99 సెకన్ల కథ-5

2
8

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత, సంపాదకులు, పాత్రికేయులు జి. వల్లీశ్వర్ ’99 సెకన్ల కథ’ సిరీస్‌లో ఈ వారం రెండు కథలు సంచిక పాఠకులకు అందిస్తున్నారు. ఈ కథలు ప్రపంచతత్వాన్ని, మానవ మనస్తత్వాన్ని సూక్ష్మంగా ప్రదర్శిస్తాయి. [/box]

1. నన్నెందుకు బ్రతికించావ్?

[dropcap]ఆ[/dropcap] యువకుడు ఒక్కసారిగా ఆ 75 ఏళ్ళ అమెరికా ముసలమ్మ మీదకి లంఘించి, ఆమె పీక పట్టుకున్నాడు. ఆమెకి ఊపిరి ఆడటం లేదు. గింజుకుంటోంది. అతి కష్టం మీద నోరు పెగుల్చుకుని, “హెల్ప్, హెల్ప్…” అని అరిచింది.

2020 జూన్ 21. రాత్రి తొమ్మిది గంటలు. కరోనా భయంతో ట్రాఫిక్ సన్నగిల్లిన సమయం అది.

న్యూయార్క్ నగరం మధ్యలో ఈస్ట్ నది ఒడ్డున పార్కులో ఒక మిత్రుడితో గడిపి, కాలి నడకన అప్పుడే రోడ్డు మీదకి మలుపు తిరిగిన యువ దౌత్యవేత్త తనకి పది అడుగుల దూరంలో వీధి దీపాల వెలుగులో ఈ దౌర్జన్యం చూశాడు.

అటు ఉరికాడు. ఆ యువకుడు గ్రహించే లోపలే, వెనకాల నుంచి వాడి గొంతు పట్టుకున్నాడు. ఎంతో బలిష్టంగా వున్న ఆ యువకుడు ఒక్కసారిగా ముసలామెని క్రిందకి తోసేశాడు. చటుక్కున వెనక్కి తిరిగి దౌత్యవేత్త మొహం మీద దిమ్మ తిరిగేలా ఒక్క గుద్దు బలంగా గుద్దాడు.

అక్కడ్నుంచీ వాళ్ళిద్దరికీ మధ్య పెనుగులాట, పిడిగుద్దులు…! ఆ ముసలమ్మ ఇంకా ఊపిరి తీసుకోలేక అవస్థ పడుతూనే వుంది. రెండు నిమిషాలు గడిచేసరికి, సైకిళ్ళ మీద ఓ అమెరికన్ యువజంట అటు వెళ్తూ చూశారు. ముసలమ్మ ఇంకా రొప్పుతూనే “హెల్ప్.. హెల్ప్” అంటోంది.. మరుక్షణంలో, ఆ యువకుడు సైకిల్ పడేసి, పరుగు పరుగున వచ్చి, దౌత్యవేత్తకి మద్దతుగా ఆ ఆకతాయిమీద విరుచుకుపడ్డాడు.

దాంతో వాడు ఇద్దర్నీ తట్టుకోలేనని తెలిసి, అకస్మాత్తుగా ఆ ముసలామె చేతిలోంచి మొబైల్ ఫోన్ లాగేసుకొని తన సైకిల్ మీద రయ్యిమంటూ పారి పోయాడు. వాడి శరీర ఛాయ ఆ చీకట్లో కలిసిపోయింది.

దౌత్యవేత్త పోలీస్‌కి ఫోన్ చేశాడు.

“కుయ్… కుయ్” అంటూ పోలీసులు వచ్చారు.

ఇంకా భయంతో వణికిపోతున్న ఆ ముసలామెకి ధైర్యం చెప్పారు. “మీరు బాగున్నారా అమ్మా (Are you ok ? ok?)” అని అడుగుతున్నారు. ఆమె ఆ దౌత్యవేత్తకేసి చూపించింది.

“ఇతను బ్రతికించాడు.”

పోలీసులు ఆ దౌత్యవేత్తకి ధన్యవాదాలు చెప్పారు. ఆ ముసలామెను ప్రథమ చికిత్సకోసం పోలీస్ వాహనంలో ఎక్కించారు.

ఆ ముసలమ్మ ఆ దౌత్యవేత్తని దగ్గరికి పిలిచింది.

“ఏ దేశం వాడివి?”

“భారత్, అంటే ఇండియా.”

“వాడు వేగంగా సైకిల్ మీద నన్ను రాసుకుంటూ పోతుంటే, తిట్టాను. అందుకే నా ఫోన్ లాక్కోవాలని చూశాడు. నువ్వు రాకపోతే నేను చచ్చిపోయేదాన్ని. ఒంటరి దాన్ని. నేను పోయినా ఎవరూ రారు…. ప్రాణాలకి తెగించి నన్నెందుకు కాపాడావు నాయనా ?”

“మనిషి తనకోసం తను జీవించడంలో సంతోషం వుంది. ఇతరులకోసం కూడా జీవించడంలో సంతృప్తి వుంది. ఇది మా దేశ సంస్కృతి…” శలవు తీసుకున్నాడు హైదరాబాద్‌కి చెందిన ఆ దౌత్యవేత్త కార్తీక్.

“గాడ్ బ్లెస్ యు” అంటూన్న ఆ ముసలామె కళ్ళల్లో ఆనంద బాష్పాలు!

