9. ఫోనొకటి చేతికొచ్చాక

0
8

[box type=’note’ fontsize=’16’] 2018 దసరా కవితల పోటీలలో పాఠకుల ఓట్ల ఆధారంగా ఎంపికైన ప్రథమ ఉత్తమ కవిత. [/box]

నాకు భయంగా ఉంది
చెప్పలేనంత బెంగగా ఉంది.

మొబైల్ ఫోనొకటి మన చేతికొచ్చాక
అంతరంగాల్లోకి ఇంటర్నెట్ చొచ్చుకొచ్చాక
ఇంటిలో ఎదుగుతున్న స్వచ్ఛమైన పచ్చని బాల్యం
కత్తులు వంతెన మీద నుంచి
ఏ నెత్తుటి నదుల్లోకి జారిపోతుందోనని
ఒకటే బెదురుగా ఉంది.

కొత్తనెప్పుడూ.. వింతగా చూసే
వారి లేలేత తేనె కళ్ళు..
నీలికలల పైత్యపు తాకిడికి
మగతగా..
మోహరించబడ్డ రహస్యాల
మైకపు వలలో పడి
విలవిలలాడి పోతాయేమోనని
అంతులేని ఆందోళనగా ఉంది.

పరిణతి పొందని వయసు వేడిలో
తొలి మాటల పారవశ్యం లో
తూలిన ఆ మూడు ముక్కలు
కళ్ళుగప్పి కల్పించిన ఏ యాప్ చట్రం లోనైనా
ఆపదగా  అమర్చ బడతాయేమోనని
మనసంతా మరీ అలజడిగా ఉంది.

ప్రతి ఇంటిలో .. ఇప్పుడిప్పుడే
ప్రత్యేకంగా వెలుస్తున్న
రీడింగ్ రూమ్ముల్లో .. కురుస్తున్న
విచ్చలవిడి ఏకాంతం… ఎడతెగని వరదై
అంతులేని పంతపు తెంపరి తనంతో..
ఇంటిని అమాంతంగా ముంచేస్తుందేమోనని
చెప్పలేనంత గాభరాగా ఉంది.

మొబైల్ ఫోన్ వచ్చినప్పటి నుండీ
మనుషుల మధ్య మాటల మాయమయ్యాక
మనో వ్యాధి సోకినట్లుగా…మత్తుగా ఉంది
అంతంత మాత్రంగా మిగిలిన
అనుబంధాల మధ్య వారధిగా ఉన్న
సన్నని మనుగడ పొర
ఇప్పుడు చిరిగిపోతుందేమోనని..

నాకు భయంగా ఉంది.
మోయలేనంత భారంగా ఉంది.