99 సెకన్ల కథ-16

4
8

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత, సంపాదకులు, పాత్రికేయులు జి. వల్లీశ్వర్ ’99 సెకన్ల కథ’ సిరీస్‌లో ఈ వారం రెండు కథలు సంచిక పాఠకులకు అందిస్తున్నారు. ఈ కథలు ప్రపంచతత్వాన్ని, మానవ మనస్తత్వాన్ని సూక్ష్మంగా ప్రదర్శిస్తాయి. [/box]

1. విజయం వెనకాల ఎవరున్నారు?

[dropcap]1[/dropcap]00 మీటర్ల హర్డిల్స్ పరుగు పందెంలో జాతీయస్థాయిలో కొత్త రికార్డు సాధించి వచ్చిన హేమకి రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో సన్మానం జరగబోతోంది మరికొద్ది నిమిషాల్లో. మనరాష్ట్రం నుండి తొలిసారిగా 13 సెకన్ల వ్యవధిలో 100 మీటర్ల హర్డిల్స్ పూర్తిచేసి, రాష్ట్ర ప్రతిష్ఠని జాతీయ స్థాయిలో ఇనుమడింపజేసిన తొలి తెలుగు యువతిగా నిలబడింది హేమ. ఈ విజయంతో రాష్ట్ర క్రీడా సంస్థ కూడా ఆనందం పట్టలేకపోతోంది. స్టేడియం అంతా కిటకిట లాడిపోతోంది.

ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రి రాజశేఖరం ముఖ్య అతిథిగా వస్తున్నారు కాబట్టి జనం విరగబడి వచ్చారు.

హేమ తన కోచ్ – ఒకప్పటి పరుగులరాజు – గుర్రాజుతో కలిసి వేదిక ఎక్కింది. స్టేడియం అంతా హర్షధ్వానాలు. ముఖ్యమంత్రి కూడా వచ్చేశారు. కేకలు, ఈలలు, చప్పట్లతో స్టేడియం హోరెత్తి పోయింది.

క్రీడా సంస్థ కార్యదర్శి తన స్వాగత వచనాలలో ఎందుకు ఇంత ఘనంగా హేమను సన్మానిస్తున్నామో చెప్పారు.

“ఒక ఎనిమిదేళ్ళక్రితం ఈమె కాలేజి విద్యార్ధిగా వున్నప్పుడే జిల్లా స్థాయిలో 60 మీటర్ల హర్డిల్స్‌లో రాష్ట్ర రికార్డుని తిరగరాసింది. అప్పుడే జాతీయ స్థాయి పోటీలకి ఈమెని పంపాలని నిర్ణయించాం. కాని, పెళ్ళి చేసుకొని, సంసారం పరుగులో పడి, హర్డిల్స్ పందాలకి సెలవు చెప్పేసింది. మళ్ళీ ఎందుకో మూడేళ్ళ నుంచీ హర్డిల్స్‌కి సాధన ప్రారంభించింది. ఇప్పుడు మంగుళూరు దగ్గర జరిగిన జాతీయ క్రీడల్లో పాతికేళ్ళ వయసులో కూడా అసాధారణ ప్రతిభ చూపించి, తెలుగువారి విజయ పతాకాన్ని ఎగురవేసింది…”

కరతాళధ్వనులు మ్రోగి పోతున్నాయి.

అప్పటిదాకా ముఖ్యమంత్రి పక్కకువంగి, హేమతో ఏదో మాట్లాడుతున్నారు.

కార్యదర్శి ప్రకటించారు: “ఇప్పుడు ముఖ్యమంత్రిచే సన్మానం.”

ముఖ్యమంత్రి తన భద్రతాధికారి చెవిలో ఏదో చెప్పారు. అంతే, వెంటనే అతను వెళ్ళి ఒక యువకుడిని, అతని నాలుగేళ్ళ కూతుర్ని వేదికపైకి తీసుకు వచ్చాడు. ముఖ్యమంత్రి ఆ పిల్లని ఎత్తుకొన్నారు. “రావయ్యా, వాసూ” అని ఆ యువకుడిని పిలిచారు. వాసు, హేమలని పక్క పక్కన నిలబెట్టి, ఆ పిల్లచేత వాళ్ళ ఇద్దరికీ కలిపి గజమాల వేయించారు.

కరతాళధ్వనులతో స్టేడియం ప్రతిధ్వనించింది.

“ప్రతి భార్య విజయం వెనకాల ఒక భర్త వుంటాడు. అవునా? కాదా?” అని రాజశేఖరం ప్రశ్నిస్తే, జనం అంతా “అవును, అవును…” అంటూ కరతాళాలు..! ప్రభుత్వ సత్కారం, నగదు బహుమానం … అన్నీ ముగిశాయి.

