99 సెకన్ల కథ-10

1
6

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత, సంపాదకులు, పాత్రికేయులు జి. వల్లీశ్వర్ ’99 సెకన్ల కథ’ సిరీస్‌లో ఈ వారం రెండు కథలు సంచిక పాఠకులకు అందిస్తున్నారు. ఈ కథలు ప్రపంచతత్వాన్ని, మానవ మనస్తత్వాన్ని సూక్ష్మంగా ప్రదర్శిస్తాయి. [/box]

1. గీతోదయం!

శేషయ్య గారు లిఫ్ట్ ఎక్కారు. కేకలు వినబడుతున్నాయి. ఒక ఆడ గొంతు, మరో మగ గొంతు. అయిదో అంతస్తుకి చేరే సరికి అర్ధమైంది. అది నవనీతం ఇంట్లోంచే.

లోపలికి వెళ్ళేసరికి ఆ యువ జంట మధ్య హోరా హోరీ వాగ్యుద్ధం సాగుతోంది.

“…నీ బోడి ఎనిమిది లక్షల ప్యాకేజీకి అంత సీను లేదే..”

“నా ప్యాకేజీ తక్కువైనా నాది బహుళజాతి కంపెనీరా మగడా.. నీ కంపెనీకి ఈ హైదరాబాద్ దాటితే అడ్రసు లేదు…”

“ఏం కూశావే…!” అంటూ నవనీతం చెయ్యెత్తబోయాడు.

శేషయ్య లోపలికి అడుగుపెట్టారు. ఇద్దరూ ఆపేశారు. కాని బుసలు కొడుతున్నారు.

“ఏమయ్యా, ఈ శనివారం తత్త్వవిదానంద స్వామి వారిని కలుద్దాం అనుకున్నాం కదా!…. నువ్వు కూడా రా గీతా. ఆయన మంచి తత్త్వవేత్త. నువ్వు చాలా సంతోషిస్తావు.”

గీత కాదనలేక పోయింది.

***

ముగ్గురూ కారులో వెళ్తున్నారు. నవనీతం నడుపుతున్నాడు.

శేషయ్య నోరు విప్పారు. “గీత ఏం చెప్పిందంటే…”

“నేనేం చెప్పాను అంకుల్?” ఖంగారు పడింది గీత.

“నువ్వు కాదు. భగవద్గీత. (శ్లోకం) ‘ధ్యాయతో విషయాన్ పుంసః… ..క్రోథాత్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధి నాశో…’ అవధులు లేని కోరికలు క్రోథానికి దారి తీస్తాయి. నా మాట నెగ్గి తీరాలి – అన్నది భయంకరమైన కోరిక. క్రోథం వల్ల విచక్షణా శక్తిని కోల్పోతాం. బుద్ధి నశిస్తుంది. మనిషి మృగంగా మారతాడు…”

“అంకుల్, కోపాన్ని జయించటం అసంభవం. ఆత్మగౌరవం కల వాళ్ళకి ఇంకా అసాధ్యం.”

శేషయ్య, గీత మాట్లాడలేదు.

కారు యూనివర్సిటీలోంచి ఖాళీ రోడ్డు మీద వేగంగా వెళ్తోంది. నాలుగు రోడ్ల సెంటర్ కి రాగానే నవనీతం అకస్మాత్తుగా బ్రేక్ వేశాడు.

“ట్రాఫిక్ ఏమీ లేదుగా. ఎందుకాపావ్?”

“అటు ఎడమ వైపు చూడండి. ఆ చెట్ల వెనకాలనుంచి ఎంత వేగంగా లారీ వస్తోందో! (లారీ సర్రున వీళ్ళ వైపుకి తిరిగి పక్కనుంచి అదే వేగంతో వెళ్ళిపోయింది). చూశారా! ఎలా వచ్చేశాడో! నేను స్పృహలో లేకపోతే ఎంత ప్రమాదం జరిగేది?”

“ఆ లారీ నాక్కనబడలేదయ్యా. నీకెలా తెలుసు?”

“అంకుల్. డ్రైవింగ్ అంటేనే అది. మన ముందూ, వెనకా, అటుపక్కా, ఇటుపక్కా, చూసుకుంటూ – ఇలా చాలా స్పృహతో నడపాలి కారుని. లేదంటే ప్రమాదాలు తప్పవు.”

“చాలా బాగా నడుపుతున్నావయ్యా.”

నవనీతానికి కాలర్ పైకి లేచింది.

“ఎలా వచ్చింది నీకు ఇంత బాగా నడపటం?”

“ప్రాక్టీస్.. అదే సాధన.”

“అలాగే, ఎలాంటి మాట తూలితే ఎంత ప్రమాదం జరగవచ్చో ఆలోచించి, మన చుట్టూ వున్న ప్రపంచాన్ని గమనిస్తూ, స్పృహతో మాట్లాడటం సాధన చేస్తే కుటుంబంలో కలహాలూ, వాగ్యుద్ధాలు వుండవు. క్రోథాన్ని జయించటం కూడా కారు నడపటం లాంటిదే.”

