99 సెకన్ల కథ-34

12
6

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత, సంపాదకులు, పాత్రికేయులు జి. వల్లీశ్వర్ ’99 సెకన్ల కథ’ సిరీస్‌లో ఈ వారం రెండు కథలు సంచిక పాఠకులకు అందిస్తున్నారు. ఈ కథలు ప్రపంచతత్వాన్ని, మానవ మనస్తత్వాన్ని సూక్ష్మంగా ప్రదర్శిస్తాయి. [/box]

1. ‘కూతల’ మేథస్సు!

ఆ మహానగరంలో కొత్తగా ‘కోడి కూత ‘ అనే దినపత్రిక ఆవిర్భవించింది.

ఉదయాన్నే వెలువడే ఈ పత్రిక పూర్తిగా ప్రభుత్వ విధానాల్ని తూర్పారపట్టడమే లక్ష్యంగా మొదలైంది. ప్రభుత్వం ఏ చట్టం తెచ్చినా, ఏ కొత్త విధానాన్ని రూపొందించినా దాన్ని ఆమూలాగ్రం చీల్చిచెండాడేస్తోంది.

ప్రభుత్వం వరకట్న నిషేధ చట్టాన్ని ఖచ్చితంగా అమలుచేసి తీరతామని కొత్తగా నిర్ద్వంద్వంగా ప్రకటించింది. పైగా అందుకోసం పోలీసుశాఖలో ఒక ప్రత్యేక విభాగాన్ని, ప్రత్యేక అధికారిని కూడా ఏర్పాటు చేసింది.

వెంటనే ‘కోడి కూత’ పత్రిక ఆ చట్టాన్ని, దానికి ప్రభుత్వ మద్దతుని విమర్శిస్తూ వ్యంగ్య చిత్రాలు వేసి, దుయ్యబట్టింది.

“ఈ ప్రభుత్వానికి ఏమాత్రమన్నా మెదడు ఉందా? వరకట్నం అనేదే లేకపోతే…. ఛాయ తక్కువున్న అమ్మాయిలకి పెళ్ళిళ్ళు ఎలా అవుతాయి?.. చదువు అబ్బని అమ్మాయిలకి ఎలా వివాహాలు చేయగలుగుతారు?.. దివ్యాంగులైన పిల్లల్ని ఎవరు పెళ్ళి చేసుకుంటారు? .. పెళ్ళి తరువాత ఆడపిల్లలకి ఆస్తిలో వాటా ఇవ్వకూడదని అడ్డంపడే సహోదరులనుంచి ఆ సోదరీమణులకి ఎలా భద్రత కల్పిస్తారు? …. అసలు ఈ మంత్రివర్గంలోకానీ, శాసనసభ్యుల్లో కానీ పందెం కోడిలాంటి ఒక్క మగ మహాశయుడైనా కట్నం తీసుకోకుండా పెళ్ళి చేసుకున్నాడా?…”

– ఇలా ఆ ‘కోడి కూత’ ఏకి పారేసింది. తన వెబ్ ఎడిషన్లో కూడా పెట్టేసిందేమో, ఈ కూత రాంబాణంలా దూసుకుపోయింది పాఠక ప్రపంచంలోకి.

దాంతో, ప్రజల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. ఈ వార్త ప్రభావంతో, నగరంలో కొత్తగా ‘వరకట్న మద్దతు సంఘం’ ఏర్పడింది. వాళ్ళూ ఇక సభలు పెట్టడం మొదలైంది.

ముఖ్యమంత్రి సహా పాలకవర్గం అంతా నివ్వెరపోయారు. ఎవ్వరికీ ఈ వార్తా కథనాన్ని ఖండించే ధైర్యం లేదు. వాళ్ళల్లో యువకులైతే, తమ రాజకీయ భవిష్యత్తుని చూపించి, అత్తమామలనుంచి పరగణాలకి పరగణాలు కట్నంగా రాయించేసుకున్నవాళ్ళే.

