99 సెకన్ల కథ-50

3
12

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత, సంపాదకులు, పాత్రికేయులు జి. వల్లీశ్వర్ ’99 సెకన్ల కథ’ సిరీస్‌లో ఈ కథ సంచిక పాఠకులకు అందిస్తున్నారు. ఈ కథ ప్రపంచతత్వాన్ని, మానవ మనస్తత్వాన్ని సూక్ష్మంగా ప్రదర్శిస్తుంది. [/box]

…పోతే, ఏడిస్తే ఎంత తప్పు?

[dropcap]ఆ[/dropcap] దృశ్యాన్ని చూస్తూనే శేషయ్యకి మనసు బాధతో నిండిపోయింది.

ఇదే ఇంట్లో అరవయ్యేళ్ళ క్రితం తను సీతారామయ్యతో శలవు రోజుల్లో చదరంగం ఆడటానికి వచ్చేవాడు. కాలేజికి శలవు వచ్చిందంటే చదరంగం ఆడాల్సిందే.

తన కన్న చిన్నవాడు సీతారాం. తనకి సహస్రచంద్ర దర్శనం జరిగేనాటికే సీతారామ్‌కి ‘భీమరథ శాంతి’ (70 ఏళ్ళు) జరిగింది. అతను కాలేజీ చదువుకొచ్చేనాటికే తను లెక్చరరుగా చేస్తున్నాడు. సీతారాం తండ్రికి, తన తండ్రికి ఉన్న స్నేహమే తనని, సీతారామ్‌ని కలిపింది. అతని చెల్లెలు శకుంతల, తమ్ముడు విజయ్ తమకీ చదరంగం నేర్పమని అడుగుతూ వెంటపడటం, తమని సరిగ్గా ఆడనీయకుండా వేధించటం, వీళ్ళ అమ్మగారిచ్చే వేడి వేడి పకోడీలు … ఎంత సందడిగా ఉండేది ఈ ఇల్లు ! సీతారామ్ రిటైర్ అయ్యాక, పెద్ద కొడుకు ప్రసాద్ ఫార్మా కంపెనీలో పెద్ద ఉద్యోగంలో చేరాక అప్పటి చిన్న డాబా ఇప్పుడు మేడగా రూపాంతరం చెందింది. భార్య పోవటం, పక్షవాతం రావటం సీతారామ్‌ని క్రుంగదీశాయి. చిన్న కొడుకు పదిహేడేళ్ళకే నేషనల్ డిఫెన్సు అకాడమీలో చేరి, డిఫెన్సు సర్వీసుకెళ్ళి, దేశమంతా తిరుగుతున్నాడు.

దగ్గరుండి తండ్రిని బాధ్యతగా చూసుకొంటున్న ప్రసాద్ ఇప్పుడు తండ్రి మృతదేహం మీద పడి వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. పక్కనే రెండో కొడుకు నిలబడి, చూడ్డానికి వచ్చిన వాళ్ళకి తన తండ్రి గురించి చెబుతున్నాడు. కొన్ని దశాబ్దాలుగా సీతారామ్ అక్కడే ఉండటంతో, విషయం తెలిసి ఊళ్ళో జనం చాలా మంది వచ్చారు.

శేషయ్యని చూసి వచ్చిన వాళ్ళు దారి ఇచ్చారు. ప్రసాద్ వంచిన తల ఎత్తడం లేదు.

“…నాన్నా, అమ్మ పోయాక మాకు అమ్మా, నాన్నా అన్నీ నువ్వే అయ్యావు కదా!… నా పిల్లలక్కూడా నీతి కథలు చెప్పావు… కాని నాకు మాట మాత్రం చెప్పకుండా ఇలా నిద్రలోనే వెళ్ళిపోయావు….” ప్రసాద్ శోకాన్ని ఆపటం ఎవ్వరి వల్లా కావటం లేదు.

