించేలా మీరు చెయ్యాలి. చిన్నతనంలోనే నైతిక, సామాజిక విలువల గురించి వివరించి చెప్పి పాటించేలా చూడాలి. మన తరువాతి తరం వారికి మనమిచ్చే నిజమైన సంపద అదే. డబ్బు సంపాదించి ఇవ్వక్కరలేదు, సక్రమంగా సంపాదించే మార్గం చూపించగలిగితే వాళ్ళే తమంతట తాము సంపాదించుకోగలరు. కానీ విలువలనే తరగని సంపదను వారసత్వంగా ఇవ్వాలి. పేదరికంలో ఉన్న మీ తల్లిదండ్రులు మీకు ఇచ్చిందీ, మీరు మీ కొడుకుకి పంచనిదీ అదే. దాని పర్యవసానమే మీ ఈ పరిస్థితి. అలా అని ఇప్పుడు బాధపడాల్సిన అవసరమూ లేదు. వాడు వృద్ధాప్యంలో మిమ్మల్ని చక్కగా చూస్తాడని మీరు వాణ్ని అలా పెంచలేదు. ప్రేమతో పెంచారు అంతే… ప్రేమ ఏమీ ఆశించకూడదు, తిరిగి ప్రేమంచడాన్ని కూడా.

అందువల్ల మీరు ఏదైతే చేశారో అది మీ ధర్మం అని భావించండి. ఇకనుంచి మీ ప్రేమను తోటి మనుషులతో పంచుకోండి. మీ మాటను పంచుకోండి, మీ సంతోషం, దుఃఖం అన్నీ పంచుకోండి. అప్పుడు ఈ ప్రపంచం నాది, అంతా నా వాళ్ళే అనిపిస్తుంది. అప్పుడు ఈ దుఃఖం ఉండదు.” మాటలు సూటిగా మనసుకు తగులుతుంటే, గాయమైన గుండెకు వెన్నపూస రాసినట్టు, దుఃఖం పొరలు వీడి మనసు తేలిక పడటం మొదలుపెట్టింది. ఇంతలో ఒక సందేహం నరసింహాచారిని తొలిచింది. వెంటనే, “రాఘవయ్యగారు, మీరు ఇన్ని తెలిసిన వారు, మరి ఇక్కడ ఎందుకు ఉన్నారు. మీ పరిస్థితి ఎందుకిలా మారింది?” అని అడిగాడు. ముందుగానే ఈ ప్రశ్నను ఊహించిన రాఘవయ్య చెప్పటం మొదలుపెట్టాడు.

 “నాకు ఇద్దరు పిల్లలు. ఒక కొడుకు, కూతురు. మధ్యతరగతి జీవితం. మొదటినుంచీ పిల్లలకు కష్టం,సుఖం నేర్పుతూ పెంచాను. అప్పుడప్పుడూ నా ప్రవర్తన వాళ్లకి వాళ్ళ స్నేహితుల మధ్య ఇబ్బందిగా అనిపించినా సర్దుకుపోయేవారు. నాకు తగిన ఇల్లాలు మా ఆవిడ. పిల్లలకు పెద్ద పెద్ద ఆస్తులను ఇవ్వలేకపోయినా మంచి చదువును, విజ్ఞానాన్ని ఇవ్వగలిగాను. వాళ్ళూ అంతే నేర్పుగా అందుకున్నారు. ఉన్నంతలో మంచి స్థానాల్లోనే స్థిరపడ్డారు. మంచి సంబంధాలు చూసి పెళ్లి చేశా. అన్నీ కుదురుకున్నాకా, వాళ్లకి పిలిచి నా మనసులో మాట చెప్పా. ససేమిరా ఒప్పుకోము అన్నారు. ఒప్పుకుని తీరాల్సిందే అని పట్టుపట్టా. వినలేదు… అలక వహించా… ఎంత బ్రతిమాలినా ఎవరి మాటా వినలేదు. ఎవరితోనూ మాట్లాడలేదు. చివరికి నా మాటకు ఒప్పుకు తీరాల్సి తప్పలేదు. అయిష్టంగా ఒప్పుకున్నారు. కానీ కొన్ని షరతులు విధించారు. నా నిర్ణయం మా ఆవిడకు ముందే చెప్పటంవల్ల ఆమె ముందే మానసికంగా సిద్ధపడిపోయింది. ఇంతకీ ఆ నిర్ణయం చెప్పలేదు కదూ. నేను ఎవరిపైనా ఆధారపడి బ్రతకనని, నా ఆరోగ్యం సహకరించే౦త వరకూ స్వతంత్రంగా బ్రతుకుతానని చెప్పా. అలాగే నా ఆస్తి మూడు వాటాలలో(కొడుకు, కూతురు, నాది) నా వాటా, నా తదనంతరం నేను ఉండే ఆశ్రమానికి వ్రాస్తానని చెప్పా. వారు ఒప్పుకోనిది ఆస్తి వ్రాసిస్తా అన్నందుకు కాదు. నేను ఆశ్రమంలో ఉంటానన్నందుకు. కంటికి రెప్పలా చూస్తామన్నారు. కానీ నేను మాత్రం నా నిర్ణయానికే కట్టుబడి ఉన్నా.” ఆశ్చర్యం, ప్రశ్నార్ధకం నిండిన చూపుతో తననే చూస్తున్న నరసింహాచారిని చూస్తూ, తన కథను కొనసాగిస్తున్నాడు రాఘవయ్య.

