99 సెకన్ల కథ-15

1
5

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత, సంపాదకులు, పాత్రికేయులు జి. వల్లీశ్వర్ ’99 సెకన్ల కథ’ సిరీస్‌లో ఈ వారం రెండు కథలు సంచిక పాఠకులకు అందిస్తున్నారు. ఈ కథలు ప్రపంచతత్వాన్ని, మానవ మనస్తత్వాన్ని సూక్ష్మంగా ప్రదర్శిస్తాయి. [/box]

1. ఏం చెప్పింది ‘సుమతి?’

[dropcap]రా[/dropcap]మకృష్ణ మఠం విషయాలు మాట్లాడాలని రాధాకృష్ణ ఇంట్లోకి శేషయ్య అడుగుపెట్టబోతుంటే, అతనే మహా ఆవేశంగా కారు తీస్తున్నాడు.

శేషయ్య గారిని చూసి, రాధాకృష్ణ కారు దిగాడు. ఆవేశం తగ్గలేదు.

“మా తమ్ముడు గిరి ఓ చిన్నపనిమీద ఆ పురుషోత్తం ఇంట్లోకి అడుగు పెడుతుంటే, లోపల్నించి ఇలా వినబడింది. వినండి” అంటూ చరవాణి వినిపించాడు:

“…నేను కృష్ణ వాళ్ళకి యాభై వేల దాకా ఇవ్వాల్సి వుంది. ఇంక ఇవ్వను. మాట తేడా వచ్చాక, ఇచ్చే ప్రశ్నే లేదు. …..”

శేషయ్య సాలోచనగా తలూపారు.

“ఇది ధర్మమేనా చెప్పండి. మా అబ్బాయికి వాళ్ళ అమ్మాయి నచ్చలేదు. సంబంధం వదులుకున్నాం. మీకూ తెలుసు. అంత మాత్రాన యాత్రలప్పుడు అప్పిచ్చిన నా డబ్బు ఎగ్గొట్టేస్తాడా! బంధువులమనే గదా, కాగితం రాసుకోకుండా ఆయనకి అవసర మైనప్పుడు డబ్బిచ్చాను… వెళ్ళి తాడోపేడో తేల్చుకొస్తాను..” రాధాకృష్ణ ఆవేశంతో ఊగిపోతున్నాడు. శేషయ్య అతన్ని సముదాయించి కూర్చోపెట్టారు.

“ఎవరు రికార్డు చేశారు?”

“నేనే. వాళ్ళ ఇంటిమెట్లు ఎక్కుతుంటే, అన్నయ్య పేరు వినబడింది. ఎందుకైనా మంచిదని, రికార్డు చేసి తెచ్చాను..” నిండా ఇరవైలేని గిరి విజయహాసంతో కాలర్ లేపాడు. ఎటూ చెప్పలేని స్థితిలో ఆందోళనతో రాధాకృష్ణ భార్య నిలబడి వుంది. ఆమె బంధువే పురుషోత్తం.

“నువ్వు నామీద గౌరవం వుంచి, రెండు నిమిషాలు ఓపిక పట్టు. స్వతహాగా పురుషోత్తం అలాంటి వాడు కాదు….” గట్టిగా చెప్పి, ఆపారు శేషయ్య.

శేషయ్య తానే పురుషోత్తానికి ఫోను చేశారు. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడారు. పలకరింపులు అయ్యాక, శేషయ్య అడిగారు:

“ఏమయ్యా లాయరూ, నాకు ఓ యాభై వేలు అవసరపడేలా వుందయ్యా. సర్దగలవా!… నాకు నోటు రాయటం అదీ అలవాటులేదు మరి.”

“అయ్యా, తమర్ని నోటు అడుగుతానా! నోటిమాట కన్న నోటు ఎక్కువా!.. ఆ మధ్య యాత్రలకెళ్తూ మా కృష్ణ (రాధాకృష్ణ) దగ్గర యాభై వేలు నోటి మాట మీద తీసుకున్నాను. నోటు రాయలేదు గదా అని ఇప్పుడు ఎగ్గొట్టేస్తానా! మీరు గురుతుల్యులు…”

శేషయ్య పరాచికానికి దిగారు.

“మీ లాయర్లని నమ్మటానికి లేదయ్యా. ఏదో లిటిగేషన్ పెట్టి ఎగ్గొట్టినా ఎగ్గొట్టేస్తారు..!”

