99 సెకన్ల కథ-18

4
8

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత, సంపాదకులు, పాత్రికేయులు జి. వల్లీశ్వర్ ’99 సెకన్ల కథ’ సిరీస్‌లో ఈ వారం రెండు కథలు సంచిక పాఠకులకు అందిస్తున్నారు. ఈ కథలు ప్రపంచతత్వాన్ని, మానవ మనస్తత్వాన్ని సూక్ష్మంగా ప్రదర్శిస్తాయి. [/box]

1. నువ్వు నాకు నచ్చావు

[dropcap]సుం[/dropcap]దరం కూతురు సుమేధకి పెళ్ళి సంబంధం ఇంచుమించు ఖాయమైనట్లే. అయినా, పెళ్ళికొడుకు ప్రదీప్ మళ్ళా ఒకసారి తాను సుమేథతో మాట్లాడాలను కుంటున్నానని కబురు చేశాడు. ఒక సాయంత్రం గండిపేట వైపు సుమేథ రాగలదా అని అడిగాడు. సుమేథ తనకి అభ్యంతరం లేదని, అయితే తనతోపాటు ఎవరన్నా ఒక్కరయినా రావాలని కోరుకుంది. సుందరం తనకి ఆత్మబంధువైన శేషయ్యగారిని ఫోనులో అభ్యర్ధించాడు.

“అంకుల్, మీరు వెళ్తే బాగుంటుంది…”

ప్రదీప్ కారులో ముందు సీట్లో సుమేథ, వెనుక సీట్లో శేషయ్య, సుమేథ అన్నకొడుకు ఏడేళ్ళ ఫణి కూర్చున్నారు. సుమేథతో మాట్లాడుతూ ప్రదీప్ డ్రైవ్ చేస్తుంటే, ఫణిగాడికి శేషయ్య హరిశ్చంద్ర కథ చెబుతున్నారు. … గండిపేట వెళ్ళే దారిలో, శీతల పానీయాలు, బిస్కట్సు తీసుకుందామని ప్రదీప్ కారుని రోడ్డు పక్కకి తీసి ఆపాడు. డోరు ఠపీమని తీస్తున్నాడు… అంతే! ఠంగ్ మంటూ శబ్డం అయింది. ఏం జరిగిందో అర్థం అయ్యేసరికి, వెనక నుంచి వస్తూ, పక్కగా వెళ్తున్న ఒక కారు పక్కచూపుల అద్దాన్ని ప్రదీప్ కారు డోరు కొట్టేసింది. ప్రదీప్ డోరు మూసేసాడు. కాని ఈ డోరు కొట్టిన ఉధృతానికి ఆ కారు పక్కచూపుల అద్దం (విరిగినట్లుంది) పక్కకి వాలిపోయింది.

ఆ కారు నడుపుతున్న వ్యక్తి కారు ముందుకి ఆపి, ప్రదీప్ దగ్గరకొచ్చి గట్టిగా ఝాడిస్తున్నాడు. అతనికి దగ్గర దగ్గర డెబ్భై ఏళ్ళు వుంటాయి. ఒక్కడే డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాడు. ప్రదీప్ ఇంకా గట్టిగా వాదించాడు. “నేను కారుని రోడ్డు పక్కగా ఆపాను. ఇండికేటర్ వేశాను. మీరు చూసుకొని నడుపుకోవాలి. మీకు నడపటం చేతకాక, నాది తప్పంటున్నారేంటి ?….” ఆ పెద్దాయనకి మద్దతు నివ్వటానికి అక్కడ ఎవ్వరూ లేరు. ఆ రోడ్డు మీద జనసంచారమే అంతంత మాత్రంగా వుంది. ప్రదీప్ కారులో అమ్మాయి, పెద్దాయన, కుర్రాణ్ణి చూసి, ప్రదీపుతో వాదించలేక ఆయన తనలో తను గొణుక్కుంటూ కారుని ముందుకు తీసుకెళ్ళి, ఆ పక్క చూపుల అద్దాన్ని సరిచేసుకునే ప్రయత్నంలో పడ్డాడు. ప్రదీప్ శీతల పానీయాలు, బిస్కట్స్ తెచ్చాడు.

సుమేధ ఆంగ్లంలో ప్రదీప్ తో నిదానంగా అంటోంది. “నాకు నువ్వు చేసింది నచ్చలేదు. కారు రోడ్డు పక్కకి పెట్టి, ఇండికేటర్ వేసినంత మాత్రాన, నువ్వు అకస్మాత్తుగా డోరు తీస్తున్నట్లు ఆయన కలగన్నాడా? ఆయనకి కలిగిన కష్టానికి విచారం వ్యక్తం చేసి, ఆయనకి ఎలా సహాయపడగలనా అని ఆలోచించటం పోయి, అడ్డంగా వాదించటం సంస్కారం అనిపించుకోదు. ఆయన పరిస్థితిలోనే నువ్వుండి, ఆయనే డోరు తీసి ఇలాగే కొట్టివుంటే, అప్పుడూ ఇలాగే మాట్లాడతావా?…” ప్రదీప్ రెండు క్షణాలు ఆలోచించాడు. “ఇప్పుడే వస్తా” అంటూ కారు దిగాడు.

