99 సెకన్ల కథ-17

2
10

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత, సంపాదకులు, పాత్రికేయులు జి. వల్లీశ్వర్ ’99 సెకన్ల కథ’ సిరీస్‌లో ఈ వారం రెండు కథలు సంచిక పాఠకులకు అందిస్తున్నారు. ఈ కథలు ప్రపంచతత్వాన్ని, మానవ మనస్తత్వాన్ని సూక్ష్మంగా ప్రదర్శిస్తాయి. [/box]

1. వియ్యపురాలి అలక!

[dropcap]”బా[/dropcap]బాయి గారు, ఆ కుటుంబం గురించి మీరు అంత గొప్పగా చెప్పారు కదా! మరి, అప్పగింతలప్పుడు ‘మా అమ్మాయిని మీ కూతురులా చూసుకోవాలి వదిన గారూ’ అని నేనంటే, ఆ వియ్యపురాలు అలా అందేమిటండీ?”

కస్తూరి అడిగిన ఈ ప్రశ్నకు శేషయ్య నవ్వారు.

“పెళ్ళి ఘనంగా చేశారు కదమ్మా! పదహారు రోజుల పండుగ కూడా అయిపోయింది. పెళ్ళికొచ్చిన నీ ఇద్దరు కొడుకులు కూడా వాళ్ళ ద్వీపాలకి వాళ్ళు వెళ్ళిపోయారు.. ఏమయ్యా, అంతేనా?” అన్నారు కస్తూరి ఇచ్చిన కుంబకోణం కాఫీ సేవిస్తూ శేషయ్య.

“అవునవును. అంతేగా” అన్నాడు కస్తూరి పతి దేవుడు (కె.పి.డి).

కస్తూరి ఇంకా సమాధానపడలేదు.

బాల్యం నుంచి పట్టెమంచాలు, పట్టుపరుపుల మీదనే జీవితంలో మూడో భాగం గడిపేసిన నేపథ్యం కస్తూరిది. యుక్తవయసులో పెళ్ళయ్యాక, పి.డి గారి ప్రభుత్వ ఉద్యోగహోదా కారణంగా సూపర్ బజార్ దగ్గర్నుంచి శ్రీనగర్ దాకా దేశమంతా కారులోనే ‘నడిచిన’ వైభవం కూడా కస్తూరికి వుండేది.

కె.పి.డికి 58 నిండాక, “ఇలాంటి చవకబారు ప్రభుత్వ ఉద్యోగాలు మనకెందుకే కస్తూరి! నేను వదిలేస్తున్నా” అని ఠపీమని ఆ ఉద్యోగం వదిలేశాడని చాలాసార్లు శేషయ్యగారికి మొరపెట్టుకొని దుఃఖపడిన వేదనా హృదయం కూడా కస్తూరిదే!

అయినా తనది విశాల హృదయం కాబట్టే – వరుడికి పట్టెలు, పట్టులు వగైరా నేపథ్యం ఏమీ లేకపోయినా ఏదో (తన ఊళ్ళో ఐ.టి.ఐ లాంటిదే కాబోలు) “ఖరగాపురం ఐ.ఐ.టి.లో చదువుకున్నాడు, మంచి కుర్రాడు, కొడుకు పుట్టే సమయానికి కంటెస్సా కారు కొనేస్తాడు…” ఇలా శేషయ్య గారు చెబితే తన మనసుని ఇంకా విశాలం చేసుకొని, ఈ పెళ్ళి చేసింది కస్తూరి.

ఇద్దరు కొడుకుల తరువాత, తనకి అమ్మాయే కావాలని పది మంది పండితుల చేత దుర్గ అమ్మవారి గుళ్ళో పదకొండు రోజులపాటు జపాలు చేయిస్తేనే కదా ఈ పిల్ల పుట్టింది! ఎంత ప్రేమగా చిన్నప్పట్నుంచి తనతో కారులోనే ‘నడిపిస్తూ’ పెంచింది! ఇంకా ఎంతో గొప్ప సంబంధాలు వస్తాయని తెలిసినా, శేషయ్య గారు చెప్పిన సంబంధం అయితే, అమ్మాయి కళ్ళముందే వుంటుందన్న ఒకే ఒక్క ‘చిన్న’ కారణంగా తన మనసుని మరింత మహావిశాలం చేసుకొని,తరతరాలకీ చెప్పుకునేటంత ఘనంగా పెళ్ళి చేసిందా! అలాంటి తన పెద్దమనసుని వియ్యపురాలు ఏమాత్రమైనా గుర్తించిందా?

