99 సెకన్ల కథ-4

3
11

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత, సంపాదకులు, పాత్రికేయులు జి. వల్లీశ్వర్ ’99 సెకన్ల కథ’ సిరీస్‌లో ఈ వారం రెండు కథలు సంచిక పాఠకులకు అందిస్తున్నారు. ఈ కథలు ప్రపంచతత్వాన్ని, మానవ మనస్తత్వాన్ని సూక్ష్మంగా ప్రదర్శిస్తాయి. [/box]

1. తెలుగు సిగ్గు!

[dropcap]”పి[/dropcap]ల్లలు ఎవరైనా తెలుగులో పద్యాలు పాడగలరా?”

అధికార భాషా సంఘం (అ.భా.సం) అధ్యక్షులు మైకులో ప్రకటించారు. నగరంలోని అతి పెద్ద కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఒకటైన ఆ స్కూలు కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు ‘అధికార భాషా దినోత్సవం’ జరుపుతోంది. జిల్లా మంత్రి, జిల్లా కలెక్టరు సహా పెద్దలు చాలా మంది వేదిక మీద వున్నారు.

ఆ స్కూల్లో తెలుగు భాష కూడా వుంది కాని, మిగతా అన్ని సబ్జక్టులకీ బోధనా భాష మాత్రం ఆంగ్లం.

“ఎవరూ లేరా?” అ.భా.సం అధ్యక్షులు మళ్ళీ అడిగారు.

అకస్మాత్తుగా ఆరో తరగతి కుర్రాడు జ్ఞానానందం వేదిక ఎక్కాడు.

ప్రేక్షకుల్లో కూర్చున్న రాధా, రవిచంద్రలు దిగ్భ్రాంతి చెందారు.

“అందరికీ ప్రణామాలు…” అంటూ జ్ఞాని పద్యాలు మొదలెట్టాడు.

“తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమీ వాడు గిట్టనేమీ, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా, విశ్వదాభిరామ ….”

రాధా, రవి ఒకరి మొహం ఒకరు చూసుకుంటున్నారు.

“వీణ్ణి మనం ఇంగ్లీష్ మీడియంలో కదా వేశాం. వీడికి తెలుగెలా వస్తోంది?” అన్న ప్రశ్న వాళ్ళ మెదళ్ళు తొలిచేస్తోంది.

“ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై, ఆరంభించి పరిత్యజింతురురు విఘ్నాయాత్తులై మధ్యముల్ ….” జ్ఞాని పద్యాలు ఆగటం లేదు.

పైగా అర్థం కూడా చెప్పేస్తున్నాడు.

వీణ్ణి ఇంగ్లీష్ మాధ్యమంలో చదివిస్తేనే భవిష్యత్తు వుంటుంది – అనుకొని, అమ్మ ఎంత చెప్పినా వినకుండా, ఇంగ్లీష్ మాధ్యమంలో వేసిన రవి, తన కొడుక్కి తెలుగెలా వచ్చిందో అర్థం కాక, బుర్ర గోక్కుంటున్నాడు.

పద్యాలు అయిపోయాయి. అ.భా.సం అధ్యక్షులు ఓ ప్రశ్న అడిగారు. “దేశ భాషలందు తెలుగు లెస్స – అని ఎవరన్నారు?”

“శ్రీనాథ మహాకవి, శ్రీకృష్ణ దేవరాయలు.”

ఆడిటోరియం అంతా కరతాళధ్వనులతో మారుమ్రోగిపోయింది. అ.భా.సం అధ్యక్షులు జ్ఞాని తల్లిదండ్రుల్ని వేదిక మీదకి పిలిచారు. వాళ్ళిద్దరికీ శాలువాలు కప్పారు. ఒక ప్రకటన చేశారు. “కేవలం మాతృభాష మీద మమకారంతో ఈ జ్ఞానికి విలువలతో కూడిన తెలుగు నేర్పుతున్న ఈ తల్లిదండ్రుల్ని అభినందిస్తున్నాను. ఈ జ్ఞానికి ప్రత్యేక నగదు బహుమతిని ప్రకటిస్తున్నాను…”

రాధా, రవి సిగ్గుతో తల వాల్చేశారు.

వాళ్ళ పక్క సీట్లోనే కూర్చున్న జ్ఞాని నాయనమ్మ, ప్రముఖ రచయిత్రి అనసూయాదేవి మాత్రం తలెత్తి మనుమడికేసి గర్వంగా చూసింది.

మనవణ్ణి ప్రతి రోజూ రాత్రి తన పక్కలో పడుకోబెట్టుకొని, శతకాలు, కథల్లో విలువలు నేర్పుతోంది తనే కదా!

2. కాంతం మొగుడు

“ఏమేవ్, కాఫీ తీసుకురా, శేషయ్య గారు వచ్చారు” అని కాంతాన్ని పిలిచాడు (అరిచాడు) సంక్షేమ శాఖ రిటైర్డ్ డైరక్టరు సంపూర్ణ రావు.

