99 సెకన్ల కథ-9

2
5

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత, సంపాదకులు, పాత్రికేయులు జి. వల్లీశ్వర్ ’99 సెకన్ల కథ’ సిరీస్‌లో ఈ వారం రెండు కథలు సంచిక పాఠకులకు అందిస్తున్నారు. ఈ కథలు ప్రపంచతత్వాన్ని, మానవ మనస్తత్వాన్ని సూక్ష్మంగా ప్రదర్శిస్తాయి. [/box]

1. ఆర్ టి సి బస్సు టిక్కెట్!

[dropcap]”ఏ[/dropcap]రా, నువ్వు వెళ్ళేది మీ పాత కాలేజి వైపుకే గదా! కొంచెం ఈ కొత్త ఆవకాయ ఆ అశోక్ నగర్లో రాజారాం మాష్టారి ఇంట్లో ఇచ్చేసి వెళ్ళరా!”

“ఏమిటి నాన్నా ఇప్పుడు! అక్కడ నా ఫ్రెండ్స్ అంతా వెయిట్ చేస్తున్నార్ట. కాల్స్ మీద కాల్స్ వస్తున్నాయి. ఇప్పుడే ఈ పని చెబుతున్నావ్!” అంటూ – ఇంజినీరింగ్ చదివి, బెంగుళూరులో ఉద్యోగంలో చేరిన కొడుకు కిరణ్ – తండ్రి సుబ్బారావు మీద విసుక్కుంటున్నాడు.

“పోనీ, నన్ను ఆ గాంధీనగర్, అశోక్ నగర్ చౌరాస్తాలో దింపేస్తే…”

కిరణ్‌కి బాగా చిరాకొచ్చేసింది.

“నాన్నా, ఎన్నిసార్లు చెప్పాలి – నేను హిమాయత్ నగర్ మీంచి వెళ్తానని” ఈసారి అరిచినంత పని చేశాడు కిరణ్.

“బాగుందయ్యా మీ వరస! వీధిలోకి వినబడుతున్నాయి మీ కేకలు” అంటూ, అప్పటిదాకా గుమ్మం దగ్గర ఆగిపోయి వింటున్న శేషయ్య గారు లోపలికి అడుగు పెట్టారు.

కిరణ్ హడావుడిగా నమస్కారం పెట్టి, “తాతగారూ, నాకో అర్జంటు పని…” అంటూ స్కూటరెక్కి పరుగెత్తాడు.

సుబ్బారావు, భార్య రాధ కలిసి మర్యాదలు చేశారు. రామకృష్ణ మఠం కొత్త కార్యక్రమాల గురించి చెప్పి, శేషయ్య లేచారు.

***

కలకత్తా వెళ్తున్న రామకృష్ణ మఠం స్వామీజీకి వీడ్కోలు చెప్పాలని ఆ రాత్రి తొమ్మిదింటికి సికింద్రాబాద్ స్టేషన్‌కి వెళ్ళిన శేషయ్యగారికి సూట్‌కేస్ పట్టుకు నిల్చున్న ఎవరితోనో మాట్లాడుతూ కిరణ్ కనిపించాడు.

‘హాయ్’ చెప్పి శేషయ్య వెళ్ళిపోతుంటే, కిరణ్ దగ్గరకొచ్చాడు. ఆ సూట్‌కేసాయన తనకి క్రిందటి వీకెండ్‌లో బెంగుళూరుకి ఆర్‌టిసి బస్సు టిక్కెట్ ఇప్పించి సాయం చేశాడనీ, ఇప్పుడు ఆయన ట్రైన్‌కి వెళ్తుంటే డ్రాప్ చేయటానికి వచ్చాననీ చెప్పాడు. శేషయ్య నవ్వారు. కిరణ్‌కి అర్థం కాలేదు. కిరణ్‌ని ప్రక్కకి తీసుకెళ్ళారు.

“చూడు, రద్దీగా వుండే వీకెండ్‌లో బస్సులో సీటుకి టిక్కెట్ ఇప్పించాడు కాబట్టి ఇంతదూరం వచ్చి సాయం చేయాలి… నువ్వు పుట్టినప్పట్నుంచి కొన్ని వేలసార్లు ఎత్తుకొని మోసి, మంచి ప్లే స్కూల్లో ఎల్ కె జి సీటు, మంచి హైస్కూల్లో సీటు, మంచి కాలేజీల్లో మంచి కోర్సుల్లో సీట్లూ ఇప్పించి, తన రక్తం రూపాయలుగా మార్చి నీకు చదువు చెప్పించిన నాన్న చిన్న పని చెబితే మాత్రం విసుక్కోవాలి. ఇది మంచి సంస్కారమేనా! ఆలోచించు.”