“ఏంటి వీడు పిచ్చివాడా అనిపిస్తుంది కదూ? కానీ అక్కడే మనం వివేకంతో ఆలోచించాలి చారీ. మన ప్రెజెన్స్ వాళ్ళకి, వాళ్ళ పనులకి, వాళ్ళ సరదాలకి అడ్డంకిగా మారకూడదు. మన ఆరోగ్యం కుంటుపడినప్పుడు ఎలాగూ మనం వాళ్ళపై ఆధారపడక తప్పదు…అలా అని ఇప్పుడే ఆధారపడటం కూడా నాకెందుకో నచ్చలేదు. అలాగే వాళ్లు ఉద్యోగాలకి వెళ్ళినప్పుడు ఒంటరిగా ఉండే బదులుగా ఇక్కడైతే మనలాంటి నలుగురితో గడిపే అవకాశం ఉంటుంది. దాని వల్ల మనసు ఎప్పుడూ ఉత్సాహంగా ఉండి ఆరోగ్యంగా ఉంటాం. అలాగే మనలో సత్తువ ఉన్నంతకాలం సమాజానికి ఏదో ఒక రూపం లో ఉపయోగపడే పని చెయ్యటం వల్ల, కొత్త ఉత్సాహంతో ఉంటాం. అందుకే రోజూ ఒక పూట పక్కనే ఉన్న ప్రభుత్వ స్కూల్ లో పిల్లలకు చదువు చెప్తున్నా. దానితో పాటే నాలుగు మంచి మాటలు చెప్తున్నా…. వాళ్ళంతా మట్టిలో మాణిక్యాలు. సానపెడితే మెరిసే వజ్రాలు. భవిష్యత్ తరానికి మంచిని మోసుకెళ్ళే సాధనాలుగా తయారు చేస్తున్నా. అలా అని నా కుటుంబానికి నేను ఎప్పుడూ దూరం కాలేదు. ఒప్పందం ప్రకారం రెండు వారాలకు ఒకసారి, ఒకసారి మా కూతిరి ఇంట్లో, ఒకసారి కొడుకు ఇంట్లో అందరం కలుస్తూనే ఉంటాం. ఆ రెండు రోజులూ ఇళ్ళంతా మనవల్లూ, వాళ్ళ కబుర్లతో సందడే సందడి. పండగలూ, పబ్బాలూ అదనం. దానివల్ల, ఎవరూ ఎవరినీ నిందించుకునే అవకాశమే ఉండదు… కలిసిన కాసేపూ ఆనందాల  హరివిల్లే. అందుకే ఇంతవరకూ నాకు అనారోగ్యమన్నదే వచ్చింది లేదు. మనసు ఎప్పుడూ ఉల్లాసంగా ఉంటుంది. ఒక్క విషయం చారి గారు. ఈ ప్రపంచంలో ఆ క్షణానికి అంతా మనవాళ్ళే…. అంతలోనే ఎవరికి వారు, దీనినే ఇంగ్లీషులో “Attached with Detached” అనో ఇంకోటనో అంటారు.సరిగా గుర్తులేదు. అది అర్థం చేసుకోగలిగితే, ఎవరి మీదా కోపం రాదు. ఎవరిపైనా ద్వేషం పెరగదు. మనసు తేలికపడి హాయిగా ఉంటుంది.” అని ముగించాడు.

ఎప్పుడూ మామూలుగా కనిపించే రాఘవయ్య ఈ రోజు ఎందుకో ఒక అత్యున్నత శిఖరంలా కనిపించాడు. జీవితమనే ఈ కురుక్షేత్రంలో పోరాడటానికి భయపడే అర్జునుడిలా తనూ, గీతను భోదించిన కృష్ణునిలా అతనూ కనిపించాడు నరసింహాచారికి. అతని మాటలతో మబ్బులు వీడిన చందమామలా తన హృదయం తేలికపడింది. తన తదుపరి జీవితం ఎలా ఉండాలో నరసింహాచారికి ఒక అవగాహన వచ్చింది. ఆ కళ్లల్లో మెరుపును గమనించిన రాఘవయ్య, తృప్తితో ముందుకు వెళుతున్నాడు. అతనినే చూస్తున్న నరసింహాచారి మెదడు… దుఃఖపు పొరలు తొలచుకొని సరికొత్త గమనం కోసం ఆలోచిస్తోంది. ఈ ఘట్టానికి సాక్ష్యాలైన ఆ చెట్లు సంతోషంతో మెల్లగా ఊగుతున్నాయి. సాయంసంధ్యా సూర్యుడు ఆ రోజుకి తన భాద్యతను పూర్తిచేసుకుని సరికొత్త ఉషోదయం కోసం పడమర కొండలవైపు పరుగులు తీస్తున్నాడు.