లైంగిక నేరాల్లో నేరస్థుడికి పద్నాలుగేళ్ళు కూడా యుక్తవయస్సుగానే పరిగణించాలి అని ఇంకో చట్టం… అంతే! ‘లైంగిక నేరాలకి కారణాలయిన అశ్లీల వెబ్ సైట్లు, యూ ట్యూబ్ సాహిత్యం నిరోధించలేని ప్రభుత్వం చట్టం చేస్తుందా?’ అంటూ మళ్ళీ ‘కోడి కూత’ పెట్టింది. ‘ఏ’ సర్టిఫికేట్ సినిమాలు తీసిన ఎమ్మెల్యేల పేర్ల జాబితా వేసింది. దాంతో, ఈసారి ఇంకో సంస్కర్తల సంఘం దీన్ని సమర్థిస్తూ సభలు పెట్టింది.

… ఇలా ఆరుమాసాల కాలంలోనే, ఆ నగరంలో పొట్టకోస్తే అక్షరాలు కనబడే ప్రతి వాడి చేతిలోనూ ‘కోడి…’ కూత పెట్టేస్తోంది. లక్షల్లో అమ్మకాలు పెరిగాయి. ఈ కోడికూత పత్రిక పట్ల అధికార పార్టీకి కడుపు రగిలిపోతోంది. ఆ సంపాదకుడు దొరికితే నమిలిమింగేయాలన్నంత కోపంతో ఉన్నారు.

అప్పుడే..

ఈ ‘కోడికూత’ కి పోటీగా ‘కాకి కూత’ అనే సాయంత్రం పత్రిక పుట్టింది. ఈ పత్రిక, ఆ రోజు పొద్దుటే ‘కోడి కూత’ ఏం రాసిందో దాన్ని విరగదీసి ఖండిస్తోంది. ప్రతి చట్టాన్ని, విధానాన్ని గురించి ఏ కోణాల్లో ‘కోడి కూత’ పత్రిక దుయ్యబడుతోందో, సరిగ్గా వాటినే మహా హేతుబద్ధంగా ఖండిస్తూ రాసేస్తోంది.

దాంతో ఇవ్వాళ ‘కోడి… ‘ ఏం కూతపెట్టిందో అని చదివిన ప్రతివాడూ, సాయంత్రం అయ్యే సరికి ‘కాకి…’ ఏం కూత కూసిందో అని చదవటం మొదలెట్టారు. మొదటిసారి ‘కాకి కూత’ చదివిన ప్రతి అక్షర జ్ఞాని, మర్నాడు ప్రొద్దుటే ‘కోడి కూత’ చదవసాగారు. అలా చదవటం వల్ల తమ జ్ఞాన సంపద, వృద్ధిరేటు వేగంగా పెరుగుతోందని వాళ్ళల్లో నమ్మకం కూడా పేరుకుపోతోంది. అయినా, అధికారపార్టీ కార్యకర్తల్లో మాత్రం ‘కోడి కూత’ పట్ల కడుపుమంట సెల్ ఫోన్ బిల్లులా పైపైకి దూసుకుపోతూనే ఉంది.

ఏమైనా మొత్తంమీద ఆ మహానగరంలో ప్రతి అక్షరజ్ఞాని ఇప్పుడు రెండు పత్రికల్నీ విడిచిపెట్టకుండా కొని, చదివేస్తున్నారు.

‘కన్నెర్ర’ అనేది ఆ మహానగరంలో ఓ మంచి సామాజిక సంస్థ.

ఆ సంస్థకి అన్ని పార్టీల వాళ్ళూ కావాలి. ఏ పార్టీపట్లా కూడా తమకి ‘ఎలాంటి కన్నెర్ర ఉండదు’ అన్నదే తమ సంస్థ స్ఫూర్తి అని చెప్పుకుంటుంటారు.

ఆ సంస్థని అధికార పార్టీ కార్యకర్తలు పట్టుకున్నారు.

“మీరు ఎలాగైనా ఆ ‘కోడి కూత’ సంపాదకుడికి సన్మానం పెట్టండి. మిగతాది మేం చూసుకుంటాం” అన్నారు. ‘కన్నెర్ర’ రాఘవ తెలివైనవాడు. అందుకని, తగాదా లేకుండా ‘కోడికూత’ తో పాటు, ‘కాకి కూత’ సంపాదకుడిని కూడా కలిపి టంకంసన్మాన సభ ఏర్పాటు చేశాడు.

“ఇంతటి ‘కూత’ మేధావులు మన నగరానికే గర్వ కారణం” అంటూ పోలీసు పేరేడ్ గ్రౌండ్స్‌లో సన్మాన సభ పెట్టాడు రాఘవ.