“తాతగారూ, మంచి చదువు, మంచి ఉద్యోగం, మంచి కుటుంబం అని చూశాను. కాని, ఇలాంటి సంస్కారం లేని వ్యక్తితోనా నాకు పెళ్ళి!.. నాకు నచ్చలేదు…” అంటూ ఏదో చెబుతోంది సుమేధ. … “ఆగు, అటు చూడు” అన్నారు శేషయ్య.

ప్రదీప్ ఆ కారు పెద్దాయన దగ్గరకెళ్ళి, ఆయనకి నమస్కారం పెట్టి, ఏదో మాట్లాడుతున్నాడు. ఆ అద్దం సరిచేసేందుకు వృథా ప్రయత్నం చేశాడు. పర్సులోంచి కొన్ని నోట్లు తీసి ఇచ్చాడు. తన బిజినెస్ కార్డు కాబోలు – అది కూడా ఇచ్చాడు. ఆ పెద్దాయన మొహం వెలిగిపోయింది. ప్రదీప్ మళ్ళీ నమస్కారం పెట్టాడు. ఆయన ఆశీర్వదిస్తున్నట్లుగా కుడి చేయి పైకెత్తాడు.

“సుమేధా, తప్పులు మనిషన్న ప్రతివాడూ చేస్తాడమ్మా. ఆ తప్పుని తెలుసుకుని సరిచేసుకోవటం కూడా సంస్కారమే. మనస్సాక్షి వున్నవాళ్ళే అలా చేయగలరు. మనస్సాక్షి గొంతుని ఒక్కోసారి పురుషాహంకారం నొక్కేస్తుంది. ప్రదీప్‌లో పురుషాహంకారాన్ని ధిక్కరించే ఆ మనస్సాక్షి వుంది. అదే సంస్కారం. అది కూడా లేని కుర్రాళ్ళని ఎంతమందిని చూడటం లేదు! … ఎక్కువ ఆలోచించకు…” సుమేథ సిగ్గుపడింది.

ప్రదీప్ వచ్చాడు. “థాంక్స్ సుమేధ, ఐ లైక్ యు” అన్నాడు ప్రదీప్ కారు స్టార్ట్ చేస్తూ.

సుమేధ అతనివంక క్రీగంట చూస్తూ, ఈసారి తెలుగులో మందహాసంతో చెప్పింది.

“నువ్వు నాకు నచ్చావు.”

ఇప్పుడు ప్రదీప్ సిగ్గుపడ్డాడు.

2. ఏది స్థిరంగా వుంటుంది?

నరసింహం భార్య సావిత్రి స్వర్గస్థురాలై మూడు నెలలు గడిచిపోయాయి.

సింహం ఎలావున్నాడో పలకరిద్దామని ఆ సాయంత్రం వెళ్ళిన శేషయ్యకి గత రోజులు గుర్తుకొచ్చాయి.

ఇంటర్ దాకా తన తమ్ముడికి సహ విద్యార్థి నరసింహం. ఐ.ఐ.టి.లో చదివాడు. అమెరికాలో గణితంలో పిహెచ్‌డి చేశాడు. హైదరాబాదులో కేంద్ర విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా చేస్తూ, చాలా వేదికల్లో అధ్యయన పత్రాలు సమర్పించాడు. విదేశీ విశ్వవిద్యాలయాలు పిలిచినా తన దేశానికే సేవ చేయాలన్న కోరికతో అవన్నీ తిరస్కరించాడు. కాని, కొడుకుల్ని వాళ్ళ ఇష్టానికి వదిలేశాడు. ఇద్దరు కొడుకులూ వేర్వేరు దేశాల్లో మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. కూతురు మాత్రం ఢిల్లీలో వుంటుంది. ఆ పిల్లకి కొద్దిరోజుల్లో రెండో కానుపు జరగాల్సి వుంది…

“సింహం, సింహం” అంటూ శేషయ్య పిలిచారు. ఎవరూ పలకటం లేదు.

ముందుహాల్లో ఎవరూ లేరు. వంటగది సహా క్రిందగదులు మూసేసి వున్నాయి. మెట్లెక్కి పైకి వెళ్ళారు శేషయ్య. తన పడక గదిలో కిటికీ ముందు కుర్చీలో కూర్చొని శూన్యంలోకి చూస్తూ తనలో తనే ఏదో గొణుక్కుంటున్నాడు సింహం.