ఇదిగో, ఈ ప్రశ్నలన్నింటినీ శేషయ్యగారు కుంబకోణం కాఫీ తాగుతుండగా సంధించింది కస్తూరి. మధ్య మధ్యలో, “ఏమండీ నిజమా, కాదా?” అని కస్తూరి ప్రశ్నించినప్పుడల్లా, “అవును కదూ..” అంటూ ఎంతో ప్రేమతో తలూపుతున్నాడు కె.పి.డి.

“సరేనమ్మాయి. అప్పగింతలప్పుడు నీ వియ్యపురాలు ఏమని చెప్పి వుంటే, నీకు సంతృప్తిగా వుండేది, చెప్పు” అని అడిగారు శేషయ్య.

“నా పిల్ల పట్ల నా ప్రేమని నా కన్నీళ్ళల్లో చూసివుండేది. నా విశాలహృదయాన్ని అర్థం చేసుకొని వుండేది. అలా జరిగివుంటే…” ఆవేశం వచ్చేస్తుంటే, ఆపుకొన్నట్లు ఒక దీర్ఘ శ్వాస తీసుకొంది కస్తూరి.

“ఆ..వుంటే!”

“మీ కూతుర్ని నా కూతురులా చూసుకుంటాను వదినగారూ, బాధపడకండి – అని సముదాయించి వుండేది… నా చేతిలో చెయ్యేసి, అందరూ వినేలా మైకులో బాస చేసి వుండేది… నా కన్నీళ్ళు తన కుడిచేతి చూపుడు వేలితో తుడిచి వుండేది.. ఈ మాత్రానికే ఏడుస్తున్నారా వదినగారూ అంటూ నన్ను ఆలింగనం చేసుకొని…”

“నీ కవయిత్రి హృదయం అర్థమయింది గానీ, ఇక చాల్లే, ఆపు” శేషయ్య సున్నితంగా కస్తూరి భావావేశాన్ని ఆపారు.

కస్తూరి రోషంతో పి.డి వైపు చూసింది. “అవును కదూ” అలవాటుగా అనేసి, నాలిక కొరుక్కున్నాడు పి.డి.

“కస్తూరీ, నీ కోడళ్ళు ఎప్పుడైనా తప్పు చేస్తే వాళ్ళమీద నువ్వు నీ కూతురి మీద అరిచినట్లు అరిచావా? (కొంచెం ఆలోచించి, తల అడ్డంగా ఊపింది కస్తూరి.) …పోనీ, వాళ్ళెప్పుడైనా నీ మీద విసుక్కుంటే, ‘నా కూతురు లాగానే విసుక్కున్నారులే’ అని పట్టించుకోకుండా ఊరుకున్నావా? (ఆలోచించకుండానే, తల అడ్డంగా ఊపింది.) అందుకే, నీ వియ్యపురాలు నువ్వు కోరుకున్నట్లు చెప్పివుంటే, అది అబద్ధం అయి వుండేది. ఈ కాలంలో చదువుకోని కోడళ్ళే ఊరుకోవటంలేదు – అత్త ఏదన్నా మాట అంటే. ఇక చదువుకున్న కోడళ్ళు…! నీ కోడళ్ళే నీకు దృష్టాంతం.”

“అసలింతకీ ఆవిడ ఏమంది? నేను వినలేదు ఆ రోజు.” కె.పి.డి ప్రశ్న.

“నా కోడలు నా ఇంట్లోనే వున్నా, కొడుకు, కోడలూ వేరే ఇల్లు తీసుకొని వున్నా, నేను నా కోడలికి మంచి స్నేహితురాలిగా వుంటాను. నమ్మండి వదినగారు – అంది… కస్తూరీ, స్నేహం ప్రేమని పంచుతుంది, పెత్తనాన్ని కోరుకోదు. అందులో అలకలుంటాయేమోగాని, అసూయా ద్వేషాలుండవు…. అలా వుండాలనీ, అలా చెప్పమనీ నేనే చెప్పాను. తప్పా?”