“ఆ…!” నవనీతం, గీతల మొహాల్లో జ్ఞానోదయం.

2. ఇతన్ని ఎలా చూడాలి?

శేషయ్య వెళ్ళేసరికి, ఆ కంపెనీ సి.ఇ.ఓ చిదంబరం ఎదురొచ్చి మరీ లోపలికి తీసుకెళ్ళాడు.

“అంకుల్, ఒక్క అయిదు నిమిషాలు” అంటూ చిదంబరం అక్కడ అప్పటికే ఏదో చర్చిస్తున్న యువకుడితో మాటల్లోకి దిగిపోయాడు.

అతను ఆవేశంతో మాట్లాడుతున్నాడు.

“సర్, మొన్న ఆ క్యాంటీన్ వాడు అలాగే – ఇడ్లి, వడ సైజు ఎందుకు తగ్గించావు అంటే మీతో మాట్లాడతానంటాడు. ఇప్పుడు సెక్యూరిటీ విషయంలో కూడా…”

అతని ఫిర్యాదుల జాబితా ఇంకా సాగుతోంది. చిదంబరంకి తెలిసిపోయింది ఇది ఇప్పుడప్పుడే తేలేది కాదు.

“సరే, నువ్వెళ్ళు. తరువాత మాట్లాడదాం” అన్నాడు.

అతను వదల్లేదు. “మీరు ప్రతిసారీ ఇలాగే అంటున్నారు. ఏదీ తేల్చకపోతే ఎలా సర్!”

“ఈ పెద్దాయన ఒక ముఖ్యమైన పని మీద వచ్చారు. నేను పిలుస్తాలే. వెళ్ళు” అంటూ అతన్ని బలవంతంగా పంపించాడు చిదంబరం.

“సారీ అంకుల్. … ఆ, మీరు చెప్పిన రామకృష్ణ మఠం సేవా ప్రాజెక్టు గురించి మా ఛైర్మన్‌కి చెప్పాను. ఆయన ‘ఓకె’ అన్నారు..”

శేషయ్య ఆపారు.

“ఈ కుర్రాడెవరు?”

“మా హెచ్ఆర్ మేనేజర్.”

“ఇతని పేరు శ్రీనాథా?”

“ఔనండి… చేరి ఆరు నెలలు కూడా కాలేదు. అందరితో పేచీలే. పదార్ధాల నాణ్యత పడిపోతోందని క్యాంటీన్ వాడి మీద… సెక్యూరిటీ సర్వీసులు ఇచ్చే ఏజెన్సీ – ఒప్పందం ప్రకారం నడుచుకోవటం లేదంటూ వాళ్ళ మీద… స్టేషనరీ సరఫరా చేసేవాడు పేపరు నాణ్యత తగ్గిస్తున్నాడని వాడి మీద…! ఇంకా, సిబ్బంది సెలవుల దరఖాస్తుల విషయంలో ఆయా విభాగాల అధిపతులు నోటితోనే మంజూరు చేసేస్తున్నారు, ముందస్తు అనుమతులు వుండటం లేదంటూ వాళ్ళతో….! ఒకటని కాదు అంకుల్. నాకు వీడితో తలనొప్పి ఎక్కువైంది… మీకు తెలిసిన మంచి కుర్రాడు – పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎవరన్నా వుంటే చెప్పండి. జీతం ఇంకా ఎక్కువిద్దాం.”

“ఇతనేం చదివాడు?”

“డిగ్రీ – అది కూడా థర్డ్ క్లాస్. మీలాంటి వాళ్ళెవరో సిఫార్సు చేస్తే తీసుకున్నాను.”

“వీళ్ళది అవినీతి, అసత్యం అంటని స్వాతంత్ర్య యోధుల కుటుంబం. వీళ్ళ నాన్న కూడా ఇతని చిన్న వయసులో కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి అమరుడయ్యాడు. ….”

“మీకు తెలిసిన మంచి కుర్రాణ్ణి – అనుభవం వున్నవాణ్ణి చెప్పండి అంకుల్. వున్నారా ?”

శేషయ్య కొంచెం ఆలోచించి చెప్పారు.

“ఇద్దరు ముగ్గురు వున్నారు. కానీ…”

“ఏమీ సంకోచించకండి. జీతం ఎక్కువైనా సరే …”

“చూడండి. ఇతన్ని నేను చూసి నాలుగైదేళ్ళయింది. గుర్తు పట్టడం కష్టమైంది. ఈ కుర్రాడికి వాక్చాతుర్యం

లేదు. …”

“ఇంకెవరో వున్నారన్నారు !”

“వున్నారు…కానీ, మీరు లక్షలు కుమ్మరించినా నిజాయితీని, విశ్వసనీయతని బజారులో కొనుక్కోలేరు. ఇతనికి కుటుంబ వారసత్వంగా వచ్చినవే అవి. కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పండి, చాలు. మీ సంస్థకి మంచి పేరు తీసుకు వస్తాడు.” శేషయ్య లేచారు.

సి.ఇ.ఓ ఆలోచించటం మొదలెట్టాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here