అధికార పార్టీ కార్యకర్తలు రాతిబాంబులు, నాటు బాంబులు వగైరా సిద్ధం చేసుకున్నారు. “మనం ఏం చేసినా ఎవరు చేశారో ఎవరికీ తెలీకూడదు. వేదిక మీద ఆ ‘కోడి కూత’ గాడిని పరిచయం చేయగానే, మన ఒడుపు చూపించాలిరోయ్…” అనుకున్నారు వాళ్ళలో వాళ్ళు. కాని అప్పటికే ఆ విషయం బయట పొక్కింది.

సభ ఆ ఆదివారం సాయంత్రం ఆరు గంటల అయిదు నిమిషాలకి. అయిదున్నరకే ఆ మైదానం అంతా కిటకిటలాడిపోతోంది.

సరిగ్గా ఆరు గంటలకి కా.కూ ఎడిటర్ వచ్చేశాడు. వేదిక వెనకాల రాఘవ స్వాగతం చెప్పాడు. ఆరున్నర అయింది. కో.కూ ఎడిటర్ ఇంకా రాలేదు. ఫోన్లో దొరకటం లేదు. ప్రజలు అసహనంగా ఉన్నారు.

కేకలు, ఈలలు పైలోకాల్లోక్కూడా వినబడుతున్నాయి.

రాఘవ అయిష్టంగానే సన్మానం మొదలెట్టాడు.

“..మన అదృష్టం. ఈ ఉదయం కూత, సాయంత్రం కూత సంపాదకులిద్దర్నీ ఒకేసారి సన్మానించాలనుకున్నాం. కాని, సాయంత్రం కూత వారొచ్చినా, ఉదయం కూత వారింకా రాలేదు… అయినా … “

“వాడి మొహం. వాడు ఇంకెందుకొస్తాడు?” అన్నాడు కా.కూ ఎడిటర్.

బాంబులున్న కుర్రాళ్ళు ఖంగారు పడుతున్నారు. ‘వాడు ఇక రాడా?’

“అలా ఎలా చెప్పగలరు సార్?” రాఘవ వినయంగా అడిగాడు.

“రెండు కూతలకీ నేనే గదయ్యా ఎడిటరు. వాడెక్కడున్నాడు?”

కరతాళ ధ్వనులు పైలోకాలదాకా వినబడ్డాయి.

కాని, అ.పా. బాంబుల కుర్రాళ్ళు కొయ్యబారిపొయ్యారు.

బాంబులు వెయ్యాలా, మానాలా ???

2. ప్రసాద్ చేసిన అ ‘ధర్మం’…

“రా ప్రసాద్. బాగున్నావా?.. కొత్త పోస్టులో నీ ఉద్యోగం ఎలా ఉంది?.

తనను పలకరించటానికి వచ్చిన ఐ.ఏ.ఎస్ అధికారి ప్రసాదుని శేషయ్య పరామర్శించారు. ప్రసాద్ అంతా బాగుందని చెప్పాడు.

“ప్రసాద్, ఇతను రుద్రేశ్వర్. రాజస్థాన్లో కేంద్ర ప్రభుత్వ సంస్థలో విజిలెన్స్ అధికారిగా పనిచేస్తున్నాడు. మాజీ వైమానిక దళాధికారి. దేశభక్తుడు. వీళ్ళ నాన్న కూడా మాజీ సైనికాధికారి. శలవుల్లో ఇంటికి వస్తే, నన్ను చూసి వెళ్ళాలని వచ్చాడు” అంటూ తనతో కూర్చున్న ఓ 40 ఏళ్ళ యువకుడిని పరిచయం చేశారు శేషయ్య.

పరిచయాలు అయ్యాయి. రుద్రేశ్వర్ లేచి, శేషయ్యగారి దగ్గర శలవు తీసుకున్నాడు.

రాష్ట్ర రాజధానికి దూరంగా ఒక మేజరు పోర్టులో నాలుగు మాసాల క్రితమే చైర్మన్ పోస్టులో నియమితుడైన ప్రసాద్ రాజధానికి రాగానే తనకి గురుతుల్యుడైన శేషయ్య గారిని పలకరించటానికి వచ్చాడు.