పరామర్శలయ్యాక, శేషయ్య గారు సూటిగా విషయంలోకి వచ్చేశారు.

“మన నగరంలో ‘సద్భావనా సంఘం’ ఆధ్వర్యంలో, కొత్తగా పెళ్ళయిన వాళ్ళకి దాంపత్యం గురించి అవగాహన కల్పించేందుకు – అంటే విడాకులు తగ్గించేలా – ఒక పూట శిబిరాలు నిర్వహించాలని నిర్ణయించాం. దాంపత్యం గురించి మంచిమాటలు చెప్పే సలహాదారుల్లో ఒకరుగా….”

శేషయ్య గారు పూర్తి చేయక ముందే సంపూర్ణ రావు అందుకున్నాడు.

“అసలు, నిన్న ధర్మపురి గురువుగారు పతివ్రతల గురించి ఎంత అద్భుతంగా చెప్పారనుకున్నారు!”

కాఫీ వచ్చింది. దాన్ని రుచి చూస్తూనే, “చల్లగా, నీ మొహంలా వుంది. మళ్ళీ పెట్టి ఏడు” అని భార్యని చాటుగా కసిరాడు – శేషయ్యగారికి వినబడలేదని అనుకుంటూ.

అనేసి, శేషయ్య గారి వంక చూశాడు. ఆయన ఏమీ వంక పెట్టలేదు. మాట్లాడకుండా తాగేశారు. “ఆ… పతివ్రతలు ఎలా వుంటారంటే, అనసూయ సీతకి చెప్పిందిట. మొగుడు నాగరికుడైనా, సన్నాసి అయినా, ప్రేమగా చూసుకోవాలి. వాడే నిజమైన స్నేహితుడట. అలాగే ద్రౌపది…”

శాంతంగా కాంతం మళ్ళీ కాఫీ తెచ్చింది.

ఆమె మొహం చూస్తూనే, శేషయ్య గారు, “ఏం చదువుకున్నావమ్మా?” అని అడిగారు. సంపూర్ణ రావే జవాబిచ్చాడు.

“ఆ, ఏదో పాతకాలం బి.యే. అది కూడా ఓరియంటల్ కాలేజి..! ఆ, ఇప్పుడేం చెప్పాను? …పతివ్రతల గురించి, ఎంత గొప్ప ప్రవచనం అనుకున్నారూ? ద్రౌపది ఇంట్లో అందరికన్నా ముందే నిద్ర లేస్తుందట. అందరికన్నా ఆఖర్న నిద్రపోతుందట ….”

“మరి భర్తల గురించి ఏం చెప్పారు ?”

“చెప్పేందుకేం ఉంటుంది శేషయ్య గారు? ‘పతియే ప్రత్యక్ష దైవం’అని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు గదా? సీత కూడా, రాముడు వనవాసం వెళ్తున్నప్పుడు అందిట – నువ్వు ఎక్కడుంటే అక్కడే నీతోనే స్వర్గం – అని…”

కాంతం వచ్చి ఖాళీ కప్పులు తీసుకు వెళ్తోంది.

శేషయ్యగారు ఆమెని అడిగారు. “అమ్మా, నువ్వేమైనా చెప్పగలవా? భార్యల్ని భర్తలు ఎలా చూడాలని మన ఇతిహాసాల్లో చెప్పారో!”

కాంతం కొంచెం సంకోచంగా భర్త వంక చూసింది.

“దానికేం తెలుసునండీ! పాత కాలం బి.యే, అది కూడా ఓరియంటల్..”

కాంతం సన్నగా చెప్పేస్తోంది. “రాముడు తనని వనవాసానికి రావద్దంటున్నాడని సీత దుఃఖిస్తూవుంటే, రాముడు ఇలా అన్నాడు: ‘న దేవీ, తవ దుఃఖేన స్వర్గమపి అభిరోచయే, (శ్లోకాలు).. న విహాతుం మయా శక్యా, కీర్తిరాత్మవతా యథా.. ‘”

“అంటే …!” సంపూర్ణ రావు భార్య వంక వెర్రివాడిలా చూస్తూ అడిగాడు.

“సీతా, నీ దుఃఖానికి కారణం స్వర్గమే అయితే, అది నాకు కూడా రుచించదు… ఆత్మ గౌరవం కలవాడు కీర్తిని ఎలాగైతే వదలకుండా అంటిపెట్టుకుని వుంటాడో, అలాగే నేను నిన్ను అంటిపెట్టుకునే వుంటాను.”

శేషయ్యగారి ముఖం వెలిగిపోయింది.

“సంపూర్ణ రావు గారూ, ఆ సలహాదారుల్లో ఒకరుగా మీ కాంతాన్ని తీసుకుంటాం. మీకేమైనా అభ్యంతరమా?”

సంపూర్ణ రావు వెర్రిచూపులు చూస్తూ, తల అడ్డంగా తిప్పాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here