కస్తూరి కళ్ళు పశ్చాత్తాపాశ్రువులతో చెమ్మగిల్లాయి. పి.డితో కలిసి శేషయ్య కాళ్ళమీద పడిపోయింది.

2. ఒక చదువుకున్న ఇల్లాలు

సికంద్రాబాద్ స్టేషన్లో ఎక్స్‌ప్రెస్ ట్రెయిన్ కదిలింది. సాధారణ ప్రయాణీకుల బోగీలో ఎక్కారు శేషయ్య. ఖమ్మంలో వేదాంత సభలు వినాలని కోరిక.

వారాంతం కావటంతో ట్రయిన్ రద్దీగా వుంది. ముగ్గురు యువకులు కూర్చున్న బెర్త్ మీద, ఒక చివర్లో శేషయ్య కూర్చున్నారు. వీళ్ళకి ఎదురుగా ఒక 30 ఏళ్ళ వయస్సున్న యువకుడి కుటుంబం కూర్చుంది. భార్యాభర్తలమధ్య 4-5 ఏళ్ళ కొడుకు కూర్చున్నాడు. ఆ యిల్లాలు కిటికీ దగ్గర ఏడాది వయసున్న తన పిల్లని నిలబెట్టి, బయట ప్రపంచం చూపిస్తోంది. ఆమె మాట తీరుని బట్టి కాలేజి దాకా చదువుకున్నట్లుగా కనిపిస్తోంది. ఈ కుటుంబం తరువాత ఒక నడివయస్కుడు – వ్యాపారస్థుడు కావచ్చు – కూర్చున్నాడు. మొత్తం మీద వాళ్ళ బెర్త్ కూడా నిండీ నిండనట్లుగా వుంది.

సామవేదం షణ్ముఖ శర్మగారి ‘ఇదీ యథార్థ మహాభారతం’ పుస్తకం చదువుకుంటున్నారు శేషయ్య. ఆయన ప్రక్కన కూర్చున్న కుర్రాళ్ళు తమ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల విషయాలు చర్చిస్తున్నారు.

ట్రెయిన్ జనగాంలో ఆగింది. ఒక్క నిమిషమే ఆగి, బయల్దేరింది. 30-40 మధ్య వయస్సులో సన్నగా వున్న ఒక నీలం చొక్కా యువకుడు ఎక్కాడు. ఎక్కడా సీటు కనబడలేదు. శేషయ్యకి ఎదురుగా బెర్తు మీద వ్యాపారస్తుడిలా వున్న ఆయన్ని కొంచెం సర్దుకోమన్నాడు నీలం చొక్కా. “ఎక్కడ సర్దుకుంటానయ్యా?” అంటూ ఆయన విసుక్కున్నాడు. నీలం బ్రతిమాలాడు. అది చూసి, ఆ ప్రక్కన ఇద్దరు పిల్లల తల్లి తన కొడుకుని కాస్త తన దగ్గరికి తీసుకుంది. కిటికీ పక్క పిల్లని ఒళ్ళోకి తీసుకుంది. భర్తని కూడా కొంచెం లోపలకి జరగమంది. వ్యాపారం గారు నసుగుతూనే జరిగాడు. ఇప్పుడు నీలంకి జాగా దొరికింది. “థాంక్స్” అంటూ నీలం కూర్చున్నాడు.

సాఫ్ట్‌వేర్ యువకులు శేషయ్యని ఆ మహాభారతం పుస్తకం గురించి అడుగుతున్నారు.

ట్రెయిన్ ఖాజీపేట చేరింది. నీలం ప్రక్కన వ్యాపారస్తుడు దిగిపోయాడు. ఆ సీట్లో నీలం, అలా కిటికీ ప్రక్కన ఏడాది పిల్ల దాకా అందరూ బెర్తు మీద మునుపటి స్థితిలోకి కొంచెం సదుపాయంగా సర్దుకున్నారు. ట్రెయిన్ కదిలింది.

“ఇప్పుడు మీరు చదువుతున్న విషయం ఏమిటి తాతగారు?” అని ఆ కుర్రాళ్ళు అడిగారు.

