99 సెకన్ల కథ-24

8
7

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత, సంపాదకులు, పాత్రికేయులు జి. వల్లీశ్వర్ ’99 సెకన్ల కథ’ సిరీస్‌లో ఈ వారం రెండు కథలు సంచిక పాఠకులకు అందిస్తున్నారు. ఈ కథలు ప్రపంచతత్వాన్ని, మానవ మనస్తత్వాన్ని సూక్ష్మంగా ప్రదర్శిస్తాయి. [/box]

1. కారు వెనక్కి తిరిగింది!

“శేషయ్య గారూ, మా అమ్మని వృద్ధాశ్రమంలో చేర్పించాలనుకుంటున్నాను. మీకు బాగా తెలిసి ఉంటుంది కదా! మంచి వృద్ధాశ్రమం ఏదో చెప్పండి కొంచెం…”

“సరే, రేపు రామకృష్ణమఠంలో కలిసినప్పుడు చెబుతాను” అన్నారు హడావుడిగా బయటకు వెళ్ళబోతూ శేషయ్య.

నగరంలో ప్రముఖ ఆడిటర్ రంగనాథం ఫోన్ కాల్ అది. ఇద్దరికీ వయసులో 30 ఏళ్ళు తేడా. కాని ఇద్దరికీ పరిచయ వేదిక రామకృష్ణ మఠం. శేషయ్య ఆశ్చర్య పడ్డారు. రంగనాథం మంచివాడే. ఆడిటరుగా మంచిపేరు ఉన్నవాడు. కూతురు, అల్లుడు అమెరికాలో ఉంటారు. కొడుకు ఇక్కడే అదేదో నగరంలో ఉంటాడు. కోడలికి ఈ మధ్యనే ఇక్కడే ఉద్యోగం వచ్చిందని ఆ మధ్య చెప్పాడు.. భార్య సుశీల కూడా మంచిదిలాగానే కనుపిస్తుంది. కాని ఇప్పుడు 80 ఏళ్ళు పైబడిన తల్లిని వృద్ధాశ్రమంలో ఎందుకు పడేయాలనుకుంటున్నాడు?

రామకృష్ణ మఠంలో కలిశారు. శేషయ్య సందేహాలని నివృత్తి చేశాడు రంగనాథం.

“మా అబ్బాయికి మన సిటీకే బదిలీ అయింది. మీకు చెప్పానుగా – కోడలు తొలి కానుపు కోసం పుట్టింటికి వైజాగ్ వెళ్ళింది. మగపిల్లాడు …”

“చాలా మంచి వార్త…”

“కదా! 27 రోజుకే కోడలిని ఇంటికి తీసుకు రండి అని మా పురోహితుడు చెప్పారు. మూడు నాలుగు నెలల తరువాతయినా కోడలు ఉద్యోగానికి వెళ్తుంది కదా! అప్పుడు అమ్మని, మనవడ్ని చూసుకోవటం సుశీలకి ఎంత కష్టం? అందుకే…” అంటూ రంగనాథం కొంచెం నసిగాడు.

“అదేమిటి? సుశీల అత్తగారిని బాగా చూసుకొంటోంది అన్నావు క్రిందటిసారి. ఇప్పుడేమైంది?”

“అహ… తనకి మనసులో ఎలా వునా, పైకి టైం ప్రకారం అన్నీ చేస్తోంది….”

“అందరి ఇళ్ళల్లోనూ అంతేలే..” అంటూ వినీ వినబడనట్లుగా అన్నారు శేషయ్య.

“ఏమిటన్నారు?”

“ఏం లేదులే… సరే, మంచివి నాలుగైదు ఉన్నాయి. విత్తం కొద్దీ వైభోగం… నేను ఒక పది రోజులు ఊళ్ళో ఉండటం లేదు. వచ్చీ రాగానే తీసుకెళ్ళి చూపిస్తాను… నేనొచ్చేలోపల, నీకు సమయం ఉన్నఫ్ఫుడు ఈ చిన్న పుస్తకం చదువు” అంటూ శాంతా బయో టెక్నిక్స్ వరప్రసాద రెడ్డి ప్రచురించిన ‘మాతృవందనం’ పుస్తకం ఇచ్చారు శేషయ్య.

పదిరోజుల తరువాత, ఓ ఆదివారం పొద్దుటే రంగనాథం శేషయ్య ఇంటిదగ్గర వాలిపోయాడు.

“ఏమయ్యా, ‘మాతృవందనం’ చదివావా ?”

“అబ్బే, టైం ఎక్కడిదండీ! కంపెనీల ఆడిట్ నివేదికలు తయారు చేసే సమయం కదా …”

ఇద్దరూ రంగనాథం కారులో వృద్ధాశ్రమాల ఎంపికకి బయల్దేరారు.

“సరే, మనవడేమంటున్నాడు ?”