“కొత్త ఉద్యోగం ఎలా ఉంది ప్రసాద్?” మళ్ళీ అడిగారు శేషయ్య.

“పదిహేను వేల మంది కార్మికులు మా డాక్ లేబర్ బోర్డులో పనిచేస్తుంటారు. ఎగుమతులు, దిగుమతులు నిర్వహించే స్టీవ్ డోర్లు అనేవాళ్ళది పెద్ద లాబీ. మా అధికారుల్లో చాలా మంది ఈ లాబీని ఎక్కువ ప్రేమిస్తుంటారు (?). కొన్నేళ్ళుగా పోర్టు పురోగతి ఇంచుమించు శూన్యం. నేను ఏ కొత్త పథకం ప్రతిపాదించినా అది మా దగ్గర చర్చ జరిగేలోపల ఆ లాబీకి తెలిసిపోతూంటుంది… మా అధికారుల్లో మార్పు రావాలి. ఎలా?…”

“మీ సంస్థలో విజిలెన్స్ విభాగం ఉంటుంది కదా?”

“ఉంది. కానీ, ఆ పోస్టుని ఇప్పటిదాకా డెప్యుటేషన్ పోస్టుగా ఉంచారు. పోలీసు శాఖనుంచి డెప్యుటేషన్‌లో ఒక డి.ఎస్.పి స్థాయి అధికారి అయిదేళ్ళ కాలానికి వస్తాడు. సంపాదించుకుని పోతాడు. ఇదే నడుస్తోంది…”

శేషయ్య తల పంకించారు. ప్రసాద్ కొన్ని విలువలకి కట్టుబడి, నిబద్ధతతో పనిచేసే మనిషి. ఇలాంటి అధికారులు తగ్గిపోతున్న రోజుల్లో, ఇతనికి ఎలాగైనా మద్దతునివ్వాలి – అనుకున్నారు శేషయ్య.

శేషయ్య ఒక ఆలోచన ఇచ్చారు. “నీ అధికారం ఉపయోగించి, నేను చెప్పినట్లు ఒక ప్రకటన చేయి, అంతే” అన్నారు. ప్రసాద్ సంకోచించాడు.

“ఇది ధర్మమా శేషయ్య గారు?”

“దుర్యోధనుడిని భీముడు చంపినప్పుడు కూడా ఈ ప్రశ్న ఉదయించింది. కాని ఇప్పుడు నువ్వు ఏ అధర్మానికీ పాల్పడటంలేదు. ఎక్కువ ఆలోచించకు. ఒక ఏడాది తరువాత, నువ్వే నాకు చెబుతావు – ఎంత మంచి జరిగిందో.”

ఒక నెల తరువాత, పోర్టు ట్రస్టు పేరుమీద పత్రికల్లో ఒక ప్రకటన వచ్చింది. అది కొత్తగా ఛీఫ్ విజిలెన్స్ అధికారి ఎంపికకి సంబంధించిన ప్రకటన. ‘ఈసారి శాశ్వత ప్రాతిపదికన అభ్యర్ధుల ఎంపిక జరుగుతోంది. అర్హత కల వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు’ – అని ఆ ప్రకటన పేర్కొంది. పదిహేను మంది దాకా అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఎక్కువమంది పోలీసు శాఖ వాళ్ళూ, వేర్వేరు సంస్థల్లో విజిలెన్స్ అధికారులుగా పనిచేస్తున్నవాళ్ళూ.

చైర్మన్ ఏర్పాటు చేసిన ఒక కమిటీకి ఈ ఎంపికకి సంబంధించిన మార్గదర్శక సూత్రాలు అందాయి. .. ఆ ఇంటర్వ్యూలు జరిగాయి. ఛీఫ్ విజిలెన్స్ అధికారిగా రుద్రేశ్వర్ ఎంపికయ్యాడు. రుద్రేశ్వర్ తన పోస్టులో చేరిన నెల తిరక్కుండానే, చైర్మన్ దగ్గరికి ఒక జాబితాతో వచ్చాడు.