ప్రసాద్ తమ్ముడికి ఇక్కడ పరిచయాలు తక్కువ. అయినా, బంధువులెవరో కర్మకాండలు జరిపించే శాస్త్రిగారికి కబురుచేశారు. తను నాలుగు రోజులక్రితమే ఫోనులో మాట్లాడిన సీతారామ్‌ని అలా నిర్జీవంగా చూస్తుంటే శేషయ్యక్కూడా మనసు వికలమైంది.

పదకొండు గంటలు దాటుతోంది, త్వరగా మొదలుపెట్టాలి – అంటూ శాస్త్రిగారికోసం ఎవరెవరో వాకబు చేస్తున్నారు. కాని, ప్రసాదుని లేపటం ఎవరూ చేయలేకపోతున్నారు.

శేషయ్య తన విచారాన్నుంచి తమాయించుకున్నారు. అందరికీ వినబడేలా పెద్ద గొంతుతో మాట్లాడారు.

“ఎంత దుర్మార్గం చేస్తున్నావు ప్రసాద్?”

తండ్రి మృతదేహం ముందు తలొంచుకుని ధారగా కన్నీళ్ళు కారుస్తూ ఏడుస్తున్న ప్రసాద్ ఒక్కసారిగా ఏడుపు ఆపి, తలెత్తి చూశాడు శేషయ్య వంక.

“అవునయ్యా, అంత ప్రేమ ఉన్నవాడివి మా సీతారామ్‌కి ఇలాగే చేస్తావా? ఆయన నీకు జ్ఞానాన్ని ఇచ్చాడు! సంపదనిచ్చాడు. మంచి భార్యని తెచ్చాడు. నీ పిల్లలక్కూడా నీతి కథలు చెప్పాడు. కాని నువ్వు..?”

ప్రసాద్ మొహంలో ఆశ్చర్యం, అయోమయం. మెల్లగా నోరు విప్పాడు.

“నేను… నేను ఇప్పటికీ మా నాన్నని ప్రేమిస్తున్నాను. మీకు తెలియదా అంకుల్?”

“చాలా తప్పు చేస్తున్నావు. నీ తండ్రి శరీరాన్ని విడిచిపెట్టిన జీవి ఉత్తరక్రియలు పూర్తయ్యేదాకా ఇక్కడే ఉంటుంది. భయంకరమైన క్షుద్బాధ అనుభవిస్తూ ఉంటుంది. ఆకలి.. ఆకలి..! వారసులు తన ఆకలి తీరటానికి ఏమిస్తే అదే తీసుకుంటుంది. మహా ప్రేమ ఉందని చెప్పుకొంటున్న నువ్వు మాత్రం నీ తండ్రిని ఇప్పుడు నీ కన్నీళ్ళతో ఆకలి తీర్చుకోమంటున్నావు. ఎంత దుర్మార్గం చేస్తున్నావయ్యా?”

ప్రసాదుకి అనుమానం. ఈయన ఎందుకిలా చెబుతున్నాడు?

ప్రసాద్ మనసు చదివేశారు శేషయ్య.

“రేపట్నుంచి గరుడపురాణం చదువు. కుటుంబంలో పోయిన వాళ్ళకోసం మృతదేహాల మీద పడి ఎందుకు ఏడవకూడదో తెలుస్తుంది.”

ప్రసాద్ ఏడుపుని దిగమ్రింగుకుంటున్నాడు.

అక్కడ్నుంచి లేచాడు. శేషయ్యగారిదగ్గరకొచ్చాడు. ఆయన్ని కౌగలించుకొని, రుద్ధకంఠంతో అంటున్నాడు.

“మీ చదరంగం బంధువు ఇక లేరు అంకుల్….”

శేషయ్య అతన్ని అనునయించారు. “అవునూ, మీ అత్త శకుంతల, బాబాయి విజయ్ ఏరి? వాళ్ళకి ఫోన్లు చేశారా? విమానంలో ఢిల్లీనుంచి ఈ పాటికి వచ్చేసి ఉండచ్చు కదా!”

ప్రసాద్ కొద్ది నిమిషాలు మాట్లాడలేదు. శేషయ్య రెట్టించారు.