“ఆ.. వచ్చేశారు మొన్ననే…. నిన్న రాత్రంతా పాపం మా కోడలికి నిద్రే లేదండీ. ఆ పిల్లడు మాటి మాటికీ ఏడుస్తాడు. పాలకోసమో తెలీదు… ఒకటి పోసుకున్నాడో తెలీదు… కడుపునొప్పో తెలీదు… మా కోడలికి మాత్రం ఎంత ఓపిక అంటారు! అబ్బ, అస్సలు విసుక్కోలేదు. వాడు పక్క బట్టలు తడిపేసినప్పుడల్లా విసుక్కోకుండా లేచి, మార్చేసేది..”

“అదేమిటయ్యా, ఇప్పుడంతా డైపర్లు వాడతారు కదా !”

“డాక్టరు – అప్పుడే డైపర్లు వాడకండి. మూత్రం పోసుకున్నది మనకి తెలియకపోతే ఎలర్జీలు రావచ్చు – అని చెప్పారట….. అబ్బ, రాత్రంతా మా కోడలికి అస్సలు నిద్రే లేదనుకోండి. ఎంత ఎంత ఓపిక …!! సుశీల ఒకటి రెండు సార్లు లేచింది. కాని, మా కోడలే – మీరు పడుకోండి అత్తయ్యా – అంది.. ఏం ఓపిక అండీ!”

శేషయ్య నవ్వారు.

“రంగనాథం, ఒక మాట చెప్పనా?”

“అయ్యా, చెప్పండి చెప్పండి.”

“అహర్నిశం తు యన్మాతః స్థనపీడామదామహం…., రాత్రే మూత్ర పురీషాభ్యాం భిద్యతే మాతృకర్పటే…., పాదాభ్యాం తాడయేత్ పుత్రః జనన్యః పరివేదనం ….”

“ఏమంటున్నారూ ?”

“రాత్రిపగలు అన్న తేడా లేకుండా నాకు పాలిమ్మని నిన్ను వేధించాను కదా, రాత్రి పూట నా మలమూత్రాలతో నీ పక్క తడిపి నిద్రలేకుండా చేశాను కదా, తల్లివైన నీకు కష్టం కలుగుతుందన్న స్పృహ లేకుండా గర్భంలో ఉన్నప్పుడూ, బయటపడ్డాక కూడా నిన్ను కాళ్ళతో తన్నాను కదా….’ అంటూ ‘వాయుపురాణం’ చాలా చెబుతుంది. నీకిచ్చిన ‘మాతృవందనం’లో ఉంది. అలా ఎన్నో వేల సార్లు అమ్మని మనం కూడా పసితనంలో కాల్చుకుతిని ఉంటాం కదా! అమ్మ ఎంత ఓపిగ్గా పెంచితే మనం ఇలా…”

 కారు కీచుమంటూ ఆగిపోయింది.

“ఏమైంది రంగనాథం?”

“వృద్ధాశ్రమాలు వద్దు. ఇంటికెళ్ళిపోదాం….” అంటూ కారు వెనక్కి తిప్పేశాడు.

2. మన సమస్యలు ఎంత పెద్దవి!

పక్షుల కిలకిలా రావాలు… అందమైన పచ్చటి ప్రకృతి …

కె.బి.ఆర్ పార్కులో రిటైరయిన సీనియర్ సిటిజన్లు, త్వరలో రిటైర్ కాబోతున్న వాళ్ళు, ఇంకా యాభయ్యో పడికి అటూ ఇటూగా వున్న వాళ్ళు ఆ ఆదివారం బాగా నడిచి నడిచి చెమటలు కక్కుతూ ఒక చోట కూలబడ్డారు. ఒక సభ్యుడి ప్రతిపాదన మేరకు ఆ ఆదివారం ఇష్టాగోష్టికి ముఖ్య అతిథిగా శేషయ్యని పిలిచారు. 82 ఏళ్ళ వయసులో కూడా ఉత్సాహంగా ఆయన ఎలా పనిచేస్తున్నారో పా.న.కం (పార్కు నడక కంపెనీ) అధ్యక్షుడు వివరించారు.

“మీ సమస్యలు ఏమైనా వుంటే వాటికి పరిష్కారాలు శేషయ్య చెబుతారు” అంటూ పా.న.కం కార్యదర్శి ప్రకటించారు.

ఒక్కొక్కళ్ళు ఒక్కోరకమైన సమస్య చెప్పారు.

“మాకు పెన్షన్ పథకం క్రింద పెరిగిన కరువు భత్యం తాలూకు బకాయిలు రాలేదు. జీవించటం ఎంతో కష్టంగా వుంది. మా మనవడికి ఒక తీవ్ర అనారోగ్య సమస్య. ఇంట్లో మాకెవ్వరికీ మనసు బాగా లేదు…” మనోవేదన.