కిరణ్ మొహం చిన్నగా అయిపోయింది.

కిరణ్ ఆ రాత్రి నిద్రపోతున్న నాన్న కాళ్ళకి నమస్కారం చేసి, అన్నాడు: “నాన్నా, ఇంకెప్పుడూ ఇవ్వాళ్టిలా ప్రవర్తించను.”

2. వదిన x ఆడపడుచు

రామకృష్ణ మఠంలోకి శేషయ్య గారితో కలిసి అడుగుపెట్టగానే, “నమస్కారం బాబాయి గారూ” అంటూ అరవిందం ఆయన్ని పలకరించాడు.

శేషయ్య గారికి బంధువు అరవిందం.

“ఏమిటయ్యా విశేషాలు? అంతా ప్రశాంతంగా జరిగిపోతోందా?”

“ఎక్కడ ప్రశాంతత బాబాయ్ గారు! వచ్చే నెల్లో విశాఖపట్నంలో మా చెల్లెలి కొడుక్కి పెళ్ళి. వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు. నా భార్య ససేమిరా రాను అంటోంది….”

“ఎందుకని ?”

“ఆరు మాసాలక్రితం మా ఆవిడ మేనకోడలి గృహప్రవేశం విశాఖలోనే జరిగింది. అప్పుడు మా చెల్లిని కూడా పిలిచారు. నేను ఒక్క రోజే వుండి వచ్చేశాను. మర్నాడు ఆ అమ్మాయి ఏదో నోము చేసుకుంటే అక్కడ అప్పుడు నా చెల్లి ఏదో వంకర మాటలు మాట్లాడిందని ఇప్పుడు ఇక్కడ ఎవరో చెప్పారని నా భార్య అలిగేసింది. నా చెల్లి తానేమీ తప్పు చేయలేదంటోంది. నా భార్య దానితో మాట్లాడదు. పెళ్ళికి నా భార్యని వదిలేసి వెళ్ళానంటే నాకు అక్కడా కురుక్షేత్రమే, ఇక్కడా ….” అరవిందం దుఃఖంతో ముక్కు చీదేశాడు.

“నీ చెల్లెలు శాంతకి, నీ భార్యామణి భామకి మధ్య గతంలో ఏమన్నా గొడవలున్నాయా ?”

“ఛ.. అస్సల్లేవు… ఇప్పుడే..” మళ్ళీ ముక్కు చీదేశాడు.

శేషయ్యగారు కొన్ని క్షణాలపాటు ఆలోచించారు.

“సరే.. మంచిది. వెళ్ళిరా.”

అరవిందం ముక్కు చీదుకుంటూ శలవు తీసుకున్నాడు.

***

ఓ నెల దాటిపోయాక మళ్ళా నేను వుండగానే అరవిందం శేషయ్య గారికి ఎదురు పడ్డాడు.

“పెళ్ళి ఎలా జరిగిందోయ్?” అన్నారు శేషయ్య. పెళ్ళి చాలా బాగా జరిగిందనీ, తన భార్యే మనసు మార్చుకొని, శాంత మీద జాలితో తనని లాక్కుని వెళ్ళిందనీ. …ఇలా మహానందంగా చెప్పి వెళ్ళిపోయాడు.

శేషయ్య తనలో తాను నవ్వుకున్నారు. ప్రశ్నార్ధకంగా ఆయన వంక చూశాను.

“నేను అతని చెల్లెలు శాంతకి ఫోన్ చేసి, పెళ్ళి విషయాలు మాట్లాడుతూ, మాటల్లో – మీ వదిన ఓ వారం ముందే వచ్చి అక్కడ నిలబడిందంటే, ఆడపడుచు కోసం వదిన వచ్చి పనిచేస్తోందని అందరూ నీ గురించి ఘనంగా చెప్పుకుంటారు. నీ కీర్తి కైలాసం దాకా వెళ్తుంది. ‘నాకు అమ్మ అయినా, అక్కయినా అన్నీ నువ్వేగా వదినా’ అంటూ రెండు మూడు ఫోన్ కాల్స్ చేసి నాలుగైదు టన్నుల ప్రేమ కుమ్మరించు. మీ అన్నయ్యకి తెలియకుండా చేయి. ఎవరికీ చెప్పుకోకు – అన్నాను.. అంతే.”

“ఇలా మీ చెల్లికి చెప్పవయ్యా అని అతనికే చెప్పవచ్చు కదా!”

“వచ్చు. కాని అతనికి కోపం ఎక్కువ. ఎప్పుడన్నా కోపంలో పురుషాహంకారం తన్నుకొచ్చి, తానే చెల్లికి చెప్పి పిలిపించానని భార్య ముందు నోరు జారినా జారేస్తాడు. అప్పుడు …?”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here