(ఇది వాస్తవ కథ – తేదీ, సమయం సహా)

2. పెళ్ళికి ముందే విడాకులా?

“అయ్యా, కొంపలంటుకున్నాయి. మీరే కాపాడాలి మహాప్రభో” అంటూ శేషయ్య గారి కాళ్ళ మీద పడ్డాడు మా మిత్రుడు రాజారాం. పొట్ట వంగలేదు. (జఠరాగ్ని ఎక్కువ)!

నేనే తీసుకెళ్ళాను. అతని సమస్య అలాంటిది. అతని కూతురు ఎవరో అబ్బాయిని ప్రేమించింది. ఇద్దరూ ఆ మధ్యనే కొంచెం ఇంజనీరింగ్ చదివి, సాఫ్ట్ వేర్ ఉద్యోగాల్లో చేరారు.

చేరాక మొదటి వార్షికోత్సవం కూడా అవలేదు. వివాహ మహోత్సవం దాకా వచ్చేశారు.

“మేమిద్దరం హృదయాలు మార్చుకున్నాం. మీరు ఒప్పేసుకుంటే, దండలు కూడా మార్చేసుకుంటాం” అంటున్నారట.

రాజారాం తన గుండూ, గుండె కొట్టేసుకుంటున్నాడు.

తన కూతురిని చిన్నప్పట్నుంచీ ఇష్టపడుతున్న దాని మేనమామ కొడుక్కే ఇద్దామని అనుకుంటున్నామనీ, ఇంతలో తన బంగారు తల్లి ఇలా ‘ప్రేమగుంటలో’ కాలేసిందనీ గొల్లుమంటున్నాడు.

“వాళ్ళిద్దరికీ ఎంతకాలంగా పరిచయం?” శేషయ్య గారి ప్రశ్న.

“అంతా కలిపి ఒక మామిడి పళ్ళ సీజనూ, ఒక సీతాఫలాల సీజనూ. అంతే…. నా బంగారు తల్లి ఆ ‘ప్రేమగుంటలో…”

“కులాంతరమా?”

“అవును. కాని, నా సమస్య అదికాదు. మంచి ఉద్యోగంలో వున్న మేనల్లుడు సిద్ధంగా వుంటే, ఆరు మాసాల్లో హృదయాలు మార్చేసుకోవడ మేమిటండీ? నా బంగారు తల్లి ఆ ‘ప్రేమగుంట…”

“సరే, వాళ్ళిద్దర్నీ నాకు పరిచయం చేయండి. ఎప్పుడు చేస్తారు?”

బయటకారులో కూర్చోపెట్టాడుగా. లోపలికి తీసుకొచ్చేశాడు రాజారాం.

శేషయ్య వాళ్ళిద్దరితో స్నేహపూర్వకంగా మాట్లాడారు. శీతల పానీయం ఇచ్చారు. ఆయనా, వాళ్ళూ కలిసిపోయారు. రాజారాం గుండు తడిమేసుకుంటున్నాడు.

“రాజారాం గారూ, నేను వీళ్ళతో విడివిడిగా చెరో రోజూ గడపటానికి వస్తానన్నాను. అదయ్యాక, మాట్లాడదాం.”

రాజారాంకి – భార్యమీద ఫోన్లో అరుస్తున్నప్పుడు ఫోన్ బ్యాటరీ అయిపోతే మండిపోయినంతగా గుండె మండిపోయింది..

***

ఓ నెల తరువాత రాజారాం కొత్త ఐఫోన్ కొనుక్కున్నంత ఆనందంగా విరగబడిపోతూ శుభవార్త చెప్పాడు. శేషయ్య గారు ఆ పిల్లలిద్దరికీ చెరో కాగితం ఇచ్చారట. అంతే! వాళ్ళమ్మాయి, ఆ అబ్బాయి ఎవరి హృదయాన్ని వాళ్ళు వెనక్కి తీసేసు కున్నారట.

అంత సులువుగానా!

శేషయ్య గారి దగ్గరికి పరుగెడితే అసలు విషయం చెప్పారు.

“స్నేహితుడిలా తిరిగానా! అప్పుడు మాటల్లో వాళ్ళ వాళ్ళ బలహీనతలేమిటో తెలుసుకున్నాను. వాళ్ళు ప్రేమ అనే మైకంలో మునిగిపోయి ఆ విషయాలు మాట్లాడుకోలేదు. అలాంటివే రేపు విడాకులకి దారి తీస్తాయి. అందుకే వాళ్ళిద్దర్నీ కలిపి కూచోబెట్టి, అతని గురించి ఆమెకి, ఆమె గురించి అతనికి అవే విషయాలు రాసిచ్చాను. చదువుకుని, చర్చించుకొని ఒక నిర్ణయానికి రమ్మన్నాను.”

నాకు అర్ధమే కాలేదు. బుర్ర గోక్కున్నాను.

“అతను మహా లోభి. ప్రతిపైసాకి మొహం చూసుకుంటాడు. మహా గురక పెట్టి నిద్రపోతాడు.. ఆ అమ్మాయికి పసి పిల్లలకి మలమూత్రాలు శుభ్రం చేయడమన్నా, డైపర్లు మార్చడమన్నా అసహ్యం. వంట రాదు. నేర్చుకున్నా, ఆదివారాలు తప్ప మరో రోజు చేయదట. ఇంకా ….”

అంతే, నాకూ బల్బు వెలిగిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here