పురుషోత్తం కూడా నవ్వాడు. “కొన్ని సందర్భాలు అలా వస్తుంటాయి కూడా… ఆ మధ్య మా ఏలూరు సుబ్బారావు కొడుకు వచ్చి, నా సిఫార్సు మీద అయిదు నక్షత్రాల తాజ్ హోటల్లో దిగాడు. కొత్తగా మామిడిపళ్ళు ఎగుమతి చేస్తాట్ట. పార్టీలతో మాట్లాడుకున్నాడు. అయిదు రోజులుండి, బిల్లు ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. ఇప్పటికి రెండు సార్లు తాజ్ జనరల్ మేనేజర్ నాకు ఫోను. ఇందాక చెప్పేశాను. ‘మా వాడు ఇవ్వకపోతే నేనిస్తాను. వాళ్ళ నాన్నకి నేను ఒక లావాదేవీలో 45 వేల దాకా ఇవ్వాలి. అది ఆపేసి అయినా మీకు ఇస్తాను.’ అన్నాను. దీన్ని మీరు లిటిగేషన్ అంటారేమో అయ్యా!”

“సుబ్బారావు కొడుకు పసివాడు కదా!”

“ఎప్పుడో మీరు చూసినప్పుడు పసివాడు. ఇప్పుడు మహా పనివాడు ఆ శివబాల కృష్ణ. కృష్ణ అని పిలుస్తుంటాం….”

రాధాకృష్ణ, గిరిల మొహాల్లో రంగులు మారుతున్నాయి.

“సరే, నాకు అవసరపడితే చెబుతాన్లే లాయరూ” నవ్వుతూ ఫోను పెట్టేశారు శేషయ్య.

“సమయానికి మీరు రాకపోతే…” అంటూ రాధాకృష్ణ భార్య కళ్ళొత్తుకుంది.

“రాధాకృష్ణ, ఒక్క అపార్ధం రెండు కుటుంబాల మధ్య ఎంత దూరాన్ని పెంచేదో ఆలోచించు. ఇంకా నయం, మీ తమ్ముడు ఫోనులో ఆ సంభాషణ రికార్డు చేసిన సంగతి పురుషోత్తానికి తెలియదు…ఒరేయ్ గిరి, ఈ చరవాణులు వున్నది ఇలాంటి క్షుద్రశక్తుల ప్రయోగం కోసమటరా! మానవ సంబంధాలు విచ్ఛిన్నమై పోతాయిరా! !”

గిరి సిగ్గు పడ్డాడు. రాధాకృష్ణ ఆయన కాళ్ళమీద పడ్డాడు.

“వినదగు నెవ్వరు సెప్పిన, వినినంతనె వేగ పడక వివరింపదగున్, కని కల్ల నిజముదెలిసిన మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతీ” అంటూ శేషయ్య లేచారు.

2. ఓ చిన్నముక్క అది!

ఋష్యేంద్ర రావు!

మంగళూరులో ఆ ఉదయం ‘కన్నడ ప్రభ’ పత్రికలో స్థానిక లయన్సు క్లబ్ – జిల్లా కలెక్టర్ ఋష్యేంద్ర రావుని సన్మానిస్తున్న ఫొటో వార్త చదువుతుంటే, ఒళ్ళంతా పులకించింది శేషయ్యకి…!

వెంటనే తమ పెళ్ళి బృందంలో ఓ కుర్రాడి సాయంతో ఆ జిల్లా కలెక్టర్ బంగళాకి ఫోన్ చేశారు. “నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మీ కలెక్టరు గారితో మాట్లాడాలయ్యా..” అనగానే అటెండర్ తన దొరగారికి కలిపాడు. “బాబూ, నా పేరు శేషయ్య, హైదరాబాద్ నుంచి…” అంటున్న శేషయ్య గారి వాక్యం పూర్తి కాకుండానే ఋష్యేంద్ర రావు గొంతు వినయ విధేయతలతో పలికింది.

“సార్. పాదాభివందనాలు. ఎక్కడున్నారు?….. నేను వస్తున్నా…”

శేషయ్య ఇరవయ్యేళ్ళ క్రితంలోకి తొంగి చూశారు.

తాముండే ఇంటి పక్కింట్లో పదిహేనేళ్ళ కుర్రాడు వీడు. తండ్రి లేడు. మేనమామల ఇంట్లో వుండి చదువుకున్నాడు. మహా కోపం. క్లాసు కుర్రాళ్ళతో తగాదా, వీధిలో పిల్లలతో తగాదా. వీడి పంచాయతీలు తీర్చలేక ఆ తల్లి తన దగ్గరికి పంపించేది. తనకీ అప్పట్లో ఉద్యోగంలో అంత తీరిక లేదు. అయినా అప్పుడప్పుడు గమనిస్తే, వాడి ప్రతి తగాదా వెనకాల ఒకటే కారణం కనుపించేది. ఆత్మాభిమానం అతి ఎక్కువ. తన జోలికొస్తే ఊరుకోడు. మాట పడడు. తన మాట నెగ్గకపోతే ఊరుకోడు… ఆ మేనమామకి ఢిల్లీకి బదిలీ అయింది. ఇతను ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసుకి ఎంపికైనప్పుడు తను ఒక లేఖ రాశాడు. మళ్ళా అతని సమాచారం లేదు.