ముఖ్యమంత్రి ప్రసంగం అవగానే హేమ ప్రతివచనం మొదలైంది.

“…ముఖ్యమంత్రిగారు చెప్పింది నిజం. నా సాధనకు సహకరించటం ద్వారా నా విజయం వెనకాల నిలబడింది నా భర్త. కాని అంతకన్నా ముందు, నాలో నిద్రాణమై వున్న శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని మేల్కొలిపింది ఒకే ఒక్క వాక్యం. మూడేళ్ళక్రితం ఆ ఒక్క వాక్యాన్ని అందించిన, ఒక స్నేహితురాలి తాతగారు ఇక్కడే ఎక్కడో… అదుగో అక్కడ…” అంటూ పరుగుపరుగున వెళ్ళి ముందువరుసలో కూర్చున్న శేషయ్యగారిని పట్టుకొని ఆనందంతో ఏడ్చేసింది హేమ.

“ఆ వాక్యం ఏమిటో మాక్కూడా చెప్పండి శేషయ్యగారూ” అంటూ ముఖ్యమంత్రి ఆయన్ని వేదికపైకి ఆహ్వానించారు.

ఇవ్వాళ నువ్వు ఈ స్థాయిలో వుండటానికి నిన్నటిదాకా చేసిన సాధనే కారణమైతే, రేపు నువ్వు ఏం సాధించాలను కుంటున్నావో దాన్ని సాధించవచ్చు ఇప్పటినుండి సాధన చేయటం ద్వారా... (కరతాళధ్వనుల మోత) ఈ వాక్యాన్ని అందించింది నేను కాదు, స్వామి వివేకానంద.”

కరతాళధ్వనులు ఇక ఆగనేలేదు.

అది జనవరి 12.

2. వ్యాసుడు చెప్పిన ‘రహస్యం’

“పండిత చర్చలో ఆగ్రహంతో ఊగిపోయిన ఉమామహేశ్వర పండిట్…

రసాభాసగా పండిత సదస్సు…|”

పొద్దున్నే మీడియాలో ఈ వార్తలు చూస్తూనే శేషయ్య ఆవేదన చెందారు. అయిదుపదుల వయస్సులో వున్న ఉమామహేశ్వరుడు గొప్ప ప్రవచన కర్తగా పేరు పొందాడు. అసాధారణమైన జ్ఞాపకశక్తి. హుషారుగా శ్రోతల్ని బాగా రంజింపజేసే ఉపన్యాసకుడిగా పేరుపొందాడు. ఆ ఖ్యాతి అతన్ని లెక్చరర్ ఉద్యోగానికి రాజీనామా చేయించింది. ఏ విషయం మీదైనా అనర్గళంగా మాట్లాడగలడు. మాట కూడా మహా స్పీడు.

ఇలాంటి ప్రవచన కర్తల్ని, హేతువాదుల్ని కలిపి, ‘హేతువాదమా! తాత్విక చింతనా!’ అనే అంశం మీద ఒక టివి చానల్ చర్చ పెట్టింది. హేతువాదుల ప్రశ్నల్లో హేతువాదం జీవితంలో ఎంతవరకూ అవసరం అన్న అంశం కన్నా, ధార్మిక చింతనవల్ల మనిషి ఏమీ సాధించలేడు అని నిరూపించాలన్న ఆరాటం ఎక్కువగా కనిపించింది. చర్చలో ఉమామహేశ్వరుడి జ్ఞానానికి వాళ్ళు తాటాకులు కట్టే ప్రయత్నం చేశారు.

ఉమా పండిట్‌కి ఆవేశం వచ్చింది! … ఇక మీడియాకి కావాల్సినంత మసాలా.

పొద్దున్నే ఉమా భార్య సావిత్రి ఆదుర్దాగా ఫోన్ చేసింది. “బాబాయి గారు, ఈయన శివాలు తొక్కుతున్నారు. ‘వాడి మీద కేసు పెడతా, వీడి మీద పెడతా’ అంటూ ఒకటే వీరంగం. భయంగావుంది. మీరు ఒక్కసారి రారా!”

***

“ఏమయ్య ఉమా, రాత్రి టివిలో బాగా మాట్లాడావయ్యా” అన్నారు శేషయ్య ఉమా ఇంట్లో అడుగుపెడుతూనే. చాలా ఆవేశంగా ఒక పత్రికా ప్రకటన తయారు చేయాలని కూర్చున్న ఉమా రాయటం ఆపేశాడు.

“అయ్యా నమస్కారం. మీరు చూశారా?”