“సర్, వీళ్ళంతా మన పోర్టులో అవినీతి పరులు. వీళ్ళల్లో ముఖ్యంగా ఎరుపు రంగులో గుర్తు పెట్టిన వాళ్ళు కొన్ని వ్యాపార వర్గాలకి (స్టీవ్ డోర్స్ సహా) ఏజెంట్లుగా పనిచేస్తున్న వాళ్ళే…. నేను వీళ్ళందర్నీ వల వేసి లంచం తీసుకుంటుండగా పట్టుకోగలను. అవసరమైతే సి.బి.ఐ సహాయం కూడా తీసుకుంటాను. మీ ఆమోదం కోసం వచ్చాను…”

ఆ జాబితా చూస్తూనే చైర్మన్ ప్రసాద్ నివ్వెరపోయాడు. అందులో కొందరు సీనియర్ అధికారులతో పాటు, తనకి కార్యదర్శిగా అత్యంత విశ్వసనీయుడిలా పనిచేస్తున్న రావు కూడా ఉన్నాడు.

అయినా ప్రసాద్ తను కట్టుబడిన ప్రమాణాల ప్రకారం ఆలోచించాడు..

“రుద్రేశ్వర్, ఇది విజయవంతం చేసి, అప్పుడు మిగతావి చూద్దాం” అంటూ తన కార్యదర్శి రావు పేరు మీద టిక్ పెట్టాడు. అంతే! చైర్మన్ లేని సమయంలో చైర్మన్ ఛాంబరులోనే లంచం తీసుకుంటూ దొరికిపోయాడు రావు… అలా, రుద్రేశ్వర్ ఆ రావుతో మొదలుపెట్టాడు. ఒక ఏడాది తిరిగేసరికి, ఆ పోర్టులో కొన్ని పెద్ద తిమింగలాల్ని కూడా సి.బి.ఐ సహాయంతో వలవేసి పట్టించాడు రుద్రేశ్వర్. చాలా మంది అధికారులు తమ తమ అదనపు ఆదాయాల్ని వదులుకొని, బుద్ఢిమంతుల్లా ప్రవర్తించసాగారు. ఫలితంగా, వ్యాపార వర్గాలకి ‘చాటుమాటు సమాచార ’ వ్యవస్థ మూతపడింది. దాంతో, చైర్మన్ ప్రసాద్ ఆ పోర్టులో కొత్త స్టీవ్ డోర్ల లైసెన్సులు సహా అనేక అసాధారణ సంస్కరణలు, విస్తరణ పనులు విజయవంతంగా సాగించాడు. ఆ పోర్టు వరుసగా మూడేళ్ళపాటు దేశంలోకెల్లా అగ్రస్థానంలో నిల్చింది.

ఒక రోజు అనుకోకుండా శేషయ్య వచ్చారు. ప్రసాద్ పోర్టులో పురోగతి అంతా చూపిస్తున్నాడు. రుద్రేశ్వర్ తన పనిని ఎంత సులువు చేశాడో చెప్పాడు.

“మరి, నేను చెప్పినప్పుడు ‘అధర్మం’ అన్నావు గదా!” శేషయ్య ప్రశ్న.

“భీముడు గదాయుద్ధంలో దుర్యోధనుడి తొడలమీద కొట్టడం అధర్మం కదా! మీరు అలా చేయమంటున్నారా అనిపించింది. కాని మీరు చెప్పినట్లు ఏ ఏ అర్హతలు కావాలని ప్రకటిస్తే రుద్రేశ్వర్‌ని ఎంపికచేయవచ్చో, అలా చేయటంవల్లే ఇక్కడ జరుగుతున్న అక్రమాలకి అడ్డుకట్ట వేయగలిగాను. “

శేషయ్య నవ్వారు.       

“ఇదే మాట ధర్మరాజు, శ్రీకృష్ణుడు కూడా దుర్యోధనుడి విషయంలో చెప్పాడు. తొడలమీద కొట్టడం అధర్మంలా కనుపించినా, అధర్మాన్ని జయించటం కోసం అలా చేయటం తప్పు కాదు. కలికాలంలో కేవలం నిజాయితీ సరిపోదు. అధర్మాన్ని జయించటానికి – అధర్మంలా కనుపించే లౌక్యాన్ని ప్రయోగించకపోతే, మంచిపనులు చేయలేం ప్రసాద్. ”

ప్రసాద్ శేషయ్యకి పాదాభివందనం చేశాడు.

….

(Based on a true story).

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here