“మా ఆఫీసులో కుల రాజకీయాల మూలంగా నాకు ప్రమోషన్ రావటల్లేదు. నా భార్య ఎంతో మంది స్వాముల్ని పూజిస్తోంది. హోమాలు చేయిస్తోంది. అయినా …” ఇదో సమస్య.

“మా అమ్మకి క్యాన్సర్. నా పెళ్ళి కాని తమ్ముడు సంన్యాసులతో తిరుగుతున్నాడు. వాడి భార్య ఉద్యోగంతో ఇల్లు గడవటం వాళ్ళకి కష్టంగా వుండి మా మీద ఆధారపడ్డారు..” ఇదో అరణ్య రోదన.

ఒకాయన కొడుక్కి వీసా సమస్య, మరొకావిడకి ఆడపడుచుతో సమస్య, మరొకరికి కూతురి విడాకుల సమస్య….!

అందరు చెప్పినదాని సారాంశం – జీవితం గడవటం దుర్భరంగా వుంది. జీవితం మీద రోత పుడుతోంది. ఏం చేస్తే సుఖంగా జీవించగలం ?

శేషయ్య నవ్వారు.

“సుఖం గురించి చెప్పలేను. కాని ప్రశాంతంగా జీవించాలంటే జీవితాన్ని ఎలా చూడాలో చెప్పటానికి ప్రయత్నిస్తాను.” అందరూ ‘ఓకె’ అన్నారు.

శేషయ్య చెప్పారు.

“పి.వి.ఆర్.కె. ప్రసాద్ అని ఒక ఐ.ఏ.ఎస్ అధికారి వుండేవారు. నాకు మిత్రుడు. ఆయన టిటిడి కార్యనిర్వహణాధికారిగా కూడా చాలా గొప్ప పేరు సంపాదించారు. ఆయన గుంటూరు హిందూ కాలేజీ హైస్కూల్లో చదువుకుంటున్నప్పుడు, ఆయనకి ఇష్టమైన ఇంగ్లీష్ టీచర్ కృష్ణారావు గారికి 13 మూడు మంది పిల్లలు… “

అంతా చెవులు రిక్కించుకొని వింటున్నారు.

“ప్రసాద్ గారు టిటిడి లో ఎగ్జిక్యూటివ్ అధికారిగా పని చేస్తున్నప్పుడు తన సహ విద్యార్ధికి తండ్రి అయిన ఆ మాష్టార్ని చూడాలని వెతుక్కుంటూ వెళితే, ఆయన హైదరాబాదులో మూసీ నది ఒడ్డున తాటాకుపాక ఇంట్లో వృద్ధుడిగా కనుపించారు. భార్యా, తనూ ఇద్దరే వున్నారు. ..”

“మరి పిల్లలంతా ఆయన్ని వదిలేసి ఎక్కడికెళ్ళిపోయారు ?” క్యాన్సర్ తల్లి గారి కొడుకు అడిగారు.

“ఒక్కడు తప్ప అందరూ 20 ఏళ్ళ వయసుకి అటూ ఇటూగా రకరకాల రోగాలతో స్వర్గానికి వెళ్ళిపోయారు.”

“ఆ మిగిలిన ఒక్కడూ?”

“తమతో ఉంటే ఇలాగే పోతాడేమోనని భయపడి దత్తతకిచ్చారు.”

“మంచి పని చేశారు.”

“అయినా, వాడు కూడా చనిపోతే, మూసీ నది ఒడ్డున ఉంటూ, ఆయన రోజూ తపస్సు చేస్తున్నారు. ఈ విషయాలన్నీ ఆయన నుంచి విని, ప్రసాద్ అడిగారు: ‘మీకు జీవితం మీద రోత కలగటం లేదా ?”

“అప్పుడు మాష్టారు ఏమన్నారు?… అక్కడ ఏం చేస్తున్నారు ?” అందరికీ నరాలు తెగేటంత ఉత్కంఠ…

శేషయ్య కొంచెం ఆగి చెప్పారు.

“ఇది నేను కోరుకుంటే వచ్చిన జీవితమా, వద్దంటే పోవటానికి! కాని, ఏ ఇతర కుటుంబానికీ ఇలాంటి కష్టం రానీయకుండా కాపాడు స్వామీ – అని దేవుణ్ణి ప్రార్థించటానికి తపస్సు చేస్తున్నానయ్యా’ – అన్నారు.”

ఎవరో ఏదో అడగబోయారు. మళ్ళీ శేషయ్యే అన్నారు.

“ఆ కృష్ణారావు మాష్టారి వంటి వాళ్ళ సమస్యల ముందు మన సమస్యలు ఎంత పెద్దవి?….”

అంతా నిశ్శబ్దం.

సభ ముగిసింది.

(వాస్తవ కథ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here