“అంటే.. అంకుల్. మీకు తెలుసుగదా! ఆస్తి పంపకాల్లో నాన్నతో గొడవపడి బాబాయి దూరంగా వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరికీ మాటల్లేవు. మా అత్త తన మాటకాదని కులాంతర వివాహం చేసుకొని వెళ్ళిపోయిందన్న కోపంతో నాన్న తనని ఎప్పటికీ ఈ గుమ్మం తొక్కద్దు అన్నారు…. ఇప్పుడు వాళ్ళకి చెప్పాలావద్దా? చెప్పినా వాళ్ళు రాకపోతే?…”

శేషయ్య ఆ అన్నదమ్ములిద్దరినీ దగ్గరకి పిలిచాడు.

“రావణాసురుడికి, విభీషణుడికి ఉన్న శత్రుత్వం కంటే పెద్దవా ఈ విభేదాలు? రావణాసురుడితో సహా అతని వారసులంతా యుద్ధంలో చనిపోయారు. రావణాసురుడికి ఉత్తరక్రియలు జరపటానికి ఎవరూ మిగల్లేదు. విభీషణుడు తమ్ముడే అయినా, శత్రువు కదా! ఏం చేయాలి. అప్పుడు రాముడే విభీషణుడితో – ‘నీ అన్న మరణించటంతోనే ఆ శత్రుత్వాలు నశించాయి. ఆ జీవిని ఊర్థ్వలోకాలకి పంపే ఉత్తరక్రియలు అతని సహోదరుడిగా నువ్వే నిర్వర్తించాలి’ అని చెప్పాడు.”

“వాళ్ళు వస్తారంటారా?” ప్రసాద్ సంశయం.

“వస్తారయ్యా. ఆర్తితో చెప్పు… అయినా అంత దగ్గరబంధువుల్ని ఎప్పుడో జరిగిపోయినదానికోసం నువ్వెందుకు దూరం చేసుకుంటావు? మనిషికి బలం, ధైర్యం ఏమిటో తెలుసా! నన్ను ప్రేమించే పదిమంది మధ్య నేను ఉన్నాను – అన్న భావనే. మానవ సంబంధాలను తెలివైనవాడెవడూ విచ్ఛిన్నం చేసుకోడు….”

అంతే! ఆ మధ్యాహ్నానికే శకుంతల, విజయ్ కూడా కుటుంబాలతో సహా వచ్చేశారు. కార్యక్రమం జరిగినన్ని రోజులూ వాళ్ళంతా అక్కడే ఉండాలన్నాడు ప్రసాద్. వాళ్ళ కుటుంబ బంధాలు మళ్ళీ చిగురించాయి. చివరి రోజున పండితులు వచ్చి ఆశీర్వచనం చెబుతుంటే, ప్రసాద్ లేచి శేషయ్య పాదాలకి నమస్కారం చేశాడు – ఆనందబాష్పాలతో.

[box type=’note’ fontsize=’16’]

ధన్యవాదాలు

గత ఏడాది కాలంగా (రెండు వారాలు తక్కువగా) సంస్కారవంతమైన ‘సంచిక’ పత్రిక సంపాదకవర్గం

నేను చేసిన ఈ ’99 సెకన్ల కథ ‘ ప్రయోగాన్ని ప్రోత్సహించింది.

కొన్ని ప్రాజెక్టుల వత్తిడివల్ల పెద్ద కథలు రాయలేక, ఈ ప్రయోగాన్ని ఎంచుకున్నాను. ఇప్పుడు కూడా

కొత్త ప్రాజెక్టుల కారణంగా ’99 సెకన్ల కథ’ లకి ఈ 99వ కథతో కొంత విరామం ఇస్తున్నాను.

నా కథల్ని ఆదరించిన పాఠకులందరికీ ధన్యవాదాలు.

– వల్లీశ్వర్, Content Head: Emesco Books, 9440446444, valliswarg@gmail.com [/box]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here