“శాంతి అనుశాసనిక పర్వాలు. భీష్ముడు అంపశయ్య మీద పడుకొని వుండే, ధర్మరాజుకి అనేక ధర్మాలు బోధిస్తుంటాడు. …. అవన్నీ ఈ కాలంలో కూడా మనుషులు ఆచరించాల్సినవే…”

ట్రెయిన్ వరంగల్లులో ఆగింది. ఒక పెద్దాయన ఎక్కాడు. 70 దాకా వుండచ్చు. ట్రెయిన్ కదిలింది. ఆయన అటు ఇటూ ఖాళీ ఎక్కడ వుందా అని చూసుకుంటూ వస్తున్నాడు. అది గమనిస్తూనే, నీలం ఠక్కున రెండు కాళ్ళూ పైకెత్తుకుని మఠం వేసుకుని కూర్చున్నాడు. ఆ పెద్దాయన చివరికి నీలం దగ్గరే ఆగాడు.

“నాయనా, కొంచెం సర్దుకుంటావా?” అని అడిగాడు.

“ఎక్కడ, ఎక్కడ సర్దుకోవాలి? చూడండి, పాపం వాళ్ళూ, ఇద్దరు పిల్లలూ…! ఇంకెక్కడన్నా చూసుకోండి” అంటూ తన పక్క కుటుంబాన్ని చూపిస్తూ, నీలం విసుక్కున్నాడు. దాంతో ఆ పిల్లల కుటుంబం యజమాని కూడా ఇరకాటంలో పడ్డాడు. పెద్దాయన బ్రతిమాలుతున్నాడు – “నేను విజయవాడ దాకా వెళ్ళాలి నాయనా…”

“మనుషులు ఆచరించాల్సిన అత్యుత్తమ ధర్మం ఏదని భీష్ముడు చెప్పాడు?” అని సాఫ్ట్ యువకుడు అడిగాడు. శేషయ్య చెప్పారు.

“యదన్యైర్విహితం నేచ్ఛేదాత్మనః కర్మ పూరుషః, న తత్ పరేషు కుర్యాచ్చ జానన్నప్రియమాత్మనః …” అంటూ శేషయ్య ఠక్కున తన సీట్లోంచి లేచి, ఆ 70 ఏళ్ళ పెద్దాయనకి సీటిచ్చాడు. ఆయన మొహమాట పడుతుంటే, సాఫ్ట్ యువకులు ‘”మేమిస్తాం.. మేమిస్తాం” అంటున్నా వినకుండా, ఆయన్ని ఈ 82 ఏళ్ళ శేషయ్య తన సీట్లో కూర్చోపెట్టారు.

“ఆ శ్లోకానికి అర్థం…?” యువకుల్లో ఉత్కంఠ పెరిగింది.

“ఇందాక ఈ నీలం చొక్కా జనగాంలో ఎక్కినప్పుడు వీళ్ళు తనకి సీటు ఇవ్వకపోటం అతనికి నచ్చలేదు. చివరికి ఇచ్చారు కదా! కాని, ఇప్పుడు అదే నీలం ఏం చేశాడు? కొంచెం సర్దుకుని ఈ పెద్దాయనకి సీటు ఇవ్వటానికి ఇష్టపడలేదు. ఇవ్వకుండా వుండటం కోసం మఠం వేసుక్కూర్చున్నాడు. ఇలాంటి వైఖరి గురించే ఈ శ్లోకం చెబుతోంది. ‘ఇతరులు నీ పట్ల ఎలా వుంటే నీకు నచ్చదో, నువ్వు ఇతరుల పట్ల అలా ప్రవర్తించకు ‘అని…”

సాఫ్ట్ యువకులు చప్పట్లు కొట్టేశారు. నీలం సిగ్గుపడి, పక్కకి జరిగి “కూర్చోండి” అన్నాడు శేషయ్య గారితో. శేషయ్యకి కూర్చునే సమయం లేదు. ఖమ్మం స్టేషనులోకి ట్రెయిన్ ప్రవేశిస్తోంది.

“సర్, తెలుగులో ఆ శ్లోకం..” ఒక సాఫ్ట్ అడిగాడు.

“నేను చెబుతాను. మీరు జాగ్రత్తగా దిగండి అంకుల్” అంది ఆ ఇల్లాలు.

శేషయ్య దిగుతుంటే, వెనకాల నుంచి వినబడుతోంది.

‘ఒరులేయవి యొనరించిన, నరవర, యప్రియము దనమనంబునకగు దానొరులకు నవి సేయకునికి పరాయణము పరమ ధర్మపథములకెల్లన్…’.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here