“నువ్వు ఎంత హేతుబద్ఢంగా మాట్లాడావయ్యా! ధార్మిక చింతన మనిషికి ఎందుకు అవసరం … అంటూ నువ్వు చెప్పిన కారణాలు నాకు చాలా బాగా నచ్చాయనుకో.”

ఉమా పండిట్ తన కలాన్ని మూసేశాడు. శేషయ్య తన వాదనా పటిమను విశ్లేషిస్తూ మాట్లాడుతుంటే, ఆవేశం తగ్గిపోయింది. ఉత్సాహం వచ్చింది. మొహంలో చిరునవ్వు విరిసింది.

“సావిత్రీ, మా డి.జి (దత్త గురువు) వచ్చారు. మాంఛి కాఫీ తీసుకురా” అంటూ కేకేశాడు.

“…గొప్ప ధారణశక్తి వుండటం నీకు వరం అనుకో. నీ లాగా వాళ్ళు టకటకామని రిఫరెన్సులు ఇవ్వలేపోయారు!…”

ఉమా మొహం వెయ్యి వాట్టుల బల్బులాగా వెలిగిపోతోంది. సావిత్రి ధైర్యంగా కాఫీ తెచ్చింది.

ఇద్దరూ నవ్వుకుంటూ మాట్లాడు కుంటున్నారు.

“మూర్ఖులు విజ్ఞుల్ని ముందు తమ స్థాయికి దిగజార్చి, అప్పుడు వాళ్ళని రెచ్చగొడతారు; ఓడించటం సులభమవుతుంది – అని ఆంగ్లంలో ఒక సూక్తి వుంది. ఇప్పుడు నువ్వు మళ్ళీ ఖండన ప్రకటన ఇవ్వాలని ప్రయత్నించటం అంటే, వాళ్ళదే పైచేయి అయ్యేలా చేయటం…”

ఆవేశం తగ్గిపోయి, వివేకంతో ఆలోచించే స్థాయికి వచ్చిన ఉమాకి డిజి గారు చెప్పింది సమంజసంగా అనిపించసాగింది.

“చూడు, రెండు విషయాలు. ఒకటి: కోట్లమంది ప్రజలు నీలాంటి వాళ్ళు చెప్పేది వినాలనుకుంటున్నారు. జనాభాలో ఒక్క శాతం కూడా లేని మేధావులతో చర్చకి వెళ్ళటం నీ సమయాన్ని వృథా చేసుకోవటం. వెళ్ళకు.

రెండు: వ్యాసుణ్ణి అనుక్షణం గుర్తు చేసుకో.”

ఉమా టక్కున తలెత్తి చూశాడు,

“నీకున్న జ్ఞానానికి, నీకున్న ధారణ శక్తికి నువ్వు గొప్ప గొప్ప గ్రంథాలు రాయగలవు. అంతర్జాతీయ స్థాయికి ఎదగగలవు. కాని నిన్ను ఇలాంటి వివాదాల్లోకి లాగి నువ్వు ఇంతకన్న ఎదగనీయకుండా చేస్తూ, నీకు శత్రువుల్ని పుట్టిస్తున్నవి నీ కోపం, నీ నోరు. అందుకే, యోగ సాధన చెయ్యి. వ్యాసుడు చెప్పిన బాటలో నడవటానికి ప్రయత్నం చెయ్యి…”

ఉమా పండితుడిలో ఉత్సుకత పెరిగిపోయింది. “వ్యాసుడు…!”

“నువ్వూ చదువుకొని వుంటావు. కాని, నీ కోపం నీ జ్ఞానాన్ని కప్పేస్తోంది. ధృతరాష్ట్రుడు వానప్రస్థాశ్రమంలో వుండగా వ్యాసమహర్షి వచ్చి చెప్పాడు. అది తెచ్చాను” అంటూ దాన్ని ఉమాకిచ్చారు. అది చదువుతూనే ఉమా సిగ్గుపడి పోయాడు.

ఆరు మాసాల తరువాత సావిత్రి ఓరోజు ఆనందంగా శేషయ్యగారికి ఫోన్ చేసింది.

“మళ్ళీ ఏమైంది తల్లీ!”

“ఆయన చాలా మారిపోయారు….” శేషయ్య నవ్వుకున్నారు.

ఏతత్ధి త్రితయం శ్రేష్టం సర్వభూతేషు భారత, నిర్వైరతా మహారాజ సత్యమ క్రోధయేవచ’ – శత్రువులు లేకపోవటం, సత్యాన్ని ఆచరించటం, క్రోధాన్ని జయించటం అనే మూడు గుణాలు వున్నవాడే అన్ని ప్రాణులలోకీ శ్రేష్టుడు.

(మహా భారతం).

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here