ఋష్యేంద్ర రావు స్వయంగా కారు నడుపుకుంటూ లుంగీ, చొక్కా వేసుకొని వచ్చేశాడు. పెళ్ళివారంతా చూస్తూండగా, శేషయ్యగారి కాళ్ళమీద పడిపోయాడు.

“ఎన్నాళ్ళకు చూశాను సర్!” అతని గౌరవం, అభిమానం కళ్ళల్లో అశృవుల రూపంలో కనుపించాయి. సాయంత్రం మళ్ళీ దింపుతానని పెళ్ళివారికి మాట ఇచ్చి, శేషయ్యగారిని తన బంగళాకి తీసుకెళ్ళాడు. చాలా మర్యాద చేశాడు. భార్య, పిల్లల చేత కూడా మర్యాద చేయించాడు.

తన ఆఫీసుకి తీసుకెళ్ళాడు. అక్కడ ‘ప్రజా దర్బారు’ చేస్తాడట. తన సీట్లో కూర్చుంటూనే తన ఎదురుగా టేబిల్ మీదున్న ఓ చిన్న గోల్డ్ ఫ్రేం ఫొటోకి నమస్కారం చేశాడు. దర్బారు మొదలైంది. వరుసలో జనం…  ప్రతిఒక్కరి సమస్య అడిగి తెలుసుకుంటున్నాడు. కాగితాలు తీసుకుంటున్నాడు. కొంతమందిని వెంట వెంటనే పంపించేస్తున్నాడు. కొంతమందికి కొంచెం ఎక్కువ సమయం తీసుకొని నచ్చజెబుతున్నాడు.

అకస్మాత్తుగా ఒక పెద్దాయన వచ్చాడు. కూలీలు, కార్మికుల కోసం పనిచేసే పార్టీలో కీలకమైన నాయకుడట. లోపలికి వస్తూనే, ఋష్యేంద్రరావుకి రెండు చేతులు జోడించి, కన్నీళ్ళు కారుస్తూ నమస్కారం చేశాదు.

“నా భార్యకి ఇంతపెద్ద సర్జరీ జరిగి, మృత్యువుని జయించిందంటే, అది మీవల్లనే… నన్ను క్షమించడయ్యా, అప్పుడు మీమీద రాజకీయ కారణాలవల్ల నేను చేసిన ఆరోపణని, ప్రచారాన్ని మీరు మనసులో పెట్టుకోకుండా..” ఋష్యేంద్రరావు చటుక్కున సీట్లోంచి లేచి, ఆయన్ని ఇంక మాట్లాడనివ్వలేదు. ఒక్క నిమిషంలో పంపించేశాడు.

సాయంత్రం అవుతోంది. శేషయ్య లేస్తున్నారు. “నేను దింపుతాను సర్” అంటూ ఋష్యేంద్రరావు కూడా లేచాడు.

“జీవితం ఎలా వుంది?”

“ప్రశాంతంగా వుంది సర్,” అంటూ రెస్ట్ రూంకి వెళ్ళాడు రావు.

“ఇలా ఎవరూ చెప్పరే. నువ్వు ఎలా చెప్పగలుగుతు…” అంటూ శేషయ్య తన కుర్చీలోంచి లేచి, ఋష్యేంద్రరావు ఆఫీసుకి వస్తూనే నమస్కరించిన దాంట్లో ఏముందా అని ఆ గోల్డ్ ఫ్రేం త్రిప్పి చూశారు. అక్కడ:

“నీకు ఇతరులు చేసిన అపకారాన్ని, నువ్వు ఇతరులకు చేసిన ఉపకారాన్ని మర్చిపో… నువ్వు ఇతరులకు చేసిన అపకారాన్ని, నీకు ఇతరులు చేసిన ఉపకారాన్ని గుర్తుంచుకో… సహాయం చేయగలిగిన చోట ఆలస్యం చేయవద్దు, చేయలేని చోట అనునయంగా చెప్పటం మరవద్దు… నిన్ను ద్వేషించేవాణ్ణి కూడా ప్రేమించటమే మనశ్శాంతిని ఇస్తుంది. దాన్ని మించిన సంపద మరొకటి లేదు. ….ఆశీస్సులతో, శేషయ్య.”

ఒక్కసారిగా గుండెలోతుల్లో ఆనందం పరవళ్ళు తొక్కింది… ఋష్యేంద్రరావు ఐ.ఏ.ఎస్.కి ఎంపికైనప్పుడు, తాను రాసిన ఉత్తరంలో ఒక ముక్క అది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here