దగ్గరికివెళ్ళి, అతని భుజం మీద చేయి వేశారు శేషయ్య. ఉలిక్కిపడి తలతిప్పి, శేషయ్యని చూస్తూనే భోరుమంటూ పసి పిల్లవాడిలా ఏడ్చేశాడు డెబ్భైరెండేళ్ళ నరసింహం.

ఓ పావుగంట కష్టపడి అతన్ని శాంతపరచగలిగారు శేషయ్య.

“సింహం, ఎందుకు ఏడుస్తున్నావ్?”

“ఇంకా ఏం మిగిలిందని?.. సావిత్రి వెళ్ళిపోతే నా జీవితం శూన్యమై పోయింది… ఏడుపు కాక నాకు మిగిలిందేమిటి?…”  మళ్ళీ రోదనలో మునిగిపోయాడు నరసింహం.

“సింహం, మీ అమ్మ చనిపోయినప్పుడూ ఇలాగే ఏడ్చావు. మీనాన్న పోయినప్పుడూ ఇలాగే… ఇప్పుడు వాళ్ళ గురించి ఏడవటంలేదే!…”

నరసింహం ఏడుపు ఆపేసి, శేషయ్య వంక తీవ్రంగా చూశాడు.

శేషయ్య ఆపలేదు.

“పోనీ, నీకు హార్వర్డ్ విశ్వవిద్యాలయం సన్మానం చేసినప్పుడు పొంగిపోయావు! సంబరం చేసుకున్నాం!.. అది తల్చుకొని ఇప్పుడెందుకు ఆనందపడటం లేదు?…”

నరసింహం చూపులో తీవ్రత తగ్గింది.

“కాని, సావిత్రి పోతే ఆ దుఃఖం ఎలాంటిదో మీకు…”

“దుఃఖం కొంతకాలం వుంటుంది. కానీ జీవితం శూన్యమైపోదు. ఐ.ఐ.టి.లో నువ్వు విశిష్ట తరగతిలో ఉత్తీర్ణుడవయినప్పుడూ, సన్మానాలు జరిగినప్పుడూ, నీకు మనవలు పుట్టినప్పుడూ, నీ కొడుకుని మూడు బహుళజాతి కంపెనీల వాళ్ళు పోటీ పడి లాక్కువెళ్ళినప్పుడూ… విరగబడి ఆనందించాం… అమ్మా, నాన్న పోయినప్పుడు దుఃఖించాం… వచ్చే నెల్లోనో ఆపై నెల్లోనో నీ కూతురికి ఆడపిల్ల పుడితే, సావిత్రి పేరుపెట్టుకుని మళ్ళీ ఆనందపడిపోతాం. … “

నరసింహంకి శేషయ్య చెబుతున్నదేమిటో కొద్ది కొద్దిగా అర్థమవుతోంది. అయినా నిర్వేదం వెంటాడుతూనే వుంది.

“చూడు సింహం! ప్రాజ్ఞుడు అయినవాడు జరిగిపోయినదాన్ని గురించి ఏడుస్తూ కూర్చోడు. దుఃఖం మనిషిని మరింత బలహీనుణ్ణి చేస్తుంది. గుర్తు తెచ్చుకో, మనిద్దరం ఒకసారి భారతం ప్రవచనం విన్నప్పుడు, ‘వ్యాసుడు చెప్పింది ఎంత నిజం’ అనుకున్నాం కదా!’ … అది ఒక్కటే సత్యం. అది మననం చేసుకో, బయటకు రా, వివేకానంద ఇన్‌స్టిట్యూట్‌లో యువతని తీర్చిదిద్దే కార్యక్రమాలకి నీలాంటి అనుభవజ్ఞులు కావాలి. ఇలాంటి చర్యలు నిన్ను త్వరగా కోలుకునేలా చేస్తాయి….”

నరసింహంలో కొంచెం చురుకుదనం వచ్చింది. సందేహం వుండిపోయింది.

“వ్యాసుడు చెప్పిన ఏ విషయం మనం ‘నిజమే కదా’ అనుకున్నది?”

“సుఖస్యానంతరం దుఃఖం, దుఃఖస్యానంతరం సుఖం, పర్యాయేణోపసర్పంతే నరం నేమిమరా ఇవ’

– సుఖం తరువాత దుఃఖం, దుఃఖం తరువాత సుఖం అనేవి ఒక బండి చక్రంలో ఆకుల్లాగా క్రిందకీ పైకీ తిరుగుతూనే వుంటాయి. జీవితంలో ఏ ఒక్క దశా స్థిరంగా వుండదు….”

నరసింహం సాలోచనగా తలపంకించాడు. లేచాడు “పదండి, రామకృష్ణ మఠానికి వెళ్దాం” అంటూ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here